హర్యానా- ఢిల్లీ సరిహద్దులోని సింఘు వద్ద నిరసన తెలుపుతున్న 23 ఏళ్ల యువతి, విశవ్జోట్ గ్రెవాల్ మాట్లాడుతూ “ఈ చట్టాలను తిప్పికొట్టాలని మేము కోరుకుంటున్నాము. మాకు మా భూమి తో చాలా అనుబంధం ఉంది. దానిని ఎవరైనా మా నుండి లాక్కుంటే మేము సహించలేము" అన్నది. ఈమె కూడా రైతుల కుటుంబానికి చెందినది. గత సెప్టెంబర్లో పార్లమెంటులో ఈ మూడు చట్టాలు ఆమోదించబడిన సమయం నుంచి ఈమె తమ గ్రామమైన పమల్(లూధియానా జిల్లా) లో నిరసన కార్యక్రమాలను నిర్వహించడానికి సహాయం చేస్తోంది.
గ్రామీణ భారతదేశంలో కనీసం 65 శాతం మంది మహిళల లానే(సెన్సస్ 2011 గమనికలు) ఆమె కుటుంబంలోని మహిళలు, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వ్యవసాయ కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నారు. వారిలో చాలా మందికి భూమి లేదు, కానీ వారు వ్యవసాయాన్నే నమ్ముకున్నారు. విత్తనాలు, నాట్లు, కోత, నూర్పిడి, పొలం నుండి ఇంటికి పంట రవాణా, ఫుడ్ ప్రాసెసింగ్, పాడిపరిశ్రమ ఇటువంటి పనులలోనే వారి శ్రమ ఎక్కువగా ధారపోసేది..
అయినప్పటికీ, జనవరి 11 న, భారత సుప్రీంకోర్టు మూడు వ్యవసాయ చట్టాలను నిలిపివేస్తూ ఒక ఉత్తర్వు జారీ చేసినప్పుడు, ప్రధాన న్యాయమూర్తి కూడా మహిళలను, వృద్ధులను నిరసన స్థలాల నుండి తిరిగి వెళ్ళడానికి ‘ఒప్పించాలి’ అని చెప్పారు. కానీ ఈ చట్టాల పతనం మహిళలను (మరియు వృద్ధులను) కూడా ప్రభావితం చేస్తుంది.
రైతులు నిరసన తెలిపే చట్టాలు రైతు (సాధికారత మరియు రక్షణ) ధరల భరోసా మరియు వ్యవసాయ సేవల చట్టం, 2020 ; రైతు ఉత్పత్తి వాణిజ్యం (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) చట్టం, 2020 ; మరియు ఎసెన్షియల్ కమోడిటీస్ (సవరణ) చట్టం, 2020 . భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ను బలహీనం చేస్తూ, పౌరులందరికీ చట్టబద్దమైన హక్కును నిలిపివేస్తున్నందున, ఈ చట్టాలు ప్రతి భారతీయుడిని ప్రభావితం చేస్తాయని విమర్శించబడ్డాయి.
ఈ చట్టాలు మొదట జూన్ 5, 2020 న ఆర్డినెన్స్లుగా ఆమోదించబడ్డాయి, తరువాత సెప్టెంబర్ 14 న పార్లమెంటులో వ్యవసాయ బిల్లులుగా ప్రవేశపెట్టబడ్డాయి. మళ్లీ అదే నెల 20 న చట్టాలుగా ఆమోదించబడ్డాయి. పెద్ద కార్పోరేట్లు వ్యవసాయంపై మరింత అధికారాన్నిపెంచుకోవడం వలన రైతులు ఈ చట్టాన్ని తమ జీవనోపాధికి జరిగే పెద్ద హానిగా చూస్తారు. అంతేగాక రాష్ట్రం సాగుదారునికి మద్దతు ఇచ్చే ముఖ్యవిషయాలైన కనీస మద్దతు ధర (ఎంఎస్పి), వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీలను (ఎపిఎంసిలు) కార్పోరేట్లు బలహీనపరుస్తాయి.
"కొత్త వ్యవసాయ చట్టాల వల్ల ఎక్కువగా బాధపడేది మహిళలే. వ్యవసాయంలో ఎంత ఎక్కువగా పాల్గొన్నా, వారికి నిర్ణయం తీసుకునే అధికారం లేదు. ఉదాహరణకు ఎసెన్షియల్ కమోడిటీస్ చట్టంలో మార్పుల వలన ఆహార కొరత వస్తుంది. దాని వలన జరిగే నష్టాలు మహిళలే ఎదుర్కొంటారు ”అని ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మరియం ధవాలే చెప్పారు.
ఢిల్లీ మరియు చుట్టుపక్కల ఉన్న రైతుల నిరసన స్థలాల వద్ద చిన్నాపెద్దా మహిళలు చాలా మంది అక్కడే ఉండి నిరసనలో పాల్గొనాలని నిశ్చయించుకున్నారు. అలానే రైతులు కాని వారెందరో కూడా తమ మద్దతును తెలియపరచడానికి అక్కడకు వస్తున్నారు. ఇదేకాక చాలామంది వస్తువులను అమ్మడానికి, పని చేసి రోజు వేతనాలు సంపాదించడానికి, లేదా లాంగర్లలో సమృద్ధిగా అందే భోజనం తినడానికి కూడా అక్కడికి వచ్చి ఉన్నారు.
అనువాదం - అపర్ణ తోట