"చూడండి! నా మోటారు ఇంకా మట్టిలో పూడిపోయేవుంది," వరద నీటిలో మునిగి ఉన్న పంపును బయటకు తీయడానికి తవ్వుతూ అన్నారు దేవేంద్ర రావత్. దేవేంద్ర, మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లా, సుంద్ గ్రామానికి చెందిన రైతు. "వరదలు భూమిని మొత్తంగా కోసేశాయి. నా మూడు మోటార్లు భూమిలో కూరుకుపొయ్యాయి. ఒక బావి కూడా కూలిపోయింది. నేనిప్పుడేం చెయ్యాలి?" 48 ఏళ్ల ఆ రైతు అడుగుతున్నారు.

నరవర్ తహశీల్‌ లోని సుంద్ గ్రామం సింధ్ నదికి చెందిన రెండు ఉపనదుల మధ్య వుంది. ఆగస్టు 2021లో వచ్చిన వరద 635 మంది (2011 జనాభా లెక్కల ప్రకారం) వున్న ఆ గ్రామంలో తీవ్ర వినాశనాన్ని మిగిల్చింది. తానెప్పుడూ అలాంటి వరదని అంతకుముందు చూడలేదని దేవేంద్ర అన్నారు. "వరద నీళ్ళు దాదాపు ముప్పై బిఘాల్లో ని (దాదాపు 18 ఎకరాలు) పంటను నాశనం చేశాయి. మా కుటుంబం ఆరు బిఘాల నేలను ఈ వరద మేట వేయటం వల్ల శాశ్వతంగా కోల్పోయింది." అని ఆయన అన్నారు.

కాళీపహాడీలోని గ్రామం నాలుగు వైపులా వరద నీటితో నిండిపోయి ఒక ద్వీపాన్ని తలపిస్తోంది. ఇప్పుడు ఎక్కువగా వర్షాలు పడ్డప్పడు అవతలి వైపుకు వెళ్లాలంటే గ్రామస్థులు నీళ్ళల్లో నడవడమో, లేదంటే ఈత కొడుతూ వెళ్లడమో చెయ్యాల్సివస్తోంది.

"వరద వచ్చినప్పుడు మా గ్రామం మూడు రోజులు పూర్తిగా నీట మునిగే వుంది," అన్నారు దేవేంద్ర. ఇక్కడే ఉంటామన్న ఒక 10, 12 మందిని తప్పిస్తే అందరినీ ప్రభుత్వ పడవలు కాపాడాయి. గ్రామస్థులు దగ్గరలోని మార్కెట్లోని శిబిరాలలో తలదాచుకోవడమో, లేదా వారి బంధువుల ఇళ్ళకు వెళ్ళటమో చేశారు. అప్పుడు పోయిన కరెంటు రావడానికి ఒక నెల రోజులు పట్టిందని దేవేంద్ర గుర్తుచేసుకున్నారు.

PHOTO • Rahul

2021లో వచ్చిన వరదల్లో పూడుకుపోయిన తన మోటారును తవ్వి బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్న  సుంద్ గ్రామస్థుడు దేవేంద్ర

2021లో మే 14 నుంచి జులై 21 దాకా, పశ్చిమ మధ్యప్రదేశ్‌లో సాధారణ వర్షపాతం కంటే 20 నుంచి 59 శాతం తక్కువ వర్షపాతం నమోదయిందని భారత వాతావరణ శాఖ అంటోంది.

కానీ ఒకే ఒక వారం తర్వాత, అంటే జులై 28, ఆగస్టు 4 మధ్యలో సాధారణం కంటే 60 శాతం ఎక్కువ వర్షపాతం నమోదయ్యింది. సింధ్ నది మీద వున్న రెండు పెద్ద ఆనకట్టల్లోకి - మరిఖేరా వద్దనున్న అటల్ సాగర్ డ్యామ్, నరవర్ వద్దనున్న మోహిని డ్యామ్ - పెద్ద ఎత్తున నీళ్లు వచ్చేశాయి. అధికారులు ఆనకట్టల గేట్లు ఎత్తివేయడంతో సుంద్ గ్రామం వరదనీటిలో మునిగిపోయింది. "ఆనకట్ట గేట్లు ఎత్తటం తప్ప మాకు మరో దారి లేదు. ఆనకట్ట కూలిపోకుండా ఉండేందుకు నీటిని విడుదల చేయవలసి వచ్చింది. 2021 ఆగస్టు 2,3 తేదీల్లో కురిసిన భారీ వర్షాల వల్లే ఈ పరిస్థితి వచ్చింది." అన్నారు అటల్ సాగర్ డ్యామ్ ఎస్‌డిఒ, జిఎల్ బైరాగి.

మధ్యప్రదేశ్‌లో ఎప్పుడు భారీ వర్షాలు వచ్చినా ఎక్కువ ప్రభావితం అయ్యేది సింధ్ నది. "సింధ్ నది గంగా పరీవాహక ప్రాంతంలో భాగం. అది హిమాలయాల్లో పుట్టిన నది కాదు; అది దక్షిణం నుంచి ఉత్తరానికి ప్రవహించే వర్షాధార నది," భోపాల్‌లోని బర్కతుల్లా విశ్వవిద్యాలయంలోని బయోసైన్స్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తోన్న బిపిన్ వ్యాస్ అన్నారు.

వరదలు పంటల క్రమాన్ని కూడా మార్చేశాయి. "మా వరి, తిలీ (నువ్వులు) పంటలు నాశనం అయ్యాయి. ఈ సంవత్సరం గోధుమ కూడా సరిగ్గా పండించలేకపోయాం," అన్నారు దేవేంద్ర. సింధ్ నదీ పరివాహక ప్రాంతంలో ఆవాలు ఎక్కువగా పండిస్తారు. వరదల తర్వాత ఎక్కువ మంది రైతులు ఆవాలు పండించడానికే మొగ్గు చూపుతున్నారు.

PHOTO • Rahul
PHOTO • Aishani Goswami

ఎడమ: వరదల్లో నాశనమైన తమ పంట భూమి వద్ద దేవేంద్ర, రామ్‌నివాస్ (మధ్యలో). కుడి: 'వాతావరణ మార్పుల వల్ల వస్తున్న భారీ వర్షాలు, వరదలు మా పంటల్ని నాశనం చేస్తూనేవున్నాయి’ అన్నారు రామ్‌నివాస్ (తెల్లచొక్కా వ్యక్తి)

వాతావరణ మార్పుల వల్ల సంభవించే నష్టాల గురించి మాట్లాడుతూ, దేవేంద్ర మేనల్లుడు రామ్‌నివాస్, "వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా భారీ వర్షాలు, వరదలు మా పంటలను నాశనం చేస్తూవస్తున్నాయి. అలాగే అధిక ఎండ వేడిమి వల్ల కూడా పంటలకు (మొక్కలకు) జరిగే నష్టం ఎలాగూ వుంది" అన్నారు.

వరదల తరవాత, గ్రామ పట్వారి (గ్రామ వివరాలు నమోదు చేసే ఉద్యోగి), సర్పంచి గ్రామస్థులను పరామర్శించడానికి వచ్చారు. నష్టపరిహారం ఇప్పిస్తామని వాగ్దానం కూడా చేశారు.

"నాకు జరిగిన వరి పంట నష్టానికి బిఘా (దాదాపు 0. 619 ఎకరాలు) ఒక్కింటికి 2000 రూపాయలు పరిహారం ఇచ్చారు," చెప్పారు దేవేంద్ర. "వరదల వల్ల మా పంట నష్టపోకుండా ఉండివుంటే మాకు కనీసం రెండు మూడు లక్షల రూపాయల లాభం వచ్చి ఉండేది," అన్నారు రామ్‌నివాస్.

దేవేంద్రది పూర్తిగా వ్యవసాయం మీదే ఆధారపడిన కుటుంబం. లాక్‌డౌన్ వలన పంటల మార్కెట్ ధర పడిపోయింది. కోవిడ్ దాడిచేసినప్పటి నుండి కుటుంబ పరిస్థితేమీ బాగాలేదు. దేవేంద్ర కూతురు, మేనకోడలి పెళ్ళిళ్ళు 2021లో జరిగాయి. "కరోనా అన్నిటి ధరలూ పెంచేసింది. కానీ పెళ్ళిళ్ళు ముందుగానే నిశ్చయమయినవి కావడంతో పెళ్ళి చెయ్యక తప్పలేదు," దేవేంద్ర వివరించారు.

మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు,  ఆ కుటుంబాన్ని మరింత ఆర్ధిక కష్టాల్లోకి నెడుతూ ఆగస్టు 2021లో వరదలు వచ్చాయి.

PHOTO • Aishani Goswami
PHOTO • Rahul

ఎడమ: 2021 వరదల్లో సింధ్ నది ఒడ్డున ఉన్న అనేక చెట్లు నేలకొరిగాయి. కుడి : నరవర్‌లోని మోహిని డ్యామ్

*****

ఇందర్‌గఢ్ తహశీల్ , తిలైథా గ్రామంలో సింధ్ నది ఒడ్డున నిలబడి తన పొలాన్ని చూపిస్తూ సాహబ్ సింగ్ రావత్," అకాల వర్షాలు పన్నెండున్నర బిఘాల (7.7 ఎకరాలు) చెరకు పంటని నాశనం చేశాయి." అన్నారు. దతియా జిల్లాలో 2021 శీతాకాలంలో విపరీతంగా వర్షాలు కురిశాయని, ఫలితంగా పంటనీ ఆదాయాన్నీ కోల్పోవాల్సి వచ్చిందని రైతులు తెలిపారు.

సుంద్ గ్రామంలోని నివాస గృహాలు ఎత్తు ప్రదేశంలో ఉండటంతో అవి మునిగిపోలేదు. కాళీపహాడీ గ్రామస్థురాలు సుమిత్ర సేన్, వాళ్ళు ఎలా నిరంతరం నీటి మట్టాన్ని గమనిస్తూ వుండిందీ, ఒక అయిదు కిలోల తిండిగింజల మూటతో మిట్ట ప్రాంతానికి ఏ క్షణంలోనైనా వెళ్ళడానికి ఎలా సిద్ధపడి వున్నదీ గుర్తుచేసుకున్నారు.

45 ఏళ్ల సుమిత్రాసేన్ కూలి పనికి వెళ్తుంటారు, దగ్గరలోనే ఉన్న ఒక బడిలో వంట చేస్తుంటారు. ఆమె భర్త 50 ఏళ్ల ధనపాల్ సేన్, అహమ్మదాబాద్‌లో సంచీలు తయారుచేసే ఒక ఫ్యాక్టరీలో పదేళ్లుగా పనిచేస్తున్నారు. వారి చిన్న కొడుకు అతీంద్ర సేన్ (16) కూడా అక్కడే పని చేస్తాడు. నాయి సామాజిక వర్గానికి చెందిన సుమిత్ర ప్రభుత్వం నుంచి బిపిఎల్ (దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి ఇచ్చే) కార్డు పొందారు.

స్యోంధా బ్లాక్, మదన్‌పురా గ్రామానికి చెందిన విద్యారామ్ బఘేల్ తన మూడు బిఘాల (దాదాపు రెండు ఎకరాలు) పంట భూమిని వరదలవల్ల కోల్పోయానని అన్నారు. "పంటా పోయింది. పైగా పొలం అంతా ఇసుక మేట వేసేసింది." అన్నారు విద్యారామ్.

PHOTO • Rahul
PHOTO • Rahul
PHOTO • Rahul

ఎడమ: అకాల వర్షాలు సాహిబ్ సింగ్ రావత్‌కు చెందిన 7.7 ఎకరాల్లోని చెరకు పంటని నాశనం చేశాయి. మధ్య: వర్షం వల్ల ఇల్లు వదిలి వెళ్లాల్సివస్తే అవసరానికి అయిదు కిలోల తిండిగింజల మూటను సిద్ధంచేసి వుంచుకున్నామని సుమిత్రా సేన్ చెప్పారు. కుడి: ఇసుక మేట వేసిన విద్యారామ్ బఘేల్ పంట పొలం

*****

అధిక వ్యయం కారణంగా నదిపై వంతెనను నిర్మించడానికి  ప్రభుత్వం సిద్ధంగా లేదని సుంద్ గ్రామస్థులు అన్నారు. దాదాపు 700 బిఘాల (సుమారు 433 ఎకరాలు) వ్యవసాయ భూమి ఈ గ్రామంలో వుంది. అది మొత్తం ఈ గ్రామస్థులకు చెందినదే. "ఒకవేళ మేం గ్రామం వదిలి వేరే చోటకి వెళ్లినా (బ్రతకటానికి) పొలం దున్నటం కోసం మళ్ళీ ఇక్కడికి వస్తూ వుండాల్సిందే." అన్నారు సుంద్ గ్రామ నివాసి రామ్‌నివాస్.

వాతావరణ మార్పులు, అకాలంగా కురిసే విపరీత వర్షాలు, నది మీద పెరిగిపోతోన్న డ్యామ్‌ల కారణంగా పెరుగుతోన్న వరద ముప్పు వున్నా కూడా తాము గ్రామాన్ని విడిచి వెళ్ళేదిలేదని దేవేంద్ర, అతని కుటుంబం అన్నారు. "మా గ్రామస్తులం ఎవరమూ మా గ్రామాన్ని విడిచి వెళ్ళం. ఒకవేళ ప్రభుత్వం మాకు ఇంతే భూమిని వేరొక చోట ఇస్తే, అప్పుడు మాత్రమే వెళతాం."

అనువాదం: వి.రాహుల్జీ

Rahul

راہل سنگھ، جھارکھنڈ میں مقیم ایک آزاد صحافی ہیں۔ وہ جھارکھنڈ، بہار اور مغربی بنگال جیسی مشرقی ریاستوں سے ماحولیات سے متعلق موضوعات پر لکھتے ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Rahul
Aishani Goswami

ایشانی گوسوامی، احمد آباد میں مقیم واٹر پریکٹشنر اور آرکٹیکٹ ہیں۔ انہوں نے واٹر رسورس انجینئرنگ اینڈ مینجمنٹ میں ایم ٹیک کیا ہے، اور ندی، باندھ، سیلاب اور پانی کے بارے میں مطالعہ کرنے میں دلچسپی رکھتی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Aishani Goswami
Editor : Devesh

دیویش ایک شاعر صحافی، فلم ساز اور ترجمہ نگار ہیں۔ وہ پیپلز آرکائیو آف رورل انڈیا کے لیے ہندی کے ٹرانسلیشنز ایڈیٹر کے طور پر کام کرتے ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Devesh
Translator : Rahulji Vittapu

Rahulji Vittapu is an IT professional currently on a small career break. His interests and hobbies range from travel to books and painting to politics.

کے ذریعہ دیگر اسٹوریز Rahulji Vittapu