“ఆ రోజు మధ్యాహ్నం నేనూ, నా బిడ్డ బ్రతుకుతామో లేదో నాకు ఖచ్చితంగా తెలియదు. నా ఉమ్మనీటి సంచీ పగిలిపోయింది. కనుచూపు మేరలో ఆసుపత్రి గానీ, అందుబాటులో ఆరోగ్య కార్యకర్త గానీ లేరు. సిమ్లాలోని ఆసుపత్రికి వెళ్లే మార్గంలో కదులుతున్న జీపులో నాకు నొప్పులు వచ్చాయి. నేనింక ఆగే అవకాశం లేదు. అక్కడే బిడ్డను ప్రసవించాను - ఆ బొలెరో లోపల!" ఈ సంఘటన జరిగిన ఆరు నెలల తర్వాత, ఏప్రిల్ 2022లో ఈ రిపోర్టర్ ఆమెను కలిసినప్పుడు, తన పసిబిడ్డను ఒడిలో పెట్టుకుని కూర్చుని ఉన్న అనురాధ మహతో (అసలు పేరు కాదు)కు ఇప్పటికీ ఆ రోజు స్పష్టమైన వివరాలతో గుర్తుంది.

"అప్పుడు మధ్యాహ్నం మూడు గంటలవుతోంది. నా ఉమ్మనీటి సంచి పగిలిపోగానే, నా భర్త ఆశా దీదీ కి కబురందించాడు. పావుగంటా, ఇరవై నిముషాల్లోనే ఆమె వచ్చేసింది. వచ్చిన వెంటనే అంబులెన్స్ కోసం ఫోన్ చేసింది. ఆ రోజు వర్షం పడుతోంది. పది నిముషాల్లో బయలుదేరతామని అంబులెన్స్ వాళ్ళు చెప్పారుగానీ, వాళ్ళకు మా ఊరు చేరడానికి మామూలుగా పట్టే సమయం కన్నా ఒక గంట ఎక్కువే పట్టివుంటుంది," వర్షాలు పడినపుడు అక్కడి రోడ్ల మీద ప్రయాణం ఎంత ప్రమాదకరంగా ఉంటుందో వివరిస్తూ చెప్పింది, దాదాపు ముప్పయ్యేళ్ళ వయసున్న అనురాధ.

ఆమె హిమాచల్ ప్రదేశ్‌లోని కోటి గ్రామంలోని కొండ ప్రాంతంలో తాత్కాలికంగా ఏర్పాటుచేసుకున్న ఒక డబ్బారేకుల గుడిసెలో తన ముగ్గురు పిల్లలతోనూ, వలస కూలీ అయిన భర్తతోనూ కలిసి నివసిస్తోంది. అయితే ఈ కుటుంబం బిహార్‌లోని భాగల్‌పూర్ జిల్లా గోపాల్‌పూర్ గ్రామం నుంచి ఇక్కడకు వలసవచ్చింది.

సిమ్లా జిల్లాలోని మషోబ్రా బ్లాక్‌లో ఉన్న కోటి గ్రామంలో 2020లో తన భర్తతో చేరిన అనురాధ, “ఆర్థిక సమస్యల కారణంగా మేం (బిహార్‌లోని) మా గ్రామం నుండి ఇక్కడికి మారవలసి వచ్చింది. రెండు చోట్లా అద్దెలు చెల్లించడం కష్టమైంది." అని చెప్పింది. 38 ఏళ్ల ఆమె భర్త రామ్ మహతో (అసలు పేరు కాదు), నిర్మాణ స్థలాల్లో మేస్త్రీగా పనిచేస్తున్నారు. ఎక్కడ పనివుంటే అతను అక్కడికి వెళ్లాల్సివుంటుంది. ప్రస్తుతం అతను తాము నివాసముండే రేకుల గుడిసెకు దగ్గరలోనే పని చేస్తున్నారు.

మామూలు రోజుల్లో కూడా అంబులెన్స్ వారి ఇంటిదాకా సులభంగా చేరుకోవడమంటే కష్టమే. ఇక సిమ్లా జిల్లా కేంద్రంలోని కమలా నెహ్రూ ఆస్పత్రి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోటికి రావాలంటే ఒకటిన్నర నుంచి 2 గంటల సమయం పడుతుంది. వర్షాలు పడుతున్నప్పుడు, మంచుకురిసే సమయంలోనూ అందుకు రెట్టింపు సమయం పడుతుంది.

Anuradha sits with six-month-old Sanju, outside her room.
PHOTO • Jigyasa Mishra
Her second son has been pestering her but noodles for three days now
PHOTO • Jigyasa Mishra

ఎడమ : ఆరునెలల పసిబిడ్డ సంజుతో , తన గది బయట కూర్చొనివున్న అనురాధ . కుడి : ఆమె రెండవ కొడుకు , నూడుల్స్ కోసం మూడు రోజులుగా తల్లిని సతాయిస్తున్నాడు

అనురాధ ఇంటి నుండి దాదాపు ఏడు కిలోమీటర్ల దూరంలో ఒక సామాజిక ఆరోగ్య కేంద్రం (సిఎచ్‌సి) ఉంది. ఇది సమీపంలో ఉండే గ్రామాలకూ, కుగ్రామాలకూ చెందిన దాదాపు 5,000 మంది ప్రజలకు సేవలు అందిస్తోందని ఆ ప్రాంతంలో అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్ (ఆశా)గా పనిచేస్తోన్న రీనా దేవి చెప్పారు. కానీ 24 గంటల అంబులెన్స్ వంటి తప్పనిసరి సేవలు - సౌకర్యాలు లేకపోవడంతో ఎవరూ ఈ సిఎచ్‌సినిని సంప్రదించరు. “మేం 108కి డయల్ చేసినప్పుడల్లా ఆ వాహనం ఒక్కసారికే అంత సులభంగా వచ్చేయదు. ఇక్కడకు అంబులెన్స్‌ను తీసుకురావడం చాలా కష్టమైన పని. స్వంతంగా వాహనాలను ఏర్పాటు చేసుకొని రమ్మని వాళ్ళే మమ్మల్ని ఒప్పించడానికి ప్రయత్నిస్తారు,” అని ఆమె చెప్పారు.

నిబంధనల ప్రకారం సిఎచ్‌సిలో ప్రసూతి-స్త్రీ జననేంద్రియ సమస్యల నిపుణులు(గైనకాలజిస్ట్), 10 మంది స్టాఫ్ నర్సుల బృందం ఉండాలి. సిజేరియన్, ఇతర వైద్య పరీక్షల వంటి అవసరమైన, అత్యవసర ప్రసూతి సంరక్షణను అందించగలగాలి. అత్యవసర సేవలన్నీ 24 గంటలూ అందుబాటులో ఉండాలి. అయితే కోటిలోని సిఎచ్‌సి సాయంత్రం 6 గంటలకే మూతపడుతుంది, తెరిచి ఉన్నా ఇక్కడ గైనకాలజిస్టు అందుబాటులో లేరు.

"కాన్పుల గది(లేబర్‌రూమ్) పనిచేయకపోవటంతో, అది సిబ్బందికి వంటగదిగా మారింది" అని గ్రామంలోని దుకాణదారుడు హరీశ్ జోషి చెప్పారు. “నా సోదరి కూడా అదే విధంగా బాధపడింది. ఆమె మంత్రసాని పర్యవేక్షణలో ఇంట్లో ప్రసవించవలసి వచ్చింది. ఇది జరిగి కూడా మూడేళ్లయింది. కానీ ఇప్పటికీ అదే పరిస్థితి. సిహెచ్‌సి తెరిచి ఉన్నా, మూసి ఉన్నా అటువంటి సందర్భాలలో ఎలాంటి తేడా ఉండదు.” అని ఆయన చెప్పారు.

గ్రామంలో నివసించే మంత్రసాని అనురాధకు ఎటువంటి సహాయం చేయలేదని రీనా చెప్పారు. "ఇతర కులాలకు చెందిన వ్యక్తుల ఇళ్లకు వెళ్ళటం ఆమెకు ఇష్టం లేదు" అని ఈ ఆశా సూచనప్రాయంగా అన్నారు. "అందుకనే, మేం మొదటి నుండి ఆసుపత్రికి వెళ్లాలనే నిర్ణయించుకున్నాం." అని రీనా చెప్పారు. అనురాధ ప్రసవించిన రోజున రీనా ఆమెతో కలిసి వచ్చారు.

“దాదాపు 20 నిమిషాల ఎదురుచూపు తర్వాత నా నొప్పి తీవ్రం కావడంతో, ఆశా దీదీ నా భర్తతో చర్చించి, అద్దె వాహనంలో నన్ను సిమ్లాకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. పోవడానికీ, తిరిగి రావడానికీ ఒకోవేపుకు 4,000 రూపాయల చొప్పున ప్రయాణం ఖర్చు అవుతుంది. కానీ మేం బయల్దేరిన 10 నిమిషాల తర్వాత, నేను బొలెరో వెనుక సీటులోనే ప్రసవించాను." అని అనురాధ చెప్పింది. అయితే, అనురాధ కుటుంబం సిమ్లాకు వెళ్ళకపోయినా డ్రైవర్ వారి నుంచి పూర్తి మొత్తాన్ని వసూలు చేశారు.

Reena Devi, an ASHA worker in the village still makes regular visits to check on Anuradha and her baby boy.
PHOTO • Jigyasa Mishra
The approach road to Anuradha's makeshift tin hut goes through the hilly area of Koti village
PHOTO • Jigyasa Mishra

ఎడమ : అనురాధ , ఆమె పసిబిడ్డ ఎలావున్నారో తెలుసుకునేందుకు గ్రామంలోని ఆశా , రీనా దేవి తరచూ వారివద్దకు వెళ్తుంటారు . కుడి : అనురాధ నివసించే రేకు గుడిసెకు వెళ్లే రహదారి కోటి గ్రామంలోని కొండ ప్రాంతం గుండా వెళుతుంది

"బిడ్డ పుట్టేటప్పటికి మేం కేవలం మూడు కిలోమీటర్ల దూరం మాత్రమే ప్రయాణించాం. మా దగ్గర పరిశుభ్రమైన గుడ్డ, నీటి సీసాలు, కొత్త బ్లేడ్ ఉండేలా చూసుకున్నాను. అందుకు దేవునికి ధన్యవాదాలు! బొడ్డు తాడును కత్తిరించడం - నేనింతకు ముందు ఎన్నడూ చేయలేదు. అయితే అది ఎలా జరుగుతుందో నేను చూసివున్నాను కాబట్టి, నేను ఈమె కోసం చేశాను,” అని రీనా చెప్పారు.

ఆ రాత్రి గట్టెక్కడం కేవలం అనురాధ అదృష్టమనే చెప్పాలి

ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్ల్యూఒఎచ్ ) ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ప్రసూతి మరణాల రేటు గణనీయంగా మెరుగుపడినప్పటికీ, గర్భధారణ సమయంలోనూ ప్రసవ సమయంలోనూ వివిధ సమస్యల కారణంగా ప్రతిరోజూ 800 కంటే ఎక్కువ మంది మహిళలు మరణిస్తున్నారు. ఈ మరణాలలో అత్యధికం, ఆదాయం చాలా తక్కువగా, మధ్యస్థంగా ఉండే దేశాలలో సంభవిస్తాయి. 2017లో ప్రపంచవ్యాప్తంగా సంభవించిన ప్రసూతి మరణాలలో 12 శాతం మరణాలు భారతదేశంలోనే సంభవించాయి .

భారతదేశంలో ప్రసూతి మరణాల నిష్పత్తి (ఎమ్ఎమ్ఆర్), 2017-19లో, ప్రతి 100,000 సజీవ జననాలకు 103గా ఉంది. ఈ నమోదైన సంఖ్య, 2030 నాటికి విశ్వవ్యాప్త ఎమ్ఎమ్ఆర్‌ను 70 లేదా అంతకంటే తక్కువకు తగ్గించే యుఎన్, సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్ (ఎస్‌డిజి) నుండి ఇప్పటికీ దూరంగా ఉంది. ఈ నిష్పత్తి ఆరోగ్యం, సామాజిక ఆర్థిక అభివృద్ధికి ఒక కీలక సూచిక; అధిక సంఖ్యలో సంభవించే ప్రసూతి మరణాలు వనరుల అసమానతను చూపుతాయి.

హిమాచల్ ప్రదేశ్‌లో ప్రసూతి మరణాల రేటుకు సంబంధించిన డేటా తక్షణమే అందుబాటులో లేదు. ఎన్ఐటిఐ ఆయోగ్, ఎస్ డిజి ఇండియా ఇండెక్స్ 2020-21లో తమిళనాడుతో పాటు ఇది రెండవ స్థానంలో ఉన్నప్పటికీ, మారుమూల పర్వత ప్రాంతాలలో పేదరికంతో బాధపడుతున్న గ్రామీణ మహిళల ప్రసూతి ఆరోగ్య సమస్యలను ఇది ప్రతిబింబించదు. అనురాధ వంటి మహిళలు పోషకాహారం, ప్రసూతి సంరక్షణ, ప్రసవానంతర సంరక్షణ, ఆరోగ్య మౌలిక సదుపాయాల వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు.

అనురాధ భర్త రామ్ ఓ ప్రైవేట్ కంపెనీలో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నారు. పని ఉన్న నెలలలో అతను "నెలకు దాదాపు 12,000 రూపాయలు సంపాదిస్తాడు. అందులో 2,000 రూపాయలు ఇంటి అద్దెకు పోతుంది," అనురాధ నన్ను తన ఇంటిలోకి ఆహ్వానిస్తూ చెప్పింది. "ఇంటి లోపల ఉన్నవన్నీ మావే." అని ఆమె చెప్పింది.

ఆమె 8 x 10 అడుగుల రేకుల గదిలో ఎక్కువ భాగాన్ని ఒక చెక్క మంచం, చిన్న చిన్న బట్టల మూటలు, పాత్రలు పేర్చి ఉన్న అల్యూమినియం రేకుపెట్టె ఆక్రమించి ఉన్నాయి. ఈ పెట్టె మంచంగా కూడా మారుతుంటుంది.“మేం చాలా తక్కువ పొదుపు చేయగలుగుతున్నాం. ఎవరైనా అనారోగ్యానికి గురైతేనో లేదా ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితేనో ఆహారం, మందులు, పిల్లలకు పాలు వంటి అవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలి, అప్పు చేయాలి.” అని అనురాధ చెప్పింది.

Anuradha inside her one-room house.
PHOTO • Jigyasa Mishra
They have to live in little rented rooms near construction sites, where her husband works
PHOTO • Jigyasa Mishra

ఎడమ : తన ఒంటి గది ఇంటిలోపల అనురాధ . కుడి : ఆమె భర్త పనిచేసే నిర్మాణ స్థలాలకు దగ్గరగా ఉండే చిన్న అద్దె గదులలో వాళ్ళు నివసించాల్సివుంటుంది

ముఖ్యంగా దేశంలో కోవిడ్-19 విజృంభిస్తోన్న 2021లో ఆమె గర్భం దాల్చడం, వారిపై ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచింది. రామ్‌కి పనిలేదు. జీతం పేరుతో అతనికి రూ. 4,000 వచ్చాయి. అందులోనే ఇంటి అద్దె చెల్లించి, మిగిలిన రూ. 2,000లతో ఆ కుటుంబం బతకాలి. ఆశా దీదీ అనురాధకు ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలను సరఫరా చేసేవారు. అయితే దూరం వెళ్ళాల్సి రావటం, అందుకయ్యే ఖర్చుల కారణంగా క్రమం తప్పకుండా తనిఖీలు చేయించుకోవడం సాధ్యంకాలేదు.

"సిఎచ్‌సి బాగా పనిచేసి ఉంటే, అనురాధకు ఒత్తిడి లేని ప్రసవం అయివుండేది, ఆమె టాక్సీ ప్రయాణానికి 4,000 రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండేది కాదు," అని రీనా చెప్పారు. "సిఎచ్‌సికి విడిగా కాన్పుల గది ఉంది, కానీ అది పనిచేయదు."

"కోటి సిఎచ్‌సిలో ప్రసూతి సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం వలన మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్ళ గురించి మాకు తెలుసు, కానీ సిబ్బంది కొరత కారణంగా పరిస్థితులు మా నియంత్రణలో లేవు," అని సిమ్లా జిల్లా ప్రధాన వైద్యాధికారి సురేఖ చోప్రా చెప్పారు. “ప్రసవాలు జరిగించడానికి అవసరమైన గైనకాలజిస్ట్, నర్సులు, తగినంత మంది శుభ్రపరిచే సిబ్బంది లేరు. కోటి వంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగం చేసేందుకు వైద్యులు ఇష్టపడరు. ఇది దేశంలోని అన్ని జిల్లాలు, రాష్ట్రాలలో ఉన్న చేదు నిజం.” అని ఆమె పేర్కొన్నారు.

రాష్ట్రంలో సిఎచ్‌సిల సంఖ్య 2005లో ఉన్న 66 నుండి 2020 నాటికి 85కి, స్పెషలిస్ట్ వైద్యుల సంఖ్య 2005లో ఉన్న 3,550 నుండి 2020 నాటికి 4,957కి పెరిగినప్పటికీ, గ్రామీణ ఆరోగ్య గణాంకాలు 2019-20 ప్రకారం, హిమాచల్ ప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రసూతి-గైనకాలజిస్ట్‌ల కొరత 94 శాతంగా ఉంది. మరో మాటలో చెప్పాలంటే, అవసరమైన 85 మందికి బదులుగా కేవలం 5 మంది ప్రసూతి-గైనకాలజిస్ట్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నారు. ఇది గర్భిణీ స్త్రీలకు అపారమైన శారీరక, మానసిక, ఆర్థిక ఒత్తిడిగా మారుతోంది.

అనురాధ నివసించే ప్రదేశానికి ఆరు కిలోమీటర్ల దూరాన నివసించే షీలా చౌహాన్ (35), 2020 జనవరిలో తన పాపను ప్రసవించేందుకు సిమ్లాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి ఈ విధమైన ప్రయాణమే చేయవలసివచ్చింది. "పాప పుట్టిన ఇన్ని నెలల తర్వాత కూడా నేనింకా అప్పుల్లోనే ఉన్నాను," అని షీలా PARI తో చెప్పారు.

షీలా, కోటి గ్రామంలో వడ్రంగిగా పనిచేసే ఆమె భర్త గోపాల్ చౌహాన్(40)లు తమ పొరుగింటివారినుంచి రూ. 20 వేలు అప్పుగా తీసుకున్నారు. రెండేళ్ళ తర్వాత కూడా వాళ్ళకు ఇంకా రూ. 5 వేలు అప్పు మిగిలి ఉంది.

PHOTO • Jigyasa Mishra
Rena Devi at CHC Koti
PHOTO • Jigyasa Mishra

ఎడమ : ప్రస్తుతం రామ్ పనిచేస్తోన్న నిర్మాణ ప్రదేశం . ఇది వారి ఇంటి పక్కనే ఉంది కుడి : కోటి సిఎచ్ సి వద్ద రీనాదేవి

సిమ్లా ఆసుపత్రిలో గది అద్దె రోజుకు రూ. 5,000 కావటం వలన షీలా అక్కడ ఒక్క రాత్రి కన్నా ఎక్కువ ఉండలేకపోయారు. మరుసటి రోజే 2,000 రూపాయలకు ఒక టాక్సీని అద్దెకు తీసుకొని ఆమె, గోపాల్ పసిపాపతో కలిసి కోటికి బయలుదేరారు. మంచు కప్పిన దారులలో ముందుకు పోవడానికి ఒప్పుకోని టాక్సీ డ్రైవర్ వారిని గమ్యస్థానాన్ని చేరడానికి ముందే దించేశాడు. "ఆ రాత్రిని తల్చుకుంటే ఇప్పటికీ నాకు ఒళ్ళు జలదరిస్తుంది. బాగా మంచు కురుస్తోంది. అంతకు ముందురోజే పాపను ప్రసవించిన నేను మోకాటి లోతున ఉన్న మంచులో నడుస్తూ ఉన్నాను!" అన్నారు షీలా.

"ఇక్కడ ఉన్న సిఎచ్‌సి సరిగ్గా పనిచేస్తున్నట్లయితే, మాకు అంత డబ్బు ఖర్చుపెట్టి సిమ్లాకు పరుగెత్తే అవసరం ఉండేది కాదు; ప్రసవం అయిన ఒక్క రోజులోనే నా భార్య మంచులో నడవాల్సిన అవసరమూ పడేది కాదు." అన్నారు గోపాల్.

ఆరోగ్య పరిరక్షణ సౌకర్యాలు పని చేయాల్సిన విధంగా పనిచేసినట్లయితే షీలా, అనురాధలిద్దరూ జననీ శిశు సురక్షా కార్యక్రమం కింద ఏమాత్రం డబ్బు ఖర్చు పెట్టనవసరంలేని పూర్తి ఉచితమైన ఆరోగ్య సేవలు పొందగలిగివుండేవాళ్ళు. ప్రభుత్వ పథకం ద్వారా వాళ్ళు ప్రజారోగ్య సంస్థలలో సిజేరియన్ సెక్షన్‌తో సహా ఉచిత ప్రసవం వంటి ఆరోగ్య సేవలను ఉచితంగా అందుకునేవాళ్ళు. వారు మందులు, తినుబండారాలు, అనారోగ్యానికి సంబంధించిన నిర్ధారణలు (డయాగ్నస్టిక్స్), ఆహారం, అవసరమైతే రక్తం, రవాణా - ఇవన్నీ కూడా ఎటువంటి వ్యక్తిగత ఖర్చు లేకుండా పొందవచ్చు. కానీ ఈ సేవలన్నీ కాగితాలపైనే మిగిలిపోయాయి.

"మేం ఆ రాత్రి మా రెండు రోజుల వయసున్న పాపాయి గురించి చాలా భయపడ్డాం. చలికి ఆమె చనిపోయి ఉండేది." అన్నారు గోపాల్.

గ్రామీణ భారతదేశంలో, కౌమారదశలో ఉన్న బాలికలు, యువతులు మొదలైన అట్టడుగు సమూహాల జీవన పరిస్థితులను, అనుభవాలను వారి గొంతులతోనే పదిలపరచాలని, పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో, PARI మరియు కౌంటర్ మీడియా ట్రస్ట్‌లు ఈ దేశవ్యాప్త రిపోర్టింగ్ ప్రాజెక్టును చేపట్టాయి.

ఈ కథనాన్ని ప్రచురించాలనుకుంటున్నారా? అయితే [email protected] కి ఈమెయిల్ చేసి, [email protected] కి కాపీ పెట్టండి.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Jigyasa Mishra

جِگیاسا مشرا اترپردیش کے چترکوٹ میں مقیم ایک آزاد صحافی ہیں۔ وہ بنیادی طور سے دیہی امور، فن و ثقافت پر مبنی رپورٹنگ کرتی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Jigyasa Mishra
Illustration : Jigyasa Mishra

جِگیاسا مشرا اترپردیش کے چترکوٹ میں مقیم ایک آزاد صحافی ہیں۔ وہ بنیادی طور سے دیہی امور، فن و ثقافت پر مبنی رپورٹنگ کرتی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Jigyasa Mishra
Editor : Pratishtha Pandya

پرتشٹھا پانڈیہ، پاری میں بطور سینئر ایڈیٹر کام کرتی ہیں، اور پاری کے تخلیقی تحریر والے شعبہ کی سربراہ ہیں۔ وہ پاری بھاشا ٹیم کی رکن ہیں اور گجراتی میں اسٹوریز کا ترجمہ اور ایڈیٹنگ کرتی ہیں۔ پرتشٹھا گجراتی اور انگریزی زبان کی شاعرہ بھی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Pratishtha Pandya
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

کے ذریعہ دیگر اسٹوریز Sudhamayi Sattenapalli