“ఏయ్! మీరిక్కడేం చేస్తున్నారు?” అతను అడిగారు, కుతూహలం నిండిన చూపుతోనూ, దృఢమైన స్వరంతోనూ.
నాకతను కనిపించిన ఎత్తైన నది ఒడ్డున ఆయనను ఎవరూ కలవరని నాకు వెంటనే అర్థమయింది.
అనిరుద్ధ సింగ్ పాతర్ ఒడ్డు మీంచి నది వైపుకు దూకారు. అకస్మాత్తుగా ఆగి, పక్కకు తిరిగి నన్నిలా హెచ్చరించారు: “ఆ ప్రదేశంలో మృతదేహాలను కాలుస్తారు. నిన్న ఎవరో చనిపోయారు. అక్కడ నిలబడొద్దు, నావెంట రండి!”
చక్కటి సూచన, అని నేననుకున్నాను. ఎందుకంటే చనిపోయినవారిని వారు సంపాదించుకున్న ఏకాంతంలో విశ్రాంతి తీసుకోనివ్వడం సముచితం అని నాకపించింది.
పశ్చిమ బెంగాల్, పురులియా జిల్లాలోని కంసావతి నది మోకాళ్ల లోతు నీటిలో అతను నేర్పుగా సాగుతున్నప్పుడు, రెండు మీటర్ల ఎత్తున్న నది ఒడ్డుమీంచి కిందికి వస్తూ నేనతన్ని గమనించాను. అతని వేగాన్ని అందుకోవడానికి నా వంతు ప్రయత్నం చేస్తూ, నేనుకూడా ఒడ్డున వేగంగా నడిచాను.
తన వయసును తెలియనివ్వని అతని చురుకుదనం తన నైపుణ్యాన్ని దాచలేకపోవడం విస్మయానికి గురిచేసింది. 50ల చివర వయసున్న ఆ వ్యక్తిని, “ కాకా , మీరు నదిలో ఏం చేస్తున్నారు?” అని అడక్కుండా ఉండలేకపోయాను.
అనిరుద్ధ తను నడుముకు సంచిలాగా కట్టుకున్న తెల్లటి గుడ్డను వదులుచేసి, తను పట్టుకున్న వాటినుండి ఒక్క రొయ్యని సున్నితంగా బయటకు తీసి, చిన్నపిల్లాడిలా ఉప్పొంగిపోతూ ఇలా అన్నారు: “ చింగ్రీ (రొయ్య)ని చూశారా? ఇది ఈరోజు మా (కుటుంబం) మధ్యాహ్న భోజనం అవుతుంది. సుక్నో లొంకా , రొసున్ వేసి వేయించిన ఈ రొయ్యలు గొరొమ్ - భాత్ తో అద్భుతమైన రుచిని కలిగి ఉంటాయి." ఎండు మిరపకాయలు, వెల్లుల్లివేసి వండిన రొయ్యలు, వేడి వేడి అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.
వల లేకుండా చేపలు, రొయ్యలు పట్టుకునే ఆ వ్యక్తి అందరి దృష్టిని ఆకర్షిస్తారు. "నేనెప్పుడూ వలని ఉపయోగించలేదు. నా చేతులనే ఉపయోగిస్తాను. అవి (చేపలు) ఎక్కడ దాక్కున్నాయో నాకు తెలుసు.” అని అతను చెప్పారు. నది వైపు చూపిస్తూ, అతనిలా కొనసాగించారు, “ఈ రాళ్ల అంచున, నది నీటి అడుగున ఉన్న కలుపు మొక్కలు, ఆల్గేలను చూశారా? ఇవే చింగ్రీల నివాసాలు."
నేను నదిలోకి తొంగిచూసేసరికి అనిరుద్ధ చెబుతున్న కలుపు మొక్కలలో, ఆల్గేలో దాగి ఉన్న రొయ్యలు కనిపించాయి.
మేము మళ్ళీ అతని మధ్యాహ్న భోజనం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, తమ భోజనానికి అన్నం ఎక్కడ నుండి వస్తుందో అతను వివరించారు. "నాకున్న కొద్దిపాటి భూమిలో కష్టపడి వరిపంట సాగు చేస్తే ఎలాగోలా నా కుటుంబానికి ఏడాది ఖోరాకి (వినియోగానికి) సరిపడా బియ్యం లభిస్తాయి."
పురూలియాలోని పుంచా బ్లాక్‌లోని కొయిరా గ్రామంలో నివసిస్తున్న ఈ కుటుంబం పశ్చిమ బెంగాల్‌లోని షెడ్యూల్డ్ తెగకు చెందిన భూమిజ్ సామాజిక వర్గానికి చెందినది. 2011 జనాభా లెక్కల ప్రకారం, గ్రామంలోని మొత్తం జనాభా 2,249 మందిలో ఆదివాసులు సగానికి పైగా ఉన్నారు. వారి జీవనోపాధి, ఆహారం కోసం నదిపై ఆధారపడతారు.
అనిరుద్ధ తాను పట్టిన చేపలను అమ్మరు. అవి అతని కుటుంబ వినియోగం కోసం మాత్రమే. చేపలు పట్టడం అనేది పని కాదు, ఇది నేను ఇష్టంగా చేసే పని అని అతను చెప్పారు. అయితే, “నేను జీవనోపాధి కోసం దూరప్రదేశాలకు వెళతాను” అని అతను చెప్పినప్పుడు, అతని గొంతు దిగులుగా మారింది. పని కోసం వెతుకులాట అతన్ని మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు తీసుకువెళ్ళింది- ఎక్కువగా భవన నిర్మాణ కార్మికుడిగా, ఇంకా ఇతర పనుల కోసం కూడా.
కోవిడ్-19 లాక్‌డౌన్, 2020 సమయంలో అతను నాగ్‌పూర్‌లో ఇరుక్కుపోయారు. “నేను ఒక భవన నిర్మాణ ప్రాజెక్ట్‌లో పని చేయడానికి ఒక ఠేకేదార్ [లేబర్ కాంట్రాక్టర్]తో కలిసి అక్కడికి వెళ్లాను. ఆ రోజుల్లో బతకడం చాలా కష్టమైంది” అని గుర్తు చేసుకున్నారు. "ఒక సంవత్సరం క్రితం తిరిగి వచ్చాను. ఇప్పుడు నేను పెద్దవాడినైపోతున్నందున తిరిగి వెళ్లకూడదని నిర్ణయించుకున్నాను."
పురులియా జిల్లాకు చెందిన పురుషులు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కేరళ వంటి ఇతర రాష్ట్రాలకూ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కూడా పనికోసం వెతుకుతూ వలస వెళతారని, కొయిరా నివాసి అమల్ మహతో (40) చెప్పారు. వ్యవసాయ ఖర్చుల కోసం వారు తీసుకున్న రుణాలను తీర్చడానికి వారిలా చేస్తారని స్థానిక వార్తాపత్రికలో రిపోర్టర్‌గా కూడా పనిచేసే ఈ ఉపాధ్యాయుడు చెప్పారు. పురుషులు ఇళ్ళల్లో లేనప్పుడు, కుటుంబానికి ఆహారాన్ని అందించడం కోసం మహిళలు పొలం పనులను చూసుకుంటారు. “కొద్దిపాటి భూమి కలిగివుండే ఆదివాసీ కుటుంబాలకు ఇదొక విషవలయంలాంటిది. వారు మహాజన్‌ల(వడ్డీ వ్యాపారులు) నుండి అప్పులు తీసుకుంటారు.” అని అమల్ వివరించారు.
ఎరువులు, విత్తనాలు వంటి వ్యవసాయ అవసరాల కోసం తీసుకున్న రుణాలను అనిరుద్ధ చెల్లించాల్సి వచ్చింది. నాగ్‌పూర్‌లో సిమెంట్ కలపడం, భారీ బరువులెత్తడం వంటివి అతని పనులుగా ఉండేవి. రోజుకు 300 రూపాయలు సంపాదించేవారు. కానీ కొయిరాలో కూలి పనికి అంత జీతం లభించదు. "పని లేనప్పుడు ఖాళీగా కూర్చోవాలి" అన్నారతను. నాట్లువేయడం, కోత కోయడం వంటి సీజన్లలో పొలాల్లో పని దొరికినప్పుడు, రోజువారీ కూలీ 200 రూపాయలు లేదా అంతకంటే తక్కువే ఉంటుంది. “నదులపై రాయల్టీ తీసుకున్న వ్యక్తులు ఇసుక తవ్వడానికి లారీలతో ఇక్కడికి వచ్చినప్పుడు నాకు (కొయిరాలో) కొన్ని రోజులు పని దొరుకుతుంది. నది నుండి లారీల వరకు ఇసుకను మోసుకెళ్ళడం ద్వారా (రోజుకు) 300 రూపాయలు సంపాదిస్తాను."
ఇక్కడ 'రాయల్టీ'అంటే అనిరుద్ధ ఉద్దేశ్యం, కంసావతి నదీగర్భంలో ఇసుక తవ్వడానికి ఇచ్చిన లీజులు. ఇక్కడ విచక్షణా రహితంగా ఇసుకను వెలికితీస్తున్నారు. స్థిరమైన ఇసుక తవ్వకాల కోసం ఏర్పరచిన మార్గదర్శకాలను తరచుగా ఉల్లంఘిస్తున్నారు. రాజకీయంగా బలమైన వ్యక్తుల సహకారంతో నదీగర్భంలో ఇసుక అక్రమ రవాణా ప్రబలంగా సాగుతున్నదని గ్రామస్తులు తెలిపారు. కానీ ఈ వాణిజ్యం అనిరుద్ధ సింగ్ పాతర్ వంటి గ్రామస్తులకు కొన్ని రోజుల కూలీ పని దొరికేలా చేస్తుంది. అయితే, దాని చట్టవిరుద్ధ స్వభావం గురించి మాత్రం వారికేమీ తెలియదు.
అయినప్పటికీ, పర్యావరణంపై "రాయల్టీ వ్యాపారం" ప్రతికూల ప్రభావం గురించి అనిరుద్ధకు తెలుసు. ఇది " బిశాల్ ఖోటీ నదీర్ " అంటే, నదికి చాలా నష్టం అని అనిరుద్ధ చెప్పారు. "నదీగర్భంలో మళ్ళీ ఏర్పడాలంటే, అనేక సంవత్సరాలు పట్టేంత ఇసుకను వాళ్ళు తవ్వుకుపోతున్నారు."
"నదిలో పుష్కలంగా చేపలు ఉండేవి," బాన్ (భారతదేశపు మచ్చల ఈల్ చేప), షోల్ (పాముతల కొరమీను) మాగుర్ (వాకింగ్ క్యాట్ ఫిష్)- అంటూ అనిరుద్ధ కొనసాగించారు. “ జలేలు (మత్స్యకారులు) అప్పట్లో చేపలను పట్టుకోవడానికి వలలను ఉపయోగించేవారు. ఇప్పుడు వారు ఇక్కడికి రావడం లేదు. వారిప్పుడు నదీప్రవాహానికి ఎగువ దిశగానో, దిగువ దిశగానో ఇతర ప్రదేశాలకు వెళ్ళిపోయారు." అక్కడ ప్లాస్టిక్ పదార్థాలు, ఖాళీ సీసాలు, థర్మాకోల్ ప్లేట్లతో నదీతీరాన్ని కలుషితం చేస్తున్న ‘పిక్నిక్ పార్టీల’ పట్ల అనిరుద్ధ కోపంగా ఉన్నారు.
అతను రొయ్యల కోసం సునాయాసంగా నదిలో వెదుకుతున్నారు. "మా చిన్నప్పుడు నదిలో చింగ్రీలు పుష్కలంగా ఉండేవి. రొయ్యలను కనిపెట్టి, వాటిని ఉత్త చేతులతోనే ఎలా పట్టుకోవాలో మా నాన్న నాకు ఉపాయాలు నేర్పించారు. బాబా అమార్ బిరాట్ మాచోవాల్ చిలో (మా నాన్న చాలా గొప్ప మత్స్యకారుడు).” అని అనిరుద్ధ చెప్పారు.
చింగ్రీ తర్వాత చింగ్రీ ని పట్టుకుంటూ, "రొయ్యలను శుభ్రం చేయడానికి చాలా శ్రమ చేయాలి, కానీ అవి చాలా రుచిగా ఉంటాయి." అన్నారు అనిరుద్ధ. అయితే, నది లేదా చింగ్రీలు ఇంకేమాత్రం ఒకేలా ఉండవని ఆయన తెలిపారు. “నదికి దగ్గరలో ఆవాలు, వరి పండించే పొలాలు మీకు కనిపిస్తున్నాయా? వారు పంటలపై అన్ని రకాల ఎరువులనూ పురుగుమందులనూ పిచికారీ చేసి, ఆ డబ్బాలను ఈ నది నీటిలో కడుగుతారు. కలుషిత నీరు చేపలను చంపుతుంది. చింగ్రీలు కరవైపోతున్నాయి...”
కొయిరా గ్రామానికి 5-6 కిలోమీటర్ల దూరంలో ఉండే పిర్‌రా గ్రామం నుండి నదిలో స్నానం చేయడానికి వచ్చిన శుభంకర్ మహతో అనిరుద్ధ అభిప్రాయాలనే తానూ వెలిబుచ్చారు: "నదులు ఒకప్పుడు సమీపంలో నివసించే భూమిలేని, లేదా కొద్దిపాటి భూమి కలిగి, ఆహారధాన్యాలను కొనుగోలు చేసే శక్తిలేని ఆదివాసులకు జీవనోపాధినీ, పుష్కలంగా ప్రొటీన్లనూ, ఇతర ముఖ్యమైన పోషకాలనూ అందించేవి." రాష్ట్రంలోనే అత్యంత పేద జిల్లాల్లో పురులియా కూడా ఉందని ఆయన ఎత్తిచూపారు.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోనే పురులియాలో అత్యధిక పేదరికం ఉందని 2020 లో జరిగిన ఒక అధ్యయనం అంచనా వేసింది. జిల్లాలోని జనాభాలో 26 శాతం కుటుంబాలు దారిద్య్రరేఖకు దిగువన నివసిస్తున్నవే. “ఇక్కడి కుటుంబాలు ఆహారం కోసం అడవుల పైనా, నదులపైనా ఆధారపడి ఉన్నాయి. కానీ ఇప్పుడు సహజసిద్ధమైన వనరులు కరవయ్యాయి" అని ఉపాధ్యాయుడైన శుభంకర్ అన్నారు.
ఎవరికోసం అనిరుద్ధ మరిన్ని రొయ్యలను అంత కష్టపడి వెతికి పట్టుకుంటున్నారో, నేను ఆ కుటుంబం గురించి ఆయన్ని అడిగాను. “నా భార్య ఇంటి పనులూ, పొలాల్లో పనులూ చేస్తుంది. నా కొడుకు కూడా మా పొలంలోనే పనిచేస్తున్నాడు,” అన్నారు. తన పిల్లల గురించి మాట్లాడేటప్పుడు ఆయన మొహం వెలిగిపోయింది. “నా ముగ్గురు అమ్మాయిలకూ పెళ్లిళ్లయ్యాయి (దూరంగా నివసిస్తున్నారు). ఇప్పుడు నా దగ్గరున్నది ఒక్కడే అబ్బాయి. నేనతన్ని ఎక్కడికీ (పని చేయడానికి) పంపడం లేదు, అలాగే నేను కూడా ఆ సుదూర ప్రాంతాలకు వెళ్లడం లేదు."
అనిరుద్ధ దగ్గర నుండి బయలుదేరి వస్తున్నప్పుడు, తాను కష్టపడి సంపాదించిన ఆహారాన్ని తన కుటుంబంతో కలిసి ఆనందంగా ఆరగిస్తూవుంటారని ఊహించాను. నాకు "ఈ నది ఎక్కడ ప్రవహిస్తుందో అక్కడ సమూహంలోని ప్రతి జీవి జీవిస్తుంది, దాని నీటిలో చాలా చేపలు ఉంటాయి" అనే బైబిల్ వాక్యం గుర్తుకు వచ్చింది.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి