విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ లో బెంగళూరు నుండి పాట్నా వెళ్లే సంఘమిత్ర ఎక్స్ప్రెస్ కోసం దాదాపు పదిమంది కార్మికులు ప్లాట్ ఫాం నం 10 పై ఎదురుచూస్తున్నారు. ఈ రైలు,కొన్ని నెలల పాటు అమరావతి నిర్మాణం కోసం పనిచేసిన వారిని బీహార్లో వారి స్వగ్రామమైన బెల్గాచ్చికి తీసుకువెళుతుంది.

"టికెట్ చూపించమని అర్థగంటలో ముగ్గురు వేర్వేరు టికెట్ ఎగ్జామినర్ లు (టిఇలు) మా దగ్గరకు వచ్చారు", అని 24 ఏళ్ల మొహమ్మద్ ఆలం చెప్పాడు. ఆ టిఇల్లో ఒకరు, "ఈ 'లేబర్ జనం' టికెట్లు కొనరు. అందుకే కొన్ని రైళ్ల కోసం అదనపు టిఇలని కేటాయిస్తారు.  ప్రత్యేకంగా ఉత్తరాదికి, ఈశాన్యానికి వెళ్లేవాళ్ల పట్ల జాగరూకతతో వ్యవహరిస్తాం" అని నాతో అన్నారు.

పుర్నియా జిల్లా, దగరువా బ్లాక్లోని తమ స్వగ్రామానికి వెళుతున్న కార్మికుల్లో లార్సన్ అండ్ టూబ్రో మరియు షాపూర్జీ పల్లోంజి ప్రైవేట్ లిమిటెడ్ వంటి పెద్ద పెద్ద నిర్మాణ సంస్థల కోసం పనిచేసిన వారున్నారు. మరికొన్నింటితో పాటు ఈ కంపెనీలు అమరావతిలోని జస్టిస్ సిటీ, ఎమ్మెల్యేల ఇళ్ళూ, ఐఏఎస్ ఆఫీసర్ల కాలనీ, ఇంకా మరికొన్ని కట్టడాల నిర్మాణం చేస్తున్నాయి.

People cramped in train
PHOTO • Rahul Maganti
men sitting and hanging in the train.
PHOTO • Rahul Maganti
Men sleeping in train.
PHOTO • Rahul Maganti

అమరావతిలో కొన్ని నెలల పని తరువాత కిక్కిరిసిన సంఘమిత్ర ఎక్స్ప్రెస్ లో అలసిపోయి ఇంటికి వెళుతున్న బీహార్ కూలీలు

జనంతో కిక్కిరిసిన రైలు రాకతో బోగీల నుంచి వేలాడుతున్న వారిని పట్టుకుని వారి టికెట్లు తనిఖీ చేయడానికి టిఇలు జనరల్ కంపార్ట్మెంట్ వైపు పరుగు తీశారు. ఈలోగా ఆలం, అతని సహచరులు పరిమితికి మించి నిండిన బోగీలలో దూరడానికి ప్రయత్నిస్తున్నారు.

"రద్దీ చాలా ఎక్కువగా ఉంది రైళ్లన్నీ హైదరాబాద్ నుంచో, చెన్నై లేదా బెంగళూరు నుంచో బయలుదేరతాయి. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి ఇలా నిండిపోయి ఉంటాయి" అంటూ గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం నేలపాడు లోని ఒక నిర్మాణ స్థలం దగ్గర నేను మొదటిసారిగా కలిసిన ఆలం చెప్పుకొచ్చాడు.

నేను కూడా బోగీలోకి ఎక్కి ప్రయాణికుల సంఖ్య లెక్కగట్టడానికి ప్రయత్నించాను. 50 మంది పట్టడం కోసం తయారుచేసిన బోగీలో దాదాపు 200 మంది కుక్కుకుని ఉన్నారు. నడుముకు కొంతమేర విశ్రాంతినిచ్చేందుకు కొందరు నిలబడగా మరికొందరు కింద నేల మీద, మిగిలిన వారు సీట్లలో గట్టిగా ఒకరికొకరు కరుచుకొని కూర్చున్నారు.

"మేం పాట్నా చేరడానికి ఇలా ఒక 40 గంటలు, ఆపైన మా ఊరు చేరడానికి బస్సులో ఇంకో పది గంటలు ప్రయాణం చేయాలి" అని ఆలం తమ్ముడైన 19 ఏళ్ల రిజ్వాన్ చెప్పాడు. అతను తన కోసం బోగీలోని రెండు రాడ్లకు తన దుప్పటి ఒకటి కట్టి తాత్కాలికంగా ఉయ్యాల లాంటి పడక ఏర్పరుచుకున్నాడు. "మా ఊరి నుంచి ఒకరికొకరు చుట్టాలు అయిన వాళ్ళు దాదాపు 22 మంది అమరావతిలో పనిచేస్తున్నారు" అంటూ కొనసాగించాడు.

Workers routine
PHOTO • Rahul Maganti

నిర్మాణ స్థలాల దగ్గర తాత్కాలికంగా కట్టిన కాలనీలో సరిగ్గా గాలి కూడా ఆడని గదుల్లో 15 నుండి 20 మంది కార్మికులు నివసిస్తారు

వీరంతా కాంట్రాక్టర్ జుబైర్ ద్వారా అమరావతికి వచ్చారు. అతను కూడా పుర్నియా జిల్లాకు చెందిన వాడే. "నా దగ్గర దాదాపు 100 మంది పనిచేస్తారు. ఎల్ అండ్ టి సంస్థ నిర్మాణ ప్రాజెక్టుల కోసం కార్మికులను చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, ఇంకా నేపాల్ కు కూడా పంపిస్తూ ఉంటాను" అని జుబైర్ చెప్పాడు.

ఆలం, రిజ్వాన్ కలిసి అమరావతికి 2018 జనవరి లో మొదటిసారిగా వచ్చారు. "మా కుటుంబానికి ఉన్న మొత్తం 7 ఎకరాల భూమిలో వరి, గోధుమలు పండిస్తాం. మా నలుగురు అన్నదమ్ముల్లో ఇద్దరు ఇంటి దగ్గరే ఉండి అమ్మానాన్నలతో కలిసి ఏడాదంతా పొలం పనులు చూసుకుంటారు" అని రిజ్వాన్ చెప్పుకొచ్చాడు.

"ఇక్కడ నాలుగు నెలల నిర్మాణ పనుల తరువాత కోతల సమయానికి వెనక్కి (ఊరికి) వెళ్లి, రెండో పంట వేసే వరకు ఉంటాం. దగ్గర దగ్గర ఒక నెల అక్కడ ఉన్న తర్వాత మళ్లీ రైలెక్కి కాంట్రాక్టర్ ఎక్కడికంటే అక్కడికి వెళ్తాం".

"ఈ ప్రయాణం, ఊరికి దూరంగా ఉండాల్సి రావడం అంత బాగా కష్టం అయిపోతోంది" అంటూ ఆలం కొనసాగించాడు. అతను ఇలా కాలానుగుణంగా, నిర్మాణ కార్మికుడిగా ఆరేళ్లుగా పనిచేస్తున్నాడు. అమరావతి నిర్మాణస్థలంలో తన 12 గంటల డ్రిల్లింగ్ షిఫ్ట్ కి గాను తనకు వచ్చే కూలి రోజుకు 350 రూపాయలు. "ఒక షిఫ్ట్ ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు లేదా రాత్రి 8 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు ఉంటుంది" అంటాడు ఆలం. ఈ కాలంలో తనకు, రిజ్వాన్ కు కలిపి వచ్చే ఆదాయం తమ పనిదినాల సంఖ్యను బట్టి ఉంటుంది.

అమరావతిలో ఎల్ అండ్ టి, ఇంకా షాపూర్జీ పల్లోంజి సంస్థలు చేపడుతున్న నిర్మాణాల్లో దాదాపు పది వేల మంది పని చేస్తున్నారని ఈ కార్మికుల అంచనా. వారంతా బీహార్ జార్ఖండ్ ఒడిశా మరియు అస్సాం కు చెందినవారే.

Workers going to their job.
PHOTO • Rahul Maganti
Boards of development on construction site
PHOTO • Rahul Maganti

వలస కూలీలు చెప్పినదాని ప్రకారం తమలా వేలమంది జస్టిస్ సిటీతో సహా అమరావతిలోని వివిధ నిర్మాణ స్థలాల్లో రెండు షిఫ్టుల్లో పనిచేస్తున్నారు

చాలా మంది కార్మికులు వారి కోసం తాత్కాలికంగా కట్టించిన లేబర్ కాలనీల్లోని రేకుల షెడ్లలో ఉంటారు. "ఒక చిన్న గదిలో దాదాపు 15 నుండి 20 మంది ఉంటాము. వంట, భోజనం, నిద్ర అన్నీ అక్కడే. వర్షం పడితే మాత్రం కాలనీ అంతా చిత్తడిగా మారుతుంది" అంటూ ఆలం చెప్పాడు.

"కొందరు దగ్గర్లో పొగాకు ఆరబెట్టి వేరుచేసే పొగాకు కొట్టాల్లో నెలకు మనిషికి వెయ్యి రూపాయల బాడుగ కట్టి ఉంటారు. ఆ కొట్టాలు సరైన గాలి కూడా లేకుండా చాలా వేడిగా ఉంటాయి. ఎందుకంటే అవి అలా వేడిగా ఉండటానికే తయారు చేయబడ్డాయి. కానీ లేబర్ కాలనీలో పరిస్థితి ఇంకా దారుణం. మంచి ఇళ్లలో ఉండటానికేమో మా స్తోమత సరిపోదు", అంటాడు పశ్చిమబెంగాల్లోని జిల్లా తారకేశ్వర్ బ్లాక్ లోని తారకేశ్వర్ గ్రామం నుంచి అమరావతిలో పని చేయడానికి వచ్చిన 24 ఏళ్ల వివేక్ సిల్. అతను హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ కోసం 2017 నవంబర్ వరకు పనిచేశాక అమరావతిలోని జస్టిస్ సిటీ నిర్మాణ స్థలానికి వచ్చాడు. "ఊళ్ళని నగరం గా మారుస్తున్న ఇక్కడి కంటే హైదరాబాదులో పనిచేయడమే నయం. వారాంతాల్లో (ఆదివారాలు) చార్మినార్ కో, హుస్సేన్ సాగర్ కో లేదా పార్కులకో వెళ్ళేవాళ్ళం. ఇక్కడ అసలేం లేదు" అంటూ కొనసాగించాడు.

ఏళ్ల తరబడి నిర్మాణ స్థలాల్లో పని చేసినా కూడా సిల్ ఇంకా కాంట్రాక్ట్ కార్మికుడిగానే కొనసాగుతున్నాడు. "ఓవర్ టైం డబ్బుల సంగతి పక్కన పెడితే నాకు కనీసం ఈ ఎస్ ఐ బీమా గాని, పిఎఫ్ కానీ ఉండవు" అంటూ వాపోయాడు. అక్కడ అందరు కార్మికులలానే సిల్, వారానికి ఏడు రోజులు, రోజుకు 12 గంటలు షిఫ్ట్ ల లో పని చేస్తాడు. అలా చేయలేని రోజు తన కూలి కోల్పోతాడు.

PHOTO • Rahul Maganti
PHOTO • Rahul Maganti

వివేక్ సిల్ (ఎడమ నుండి రెండో వ్యక్తి), ఇంకా మరికొందరు వేడిగా ఉన్నా కూడా పొగాకు కొట్టాల్లో ఉండడానికే మొగ్గు చూపుతారు. లేబర్ కాలనీలు ఇంకా దారుణంగా ఉంటాయని వారి అభిప్రాయం

బెంగాల్ నుంచే వలస వచ్చిన కొందరు అమరావతిలో కూరగాయల దుకాణాలు, మందుల షాపులు నడుపుతున్నారు. ఇప్పుడే పురుడు పోసుకుంటున్న ఈ నూతన రాజధానికి వచ్చిన మొదటి వ్యాపారవేత్తలు వీరే కానీ, అమరావతి వచ్చి కార్యాలయాలు పెడతారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు చెప్పిన అంతర్జాతీయ కంపెనీలు, వ్యాపారవేత్తలు కాదు.

42 ఏళ్ల శుభంకర్ దాస్, ఒక నిర్మాణ స్థలానికి కొద్దిదూరంలో నెలకు మూడు వేల రూపాయలకు ఒక జాగా అద్దెకు తీసుకుని చిన్న మందుల షాపు నడుపుతున్నాడు. "పనుల కోసం వచ్చిన కార్మికులు స్థానిక భాష అర్థం చేసుకోలేకపోతున్నారని కాంట్రాక్టర్లు మిమ్మల్ని ఇక్కడికి పిలిపించారు" అంటాడు బీహార్ కార్మికులతో హిందీ లో మాట్లాడే దాస్.

రఫీకుల్ ఇస్లాం సాదర్ కూడా కొన్ని నెలల క్రితం ఒక నిర్మాణ స్థలానికి దగ్గర్లో కూరగాయల అంగడి ప్రారంభించాడు. "నేను రోజుకు 600 నుండి 700 రూపాయల వరకు సంపాదిస్తాను. ఇక్కడ బెంగాలీ కార్మికులు పని చేస్తున్నారని, తెలిసిన వారు చెప్పడంతో (కలకత్తా నుండి) ఇక్కడకు వచ్చాను" అని 48 ఏళ్ల సాదర్ చెప్పాడు.

PHOTO • Rahul Maganti
PHOTO • Rahul Maganti

(ఎడమ) నేలపాడు గ్రామ శివార్లలోని శుభంకర్ దాస్ మందుల షాపు.

(కుడి) ఒక నిర్మాణ స్థలానికి దగ్గర్లో కూరగాయల అంగడి నడుపుతున్న రఫీకుల్ సాదర్

సింగపూర్ కి చెందిన నిర్మాణ కంపెనీల ఏకీకృత సంస్థ (కన్సార్షియం) తయారు చేసిన అమరావతి సుస్థిర రాజధాని నగర అభివృద్ధి ప్రణాళిక (Amaravati Sustainable Capital City Development Project) యొక్క మాస్టర్ ప్లాన్, 2035 నాటికి 33.6 లక్షలు, 2050 నాటికి 56.5 లక్షల ఉద్యోగాల సృష్టి గురించి మాట్లాడుతోంది. 2014 ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఇంటికొక ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో స్థిరంగా దొరుకుతున్న ఉపాధి మాత్రం నిర్మాణ రంగంలోనే.

"దొరికే కాస్త పని కూడా కాంట్రాక్టు (ఒప్పందబద్ధ) పనే. ఈ కార్మికులకు సంఘటిత రంగంలో లాగా లేబర్ చట్టాల ప్రకారం ఉండే హక్కులేవీ ఉండవు. ఇది కేవలం స్థిరంగా సంఘటిత రంగం వైపు పరివర్తన చెందే దశ మాత్రమే కావచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వం సృష్టిస్తామంటున్న (ఉద్యోగాల) సంఖ్య మాత్రం ఖచ్చితంగా అతిశయోక్తే" అని ఫ్రాన్సు దేశపు యూనివర్సిటీ ఆఫ్ లిల్ లో జియోగ్రఫీ అండ్ ప్లానింగ్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న ఎరిక్ లెక్లెర్క్ అన్నారు. ఆయన నగరాలు వాటి  ప్రణాళికల(Cities and Planning) గురించి చేసే తన పరిశోధనలో భాగంగా ప్రస్తుతం అమరావతిని అధ్యయనం చేస్తున్నారు.

కార్మికులేమో వేరే ప్రత్యామ్నాయం లేక, ఇలాగే అస్థిరమైన ఉపాధి కోసం, కాలానుగుణంగా వలస పోతూ కొన్నిసార్లు కోతలకు విత్తనాలు నాటే సమయానికి రైళ్లలో (ఇంటికి) వెనక్కి వెళుతూ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. విజయవాడ నుండి విశాఖపట్నం వెళ్ళే కోరమాండల్ ఎక్స్ప్రెస్ లోని జనరల్ కంపార్ట్మెంట్లో ప్రయాణిస్తున్న వలస కార్మికులు కూడా అమరావతిలో పనిచేసిన తమ అనుభవాలను సంఘమిత్ర ఎక్స్ప్రెస్ లోని ఆలంలానే వ్యక్తపరిచారు. "ఈశాన్య రాష్ట్రాలకి లేదా  బీహార్ కో బెంగాల్ కో వెళ్లే రైళ్లన్నీ ఇలాగే కిక్కిరిసి పోయి ఉంటాయి" అంటాడు బీహార్లోని కతిహార్ జిల్లాకు చెందిన 30 ఏళ్ల విజయ్ కుమార్. 2017 జూన్ నెల నుండి అమరావతి లో పనిచేస్తున్న విజయ్, భూమి లేని ఒక దళిత కుటుంబానికి చెందిన వాడు. ఆయన భార్య, మూడేళ్ల కూతురు, ఒక సంవత్సరం వయసున్న కొడుకు వాళ్ళ ఊర్లోనే ఉంటారు. "నేను మొట్టమొదటిసారి బీహార్ వదిలి వెళ్ళింది 2009లో బెంగళూరు నగరంలో నిర్మాణరంగ కార్మికుడిగా పనిచేయడానికి. ఆ తర్వాత హైదరాబాద్, కర్నూలు, కొచ్చి ఇంకా చాలా ప్రాంతాల్లో పని చేశాను" అని చెప్పాడు.

PHOTO • Rahul Maganti
PHOTO • Rahul Maganti

తాత్కాలిక లేబర్ కాలనీ చుట్టూ టీ కొట్లు, సెలూన్లు, కిరాణా దుకాణాల్లాంటి ఎన్నో వ్యాపారాలు వెలిశాయి

"నాకు ఇలా రద్దీలో ప్రయాణించడం అంటే అస్సలు ఇష్టం లేదు. కానీ నా కుటుంబాన్ని చూడకుండా ఎన్నాళ్ళని ఉండగలను?" అని ప్రశ్నిస్తాడు విజయ్. ఈ ప్రయాణంలో ఆయనకు తోడు, తన బంధువైన పాతికేళ్ల మనోజ్ కుమార్. అతను కూడా విజయ్ లానే 2017 జూన్ నెల నుంచి అమరావతి లో పని చేస్తున్నాడు. అంతలో లగేజ్ దగ్గర ఒక టవల్ పరుచుకుని వారు పేకాట మొదలుపెట్టారు.

ఈలోగా దగ్గర్లో ఒక చిన్న గొడవ మొదలైంది. ఒక ప్రయాణికుడు వెనక్కి జారి కూర్చున్న ఓ యువకుడ్ని సరిగ్గా కూర్చుని, మిగిలిన వారు కూర్చోడానికి కి జాగా ఇవ్వమని అరుస్తున్నాడు. "నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో నేను మాత్రం కదిలేది లేదు" అన్న అలసిపోయిన ఆ యువకుడి సమాధానానికి విజయ్ కలుగజేసుకుని "తమ్ముడూ! మనం ఇంకో 30 గంటలు ఇలాగే కలిసి ప్రయాణం చేయాలి. సర్దుకోక తప్పదు. నువ్వు ఇప్పుడు ఖాళీ ఇస్తే, నీకు అవసరమైనప్పుడు ఇంకొకరు ఇస్తారు" అంటూ సర్దిచెప్పడంతో ఆ యువకుడు లేచి ఇంకో ఇద్దరికి కూర్చోడానికి ఖాళీ ఇచ్చాడు.

ఆ పరిస్థితిలో ఇరుకుగా, ఊపిరి సరిగ్గా ఆడకుండా ప్రయాణం చేయలేక ఆరు గంటల తర్వాత నేను విశాఖపట్నంలో దిగిపోయాను. కానీ విజయ్, ఆలం ఇంకా మిగిలిన వారు వారి గమ్యం చేరి, కాస్త విశ్రాంతి తీసుకోవడానికి ఇంకో 24 గంటలకు పైగా ఎదురు చూడాలి!!

ఇదే వరుసలో:

ఈ రాజధాని ప్రజల రాజధాని కాదు .

కొత్త రాజధానికి పాత పంథాలో విభజన

ప్రభుత్వం వాగ్దానం చేసిన ఉద్యోగాలన్నీ ఇవ్వనివ్వండి.

ముదురుతున్న రియల్ ఎస్టేట్ , తరుగుతున్న వ్యవసాయ భవిత

వ్యవసాయ కూలీలు - బీడుపోయిన బతుకులు

అనువాదం - సుజన్

Rahul Maganti

راہل مگنتی آندھرا پردیش کے وجیہ واڑہ میں مقیم ایک آزاد صحافی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Rahul Maganti
Translator : Sujan Nallapaneni

Sujan is a freelance journalist based in Guntur. He is a translation enthusiast.

کے ذریعہ دیگر اسٹوریز Sujan Nallapaneni