చిటెంపల్లి పరమేశ్వరికి తరచుగా ఎక్కడికైనా పరుగెట్టి పారిపోవాలనిపిస్తుంటుంది. "కానీ నేను నా పిల్లలను విడిచిపెట్టి పోలేను. వాళ్ళకున్నది నేనొక్కదాన్నే," అంటుంది 30 ఏళ్ళ వయసున్న ఈ తల్లి.

పరమేశ్వరి భర్త చిటెంపల్లి కమల్ చంద్ర ఒక రైతు. 2010 నవంబర్‌లో ఆత్మహత్య చేసుకొని చనిపోయే నాటికి అతని వయసు ముప్పయ్యేళ్ళు కూడా లేవు. "అతను ఉత్తరంలాంటిదేమీ రాసిపెట్టి పోలేదు. బహుశా అతనికి రాయటం సరిగ్గా రాకపోవటం వలన కావొచ్చు," పేలవంగా నవ్వుతూ చెప్పిందామె.

ఆ విధంగా ఆమె తన ఇద్దరు పిల్లలైన శేషాద్రి, అన్నపూర్ణలకు తల్లీ తండ్రీ తానే అయింది. ఆ పిల్లలిద్దరూ ఇప్పుడు వాళ్ళ ఊరికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాస్టల్‌లో ఉంటూ ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. "వాళ్ళు నాకు బాగా గుర్తొస్తుంటారు, బెంగగా ఉంటుంది," అంటుంది ఆ తల్లి. ఇంతలోనే తనను తాను ఓదార్చుకుంటున్నట్టుగా, "వాళ్ళకక్కడ సమయానికి తిండి దొరుకుతుందని నాకు తెలుసు" అంటుంది.

ప్రతినెలకు ఒకసారి వాళ్ళను చూసివచ్చే రోజు కోసం ఆమె ఎదురుచూస్తుంటుంది. "నా దగ్గర డబ్బులున్నప్పుడు, వాళ్ళకి (పిల్లలకు) 500 (రూపాయలు) ఇస్తుంటాను. నా దగ్గర తక్కువ డబ్బులున్నపుడు వాళ్ళకు 200 (రూపాయలు) ఇస్తాను," అంటుందామె.

ఈ కుటుంబం తెలంగాణాలో షెడ్యూల్డ్ కులాల జాబితాలో ఉన్న మాదిగ సముదాయానికి చెందినది. పరమేశ్వరి చిల్తంపల్లె గ్రామంలో ఒక ఒంటి గది ఇంటిలో నివాసముంటోంది. ఆమె ఉండే ఇంటి పైకప్పు కుంగిపోతోంది. ఇంటి బయట ఒక తలుపులు లేని కొట్టాం ఉంది. తెలంగాణాలోని వికారాబాద్ జిల్లాలో ఉన్న ఈ ఇల్లు చనిపోయిన ఆమె భర్త కమల్ చంద్ర కుటుంబానికి చెందినది. అతనితో పెళ్ళి జరిగిన తరవాత ఆమె ఇక్కడకు వచ్చి ఉంటోంది.

PHOTO • Amrutha Kosuru
PHOTO • Amrutha Kosuru

ఎడమ : పరమేశ్వరి భర్త చిటెంపల్లి కమల్ చంద్ర ఫోటో . కమల్ చంద్ర 2010 లో ఆత్మహత్య చేసుకున్నాడు . కుడి : తెలంగాణాలోని వికారాబాద్ జిల్లా , చిల్తంపల్లి గ్రామంలో పరమేశ్వరి ఒంటరిగా నివసిస్తోంది

పరమేశ్వరి భర్త ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆమెకున్న ప్రధాన ఆదాయ వనరు భర్త చనిపోయినవారికి ఆసరా పెన్షన్ స్కీమ్ కింద వచ్చే పింఛను మాత్రమే. "నాకు 2019 వరకూ 1,000 (రూపాయలు) వచ్చేవి, కానీ ఇప్పుడు ప్రతి నెలా 2, 016 (రూపాయలు) వస్తున్నాయి."

ఆ పింఛనుతో పాటు, అదే గ్రామంలో ఆమె అత్తమామలకున్న సొంత మొక్కజొన్న పొలాల్లో పనిచేయడం ద్వారా ఆమెకు నెలకు రూ. 2,500 వస్తాయి. పరమేశ్వరి పొలాల్లో దినసరి కూలీగా కూడా పనిచేస్తూ రోజు కూలీగా రూ. 150-200 సంపాదిస్తుంది కానీ, ఆ పని ఆమెకు ఎప్పుడోగాని దొరకదు.

ఆమె సంపాదించినది కుటుంబ నెలవారీ ఖర్చులకు పోతుంది. " కేవలం ఈ డబ్బు మాత్రమే సరిపోని నెలలుంటాయి," అంటుందామె, మట్లాడుతున్నపుడు తన చీరె కొంగు చివరలను మెలిపెడుతూ.

ఆ డబ్బులెందుకు సరిపోవంటే 13 ఏళ్ళ తర్వాత కూడా మరణించిన తన భర్త వదిలివెళ్ళిన అప్పులను తీర్చడానికి ఆమె తంటాలు పడుతోంది. ఏకైక సంపాదనపరురాలైన ఈమెకు అప్పులోళ్ళ కు ప్రతి నెలా డబ్బులు కట్టవలసి రావటం ఒక నిరంతర ఒత్తిడికి కారణమవుతోంది. "నేనెంత బాకీ ఉన్నానో కూడా నాకు తెలియదు," అందామె ఆందోళనగా.

PHOTO • Amrutha Kosuru
PHOTO • Amrutha Kosuru

వంటగదిలో ( ఎడమ ) వంట చేస్తోన్న పరమేశ్వరి . చిల్తంపల్లె లోని తన ఇంటి బయట ( కుడి )

చనిపోయిన ఆమె భర్త కమల్ చంద్ర, కొన్ని ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని, దానిని సాగుచేయడానికి అయ్యే ఖర్చుల కోసం అప్పులు చేసేవాడు. అతను చనిపోయేంతవరకూ వికారాబాద్ జిల్లాలోని అయిదుగురు వేరువేరు అప్పులోళ్ళ నుండి తీసుకున్న బాకీలు రూ. ఆరు లక్షలు. "నాకు తెలిసింది (మొత్తం డబ్బు) మూడులక్షలు (రూపాయలు) మాత్రమే. ఇంత పెద్ద మొత్తం బాకీ ఉందని నాకు తెలియదు," అంటోంది పరమేశ్వరి.

అతను చనిపోయిన కొన్ని వారాల తర్వాత ఆ వడ్డీ వ్యాపారులు ఆమెను కలిశారు. కమల్ ఇద్దరు వ్యాపారుల నుండి ఒక్కొక్కరి వద్ద 1.5 లక్షల చొప్పున; ముగ్గురు వ్యాపారుల నుండి ఒక్కొక్కరి వద్ద లక్ష రూపాయల చొప్పున అప్పు చేసినట్లు అప్పుడే ఆమెకు తెలిసింది. ఇదంతా ఏడాదికి 36 శాతం వడ్డీకి. ఈ అప్పులకు సంబంధించి రాతపూర్వక ఆధారాలేమీ లేకపోవడం వలన భర్త చేసిన అప్పుల గురించి పరమేశ్వరి దగ్గర సరైన లెక్కలు లేవు.

"నేను చేయగలిగిందల్లా బాకీని తీర్చడానికి వెళ్ళినపుడు వాళ్ళు చెప్పింది నమ్మడమే," అంటోందామె. పోయిన్నెల ఆ అప్పులోళ్ళలో ఒకడిని తానింకా ఎంత బాకీ ఉందో అని అడిగినప్పుడు అతను స్పష్టంగా జవాబివ్వనేలేదు. దాంతో ఆమె కూడా అయోమయంలో పడిపోయింది.

ప్రతి ఒక్క అప్పులవాడికి ఆమె ప్రతి నెలా రూ. 2,000 కట్టాలి. భారాన్ని తగ్గించుకోవడానికి ఆమె నెలలో ఏదో ఒక రోజున ఆ ఐదుగురికీ అప్పు కడుతోంది. "ఒకే నెలలో మొత్తం ఐదుగురికీ అప్పు కట్టడానికి నా దగ్గర డబ్బు ఉండదు," అంటుందామె. అందుకని నెలలో ఐదుగురిలో కొంతమందికి రూ. 500 చొప్పున చెల్లిస్తోంది.

PHOTO • Amrutha Kosuru
PHOTO • Amrutha Kosuru

ఎడమ: కుటుంబపు పాత చిత్రం. కుడి: అప్పులు తీర్చడం కోసం పరమేశ్వరి తన అత్తమామల పొలాల్లోనూ, ఇతరుల పొలాల్లోనూ రోజు కూలీగా పనిచేస్తుంది

"అలా చేసుకున్నందుకు (ప్రాణాలు తీసుకున్నందుకు) నేను నా భర్తను నిందించను. నేను అర్థంచేసుకుంటాను," అనే పరమేశ్వరి, "నాక్కూడా ఒకోసారి అలా అనిపిస్తుంటుంది. ఇదంతా నేను ఒంటరి పోరాటం చేస్తున్నా," అంటోంది.

కొన్నిసార్లు చాలా తీవ్రమైన ఒత్తిడిగా ఉంటుంది, కానీ పిల్లల గురించి ఆలోచించడం ఆమెకు సహాయం చేస్తుంది. "ఈ అప్పులోళ్ళు అప్పుడు నా పిల్లల్ని అప్పు తీర్చమని అడుగుతారు (నేను ప్రాణాలు వదిలేస్తే)," విచారంగా చెప్పిందామె. "వాళ్ళెందుకు అప్పులు కట్టాలి? వాళ్ళు చక్కగా చదువుకొని గౌరవనీయమైన ఉద్యోగాల్లో, పెద్ద నగరాల్లో స్థిరపడాలని నేను కోరుకుంటున్నాను."

*****

పరమేశ్వరి రోజు పొద్దున్నే 5 గంటలకల్లా మొదలవుతుంది. "ఇంట్లో బియ్యం ఉంటే అన్నం వండుతాను. లేదంటే గంజి కాస్తాను," చెప్పిందామె. పనికి వెళ్ళే రోజున మధ్యాహ్నానికి అన్నం మూట కట్టుకొని ఉదయం 8 గంటలకల్లా ఇల్లు వదులుతుంది.

పని లేని రోజున ఇంటి పనులన్నీ ముగించుకొని ఒక చిన్న తెలివిజన్‌లో పాతవి, నలుపు-తెలుపు తెలుగు సినిమాలు చూస్తూ కాలక్షేపం చేస్తుంది. "నాకు సినిమాలు చూడటమంటే ఇష్టం. కానీ కొన్ని సార్లు ఆపేద్దామనుకుంటా (కేబుల్ కనెక్షన్‌కు డబ్బులు కట్టడం)." కానీ తాను నిరాశలో కూరుకుపోతున్నపుడు ఈ కేబులు కనెక్షన్ కోసం రూ. 250 కట్టడం చాలా ఉపయోగపడుతుందని అంటుందామె.

PHOTO • Amrutha Kosuru
PHOTO • Amrutha Kosuru

పాత తెలుపు-నలుపు సినిమాలను, సీరియళ్ళను తన టివిలో చూడటమంటే పరమేశ్వరికి చాలా ఇష్టం. ఎవరితోనైనా తన సమస్యలను గురించి చెప్పుకోవటం తనకు ఊరటనిస్తుందని ఆమె అంటుంది

అక్టోబర్ 2022లో ఆమె బంధువులలో ఒకరు కిసాన్‌మిత్ర అనే గ్రామీణ ప్రాంత హెల్ప్‌లైన్‌ని సంప్రదించాలని సూచించారు. "ఫోన్‌లో జవాబిచ్చిన మహిళతో మాట్లాడటం నాకు చాలా మంచిగా అనిపించింది. పరిస్థితులు బాగవుతాయని ఆమె చెప్పింది," గుర్తుచేసుకుంది పరమేశ్వరి. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌లలో పని చేసే ఈ హెల్ప్‌లైన్‌ను రూరల్ డెవలప్‌మెంట్ సర్వీస్ సొసైటీ అనే ఎన్‌జిఒ నడుపుతోంది. ఫోన్‌లో మాట్లాడిన వెంటనే కిసాన్‌మిత్రకు చెందిన క్షేత్ర సమన్వయకర్త జె. నర్సిములు పరమేశ్వరి ఇంటికి వచ్చారు. "అతను (నర్సిములు) నా భర్త గురించి, పిల్లల గురించి, ఆర్థిక ఇబ్బందుల గురించి వాకబు చేశారు. నా ఇబ్బందులను ఒకరు వినడం నాకు చాలా బాగా అనిపించింది" అంటోందామె.

తన ఆదాయానికి తోడుగా ఉండేందుకు పరమేశ్వరి ఒక ఆవును కొనబోతోంది. "నా ఒంటరితనాన్ని ఈ ఆవు తగ్గించవచ్చు." ఆవును కొనడానికి మొదటి విడత చెల్లింపుగా ఆమె రూ. 10,000 కట్టింది. "ఆ ఆవు ఇంకా ఇంటికి రాలేదు, కానీ నేను దానికోసం ఎదురుచూస్తున్నాను," అంది పరమేశ్వరి.

మీకు ఆత్మహత్య గురించిన ఆలోచనలు వస్తుంటే , లేదా అటువంటి ధోరణి ఉన్నవారి గురించి మీకు తెలిస్తే , దయచేసి నేషనల్ హెల్ప్ లైన్‌కు చెందిన కిరణ్‌కు 1800 -599 -0019 (24/7 టోల్ ఫ్రీ) ఫోన్ చేయండి. లేదంటే మీ దగ్గరలో ఉన్న ఈ హెల్ప్‌లైన్‌లలో దేనికైనా ఫోన్ చేయండి. మానసిక ఆరోగ్య నిపుణుల , లేక సేవల సమాచారం కోసం దయచేసి SPIF మానసిక ఆరోగ్య డైరెక్టరీ ని సందర్శించండి సందర్శించండి

ఈ కథనానికి రంగ్ దే నుంచి గ్రాంట్ మద్దతు ఉంది.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Amrutha Kosuru

امریتا کوسورو، ۲۰۲۲ کی پاری فیلو ہیں۔ وہ ایشین کالج آف جرنلزم سے گریجویٹ ہیں اور اپنے آبائی شہر، وشاکھاپٹنم سے لکھتی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Amrutha Kosuru
Editor : Sanviti Iyer

سنویتی ایئر، پیپلز آرکائیو آف رورل انڈیا کی کنٹینٹ کوآرڈینیٹر ہیں۔ وہ طلباء کے ساتھ بھی کام کرتی ہیں، اور دیہی ہندوستان کے مسائل کو درج اور رپورٹ کرنے میں ان کی مدد کرتی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Sanviti Iyer
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

کے ذریعہ دیگر اسٹوریز Sudhamayi Sattenapalli