“నేను వేరుగా ఉండి ఐసోలేట్ కావడానికి వీలుగా, సొంత వాకిలి తో విడిగా ఉండగలిగే గది ఉన్న ఇంటిని మా వాళ్ళు వెతికి పెట్టారు", అన్నారు ఎస్ .గోపాల దేవి. అది మే 2020 , కొన్ని కుటుంబాలు తమ ఇంటి వారిని రక్షించుకోవడానికి, ఇంకొంచెం కష్టపడడానికి నిర్ణయంచుకున్నాయి. తన వృత్తి వలన తనకు కరోనా సోకే ప్రమాదం అధికంగా ఉన్నదని, అందువలన తన కుటుంబ సభ్యులకు కూడా కష్టం కలగవచ్చని ఆమె ఈ పరిష్కారాన్ని పాటించింది.
50 ఏళ్ల గోపాలదేవి సునిశితమైన శిక్షణ తో పాటు 29 సంవత్సరాల అనుభవం గల ఒక నర్స్ . ఆమె ఈ కరోనా వైరస్ మహమ్మారి సమయంలో చెన్నై లోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లోని కోవిడ్ వార్డు లో పని చేసింది. చెన్నై నగరానికి పరిసర ప్రాంతమైన పులియంతోప్‌లో గల కోవిడ్ ప్రత్యేక కేంద్రంలో కొంతకాలం పాటు ఆమె విధులు నిర్వహించింది.
ఇప్పుడు దశల వారీగా లొక్డౌన్ నిబంధనల సడలింపు వల్ల నెమ్మదిగా అనేక కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకుంటునప్పటికీ, గోపాల దేవి కోవిడ్ వార్డు లో పని చేయడం వల్ల తరచుగా క్వారంటైన్లో వుండవలసి వస్తోంది . "నాకు లొక్డౌన్ కొనసాగుతూనే ఉంది", అంటూ ఆమె నవ్వింది . "నర్సులకు ఇప్పట్లో లొక్డౌన్ ముగిసిపోదు".
అనేక మంది నర్సులు పత్రికా విలేఖరితో అన్నట్టు : "మాకు ఎల్లప్పుడూ పని ఉంటుంది, నిర్బంధం కూడా ఉంటుంది.”
"నా కుమార్తె వివాహం సెప్టెంబర్ లో జరిగింది. దానికి నేను ఆ ఒక్క రోజే సెలవు తీసుకున్నాను," అన్నారు గోపాల దేవి. "నా భర్త ఉదయ కుమార్ మొత్తం పెళ్లి బాధ్యతను తన భుజాల మీద మోశాడు." కుమార్ చెన్నై లోని శంకర్ నేత్రాలయ ఆసుపత్రి లో అకౌంట్స్ విభాగంలో పని చేస్తున్నాడు."అతను నా వృత్తిలో ఉన్న పరిమితులను అర్థం చేసుకుంటాడు." అని ఆమె చెప్పింది.
అదే ఆసుపత్రి లో తమిజ్ సెల్వి, కోవిడ్ వార్డులో పనికి గాను ఒక్క రోజు కూడా సెలవు తీసుకోనందున అవార్డు గెల్చుకుంది. “క్వారంటైన్ లో ఉన్న రోజులు తప్ప నేను ఒక్కసారి కూడా సెలవు తీసుకోలేదు. సమస్య తీవ్రత నాకు అర్థమైనందున సెలవు దినాల్లో కూడా పని చేశాను," అని ఆమె చెప్పింది.
"రోజుల తరబడి నా చిన్న కొడుకు షైన్ ఒలివర్ ను వదిలి వెళ్లాల్సి రావడం చాలా కష్టమనిపిస్తుంది. కొన్ని సార్లు నేను అపరాధ భావం తో క్రుంగిపోతుంటాను , కానీ ఈ మహమ్మారి సమయంలో మేము ముందు వరుసలో ఉండడం ముఖ్యం. ఇంటికి దూరంగా ఉంటూ పడే కష్టం అంతా, మా రోగులు కోలుకొని ఆరోగ్యంతో తిరిగి వారి ఇంటికి వెళ్తున్నప్పుడు వచ్చే ఆనందంతో తీరిపోతుంది. ఇటువంటి సమయం లో, నా భర్త నా బాధ్యతని అర్థం చేసుకొని, 14 ఏళ్ల నా కొడుకు ని బాగా చూసుకోకపోయుంటే ఇదంతా సాధ్యపడేది కాదు."
కానీ నర్సులు పని ముగించుకుని ఇళ్లకు వెళ్ళినప్పుడు, అందరూ తమ కష్టాన్ని అంత బాగా అర్థం చేసుకోలేరు అన్న చేదు నిజాన్ని తెలుసుకున్నారు.
"నేను క్వారంటైన్ ముగించుకొని వెళ్తున్న ప్రతి సారి కొంతమంది నేను నడిచిన దారిలో పసుపు నీళ్లను చల్లడం నేను గమనించాను. నేను వారి భయాన్ని అర్థం చేసుకోగలను, కానీ అలా చేయడం బాధపెడుతోంది," అని అన్నారు నిషా(పేరు మార్చాము)
నిషా చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రి లో ప్రసూతి విభాగం లో నర్స్ గా పని చేస్తుంది. కోవిడ్ పాజిటివ్ గా నిర్దారించబడిన గర్భిణీ స్త్రీలకు వైద్యం చేయాల్సి వస్తుంది. “ఇది ఎంతో ఒత్తిడి తో కూడుకున్న పని, మేము తల్లి మరియు బిడ్డను బ్రతికించాల్సిన అవసరం ఉంది." ఇటీవల నిషా స్వయంగా కరోనా బారిన పడింది. మూడు నెలల ముందు తన భర్త కూడా కరోనా వైరస్ బారిన పడి కోలుకున్నాడు." ఈ ఎనిమిది నెలల్లో ఆసుపత్రిలో కనీసం 60 మంది నర్సులకు కరోనా సోకింది," అన్నారు
"వైరస్ కంటే ఇతరుల చిన్నచూపు తట్టుకోవడం ఇంకా కష్టం ,"అని అన్నారు నిషా.
నిషా కుటుంబంలో ఆమె , ఆమె భర్త, ఇద్దరు పిల్లలు, ఆమె అత్తమ్మ తో కూడి ఐదుగురు సభ్యులున్నారు. వీరంతా ఇంటి చుట్టుపక్కల వారి ప్రతికూలత, భయం వల్ల చెన్నైలోని ఒక ప్రాంతాన్నించి మరొక ప్రాంతానికి వెళ్ళ వలసి వచ్చింది.
కోవిడ్ 19 వార్డులో పని చేసి క్వారంటైన్ అవ్వాల్సిన ప్రతిసారి , ఇంకా పాలు విడవని తన ఒక్క సంవత్సరపు బిడ్డ నుండి రోజుల పాటు నిషా దూరంగా ఉండవలసి వస్తోంది . "నేను ఆసుపత్రిలో కోవిడ్ పాజిటివ్ తల్లులుకు ప్రసవంలో సహాయం చేస్తున్నప్పుడు, ఇంట్లో నా బిడ్డ ఆలనా పాలనా నా అత్తమ్మ చూస్తోంది," అన్నారు నిషా. "నాకు ఇది ఇంకా కొత్తగా, వింతగా అనిపిస్తుంది."
ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్ మార్గదర్శకాల ప్రకారం, పాలిచ్చే తల్లులకు మరియు ఇతర అనారోగ్య సమస్యలు వున్నవారికి కోవిడ్ వార్డులలో పని చేయడం నుండి మినహాయింపు ఉంది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా ఉన్న నర్సుల కొరత వలన, నిషా వంటి వారికి ఇటువంటి మినహాయింపు వాడుకోవడానికి ఏ మాత్రం అవకాశం లేదు. దక్షిణ తమిళనాడు లోని విరుదునగర్ జిల్లాకు చెందిన నిషా , చెన్నైలో ఆశ్రయం పొందడానికి తనకు బంధువులు ఎవ్వరూ లేరని చెప్పింది."ఇది నా జీవితంలోని అతి కష్టమైన కాలం." అన్నది.
ఇప్పుడే నర్స్ గా తన జీవితాన్ని ప్రారంభిస్తున్న 21 ఏళ్ల శైల దీనికి సమ్మతం తెలుపుతోంది. అక్టోబర్ 2020 లో ఆమె చెన్నైలోని కోవిడ్ కేంద్రం లో తాత్కాలిక నర్స్ గా రెండు నెలల కాంట్రాక్టు ఉద్యోగాన్ని ప్రారంభించింది. కంటైన్మెంట్ జోన్ లలో ఇంటింటికి వెళ్లి కోవిడ్ పరీక్షలు చేయడం , ప్రజలలో మాస్క్ మరియు ఇతర కోవిడ్ జాగ్రత్తల పై అవగాహన కల్పించడం- స్థూలంగా ఇదే తన పని.
"చాలా చోట్ల ప్రజలు కోవిడ్ పరీక్షలు చేయించుకోవడానికి నిరాకరించడంతో పాటు మాతో వాగ్వాదానికి దిగేవాళ్ళు," అన్నారు శైల . అలాగే కోవిడ్ వచ్చిన వారి పట్ల చిన్నచూపు కొట్టొచ్చినట్లు కనపడేది. " నేను కోవిడ్ పరీక్షల కోసం ఒక ఇంటికి వెళ్ళాను , కోవిడ్ టెస్టింగ్ కిట్లు ఉన్న ప్యాక్ ను కత్తరించడానికి కత్తెర మేము తేలేదని గ్రహించి , అక్కడి వాళ్ళను ఒక కత్తెర అడిగాము. వారు మాకు అస్సలు పదును లేని కత్తెరను ఇచ్చారు . ఆ కత్తెరతో ప్యాక్ ను కత్తిరించడం కోసం ఎంతో ఇబ్బంది పడాల్సి వచ్చింది. మా పని తర్వాత మేము వారికి కత్తెరను వెనక్కి ఇవ్వబోతే వారు తీసుకోవడానికి నిరాకరిస్తూ దానిని చెత్త బుట్టలో పారేయమని మాతో అన్నారు."
అలాగే చెన్నై వేడిలో 7 నుండి 8 గంటలు పీపీఈ కిట్ ధరించి పనిచేయడం వలన ఎంతో అసౌకర్యానికి గురి కావాల్సి వస్తోంది. "దానికి తోడు మేము భోజనం మరియు నీళ్లు లేకుండా పని చేయాల్సి ఉంటుంది. అంటే కాకుండా మేము వెళ్లే ఇళ్లల్లో బాత్రూంని వాడుకోవడానికి వీలు పడేది కాదు." అని ఆమె చెప్పింది.
అయినప్పటికీ ఆమె అక్కడే ఉంది . “నేను వైద్యురాలు కావాలి అన్నది నా తండ్రి కల. నేను మొదటిసారి నర్స్ యూనిఫామ్ లో పిపిఈ కిట్ ధరించినప్పుడు , అసౌకర్యం ఉన్నప్పటికీ నేను నా తండ్రి కలకు దగ్గరగా ఉన్నానని నాకు తెలుసు," అని ఆమె అన్నది. శైల తండ్రి ఒక సఫాయి కార్మికుడు. అతను మురుగు నీటి ట్యాంక్ ను శుభ్ర పరస్తూ మరణించాడు.
ప్రమాదం, వివక్ష తో పాటు భయంకరమైన పని పరిస్థితులు, పేలవమైన వేతన స్థితి తో కూడా నర్సులు పోరాడుతున్నారు.ఇప్పుడే ఉద్యోగ ప్రయాణాన్ని ప్రారంభించిన శైల వేతనం నెలకు రూ. 14,000 . ఆరేళ్ళు ప్రభుత్వ సంస్థలో కాంట్రాక్టు ఉద్యోగం తో పాటు 10 సంవత్సరాలు అనుభవం ఉన్న నిషా జీతం నెలకు రూ. 15,000 . మూడు దశాబ్దాల నిర్విశ్రాంత సేవ అనంతరం గోపాల దేవి స్థూల వేతనం నెలకు రూ.45. 000 , ఇది జాతీయస్థాయి బ్యాంకులలో కింది స్థాయి క్లర్క్ వేతనం కంటే చాల ఎక్కువేమీ కాదు.
అధికారిక లెక్కలు అందుబాటులో లేనప్పటికీ ప్రజారోగ్య కార్యకర్తలు తమిళనాడులోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రులలో ని నర్స్ ల సంఖ్య 30000 నుండి 80000 మధ్య ఉండవచ్చని అంటారు. నర్సుల పరిస్థితి కఠినంగా ఉందని తమిళనాడు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డా. సి.యెన్.రాజా ఒప్పుకున్నారు, వారికి అవగాహన సదస్సులు కూడా నిర్వహించడానికి ప్రయత్నించినట్లు చెప్పారు. "ముఖ్యంగా ICU కేర్ లో పని చేసే నర్సులు, తాము అత్యధిక ప్రమాదంలో ఉన్నామని పూర్తిగా తెలిసి కూడా వారి విధి నిర్వహించడానికి వస్తున్నారు. మనము వాళ్ళను చాలా బాగా చూసుకోవాలి."
కానీ తమను బాగా చూసుకుంటున్నారని నర్సులు మాత్రం అనుకోవడం లేదు.
"ఈ రాష్టంలో దాదాపు 15000 తాత్కాలిక నర్స్ లు ఉన్నారు," అన్నారు కాళ్ళకూరిచి జిల్లాకు చెందిన నర్స్ కె.శక్తివెల్ . శక్తివేల్ తమిళనాడు ప్రభుత్వ నర్సుల సంఘం అధ్యక్షుడు. "మా ప్రధాన డిమాండ్లలో ఒకటి సరైన వేతనం. అటు నియామకాలు కానీ ఇటు పదోన్నతులు కానీ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ప్రమాణాల ప్రకారం జరగడం లేదు." అని అన్నారు శక్తివేల్.
"18000 మందికి పైగా ఉన్న తాత్కాలిక నర్సులలో కేవలం 4500 మందిని మాత్రమే క్రమబద్ధీకరించారు, " అన్నారు డా.ఏ,ఆర్.శాంతి అన్నారు. ఆమె తమిళనాడు లోని ఆరోగ్య కార్మికుల ఐక్య సమస్యైన ఆరోగ్య కార్మికుల సమాఖ్య కు ముఖ్య కార్యదర్శి. "మిగతా నర్సులు శాశ్వత నర్సులు తో సమానంగా పనిచేస్తూ కూడా నెలకు రూ.14000 మాత్రమే జీతం తీసుకోవలసి వస్తుంది. వారికి శాశ్వత నర్స్ లకు లభించే సెలవులు కూడా లేవు , ఒకవేళ ప్రత్యేక పరిస్థితుల్లో సెలవు తీసుకుంటే వారి వేతనంలో కోత ఉంటుంది." అని అన్నారు శాంతి.
ఇది అంతా బాగుంటే ఉండే పరిస్థితి.
ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రులలో పని చేసిన అనుభవం గల గోపాల దేవి , ఏడాదిగా ఉన్న కోవిడ్-19 ఇంతకు ముందెన్నడూ లేని పరిస్థితిని మోసుకొచ్చింది అన్నారు . "భారతదేశపు మొట్టమొదటి హెచ్ఐవి కేసు [1986 లో] చెన్నైలోని మద్రాస్ మెడికల్ కాలేజీలో [రాజీవ్ గాంధీ ఆసుపత్రికి అనుబంధ సంస్థ ] నమోదు చేయబడింది." అని గుర్తు చేసుకుంది. "హెచ్ఐవి రోగులకు చికిత్స చేసేటప్పుడు కూడా మేము ఇంతలా భయపడలేదు. మేము మమ్మల్ని పూర్తిగా కప్పుకోవాల్సిని అవసరం రాలేదు. కోవిడ్-19 చాలా అనూహ్యమైనది. దాన్ని ఎదురుకోవడానికి అపారమైన దైర్యం కావాలి." అని అన్నారు గోపాల దేవి.
ఈ మహమ్మారి తో పోరాటం మా జీవితాలను తలక్రిందులుగా చేసింది . "ప్రపంచం మొత్తం లాక్ డౌన్ అయ్యి మూగబోయినప్పుడు, మేము కోవిడ్-19 వార్డులలో గతం కంటే ఎక్కువ పనిలో ఉన్నాం. మీరు ఎలా పడితే అలా కోవిడ్ వార్డులోకి అడుగు పెట్టలేరు. ఉదయం 7 గంటలకు నా పని మొదలవ్వాలంటే నేను 6 గంటల నుండే సిద్ధం కావాలి .నేను వార్డు నుండి పని ముగించుకొని వచ్చేవరకు నీరసం రాకుండా ఉండేందుకు ఒకేసారి బాగా తిని అప్పుడు పీపీఈ కిట్ ధరించాలి - పీపీఈ కిట్ ధరించనంతసేపు ఏమి తినలేము, తాగలేము - అసలు పని అప్పటి నుండే మొదలవుతుంది."
"ఇది ఈ పద్దతిలో జరుగుతుంది," అన్నారు నిషా . "మీరు కోవిడ్ వార్డులో ఏడు రోజుల పాటు పని చేస్తారు తర్వాత ఏడు రోజుల పాటు నిర్బంధంలోకి వెళ్ళిపోతారు. మా వార్డులోని దాదాపు 60 - 70 మంది నర్సులు వంతులవారీగా పనిచేస్తారు. రోగుల సంఖ్యను బట్టి ముగ్గురి నుండి ఆరుగురు నర్సులు వారం పాటు ఆపకుండా పని చేస్తారు.[అంటే అదే సమయంలో ముగ్గురి నుండి ఆరుగురు నర్సులు నిర్బంధంలో వుంటారు] సుమారుగా మాలో ప్రతి ఒక్కరికి 50 రోజులకు ఒకసారి కోవిడ్ విధులు ఉంటాయి. "
దాని అర్థం నర్సుల క్యాలెండరు లో ప్రతి ఏడూ వారాలకు, రెండు వారాలు కొవిడ్ 19 పై జరిగే యుద్ధం లో అత్యధిక ప్రమాద పరిస్థితుల మధ్య నర్సులు గడిపారు. నర్సు ల కొరత అత్యవసర పరిస్థితులు ఈ భారాన్ని మరింత పెంచుతాయి. నర్సు లకు విడిగా ఉండడానికి అవసరమైన వసతులను ప్రభుత్వం కల్పిస్తోంది.
ఒక పని షిఫ్ట్ సాంకేతికంగా ఆరు గంటలు ఉంటుంది, కానీ చాలా మంది నర్సులు అంతకు రెండు రెట్లు ఎక్కువగా పని చేస్తారు. " రాత్రి షిఫ్ట్ అనివార్యంగా రాత్రి 7 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు, అంటే 12 గంటల పాటు ఉంటుంది . మేము ఎప్పుడు ఆరు గంటల్లో పని ముగించలేదు. కనీసం ప్రతి షిఫ్ట్ గంట లేక రెండు గంటలు అదనంగా సాగుతుంది." అని అన్నారు నిషా.
లోపభూయిష్టమైన నియామక పద్ధతులు ప్రతి ఒక్కరి భారాన్ని మరింత పెంచుతున్నాయి.
"కొత్త నర్సులను నియమించే బదులు కొత్త కోవిడ్ కేంద్రాలు ఇతర ఆసుపత్రుల నుండి వారిని తెచ్చుకుంటాయి. దీని వల్ల చాల రాజీపడవలసి వస్తుంది . ఐ సి యు లో ఆరుగురు నర్సులు అవసరం అయితే చాలా ఆసుపత్రులు కేవలం ఇద్దరితోనే సరిపెట్టు కోవాల్సి వస్తోంది. చెన్నై లో తప్ప ఇతర జిల్లాలోని ఏ ఆసుపత్రులు కొవిడ్ ఐ.సి.యు లో ఒక రోగి కి ఒక నర్సు అనే కచ్చితమైన సూత్రాన్ని పాటించవు. మీరు విన్న- పరీక్షలు చేయడంలో ఆలస్యం, పడకలు లు దొరకడంలో ఆలస్యం వంటి అన్ని ఫిర్యాదులకు మూల కారణం ఇదే " ఆని చెప్పుకొచ్చింది డా.ఏ.ఆర్.శాంతి.
ప్రభుత్వం, కొవిడ్ 19 విధుల నిమ్మితం, జూన్ 2020 లో చెన్నై చెంగాలపట్టు కాంచీపురం మరియు తిరువళ్లూరు జిల్లాల కోసం సుమారు 2000 మంది నర్సులను నెలకు 14000 వేల జీతానికి నియమించనుంది. .’ ఈ సంఖ్య ప్రస్తుతం ఉన్న అవసరానికి ఏ మాత్రం సమీపం లో లేదు’, అని అన్నారు డా.ఏ.ఆర్.శాంతి.
జనవరి 29 న రాష్ట్రవ్యాప్తంగా నర్సులు ఒక రోజు నిరసన చేపట్టారు. వారి డిమాండ్లలో ముఖ్యమైనవి కేంద్ర ప్రభుత్వంలో పనిచేసే నర్సులతో సమానంగా జీతాలు పెంచడం; సంక్షోభ సమయంలో కోవిడ్ వార్డులలో పనిచేసే నర్సులకు బోనస్ ప్రకటించడం; మరియు విధి నిర్వహణలో మరణించిన నర్సుల కుటుంబాలకు పరిహారం చెల్లించడం.
ఇతర వార్డులలో పనిచేసే నర్సుల పట్ల ఆరోగ్య కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. "ప్రమాద స్థాయి మారవచ్చు కాని కోవిడేతర వార్డులలో పనిచేసే వారు కూడా ముప్పుకు గురవుతారు. కోవిడ్ వార్డులో పనిచేసే నర్సు లకు పిపిఇ కిట్లు ఎన్ 95 మాస్క్‌లు ఉండడం వల్ల కొంత మేరకు రక్షణ ఉంటుంది , వారు పిపిఇ కిట్లు ఎన్ 95 మాస్క్‌లు హక్కుగా అడిగి పొందవచ్చు కానీ వేరే వార్డు లలో ని నర్సు లకు ఆ అవకాశం లేదు." అన్నారు డాక్టర్ శాంతి .
కోవిడ్ రోగులకు వైద్య వసతి కలిగి ఉన్న రామనాథపురం జిల్లాలోని మండపం క్యాంప్‌లో నర్సింగ్ సూపరింటెండెంట్‌గా పనిచేసిన 55 ఏళ్ల ఆంథోనియమ్మల్ అమ్రితసెల్వి యొక్క ఉదంతాన్ని చాలా మంది ఉదహరిస్తున్నారు . అక్టోబర్ 10 న, గుండె జబ్బు రోగి అయిన అమ్రితసెల్వి ప్రాణాలను కోవిడ్ -19 బలిగొంది. "ఆమె కొంచెం అనారోగ్యంతో ఉన్నప్పటికీ, తన పనిని చేస్తూనే ఉంది" అని ఆమె భర్త ఎ. జ్ఞానరాజ్ చెప్పారు. "ఇది మాములు జ్వరం అని ఆమె భావించింది, కానీ ఆమె కోవిడ్ -19 పాజిటివ్ అని పరీక్ష లో తేలింది. ఆ తరువాత, చేయడానికి ఏమి మిగలలేదు ." అమ్రితసెల్వి గత ఏడాది మదురై జనరల్ హాస్పిటల్ నుండి మండపం క్యాంప్‌కు బదిలీ చేయబడింది.
పైగా చిన్న చూపు ఎప్పుడూ ఉంటుంది - ఈ పరిస్థితులలో దళితులైన నర్సుల పట్ల రెండంచెల వివక్ష ఎప్పుడు ఉంటుంది.
అవార్డు గ్రహీత తమిజ్ సెల్వి (పైన కవర్ ఫోటోలో) కి ఆ చిన్నచూపు కొత్తదేమీ కాదు . ఆమె రాణిపేట (గతంలో వెల్లూరు) జిల్లాలోని వలజాపేట తాలూకాలోని లాలపేట గ్రామంలో ఒక దళిత కుటుంబానికి చెందినది. ఆ కుటుంబానికి చిన్నచూపు అలవాటే.
ఇప్పుడు కోవిడ్ -19 తో పోరాడుతున్న నర్సు గా పనిచేయడం కొత్త రకం చిన్నచూపును కలుపుకుంది. "నేను క్వారంటైన్ ముగించుకొని చేతిలో సంచితో వీధిలోకి అడుగుపెట్టిన మరుక్షణం నాకు సుపరిచితులు కూడా నా మొఖం మీదే తలుపులు మూసుకుంటున్నారు .నేను కొంచం బాధ పడ్డాను.కానీ వారు తమ భద్రత గురించి ఆందోళన చెందడం నేను అర్థం చేసుకోగలను." అని అన్నారు తమిజ్ సెల్వి.
ప్రఖ్యాత తమిళ కవి, తమిజ్ సెల్వి సోదరి అయినా సుకీర్ధరణి తన ముగ్గురు సోదరీమణులు నర్సింగ్‌ను తమ వృత్తిగా ఎందుకు ఎంచుకున్నారో గుర్తుచేసుకున్నారు: “ఇది మేము మాత్రమే కాదు, దళిత కుటుంబాలకు చెందిన చాలామంది నర్సింగ్ ను ఎన్నుకున్నారు.నా పెద్ద అక్క నర్సు అయినప్పుడు మాములుగా మా ఇంటికి రావడానికి సంకోచించే వ్యక్తులు కూడా సహాయం కోరుతూ ఇంటికి రావడం నేను గమనించాను. చేరి లో ని మా ఇంటిని చూపిస్తూ ఊరు లోని జనాలు నా తండ్రి షణ్ముగం మాదిరిగానే తమ పిల్లలకు విద్యను అందించాలని వారు కోరుకుంటున్నారని అనేవారు. [సాంప్రదాయకంగా, తమిళనాడులోని గ్రామాలు ఊరు మరియు చేరిలు గా విభజించబడ్డాయి .ఊరలలో ఆధిపత్య కులాలు అగ్ర వర్ణ ప్రజలు నివసిస్తారు. చేరి లో దళితులూ ఉంటారు] నేను పాఠశాల ఉపాధ్యాయురాలిని , మరొక సోదరుడు కూడా ఉపాధ్యాయుడు. నా సోదరీమణులు నర్సులు.
“ఇంజనీర్ అయిన ఒక సోదరుడు తప్ప, మిగతా వారందరము ఈ సమాజాన్ని సరిదిద్దే విధిలో నిమగ్నమై ఉన్నాము. మా నేపధ్యానికి ఇది మాకు ఎంతో గర్వకారణమైన విషయం. నా పెద్ద అక్క ఆ నర్సు యూనిఫామ్ ధరించినప్పుడు, అది ఆమెకు దయను మరియు గౌరవాన్ని తెచ్చిపెట్టింది. వారు నర్సింగ్ ను ఎన్నుకోవటానికి ఇది ఒక కారణం మాత్రమే .వాస్తవానికి , డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా , మేము మొత్తం సమాజానికి సేవ చేయాలనుకుంటున్నాము. "
సోదరి తమీజ్ సెల్వి వార్డులో పని చేసిన తర్వాత కొవిడ్ -19 పాజిటివ్ గా నిర్దారించబడినప్పటికీ, " ఆమె తన పనిని చేయలేకపోతోంది అని ఎక్కువ బాధ పడ్డాను." అంటూ నవ్వింది సుకిర్తారాణి .“అయితే, మేము మొదట్లో కొన్నిసార్లు ఆందోళన పడ్డాము కానీ , ఇప్పుడు అలవాటు అయిపొయింది." అన్నది.
"కొవిడ్ డ్యూటీ లోకి అడుగు పెట్టడం అంటే కాలిపోతామని తెలిసీ అగ్ని లోకి అడుగుపెట్టడం లాంటిదే." అంటారు గోపాల దేవి. “కానీ మేము నర్సింగ్ చేయాలని నిర్ణయించుకున్నప్పుడు మాకు ఇది మాకు సహజమైన విషయం లానే తోస్తుంది. నర్సింగ్ అనేది, మేము సమాజానికి సేవ చేసే మార్గం. ”
కవితా మురళీధరన్ ఠాకూర్ ఫ్యామిలీ ఫౌండేషన్ నుండి స్వతంత్ర జర్నలిజం గ్రాంట్ ద్వారా ప్రజారోగ్యం మరియు పౌర స్వేచ్ఛపై నివేదికలు రాస్తారు. ఠాకూర్ ఫ్యామిలీ ఫౌండేషన్ ఈ రిపోర్టేజీలోని విషయాలపై సంపాదకీయ నియంత్రణను అమలు చేయలేదు.
కవర్ ఫోటో: ఎం పళని కుమార్
అనువాదం: రూబీ