ఒక తల్లి ఏ భాషలో కలగంటుంది? గంగా తీరాలనుంచి పెరియార్ తీరాలదాకా ఆమె తన బిడ్డలతో ఏ భాషలో సంభాషిస్తుంది? రాష్ట్రాన్ని బట్టి, జిల్లానుబట్టి, గ్రామాన్నిబట్టి ఆ తల్లి భాష రంగు మారుతుందా? వేల భాషలున్నాయి, లక్షల మాండలికాలున్నాయి, అవన్నీ ఆమెకు తెలుసా? విధర్భ రైతులతో, హత్రాస్ చిన్నారులతో, దిండుక్కల్ మహిళలతో ఆమె ఏ భాషలో మాట్లాడుతుంది? వినండి! ఎర్రని నేలకు తల ఆన్చి వినండి. గాలితెమ్మెరలు ముఖాన్ని లాలించే ఒక కొండమీదకు చేరి వినండి! వినగలుగుతున్నారా? ఆమె పాటల్ని, ఆమె కథల్ని, ఆమె నిట్టూర్పుల్ని? అయితే చెప్పండి నాకు, ఆమె భాషను గుర్తుపట్టగలరా? చెప్పండి, ఒక సుపరిచితమైన జోలపాట ఏదైనా వినగలుగుతున్నారా, నాలాగా?
భాషలు
బాకు ఒకటి నా
నాలుకలో దిగబడుతున్నది
సున్నితమైన
కండరాలను చీలుస్తూ
దాని అంచుల
పదును తెలుస్తున్నది
నేనిక మాట్లాడలేను
నా మాటలన్నీ,
నా అక్షరాలన్నీ
నాకు తెలిసిన,
నేను అనుభూతి చెందిన
పాటలన్నీ, కథలన్నీ
ఇప్పుడు ఆ బాకు
పాలైనవి.
నెత్తురోడుతోన్న
ఈ నాలుక
ఒక రక్తధారయై
నా నోటినుంచి
ఛాతీ దాకా
నాభి దాకా,
నా లింగం దాకా
సారవంతమైన ద్రావిడ
నేలల దాకా పొంగుతున్నది.
నేలంతా ఎర్రగా
చిత్తడిగా నాలుకలాగే ఉన్నది.
ఒక్కో బిందువు
నుంచి కొత్తకొత్తవి మొలుచుకొస్తున్నవి
నల్లని నేలపొరల్లోంచి
ఎర్రెర్రని గడ్డిపోచలు.
పొరల క్రింద
వందలకొద్దీ,
వేలకొద్దీ, లక్షలకొద్దీ భాషలు.
మృత భాషలు పురా
శ్మశానాల్లోంచి పైకి లేస్తున్నవి
మా అమ్మకు తెలిసిన
పాటల్నీ, కథల్నీ ఆలాపిస్తూ
విస్మృత భాషలు
మళ్లీ వసంతపుష్పాల్లా వికసిస్తున్నవి
బాకు దిగబడుతున్నది
కానీ,
వేల భాషల పుట్టిల్లు
అయిన నేల పాట విని
మొద్దుబారిన
దాని అంచులు వణుకుతున్నవి
అనువాదం: కె. నవీన్ కుమార్