అప్పటికి రాత్రి రెండుగంటలైంది. గాఢాంధకారంగా ఉంది. మేము ‘మెకనైజ్డ్ బోట్’ అని గొప్ప పేరు గల పడవను తమిళనాడులో రామనాథపురం జిల్లా(స్థానికంగా దీనిని రామనాద్ అంటారు)లోని తీరంలో ఎక్కబోతున్నాము.
‘మెకనైజ్డ్ బోట్’ అంటే బాగా పాతదైన, ఒక పడవ వంటి దానికి ఒక లేలాండ్ బస్సు ఇంజిన్(1964, ఇది పనికి రాదనీ తేల్చినా దాన్ని మళ్లి మార్చి ఇటువంటి పడవలకు ఇప్పటికీ, 1993లో నేను వీరితో వెళ్ళినప్పుడు కూడా వాడుతున్నారు)ని తగిలించారు. స్థానికులైన మత్స్యకారులలా కాక, నాకసలు మేము ఎక్కడున్నామో తెలియట్లేదు. ఎక్కడో బంగాళాఖాతంలో అని మాత్రమే చెప్పగలను.
మేము పదహారు గంటలకు పైగానే సముద్రం పై ఉన్నాం. కొన్ని ప్రాంతాలు కష్టంగా దాటాము. కానీ ఈ ఐదురుగురు మత్స్యకారుల బృందంలో ఎవరి మొహాలలోనూ చిరునవ్వు చెదరలేదు. వీరందరి ఇంటి పేరు ఫెర్నాండో - ఇక్కడ మత్సకారుల వర్గంలో ఈ ఇంటి పేరు చాలా సాధారణం.
ఈ మెకనైజ్డ్ బోట్ కి కర్ర చివర గుడ్డని కట్టి, దానిని కిరోసిన్ లో ముంచి అంటీంచిన మంట తప్ప మరో వెలుగు లేదు. ఇటువంటి చీకటిలో నేను ఫోటోలు ఎలా తీయగలను?
నా సమస్యను చేపలు తీర్చాయి.
అవి వల లోపలనుంచి ఫాస్ఫరోసెన్స్(దీనికి బదులుగా మరో పదం వాడడం నాకు రాలేదు)తో వెలుగుతూ ఆ బోట్ ని కాంతితో నింపాయి. వాటిమీద ఫ్లాష్ వాడడమే నేను చేయవలసింది. నేను మరో రెండు ఫోటోలు ఫ్లాష్(ఇది వాడడం నాకు ఎప్పుడు నచ్చదు) లేకుండానే తీసుకున్నాను.
ఒక గంట తరవాత, నేను ఎప్పుడూ తిననంత తాజా చేపను తిన్నాను. టిన్ డబ్బాను బోర్లా తిప్పి మంటను రాజేశారు, దాని అడుగుకు కన్నాలు పెట్టి దానిపై చేపను వేయించి ఇచ్చారు. మేము ఆ సముద్రంలో రెండు రోజులు ఉన్నాము. 1993లో రామనాద్ తీరంలో మొత్తం మూడు సార్లు వెళ్లాను, అందులో ఈ ప్రయాణం కూడా ఒకటి. ప్రతిసారి మత్స్యకారులు ఆనందంగా ఉంటూ వారివద్ద ఉన్న పురాతన పరికరాలను వాడి, గొప్ప నైపుణ్యంతో పనిచేసేవారు.
అక్కడున్న కోస్ట్ గార్డ్ మమ్మల్ని రెండుసార్లు తనిఖీ చేయడానికి వచ్చాడు. అది మరి LTTE యుగం. శ్రీలంక కొద్ధి కిలోమీటర్లుదూరంలోనే ఉంది. ఆ కోస్ట్ గార్డ్ కాస్త గుర్రుమంటూనే రామనాద్ కలెక్టర్ నేను ఒక జర్నలిస్టునని రాసి ఇచ్చిన ఉత్తరాన్ని ఒప్పుకున్నాడు.
ఈ తీరం మీద బ్రతికే మత్సకారులు అందరూ అప్పుల్లో ఉన్నారు. వారికి వచ్చే డబ్బు, ఉత్పత్తి ని చూస్తే వారికి చాలా తక్కువ సంపాదన ఉంటుంది అని అర్థమవుతుంది. నేను కలిసిన వారందరిలో ఆరవతరగతి దాకా ఒక్క వ్యక్తి మాత్రమే చదువుకున్నాడు. వారికున్న లెక్కలేనన్ని ప్రమాదాల మధ్య వారికి లభించేది చాలా తక్కువ. వారు పట్టుకునే రొయ్యలు జపాన్ లో చాలా ఖరీదు చేస్తాయి. అయినా కాని, ఈ మెకనైజ్డ్ బోట్ల పై పనిచేసేవారికి సాధారణ పడవలపై చేపవేటలకు వెళ్లేవారికి, సంపాదనలో పెద్ద తేడా లేదు.
ఇద్దరూ పేదగానే ఉన్నారు, అందులో కొందరికి పడవలున్నాయి. నిజానికి మెకనైజ్డ్ బోట్లు నడిపేవారికి అసలేమీ లేవు. తెల్లవారుఝామునే మళ్లి సముద్రం మీద ఒకసారి అలా తిరిగి వచ్చి, నేల మీదకి చేరాము. ఫెర్నాండోలు ఇంకా నవ్వుతున్నారు. ఈసారి, వారు బ్రతకడానికి వెనుక ఉన్న ఆర్ధికశాస్త్రాన్ని అర్థం చేసుకోడానికి ప్రయత్నించే నా తెల్లబోయిన మొహాన్ని చూసి.
ఇది తేలిక, వారిలో ఒకరు చెప్పారు: “మేము మా శ్రమతో కొందరిని ధనవంతులుగా మారుస్తాము.”
ఈ వ్యాసంలో సంక్షిప్త భాగం 19 జనవరి, 1996 న ది హిందూ బిజినెస్ లైన్ లో ప్రచురితమైంది.
అనువాదం: అపర్ణ తోట