"నాకు రేషన్ షాపు నుండి బియ్యం ఎందుకు రావడంలేదు?" జనవరి నెలలో రాష్ట్ర ప్రభుత్వ జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించటానికి తుమ్మలలోని ప్రభుత్వ పాఠశాలకు వచ్చిన మండల అధికారులను అడిగారు మహమ్మద్.
తుమ్మల గ్రామంలో ఉన్న అతని రేషన్ కార్డులో మహమ్మద్ పేరు కనిపించకుండాపోయి, అక్కడికి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్నూలు నగరంలోని రేషన్ కార్డులో కనిపించింది. "కొందరి పేర్లు వైజాగ్ (800 కిలోమీటర్ల దూరంలో ఉన్న విశాఖపట్నం) వంటి ప్రాంతాలలో కూడా కనిపిస్తున్నాయి," అని అధికారి బదులిచ్చారు.
అక్టోబరు 2016లో తన ఆధార్ నంబర్‌ను రేషన్ కార్డుకు జోడించినప్పటి నుండి, పఠాన్ మొహమ్మద్ అలీఖాన్ తనకు రావలసిన రేషన్‌ను పొందలేకపోతున్నారు. 52 ఏళ్ళ ఈ కూరగాయల వ్యాపారి, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆధార్, రేషన్ కార్డులను జోడించడాన్ని తప్పనిసరి చేసిన వెంటనే తన ఆధార్‌నూ, రేషన్ కార్డునూ జోడించేశారు. ఇలా చేసిన కొద్ది వారాల్లోనే, అనంతపురం జిల్లా అమడగూరు మండలం తుమ్మల గ్రామంలోని ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్)కు చెందిన రేషన్ దుకాణంలో అతనికి సమస్యలు మొదలయ్యాయి.
అలీ లాంటి బిపిఎల్ (దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న) రేషన్ కార్డులున్నవారు ప్రజా పంపిణీ వ్యవస్థకు చెందిన దుకాణానికి వెళ్ళినప్పుడల్లా, దుకాణదారుడు కుటుంబ రేషన్ కార్డ్ నంబర్‌ను అడిగి, దానిని ఒక చిన్న యంత్రంలోకి పంపుతాడు. అప్పుడు ఆ పరికరం కుటుంబ సభ్యుల జాబితాను చూపెడుతుంది. ఆ కార్డుదారుడి వేలిముద్రలతో దీన్ని ధ్రువపరచిన తర్వాత యంత్రం చూపించే వ్యక్తుల సంఖ్యను బట్టి దుకాణదారుడు రేషన్ ఇస్తాడు. అయితే అతని కుటుంబ రేషన్ కార్డులో ఉన్న పేర్ల జాబితాలోంచి అలీ పేరు మాయం అయ్యింది. "నేను చాలాసార్లు దుకాణానికి వెళ్ళాను, అయినా జాబితాలో నా పేరు లేదు,” అని ఆయన చెప్పారు. “మా నంబర్‌ను యంత్రంలో పంచ్ చేసినప్పుడు, ఐదు పేర్లు కనిపించాలి. కానీ నలుగురువి మాత్రమే కనిపిస్తున్నాయి. నా పేరు లేదు. అందులో పేరు ఉంటేనే వేలిముద్రలు పనిచేస్తాయి. లేకపోతే అవి పనిచేయవు."
మహ్మద్ హుస్సేన్ రేషన్ కార్డుకు అలీ ఆధార్ నంబర్ జోడించి ఉండటం వల్ల ఇలా జరిగింది. ఆ జోడింపు ఎలా జరిగిందో ఎవరికీ తెలియదు. కానీ కర్నూలు నగరంలోని కావడి వీధిలో నివసించే హుస్సేన్ 2013లో 59 సంవత్సరాల వయసులో బ్రెయిన్ స్ట్రోక్‌తో మరణించారు. అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పనిచేసేవారు. "(దాంతో) వారు నా భర్త పేరును (మా రేషన్ కార్డ్ నుండి) తొలగించారు," అని హుస్సేన్ భార్య షేక్ జుబేదా బీ చెప్పారు.
తుమ్మలకు కొద్ది దూరంలో ఉన్న వెంకటనారాయణ పల్లి గ్రామంలో వి.నాగరాజు పేరు కూడా అతని రేషన్ కార్డులో కనిపించకుండా పోయింది. "నేను కార్డు (నంబర్) పంచ్ చేసిన తర్వాత చూస్తే అతని పేరు కనిపించ లేదు," అని రేషన్ డీలర్ రమణా రెడ్డి చెప్పారు. నాగరాజు కుటుంబం రేషన్ కార్డులో ఉన్న వ్యక్తుల జాబితాను అతను నాకు చూపించారు. అందులో నాగరాజు పేరు లేదు.
"ప్రతినెలా ఐదు కిలోల బియ్యం (రేషన్ దుకాణం నుండి) అందకపోవడమంటే అది మాకు చాలా పెద్ద విషయం," అని కౌలు రైతు నాగరాజు (45) అన్నారు. అలీ స్నేహితుడైన నాగరాజు అప్పుడప్పుడూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజిఎన్ఆర్ఇజిఎ) పనిప్రదేశాలలో పనిచేస్తుంటారు. రేషన్ నిల్వలు అందుబాటులో ఉన్నప్పుడు, బిపిఎల్ కార్డు ఉన్నవారికి ఒక కిలో రాగులు, అప్పుడప్పుడూ కుటుంబానికి కొంత పంచదార, సబ్బులు లభిస్తాయి.
నాగరాజు తన సమస్యతో అమడగూరుకు 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతపురంలోని జిల్లా సరఫరా అధికారి (డిఎస్‌ఒ) కార్యాలయానికి వెళ్లారు. అక్కడ, ఒక ఆపరేటర్ అతని వివరాలను చూసి, నాగరాజు ఆధార్ కార్డ్ ఫొటోకాపీపై ఇలా రాశారు: “ఈ ఆధార్ కార్డ్ కర్నూలు జిల్లాలో ఉన్నట్టుగా నమోదయింది / ఇదివరకే (సమాచారం) కర్నూలు డిఎస్ఒకి తెలియచేయటమయినది.”
అలీ విషయంలో జరిగినట్టే నాగరాజు ఆధార్ కూడా కర్నూలు నగరంలోని శ్రీనివాసనగర్ ప్రాంతంలో నివసించే జి. విజయలక్ష్మి కార్డుకు జోడించివుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రజా పంపిణీ వ్యవస్థ వెబ్సైట్ ప్రకారం, విజయలక్ష్మి కార్డ్ 'వాడకంలో' ఉంది. అంటే, ఆమె ప్రజా పంపిణీ వ్యవస్థ దుకాణం నుండి రేషన్లను తీసుకుంటున్నారని అర్థం.
"కానీ నేనెప్పుడూ నా రేషన్ తీసుకోలేదు," 40 ఏళ్ల పైబడిన వయసున్న గృహిణి విజయలక్ష్మి చెప్పారు. ఆమె భర్త స్కూటర్ మెకానిక్‌గా పనిచేస్తుంటారు. విజయలక్ష్మి తన పేరు మీద జారీ చేసిన రేషన్ కార్డులో ఉన్న నాగరాజు, మరో మహిళ ఫొటోలను గుర్తించలేకపోయారు. ఆమె జనవరి 2017లో తన పేరు, తన కుటుంబ సభ్యుల పేర్లతో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు, అది రావటం కోసం వేచి ఉన్నారు.
ప్రజా పంపిణీ వ్యవస్థ వెబ్‌సైట్‌లోని “లావాదేవీల చరిత్ర” విభాగంలో నమోదు చేసివున్నదాని ప్రకారం అలీ, నాగరాజుల ఆధార్ నంబర్లతో కర్నూలులో తప్పుగా జోడించివున్న రెండు రేషన్ కార్డులు డిసెంబర్ 2011లో జారీ అయినవి. ఈ చరిత్ర ప్రకారం అక్టోబరు 2016 వరకు, ఈ రెండు రేషన్ కార్డులను భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (ఆధార్) డేటాబేస్‌లో ‘నమోదు(సీడ్)’ చేసేందుకు అనేకసార్లు విఫలయత్నాలు జరిగాయి. ఇవి సహాయం చేసే స్వభావమున్న ప్రభుత్వ అధికారులు చేసిన ప్రయత్నాలు కావచ్చు; లేదా గుర్తుతెలియని వ్యక్తులు చేసిన మోసం కావచ్చు. అయితే ఈ ప్రయత్నాలతో అలీకి గానీ, నాగరాజుకు గానీ ఎలాంటి సంబంధం లేదు.
లావాదేవీల చరిత్రనూ, కార్డ్ వివరాలనూ చూడాలంటే పాస్వర్డ్ అవసరం లేదు, రేషన్ కార్డ్ నంబర్ ఉంటే సరిపోతుంది. వెబ్‌సైట్‌లోని ‘ప్రింట్ రేషన్ కార్డ్’ విభాగం నుండి నేను ఈ కార్డులను తీసుకున్నపుడు, ఆ కార్డుల్లో అలీకీ, నాగరాజుకు తెలియని పేర్లు ఉన్నాయి. వాటిలో ఉన్న ఆరుగురు వ్యక్తుల పాస్‌పోర్ట్ సైజు ఫొటోలలో (అలీ ఆధార్‌తో జోడించి ఉన్న రేషన్ కార్డులో నాలుగు, నాగరాజు కార్డులో రెండు) అలీ, నాగరాజుల (వారి ఆధార్ కార్డులలో ఉన్నవి) ఫోటోలు ఉన్నాయి కానీ, మిగతా వారిని నాగరాజు గుర్తించలేకపోయారు.
24 సంవత్సరాల క్రితం వివాహమైనప్పటి నుండి తన కోటా రేషన్‌ను పొందని విజయలక్ష్మిలా కాకుండా, అలీ మాత్రం 1980ల నుండి తన రేషన్‌ను తీసుకుంటున్నారు. అందుకనే, 2016 అక్టోబర్‌లో ఈ గందరగోళం ప్రారంభమైన వెంటనే, అతను రేషన్ కార్డ్ హెల్ప్ లైన్‌కు కొన్నిసార్లు ఫోన్ చేశారు, అతని సమస్యను పరిష్కరిస్తామని ఏజెంట్లు అతనికి హామీ ఇచ్చారు కూడా. కొంతకాలం వేచి ఉన్న తర్వాత, తిరిగి అక్టోబర్ 2017లో, అలీ అమడగూరులోని ‘మీ సేవ’ కేంద్రానికి వెళ్లి, తన కుటుంబ రేషన్ కార్డులో తన పేరును తిరిగి చేర్చమని అభ్యర్థించారు. అమడగూరు మండల రెవెన్యూ అధికారి (ఎంఆర్ఒ)తో కూడా మాట్లాడి, తన సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామనే హామీని పొందారు. "నేను నా ఆధార్ (రేషన్ కూడా) గురించి వెళ్లిన ప్రతిసారీ, ఆ రోజు నా వ్యాపారం పోతుంది." అన్నారు అలీ.
తుమ్మలలో జన్మభూమి సమావేశం అయిన తరువాత అలీ, నేను కలిసి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న అమడగూరులోని మీ సేవ శాఖకు వెళ్లాం. వివరాలు నమోదు చేయటంలో ఏమైనా లోపాలు ఉన్నాయేమో చూడటానికి అతని ఆధార్ కార్డు కాపీని తీసుకునేందుకు ప్రయత్నించాం. అతని ఆధార్ నంబర్‌కు ఒటిపి (సమాచారం నిజమైనదా కాదా అని నిర్ధారించుకునేందుకు మొబైల్ ఫోన్లకు పంపే వన్ టైమ్ పాస్వర్డ్) సౌకర్యం కలిగించివుంది. అయితే ఈ విషయం అలీకి తెలియదు. అతను గుర్తుపట్టలేని ఒక నంబర్‌కు ఒటిపి వెళ్ళింది.
ఆధార్‌ను తిరిగి తీసుకోవడం కుదరకపోవడంతో, మీ సేవ కేంద్రంలో అక్టోబర్ 2017లో అలీ చేసిన అభ్యర్థన గురించి ఏమి జరిగిందో చూడడానికి మేం సమీపంలోని అమడగూరులోని ఎంఆర్ఒ కార్యాలయానికి వెళ్లాం. ఎంఆర్ఒ కార్యాలయంలోని కంప్యూటర్ ఆపరేటర్ అలీకి మీ సీవలో ఇచ్చిన రశీదు చూపించమని అడిగారు. అయితే అలాంటి రశీదు ఏదీ అతని దగ్గర లేదు. రశీదు కోసం మళ్ళీ మీ సేవకు తిరిగి వచ్చాం. దాన్ని తిరిగి తీసుకోవడానికి కొంత సమయం పట్టింది.
ఆ కాగితాన్ని తీసుకుని మేం మరోసారి ఎంఆర్ఒ కార్యాలయానికి వెళ్ళాం. అక్కడ ఆపరేటర్ వివరాలను చూశారు. మీ సేవా వెబ్‌సైట్‌లోని ‘ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ డెలివరీ గేట్‌వే’లోని కాలమ్ ప్రకారం, మహమ్మద్ అలీ రేషన్‌ను నిలిపివేశారు. ఎందుకంటే “... ఇప్పటికే యుఐడి ఉపయోగంలో ఉంది", గుర్తు తెలియని రేషన్ కార్డ్ నంబర్‌తో. అయితే అది కర్నూలులోని మహమ్మద్ హుస్సేన్ చిరునామాతో ఉంది.
అలీ, నాగరాజుల ఆధార్ వివరాలు ఉన్న కర్నూలులోని రేషన్ దుకాణం అవినీతి ఆరోపణల కారణంగా 2017లోనే మూతపడింది; దీని వినియోగదారులు నగరంలోని మరొక రేషన్ దుకాణాన్ని ఉపయోగించడం ప్రారంభించారు.
అలీ రేషన్ కార్డ్ చరిత్రను మనం సులభంగా పొందగలగడం, అతని ఒటిపి మరొక ఫోన్ నంబర్‌కు వెళ్ళడం, రేషన్ కార్డులపై సంబంధం లేని వ్యక్తుల ఫొటోలుండటం - ఇవన్నీ డిజిటలైజేషన్ సృష్టించిన మతిపోగొట్టే గందరగోళాన్ని సూచిస్తున్నాయి. అదే విధంగా ఒక సమాంతర మార్కెట్లోకి రేషన్లను మళ్ళించడాన్ని, ఆధార్ సీడింగ్లోనూ, డిజిటలైజేషన్‌లోనూ సరిచేయవలసిన లొసుగులనూ చూపిస్తోంది.
కర్నూలులో అవినీతికి పాల్పడుతున్న రేషన్ షాపు డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, 2016లో నిరసన కార్యక్రమం చేపట్టిన భారత కమ్యూనిస్టు పార్ట్ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) కర్నూలు జిల్లా కార్యదర్శి కె. ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, "డీలర్లు కర్నూలు చిరునామాలతో అదనపు రేషన్ కార్డులను తయారుచేసి వాటిని బోగస్ ఆధార్ కార్డులతో జత చేశారు. వారిపై కేసులు నమోదయ్యాయి. కొంతమంది రేషన్ షాపు డీలర్లు జైలుకు వెళ్ళి తిరిగి వచ్చారు." అన్నారు.
అలీ, నాగరాజులకు జరిగినటువంటి కొన్ని దురదృష్టకర సందర్భాల్లో మాత్రమే, పొరపాటున ఆపరేటర్లు పంచ్ చేసిన తప్పు అంకెల వల్ల లోపాలు సంభవించాయని ఎమ్ఆర్ఒ, పి. సుబ్బలక్షుమ్మ చెప్పారు. "వారు మీ సేవకు వెళ్లి వారి పది వేలిముద్రలను మరోసారి (వారి ఆధార్ డేటాలో) వేసి తప్పులను సవరిస్తే, దీనిని పరిష్కరించడం సాధ్యమవుతుంది," అని ఆమె అన్నారు.
కానీ అలీ చూడవలసినదంతా చూసేశారు. చిక్కులుపడిన తన ఆధార్-రేషన్ కార్డుల లంకెను విడదీయడానికి పని వదిలేసి మళ్ళీ బయలుదేరే సంకటంలోకి పడదలచుకోలేదు. ముగ్గురు పిల్లలున్న అతని కుటుంబంలో అతనే ప్రధాన సంపాదనాపరుడు. కూరగాయలు అమ్మడంతోపాటు అతనూ, అతని భార్యా అప్పుడప్పుడూ ఎమ్‌జిఎన్ఆర్ఇజిఎ పనిప్రదేశాలలో పని చేస్తుంటారు. "నేను ఎమ్ఆర్ఒ కార్యాలయానికి చాలాసార్లు వెళ్ళాను. ఇప్పుడు వాళ్ళు నన్ను డిఎస్‌ఒ కార్యాలయానికి వెళ్ళమని చెప్తున్నారు. అక్కడికి వెళ్ళటానికి నాకు సమయం ఎప్పుడు దొరుకుతుందో తెలియదు." అన్నారు అలీ.
అనువాదం: నిత్యా కూచిమంచి