అప్ప‌టికే చేస్తున్న పోరాటాల‌కు తోడు పనిమారా స్వాతంత్య్ర సమరయోధులు ఇతర రంగాల పోరాటాల‌లో కూడా భాగం తీసుకోవాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. వీటిలో కొన్ని ఆంత‌రంగిక‌మైన‌వే.

అస్పృశ్యతకు వ్యతిరేకంగా గాంధీజీ ఇచ్చిన పిలుపుతో ప్రేరణ పొంది ఈ యోధులు ముందుకు న‌డిచారు.

"ఒక రోజు మేము సుమారు 400 మంది దళితులతో మా గ్రామంలోని  జగన్నాథ ఆలయంలోకి ప్ర‌వేశించాం. అది కొంద‌రు బ్రాహ్మ‌ణుల‌కు న‌చ్చ‌లేదు. కానీ కొంద‌రు మాత్రం మాకు మ‌ద్ద‌తు ప‌లికారు. బ‌హుశా అది కూడా బ‌ల‌వంతంగానే జ‌రిగింద‌ని నేన‌నుకుంటున్నాను" అని చెప్పారు చామారు. ఆ స‌మ‌యానికి అక్క‌డివారి ప‌రిస్థితి అలావుంది మ‌రి. ఆ ఆల‌యానికి గ్రామాధికారి (గౌంటియా) మేనేజింగ్ ట్ర‌స్టీ. ద‌ళితుల ఈ చ‌ర్య ఆయ‌న‌కు తీవ్ర ఆగ్ర‌హాన్ని తెప్పించింది. ఇందుకు త‌న నిర‌స‌న తెలియ‌జేస్తూ ఆయ‌న వూరు విడిచి వెళ్లిపోయాడు. అనంత‌ర కాలంలో ఆయ‌న సొంత కుమారుడే త‌న తండ్రి చ‌ర్య‌ల‌ను నిర‌సిస్తూ, త‌మ‌తో క‌లిసి ప‌నిచేశాడని చామారు చెప్పారు.

“బ్రిటిష్ వ‌స్తువుల‌కు వ్య‌తిరేకంగా జ‌రుగుతున్న పోరాటం ఉధృత‌మ‌వుతోంది. మేమంద‌రం ఖ‌ద్ద‌రు మాత్ర‌మే ధ‌రించాం. మేమే నేసేవారిమి. మా భావ‌జాల స్ర‌వంతిలో భాగ‌మ‌ది. నిజానికి మేమంతా పేద‌వాళ్లం కావ‌డం వ‌ల్ల ఖ‌ద్ద‌రు బ‌ట్ట‌లు మాకు సౌక‌ర్యంగా అనిపించాయి.”

స్వాతంత్య్ర  స‌మ‌ర యోధులంతా కొన్ని ద‌శాబ్దాల పాటు ఖ‌ద్ద‌రునే ధ‌రిస్తూ వ‌చ్చారు. కానీ, నేత‌ప‌ని చేయ‌డం ఇక సాధ్యం కాద‌ని మా వేళ్లు మొండికేశాయి. “90 ఏళ్ల వ‌య‌సులో త‌ప్ప‌నిస‌రి స్థితిలో ఇక నేత ప‌ని మానేయాల‌ని నిర్ణ‌యించుకున్నాను”, అన్నారు చ‌మారూ.

పనిమ‌రా పోరాటం 1930ల‌లో సంబ‌ల్‌పూర్‌లో కాంగ్రెస్ నిర్వ‌హించిన “శిక్ష‌ణ” కార్య‌క్ర‌మం ప్రోద్బ‌లంతో జ‌రిగింది. “దీనికి ` సేవ ` అని పేరు పెట్టారు. కానీ, సేవ కంటే మాక‌క్క‌డ జైలు జీవితాల గురించే ఎక్కువ నేర్పారు. మ‌రుగుదొడ్ల‌ను శుభ్రం చేయ‌డం, నాణ్య‌త లేని ఆహారం- ఈ విషయాల గురించి చెప్పారు. కానీ ఈ శిక్ష‌ణ ఎందుకో మాకు మొద‌లే తెలుసు. మా గ్రామం నుంచి మేము తొమ్మిదిమందిమి ఈ శిబిరానికి హాజ‌ర‌య్యాం.”

“గ్రామ ప్ర‌జ‌లు పూలు, దండ‌లు, కుంకుమ హార‌తుల‌తో మ‌మ్మ‌ల్నిసాద‌రంగా ఆహ్వానించారు. పోరాట ప్ర‌భావం ఆనాటికే అక్క‌డికి వ్యాపించి, నిండుగా గుబాళిస్తోంది.”

అంతేకాదు, ఈ నేప‌థ్యం వెనుక‌ మ‌హాత్ముని ప్ర‌భావం కూడా బాగా వుంది. ఆయ‌న స‌త్యాగ్ర‌హ పిలుపు మ‌మ్మ‌ల్ని ఉత్తేజ‌ప‌రిచింది. పేదలు, నిర‌క్ష‌రాస్యులు నూత‌న ప్ర‌స్థానానికి నాంది ప‌లకాల‌ని మాక‌క్క‌డ బోధించారు. మేమంతా అహింసా సిద్ధాంతానికి బ‌ద్ధుల‌మై వుంటామ‌ని ప్ర‌మాణం చేశాం. పనిమారా  స్వ‌తంత్ర యోధుల్లో ఎక్కువ‌మంది త‌మ జీవిత ప‌ర్యంతం ఈ నిబంధ‌న‌ను పాటించి చూపారు.

వార‌ప్ప‌టికి గాంధీని ఎప్పుడూ చూసి ఎరుగ‌రు. కానీ, ల‌క్ష‌లాదిమంది ఇత‌రుల్లాగే వారు కూడా గాంధీజీ పిలుపుకు ప్ర‌భావిత‌మై వ‌చ్చిన‌వారే. “మేము ఇక్క‌డి కాంగ్రెస్ నాయ‌కులు మ‌న్మోహ‌న్ చౌధురి, ద‌యానిధిల ప్ర‌సంగాల ప్ర‌భావాల‌కు లోనైన‌వారే”. పనిమారా  స‌మ‌ర యోధులు త‌మ తొలి జైలు అనుభవాల్ని 1942 ఆగ‌స్టుకు ముందే సాధించారు. ఆ స‌మ‌యంలోనే మేమొక ప్ర‌మాణాన్ని తీసుకున్నాం. “ఎట్టి ప‌రిస్థితుల్లోనూ (రెండ‌వ ప్ర‌పంచ‌) యుద్ధానికి వ్య‌క్తిగ‌తంగా కానీ, ధ‌న రూపేణా; ఇత‌ర ఏ రూపాల్లోనూ స‌హ‌క‌రించ‌కూడ‌ద‌ని; ఇలా స‌హ‌క‌రించ‌డ‌మంటే దేశ‌ద్రోహ‌మేన‌ని. ఇదంతా కూడా అహింసా సిద్ధాంతానికి అనుగుణం గానే జ‌ర‌గాలని. గ్రామంలోని అంద‌రూ ఇందుకు త‌మ మ‌ద్దతు తెలిపారు.

“మేము ఆరు వారాల పాటు క‌ట‌క్ జైల్లో వున్నాం. వేల‌మంది జైళ్ల‌కు త‌ర‌లివ‌స్తుండ‌డంతో బ్రిటిష్ ప్ర‌భుత్వం ఎవ‌రినీ ఎక్కువ కాలం పాటు జైల్లో నిర్బంధించ‌లేక‌పోయింది. జైలుకు వెళ్లాల‌ని త‌ప‌న ప‌డుతున్న‌వారి సంఖ్య మాత్రం బాగా పెరుగుతోంది.”

Jitendra Pradhan, 81, and others singing one of Gandhi's favourite bhajans
PHOTO • P. Sainath

జితేంద్ర ప్ర‌ధాన్ (81) త‌దిత‌రులు గాంధీజీకి ఇష్ట‌మైన‌ భ‌జ‌న‌ల్ని పాడుతున్నప్ప‌టి చిత్రం

అస్పృశ్య‌తా వ్య‌తిరేక ఉద్య‌మం మొద‌ట అంత‌ర్గ‌త ఒత్తిళ్ల‌కు లోన‌యింది. కానీ, క్ర‌మంగా ఇబ్బందులు వాటంత‌ట అవే స‌మ‌సిపోయాయి. “ఇవ్వాల్టికీ మేము మా క్ర‌తువులు చాలావాటికి బ్రాహ్మ‌ణుల‌ను పిల‌వం. ఆ ‘దేవాల‌యం లోకి ద‌ళితుల ప్ర‌వేశం’ విష‌యం మావారిలో కొంద‌రిని వేద‌న‌కు గురిచేసింది. అయితే క్విట్ఇండియా ఉద్య‌మం మొద‌ల‌య్యే స‌మ‌యానికి అంద‌రూ మాతో క‌లిసి ప‌నిచేయ‌డానికి ముందుకొచ్చారు”, అని ద‌యానిథి చెప్పారు.

`ఇక్క‌డ కులం కూడా కొంత ఒత్తిడికి గురిచేసింది. మేము జైలుకు వెళ్లొచ్చిన ప్ర‌తిసారీ మా బంధువులు, స‌న్నిహితులు, చుట్టుప‌క్క‌ల గ్రామాల ప్ర‌జ‌లు మ‌మ్మ‌ల్ని `శుద్ధి చేసుకుని` వూర్లోకి ప్ర‌వేశించ‌మ‌ని చెప్పేవారు. జైళ్ల‌లో అంట‌రానివారితో క‌లిసి వున్నాం కాబ‌ట్టి ఈ నియ‌మం త‌ప్పేది కాదు` అన్నారు మ‌నోజ్‌భాయ్‌. పి.ఎస్ః (జైలుకు వెళ్లొచ్చిన‌వారు ప‌రిశుద్ధ‌ప‌ర‌చుకోవాల‌నే నియ‌మం గ్రామీణ ఒరిస్సా లోని కొన్ని కులాల్లో ఇప్ప‌టికీ వుంది.)

భోయి మాట్లాడుతూ ... “నేను జైల్లో వున్న స‌మ‌యంలో మా అమ్మ‌మ్మ చ‌నిపోయింది. ఆమె ప‌ద‌కొండ‌వ రోజు క్ర‌తువు స‌మ‌యానికి విడుద‌లై ఇంటికి వెళ్లాను. మా మామ‌య్య అడిగాడు న‌న్ను `ప‌రిశుద్ధ‌ప‌ర‌చుకునే వ‌చ్చావా?` అని. నేను జ‌వాబిచ్చాను - `లేదు, స‌త్యాగ్ర‌హులు త‌మ కార్యాచ‌ర‌ణ‌తో ఇత‌రుల‌ను ప‌రిశుద్ధ‌ప‌రుస్తారు` అని. దాంతో న‌న్ను రెండు రోజుల‌పాటు కుటుంబ‌స‌భ్యుల‌కు దూరంగా వేరే  గ‌దిలో వుంచారు. నా భోజ‌నం కూడా ఒంట‌రి గానే చేశాను`` అని చెప్పారు.

“నా వివాహం నిశ్చ‌యం కాగానే నేను జైలుకు వెళ్లాల్సివ‌చ్చింది. జైలు నుంచి విడుద‌లై వెన‌క్కి వచ్చేస‌రికి వ‌ధువు ప‌క్షం వారు వివాహాన్ని ర‌ద్దు చేసుకున్నార‌ని తెలిసింది. జైలుకు వెళ్లొచ్చిన మ‌నిషి త‌న‌కు అల్లుడుగా ప‌నికిరాడ‌ని వ‌ధువు తండ్రి భావించార‌ట‌. ఆత‌ర్వాత ... కాంగ్రెస్ ప్రభావం బాగా వుండే సారంద‌ప‌ల్లి గ్రామానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను,” అని భోయి చెప్పారు.

***

1942 ఆగ‌స్టులో క్విట్ఇండియా ఉద్య‌మం స‌మ‌యంలో జైల్లో వున్న‌ప్పుడు చ‌మారు, జితేంద్ర‌, పూర్ణ‌చంద్ర‌ల‌కు ఈ శుద్ధ‌త‌కు సంబంధించి ఎలాంటి స‌మ‌స్య‌లూ ఎదురుకాలేదు.

“బ్రిటిష్‌వారు మ‌మ్మ‌ల్ని నేర‌స్తుల జైలుకు త‌ర‌లించారు. అక్క‌డ కూడా మేము చేయ‌గ‌లంత ప‌ని చేశాం”, అని చెప్పారు జితేంద్ర‌. ఆరోజుల్లో జ‌ర్మ‌నీతో యుద్ధం చేస్తున్న బ్రిట‌న్ త‌న కోసం చావ‌డానికి సైనికుల‌ను స‌మ‌కూర్చుకుంటోంది. దీర్థ‌కాలంగా మ‌న జైళ్ల‌లో మ‌గ్గుతున్న నేర‌స్తుల‌ను ఇందుకోసం బ్రిటిష్ ప్ర‌భుత్వం వాడుకోజూసింది. ఇందుకోసం వారికి కొన్ని వాగ్దానాలు కూడా చేసింది. యుద్ధంలో పాల్గొన‌డానికి అంగీక‌రించిన వారంద‌రికీ వంద రూపాయ‌లిస్తామ‌ని, యుద్ధం అనంత‌రం వారిని పూర్తిగా విడుద‌ల చేస్తామ‌ని హామీ ఇచ్చింది. ఫ‌లితంగా కుటుంబానికి ఐదు వంద‌ల రూపాయ‌లు ద‌క్కుతాయి.

“మేము ఆ నేర‌స్తుల‌ను క‌లిసి వివ‌ర‌ణ ఇచ్చాం. ‘కేవ‌లం ఐదు వంద‌ల రూపాయ‌ల కోసం వీరి (బ్రిటిష్‌) త‌ర‌పున‌ యుద్ధం చేయ‌డం తెలివైన ప‌నేనా?’ అని వారిని ప్ర‌శ్నించాం. యుద్ధ‌భూమిలో అడుగుపెట్ట‌గానే తొలుత చావును చూసేది మీరే అని కూడా వారిని హెచ్చ‌రించాం. మీ ప్రాణాలు వారికి విలువైన‌వేమీ కావు. ఎందుకు అన‌వ‌స‌రంగా ఉచ్చులో చిక్కుకుంటారు? అని ప్ర‌శ్నించాం.

Showing a visitor the full list of Panimara's fighters
PHOTO • P. Sainath

పనిమారా యోధులంద‌రి లిస్టునూ ఒక సంద‌ర్శ‌కుడికి చూపిస్తున్న దృశ్యం

“కొద్దికాలం త‌ర్వాత జైలు లో ఉన్నవారు మేము చెప్పేది ఆల‌కించ‌డం మొద‌లైంది. (వాళ్లు మ‌మ్మ‌ల్ని గాంధీ అనీ; ఇంకా సులువుగా కాంగ్రెస్ అనీ పిలిచేవారు). మా మాట‌ల ప్ర‌భావంతో ఖైదీలు ఈ ఒప్పందం నుంచి విరమించుకున్నారు. వారు తిర‌గ‌బ‌డ్డారు. యుద్ధ‌క్షేత్రం లోకి వెళ్ల‌డానికి నిరాక‌రించారు. అక్క‌డున్న వార్డెన్ ఈ ప‌రిణామాల ప‌ట్ల తీవ్ర అసంతృప్తిగా వున్నాడు. ‘మీరెందుకు వారినిలా రెచ్చ‌గొడుతున్నారు? ఇప్ప‌టిదాకా వారు యుద్ధ‌భూమికి వెళ్ల‌డానికి సిద్ధంగా వున్నారు. కానీ మీవ‌ల్లే ఇలా తిర‌గ‌బ‌డ‌డం నేర్చుకున్నారు,’ అన్నాడు. వారికి బ‌దులు యుద్ధానికి వెళ్ల‌డానికి మేము సిద్ధంగా వున్నామ‌ని వార్డెన్‌కి చెప్పాం. అక్క‌డేం జ‌రుగుతోందో ఇత‌ర ఖైదీల‌కూ తెలిసేలా చేశాం.

“ఆ మ‌రుస‌టి రోజే మ‌మ్మ‌ల్ని రాజ‌కీయ ఖైదీలుండే జైలుకు మార్చారు. మాకు ఆరు నెల‌ల సాధార‌ణ‌ జైలు శిక్ష ప‌డింది.”

***

అంత‌పెద్ద బ్రిటిష్ సామ్రాజ్యం ఎందుకింత‌ అన్యాయ‌మైన చర్య‌ల‌కు ఒడిగ‌ట్టింది?

“బ్రిటిష్ వారి న్యాయం ఎలా వుంటుందో న‌న్న‌డ‌గండి, నేను చెప్తా”, అన్నారు చ‌మారూ కాసింత ఎగ‌తాళి స్వ‌రంతో. నిజానికి ఆయ‌న‌ను అడ‌గాల్సిన ప్ర‌శ్న కాద‌ది. “అక్క‌డ జ‌రిగేదంతా అన్యాయ‌మే”, అన్నారు చ‌మారూ న‌వ్వుతూ.

“మ‌నం బ్రిటిష్ వారికి బానిస‌లం. వారు మ‌న ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను చిన్నాభిన్నం చేశారు. మన ప్ర‌జ‌ల‌కు హ‌క్కుల్లేవు. మ‌న వ్య‌వ‌సాయం విధ్వంస‌మ‌వుతోంది. జ‌నం భ‌యంక‌ర‌మైన పేద‌రికం లోకి కూరుకుపోయారు. 1942 జులై, సెప్టెంబ‌ర్ నెల‌ల మ‌ధ్య‌న ... 400 కుటుంబాల్లో కేవ‌లం ఐదు నుంచి ఏడు కుటుంబాలకు మాత్ర‌మే తినేందుకు కావ‌ల్సినంత ఆహార‌ముంది. మిగిలిన‌వారంతా ఆక‌లినీ, అవ‌మానాల‌నీ భ‌రించాల్పివ‌చ్చింది.”

“ఇవ్వాళ్టి పాల‌కులు కూడా గ‌త పాల‌కుల‌కేమీ తీసిపోరు. ప్ర‌జ‌ల్ని దోచుకోవ‌డంలో వీరికెలాంటి సిగ్గూ లేదు. గుర్తుంచుకోండి, నేను ప్ర‌స్తుత కాలాన్ని బ్రిటిష్ వ్య‌వ‌స్థ‌తో పోల్చ‌డం లేదు. కానీ ఇప్ప‌టి ప‌రిస్థితి కూడా భయంక‌రం గానే వుంది.”

* * *

పనిమ‌రా స‌మ‌ర యోధులు ఇవ్వాళ్టికీ ప్ర‌తి ఉద‌యం జ‌గ‌న్నాథ ఆల‌యానికి వెళ‌తారు. 1942 దాకా ఆ ఆల‌యంలో వున్న పెద్ద ఢంకా (నిసాన్‌)ను ఒక తెల్ల‌వారుజామున వారే మోగిస్తారు. దాని ఘంటారావం కొన్ని కిలోమీట‌ర్ల వ‌ర‌కూ వినిపిస్తుందట.

ప్ర‌తి శుక్ర‌వారం సాయంత్రం 5.17 నిముషాల‌కు ఈ స‌మ‌ర యోధులు ఒక్క‌చోట‌న క‌లుస్తారు. ఇందుకు కార‌ణం - గాంధీజీని హ‌త్య‌చేసినది శుక్ర‌వారం సాయంత్రం 5.17 నిముషాల‌కే. ఈ సంప్ర‌దాయం గ‌త 54 ఏళ్లుగా ఈ గ్రామంలో నిరంత‌రం కొన‌సాగుతోంది.

ఈరోజు ఆదివారం. అంద‌రూ గ‌తించిపోగా మిగిలిన ఏడుగురు స‌మ‌ర‌యోధుల్లోని మేము న‌లుగురం - చ‌మారూ, ద‌యానిధి, మ‌ద‌న్‌, జితేంద్ర‌ క‌లిసి ఆల‌యానికి వెళ్తున్నాం. మిగిలిన ముగ్గురు - చైత‌న్య‌, చంద్ర‌శేఖ‌ర్ సాహు, చంద్ర‌శేఖ‌ర్ ప‌రీదాలు వూర్లో లేరు.

The last living fighters in Panimara at their daily prayers
PHOTO • P. Sainath

వారి రోజువారీ పూజ‌ల్లో జీవిత చరమాకం లో ఉన్న పానిమారా పోరాట యోధులు

ఆల‌య‌మంతా జ‌నంతో, పూజ‌ల తాలూకు పొగ‌ల‌తో నిండిపోయి వుంది. ఎవ‌రో గాంధీజీకి ఇష్ట‌మైన కీర్త‌న పాడుతున్నారు. చ‌మారూ చెప్తున్నాడు - 1948లో మ‌హాత్మాగాంధీ హ‌త్య వార్త తెలియ‌గానే ఈ గ్రామంలోని చాలామంది ప్ర‌జ‌లు గుండ్లు గీయించుకున్నారు. త‌మ తండ్రే మ‌ర‌ణించినట్లుగా అనుభూతి చెందారు. ఇవ్వాళ్టికీ ఇక్క‌డ చాలామంది శుక్ర‌వారం రోజు ఉప‌వాసం చేస్తారు.

కొంత‌మంది పిల్ల‌లు బ‌హుశా ఉత్సుక‌తతో ఆ చిన్న‌ ఆల‌యంలో తిరుగుతున్నారు. త‌రాలు మారుతున్నాయి కాబ‌ట్టి వారికి తెలియ‌క‌పోవ‌చ్చు కానీ, ఈ గ్రామానికి త‌న‌కంటూ చ‌రిత్ర‌లో ఒక  స్థాన‌ముంది. త‌న‌కంటూ ఒక హీరోయిజం వుంది. స్వాతంత్య్రపు వెలుతురును చిరంజీవిగా వుంచుకోవాల్సిన బాధ్య‌త‌ను గ్రామం గుర్తుచేస్తుంటుంది.

పనిమారా స‌న్న‌కారు రైతులు నివ‌సించే గ్రామం. “ఇక్క‌డ వంద‌కు పైగా కుల్తా (వ్య‌వ‌సాయ కులం) కుటుంబాలున్నాయి. సుమారు 80 మంది ఒరియావారున్నారు. వీరూ రైతులే. ఇక దాదాపు 50 సౌరా ఆదివాసీ కుటుంబాలు; ప‌ది విశ్వ‌బ్రాహ్మ‌ణ కుటుంబాలున్నాయి. గౌడ (యాద‌వ‌) సామాజిక‌వ‌ర్గానికి చెందిన కుటుంబాలు కూడా కొన్నున్నాయి”, అని చెప్పారు ద‌యానిధి.

ఇదీ క్లుప్తంగా గ్రామం గురించి. స‌మ‌ర‌యోధుల కుటుంబాల‌లో ఎక్కువ‌భాగం వ్య‌వ‌సాయ‌దారుల కులాల‌వారే వుంటారు. “కులాంతర వివాహాలు మాలో చాలా త‌క్కువే. కానీ, స్వ‌తంత్ర పోరాట కాలం నుంచీ ఇప్ప‌టిదాకా అంద‌రి మ‌ధ్యా మంచి సంబంధాలే వున్నాయి. గుడిలో అంద‌రికీ ప్ర‌వేశం ఇంకా కొన‌సాగుతూనేవుంది. అంద‌రి హ‌క్కుల‌కూ గౌర‌వం ల‌భిస్తోంది”, అని వివ‌రించారు ద‌యానిధి.

అయితే, ఇక్క‌డ కూడా త‌మ‌కు స‌రైన గుర్తింపు లేద‌ని భావించేవారు కూడా కొంద‌రున్నారు. దిబిత్యా భోయి అందులో ఒక‌రు. ``చిన్న కుర్రాడిగా వున్న‌ప్పుడే బ్రిటిష్ వాళ్లు న‌న్ను దారుణంగా కొట్టారు. అప్పుడు నా వ‌య‌సు నిండా ప‌ద‌మూడు కూడా వుండ‌దు`` అన్నారాయ‌న‌. అయితే, ఆయ‌న ఎప్పుడూ జైలుకు వెళ్ల‌క‌పోవ‌డంతో ఆయ‌న పేరు అధికారికంగా స‌మ‌ర‌యోధుల లిస్టులో లేదు. ఇలాగే మ‌రికొంద‌రు కూడా బ్రిటిష్‌వారిపై పోరాడి దెబ్బ‌లు తిన్న‌ప్ప‌టికీ, జైలుకు వెళ్ల‌క‌పోవ‌డం కార‌ణంగా వారి పేర్లు కూడా లిస్టులో లేకుండా పోయాయి.

స‌మ‌ర‌యోధుల పేర్లు చెక్కించిన స్తంభం మీద కూడా 1942లో జైలుకు వెళ్లిన‌వారి పేర్లే వున్నాయి. అయితే ఇవ్వాళ్టికి కూడా ఎవ‌రూ త‌మ పేర్లు స్తంభం మీద లేవ‌ని బాధ‌ప‌డ‌లేదు. దీనికి సంబంధించి ఎలాంటి వివాద‌మూ త‌లెత్త‌లేదు. స‌మ‌ర‌యోధుల రికార్డుల‌లో త‌మ పేర్లు చేర్చ‌క‌పోవ‌డం వ‌ల్ల త‌మ‌కు గుర్తింపు ద‌క్క‌లేద‌నే కొద్దిపాటి చింత మాత్రం కొంద‌రికి వున్న‌ట్టు అర్థ‌మ‌వుతుంది.

ఆగ‌స్టు 2002. అర‌వై ఏళ్ల త‌రువాత పనిమారా  స‌మ‌ర‌యోధులు మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చారు.

మిగిలిన ఏడుగురు స‌మ‌ర‌యోధుల్లో బాగా పేద‌వాడైన మ‌ద‌న్ భోయికి కేవ‌లం అరఎక‌రం భూమి మాత్ర‌మే వుంది.  ఆయ‌న‌తో పాటు మిగిలిన యోధులు క‌లిసి సోహెలా టెలిఫోన్ ఆఫీసు బ‌య‌ట ధ‌ర్నాకు కూర్చున్నారు. స్వాతంత్య్రం వ‌చ్చి ఇన్ని ద‌శాబ్దాలైనా త‌మ గ్రామానికి టెలిఫోన్ స‌దుపాయం క‌ల్పించ‌క‌పోవ‌డంపై వారు ఆందోళ‌న నిర్వ‌హించారు.

అక్క‌డి ఎస్‌డీఓ (స‌బ్‌-డివిజ‌న‌ల్ ఆఫీస‌ర్) అస‌లు త‌మ గ్రామం పేరే ఎప్పుడూ విన‌లేద‌ని చెప్పాడంటూ న‌వ్వాడు మ‌ద‌న్ భోయి. “ఇదెలా వుందంటే - మీరు బార్ఘా వెళ్లారంటే దైవాన్ని దూషించిన‌ట్లే అనే సామెత‌లా వుంది. అయితే, హాస్యాస్ప‌ద విష‌యం ఏమిటంటే ఈసారి పోలీసులు జోక్యం చేసుకున్నారు.”

ఈ స‌మ‌రయోధుల గురించి బాగా తెలిసిన స్థానిక పోలీసులు ఎస్‌డిఓ నిర్ల‌క్ష్యం కార‌ణంగా జోక్యం చేసుకోవాల్సివ‌చ్చింది. 80 ఏళ్ల వ‌య‌సులో ధ‌ర్నా కు కూర్చున్న వీరి ఆరోగ్యాల‌పై పోలీసులు కంగారుప‌డ్డారు. వారు వెంట‌నే ఒక డాక్ట‌ర్‌, మెడిక‌ల్ సిబ్బంది, త‌దిత‌రులను పిలిపించారు. అప్ప‌టికి దిగివ‌చ్చిన టెలిఫోన్ సిబ్బంది సెప్టెంబ‌ర్ 15 లోగా గ్రామంలో టెలిఫోన్ స‌దుపాయం ఏర్పాటు చేస్తామ‌ని హామీ ఇచ్చారు. చూద్దాం ఏం జ‌రుగుతుందో!

రెండ‌వ ద‌శ పోరాటంలో కూడా పనిమారా స‌మ‌ర‌యోధులు త‌మ కోసం కాకుండా, ప్ర‌జ‌లంద‌రి కోసం పోరాటానికి దిగారు.  ఎప్ప‌టికైనా ఈ యోధుల్లో ఏ ఒక్క‌రైనా త‌మ‌ వ్య‌క్తిగ‌త అంశాల‌పై పోరాటానికి దిగుతార‌ని భావించ‌గ‌ల‌రా?

`స్వేచ్ఛ‌` అన్నాడు చ‌మారూ.

మీకూ, మాకూ!

ఈ వ్యాసం (రెండు భాగాలలో రెండవది) మొదట ది హిందూ సండే మ్యాగజైన్ లో 27 అక్టోబరు 2002 న ప్రచురించారు. మొదటి భాగం 20 ఆక్టోబర్ 2002 న ప్రచురించారు.

ఫోటోలు : పి సాయినాథ్

ఈ వరసలో ఇంకొన్ని శీర్షికలు :

సాలిహాన్ రాజ్ మీద ఎదురుదాడి చేయగా

పనిమారా స్వాతంత్య్ర క్షేత్ర యోధులు -1

లక్ష్మి పాండా ఆఖరి పోరాటం

తొమ్మిది దశాబ్దాల అహింస

గోదావరి: దాడి కై ఎదురుచూస్తున్న పోలీసులు

షేర్పూర్ : గొప్ప త్యాగం, గుర్తులేని జ్ఞాపకం

సోనాఖాన్ : వీర్ సింగ్ రెండు సార్లు మరణించాడు

కల్లియస్సేరి : యాభైల్లో కూడా వీడని పోరాటం

కల్లియస్సేరి : సుముకన్ కోసం వెతుకే ఒక ప్రయత్నం

అనువాదం: సురేష్ వెలుగూరి

پی سائی ناتھ ’پیپلز آرکائیو آف رورل انڈیا‘ کے بانی ایڈیٹر ہیں۔ وہ کئی دہائیوں تک دیہی ہندوستان کے رپورٹر رہے اور Everybody Loves a Good Drought اور The Last Heroes: Foot Soldiers of Indian Freedom کے مصنف ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز پی۔ سائی ناتھ
Translator : Suresh Veluguri

Suresh Veluguri is one of the first generation Technical Writers in India. A senior journalist by profession. He runs VMRG international, an organisation that offers language services.

کے ذریعہ دیگر اسٹوریز Suresh Veluguri