అనూ చెదిరిపోయిన జుట్టు, పాలిపోయిన మొహంతో చెట్టు కింద సగం చిరిగిన ప్లాస్టిక్ చాప మీద కూర్చునుంది. ఆమెని దాటి వెళ్తున్నవారు కాస్త దూరం నుండి ఆమెను పలకరిస్తున్నారు. అక్కడే కొన్ని పాడి పశువులు విశ్రమిస్తున్నాయి, చొప్పని ఎండబెట్టారు.
“ఒకవేళ వర్షం పడినా, నేను గొడుగేసుకుని చెట్టు కిందే కూర్చుంటా కానీ ఇంట్లోకీ అడుగుపెట్టను. నా నీడ కూడా ఎవరి మీద పడకూడదు. మా దేవుడికి కోపం తెప్పించకూడదు.” అంది అనూ.
ఆ చెట్టు ఆమె ఇంటికి 100 మీటర్ల దూరంలో, ఒక విశాల మైదానంలో ఉంది. ఈ చెట్టే ఆమెకు నెలసరి సమయంలో మూడు రోజుల పాటు నీడ నిచ్చే ఇల్లు.
“నా కూతురు నా కోసం ఒక పళ్లెంలో ఆహరం పట్టుకొచ్చి ఇక్కడ పెడుతుంది.” అన్నది అనూ(పేరు మార్చబడింది). ఆమె ఈ నెలసరి రోజుల కోసం వేరే పాత్రలు వాడుతుంది. “ఇక్కడ నేనేమి సుఖంగా ఉండడం లేదు. నాకు ఇంట్లో పని చెయ్యాలనే ఉంటుంది, కానీ నా ఆచారాల మీద గౌరవం తో నేను ఇక్కడ ఉంటున్నాను. చాలా పని ఉన్నప్పుడు నేను పొలం పనికి కూడా వెళ్తాను.” అనూ కుటుంబం వారికున్న ఒకటిన్నర ఎకరం పొలం లో రాగి సాగుచేస్తారు.
ఈ మూడు రోజులు ఆమె ఒంటరిగా ఉన్నా, ఈ పద్దతిని అనూ ఒకత్తే పాటించడం లేదు. ఆమె 19, 17 ఏళ్ళ కూతుర్లు (21 ఏళ్ళ కూతురు కి పెళ్ళయిపోయింది) కూడా ఇదే పాటిస్తారు. పైగా ఆమె కుగ్రామం లోని ఇతర 25 కుటుంబాల్లోని కదుగొల్ల మహిళలు ఇలానే బయట ఉండాలి.
అప్పుడే బిడ్డలను ప్రసవించిన మహిళలకు కూడా చాలా కట్టుబాట్లుంటాయి. దగ్గరగా ఆరు గుడిసెలు అను ‘చెట్టు-ఇంటి’ కి కొద్ధికొద్ధి దూరం లో ఉంటాయి. ఈ గుడిసెలు వారికీ, వారికి పుట్టిన బిడ్డలకి కొంతకాలం పాటు ఇళ్లుగా పనికి వస్తాయి. నెలసరిలో ఉన్నవారు చెట్ల కిందే ఉండవలసి వస్తుంది.
ఈ చెట్లు, గుడిసెల వరస ఆ ఊరి పెరడు వంటి స్థలంలో ఉంటుంది, ఇది అరలలసంద్రకు ఉత్తర దిక్కున ఉంది. కర్ణాటక రాష్ట్రంలో, రమణగర జిల్లా చెన్నపట్న తాలూకకు చెందిన ఈ గ్రామంలో జనాభా 1070(సెన్సస్ 2011).
ఇలా క్వారంటైన్ అవబడ్డ మహిళలు పొదల పక్క ఉన్న చాటును వాడుకుని వారి వ్యక్తిగత అవసరాలను తీర్చుకుంటారు. నీళ్లు వారి ఇంటివారో లేక చుట్టుపక్కల వారో చెంబుల్లోనో లేక బక్కెట్ల లోనో ఇస్తారు.
అప్పుడే ప్రసవం అయిన బాలింతలు కనీసం ఒక నెల పాటు విడిగా ఉన్న ఆ గుడిసెలలో గడపాలి. వీరిలో పూజ(అసలు పేరు కాదు), 19 ఏళ్లకు పెళ్లయ్యాక, బీకామ్ చేసింది. ఆమెకు ఫిబ్రవరి 2021 లో బెంగుళూరుకు 70 కిలోమీటర్ల దూరం లో ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పాప పుట్టింది. “నాకు ఆపరేషన్(సిసేరియన్) అయింది. మా అత్తగారింటివారు, నా భర్త ఆసుపత్రికి వచ్చారు కానీ వారు మా ఆచారం ప్రకారం ఒక నెల దాకా పాపని ముట్టుకోకూడదు.ఆ తరవాత మా పుట్టింటివారు ఉండే గ్రామానికి వచ్చాక (అరలలసంద్ర వద్ద కదుగొల్ల కుగ్రామానికి; ఆమె, ఆమె భర్త అదే జిల్లాలో వేరే గ్రామంలో ఉంటారు), నేను 15 రోజుల పాటు ఒక గుడిసెలో ఉన్నాను. తరవాత ఈ గుడిసెకి మారాను,” అని పూజ తన అమ్మావాళ్ళింటికి ఎదురుగా ఉన్న గుడిసే చూపించింది. ఆమె పాపతో 30 రోజులు బయట గడిపాకే తన అసలు ఇంటికి చేరింది.
ఆమె ఇలా మాట్లాడుతుండగానే బాబు ఏడ్చాడు. ఆమె అతనిని తన తల్లి చీరతో చేసిన ఉయ్యాలలో వేసింది. ‘ఆమె(పూజ) విడిగా ఉన్న గుడిసెలో 15 రోజులు మాత్రమే గడిపింది . మా గ్రామం లో మేము చాలా వదిలేస్తున్నాము. వేరే కదుగొల్ల గ్రామాలల్లో ఐతే ప్రసవం తరవాత తల్లి తన బిడ్డతో రెండు నెలల కన్నా ఎక్కువ కాలమే గుడిసెలో ఉండాలి”, అన్నది పూజ తల్లి నలభై ఏళ్ళ గంగమ్మ. ఈ కుటుంబం గొర్రెలను పెంచుతుంది. మామిడి పంట, రాగి పంటను ఒక ఎకరం భూమిలో పండిస్తోంది.
పూజ తన అమ్మ చెబుతున్న మాటలు వింటోంది. ఆమె బాబు ఉయ్యాలలో నిద్రపోతున్నాడు. “నాకు ఏ ఇబ్బంది కలగలేదు. మా అమ్మ దగ్గర్లోనే ఉంది, ఆమె నాకు అన్ని విషయాలు తెలియజెప్పేది. కానీ బయట చాలా వేడిగా ఉండేది.” అని చెప్పింది. ఇప్పుడు 22 ఏళ్ళు వచ్చిన పూజ, ఎం కామ్ చేయాలనుకుంటోంది. ఆమె భర్త బెంగుళూరు లో ఒక ప్రైవేట్ కాలేజీ లో అటెండర్ గా పనిచేస్తున్నాడు. “అతను కూడా నేను ఈ ఆచారాన్ని పాటించాలని కోరుకుంటాడు.” అన్నది ఆమె. “అందరు నన్ను పాటించమని చెప్పారు. నాకక్కడ ఉండాలని లేదు. కాని నేను దెబ్బలాడలేదు. ఇది మేము పాటించి తీరాలి.”
*****
ఈ పధ్ధతి వేరే కదుగొల్ల కుగ్రామాల్లాలో కూడా ఉంది. ఇలాంటి ప్రదేశాలను స్థానికంగా గొల్లరదొడ్డి లేదా గొల్లరహత్తి అని పిలుస్తారు. కదుగొల్లలు, చారిత్రకంగా సంచార గొల్లకాపరులు, కర్ణాటకలో వారిని ఓబీసీ జాబితాలో వేశారు (వాళ్ళు షెడ్యూల్డ్ తెగ గా వర్గీకరణ కోరుకుంటున్నాగాని). కర్ణాటక లో వారి సంఖ్య 3,00,000(బసవరాజు, డిప్యూటీ డైరెక్టర్, వెనకబడిన తరగతుల వెల్ఫేర్ డిపార్ట్మెంట్, రామనగర అంచనా ప్రకారం) నుంచి పది లక్షల దాకా ఉంటుంది(పేరు చెప్పడానికి ఇష్టపడని కర్ణాటక వెనుకబడిన తరగతుల కమీషన్ మెంబెర్ అంచనా). ఈ సామాజిక వర్గం మధ్య, దక్షిణా ప్రాంతాలైన కర్ణాటకలోని పది జిల్లాలలో విస్తరించి ఉన్నారని బసవరాజు చెప్పారు.
పూజ ఇంటికి 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న డి హోసహల్లి గ్రామంలోని కదుగొల్ల కుగ్రామం లో, తుంకూర్ జిల్లాలో, జయమ్మ కూడా ఒక మధ్యాహ్నం తన ఇంటి ముందు రోడ్డు మీద చెట్టునానుకుని కూర్చునుంది. అది ఆమె నెలసరి లో మొదటి రోజు. ఆ చెట్టు వెనుక ఒక సన్నని మురుగు కాలువ పారుతోంది, ఒక స్టీల్ ప్లేట్, గ్లాస్ ఆమె పక్కన నేల మీద పెట్టి ఉన్నాయి. ఆమె ఆ చెట్టు కింద నెలలో మూడు రోజులు గడుపుతుంది- వర్షాలప్పుడు కూడా అని ఆమె నొక్కి చెప్తుంది. ఈ సమయం లో వంట గదిలో ఆమె పనులన్నీ పక్కన పెడుతుంది, కానీ ఆమె తన కుటుంబానికి చెందిన గొర్రెలని మేపుకు రావడానికి మైదానంలోకి తీసుకెళ్తుంది.
“బయట పడుకోవాలని ఎవరు కోరుకుంటారు.” అడుగుతుంది ఆమె. “కానీ చేయాలి. ఎందుకంటే దేవుడికి (కదుగొల్లలు కృష్ణుడి భక్తులు) మేము అలా చేయాలని కోరుకుంటాడు, అందుకే అందరూ పాటిస్తారు”, అంటుంది ఆమె. “నిన్న నేను నాపైన ఒక కవర్(టార్పాలిన్ షీట్) వేసుకుని వర్షం పడుతున్నా ఇక్కడే కూర్చున్నా.’
జయమ్మ, ఆమె భర్త ఇద్దరూ గొర్రెలని పెంచుతారు. ఇరవైల్లో ఉన్న వారి ఇద్దరు పిల్లలు బెంగుళూరులోని ఫ్యాక్టరీలలో పని చేస్తారు. “వారికి పెళ్ళైతే వారి భార్యలు కూడా ఇలానే బయట పడుకోవాలి. ఎందుకంటే మేము ఈ ఆచారాన్ని ఎప్పుడూ పాటిస్తూనే ఉన్నాము.” అన్నది ఆమె. “నాకు నచ్చవు కాబట్టి, పద్ధతులు మారవు. నా భర్త, ఈ గ్రామం ఈ పధ్ధతిని ఆపాలని నిర్ణయిస్తే అప్పుడు నేను, ఆ రొజుల్లొ ఇంట్లోనే ఉంటాను.”
కుణిగల్ తాలూకాకు చెందిన డి హోసహల్లి గ్రామం లోని కదుగొల్ల కుగ్రామం లో వేరే ఆడవాళ్ళు కూడా అదే చేయాలి. “మా ఊరిలో ఆడవాళ్లు నెలసరి లో మొదటి మూడు రోజులు బయట ఉండి, నాలుగో రోజు ఇంటికి వస్తారు,” అన్నది 35 ఏళ్ళ ఎం. ఎన్ లీల(అసలు పేరు కాదు). ఈమె ఒక స్థానిక అంగన్వాడీ వర్కర్. ఆమె కూడా నెలసరిలో బయట ఉంటుంది. “ఇది ఒక అలవాటు. దేవుడి మీద భయంతో ఎవరు దీనిని ఆపాలనుకోరు” అన్నది. “రాత్రుళ్ళు కుటుంబానికి చెందిన ఒక మగవాడు -- అన్నో, తాతో, భర్త నో - ఇంటి నుండి, లేదా బయటికొచ్చి దూరం పాటిస్తూ మమ్మల్ని కనిపెట్టుకుని ఉంటారు. నాలుగో రోజు, ఇంటికి తిరిగివచ్చేసాక, ఇంకా రక్తస్రావం ఆగకపోతే వాళ్ళు ఇంటిలో వారితో దూరంగా మసలుకుంటారు. భార్యలు భర్తలతో కలవరు. కానీ ఇంటిలో పని చేస్తారు.”
ఇలా ప్రతి నెలసరికి ఇంటికి బయట ఉండడం అనేది కదుగొల్ల కుగ్రామాలకు మామూలు విషయమైనా, ఇలా ఆచారాన్ని పాటించి ఆడవారిని దూరంగా ఉంచడం చట్టరీత్యా నేరం. ది కర్ణాటక ప్రివెన్షన్ అండ్ ఎరాడికేషన్ ఆఫ్ ఇన్హుమన్ ఎవిల్ ప్రాక్టీసెస్ అండ్ బ్లాక్ మేజిక్ ఆక్ట్, 2017(జనవరి 4, 2020న ప్రభుత్వం జారీ చేసిన నోటీసు) మొత్తం 16 ఆచారాలను నిషేధించింది. ఇది “బలవంతంగా ఒంటరిగా ఉంచడం, గ్రామంలోకి తిరిగి ప్రవేశాన్ని నిషేధించడం లేదా నెలసరిలో ఉన్న మహిళలను లేదా ప్రసవానంతర మహిళలను వేరుచేయడం," పై 1 నుండి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష, అలాగే ఉల్లంఘించినవారికి జరిమానా విధిస్తుంది.
కానీ సంఘ ఆరోగ్యా సంరక్షణను నిర్వహించే కదుగొల్ల వర్గానికి చెందిన ఆశా, అంగన్‌వాడీ వర్కర్లు కూడా ఈ పద్ధతులను పాటించకుండా చట్టం నిరోధించలేకపోయింది. డి. హోసహల్లిలోని ASHA కార్మికురాలు డి. శారదమ్మ (ఆమె అసలు పేరు కాదు), ప్రతి నెలా బయట ఉంటుంది.
“ఊరిలో ఉన్న ప్రతి ఒక్క మహిళా ఈ పని చేస్తుంది. నేను పక్కనే ఉన్న చిత్రగుడ జిల్లాలో పెరిగాను. అక్కడ వారు ఈ ఆచారాన్ని పాటించడం మానేసారు. ఎందుకంటే ఇలా ఆడవాళ్లు బయట ఉండడం వలన వారికి భద్రత కరువైయింది. ఇక్కడ అందరు మేము ఈ ఆచారం పాటించక పొతే దేవుడు మమ్మల్ని శపిస్తాడు అనుకుంటారు. నేను ఈ కులానికి చెందినదాన్నే కనుక నేను కూడా ఈ ఆచారాలన్నీ పాటిస్తాను. నా ఒక్కదానితో నేనేమి మార్చలేను. పైగా నేను బయట ఉండడం వలన ఏ ఇబ్బంది పడలేదు,” అన్నది నలభై ఏళ్ళ శారదమ్మ.
ఈ ఆచారాలు కదుగొల్ల కులం లోని ప్రభుత్వ ఉద్యోగులలో కూడా ఉంది - 43 ఏళ్ళ ఎస్ మోహన్(అసలు పేరు కాదు) ఇంటి తో సహా. ఇతను హోసహల్లి గ్రామ పంచాయత్ లో పని చేస్తున్నాడు. డిసెంబర్ 2020 లో MA Bed చేసిన అతని తమ్ముడి భార్యకు పాపాయి పుడితే, ఆమె తన పాపతో రెండు నెలలు ఇంటి బయట ఆమె కోసం ప్రత్యేకంగా కట్టించిన గుడిసె లోనే ఉంది. “వాళ్ళు బయట గుడిసెలో ఉండవలసిన సమయం గడిచాకే ఇంటిలోకి వచ్చారు.” అన్నాడు మోహన్. అతని 32 ఏళ్ళ భార్య భారతి(అసలు పేరు కాదు)అవునన్నట్టు తలూపింది. “నేను నా నెలసరి అప్పుడు ఏది ముట్టుకోను. నాకు ప్రభుత్వం ఈ ఆచారాన్ని మార్చడం ఇష్టం లేదు. వాళ్ళు మాకోసం ఈ ఊరిలో ఒక గది కట్టిస్తే, నెలసరి అప్పుడు మేము చెట్ల కింద ఉండవలసిన అవసరం ఉండదు.”
*****
కాలం గడుస్తున్న కొద్దీ అటువంటి గదులు కట్టించే ప్రయత్నాలు జరిగాయి. జులై 10, 2009 లో మీడియా నివేదిక ప్రకారం కర్ణాటక ప్రభుత్వం, ప్రతి కదుగొల్ల కుగ్రామాల బయట నెలసరి లో ఉండే పదిమంది ఆడవారికి మహిళా భవన్ కట్టించమని ఆర్డర్ జారీ చేసింది.
ఈ ఆర్డర్ జారీ చేయక ముందే స్థానిక పంచాయత్ ఒక సిమెంట్ గదిని డి. హోసహల్లి లో జయమ్మ వారి కుగ్రామం లో కట్టించారు. కుణిగల్ తాలూకా పంచాయత్ మెంబెర్, కృష్ణప్ప జి టి - ఆ గది 50 ఏళ్ళ క్రితం, అతని బాల్యంలో కట్టించారని చెబుతారు. ఆ ఊరిలో ని ఆడవారు ఆ గదిని చాలా ఏళ్ళు వాడారు. ఇప్పుడు ఆ గది పాడుబడి కలుపు మొక్కలతోటి, పాదులతోటి నిండిపోయి ఉంది.
అలానే ఇటువంటి సగం విరిగి పోయిన గది అరలలసంద్ర లో ఉంది. దానిని ఇప్పుడు ఎవరు వాడట్లేదు. “నాలుగైదేళ్ల క్రితం, కొంత మంది జిల్లా అధికారులు, పంచాయత్ మెంబర్లు మా ఊరికి వచ్చారు.” అని అనూ గుర్తు చేసుకుంది. “వారు బయట ఉన్న ఆడవారిని ఇంటికి వెళ్లిపొమ్మని చెప్పారు. బయట ఉండడం మంచిది కాదని చెప్పారు. మేము గది ఖాళీ చేయగానే వారు వెళ్లిపోయారు. తరవాత అందరు మళ్ళీ గదికి వెనక్కి వచ్చేసారు. తరవాత కొన్ని నెలలకి, వాళ్ళు మళ్ళీ వచ్చి మా నెలసరి అప్పుడు మా ఇళ్లలోనే ఉండమని చెప్పి ఆ గదిని విరగ్గొట్టడం మొదలుపెట్టారు. కానీ ఆ గది మాకు బాగా పనికి వచ్చేది. కనీసం టాయిలెట్ అవసరాలని ఇబ్బంది పడకుండా వాడుకోగలిగేవాళ్లం.”
2014 లో ఉమాశ్రీ, అప్పటి మహిళా శిశు సంక్షేమ మంత్రి, కదుగొల్ల కులాచారాలను ప్రతిఘటించడానికి ప్రయత్నాలు చేసింది. దీనికి సంకేతంగా ఆమె డి. హోసహల్లి లో కదుగొల్ల కుగ్రామం లోని నెలసరి మహిళలు వాడే గదిని విరగ్గొట్టింది. “ఉమాశ్రీ మేడం మా మహిళలను నెలసరి అప్పుడు ఇళ్లలోనే ఉండమని చెప్పింది. అందరు ఆమె ఈ ఊరు వచ్చినప్పుడు సరే అన్నారు కానీ ఎవరు ఈ ఆచారాన్ని పాటించడం ఆపలేదు. ఆమె పోలీసులు, ఊరి అకౌంటెంట్ తో కలిసి వచ్చి, ఆ గది తలుపుని, ఆ గది లో కొన్ని భాగాలని విరగ్గొట్టింది. మా ప్రాంతాన్ని అభివృద్ధి పరుస్తానని చెప్పింది కానీ ఏమి జరగలేదు,” అన్నాడు తాలూకా పంచాయత్ మెంబెర్ కృష్ణప్ప జి టి
అయినా ఫిబ్రవరి 2021 లో డి హోసహల్లి గ్రామ పంచాయత్ కి ప్రెసిడెంట్ అయినా ధనలక్ష్మికె ఎం(ఆమె కదుగొల్ల కులానికి చెందినది కాదు), మళ్ళీ గదులు కట్టించడం గురించి ఆలోచిస్తుంది. “ఆడవారి ఆరోగ్యానికి కీలక సమయాలైన ప్రసవానంతరం, రుతుస్రావం సమయాల్లో వారిని ఇళ్లలో కాక బయట ఉంచే పద్ధతికి దిగజార్చిన స్థితి ని చూసి నేను నివ్వెరపోయాను. నేను కనీసం వారికి వేరే ఇళ్లు కట్టడం గురించి ప్రస్తావిస్తాను. బాధించే విషయం ఏంటంటే ఇక్కడ చదువుకున్న అమ్మాయిలు కూడా ఈ ఆచారాన్ని ఆపదలచుకోలేదు. ఇక్కడ వారే మారినప్పుడు నేను ఎంతవరకు మార్పును తీసుకురాగలను?”
ఈ గదులను గురించి వాదన ముగించాలి. “ఆడవారికి వేరే గదులుండడం నయమనిపించినా , అసలు ఆచారాన్ని మాన్పించడం ముఖ్యం”, అంటారు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ డిపార్ట్మెంట్ లో పని చేసే బసవరాజు. “మేము కదుగొల్ల ఆడవారితో మాట్లాడి ఈ మూడాఛారాలని పాటించడం ఆపమని చెబుతున్నాము. ఇదివరకు అవగాహనా ప్రచారాలు కూడా నిర్వహించేవారము.”
నెలసరిలో ఉన్న మహిళలకు గదులు కట్టి ఇవ్వడం పరిష్కారం కాదని అరలలసంద్ర కు చెందిన కే ఆర్కెష్, రిటైర్డ్ ఇన్స్పెక్టర్ జనరల్, సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్ అంటారు. “ఈ కృష్ణ కుటీరాలు(ఆ గదులని అలా పిలుస్తారు) ఈ ఆచారాన్ని సమర్ధిస్తున్నాయి. అసలు ఆడవాళ్ళు నెలసరి దినాలలో అపవిత్రం అవుతాయారన్న మాటని ఒప్పుకోకూడదు.” అన్నారు
“ఇటువంటి మొండి ఆచారాలు చాలా క్రూరమైనవి, కాని సమాజలో ఒత్తిడి ఎలా ఉంటుందంటే, దానిని ఛేదించడానికి ఆడవాళ్ళంతా ఒకచోట కూడలేరు, ఎదిరించలేరు. సతిని నిర్మూలించడం సామాజిక విప్లవం ద్వారానే సాధ్యమైంది. అప్పుడు మార్పు తీసుకురావడానికి ఒక సంకల్పం ఉంది. కానీ ఎన్నికలతో రాజకీయాలు ముడిపడి ఉండడం వలన మన రాజకీయనాయకులు ఈ విషయాలను అసలు తాకరు. ఈ మూఢాచార నిర్మూలనకు రాజకీయ నాయకులు, సామాజిక సంస్కర్తలు, సంఘం లోని వారు కలిసి ముందుకు రావాలి.”
*****
అప్పటివరకు దైవం కోపగిస్తాడని, సమాజం వెలివేస్తుందని భయపడి ఈ ఆచారం ఇలా కొనసాగిస్తూనే ఉంటారు.
“మేము ఈ ఆచారాన్ని పాటించకపొతే మాకు చెడు జరుగుతుంది”, అంది అరలలసంద్ర లో కదుగొల్ల కుగ్రామానికి చెందిన అనూ. చాలా ఏళ్ళ క్రితం, తుంకూర్ లో ఒక ఆడామె నెలసరి సమయం లో అలా బయట ఉండడానికి ఇష్టపడకపోతే ఆమె ఇల్లు ఎలానో తెలియకుండా కాలిపోయింది.”
“మా దేవుడు మమ్మల్ని ఇలానే బతకాలని చెబుతున్నాడు, ఒకవేళ మేము ఆయన మాట వినక పొతే మేము దాని పర్యవసానం భరించవలసి వస్తుంది”, అని హోసహల్లి గ్రామా పంచాయత్ కి చెందిన మోహన్ ఎస్ అన్నాడు. ఒకవేళ ఈ ఆచారాన్ని ఆపితే, “రోగాలు పెరుగుతాయి, మా మేకలు, గొర్రెలు చనిపోతాయి, మా వారందరికీ నష్టం కలుగుతుంది. ఈ పద్దతి ని ఆపకూడదు. మాకు మార్పు వద్దు.”
“మండ్య జిల్లా లో నెలసరిలో ఉన్న ఒక ఆడామెను ఆమె గుడిసె లో ఉండగా ఒక పాము కాటేసింది”, అని రమణగర జిల్లాలో సాతానూర్ గ్రామం లోని కదుగొల్ల కుగ్రామం లో ఉండే గిరిగమ్మ చెప్పింది. ఇక్కడ ప్రభుత్వం, పక్కనే టాయిలెట్ సౌకర్యం ఉన్న ఒక పక్కా గదిని కట్టించింది. నెలసరి లో ఉన్న మహిళలకు ఈ గది రక్షణనిస్తోంది. ప్రధాన గ్రామంలో నుంచి ఒక సన్నని దారికి గుండా వస్తే ఈ గది కనిపిస్తుంది.
మూడేళ్ళ క్రితం మొదటి నెలసరికి ఈ గదిలో ఒంటరిగా ఉండవలసి వచ్చినప్పుడు ఎంత భయపడిందో గీత యాదవ్ గుర్తుచేసుకుంటుంది. “నేను చాలా ఏడ్చాను, నన్ను ఇక్కడికి పంపవద్దని మా అమ్మని బతిమాలాను. కానీ ఆమె వినలేదు. కానీ ఇప్పుడు ఎవరో ఒక ఆంటీ(నెలసరిలో ఉన్న వేరే మహిళలు) తోడుగా ఉంటారు, కాబట్టి నేను హాయిగా పడుకోగలుగుతున్నాను. నా నెలసరి సమయం లో నేను నా క్లాసులు హాజరయి ఈ గదికే నేరుగా వచ్చేస్తాను. కానీ ఇక్కడ నేల మీద పడుకొనవసరం లేకుండా పరుపులు ఉంటే బావుణ్ణు.” పదహారేళ్ళ గీత, పదకొండవ తరగతి చదువుతోంది. “ముందుముందు నేను పెద్ద నగరాల్లో పనిచేసినా నెలసరి సమయం లో నేను వేరే గదిలో ఉంటాను. ఏది ముట్టుకోను. నేను ఈ పద్దతిని కచ్చితంగా పాటిస్తాను. మా ఊరి లో దీనిని పాటించడం చాలా ముఖ్యం.” అంది.
పదహారేళ్ళ గీత ఈ ఆచారాన్ని ముందు తీసుకెళ్తానని చెబితే, 65 ఏళ్ళ గిరిగమ్మ కి ఈ ఆచారాన్ని పాటించడం వలన వారి కుల మహిళలకు విశ్రాంతి దొరుకుంటుంది కాబట్టి ఫిర్యాదు చేయడంలో అర్థం లేదంటుంది. “మేము కూడా బయట ఎండలో వానలో ఉన్నాం. నన్ను మా ఇంట్లోకి రానిచ్చేవారు కాదు, కాబట్టి తుఫానులప్పుడు కూడా నేను వేరే కులాల ఇళ్లలో తలదాచుకోవలసి వచ్చేది." అన్నది. "కొన్నిసార్లు మేము నేల మీద పరచిన ఆకులో అన్నం తినేవాళ్ళం. ఇప్పుడు ఆడవారికి వారి ప్రత్యేక కంచాలు, గిన్నెలు ఉన్నాయి. మేము కృష్ణుడిని నమ్ముకున్నాము, మరి ఆడవాళ్లు ఈ ఆచారాన్ని పాటించకపోతే ఎలా?”
“ఆ మూడు రోజులు మేము ఊరికే కూర్చుంటాం, తింటాం, పడుకుంటాం. లేదంటే మాకు వంట చేయడం, ఇంటిని శుభ్రం చేయడం,మేకల వెనక పరిగెత్తడంతో సరిపోతుంది. మేము మా నెలసరి ఇళ్లలో ఉన్నప్పుడు ఇవన్నీ చేయవలసిన పని లేదు”, అన్నది 29 ఏళ్ళ రత్నమ్మ(అసలు పేరు కాదు). ఈమె కనకాపుర తాలూకా (సాతానూర్ కూడా ఇందులోనే ఉంది)లో కబ్బల్ గ్రామ పంచాయత్ లో అంగన్వాడీ వర్కర్ గా పనిచేస్తుంది.
గిరగమ్మకు, రత్నమ్మ కు ఇలా వేరుగా ఉంచడంలో లాభాలు కనిపించినా ఈ ఆచారం చాలా ప్రమాదాలకు చావులకు దారి తీసింది. తుంకూర్ లో డిసెంబర్ 2014 లో తన తల్లి తో గుడిసెలో ఉన్న ఒక కదుగొల్ల శిశువు వర్షం కురిసిన తరవాత వచ్చిన చలికి చనిపోయింది అని ఒక వార్తా పత్రిక లో వచ్చింది. ఇంకో వార్త 2010 లో మండ్యలోని మద్దూర్ తాలూకా లో కదుగొల్ల కుగ్రామం లో ఒక 10 రోజుల శిశువును కుక్క ఈడ్చుకుని వెళ్ళిపోయింది అని వచ్చింది.
డి హోసహల్లి గ్రామంలో కదుగొల్ల కుగ్రామానికి చెందిన ఇరవైరెండేళ్ల పల్లవి ఒక గృహిణి. ఆమె తన మొదటి బిడ్డని ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ప్రసవించింది. ఆమె ఒంటరిగా బయట ఉండడంలోని ప్రమాదాలను కొట్టిపారేస్తుంది. “ఇన్ని సంవత్సరాలలో ఒకటి రెండు కేసులు ఉన్నాయి. నన్ను ఆ విషయాలేమి చేయలేవు. ఈ గుడిసె చాలా హాయిగా ఉంటుంది. నేనెందుకు భయపడతాను? నేను నా నెలసరి సమయంలో ఎప్పుడూ చీకటిలోనే గడిపాను. నాకిదేం కొత్త కాదు,” అని పాపాయిని ఉయ్యాలలో వేస్తూ చెప్పింది.
పల్లవి భర్త తుంకూర్ లో గ్యాస్ ఫ్యాక్టరీ లో పని చేస్తున్నాడు. పల్లవి తన బిడ్డతో గుడిసె లో పడుకుంటుంది. తన అమ్మ లేదా తాత కొన్ని మీటర్ల దూరంలో వేరే గుడిసెలో ఉంటారు. ఈ రెండు కట్టడాలకు మధ్య ఒక స్టాండింగ్ ఫ్యాన్, ఒక బల్బ్ ఉంటాయి. బయట ఆవరణలో పొయ్యి మీద నీళ్లు కాచుకోడానికి ఒక పాత్ర ఉంటుంది. పల్లవి బట్టలు, బిడ్డ బట్టలు, గుడిసె పైన ఆరేసి ఉన్నాయి. రెండు నెలల మూడు రోజులు గడిచాక తల్లీబిడ్డ, వారి గుడిసె కి 100 మీటర్ల దూరం లో ఉన్న తమ ఇంటికి వెళ్తారు.
కొన్నికదుగొల్ల కుటుంబాలు కొత్తగా పుట్టిన పాపాయిని, తల్లిని ఇంటికి తెచ్చేముందు గొర్రెని బలి ఇస్తారు. చాలా సార్లు శుద్ధి చేయడం కూడా జరుగుతుంది. ఆ గుడిసె, పాపాయి బట్టలు, తల్లి బట్టలని శుభ్రపరుస్తారు. ఆ ఊరి పెద్దలు తల్లీబిడ్డలకి దూరం నుండే దారి చూపిస్తారు . వారిని అక్కడ స్థానిక గుడికి తీసుకు వెళ్లి నామకరణం చేయిస్తారు. అక్కడ వారు పూజచేసి, ఆ తరవాత భోజనం చేస్తారు - ఆ తరవాత వారిని ఇంటికి రానిస్తారు.
*****
కానీ కొన్ని ప్రతిఘటన గాధలు కూడా ఉన్నాయి.
అరలలసంద్ర లో కదుగొల్ల కుగ్రామం లో ఉండే డి జయలక్ష్మమ్మ, ఊరిలో వారు ఆచారాన్ని పాటించాలని ఎంత చెప్పినా, తన నెలసరి సమయంలో బయట ఉండదు. ఈ 45 ఏళ్ళ అంగన్వాడీ వర్కర్ ఆమె నాలుగు కాన్పులకు ఆసుపత్రి నుంచి నేరుగా ఇంటికొచ్చేసి చుట్టుపక్కల ఉండే కదుగొల్ల కుటుంబాలకు కోపం రప్పించింది.
“నాకు పెళ్ళయినప్పుడు, ఇక్కడున్న అందరు ఆడవాళ్ళూ ఊరికావల ఉన్న చిన్న గుడిసెలలో కానీ, చెట్ల కింద కానీ ఉండేవాళ్ళు. నా భర్త ఈ ఆచారాన్ని వ్యతిరేకించాడు. పెళ్ళికిముందు మా పుట్టింట్లో కూడా నన్ను వేరుగా పెట్టడం నాకు నచ్చేది కాదు. కాబట్టి నేను కూడా మానేసాను. కానీ ఊరివాళ్ళనుంచి మాటలు పడవలసి వస్తుంది.” అన్నది పదో తరగతి వరకు చదువుకున్న జయలక్ష్మమ్మ. ఆమెనే గాక, 19-23 ఏళ్ళ వయసులో మధ్యలో ఉన్న ఆమె ముగ్గురు ఆడపిల్లలు నెలసరి సమయంలో బయట ఉండరు.
“మా ఊరివారు మమ్మల్ని ఏవేవో మాటలని బాధపెట్టేవారు. మేము ఎప్పుడు ఏ ఇబ్బంది పడినా అది ఈ ఆచారాన్ని పాటించక పోవడం వలెనే, అందుకే మాకు అన్ని చెడు విషయాలు జరుగుతున్నాయని చెప్పేవారు. వారు కొన్నిసార్లు మమ్మల్ని కలుపుకునేవారు కాదు. గత కొన్నేళ్లుగా, దీనికి వ్యతిరేక చట్టం వచ్చింది కాబట్టి భయపడి, వాళ్ళు మేమేం చేస్తున్నామో పట్టించుకోవడం మానేశారు,” అన్నాడు జయలక్ష్మి భర్త 60 ఏళ్ళ కుళ్ళ కురియప్ప. ఈయన ఎం. ఎ , బి ఈడి చేసిన రిటైర్డ్ లెక్చరర్. “ఎప్పుడైనా ఊరిలో వారు నన్ను ఆపి ఈ ఆచారాన్ని ఎందుకు పాటించడం లేదు అని అడిగితే నేను టీచర్ ని కాబట్టి ఇలా ప్రవర్తించకూడదు అని చెప్పేవాడిని. మన ఆడపిల్లలకు బుర్రలో ఇటువంటి త్యాగాలు చేయాలని నమ్మకాలు నింపి పెట్టారు.” అన్నాడాయన కోపంగా.
జయమ్మ లాగా అరలలసంద్ర లో ఇద్దరు పిల్లల తల్లి అయినా 30 ఏళ్ళ అమృత కు(అసలు పేరు కాదు), ఇలా బలవంతంగా బయట ఉండే ఆచారాన్నిఆపివేయాలని ఉంది - కానీ అలా చేయలేకపోతోంది. “పై నుంచి ఎవరైనా(రాజకీయ నాయకులు, ఆఫీసర్లు వంటి వారు) మా ఊరిపెద్దలకు ఈ విషయాన్ని వివరించాలి. లేదా ఐదేళ్ల నా కూతురు పెద్దయ్యాక తాను కూడా పాటించవలసి వస్తుంది. తనని అలా పాటించమని నేనే చెప్పవలసి వస్తుంది. నేను ఈ ఆచారాన్ని ఒంటరిగా ఆపలేను.”
పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా లో భాగంగా, PARI మరియు కౌంటర్ మీడియా ట్రస్ట్ కలిసి గ్రామీణ భారతదేశంలో కౌమారదశలో ఉన్న బాలికలు మరియు యువతులపై దేశవ్యాప్త రిపోర్టింగ్ ప్రాజెక్ట్ ను చేస్తున్నారు. సమాజం లో కీలకమైన పాత్రను పోషించే అట్టడుగు వర్గాల పరిస్థితులను అన్వేషించడానికి, సాధారణ ప్రజల గొంతులను, వారి అనుభవాలను వినిపించడానికి ఈ ప్రాజెక్టు కృషి చేస్తుంది.
ఈ వ్యాసాన్ని ప్రచురించాలనుకుంటున్నాయారా? అయితే [email protected] కి మెయిల్ చేసి [email protected] కు కాపీ పెట్టండి.
అనువాదం : అపర్ణ తోట