"పాష్మీనా శాలువాలకు ఆ మృదువైన మెరుపునిచ్చేది మేమే."
శ్రీనగర్‌లోని అబ్దుల్ మజీద్ లోన్ ఇల్లంతా చిక్కులుపడిన దారపు పీచుల చెత్తతో నిండివుంది. నేలపై కూర్చొని, చేతిలో ఒక వౌచ్ (పదునైన ఇనుప పనిముట్టు) పట్టుకొని, తాజాగా నేసిన ఒక పాష్మీనా శాలువ నుండి అక్కడక్కడా విడిగా వచ్చిన దారపు పీచులను తీసేస్తున్నారు లోన్. "మేం చేసే ఈ పనిలాంటి పని ఒకటుందని చాలా తక్కువ మందికి తెలుసు," చెప్పారాయన
42 ఏళ్ళ ఈ నిపుణుడైన పనివాడు శ్రీనగర్ జిల్లాలోని నవా కదల్ వార్డులో నివసిస్తున్నారు. ఈయన అత్యంత విలువైన పాష్మీనా శాలువాల నుండి పురజ్ (పీచు లేదా దారపు పోచ)ని తీసేయడానికి వౌచ్‌ని ఉపయోగిస్తారు. ఈ పనిని పురజ్ గారీ అని పిలుస్తారు. ఒక్క శ్రీనగర్‌లోనే 200 కంటే ఎక్కువ మంది నైపుణ్యం కలిగిన పనివారు ఈ పనిని చేస్తున్నారు. గత రెండు దశాబ్దాలుగా అబ్దుల్ పురజ్ గారీ చేస్తున్నారు. ఆయన ఎనిమిది గంటల పనికి సుమారు 200 రూపాయలు సంపాదిస్తారు
అన్ని రకాల పాష్మీనా - నేసిన, రంగులు వేసిన, బుటేదారీపని చేసిన - శాలువాల కోసం పురజ్ గారీ ని మనుషులే చేస్తారు. ఈ వస్త్రానికుండే సున్నితమైన స్వభావం, చేతిపని కళాకారుల నైపుణ్యాన్ని తప్ప, ఏ యంత్రాన్నీ అనుమతించదు
పురజ్ గారీ కి వౌచ్ చాలా అవసరం. "మా సంపాదన మొత్తం వౌచ్ పైనా, దాని నాణ్యతపైనా ఆధారపడి ఉంటుంది," తన ముందు ఉన్న చెక్క మగ్గానికి గట్టిగా సాగదీసి బిగించి ఉన్న ఒక శాలువా వైపు నిశితంగా చూస్తూ చెప్పారు అబ్దుల్. "వౌచ్ లేకుండా పాష్మీనా శాలువాను శుభ్రం చేయడం మాకు కష్టం."
ఇటీవల, శ్రీనగర్‌లోని పురజ్ గార్లు వౌచ్‌లను తయారుచేసే, లేదా వాటిని తగినవిధంగా పదును పెట్టే కమ్మరిని దొరికించుకునేందుకు కష్టపడుతున్నారు. "వౌచ్‌ల కొరత కారణంగా పురజ్ గారీ కళ కనుమరుగయ్యే సమయం వస్తోంది" అని అబ్దుల్ ఆందోళనగా చెప్పారు. “నేను కూడా నా దగ్గరున్న చివరి వౌచ్‌ను ఉపయోగిస్తున్నాను. దాని పదును పోతే, ఇక నాకు పని లేకుండా పోతుంది."
అబ్దుల్ ఇంటి నుండి 20 నిమిషాల నడక దూరంలో కమ్మరి, అలీ మొహమ్మద్ అహంగర్ దుకాణం ఉంది. శ్రీనగర్ జిల్లాలోని అలీ కదల్ ప్రాంతంలో దాదాపు డజను కమ్మరి దుకాణాలు ఉన్నాయి; అలీ దుకాణం పురాతనమైన వాటిలో ఒకటి. అలీతో సహా ఏ కమ్మరి కూడా వౌచ్‌ని రూపొందించడానికి ఆసక్తి చూపడంలేదు. దాని తయారీకి వారు వెచ్చించే సమయం, శ్రమలతో పోలిస్తే, వచ్చే రాబడి ఏ మాత్రం సరిపోదని వారు అంటున్నారు.
“వౌచ్ తయారుచేయడం నైపుణ్యానికి సంబంధించిన విషయం. ఒక వౌచ్ చాలా పదునైనదిగా, అమిత నైపుణ్యంతో తయారుచేసిందిగా ఉండాలి. ఎందుకంటే అలా ఉన్నప్పుడు మాత్రమే అది పాష్మీనా శాలువా నుండి అతిచిన్న దారపు పీచులను కూడా తొలగించగలుగుతుంది," సుత్తితో కొడుతూ గొలుసురంపాన్ని ఆకారంలోకి మారుస్తున్న 50 ఏళ్ళ అలీ మాట్లాడుతూ, "నేను వౌచ్ చేయడానికి ప్రయత్నించినా, విజయం సాధించలేనని ఖచ్చితంగా అనుకుంటున్నాను" అని చెప్పారు. “ఒక్క నూర్ మాత్రమే వౌచ్ చేయడంలో నిపుణుడు,” నిశ్చయంగా చెప్పారు అలీ.
15 సంవత్సరాల క్రితం మరణించిన నూర్ మొహమ్మద్ వౌచ్‌లను తయారుచేయడంలో నిపుణుడిగా శ్రీనగర్‌లో చాలాకాలంగా పేరు పొందినవారు. శ్రీనగర్ వాణిజ్య ప్రాంతం చుట్టూ చెలామణిలో ఉన్న చాలా వౌచ్‌లు ఆయన తయారుచేసినవే. అయితే, పురజ్ గార్లు ఆందోళన చెందుతున్నది ఎందుకంటే, “నూర్ తన కొడుకుకు మాత్రమే వౌచ్ ఎలా తయారుచేయాలో నేర్పించాడు. అయితే అతని కొడుకు వీటిని తయారుచేయడానికి ఆసక్తి చూపడంలేదు. అతనికి ఇంతకంటే మంచి జీతం వచ్చే ప్రైవేట్ బ్యాంక్‌లో ఉద్యోగం ఉంది,” అని మిర్జాన్‌పురాలోని వర్క్‌షాప్‌లో పనిచేస్తున్న యువ పురజ్ గార్ ఫిరోజ్ అహ్మద్ చెప్పారు.
ఆ వర్క్‌షాప్‌లో మరో పన్నెండుమంది పురజ్ గార్ ల తో కలిసి పనిచేస్తున్న 30 ఏళ్ల ఫిరోజ్ గత రెండేళ్లుగా సరిగ్గా పదునుపెట్టని వౌచ్‌ని ఉపయోగిస్తున్నాడు. " పురజ్ గారీ లో అభివృద్ధి లేదు," అని ఆయన చెప్పారు. “నేను 10 సంవత్సరాల క్రితం ఎంత సంపాదించానో ఇప్పుడు కూడా అంతే సంపాదిస్తున్నాను."
"నేను పురజ్‌గార్‌గా పనిచేస్తున్న ఈ 40 సంవత్సరాలలో, ఈ వ్యాపారానికి కష్టంగా మారిన సమయాన్ని ఎన్నడూ చూడలేదు," అని నజీర్ అహ్మద్ భట్ చెప్పారు. “ఇరవై సంవత్సరాల క్రితం, నాకు ఒక్కో శాలువాకు 30 రూపాయలు చెల్లించేవారు. ఇప్పుడు అదే పనికి నేను 50 రూపాయలు సంపాదిస్తున్నాను." నజీర్ నైపుణ్యానికి సంవత్సరానికి కేవలం ఒక్క రూపాయి మాత్రమే ఇంక్రిమెంట్ లభిస్తుంది
శ్రీనగర్‌లోని హస్తకళలు మరియు చేనేతల విభాగం అధికారులు PARIతో పంచుకున్న నివేదిక ప్రకారం, గత దశాబ్దంలో కాశ్మీరీ శాలువాల ఎగుమతి గణాంకాలు గణనీయంగా క్షీణించడంలోనే - 2012-13లో ఉన్న 620 కోట్ల నుండి 2021-22 నాటి 165.98 కోట్ల వరకు - పురజ్ గార్ ల కష్టాలు ప్రతిబింబిస్తున్నాయి.
రెండు నెలలపాటు వరుసగా ఉపయోగించిన తర్వాత ఒక వౌచ్‌కు పదును పెట్టాల్సిన అవసరం వస్తుంది. వ్యాపారం మందకొడిగా సాగే ఇటువంటి సమయాల్లో, కొంతమంది కమ్మరులు ఈ నైపుణ్యాన్ని నేర్చుకోవడానికి సిద్ధపడతారు
" పురజ్ గార్ ల కు వౌచ్‌ను తయారుచేయడం గానీ, పదునుపెట్టడం గానీ నిజంగా తెలియదు," అని నజీర్ చెప్పారు. ఆయన కుటుంబం ఇప్పటికి మూడు తరాలుగా పురజ్ గారీ లోనే ఉన్నారు. కొందరు చదునుగా, పదునైన అంచులున్న ఆకురాయిలాంటి సాధనాన్ని ఉపయోగించి వౌచ్‌లను పదునుపెట్టడానికి ప్రయత్నిస్తారనీ, ఫలితమెప్పుడూ సంతృప్తికరంగా లేదనీ నజీర్ అంటారు.
"మేం ఎలాగోలా పని గడుపుకోవాలి," అంటారాయన
వర్క్‌షాప్‌లో నజీర్ పక్కనే కూర్చునివున్న ఆషిక్ అహ్మద్, “చూడండి, ఈ వౌచ్ కూడా పదునుగా లేదు," అంటూ తాను పట్టుకున్న వౌచ్ దంతాలను కూడా చూపించారు: “నేను ఒక రోజులో అతి కష్టమ్మీద 2-3 శాలువాలపై పని చేయగలను. ఒక రోజులో అత్యధికంగా నేను సంపాదించగలిగేది రూ. 200 మాత్రమే." మొద్దుబారిన వౌచ్‌లతో పని చేయడం వల్ల శాలువాను శుభ్రం చేయడానికి పట్టే సమయం పెరుగుతుంది. ఒక పదునైన సాధనం, అతని వేగాన్నీ, ఖచ్చితత్వాన్నీ పెంచుతుందని, ప్రతి రోజు అదనంగా రూ. 500 సంపాదించడంలో సహాయం చేస్తుందని ఆషిక్ వివరించారు
దాదాపు 40 x 80 అంగుళాల కొలత ఉన్న సాదా పాష్మీనా శాలువాలను శుభ్రం చేసినందుకు పురజ్ గార్ లు ఒక్కోదానికి రూ. 50 వరకు సంపాదించవచ్చు. స్థానికంగా ‘కానీ’గా పిలిచే బుటేదారీపని చేసిన శాలువా ద్వారా వారికి దాదాపు రూ. 200 ఆదాయం వస్తుంది.
ఈ సమస్యలలో కొన్నింటిని పరిష్కరించే ప్రయత్నంలో, రాష్ట్ర ప్రభుత్వం వారి హస్తకళలు మరియు చేనేత శాఖ కింద పురజ్ గార్ ల ను నమోదు చేయడానికి చొరవ తీసుకుంది. ఈ సంవత్సరం మార్చి-ఏప్రిల్‌లో, “ పురజ్ గార్ లు సులభంగా ఆర్థిక సహాయాన్ని పొందేందుకు రిజిస్ట్రేషన్ సహాయం చేస్తుంది” అని ఆ విభాగపు సంచాలకుడు మహమూద్ అహ్మద్ షా చెప్పారు.
రిజిస్ట్రేషన్ వలన మంచి రోజులు వస్తాయనే హామీ అలా ఉండగా, ప్రస్తుతం పురజ్‌గార్‌లు తమ పనిని కొనసాగించడానికి చాలా కష్టపడుతున్నారు
చాలామంది యువ పురజ్‌గార్‌లు తమ పని ద్వారా స్థిరమైన ఆదాయాన్ని పొందలేకపోతున్నామని ఆందోళన చెందుతున్నారు. "అవకాశాలు వచ్చినప్పుడు నేను వేరే పనిలోకి మారతాను," అని ఫిరోజ్ చెప్పారు. అతని సహోద్యోగుల్లో ఒకరు, “నేను 45 సంవత్సరాల వయస్సులో పెళ్లి చేసుకుంటున్నానని అంటే మీరు నమ్మగలరా? అతి తక్కువగా సంపాదించే పురజ్‌గార్ ని ఎవరూ పెళ్లి చేసుకోవాలనుకోరు. ఈ పనిలోంచి మారిపోవడం ఉత్తమం.” అంటున్నారు.
"అదంత సులభం కాదు," ఫయాజ్ అహ్మద్ షాలా (62), వెంటనే కలగచేసుకున్నారు. ఆయన ఆ ఇద్దరు యువ పురజ్‌గార్‌ల మాటలను శ్రద్ధగా వింటున్నారు. తనకు పన్నెండేళ్ళ వయస్సు నుండే ఈ పనిచేస్తోన్న ఫయాజ్, పురజ్‌గారీ గురించి ఒక విధమైన వ్యామోహంతో మాట్లాడారు. “నేనీ నైపుణ్యాన్ని మా తండ్రి హబీబ్-ఉల్లా షాలా నుండి వారసత్వంగా పొందాను. నిజానికి శ్రీనగర్ వాణిజ్య ప్రాంతంలోని చాలామంది పురజ్‌గార్‌లు మా నాన్న నుండే ఈ పనిని నేర్చుకున్నారు."
ముందరి అనిశ్చితులు ఎలా ఉన్నప్పటికీ, ఫయాజ్ పురజ్‌గారీ ని విడిచిపెట్టేందుకు సిద్ధంగా లేరు- "నాకు ఇతర వృత్తుల గురించిన జ్ఞానం తక్కువ," అంటూ ఆయన ఆ ఆలోచనను తోసిపుచ్చారు. ఎంతో అనుభవజ్ఞానంతో ఆయన తాను పనిచేస్తున్న సున్నితమైన పాష్మీనా శాలువా నుంచి దారపు పీచును తొలగిస్తూ, " పురజ్‌గారీ ఒక్కటే నిజంగా నాకు తెలిసిన పని" అని నవ్వుతూ చెప్పారు.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి