"జూన్ నెలలో ఎస్‌డిఎమ్ [సబ్-డివిజినల్ మేజిస్ట్రేట్] వచ్చి, 'ఇదిగోండి ఈ ప్రదేశాన్ని వదిలిపోవాలనే నోటీస్,' అని చెప్పాడు."

బాబూలాల్ ఆదివాసీ గాహ్‌దరా గ్రామ ప్రవేశద్వారం వద్ద ఉన్న పెద్ద మర్రి చెట్టును చూపించారు. అది సముదాయపు సమావేశాలు జరిగే ప్రదేశం - ఇప్పుడది అతని ప్రజల భవిష్యత్తు ఒక్క రోజులో మారిపోయిన చోటు.

మధ్యప్రదేశ్‌లోని పన్నా టైగర్ రిజర్వ్ (పిటిఆర్), ఆ చుట్టుపక్కల 22 గ్రామాల ప్రజలను ఆనకట్ట కోసం, నదుల అనుసంధాన ప్రాజెక్ట్ కోసం వారి ఇళ్ళను, భూములను ఇవ్వాలని కోరారు. 2017 నాటికే తుది పర్యావరణ అనుమతులు వచ్చాయి, దేశీయ ఉద్యానవనంలో చెట్ల నరికివేత ప్రారంభమైంది. కానీ తొలగింపు బెదిరింపులు ఊపందుకున్నాయి

కేన్, బెత్వా నదులను 218 కిలోమీటర్ల పొడవైన కాలువతో అనుసంధానం చేసేందుకు రెండు దశాబ్దాలుగా ప్రక్రియలో ఉన్న ఈ ప్రాజెక్టు ప్రణాళిక రూ. 44,605 ​​కోట్లు ( దశ 1 ).

ఈ ప్రాజెక్ట్ అనేక విమర్శలపాలయింది. “ప్రాజెక్ట్‌ నిర్మాణానికి తగినంత కారణం లేదు, జలసంబంధమైన సమర్థన కూడా లేదు," 35 ఏళ్ళుగా నీటి రంగంలో పనిచేస్తోన్న శాస్త్రవేత్త హిమాంశు ఠక్కర్ అన్నారు. “అసలు చెప్పాలంటే, కేన్‌ నదిలో మిగులు జలాలు లేవు. విశ్వసనీయమైన అంచనా గానీ, వస్తుగతమైన అధ్యయనం గానీ లేవు. ముందుగానే నిర్ణయించిన నిర్ధారణలు మాత్రమే ఉన్నాయి," అని ఆయన చెప్పారు.

ఠక్కర్ సౌత్ ఆసియా నెట్‌వర్క్ ఆన్ డామ్స్, రివర్స్ అండ్ పీపుల్ (SANDRP)కు సమన్వయకర్తగా ఉన్నారు. నదుల అనుసంధానం కోసం 2004 ప్రాంతాల్లో జల వనరుల మంత్రిత్వ శాఖ (ఇప్పుడు జల్ శక్తి) ఏర్పాటుచేసిన నిపుణుల కమిటీలో ఆయన ఒక సభ్యుడు. అసలు ప్రాజెక్ట్ ప్రాతిపదికే చాలా దారుణమైనదని ఆయన చెప్పారు: "నదుల అనుసంధానం అడవుల పైన, నది పైన, జీవవైవిధ్యంపైన పర్యావరణ సంబంధమైన, తద్వారా సామాజిక పర్యవసానాలపై భారీ ప్రభావాలను కలిగిస్తుంది. స్థానికంగానూ బుందేల్‌ఖండ్, ఇంకా చాలా దూరప్రాంతాల వరకూ కూడా ప్రజలను నిరుపేదలుగా మారుస్తుంది."

PHOTO • Priti David
PHOTO • Priti David

ఎడమ: పన్నా జిల్లాలోని గాహ్‌దరా గ్రామ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న మర్రి చెట్టు. ఈ చెట్టు కింద జరిగిన సభలోనే, నదుల అనుసంధాన ప్రాజెక్ట్ కోసం ఈ గ్రామాన్ని పరిహారక భూమిగా అటవీ శాఖ స్వాధీనం చేసుకుంటుందనే సమాచారాన్ని స్థానికులకు తెలియజేశారు. కుడి: తమను ఎవరూ సంప్రదించలేదని, కేవలం తొలగింపు గురించిన సమాచారం మాత్రమే తెలియజేశారని గాహ్‌దరాకు చెందిన బాబులాల్ ఆదివాసీ చెప్పారు

PHOTO • Priti David
PHOTO • Priti David

ఎడమ: ఆనకట్ట రాగానే మునిగిపోనున్న ఛతర్‌పూర్ జిల్లాలోని సుఖ్‌వాహా గ్రామానికి చెందిన పశువుల కాపరి మహాసింగ్ రాజ్‌భోర్. కుడి: ఇక్కడి ప్రధాన వంటచెరుకైన కట్టెలను సేకరించి, ఇంటికి తిరిగి వస్తోన్న గ్రామ మహిళలు

ఈ ఆనకట్టకు చెందిన 77 మీటర్ల ఎత్తైన రిజర్వాయర్ 14 గ్రామాలను ముంచేస్తుంది. ఇది ప్రధాన పులుల ఆవాసాలను కూడా ముంచివేస్తుంది, ప్రధానమైన వన్యప్రాణుల కారిడార్‌లను వేరుచేస్తుంది. అలాగే బాబూలాల్ గ్రామం వంటి మరో ఎనిమిది గ్రామాలను పరిహారక భూమిగా రాష్ట్రం అటవీ శాఖకు అప్పగించింది.

ఇందులో అసాధారణమైనదేమీ లేదు. చిరుతలు, పులులు , పునరుత్పాదక ఇంధనం, ఆనకట్టలు, గనుల కోసం లక్షలాది మంది గ్రామీణ భారతీయులు, ముఖ్యంగా ఆదివాసీలు నిత్యం నిర్వాసితులవుతూనే ఉంటారు.

భారతదేశ మూలవాసులైన అటవీ సముదాయాలను బలిపెట్టి మరీ సాధించిన ప్రాజెక్ట్ టైగర్ అద్భుతమైన విజయం, 3,682 పులులతో (2022 పులుల గణన), ఇప్పుడు 51వ సంవత్సరంలో ఉంది. అన్నిటికీ మించి ఈ సముదాయాలు దేశంలోని అత్యంత నిరుపేదలైన పౌరులలో భాగంగా ఉన్నాయి.

1973లో భారతదేశంలో తొమ్మిది టైగర్ రిజర్వులున్నాయి, ఈ రోజున వాటి సంఖ్య 53కు పెరిగింది. 1972 నుంచి మనం పెంచుకుంటూ వచ్చిన ప్రతి పులికీ, సగటున 150 మంది ఆదివాసులును నిర్వాసితులను చేశాం. ఇది కూడా చాలా తక్కువ అంచనా.

ఇక్కడితో అయిపోలేదు - 2024 జూన్ 19న, లక్షలాది మందిని తరలించాలని కోరుతూ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (NTCA) ఒక లేఖను జారీ చేసింది.  దేశవ్యాప్తంగా 591 గ్రామాలను ప్రాధాన్యం ప్రాతిపదికన తరలిస్తారు.

పన్నా టైగర్ రిజర్వ్ (PTR)లో 79 పెద్ద పిల్లులు ఉన్నాయి. అటవీ ప్రాంతంలోని అతి ముఖ్యమైన భాగాన్ని ఆనకట్ట ముంచేసినప్పుడు, వాటికి పరిహారం చెల్లించాలి. గాహ్‌దరాలోని బాబూలాల్ భూమి, ఇల్లు పులుల కోసం తప్పకుండా పోతుంది.

సరళంగా చెప్పాలంటే: ఇది అటవీ శాఖకు 'పరిహారంగా' అందజేయబడింది తప్ప, శాశ్వతంగా తమ ఇళ్ళను కోల్పోతున్న నిర్వాసిత గ్రామస్థులకు కాదు.

PHOTO • Raghunandan Singh Chundawat
PHOTO • Raghunandan Singh Chundawat

అనేక అంతరించిపోతున్న క్షీరదాలకూ పక్షులకూ నిలయంగా ఉన్న పన్నా టైగర్ రిజర్వ్ UN జీవావరణ రిజర్వ్‌ల నెట్‌వర్క్‌లో జాబితా చేసివుంది. ఆనకట్ట కోసం, నదులను అనుసంధానించే ప్రాజెక్ట్ కోసం అరవై చదరపు కిలోమీటర్ల మౌలిక అటవీ ప్రాంతం నీటిలో మునిగిపోతుంది

PHOTO • Priti David
PHOTO • Priti David

ఎడమ: రైతులకూ పశుపోషకులకూ ఆవాసంగా ఉన్న పన్నా టైగర్ రిజర్వ్‌లోని మొత్తం 14 గ్రామాలు శాశ్వతంగా మాయమైపోతాయి. కుడి: ఇక్కడ పశుపాలన చాలా ముఖ్యమైన జీవనోపాది, సుఖ్‌వాహాలో నివసించే అనేక కుటుంబాలు జంతువులను పెంచుకుంటారు

"మేం అందులో తిరిగి అడవులను పెంచుతాం," పన్నా రేంజ్ సహాయక అటవీ అధికారి అంజనా తిర్కీ అన్నారు. "మా పని దానిని గడ్డిభూములుగా మార్చటం, వన్యప్రాణుల నిర్వహణ," ప్రాజెక్ట్‌కు సంబంధించిన వ్యవసాయ పర్యావరణ అంశాలపై వ్యాఖ్యానించటానికి ఇష్టపడని ఆమె అన్నారు.

మునిగిపోయే 60 చదరపు కిలోమీటర్ల దట్టమైన, జీవవైవిధ్య అడవికి పరిహారంగా తాము చేయగలిగింది తోటలను పెంచటం మాత్రమేనని, తమ గోప్యతను బయటపెట్టకుండా ఉండే షరతుపైన, అధికారులు అంగీకరించారు. ఇదంతా యునెస్కో (UNESCO) పన్నాను వరల్డ్ నెట్‌వర్క్ ఆఫ్ బయోస్ఫియర్ రిజర్వ్‌ లో చేర్చిన రెండు సంవత్సరాల తర్వాత జరిగింది. ఒక సహజారణ్యంలో 46 లక్షల చెట్లను (2017లో జరిగిన అటవీ సలహా కమిటీ సమావేశంలో ఇచ్చిన అంచనా ప్రకారం) నరికివేయటంలో ఉన్న జలసంబంధిత అంతర్భావమేమిటో ఇంకా అంచనాకు అందటంలేదు.

ఈ అటవీవాసులలో పులులు మాత్రమే అభాగ్యులు కాదు. భారతదేశంలోని మూడు ఘరియాల్ (మొసలి) అభయారణ్యాలలో ఒకటి ప్రతిపాదిత ఆనకట్టకు కొన్ని కిలోమీటర్ల దిగువన ఉంది. దారుణంగా అంతరించిపోతున్న పక్షులలో IUCN రెడ్ లిస్ట్‌ లో ఉన్న భారతీయ రాబందులకు కూడా ఈ ప్రాంతం ఒక ముఖ్యమైన ఆవాసం. అంతేకాకుండా అనేక విస్తారమైన శాకాహార, మాంసాహార జంతువులు తమ ఆవాసాలను కోల్పోతాయి.

బాబూలాల్ కొద్దిపాటి బీఘాల పొలం ఉన్న ఒక చిన్న రైతు. వర్షాధారంగా పండే ఆ భూమిపై ఆధారపడి ఆయన తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. "ఈ ప్రాంతాన్ని ఎప్పుడు వదిలివెళ్ళాలో ఇంకా చెప్పలేదు కాబట్టి, మా కుటుంబాన్ని పోషించుకోవటం కోసం అప్పటివరకూ పొలంలో కొంత మక్కై [మొక్కజొన్న] వేద్దామని అనుకున్నాం." ఆయనతో సహా ఆ గ్రామంలోని వందలాదిమంది రైతులు పంట వేయటానికి తమ భూములను సిద్ధంచేసుకోగానే, అటవీ రేంజర్లు వచ్చిపడ్డారు. "అంతా ఆపేయాలని వాళ్ళు మాకు చెప్పారు. 'మాట వినకపోతే, ట్రాక్టర్ తీసుకువచ్చి పొలాన్నంతా తిరగదున్నేస్తాం,' అని వాళ్ళన్నారు."

బీడుగా పడివున్న తన భూమిని PARIకి చూపిస్తూ ఆయన, "మేం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి వాళ్ళు మాకు పూర్తి నష్టపరిహారం ఇవ్వటంలేదు, అప్పటి వరకూ ఇక్కడ ఉండటానికీ, పంట వేసుకోవడానికీ అనుమతి కూడా ఇవ్వటంలేదు. మా గ్రామం ఇక్కడ ఉన్నంతవరకూ మా పొలాలను మమ్మల్ని సాగుచేసుకోనివ్వాలని మేం ప్రభుత్వాన్ని అడుగుతున్నాం... లేకపోతే మేం ఏం తినాలి?"

పూర్వీకుల నుంచి ఉన్న ఇళ్ళను నష్టపోవటం మరో దెబ్బ. తన కుటుంబం 300 ఏళ్ళకు పైగా గాహ్‌దారాలో నివాసముందని స్వామి ప్రసాద్ పరోహార్ దుఃఖపడుతూ PARIతో చెప్పారు. మాకు వ్యవసాయం ద్వారా, ఏడాది పొడవునా మహువా (ఇప్పచెట్టు), తెందూ ఆకుల (తునికాకు) ద్వారా ఆమ్‌దానీ [ఆదాయం] ఉండేది. ఇప్పుడు మేం ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడ చనిపోవాలి? ఎక్కడ మునిగిపోవాలి... ఎవరికి తెలుసు?" రాబోయే తరాలు అడవితో సంబంధాన్ని కోల్పోతాయని ఆ 80 ఏళ్ళ పెద్దాయన ఆందోళన చెందుతున్నారు.

PHOTO • Priti David
PHOTO • Priti David

ఎడమ: అక్కడి నుంచి తొలగింపుకు అంతా సిద్ధం కావటంతో, గాద్‌హరాలో ఈ సీజన్‌లో (2024) నాట్లు వేయటానికి అనుమతించని తన పొలాలను చూపుతోన్న బాబూలాల్ ఆదివాసీ. కుడి: గ్రామానికి చెందిన పరమలాల్, సుదామ ప్రసాద్, శరద్ ప్రసాద్, బీరేంద్ర పాఠక్ (ఎడమ నుండి కుడికి) లతో స్వామి ప్రసాద్ పరోహార్ (కుడివైపు చివర). సంపూర్ణమైన, చివరి నిర్ధారణ ఎప్పుడు వస్తుందో తమకు తెలియదని వారు అంటున్నారు

*****

నదులను అనుసంధానించే ప్రాజెక్టు కేవలం 'అభివృద్ధి' కోసం రాష్ట్రం తాజాగా చేసిన భూసేకరణ మాత్రమే.

2023 అక్టోబరులో కేన్-బేత్వా నదుల అనుసంధాన ప్రాజెక్ట్‌ (KBRLP)కు తుది కేటాయింపులు జరగగానే, బిజెపి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశంసలతో దానిని స్వాగతించాడు. "వెనకబడి ఉన్న బుందేల్‌ఖండ్ ప్రజలకు ఇది చాలా శుభదినం," అని అతను అభివర్ణించాడు. దానివలన వంచనకు గురయ్యే వేలాదిమంది రైతుల, పశువుల కాపరుల, అటవీ వాసుల గురించి అతను ఏమాత్రం ప్రస్తావించలేదు. అలాగే విద్యుత్ ఉత్పాదన పన్నా టైగర్ రిజర్వ్ (పిటిఆర్) బయటే ఉంటుందని ఫారెస్ట్ క్లియరెన్స్ ఇచ్చినా, ఇప్పుడది పిటిఆర్ లోపలే ఉంటుందనే విషయాన్ని అతను పట్టించుకోలేదు.

నీటి కొరతతో ఉన్న నదీ పరీవాహక ప్రాంతాలతో మిగులు నీటిని అనుసంధానం చేయాలనే ఆలోచన 1970లలో ప్రారంభమైంది, నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (NWDA) పుట్టింది. ఇది దేశంలోని నదుల మీదుగా 30 అనుసంధానాల అవకాశాలను అధ్యయనం చేయడం ప్రారంభించింది - కాలువల 'ఘనమైన హారం'

గంగా పరీవాహక ప్రాంతంలో భాగమైన కేన్ నది మూలాలు మధ్య భారతదేశంలోని కైమూర్ కొండల్లో ఉన్నాయి. ఇది ఉత్తరప్రదేశ్‌లోని బాఁదా జిల్లాలో యమునానదిని కలుస్తుంది. 427 కిలోమీటర్ల పొడవైన దాని ప్రయాణం పన్నా టైగర్ రిజర్వ్ గుండా సాగుతుంది. పార్క్‌లో ఉన్న దౌధన్ గ్రామమే ఆనకట్ట నిర్మించే ప్రదేశం.

కేన్ నదికి పశ్చిమాన దూరంగా ప్రవహించే నది బేత్వా. కేన్ నుండి 'మిగులు' నీటిని తీసుకొని దానిని 'తక్కువ' నీరున్న బేత్వాకు ఎగువకు పంపాలని KBLRP లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రెండింటిని అనుసంధానం చేయడం వల్ల ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతమే కాక వోటుబ్యాంకు కూడా అయిన బుందేల్‌ఖండ్‌లోని నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో 343,000 హెక్టార్లకు సాగునీరు అందుతుందని భావిస్తున్నారు. కానీ వాస్తవానికి ఈ ప్రాజెక్ట్ బుందేల్‌ఖండ్ నుండి బుందేల్‌ఖండ్‌కు వెలుపల ఉన్న ఎగువ బేత్వా పరీవాహక ప్రాంతాలకు నీటిని పైకి పంపడాన్ని సులభతరం చేస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

PHOTO • Courtesy: SANDRP (Photo by Joanna Van Gruisen)
PHOTO • Bhim Singh Rawat

ఎడమ: ఆనకట్ట వలన మునిగిపోయే సుమారు ఐదు నుండి ఆరు కిలోమీటర్ల కేన్ నది ఎగువ ప్రవాహపు దృశ్యం. సౌజన్యం: SANDRP (జోఆనా వాన్ గ్రూసన్ తీసిన ఫోటో). కుడి: టైగర్ రిజర్వ్‌లోని జంతువులతో పాటు, కేన్ నదీ తీరం పొడవునా ఉన్న మొత్తం పశుపోషక సముదాయాలు తమ జంతువులకు నీటి కోసం ఆ నదిపైనే ఆధారపడతాయి

PHOTO • Courtesy: SANDRP and Veditum
PHOTO • Courtesy: SANDRP and Veditum

ఎడమ: అమాన్‌గంజ్‌కు సమీపంలోని పాండవన్ వద్ద 2018 ఏప్రిల్‌లో విశాల విస్తీర్ణంలో పూర్తిగా ఎండిపోయిన కేన్ నది; నదీగర్భం మధ్య నుండి ఎవరైనా సులభంగా నడచిపోవచ్చు. కుడి: పవయ్ వద్ద మైళ్ళ పర్యంతం ఎండిపోయిన కేన్ నది

కేన్ నదికి మిగులు జలాలున్నాయనే భావననే ప్రశ్నించుకోవాల్సి ఉందని డా. నచికేత్ కేల్కర్ అన్నారు. కేన్ నదిపై ఇప్పటికే ఉన్న బరియార్‌పుర్ ఆనకట్ట, గంగూ ఆనకట్ట, పవయ్ వద్ద ఉన్న ఆనకట్టలను సాగునీటి సౌకర్యం కోసం వినియోగించాలి. "కొన్నేళ్ళ క్రితం నేను కేన్ నది వెంబడి బాఁదా, ఆ చుట్టుపక్కల పరిసరాలను సందర్శించినప్పుడు, సాగునీరు అందుబాటులో లేదని నేను అందరి నోటా విన్నాను," అని వన్యప్రాణి సంరక్షణ ట్రస్ట్‌కు చెందిన ఈ పర్యావరణ శాస్త్రవేత్త అన్నారు.

2017లో నదీ తీరం పొడవునా నడిచిన SANDRP పరిశోధకులు ఒక నివేదిక లో ఇలా రాశారు, “...కేన్ ఇప్పుడు సర్వత్రా జీవ నది కాదు... నదిలోని చాలా భాగం ప్రవాహం లేకుండా, నీరు లేకుండా సాగుతోంది.

ఇప్పటికే సాగునీటి లోటు ఉన్న కేన్‌, బేత్వాకు ఏమి ఇవ్వగలిగినా తన స్వంత ఆయకట్టుతో రాజీపడే ఇవ్వాలి. తన జీవితమంతా పన్నాలోనే గడిపిన నీలేశ్ తివారీ ఈ అంశాన్ని పునరుద్ఘాటించారు. పొరుగున ఉన్న ఉత్తరప్రదేశ్‌కు ప్రయోజనం చేకూర్చేలా కనిపిస్తూనే, మధ్యప్రదేశ్ ప్రజలను శాశ్వతంగా వంచిస్తోన్న ఈ ఆనకట్టపై ప్రజలకు చాలా కోపం ఉందని ఆయన అన్నారు.

"ఈ ఆనకట్ట లక్షలాది చెట్లనూ, వేలాది జంతువులను ముంచివేస్తుంది. ప్రజలు (అటవీ నివాసులు) తమ స్వేచ్ఛను కోల్పోతారు, బేఘర్ [నిరాశ్రయులు]గా మారిపోతారు. ప్రజలు చాలా కోపంగా ఉన్నారు, కానీ రాజ్యం మాత్రం పట్టించుకోవటంలేదు," అంటారు తివారీ.

"ఒకచోట వాళ్ళు [ప్రభుత్వం] ఒక నేషనల్ పార్క్‌ను ఏర్పాటుచేస్తారు, ఇంకోచోట ఇక్కడో నది మీద, అక్కడో నది మీద ఆనకట్టలు కడతారు... జనం మాత్రం నిర్వాసితులవుతారు, వెళ్ళగొట్టబడతారు..." 2015 నాటి పిటిఆర్ విస్తరణలో ఉమ్రవాన్‌లోని తన ఇంటిని పోగొట్టుకున్న జంకా బాయి అన్నారు.

ఉమ్రవాన్ గోండ్ ఆదివాసులకు చెందిన గ్రామం. యాబైల వయసులో ఉన్న ఈమె తగినంత నష్టపరిహారం కోస ఒక దశాబ్దకాలంగా పోరాడుతున్నారు. "ప్రభుత్వానికి మా భవిష్యత్తు గురించి కానీ మా పిల్లల భవిష్యత్తు గురించి కానీ ఆందోళన లేదు. వాళ్ళు మమ్మల్ని మోసంచేశారు," అంటూ ఆమె పులుల కోసమని తీసుకున్న తన భూమిలో ఇప్పుడు రిసార్ట్‌ను ఏర్పాటు చేయనున్నారనే వాస్తవాన్ని ఎత్తిచూపారు. "మమ్మల్ని బయటకు తరిమేసిన తర్వాత పర్యాటకులు వచ్చి ఉండడానికి వారు సర్వే చేసిన భూమి ఇదిగో, చూడండి."

PHOTO • Priti David
PHOTO • Priti David

ఎడమ: తమ ఇంటిలో ఉన్న జంకా బాయి, ఆమె భర్త కపూర్ సింగ్. కుడి: ఉమ్రవాన్‌లోని శాస్‌కి ప్రాథమిక్ శాల (ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల). తమను అక్కడి నుంచి ఎప్పుడు వెళ్ళిపొమ్మంటారో స్థానికులకు తెలియకపోవటంతో, బడిలో పిల్లల హాజరు దారుణంగా పడిపోయిందని ఉపాధ్యాయులు చెప్తున్నారు

PHOTO • Priti David
PHOTO • Priti David

ఎడమ: తమను గ్రామం నుంచి వెళ్ళగొట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఉమ్రవాన్‌కు చెందిన ఇతర మహిళలతో కలిసి, గ్రామం నుండి పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను తీసుకువెళుతున్న ప్రభుత్వ ట్రాక్టర్‌ను అడ్డుకుని, దానిని వెళ్ళనివ్వకుండా చేసిన ప్రదేశంలో జంకా బాయి. కుడి: ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తూ ఉమ్రవాన్‌లోనే నివాసముంటోన్న సుర్మిల (ఎరుపు రంగు చీర), లీల (ఊదా రంగు చీర), గోని బాయిలతో జంకా బాయి

*****

బహిరంగ విచారణలో ప్రకటించవలసిన కేన్-బేత్వా నది అనుసంధానం గురించిన ప్రకటన 2014, డిసెంబర్‌లో వెలువడింది.

అయితే, తొలగింపు నోటీసులూ నోటిమాటగా చేసిన వాగ్దానాలు తప్ప ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునే ఎలాంటి బహిరంగ విచారణ జరగలేదని స్థానికులు చెప్పారు. అది భూసేకరణ, పునరుద్ధరణ మరియు పునరావాస చట్టం , 2013 (LARRA)లో న్యాయమైన పరిహారం, పారదర్శకత హక్కును ఉల్లంఘించడమే. "భూ సేకరణ విషయాలను అధికారిక గెజిట్‌లో, స్థానిక వార్తాపత్రికలలో, స్థానిక భాషలో, సంబంధిత ప్రభుత్వ సైట్‌లలో ప్రకటించాలి," అని ఈ చట్టం నిర్దేశిస్తుంది.  నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత, ఈ విషయాన్ని తప్పనిసరిగా గ్రామ గ్రామసభ (కౌన్సిల్)ను సమావేశపరచి, తెలియజేయాలి.

"చట్టంలో చెప్పిన ఏ విధానం ద్వారా కూడా ప్రభుత్వం ప్రజలకు ఈ విషయాన్ని తెలియజేయలేదు. 'చట్టంలోని ఏ సెక్షన్ కింద మీరు ఇదంతా చేస్తున్నారు?' అని మేం ఎన్నోసార్లు అడిగాం," సామాజిక కార్యకర్త అమిత్ భట్నాగర్ పేర్కొన్నారు. గ్రామ సభ సంతకం చేసినట్టుగా రుజువు చూపించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఈ ఏడాది జూన్ నెలలో ఆయన ఒక నిరసనను నిర్వహించారు. అందుకు వారిపై లాఠీ చార్జ్ జరిగింది.

"మొదట మీరు [రాజ్యం] ఏ గ్రామసభ సమావేశాన్ని నిర్వహించారో మాకు చెప్పండి, ఎందుకంటే మీరు ఎలాంటి సభ చేయలేదు," ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుడైన భట్నాగర్ అన్నారు. “రెండవది, చట్టం చెప్పినట్లుగా ఈ పథకానికి ప్రజల సమ్మతి ఉండాలి, కానీ ఇక్కడ అది లేదు. ఇంక మూడవది, వారు వెళ్ళిపోవాలంటే, మీరు వారిని ఎక్కడికి పంపుతున్నారు? దీనికి సంబంధించి మీరేమీ చెప్పలేదు, నోటీసు ఇవ్వడం గానీ, సమాచారం ఇవ్వడం గానీ చేయలేదు."

LARRAను విస్మరించడమే కాకుండా, రాష్ట్ర అధికారులు బహిరంగ ఫోరమ్‌లలో వాగ్దానాలు చేశారు. తాము మోసపోయామని అందరూ భావిస్తున్నట్టుగా దౌధన్ నివాసి గురుదేవ్ మిశ్రా అన్నారు. “అధికారులు, 'మీ భూమికి బదులుగా భూమి, మీ ఇంటికి బదులుగా పక్కా ఇల్లు, మీకు ఉపాధి దొరుకుతుంది. మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపించివేయడం ప్రియమైన కూతురిని పంపినట్టుగా ఉంటుంది’ అని చెప్పారు."

మాజీ సర్పంచ్ అయిన ఆయన ఒక అనధికారిక గ్రామ సమావేశంలో PARIతో మాట్లాడుతున్నారు. "ప్రభుత్వం వాగ్దానం చేసిన వాటిని మాత్రమే మేం అడుగుతున్నాం, జిల్లా కలెక్టర్ [ఛతర్‌పూర్], ముఖ్యమంత్రి, ప్రాజెక్ట్ [KBRLP] అధికారులు ఇక్కడికి వచ్చినప్పుడు మాకు హామీ ఇచ్చిన వాటిని మాత్రమే," అని ఆయన చెప్పారు. “కానీ వాళ్ళు చెప్పినవాటిలో ఏదీ చేయలేదు."

PHOTO • Priti David
PHOTO • Priti David

ఎడమ: కేన్ నదిపై దౌధన్ వద్ద ఆనకట్ట కట్టే ప్రదేశంలో, పశువుల కాపరి బిహారీ యాదవ్‌తో మాట్లాడుతోన్న ఆనకట్ట నిరసనకారుడు అమిత్ భట్నాగర్. కుడి: నదుల అనుసంధాన ప్రాజెక్ట్ వలన దౌధన్ గ్రామం, దాని పరిసరాలు మునిగిపోతాయి

PHOTO • Priti David
PHOTO • Priti David

ఎడమ: పరిహారం, పునరావాసం గురించి ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఎందుకు నిలబెట్టుకోవడం లేదని దౌధన్ గ్రామానికి చెందిన గురుదేవ్ మిశ్రా అడుగుతున్నారు. కుడి: ఆనకట్ట నుండి కేవలం 50 మీటర్ల దూరంలో నివసించే కైలాస్ ఆదివాసి. కానీ అతని వద్ద భూమి యాజమాన్య పత్రాలు లేనందున, అతనికి పరిహారాన్ని నిరాకరించారు

గాహ్‌దరాలోని పిటిఆర్‌కు తూర్పు వైపు పరిస్థితి కూడా భిన్నంగా లేదు. “మీరు ఎలా ఉన్నారో తిరిగి అలాగే మేం మిమ్మల్ని కుదురుకునేలా చేస్తాం. అది మీ సౌకర్యం కోసమే. మేం మీ కోసం ఈ గ్రామాన్ని పునర్నిర్మిస్తామని కలెక్టరు [పన్నా] అన్నాడు,” అని ఎనభై ఏళ్ళు పైబడిన పరోహర్ చెప్పారు. "అసలేమీ చేయలేదు, ఇప్పుడు మమ్మల్ని అంతా వదిలేసి వెళ్ళిపొమ్మని చెబుతున్నారు."

పరిహారం ఎంతో కూడా స్పష్టంగా లేదు, రకరకాల గణాంకాలు వినబడుతున్నాయి - 18 ఏళ్ళు నిండిన ప్రతి మగవారికి రూ. 12 నుంచి 20 లక్షలు ఇస్తారు - వంటివి. ఇక్కడి ప్రజలు ఇలా అడుగుతున్నారు: “అది ఒక్కొక్కరికా లేక ఒక్కో కుటుంబానికా? ఇంటి పెద్దలుగా స్త్రీలే ఉంటే, వారి సంగతి ఏమిటి? భూమికి విడిగా పరిహారం ఇస్తారా? మా జంతువుల సంగతేంటి? మాకు ఏ విషయం కూడా స్పష్టంగా చెప్పటంలేదు.”

ప్రభుత్వ చర్య వెనుక ఉన్న అబద్ధాలు, అస్పష్టత ఫలితంగా PARI సందర్శించిన ప్రతి గ్రామంలోనూ వారు ఎప్పుడు, ఎక్కడికి వెళ్తారో ఎవరికీ తెలియకుండాపోయింది. వారి ఇళ్ళకు, భూమికి, పశువులకు, చెట్లకు పరిహారంగా ఇచ్చే ఖచ్చితమైన మొత్తం/రేటు ఎంతో తెలియదు. ఈవిధంగా 22 గ్రామాలకు చెందిన ప్రజలు అనిశ్చితమైన చేతనలో జీవిస్తున్నట్లు తెలుస్తోంది.

ఆనకట్ట కింద మునిగిపోయే దౌధన్‌లోని తన ఇంటి బయట ఆందోళనపడుతూ కూర్చొనివున్న కైలాస్ ఆదివాసి తన భూమి యాజమాన్యాన్ని నిరూపించే గతకాలపు రశీదులను, అధికారిక పత్రాలను బయటకు తీస్తారు. “నా దగ్గర పట్టా [భూయాజమాన్యాన్ని నిరూపించే అధికారిక పత్రం] లేదని వారు చెప్పారు. కానీ నా దగ్గర ఈ రశీదులు ఉన్నాయి. మా నాన్న, అతని తండ్రి, అతని తండ్రి... వాళ్ళందరికీ చెందినది ఈ భూమి. నా దగ్గర రశీదులన్నీ ఉన్నాయి."

అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం, ఆదివాసీ లేదా అటవీ-నివాస తెగలకు "అటవీ భూములపై ​​ఏదైనా స్థానిక అధికార సంస్థ లేదా ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పట్టాలు లేదా లీజులు లేదా గ్రాంట్‌లను హక్కుపత్రాలుగా మార్చుకోవడానికి అనుమతి ఉంది.”

కానీ కైలాస్ వద్ద ఉన్న కాగితాలు 'సరిపోకపోవడంతో' ఆయనకు పరిహారం ఇచ్చేందుకు నిరాకరించారు. “ఈ భూమిపైన, ఇంటిపైన మాకు హక్కులు ఉన్నాయా లేదా అనేది ఇప్పుడు మాకు స్పష్టంగా తెలియటంలేదు. మాకు పరిహారం వస్తుందో లేదో చెప్పడంలేదు. మమ్మల్ని తరిమికొట్టాలనుకుంటున్నారు. మా మాటను ఎవరూ వినడం లేదు.

వీడియో చూడండి: 'మేం ఆందోళన చేయటానికి సిద్ధంగా ఉన్నాం'

ఆనకట్ట రిజర్వాయర్ వల్ల 14 గ్రామాలు మునిగిపోతాయి. మరో ఎనిమిది గ్రామాలను రాష్ట్రం నష్టపరిహారంగా అటవీ శాఖకు అప్పగించింది

పక్క గ్రామమైన పల్‌కోఁహాకు చెందిన జుగల్ ఆదివాసీ ఏకాంతంగా మాట్లాడటానికి మొగ్గుచూపారు.

"నీ పట్టా కు సంబంధించిన రికార్డులేవీ మా వద్ద లేవని పట్వారీ [ప్రధానాధికారి] చెప్పేశాడు," గ్రామ కేంద్రం నుండి దూరంగా మేం నడుస్తూ వెళుతున్నప్పుడు అతను చెప్పారు. "సగంమంది జనానికి ఎంతో కొంత పరిహారం వచ్చింది, కానీ మిగిలినవారికి ఏమీ రాలేదు." తానిప్పుడు ప్రతి ఏటా వెళ్తున్నట్టే వలస వెళ్ళటం మొదలుపెడితే ఏదైనా పరిహారాన్ని కోల్పోతానేమోననీ, తన ఏడుగురు పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందనీ అతను ఆందోళన చెందుతున్నారు.

"నేను చిన్నపిల్లాడిగా ఉండగా భూమిపై పనిచేశాను, మేం అడవిలోకి వెళ్ళేవాళ్ళం," అని అతను గుర్తుచేసుకున్నారు. అయితే గత 25 ఏళ్ళుగా పులుల అభయారణ్యంగా మారిన అడవిలోకి ప్రవేశించడంపై ఆంక్షలు విధించడం వల్ల ఆయనలాంటి ఆదివాసులకు రోజువారీ కూలీ పనుల కోసం వలస వెళ్ళడం తప్ప మరో దారి లేకుండాపోయింది.

నిర్వాసితం కాబోతున్న గ్రామాల్లోని మహిళలు తమకు న్యాయమైన వాటా దక్కాలని పట్టుదలతో ఉన్నారు. "[ప్రధాని] మోదీ ఎప్పుడూ 'మహిళల కోసం ఈ పథకం... మహిళల కోసం ఆ పథకం' అని చెబుతుంటాడు. మాకు అదేమీ వద్దు. మా హక్కు ఏమిటనేదే మాకు కావాలి,” అని (దళిత) రవిదాస్ సముదాయానికి చెందిన పల్‌కోఁహా రైతు సున్నీ బాయి చెప్పారు.

“పురుషులు మాత్రమే ఎందుకు [పరిహారం] ప్యాకేజీని పొందుతున్నారు, మహిళలకు మాత్రం ఎందుకని ఏమీ లేదు? ఏ ప్రాతిపదికన ప్రభుత్వం ఈ చట్టం చేసింది?" అని ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్ళు ఉన్న ఈ తల్లి అడుగుతున్నారు. “భార్యాభర్తలు గొడవపడి విడిపోతే, ఆ మహిళ తననూ తన పిల్లలనూ ఎలా పోషించుకుంటుంది? చట్టం ఈ విషయాల గురించి ఆలోచించాలి… ఎందుకంటే, ఆమె కూడా వోటరే కదా."

PHOTO • Priti David
PHOTO • Priti David

ఎడమ: నిరసనకారులు ఉపయోగించింజ పోస్టర్లను చూపిస్తోన్న ఛతర్‌పూర్ జిల్లా, పల్‌కోఁహాకు చెందిన జుగల్ ఆదివాసీ. కుడి: తన పిల్లలు విజయ్, రేష్మా (నల్ల కుర్తా), అంజలిలతో సున్నీ బాయి. మహిళలకు నష్టపరిహారాన్ని ఇవ్వడాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆమె అన్నారు

*****

" జల్, జీవన్, జంగల్ ఔర్ జాన్వర్ [నీరు, జీవనోపాధులు, అడవులు, జంతువులు]. వీటికోసమే మేం పోరాడుతున్నాం," అంటూ ఇక్కడి ప్రజలు PARIతో చెప్పారు.

దౌధన్‌కు చెందిన గులాబ్ బాయి మాకు తన విశాలమైన ఆవరణను చూపిస్తూ, ఇంటిలో తాము నివసించే గదుల 'గోడల' వెలుపల ఉన్నందున, పరిహారం నుంచి ఆవరణను, వంటగదులనూ మినహాయించారని చెప్పారు. అయితే ఈ 60 ఏళ్ళ మహిళ ఏమాత్రం వెనక్కి తగ్గడంలేదు. “[నాలాంటి] ఆదివాసీ శాసన్ [ప్రభుత్వం] నుండి పొందిందేమీ లేదు. నేను ఇక్కడి నుండి భోపాల్ [రాష్ట్ర రాజధాని] వరకూ పోరాడతాను. నాకు బలం ఉంది. నేను అక్కడ ఉన్నాను. నాకు భయం లేదు. ఆందోళన కు నేను సిద్ధంగా ఉన్నాను."

కెబిఆర్‌ఎల్‌పికి వ్యతిరేకంగా 2017 గ్రామ సభలతో చిన్నపాటి నిరసనలు ప్రారంభమై, ఊపందుకున్నాయి. LARRAను ఉల్లంఘించడాన్ని వ్యతిరేకిస్తూ జనవరి 31, 2021న 300 మందికి పైగా ప్రజలు ఛతర్‌పూర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. 2023 గణతంత్ర దినోత్సవం నాడు, మూడు జల సత్యాగ్రహాల లో (నీటి సంబంధిత కారణాల కోసం నిరసనలు) మొదటిదాన్ని నిర్వహించినపుడు, పిటిఆర్‌లోని 14 గ్రామాల నుండి వచ్చిన వేలాదిమంది ప్రజలు రాజ్యాంగపరమైన తమ హక్కుల ఉల్లంఘనను వ్యతిరేకిస్తూ మాట్లాడారు.

తమ ఆగ్రహం ప్రధానమంత్రికి చేరిందని, అందుకే ఆయన గత సంవత్సరం ఆనకట్టను ప్రారంభించేందుకు దౌధన్‌కు రాకూడదని నిర్ణయించుకున్నాడని స్థానికులు అంటున్నారు. అయితే ఆ విషయాన్ని ఈ విలేఖరి స్వతంత్రంగా ధృవీకరించలేకపోయారు.

ఈ ప్రాజెక్ట్ చుట్టూ అలముకున్న వివాదాలు, దురుద్దేశాల వలన ఆగస్టు 2023లో ప్రారంభమైన టెండర్లు వేసే ప్రక్రియ దెబ్బతింది. ఇందులో ఎవరూ పాల్గొనలేదు. దాంతో తేదీలను మరో ఆరు నెలల పాటు పొడిగించారు.

PHOTO • Priti David

న్యాయమైన పరిహారం కోసం పోరాడటానికి తాను సిద్ధంగా ఉన్నానని దౌధన్ గ్రామానికి చెందిన గులాబ్ బాయి చెప్పారు

ప్రభుత్వ చర్య వెనుక ఉన్న అబద్ధాలు, అస్పష్టత ఫలితంగా PARI సందర్శించిన ప్రతి గ్రామంలోనూ వారు ఎప్పుడు, ఎక్కడికి వెళ్తారో ఎవరికీ తెలియకుండాపోయింది. వారి ఇళ్ళకు, భూమికి, పశువులకు, చెట్లకు పరిహారంగా ఇచ్చే ఖచ్చితమైన మొత్తం/రేటు ఎంతో, దాన్ని ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు

*****

"మధ్య భారతదేశంలో వాతావరణ మార్పుల గురించి ఎక్కువమంది మాట్లాడరు, కానీ ఇక్కడ మేం విపరీతమైన వర్షాలనూ, కరవులు పెరిగిపోవడాన్నీ చూస్తున్నాం. ఈ రెండూ వాతావరణంలో వచ్చిన మార్పుల ప్రభావాలను సూచిస్తాయి," అని పర్యావరణ శాస్త్రవేత్త కేల్కర్ అభిప్రాయపడ్డారు. "మధ్య భారతదేశంలోని చాలా నదులు వాతావరణ మార్పుల కారణంగా వేగవంతమైన ప్రవాహాలను చూస్తున్నాయి, కానీ ఆ ప్రవాహాలు నిలిచేవి కావు. ఈ ప్రవాహాలు ఇప్పుడు మిగులు జలాలు ఉన్న భావనను కలిగించవచ్చు, కానీ వాతావరణంలో వస్తోన్న మార్పుల కారణంగా అవి చాలా కొద్దికాలం మాత్రమే ఉంటాయని స్పష్టంగా తెలుస్తోంది.”

నదుల అనుసంధానం కోసం ఈ స్వల్పకాలిక మార్పులను వాడుకోవాలని చూస్తే, భవిష్యత్తులో ఈ ప్రాంతం మరింత తీవ్రమైన కరువును ఎదుర్కొనే అవకాశాన్ని తోసిపుచ్చలేమని ఆయన హెచ్చరిస్తున్నారు.

సహజారణ్యంలోని విశాల ప్రాంతంలో జలవిధ్వంసక ప్రభావం ఒక బ్రహ్మాండమైన తప్పిదమని ఠక్కర్ కూడా హెచ్చరించారు. "సుప్రీమ్ కోర్టు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ నివేదిక దీనిని వెలుగులోకి తెచ్చింది, అయితే ఆ నివేదికను సుప్రీమ్ కోర్టు కూడా పరిగణనలోకి తీసుకోలేదు."

నేచర్ కమ్యూనికేషన్‌ లో నదుల అనుసంధానంపై ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) ముంబై 2023లో ప్రచురించిన ఒక పత్రం కూడా ప్రమాద ఘంటికను మోగించింది: “బదలాయింపు చేసిన నీటి ద్వారా పెరిగిన నీటిపారుదల, ఇప్పటికే నీటి ఒత్తిడి ఉన్న ప్రాంతాలలో సెప్టెంబర్‌లో కురిసే సగటు వర్షపాతాన్ని 12% వరకు తగ్గిస్తుంది... తగ్గిపోయిన సెప్టెంబరు అవక్షేపణం రుతుపవనాల అనంతరం నదులను ఎండిపోయేలా చేస్తుంది, దేశవ్యాప్తంగా నీటి ఒత్తిడిని పెంచుతుంది, అనుసంధానాన్ని కుదరనివ్వదు.

PHOTO • Priti David
PHOTO • Priti David

ఎడమ: వేసవిలో కేన్ నదీ భాగాలు తరచుగా ఎండిపోతాయి. కుడి: 2024 రుతుపవనాల తర్వాత టైగర్ రిజర్వ్ సమీపంలో కేన్ నది. ఇటువంటి రుతుపవనాల అనంతర ప్రవాహం మిగులు జలాలకు సూచన కాదు

నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (NWDA) ఆధ్వర్యంలో ఉన్న ఈ ప్రాజెక్ట్ ఉపయోగించిన డేటాను, దేశీయ భద్రతా సమస్యలను కారణంగా చూపిస్తూ శాస్త్రవేత్తలతో పంచుకోవడం లేదని హిమాంశు ఠక్కర్ తెలిపారు.

ఆనకట్ట నిజంగానే సాధ్యమవుతుందన్నట్టు కనిపించడం ప్రారంభించిన 2015లో, SANDRP కు చెందిన ఠక్కర్, ఇంకా కొంతమంది వాతావరణ అంచనాల కమిటీ (EAC)కి చాలా లేఖలు రాశారు. 'లోపభూయిష్టమైన కేన్-బేత్వా EIA మరియు ప్రజాభిప్రాయ సేకరణలో ఉల్లంఘనలు' అనే శీర్షికతో పంపిన లేఖ అటువంటి వాటిలో ఒకటి. "ప్రాజెక్ట్ EIA ప్రాథమికంగా లోపభూయిష్టంగా, అసంపూర్తిగా ఉంది. దాని ప్రజాభిప్రాయ సేకరణలో అనేక ఉల్లంఘనలు ఉన్నాయి. అటువంటి అసమగ్రమైన అధ్యయనాలతో ప్రాజెక్ట్‌కు ఆమోదాన్నివ్వటం తప్పు మాత్రమే కాదు, చట్టబద్ధంగా అంగీకారయోగ్యం కూడా కాదు," అని ఈ లేఖ చెప్పింది.

ఇప్పటికే 15-20 లక్షలకు పైగా చెట్లు నేలకొరిగాయి. పరిహారం గురించి స్పష్టమైన అంచనా ఏదీ లేకుండా తొలగింపు గురించిన బెదిరింపులు వినిపిస్తున్నాయి. వ్యవసాయం ఆగిపోయింది. రోజువారీ కూలీ పని కోసం వలస వెళ్లడం వల్ల పరిహారం పేరుతో ఏదైనా అరకొరగా ఇచ్చే వాటి నుండి కూడా మినహాయించబడే ప్రమాదం ఉంది.

“మేం మా సమస్తాన్నీ కోల్పోతున్నాం. దాన్నంతా వాళ్ళే తీసుకుపోతున్నారు. వారే మాకు సహాయం చేయాలి. అలా చేయటానికి బదులుగా వాళ్ళు ‘ఇదిగో ప్యాకేజీ, పత్రంపై సంతకం చేయండి, మీ డబ్బు తీసుకొని వెళ్ళండి,’ అంటున్నారు," అంటూ సున్నీ బాయి ఈ కొద్ది పదాలలో మొత్తమంతటి సారాంశాన్నీ చెప్పారు.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Priti David

پریتی ڈیوڈ، پاری کی ایگزیکٹو ایڈیٹر ہیں۔ وہ جنگلات، آدیواسیوں اور معاش جیسے موضوعات پر لکھتی ہیں۔ پریتی، پاری کے ’ایجوکیشن‘ والے حصہ کی سربراہ بھی ہیں اور دیہی علاقوں کے مسائل کو کلاس روم اور نصاب تک پہنچانے کے لیے اسکولوں اور کالجوں کے ساتھ مل کر کام کرتی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Priti David

پی سائی ناتھ ’پیپلز آرکائیو آف رورل انڈیا‘ کے بانی ایڈیٹر ہیں۔ وہ کئی دہائیوں تک دیہی ہندوستان کے رپورٹر رہے اور Everybody Loves a Good Drought اور The Last Heroes: Foot Soldiers of Indian Freedom کے مصنف ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز پی۔ سائی ناتھ
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

کے ذریعہ دیگر اسٹوریز Sudhamayi Sattenapalli