మధ్యాహ్నానికి ముందు, ఒక వ్యక్తి లౌడ్స్పీకర్లో తెలుగులో పిలుస్తున్నాడు. “పాండు నాయక్, మీ కూతురు గాయత్రి మాతో ఉంది. దయచేసి వెంటనే కంట్రోల్ రూంకి రండి”. మునుపటి రాత్రి నుండి పిల్లలతో పాటు పెద్దల కోసం కూడా ఇలాంటి ప్రకటనలు అనేకం చేయబడ్డాయి. అలుపెరుగక తిరుగుతున్న ఆ సమూహాలలో, సాధారణంగా కొంతమంది కుటుంబాలు, వారి సహచరుల నుండి విడిపోతారు - మళ్లీ కలుసుకోగానే వారి ఆందోళన తగ్గుతుంది.
యాత్రికులు, సందర్శకులు మునుపటి రాత్రి నుండి రావడం ప్రారంభించారు - వారు కనీసం 50,000 మంది ఉంటారని స్థానిక మీడియా అంచనా. మరుసటి రోజు సూర్యోదయం నాటికి, తెలంగాణలోని సూర్యాపేట జిల్లా జనపహాడ్ గ్రామంలోని దర్గాకు వెళ్లే మార్గం దాదాపు నిండిపోయింది.
ఇది ఉర్సు, హజ్రత్ జనపక్ షహీద్ వర్ధంతి. మొదటి క్యాలెండర్ నెలలోని నాల్గవ శుక్రవారం జరుపబడుతుంది - ఈ సంవత్సరం జనవరి 24న జరుపుకున్నారు.
ఈ రోజు అనేక వర్గాల ప్రజలు ఇక్కడికి వస్తారు- ముస్లింలు; హిందువులు, లంబాడీలకు(షెడ్యూల్డ్ తెగ) ఇది ఒక ముఖ్యమైన పండుగ. ప్రధానంగా- తెలంగాణలోని ఖమ్మం, వరంగల్ మరియు మహబూబ్నగర్ జిల్లాల నుండి, ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల నుండి, సందర్శకులు వస్తుంటారు.
దాని లౌకిక ఆకర్షణతో పాటు, ఈ ఉర్సు తమ భూమి కోసం అదృష్టాన్ని కోరుకునే రైతులను కూడా రప్పిస్తుంది. “పంట, పైరు, పిల్లలు [దిగుబడి, పంట, పిల్లలు] బాగుంటుంది. అందుకే గంధం పండుగకు నిత్యం వస్తున్నాం’’ అని రజక (తెలంగాణలో వెనుకబడిన కులం)కు చెందిన రైతు మొయిలోళ్ల అంజమ్మ చెప్పారు. ఆమె తన భర్త మొయిలోల్ల బాలయ్యతో కలిసి మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేట మండలం నుండి పాలకీడు మండలంలోని హజరత్ దర్గాకు 160 కిలోమీటర్ల దూరం నుండి వచ్చింది.






