ప్రవీణ్ కుమార్ స్కూటర్ మీద తన క్రచెస్ తో కూర్చొని, ఒక చేతిలో బ్రష్ ఉంచుకొని తన చుట్టూ ఉన్నవారితో మాట్లాడుతున్నారు. ఆ పక్కనే అతను చిత్రించిన 18 అడుగుల పొడవున్న ఒక పెద్ద కాన్వాస్ లో రైతుల నిరసన చిత్రాలున్నాయి.
ప్రవీణ్ లూధియానా లో ఆర్ట్ టీచర్ మరియు ఆర్టిస్ట్.ఆయన లూథియానా నుండి సింగుకు 300 కిలోమీటర్లు ప్రయాణించి జనవరి 10 న హర్యానా- ఢిల్లీ సరిహద్దు వద్ద ఉన్న నిరసన స్థలానికి చేరుకుని తన సహకారం అందిస్తానని గట్టిగా చెప్పారు.
“నేను పబ్లిసిటీని కోరుకోవట్లేదు, దేవుడు నాకు చాలా ఇచ్చాడు. ప్రచారం కావాలని నాకు ఆరాటమూ లేదు. నేను ఇప్పుడు ఈ ఆందోళనలో ఒక భాగమేననే సంగతి నాకు సంతోషం కలిగించే విషయం , ”అని ఆయన చెప్పారు.
"నేను 70 శాతం వికలాంగుడిని," ఆయన తన కాలును చూపించారు. ఆయనకి మూడు సంవత్సరాల వయస్సులో పోలియో సోకింది. ఆ ఇబ్బంది కానీ, ఈ ప్రయాణం పట్ల అతని కుటుంబం మొదట్లో చూపిన అయిష్టత కానీ, అతని ప్రయాణాన్ని ఆపలేకపోయాయి.
ప్రవీణ్, 43, లుధియానాలో పెద్ద కాన్వాస్ పెయింటింగ్ ప్రారంభించారు. ఆ పెయింటింగ్ ని తనతో పాటుగా సింఘు వద్దకు తీసుకువచ్చారు. అక్కడ నిరసనకారుల మధ్య ఒక వీధిలో కూర్చుని అది పూర్తి అయ్యేవరకు అతను తన పనిని కొనసాగించారు.
రాజధాని నగర సరిహద్దులోని సింఘు మరియు ఇతర నిరసన ప్రదేశాలలో, లక్షలాది మంది రైతులు మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ చట్టాలను మొదట జూన్ 5, 2020 న ఆర్డినెన్స్‌లుగా జారీ చేశారు, తరువాత సెప్టెంబర్ 14 న పార్లమెంటులో వ్యవసాయ బిల్లులుగా ప్రవేశపెట్టారు మరియు ఆ నెల 20 నాటికి చట్టాలుగా తీసుకొచ్చారు.
నిరసన వ్యక్తం చేసిన రైతులు ఈ చట్టాలు చాలా హాని చేస్తాయని చెప్పారు - రైతు ఉత్పత్తి వాణిజ్యం (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) చట్టం , 2020; రైతుల (సాధికారత మరియు రక్షణ) ధర భరోసా మరియు వ్యవసాయ సేవల చట్టంపై ఒప్పందం. 2020; మరియు ఎసెన్షియల్ కమోడిటీస్ (సవరణ) చట్టం, 2020. భారతీయ రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ను బలహీనం చేస్తూ, పౌరులందరికీ చట్టబద్దమైన హక్కును నిలిపివేస్తున్నందున ఈ చట్టాలు ప్రతి భారతీయుడిని ప్రభావితం చేస్తాయని విమర్శించారు.
ఈ చట్టాల నేపథ్యంలో అనుసరించిన నిరసనల దశలను ప్రవీణ్ చిత్రాలు కళ్ళకు కడతాయి. కాన్వాస్ లోఈ ఆందోళన యొక్క ఎపిసోడిక్ చిత్రణ - రైతులు రైల్వే ట్రాక్‌లను అడ్డుకోవడం ప్రారంభించిన రోజు నుండి, కన్నీటి వాయువు మరియు నీటి ఫిరంగులను ఎదుర్కొన్న కాలం నుండి, నేటి వరకు, వారు సంకల్ప బద్ధులై ఉన్నారని తెలియజెప్పే చిత్రాలున్నాయి.
అతను కాన్వాస్‌పై చాలా కష్టపడి పనిచేశారు. దానిని మరింత విస్తరించాలని అనుకుంటున్నారు. నిరసన విజయవంతం కావడానికి మరియు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడానికి “నేను దీన్ని ఆఖరు వరకు కొనసాగించాలని అనుకుంటున్నాను” -.అంటున్నారు ప్రవీణ్.
అనువాదం - అపర్ణ తోట