“వ్యవసాయంలో సంక్షోభం అంటూ ఏమీ ఉండదు.”

ఈయన దర్శన్ సింగ్ సంఘేరా – పంజాబ్‌లో శక్తివంతమైన సంస్థల్లో ఒకటైన అర్థియాస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు; ఆ సంస్థ బర్నాలా జిల్లా చాప్టర్ అధినేత. అర్థియాలు రైతులకూ, వారి ఉత్పత్తుల కొనుగోలుదారులకూ మధ్య ఉండే దళారులు. రైతులు పండించిన పంటను వేలం వేసి, కొనుగోలుదారులకు అందజేసే ఏర్పాట్లు చేస్తుంటారు. ఈ వ్యాపారంలో సుదీర్ఘ అనుభవం ఉన్న వీళ్ళు వడ్డీ వ్యాపారులు కూడా. ఇటీవలి కాలంలో, పెట్టుబడి డీలర్లుగా కూడా అవతారమెత్తారు. వీటన్నిటి అర్థం: ఈ రాష్ట్ర రైతులపై వీళ్ళకు గొప్ప పట్టు ఉందని.

ఆర్థియాలు రాజకీయంగా కూడా శక్తివంతులు. శాసనసభ సభ్యులను వీళ్ళు తమ సోదరులుగా లెక్కిస్తారు. గతేడాది జులైలో, ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌ను “ఫఖ్ర్-ఎ-క్వామ్” ('సామాజికవర్గానికే గర్వకారణం') అనే బిరుదుతో వీళ్ళు సత్కరించారు. దీనిని ఒక “ఘన సత్కారపు వేడుక”గా స్థానిక మీడియా వర్ణించింది. రైతులు ఆర్థియాల కు ఉన్న బాకీలను మాఫీ చేయడం కష్టమని ముఖ్యమంత్రి ప్రకటించిన వెంటనే, ఆయన గౌరవార్థం ఆర్థియాలు చేపట్టిన కార్యక్రమం అది.

“గ్రామీణ పంజాబ్‌లోని రైతులపై, వ్యవసాయ కూలీలపై ఋణభారం ” అనే ఒక అధ్యయనం ప్రకారం, 86 శాతం రైతు కుటుంబాలు, 80 శాతం వ్యవసాయ కార్మిక కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. ఋణ మొత్తంలో ఐదోవంతు కమిషన్ ఏజెంట్లకు, వడ్డీ వ్యాపారులకు చెల్లించాలని పటియాలాలోని పంజాబీ యూనివర్శిటీలో పరిశోధకులుగా పనిచేస్తున్న ఈ అధ్యయన రచయితలు తెలిపారు. ఈ అప్పుల బాధ రైతుల్లో ఆందోళనను కలిగిస్తోంది; చిన్న, సన్నకారు రైతులపైనే ఈ భారం ఎక్కువగా ఉంది. ఈ అధ్యయనంలో భాగంగా 1,007 రైతులతో, 301 వ్యవసాయ కార్మిక కుటుంబాలతో పరిశోధకులు మాట్లాడారు. 2014-15లో, దీనికి సంబంధించిన క్షేత్రస్థాయి సర్వేలు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో జరిగాయి. ఇదే సమయంలో, పెరుగుతున్న ఋణభారం, దిగజారుతున్న రైతు పరిస్థితులపై అనేక అధ్యయనాలు జరిగాయి.

వ్యవసాయ రంగంలోని కష్టాలను కొట్టిపారేస్తూ, “అనవసరంగా పెట్టే ఖర్చులే రైతుని ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయి. ఉత్పాదకాలు కొనుగోలు చేయడానికి మేం తనకి డబ్బు సహాయం చేస్తాం; పెళ్లిళ్లు, వైద్యం, ఇతర ఖర్చుల కోసం కూడా. పంట చేతికి రాగానే, అతను ఆర్థియా కు అప్పగిస్తాడు. మేం ఆ పంటను శుభ్రం చేసి, గోతాలకు ఎత్తి, మార్కెట్లో అమ్మడానికి తగిన చర్యలు చేపడతాం; అలాగే ప్రభుత్వం, బ్యాంకుల వ్యవహారాలు చూస్తాం,” అని దర్శన్ సింగ్ సంఘేరా వివరించాడు. ఇలా సేకరించిన గోధుమలు, వరి పంటల మొత్తం విలువలో, 2.5 శాతాన్ని ప్రభుత్వం ఈ ఏజెంట్లకు చెల్లిస్తుంది. వీళ్ళ అధికార కార్యకలాపాలన్నిటినీ పంజాబ్ రాష్త్ర వ్యవసాయ మార్కెటింగ్ బోర్డు సమీక్షిస్తుంది. ఈ దళారీల ద్వారానే రైతులకు చెల్లింపులు జరుగుతాయి. ఇది ఈ ఆర్థియాల కు వడ్డీ వ్యాపారం నుండి వచ్చే ఆదాయానికి అదనం.

A Punjabi farmer in the field
PHOTO • P. Sainath

మాన్సాకు చెందిన ఒక వ్యవసాయ కూలీ; పంజాబ్‌లోని రైతులు, వ్యవసాయ కూలీలు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఆ ఋణ మొత్తంలో ఐదోవంతు ఆర్థియాలకు చెల్లించాలి

అదే బ్లాక్‌లో ఉన్న జోధ్‌పూర్ గ్రామాన్ని సందర్శించిన తర్వాత, బర్నాలా పట్టణంలోని సంఘేరాకు చెందిన గ్రెయిన్ మార్కెట్ కార్యాలయానికి వెళ్ళాం. తమ బంధువులైన బల్జీత్ సింగ్, అతని తల్లి బల్బీర్ కౌర్‌లు ఒక గంట వ్యవధిలోనే ఒకరి తర్వాత ఒకరు 2016, ఏప్రిల్ 25న అక్కడ బహిరంగంగా ఆత్మహత్య చేసుకున్నారని రంజిత్, బల్వీందర్ సింగ్‌లు తెలిపారు. “ఆ కుటుంబానికి చెందిన రెండెకరాల భూమిని అటాచ్ చేయడానికి కోర్టు ఆదేశాలతో, దాదాపు వందమంది పోలీసులతో వచ్చిన ఆర్థియా ప్రయత్నాన్ని వాళ్ళు ప్రతిఘటిస్తూ చనిపోయారు,” అని బల్వీందర్ గుర్తు చేసుకున్నారు. "అంతేకాకుండా, స్థానిక అధికారులు, ఆర్థియాలకు చెందిన అనేక మంది గూండాలు..." ఇట్లా దాదాపు 150 మంది వ్యక్తులు ఆ కుటుంబానికి చెందిన రెండు ఎకరాల భూమిని అటాచ్ చేయడానికి వచ్చారు!

“దాదాపు 450 ఇళ్ళున్న ఈ ఒక్క జోధ్‌పూర్ గ్రామంలో కేవలం 15-20 కుటుంబాలు మాత్రమే అప్పులేమీ లేనివి. ఆర్థియాల దగ్గర చేసిన అప్పుల వల్ల రైతులు తమ భూములు కోల్పోతున్నారు.” అని బల్వీందర్ తెలియజేశారు.

ఆర్థియాల కూ, రైతులకూ మధ్య సంబంధాలు అంత చెడ్డగా ఏం లేవు. అలాగే వ్యవసాయంలో కూడా ఎలాంటి సంక్షోభం లేదు. ఉదాహరణకి, నాకు వారసత్వంగా కేవలం ఎనిమిది ఎకరాలు వచ్చాయి. ఇప్పుడు నా దగ్గర 18 ఎకరాలు ఉన్నాయి. కొన్నిసార్లు మీడియా సమస్యలను భూతద్దంలో చూపిస్తుంది. ప్రభుత్వం ఆత్మహత్యలకు ఇచ్చే పరిహారం రైతులను ఆత్మహత్యలు చేసుకునేలా మరింత ప్రోత్సహిస్తుంది. ఒక కుటుంబానికి పరిహారం అందితే, అది ఇతరులకు స్ఫూర్తినిస్తుంది. ఈ నష్ట పరిహారం చెల్లించడం ఆపితే, ఆత్మహత్యలు అవే ఆగిపోతాయి.” అని సంఘేరా అభిప్రాయపడ్డాడు.

అతని దృష్టిలో రైతుల హక్కుల రక్షణ కోసం నిలిచే సంఘాలే అసలైన ప్రతినాయకులు. అందులోనూ అత్యంత దారుణమైన నేరస్తుడు, భారతీయ కిసాన్ యూనియన్ (డకౌందా). ఈ ప్రాంతంపై బికెయు (డి)కి ఉన్న పట్టును సడలించడం అంత సులువు కాదు. ఆర్థియాలు తుపాకులతో తిరిగే గూండాలను వెంటేసుకొచ్చినప్పుడు కూడా, భూములను అటాచ్ చేయడాన్నీ, కబ్జాలనూ నిరోధించడానికి ఈ సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు!

చాలా మంది ఆర్థియాల దగ్గర ఆయుధాలు ఉన్నాయని సంఘేరా అంగీకరించాడు. “కానీ, అవి ఆత్మరక్షణకై ఉపయోగిస్తాం. పెద్ద మొత్తం డబ్బుతో వ్యవహరించేటప్పుడు, భద్రత అవసరమే కదా? తొంభై తొమ్మిది శాతం మంది రైతులు మంచి వ్యక్తులని గుర్తుంచుకోండి,” కానీ సమస్యాత్మకంగా మారిన ఆ ఒక్క శాతం వల్లే ఆర్థియాల కు ఎల్లవేళలా సాయుధ భద్రత అవసరమైంది! సంఘేరా దగ్గర కూడా తుపాకీ ఉంది. “పంజాబ్‌లో మిలిటెన్సీ ప్రబలంగా ఉన్నప్పుడు నాకీ తుపాకీ అవసరమైంది.” అని అతను వివరించాడు.

మరోవైపు, అప్పుల వల్ల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. 2000-2015 మధ్య కాలంలో 8,294 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని వ్యవసాయానికి సంబంధించిన ఆత్మహత్యలపై గత సంవత్సరం విధానసభ కమిటీ ముందు ప్రవేశపెట్టిన ఒక అధ్యయనం పేర్కొంది. పంజాబ్‌లో రైతుల, రైతు కూలీల ఆత్మహత్యలు అనే నివేదిక ప్రకారం, 6,373 మంది వ్యవసాయ కూలీలు కూడా అదే సమయంలో ఆత్మహత్య చేసుకున్నారు. అది కూడా రాష్ట్రంలోని 22 జిల్లాల్లోని ఆరింటిలోనే ఇవి నమోదయ్యాయని ఆ నివేదికను సమర్పించిన లూధియానాలోని పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ (పిఎయు)కి చెందిన పరిశోధకులు తెలిపారు. ఈ మొత్తం ఆత్మహత్యలలో, 83 శాతం ఆత్మహత్యలకు కారణం అప్పులే అని రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ అధ్యయనంలో తేలింది.

A man sitting on a bed in an orange turban
PHOTO • P. Sainath

రైతుల ఆత్మహత్యల్లో సగానికి సగం నిజమైనవి కావని మాజీ పోలీసు కూడా అయిన ఆర్థియా తేజా సింగ్ వాదిస్తున్నాడు

ఎవ్వరూ నిస్సహాయతకులోనై ఆత్మహత్యలు చేసుకోవడం లేదని తేజా సింగ్ వాదించాడు. "గత పదేళ్ళుగా వ్యవసాయం బాగా సాగుతోంది. నిజానికి ఆర్థియాలు వడ్డీ రేట్లను కూడా తగ్గించారు." నెలకు 1 శాతం (సంవత్సరానికి 12 శాతం) మాత్రమే తీసుకుంటున్నామని అతను చెప్పాడు. అయితే, వడ్డీ రేటు 1.5 శాతం (ఏడాదికి 18 శాతం) లేదా అంతకంటే ఎక్కువగానే ఉంటోందని దాదాపు ప్రతీ గ్రామంలోని రైతులు చెప్పారు. జోధ్‌పూర్‌లో ప్రజలందరూ చూస్తుండగానే తల్లీ కొడుకులు ఆత్మహత్య చేసుకున్న సంఘటనకు సంబంధించిన ఆర్థియా మరెవరో కాదు, ఈ తేజా సింగే. “ఈ రైతు ఆత్మహత్యల్లో 50 శాతం మాత్రమే నిజమైనవి.” ఎగతాళిగా అన్నాడు తేజాసింగ్.

అయినప్పటికీ, అతను ఆర్థియాల రాజకీయాల గురించి ఎటువంటి దాపరికం లేకుండా మాట్లాడాడు. అవును, మాలో చాలా వర్గాలున్నాయి. "కానీ ఏ పార్టీ అధికారంలోకి వస్తే, ఆ పార్టీ సభ్యుడు మా అసోసియేషన్ అధ్యక్షుడవుతాడు.” ప్రస్తుతం, రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ సభ్యడు. ఎన్నికలకు ముందు అకాలీ మనిషి ఉండేవాడు. ఇదిలా ఉంటే, అందరూ అనవసరంగా కమిషన్ ఏజెంట్లను దూషిస్తున్నారని తేజా సింగ్ కొడుకు జస్‌ప్రీత్ సింగ్ అభిప్రాయపడ్డాడు: “మాదీ అందరి లాంటి వృత్తే. కానీ మాకు అన్యాయంగా చెడ్డ పేరు వచ్చింది. ఆ (జోధ్‌పూర్) కేసు తర్వాత, దాదాపు 50 మంది ఆర్థియాలు వ్యాపారం వదిలేశారు.” అన్నాడతను.

అయితే, జస్‌ప్రీత్ మీడియాను మాత్రం మెచ్చుకున్నాడు. “స్థానిక ప్రెస్ మాకు చాలా సహకరించింది. మీడియాపై మాకు నమ్మకముంది. మేం వారి ఋణాన్ని తీర్చుకోలేం. మాకు అనుకూలమైన కవరేజీ కోసం మేం ఎవరికీ డబ్బు ఇవ్వలేదు కానీ, హిందీ పత్రికలు మమ్మల్ని రక్షించాయి (జోధ్‌పూర్ సంఘటన తర్వాత వారిపై క్రిమినల్ కేసులు పెట్టినప్పుడు). ఊహించిన దానికంటే ముందే మాకు హైకోర్టు బెయిలు మంజూరు చేసింది.” వ్యాపారవర్గాలకు మద్దతుగా ఉండడం ద్వారా హిందీ మీడియా తమకి అండగా నిలిచిందనీ, పంజాబీ మీడియా మాత్రం భూస్వామ్య వర్గాలకు అనుగుణంగా నడుస్తోందనీ అతని అభిప్రాయం.

అక్టోబర్ 2017లో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఋణమాఫీ చాలా అస్పష్టంగా, పరిమితంగా, షరతులతో కూడి ఉంది. సహకార, ప్రభుత్వ రంగ లేదా ప్రైవేట్ రంగ బ్యాంకులకు రైతులు చెల్లించాల్సిన ఋణాలకు మాత్రమే ఇది వర్తించింది, అది కూడా చాలా పరిమితంగా. వ్యవసాయ ఋణాలను పూర్తిగా మాఫీ చేస్తానని, పంజాబ్ సెటిల్మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇన్‌డెబిటెడ్‌నెస్ యాక్ట్-2016ని మరింత “సమగ్రంగా, ప్రభావవంతంగా” ఉండేలా సవరిస్తామని 2017 ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కానీ, ఆర్థియాల దగ్గర రైతులు చేసిన రూ.17,000 కోట్ల అప్పులో ఇప్పటి వరకూ ఒక్క పైసా కూడా ప్రభుత్వం మాఫీ చేయలేదు!

“రైతుల ఉత్పత్తులకు కమిషన్ ఏజెంట్ల ద్వారా డబ్బు చెల్లించే వ్యవస్థను రద్దు చేయాల"ని 2010లో జరిగిన ఒక అధ్యయనం సిఫారసు చేసింది. కమిషన్ ఏజెంట్ సిస్టమ్ ఇన్ పంజాబ్ అగ్రికల్చర్ పై పిఎయు, లూధియానా పరిశోధకులు చేసిన ఈ అధ్యయనంలో, "రైతుల ఉత్పత్తుల సేకరణపై వారికే నేరుగా డబ్బు చెల్లించాలని" పిలుపునిచ్చింది.

కమిషన్ ఏజెంట్ల, రైతుల కథ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కానీ, ఇక్కడే ఒక అసాధారణ విషయం ఉంది. ఇతర ప్రదేశాల్లో ఉన్నట్టు, దర్శన్ సింగ్ సంఘేరా, తేజా సింగ్ లాంటి చాలామంది బనియా లేదా వేరే వ్యాపార కులాలకు చెందినవారు కారు. వారు జాట్ సిక్కులు. జాట్‌లు వాణిజ్య రంగంలోకి ఆలస్యంగా ప్రవేశించినా బాగా నిలదొక్కుకున్నారు. ప్రస్తుతం పంజాబ్‌లో ఉన్న47,000 మంది ఆర్థియాల లో, 23,000 మంది జాట్‌లు. “నగరాల్లో మాది అంత పెద్ద సమూహమేమీ కాదు. నేను 1988లో ఈ వ్యాపారంలోకి వచ్చాను. ఓ దశాబ్దం తర్వాత, ఈ మండి (మార్కెట్)లో కేవలం 5-7 మంది జాట్ ఆర్థియాలు మాత్రమే ఉన్నారు. ఈ రోజు ఇక్కడ 150 దుకాణాలు ఉంటే, వాటిలో మూడోవంతు జాట్లవి. సరిహద్దుల్లో ఉన్న చిన్న మార్కెట్లలో మేమే ఎక్కువగా ఉన్నాం.” అని సంఘేరా వివరించాడు.

The first two are of Guru Gobind Singh and Guru Nanak. The last two are of Guru Hargobind and Guru Tegh Bahadur. The central one in this line up of five is of Shiva and Parvati with a baby Ganesha.
PHOTO • P. Sainath

ఒక పరిశీలనాత్మక మిశ్రమంగా ఉన్న దర్శన్ సింగ్ సంఘేరా కార్యాలయంలోని గోడలపై ఉన్న ఫోటోలు

చాలామంది జాట్‌లు బనియా ఆర్థియాల వద్ద జూనియర్ భాగస్వాములుగా చేరారు. నెమ్మదిగా వారే సొంత శాఖలుగా విస్తరించారు. కానీ, బనియాలు ఎందుకు జాట్లను భాగస్వాములుగా తీసుకున్నారు? డబ్బు రికవరీ చేయటం, మొరటు నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు “బనియా ఆర్థియాలు భయపడతారు." అన్నాడు సంఘేరా. జాట్ ఆర్థియాలు అంత పిరికివాళ్ళు కాదు."మేము డబ్బును ఎలాగైనా వసూలు చేస్తాం.” ప్రశాంతంగా చెప్పాడు సంఘేరా.

ముక్తసర్ జిల్లాలోని జాట్ రైతులకు నేనీ కథనాన్ని వివరించినప్పుడు, వాళ్ళు బిగ్గరగా నవ్వారు. “అతను మీకు నిజమే చెప్పాడు. కఠినమైన విషయాల్లో జాట్లు ఎప్పుడూ వెనక్కి తగ్గరు. బనియాలు తగ్గుతారు,” అని వారిలో కొందరు అన్నారు. ఈ జూనియర్ భాగస్వాములే తొందరలో వడ్డీ వ్యాపారాన్ని ఏలబోతున్నారు.

ఒకప్పుడు బనియాలతో ఈ ఏజెంట్లకున్న భాగస్వామ్యపు ప్రభావం బహుశా కొన్ని విషయాల్లో ఇప్పటికీ కనబడుతుంటుంది. సంఘేరా కార్యాలయంలో గోడపై ఉన్న ఐదు చిత్రాల గురించి అతని కుమారుడు ఓంకార్ సింగ్‌ను మేము ప్రశ్నించాం: “మొదటి రెండు చిత్రాలు గురు గోవింద్ సింగ్, గురునానక్‌లవి; చివరి రెండు చిత్రాలు గురు హరగోవింద్, గురు తేజ్ బహదూర్‌లవి; మధ్యలో చిత్రం శివ-పార్వతులతో ఉన్న చిన్నివినాయకుడిది. ఎందుకలా?”

“మేం ఈ వృత్తిని ఎంచుకున్నప్పుడు అందులోని పద్ధతులు కూడా పాటించాలి కదా!” అని సమాధానమిచ్చాడు ఓంకార్.

అనువాదం: వై. క్రిష్ణ జ్యోతి

پی سائی ناتھ ’پیپلز آرکائیو آف رورل انڈیا‘ کے بانی ایڈیٹر ہیں۔ وہ کئی دہائیوں تک دیہی ہندوستان کے رپورٹر رہے اور Everybody Loves a Good Drought اور The Last Heroes: Foot Soldiers of Indian Freedom کے مصنف ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز پی۔ سائی ناتھ
Translator : Y. Krishna Jyothi

Krishna Jyothi has 12 years of experience in journalism as a sub-editor & features writer. Now, she is into blogging.

کے ذریعہ دیگر اسٹوریز Y. Krishna Jyothi