అతను వేదిక మీదకి తన ప్రైజ్ ను అందుకోవడానికి వెళ్ళాడు. అది ఒక మెరిసే పైసా బిళ్ళ. అది కూడా ఒక మున్షి వద్దనుండి. మున్షి అంటే ఒక అనుభవజ్ఞుడైన అధికారి, ఎన్నో బడులు ఆయన నియంత్రణ లో ఉంటాయి. 1939 సంవత్సరంలో పంజాబ్ లో అతనికి 11 ఏళ్ళు మాత్రమే ఉన్నప్పుడు, మూడో తరగతిలో క్లాస్ టాపర్. మున్షి అతని తల మీద తట్టి ఇలా అరివమన్నాడు - ‘బ్రిటానియా జిందాబాద్, హిట్లర్ ముర్దాబాద్.’ చిన్నవాడైన భగత్ సింగ్ - ప్రసిద్ధుడైన అమరవీరుడు భగత్ సింగ్ కాదు, ఇతను వేరే అతను, ప్రేక్షకుల వైపు చూసి అరిచాడు: ‘ బ్రిటానియా ముర్దాబాద్, హిందుస్తాన్ జిందాబాద్.’
అతని అమాయకత్వానికి వెంటనే స్పందన వచ్చింది. అతనిని అక్కడికక్కడే మున్షి బాబు బాగా మందలించి, సముంద్రా ప్రభుత్వ పాఠశాల నుంచి పేరు కొట్టేశారు. ఇతర విద్యార్థులు నిశ్చేస్టులై కాసేపు ఉండి, ఆ తర్వాత పారిపోయారు. అప్పటి స్థానిక పాఠశాల అధికారి, ఈ రోజుల్లో అయితే బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ కు సమానమైన అధికారం కలవాడు, ఇప్పుడు పంజాబ్‌లోని హోషియార్‌పూర్ జిల్లాలో ఉన్న ఈ భాగంలో డిప్యూటీ కమిషనర్ ఆమోదంతో ఒక లేఖను జారీ చేసారు. లేఖ అతని అతన్ని ‘ప్రమాదకారి’ అని ‘విప్లవకారి’ అని వివరించి, బహిష్కరణను ధృవీకరించింది. అప్పటికి అతని వయసు - పదకొండేళ్లు.
దీని అర్థం ఇక అతను బడికి వెళ్లలేడని- అక్కడ ఉన్న బడులు కూడా తక్కువే - ఇలా బ్లాక్ లిస్ట్ అయినా భగత్ సింగ్ కి ఎవరూ వారి స్కూల్ గేట్లను తెరవరు. అతని తల్లిదండ్రులతో పాటుగా చాలా మంది, ఈ నిర్ణయాన్ని మార్చుకొమ్మని స్కూల్ అధికారులను కోరారు. బాగా పరిచయాలున్న ఒక జమీందారు గులాం ముస్తఫా తన తరఫునుండి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ బ్రిటిష్ రాజ్యం అనుచరులు చాలా కోపంగా ఉన్నారు. ఒక చిన్న పిల్లాడు వాళ్ళ గౌరవాన్ని అవమానపరచాడు. కానీ భగత్ సింగ్ జుగ్గీయాన్ తుళుకులీనే మిగిలిన జీవితంలో ఇక ఎప్పటికీ మామూలు బడికి వెళ్లలేక పోయాడు.
కానీ 93 ఏళ్ళ తరవాత కూడా ఆతను ఒక స్టార్ విద్యార్థి అయ్యాడు.
ఇదంతా హోషియా పుర జిల్లా లో రంగడ్ గ్రామం అతని ఇంట్లో మాతో సంభాషిస్తూ చిరునవ్వుతూ గుర్తుచేసుకొన్నాడు. దాని గురించి అతను ఇబ్బంది పడలేదా? అంటే, “అప్పుడు అనుకున్నా, ఇప్పుడు నేను బ్రిటిష్ రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడవచ్చు”, అని.
అతని స్వేచ్ఛను చాలా మంది గమనించారు. మొదట్లో అతను తన కుటుంబానికి చెందిన పొలంలో పనిచేసినా అతని కీర్తి బాగా వ్యాపించింది. పంజాబ్ విప్లవ అండర్ గ్రౌండ్ సమూహాలు అతనిని సంప్రదించడం మొదలు పెట్టాయి. రాష్ట్రం లో 1914-15 మధ్యలో ఘాడర్ విప్లవాన్ని ప్రదర్శించిన ఘాడర్ పార్టీ నుంచి ఉద్భవించిన కీర్తి పార్టీలో అతను చేరాడు.
ఈ కీర్తి పార్టీ చాలా మంది విపోలవ రష్యా కు మిలిటరీ శిక్షణ, భావజాల శిక్షణ కు వెళ్లారు. ఘాడర్ పోరాటాన్ని పూర్తిగా చిదిమేసాక వారు కీర్తి అనే ఒక ప్రచురణాలయాన్ని స్థాపించారు.ఇందులో బాగా పేరున్న జర్నలిస్టులతో పాటు ప్రసిద్ధుడైన భగత్ సింగ్ కూడా ఉన్నాడు. భగత్ సింగ్, మే 27 అరెస్ట్ కు ముందు ఈ పత్రికను, ఆ పత్రికకు సంపాదకుడు లేనప్పుడు, 3 నెలల పాటు నడిపాడు. మే 1942 లో కీర్తి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ తో విలీనమైంది.
కానీ జుగ్గీయాన్ మన గొప్ప భగత్ సింగ్ పేరు పెట్టుకోలేదు. “నేను అతనిని గురించి రాసిన పాటలు వింటూ పెరిగాను, అతని పై రాసిన పాటలు చాలా ఉన్నాయి.” అతను కొన్ని మాటలు కూడా చెప్తాడు- 1931 లో బ్రిటిష్ వారు భగత్ సింగ్ ని ఉరి వేసినప్పుడు, అప్పటికి తను వయసు మూడు సంవత్సరాలే.
అతనిని బడి నుంచి తీసేశాక, యువకుడైన భగత్ సింగ్ జుగ్గీయాన్, అతని కుటుంబానికున్న ఐదు ఎకరాలలో పని చేస్తూనే, విప్లవ అండర్ గ్రౌండ్ లో కొరియర్ గా పనిచేశాడు. “నేను వాళ్లేమడిగినా చేయడానికి సిద్ధంగా ఉండేవాడిని.” ఇందులో ఒకటి, అతను కౌమార వయసులో ఉండగానే, 20 కిలోమీటర్లు నడుచుకుంటూ చీకటిలో భాగాలు విడదీసిన అతి భారమైన, ఒక చిన్న ప్రింటింగ్ ప్రెస్ ని రెండు సంచులలో విప్లవ సమూహాల రహస్య స్థావరానికి తీసుకెళ్లారు. అంటే ఇతనిని ఒక క్షేత్రస్థాయి లో పని చేసిన స్వాతంత్య్ర సైనికుడు అనవచ్చు.
“అక్కడ చేరాక వారు కూడా ఒక బరువైన సంచిని ఇచ్చారు. అందులో ఆహార పదార్ధాలు ఇంకా వేరే ఇతర సామాన్లు ఉన్నాయి. అదే దూరంలో అండర్ గ్రౌండ్ లో ఉన్న మా సంబంధిత విప్లవ కామ్రేడ్లకు ఈ సామాను తీసుకు వెళ్లి ఇవ్వాలి.” అతని కుటుంబం కూడా అండర్ గ్రౌండ్ లో ఉన్న విప్లవకారులకు భోజనం, వసతి సదుపాయాలూ కల్పించేవారు.
*****
ఆ తరవాత భారత దేశం విడిపోయింది.
ఆ సమయం గురించి ప్రస్తావించగానే అతని కళ్ళలో నీళ్లసుడులు తిరిగాయి. ఈ పెద్ద మనిషి తన కన్నీళ్లను ఆపుకుని అప్పుడు జరిగిన అరాచకాన్ని మారణకాండని గుర్తుకు తెచ్చుకున్నారు. “లెక్కపెట్టలేని వేలల్లో సరిహద్దును దాటి వలస వెళ్తున్న ప్రజల పై తరచూ దాడి చేసి, ఊచకోత కోసేవారు. ఈ చుట్టుపక్కలే అవి జరిగేవి.”
“ఇక్కడికి నాలుగు కిలోమీటర్ల దూరంలోనే సింబి గ్రామం ఉంది,” అన్నాడు రచయిత, పాఠశాల ఉపాధ్యాయుడు, స్థానిక చరిత్రకారుడు అయిన అజ్మీర్ సిద్ధూ, “250 మందికి పైగానే, అందులో ఎక్కువ మంది ముస్లింలు రెండు రాత్రులు, ఒక రోజులో నరకబడ్డారు.” ఈయన భగత్ సింగ్ జగ్గియాన్తో మా సంభాషణ జరుగుతున్నంత సేపు మాతోనే ఉన్నారు, కానీ ఇందులో, గడ్ శంకర్ పోలీస్ స్టేషన్ తానాదార్ 101 చావులు మాత్రమే నమోదు చేశారు.
“1947 లో ఇక్కడ రెండు రకాల మనుషులు ఉండేవారు”, అన్నారు భగత్ సింగ్. “ఒక సమూహం ముస్లింల పై దాడి చేసి చంపేస్తే, ఇంకో సమూహం దాడి చేసేవారి నుండి ముస్లింలను రక్షించేది.” అన్నారు భగత్ సింగ్.
“మా పొలం దగ్గర ఒక యువకుడిని కాల్చి చంపేశారు. మేము అతని అన్నకి తన తమ్ముడిని దహనం చేయడానికి సాయం చేస్తామని చెప్పాము, కానీ అతను భయపడి వలసవెళ్లే వాళ్లతో కలిసి వెళ్ళిపోయాడు. ఇంకా ఆ శవాన్ని మా పొలంలోనే ఖననం చేశాము. అది చాలా చెడ్డ ఆగష్టు 15 .” అతను చెప్పాడు.
ఇందులో సరిహద్దును దాటగలిగినవారు గులామ్ ముస్తఫా, ఒక పెద్ద భూస్వామి- ఇతను భగత్ సింగ్ జుగ్గీయాన్ ని అతని చిన్నప్పుడు, మళ్లీ బడిలో చేర్పించడానికి చాలా ప్రయత్నించాడు.
“కానీ, ముస్తఫా కొడుకు అబ్దుల్ రహ్మాన్, ఇంకా కొంత కాలం ఇక్కడే ఉండిపోయి తరవాత చాలా ప్రమాదంలో పడ్డాడు. మా కుటుంబం వారు రెహమాన్ ను ఒక రాత్రి దొంగతనంగా మా ఇంటికి తీసుకువచ్చారు. అతని దగ్గర ఒక గుఱ్ఱం ఉంది.”
కానీ ముస్లిమ్ ల కోసం వెతికే సమూహాలకు ఈ విషయం తెలిసింది. కాబట్టి ఒక రాత్రి అతనిని బయటకు తీసుకొచ్చాము. మాకున్న స్నేహితులు, కామ్రేడ్ల సహాయంతో అతన్ని ప్రాణాలతో సరిహద్దును దాటించగలిగాము. తరవాత అతని గుఱ్ఱాన్ని కూడా అతనికి వెనక్కి ఇచ్చేశారు. ముస్తాఫా తన సన్నిహితులకు ఉత్తరం రాస్తూ, జగ్గియాన్ కు వేల కృతఙ్ఞతలు చెప్పి, తప్పకుండా ఒకరోజు భారతదేశానికి వచ్చి అతన్ని కలుస్తానని చెప్పాడు. “కానీ అతను ఎప్పుడు వెనక్కి రాలేదు.”
విభజన గురించి మాట్లాడితే భగత్ సింగ్ చాలా బాధపడతాడు. అతను కాసేపు మౌనంగా ఉండి తరవాత మళ్లీ మాట్లాడడం మొదలుపెట్టాడు. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా బిరంపూర్ లో నూ హోషియార్పూర్ లోను ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు అతను 17 రోజులపాటు జైల్లో ఉన్నాడు.
1948 లో, అతను సిపిఐలో విలీనమైన కీర్తి పార్టీ నుండి విడిపోయిన లాల్ (రెడ్) కమ్యూనిస్ట్ పార్టీ హింద్ యూనియన్‌లో చేరాడు.
కానీ 1948 నుండి 1951 వరకు తెలంగాణా, ఇంకా ఇతర ప్రాంతాలలో జరిగిన తిరుగుబాట్ల వలన కమ్యూనిస్ట్ పార్టీ ని నిషేధించారు. భగత్ సింగ్ జుగ్గియన్ మళ్లీ పగటిపూట రైతుగా, రాత్రి పూట రహస్య కొరియర్ గా పని చేసేవాడు. అండర్ గ్రౌండ్ లో ఉన్న కార్యకర్తలకు వసతిని ఇచ్చేవాడు. ఈ దశలో అతను కూడా ఒక సంవత్సరం అండర్ గ్రౌండ్ లో గడిపాడు.
1952 లో లాల్ పార్టీ కమ్యూనిటీ పార్టీ అఫ్ ఇండియా లో విలీనమైపోయింది. 1964లో సిపిఐ విడిపోయినప్పుడు, అతను సిపిఐ-ఎం లో చేరాడు, ఆ తర్వాత ఇక ఎప్పటికి అందులో ఉండిపోయాడు.
ఆ కాలంలో అతను భూమి ఇంకా రైతులను ప్రభావితం చేసే ఇతర పోరాటాలలో పాల్గొన్నాడు. 1959 లో ఖుష్ హసియతి టాక్స్ మోర్చా (మెరుగైన పన్ను వ్యతిరేక పోరాటం) సమయంలో భగత్ సింగ్ అరెస్టయ్యాడు. అతని నేరం: కంది ప్రాంత రైతులను సమీకరించడం (ఇప్పుడు పంజాబ్ ఈశాన్య సరిహద్దులో). కోపంతో ఉన్న ప్రతాప్ సింగ్ కైరాన్ ప్రభుత్వం అతని గేదెను, పశుగ్రాసం కోసే యంత్రాన్ని స్వాధీనం చేసుకొని వాటిని వేలం వేయడం ద్వారా అతడిని శిక్షించింది. కానీ రెండింటిని 11 రూపాయలకు తోటి గ్రామస్థుడు కొనుగోలు చేశాడు, తర్వాత వాటిని కుటుంబానికి తిరిగి ఇచ్చాడు.
ఈ ఆందోళన సమయంలో భగత్ సింగ్ లుథియానా జైలులో మూడు నెలలు గడిపాడు. ఆ తరువాత మళ్ళీ, అదే సంవత్సరం పాటియాలా జైలులో మూడు నెలలు గడిపాడు.
అతను తన జీవితమంతా నివసించిన గ్రామం మొదట మురికి వాడల (స్లమ్ నివాసాలు) గుంపుగా ఉండేది, దీనిని జుగ్గియన్ అని పిలిచేవారు. అందుకే భగత్ సింగ్ జుగ్గియన్ అనే పేరు వచ్చింది. దీనిని ఇప్పుడు గర్‌శంకర్ తహసీల్ లోని రామ్‌ఘర్ గ్రామంలో భాగంగా గుర్తించారు.
1975 లో, అతను మళ్లీ ఎమర్జెన్సీపై పోరాడుతూ ఒక సంవత్సరం పాటు అండర్ గ్రౌండ్ లోకి వెళ్లాడు. ప్రజలను సమీకరించడం, తనకు అవసరమైనప్పుడు కొరియర్ పని చేయడం, అత్యవసర వ్యతిరేక సాహిత్యాన్ని పంపిణీ చేయడం వంటి పనులు చేసేవాడు.
ఇన్ని సంవత్సరాలుగా, అతను తన గ్రామంలో, ప్రాంతంలో పాతుకుపోయాడు. 3 వ తరగతి చదివిన ఈ వ్యక్తి , తన చుట్టూ విద్య ఉద్యోగాలతో ఇబ్బంది పడుతున్న యువకులపై తీవ్ర ఆసక్తిని కనబరిచాడు. అతను సహాయం చేసిన వారిలో చాలామంది బాగా పైకి వచ్చారు, కొందరు ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా ఉన్నారు.
*****
1990: భగత్ సింగ్ కుటుంబానికి, వారి గొట్టపు బావికి, భీభత్సానికి మధ్య కొద్ది నిమిషాలు మాత్రమే ఉన్నాయని తెలుసు. భారీ సాయుధ ఖలిస్తానీ హిట్ స్క్వాడ్ అతని పొలాల్లో ఆగింది , గొట్టపు బావి మీద అతని పేరు చెక్కబడి ఉంది. అక్కడి నుండి అతని ఇల్లు కేవలం 400 మీటర్ల దూరంలో ఉంది. అక్కడి నుండి వారి లక్ష్యాన్ని నిర్ధారించుకున్నారు. అక్కడ వారు దాగి ఉన్నారు - కానీ కనిపించారు.
1984 నుంచి 1993 వరకు పంజాబ్ భయంతో వణికి పోయింది. వందలకొద్దీ మనుషులు కాల్చివేయబడ్డారు లేదా చంపివేయబడ్డారు. అందులో చాలా మంది సిపిఐ, సిపిఐ-ఎం, సిపిఐ-ఎం ఎల్ ఉద్యమకారులు ఉన్నారు. ఎందుకంటే వీరు ఖలిస్తానీల పట్ల చాలా మొండివైఖరితో లొంగకుండా ఉన్నారు. ఈ సమయం లో భగత్ సింగ్ ఎప్పుడూ వారి హిట్ లిస్ట్ లో ఉండేవాడు.
1990లో అసలు ఆ లిస్టు లో ఉండడం అంటే ఏంటో అర్ధమైంది భగత్ సింగ్ కు. అతని ముగ్గురు కొడుకులు డాబా మీద ఉన్నారు, వారికి పోలీసులు గన్నులు ఇచ్చారు. ఆ సమయం లో ప్రభుత్వం చావు ఆపద లో ఉన్నవారికి తమను కాపాడుకునేందుకు మారణాయుధాలకు అనుమతినివ్వడమే కాకుండా, సాయం కూడా చేసేది.
“వారిచ్చిన గన్నులు నాణ్యమైనవి కాదు. అందుకని నేను ఒక 12 బోర్ షాట్ గన్ ను చేబదులుగా తీసుకున్నాను, ఆ తరవాత సెకండ్ హ్యాండ్ లో నేనే ఒకటి కొనుక్కున్నాను.” అన్నారు ఆ సమయాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ భగత్ సింగ్.
అతని 50 ఏళ్ళ కొడుకు పరంజిత్ అన్నారు, “ఒకసారి నేను మా నాన్నకి వచ్చిన ఉత్తరం లో చావు బెదిరింపుని చదివాను. ‘నీ కార్యాకలాపాలు మానుకోకపోతే నీ మొత్తం కుటుంబాన్నే ఆనవాలు లేకుండా చేసేస్తాం,’ అని ఉంది అందులో. నేను దాని కవర్ లో పెట్టేసి ఎవరు దానిని చూడనట్లుగా నటించాను. ఆ ఉత్తరాన్ని చదివితే మా నాన్న ఎలా స్పందిస్తాడో అనుకున్నా నేను. ఆయన నెమ్మదిగా ఆ ఉత్తరాన్ని చదివి, మడత పెట్టి, దాన్ని జేబులో పెట్టుకున్నాడు. కొంతసేపటి తరవాత ఆయన మా ముగ్గురిని మేడ మీదకు తీసుకెళ్లి సావధానంగా ఉండమని చెప్పాడు. కానీ ఒక్క మాట కూడా ఉత్తరాన్ని గురించి చెప్పలేదు.”
1990లో జరిగిన విషయం మాత్రం వెన్నులో చలిపుట్టిస్తుంది. ఈ సాహసవంతమైన కుటుంబం చివరి వరకు పోరాడుతుంది అనడంలో అనుమానమే లేదు. కానీ AK-47 లు, ఇతర ఘోరమైన ఆయుధాలతో సాయుధ శిక్షణ పొందిన హిట్ స్క్వాడ్ల ఫైర్‌పవర్‌తో వారు తలపడి ఓడిపోతారనడంలో సందేహం లేదు.
అప్పుడే గొట్టపు బావిలో ఒక ఉగ్రవాది పేరు గుర్తించబడింది. "అతను ఇతరుల వైపు తిరిగి, 'భగత్ సింగ్ జుగ్గియన్ మన లక్ష్యం అయితే, నాకు దీనితో ఎలాంటి సంబంధం ఉండదు' అని చెప్పాడు," అని మన పాత స్వాతంత్య్ర సమరయోధుడు చెప్పాడు. హిట్ స్క్వాడ్ దానిని రద్దు చేయాలని నిర్ణయించుకుంది. ఇక ఫీల్డ్ నుండి వైదొలిగి అదృశ్యమైంది.
గ్రామంలో ఉగ్రవాది తమ్ముడికి భగత్ సింగ్ సహాయం చేశారని తేలింది. ఈ తమ్ముడికి పట్వారీ గా (గ్రామ రికార్డుల కీపర్) గా ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. "నన్ను చంపడం మానుకున్నాక ఆ తరవాత రెండు సంవత్సరాలు, ఆ అన్నయ్య నాకు చిన్న చిన్న సలహాలు, హెచ్చరికలు పంపేవాడు. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళకూడదో అని చెబుతూ ... " అని భగత్ సింగ్ నవ్వుతూ చెప్పాడు. ఇది అతని పై జరిగే తదుపరి ప్రయత్నాలను తప్పించుకోవడానికి సహాయపడింది.
ఈ విషయాలను గురించి అతని కుటుంబం మాట్లాడే విధానం దాదాపుగా కలవరపెడుతుంది. భగత్ సింగ్ విశ్లేషణ శాస్త్రీయంగా ఉంటుంది. కానీ విభజన గురించి మాట్లాడేటప్పుడు అతను చాలా భావోద్వేగానికి గురవుతాడు. అతని భార్య సంగతి ఏమిటి, ఆ సమయంలో ఆమె కంగారుపడలేదా? “మేము దాడిని ఎదుర్కోగలమని నాకు నమ్మకం ఉంది," అని 78 ఏళ్ళ గురుదేవ్ కౌర్ చాలా ప్రశాంతంగా చెప్పారు. ఈమె ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ లో సీనియర్ కార్యకర్త. ఆమె ఇలా చెప్పింది: "నా కుమారులు బలంగా ఉన్నారు, నాకు భయం లేదు - పైగా మాకు గ్రామస్ధుల మద్దతు చాలా ఉంది."
గురుదేవ్ కౌర్ 1961 లో భగత్ సింగ్‌ను వివాహం చేసుకున్నారు - ఇది అతని రెండవ వివాహం. అతని మొదటి భార్య 1944 లో వివాహం చేసుకున్న కొన్ని సంవత్సరాల తరువాత మరణించింది. వారికి కలిగిన ఇద్దరు కుమార్తెలు విదేశాలలో స్థిరపడ్డారు. గురుదేవ్ కౌర్ తో అతని వివాహం జరిగాక మళ్లీ అతనికి ముగ్గురు కుమారులు కలిగారు, కానీ పెద్దవాడు జస్వీర్ సింగ్ 2011 లో 47 సంవత్సరాల వయస్సులో మరణించాడు. మిగిలిన ఇద్దరు కుల్దీప్ సింగ్, 55, ఇప్పుడు యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఉన్నారు, మూడోవారు పరంజిత్, వారితోనే ఉంటారు.
అతనికి వద్ద ఇప్పటికి 12 బోర్ గన్ ఉందా? “లేదు, నేను దానిని వదిలించుకున్నాను. అయినా నాకు ఇప్పుడు దానితో పనేంటి? ఒక చిన్నపిల్లాడు కూడా నా దగ్గరనించి దాన్ని లాక్కోగలడు”, అని చెప్పి నవ్వాడు ఆ 93 ఏళ్ళ పెద్దమనిషి.
1992 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు అతని ఇంటికి మళ్లీ ప్రమాదాన్ని తీసుకువచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఎన్నికలను పంజాబ్ లో కూడా జరపాలని గట్టిగా నిర్ణయించుకుంది. పోల్స్ ని పనిచేయకుండా చేయాలని ఖలిస్తానీలు అంట గట్టిగానే నిర్ణయించుకుని, నిలబడిన కాండిడేట్లను చంపేయడం మొదలు పెట్టారు. భారత ఎన్నికల చట్టం ప్రకారం, ప్రచార సమయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ అభ్యర్థి మరణించడం ఆ నియోజకవర్గంలో 'వాయిదా' లేదా ఎన్నికల కౌంటర్‌మాండింగ్‌కు దారితీస్తుంది. అందువలన ప్రతి అభ్యర్థి అప్పుడు తీవ్రమైన ప్రమాదంలో ఉన్నారు.
నిజానికి, రకరాకాలుగా సాగిన హింస, జూన్ 1991 లో ఈ ఎన్నికలను వాయిదా వేయడానికి దారితీసింది. ఆ సంవత్సరం మార్చి-జూన్ మధ్య, ఆసియా సర్వే జర్నల్‌లో గుర్హర్‌పాల్ సింగ్ రాసిన పేపర్ ప్రకారం, “24 రాష్ట్ర, ఇంకా పార్లమెంటరీ అభ్యర్థులు మరణించారు; రెండు రైళ్లలో 76 మంది ప్రయాణీకులు ఊచకోతకు గురయ్యారు; పోలింగ్‌కు వారం రోజుల ముందు, పంజాబ్‌ను చెదిరిన ప్రాంతంగా ప్రకటించారు.”
కాబట్టి తీవ్రవాదుల లక్ష్యం స్పష్టంగా ఉంది. తగినంత మంది అభ్యర్థులను చంపండి. అభ్యర్థులకు అపూర్వమైన భద్రతను అందించడం ద్వారా ప్రభుత్వం స్పందించింది. వారిలో, భగత్ సింగ్ జుగ్గియన్ గర్‌శంకర్ నియోజకవర్గం నుండి ఎన్నికల్లో పోటీ చేశారు. అకాలీదళ్‌లోని అన్ని వర్గాలు ఎన్నికలను బహిష్కరించాయి. " ప్రతి అభ్యర్థి కి 32-వ్యక్తుల సెక్యూరిటీ డిటాచ్‌మెంట్ అందించబడింది, మరింత ప్రముఖ నాయకులకు అయితే ఈ 50 కన్నా ఎక్కువమందినే సెక్యూరిటీ గా ఇచ్చారు." వాస్తవానికి, ఇదంతా ఎన్నికలు జరిగేంత వరకు మాత్రమే.
భగత్ సింగ్ 32 మంది బృందం గురించి ఏమిటి? "ఇక్కడ నా పార్టీ కార్యాలయంలో 18 మంది సెక్యూరిటీ గార్డులు ఉండేవారు. మరో 12 మంది ఎప్పుడూ నాతోనే ఉన్నారు. నేను ప్రచారానికి వెళ్లినప్పుడల్లా వారు కూడా వచ్చేవారు . ఇక ఇద్దరు ఎల్లప్పుడూ నా కుటుంబంతో ఇంట్లో ఉంటారు.” ఎన్నికలకు ముందు కొన్నాళ్లుగా టెర్రరిస్ట్ హిట్ లిస్ట్‌లో ఉన్నందున, అతనికి ఎక్కువ ప్రమాదం ఉంది. కానీ అతనికి ఏమి కాలేదు. సైన్యం, పారామిలిటరీ, పోలీసు సిబ్బంది - వీరందరి భారీ భద్రతా ఆపరేషన్ కూడా తీవ్రవాదులను ఎదుర్కొంది. కాబట్టి ఎన్నికలు ఎటువంటి పెద్ద ఘోరాలు లేకుండా జరిగాయి.
"ఆయన 1992 ఎన్నికలలో పోటీ చేసాడు," అని పరంజిత్ చెప్పాడు, "తనను తాను అధిక ప్రాధాన్యత ఉన్న లక్ష్యంగా చేసుకొని, ఖలిస్తానీల దృష్టిని తన వైపు మళ్లించి, తద్వారా ఆయన తన కామ్రేడ్లను కాపాడగలనని నమ్మాడు."
ఈ ఎన్నికల్లో భగత్ సింగ్ కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. కానీ అతను వేరే ఎన్నికలలో గెలిచాడు. 1957 లో, అతను రామ్‌ఘర్ మరియు చక్ గుజ్జ్రాన్ అనే రెండు గ్రామాల సర్పంచ్ గా ఎన్నికయ్యారు. అతను నాలుగు సార్లు సర్పంచ్ గా ఉన్నారు, ఆఖరుసారిగా 1998 లో సర్పంచ్ గా ఎన్నికయ్యారు.
అతను 1978 లో నవాన్‌షహర్ (ఇప్పుడు షహీద్ భగత్ సింగ్ నగర్) లోని సహకార చక్కెర మిల్లు డైరెక్టర్‌గా ఎన్నికయ్యారు. అకాలీదళ్‌తో అనుసంధానమైన, శక్తివంతమైన భూస్వామి సంసర్ సింగ్‌ను ఓడించడం ద్వారా అది జరిగింది. 1998 లో, అతను మళ్లీ అదే పదవికి ఎన్నికయ్యాడు - ఏకగ్రీవంగా.
*****
ఆ ఎనిమిది దశాబ్దాలలో అతడిని మందలించి, బడి నుండి తీసివేసినప్పటినుండి నుండి, భగత్ సింగ్ జుగ్గియాన్ రాజకీయంగా అవగాహన, అప్రమత్తతతో చురుకుగా ఉన్నాడు. ప్రస్తుతం సాగుతున్న రైతుల నిరసనలలో జరుగుతున్న ప్రతిదాన్ని అతను తెలుసుకోవాలనుకుంటున్నాడు. అతను తన పార్టీ స్టేట్ కంట్రోల్ కమిషన్‌కు ప్రతిరోజు వెళ్లి కూర్చుంటారు . ఈయన జలంధర్‌లోని దేశ్ భగత్ యాద్గార్ హాల్‌ను నిర్వహిస్తున్న బాడీకి ట్రస్టీ కూడా. వేరే ఏ ఇతర సంస్థల కన్నా బాగా DBYH పంజాబ్ లోని విప్లవాత్మకమైన ఉద్యమాలని రికార్డుచేసి స్మారకసభలు నిర్వహిస్తూ ఉంటుంది. ఘాడర్ పోరాట విప్లవ వీరులే ఈ పోరాటాన్ని కూడా మొదలుపెట్టారు.
“ఈరోజు కూడా, ఈ ప్రాంతం నుండి రైతుల సమస్యలపై జాతాలు (నియమబద్ధమైన కవాతు) బయలుదేరినప్పుడు, బహుశా ఢిల్లీ సరిహద్దుల్లోని నిరసన శిబిరాలలో చేరడానికి, వారు మొదట భగత్ సింగ్ ఇంటికి ఆశీర్వాదం కోసం వెళతారు," అని అతని స్నేహితుడు, సిపిఐ-ఎమ్ పంజాబ్ రాష్ట్ర కమిటీ సభ్యుడు, దర్శన్ సింగ్ మట్టు చెప్పారు . “మునుపటితో పోలిస్తే అతను శారీరకంగా బలహీన పడ్డాడు, కానీ అతని నిబద్ధత, తీవ్రత ఎప్పటిలాగే బలంగా ఉన్నాయి. ఇప్పుడు కూడా అతను రామ్‌గఢ్ మరియు గర్‌శంకర్‌లో బియ్యం, నూనె, ఇతర సామాన్లను, డబ్బులను(ముఖ్యంగా తన డబ్బుతో మొదలుపెట్టి) షాజహన్పూర్ లో నిరసన తెలిపే రైతుల కొరకు సమీకరిస్తున్నాడు.
మేము బయలుదేరినప్పుడు, అతను తన వాకర్‌తో చాలా త్వరగా కదులుతూ మమ్మల్ని సాగునంపుతానని పట్టుబట్టాడు. భగత్ సింగ్ జుగ్గియన్, తాను ఏ దేశ స్వాతంత్య్రం కోసం పోరాడాడో, ఆ దేశ స్థితి తనకు నచ్చలేదని, ఆ విషయం మేము తెలియజేయాలని కోరాడు. దేశాన్ని నడుపుతున్న వ్యక్తులు ఎవరూ, "స్వాతంత్య్ర ఉద్యమంలో ఉన్న వారి స్ఫూర్తిని అందిపుచ్చుకోలేదని” అన్నారు. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ శక్తులు - స్వాతంత్య్ర పోరాటాలలో ఎన్నడూ ఉండేవి కాదన్నారు. “ఒక్కటి కూడా లేదు. మనం కనుక అప్రమత్తంగా ఉండకపోతే వారు ఈ దేశాన్ని నాశనం చేస్తారు, ”అని ఆందోళనగా చెప్పాడు.
ఆ పైన ఆయన ఇంకో మాట అన్నాడు: "కానీ నన్ను నమ్మండి, ఈ రాజ్యంలో కూడా సూర్యుడు అస్తమిస్తాడు."
రచయిత : చండీగఢ్ లోని విశ్వభారతి ట్రిబ్యూన్ కు , గొప్ప విప్లవకారుడు షహీద్ భగత్ సింగ్ మేనల్లుడు ప్రొఫెసర్ జగ్ మోహన్ సింగ్ కు వారి అమూల్యమైన సూచనలకు , సహాయానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు . అలాగే అజ్మీర్ సిద్ధూ - అతని దయగల సహాయానికి , సూచనలకు కృతఙ్ఞతలు .
అనువాదం : అపర్ణ తోట