"వాన మళ్ళ ఆగిపోయింది," అనుకుంటా ధర్మ గారెల్ చేతికట్టే సాయంతో తన పొలం దిక్కుకు నడుస్తున్నడు. “జూన్ ఒక ఇచ్చంత్రమైన నెలగా మారింది. రోజు 2-3 గంటల దాకా వాన పడుతది. అది కొన్నిమాట్లా పేసరుకాయ డళ్లుల్లెక్క పడితే, కొన్నిమాట్లా భారీగా ఇసిరి ఇసిరి కొడతది. అయితే ఇంతగనం వాన దంచినా కొన్ని గంటలకల్లా మళ్ళా వశంగాని వేడి ఉంటది. అప్పుడు ఆ వేడి భూమిలోని తేమ పీర్శకపోతది. దాంతోని నేల మళ్ల పొడిగా మారిపోద్ది. గిట్ల అయితాంటే మొలకలు ఎట్ల పెరుగుతయి?"
గారెల్‌పాడు, థానే జిల్లాలోని షాహాపూర్ తాలూకాలో 15 వార్లీ కుటుంబాలకు చెందిన ఆదివాసీ గ్రామం. ఆ గ్రామంల ఎనభై ఏళ్ల గారెల్ ఇంకా అతని కుటుంబం, తమకున్న ఎకరం పొలంల వరి సాగు చేసెటోల్లు. 2019 జూన్‌ల ఆళ్ళు నాటేసిన వరి పంట పూర్తిగా ఎండిపోయింది. ఆ నెలలో, 11 రోజులకు కేవలం 393 మి.మీ (సగటున 421.9 మి.మీ కంటే తక్కువ) వాన మాత్రమే పడ్డది.
వాళ్ళు అలుకుడు చేసిన వరి కూడా మొలకెత్తనే లేదు - కానీ దగ్గరదగ్గరా రూ. 10,000 దాకా నష్టపోయినరు. విత్తనాలు, ఎరువులు, ఒక ట్రాక్టర్ కిరాయి, ఇతర సాగు ఖర్చులు కలిపి అంత అయినయి.
"ఆగస్టులో మాత్రమే సాధారణ వర్షపాతంతో భూమి చల్లబడటం సురువు అయింది. రెండోతాప విత్తునాలు అలుకుతే నన్న మల్ల పంట పండుతుందని, కొంత ఫాయిదా ఉంటదని నేను ఖచ్చితంగా అనకున్న,” అని 38 ఏళ్ల ధర్మ కొడుకు, రాజు అన్నడు.
ఆ వర్షాభావ జూన్ తర్వాత, జూలైలో, ఆ తాలూకాలో చానా వర్షం (1586.8 మి.మీ) పడింది - ఆడ సాధారణ వర్షపాతం 947.3 మి.మీ. దీనితోటి, గారెల్ కుటుంబం ఆ రెండో పంట మీద ఆధారపడ్డది. కానీ ఆగస్టు నాటికి వానా చానా తీవ్రంగా మారింది - అది అక్టోబర్ దాకా అట్లనే పడ్డది. థానే జిల్లాలోని ఏడు తాలూకాలలో 116 రోజుల్లో దాదాపు 1,200 మిల్లీమీటర్ల అధిక వర్షపాతం నమోదైంది.
“మొక్కలు పెరిగేతందుకు సెప్టెంబర్ వరకు తగినంత వర్షం పడ్డది. మనుషులమే కడుపు పగిలిపోయే దాకా తినము. అసోంటిది చిన్న చిన్న మొలకలు ఎక్కువ నీళ్ళు ఎందుకు కోరుకుంటయి.?”, అని రాజు అంటడు. అక్టోబరులో కురిసిన వానలు, గారెల్ కుటుంబ పొలాన్ని ముంచెత్తినయి. "మేము సెప్టెంబర్ చివరి వారంల వరిని కోసి కట్టలుగా కట్టి, పేరుసుడు మొదలుపెట్టినము," అని 35 ఏళ్ల రైతు అయిన సవిత యాదికి చేసుకున్నది. ఈమె రాజు భార్య. “మేము ఇంకా మిగిలిన పంటను కోయవలసి ఉండే. అక్టోబర్ 5 తర్వాత ఆదాటున భారీ వర్షం కురిశింది. పేర్చిన పంటలను వీలైనంత వరకు ఇంట్లకు తీసుకపోయేటందుకు ప్రయత్నం చేసినం. కానీ నిమిషాల వ్యవధిలోనే మా పొలం ముంపుకు గురైంది…”
ఆగస్ట్‌లో ఏసిన రెండవ పంట నుండి, గారెల్ 3 క్వింటాళ్ల వరిని కాపాడుకోగలిగారు - ఇదివరకు అయితే వాళ్ళు ఒక్కో పంటకు 8-9 క్వింటాళ్ల దాకా పండించేటోళ్ళు.
"ఒక దశాబ్దం నుంచి గిట్లనే ఉంది" అని ధర్మ చెప్పిండు. "వర్షం పెరగలే అట్లని తగ్గలే, కానీ ఇంకా అసమానంగా తయారు అయింది - వేడి కూడా బాగానే పెరిగింది." 2018ల కూడా, సగటు కంటే తక్కువ వర్షపాతం కారణంగా ఈ కుటుంబం కేవలం నాలుగు క్వింటాళ్ల పంటను మాత్రమే పండించింది. 2017లో, అక్టోబర్‌లో మరో అకాల వర్షం వారి వరి పంటను దెబ్బతీశింది.
వర్షాలకు బదులుగా వేడి క్రమంగా తీవ్రమవుతున్నది. ఇంకా "అస్సలు ఓర్చుకోలేనిది" గా మారుతున్నది. అని ధర్మ గమనించిండు. న్యూయార్క్ టైమ్స్ వారు వాతావరణం మరియు గ్లోబల్ వార్మింగ్‌పై ఇంటరాక్టివ్ పోర్టల్ నుండి వచ్చిన డేటా ప్రకారం, 1960లో (అంటే అప్పుడు ధర్మాకు 20 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు) థానేలో 175 రోజులు మాత్రమే అక్కడి ఉష్ణోగ్రతలు 32 డిగ్రీల సెల్సియస్‌కు పెరిగేది. కానీ ఇప్పుడు అట్లా ఉష్ణోగ్రతలు పెరిగే సంఖ్య 237 రోజులకు పెరిగింది.
షాహాపూర్ తాలూకాలోని ఆదివాసీ కుగ్రామాలకు చెందిన అనేక కుటుంబాలు వరి దిగుబడి తగ్గిపోవుడు గురించి మాట్లాడుతున్నరు. జిల్లాలో కట్కారీ, మల్హర్ కోలి, మా ఠాకూర్, వార్లీ, ఇంకా ఇతర ఆదివాసీ సంఘాలు ఉన్నయి - థానేలో షెడ్యూల్డ్ తెగల జనాభా దాదాపు 1.15 మిలియన్లు (2011 జనాభా లెక్కలు), అంటే థానే జిల్లా మొత్తంలో దాదాపు 14 శాతం ఉంటరు.
“వర్షాధారిత వరిపంటకు క్రమమైన వ్యవధిలో నీటి తడులు అవసరం. అట్లా జరగాలి అంటే సరైన సమయంలో సరైన వర్షపాతం పడడం అవసరం. పంట క్రమంలో ఏ దశలోనైనా నీటి కొరత దిగుబడిని తగ్గిస్తుంది" అని పూణేలోని BAIF ఇన్స్టిట్యూట్ ఫర్ సస్టెయినబుల్ లైవ్లీహుడ్స్ అండ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ మేనేజర్ సోమనాథ్ చౌదరి చెప్పారు.
చానా మంది ఆదివాసీ కుటుంబాలు ఖరీఫ్ సీజన్ల చిన్న చిన్న ఖమతాల్లో వరిని పండించుకుని దాంతోనే సంవత్సరమంతా ఏళ్లదీసుకునేటోల్లు. ఆ తరువాత బతకడానికి ఇటుక బట్టీలల్ల, చెరకు పొలాలల్ల, ఇంకా ఏడ పని దొరికితే ఆడ పని చెయ్యడానికి సగం సంవత్సరం వలసపోతరు. కానీ వాళ్ళు ఇకనుంచి ఈ ప్రమాదకరమైన వార్షిక అనిశ్చితిలో ఆ సంగం సంవత్సరాన్ని కూడా లెక్కలకు తీసుకోరు. ఎందుకంటే అనియత రుతుపవనాల కారణంగా వరి దిగుబడి పదేపదే పడిపోతున్నది.
ఆ జిల్లాల వరిని ఖరీఫ్ సీజన్‌ల వర్షాధారంగా 136,000 హెక్టార్లలో మరియు రబీ సీజన్‌ల 3,000 హెక్టార్లలో (ప్రధానంగా ఓపెన్ బావులు, బోర్‌వెల్‌ల కింద) సాగు చేస్తరు. (2009-10 నాటి సెంట్రల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డ్రైలాండ్ అగ్రికల్చర్ డేటా ప్రకారం). అంతేకాక ఈడ పండించే ఇంకొన్ని ఇతర ప్రధాన పంటలు - మినుములు, పప్పులు, ఇంకా వేరుశెనగలు.
థానే జిల్లాలో ఉల్హాస్ ఇంకా వైతర్ణ అనే రెండు ప్రధాన నదులు ఉన్నయి. అవి ఒక్కొక్కటి అనేక ఉపనదులతో కలిసి ఏర్పడుతున్నయి. అంతేకాకుండా షాహాపూర్ తాలూకలో వీటిపై భట్సా, మోదక్ సాగర్, తాన్సా, ఇంకా అప్పర్ వైతర్ణ అనే నాలుగు పెద్ద ఆనకట్టలు కూడా ఉన్నయి. అయితే గివన్ని ఉన్న కూడా ఇక్కడ ఆదివాసీ తండాలల్లా మాత్రం వ్యవసాయం ఎక్కువగా వర్షం మీదనే ఆధారపడి ఉన్నది.
"ఈ నాలుగు డ్యామ్‌ల నీళ్ళు మొత్తం ముంబైకి సరఫరా చేయబడుతున్నయి. కానీ ఈన్నేమో ప్రజలు డిసెంబర్ నుండి మే వరకు, అంటే మళ్ళా వానకాలం వచ్చే దాకా నీటి కొరతను ఎదుర్కొంటరు. దీనితోటి ఎండాకాలంలో నీళ్లకోసం వీళ్లకు ట్యాంకర్లే ఏకైక దిక్కుగా మారుతున్నయి," అని షాహాపూర్‌కు చెందిన సామాజిక కార్యకర్త బాబన్ హరానే చెప్పిండు. ఆయన భట్సా నీటిపారుదల ప్రాజెక్ట్ పునరావాస కమిటీ సమన్వయకర్తగా కూడా పనిచేస్తున్నడు.
షాహాపూర్‌లో బోర్‌వెల్‌లకు డిమాండ్ పెరుగుతున్నదని ఆయన చెప్పిండు. జలవనరుల శాఖ తవ్వకాలను మినహాయించి, ప్రైవేట్ కాంట్రాక్టర్లు 700 మీటర్లకు పైగా అక్రమంగా తవ్వారు. భూగర్భజల సర్వేలు అభివృద్ధి ఏజెన్సీ యొక్క సంభావ్య నీటి కొరత నివేదిక, 2018, షాహాపూర్‌తో సహా థానేలోని మూడు తాలూకాలలోని 41 గ్రామాలల్లా భూగర్భ జలాలు క్షీణించాయని చూపిస్తున్నది.
“తాగనికే నీరు లేదు, ఇంకా మేము మా పంటలకు ఎట్ల జీవం పోస్తాము? పెద్ద రైతులు డ్యామ్ నుండి నీటిని పొందనీకి డబ్బు చెల్లించవచ్చు. లేదా ఆళ్ళకి బావులు, పంపులు ఉన్నందున ఎట్లనో పండిస్తారు,” అని రాజు చెప్పారు.
షాహాపూర్‌లోని ఆదివాసీ గ్రామాల నుండి చానా మంది ప్రతి సంవత్సరం నవంబర్ నుండి మే వరకు పని కోసం వలస వెళ్ళడానికి, నీటి కొరత ఒక ప్రధాన కారణం. అక్టోబరులో ఖరీఫ్ కోత తర్వాత, ఆళ్ళు మహారాష్ట్ర లేదా గుజరాత్‌లోని ఇటుక బట్టీలకు, లేదా రాష్ట్రంలోని చెరకు పొలాలకు కూలీలకు పోతారు. మల్ల ఖరీఫ్ విత్తన సీజన్‌కు తిరిగి వస్తారు. గప్పుడు అల్ల దగ్గర కొన్ని నెలలకు సరిపోయే డబ్బు మాత్రమే ఉంటది.
రాజు, సవిత గారెల్ కూడా చెరకు పొలంలో పని చేయనీకి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న నందుర్‌బార్ జిల్లాలోని, షాహడే తాలూకాలోని ప్రకాశ గ్రామానికి బత్కపోతరు. అయితే 2019 డిసెంబరులో వాళ్ళు కొంచెం ఆలస్యంగా బయలుదేరారు. గప్పుడు ధర్మా వారి 12 ఏళ్ల కుమారుడు అజయ్‌ని తిరిగి గారెల్‌పాడులో విడిచిపెట్టి వెళ్ళవలసి వచ్చినందున ఆ ఆలస్యం జరిగింది. నలుగురు ఉన్న ఆ కుటుంబానికి, జూన్ వరకు మూడు క్వింటాళ్ల బియ్యం మాత్రమే ఉన్నాయి. “మేము సమీపంలో ఉన్న అఘై గ్రామం నుండి కంది పప్పు పండించే రైతులతో కొంత బియ్యం మార్పిడి చేసుకుంటము. ఈసారి అది వీలుపడదు .పంట సరిగా రాలే.. ..”, అని రాజు నాతో చెప్పిండు.
అతను, సవిత ఇద్దరూ కలిసి దగ్గర దగ్గర ఏడు నెలలుచెరకు పొలాల్లో కష్టపడి దాదాపు రూ. 70,000 సంపాదించినరు. జూన్ సెప్టెంబర్ మధ్య, షాహాపూర్ నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న భివాండి తాలూకాలోని ఆన్‌లైన్ షాపింగ్ వేర్‌హౌస్‌లో కూడా రాజు లోడర్‌గా పనిచేస్తున్నడు – ఇది సాధారణంగా 50 రోజుల పని. ఈడ రోజుకు రూ.300 వస్తయి.
గారెల్‌పాడుకు 40 కిలోమీటర్ల దూరంలోని బేర్శింగిపాడు తండాలో మాలు వాఘ్ కుటుంబం నివసిస్తుంది. వాళ్ళు కూడా వరి దిగుబడి పడిపోవడంతో ఇబ్బందులు పడుతున్నరు. గడ్డితో కప్పిన అతని మట్టి గుడిసెల, ఒక మూలకు, చీడపీడలు పట్టకుండా ఉండటానికి రెండు క్వింటాళ్ల వరిని వేప ఆకుల మధ్య కానగి -ఆవుపేడ-వెదురు తో తయారుచేసిన గుమ్మిలో నిల్వ చేస్తరు. "ఇప్పుడు వాళ్ళ గుడిసె ఇంట్లున్న అత్యంత విలువైన వస్తువు అదే" అని మాలూ గత నవంబర్‌లో నాతో చెప్పిండు. “వానను నమ్మవశం కాదు కాబట్టి మనం మన దిగుబడిని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలె. వాన మన మాటినేది కాదు. ఎప్పుడు పడుతదో, ఎప్పుడు ఆగుద్దో ఎవ్వలకు తెలువది. దాని స్వంత హృదయానికి అదే రాజు.."
అధ్యయనాలు కూడా ఇది నిజమని చెప్తున్నయి - వర్షం మోసపూరితంగా మారింది. "మేము మహారాష్ట్రలో 100 సంవత్సరాలకు పైగా వర్షపాతం డేటాను విశ్లేషించాము" అని భారత వాతావరణ విభాగం (IMD) 2013లో చేసిన అధ్యయనం యొక్క ప్రధాన రచయిత డాక్టర్ పులక్ గుహతకుర్తా చెప్పినరు. మహారాష్ట్రలో పెరుగుతున్న నీటి కొరతతో, వర్షపాతం నమూనాలో మార్పులను, ఇంకా కాలానుగుణ సూచికలో మార్పులను గుర్తించడం అనే శీర్షికతో, ఈ అధ్యయనం ప్రచురించబడింది. రాష్ట్రంలోని మొత్తం 35 జిల్లాల్లో 1901-2006 కాలంలో నెలవారీ వర్షపాత డేటాను ఈ అధ్యయనం విశ్లేషిస్తది "చిన్న ప్రాదేశిక ప్రమాణాలపై తాత్కాలిక, ప్రాదేశిక నమూనాలపై వాతావరణ మార్పుల ప్రభావం ఈ విశ్లేషణలో స్పష్టంగా గుర్తించబడ్డయి. ముఖ్యంగా వర్షంపై ఆధారపడిన వ్యవసాయ ప్రాంతాలలో, వ్యవసాయ దృక్కోణం నుండి చూస్తే, ఈ మారుతున్న నమూనాలు చానా కీలకమైనవి," అని డాక్టర్ గుహతకుర్తా అన్నరు. వాతావరణ పరిశోధన సేవల కార్యాలయంలో ఆయన శాస్త్రవేత్త.
ఈ మారుతున్న నమూనాలు భూమిపై చానా స్పష్టమైన ప్రభావాన్ని చూపుతున్నయి. కాబట్టి, 56 ఏళ్ల మాలు వాఘ్ ఇంకా ఆయన కుటుంబం - కట్కారీ కమ్యూనిటీ - గుజరాత్‌లో ఉన్న వల్సాద్ జిల్లాలోని వాపి పట్టణానికి నవంబర్ 2019లో ఇటుక బట్టీలో పని చేయడానికి బయలుదేరినప్పుడు - ఆ కుగ్రామంలోని 27 ఆదివాసీ కుటుంబాలలో చానా వరకు - 50 కిలోల బియ్యం మోసుకెళ్లినరు. ఆ సమయంలో తాళం వేసిన గుడిసెలో కేవలం రెండు క్వింటాళ్లు మాత్రమే మిగిలి ఉన్నయి. వాళ్ళు తిరిగి వచ్చినంక మే-జూన్ నుండి అక్టోబర్ వరకు ఆ కొద్దిబియ్యంతోటే బతకవలసి ఉంటది.
“దాదాపు 5 నుండి 10 సంవత్సరాల కిందట, మేము 8-10 క్వింటాళ్లు బియ్యం పండిన్చేటోల్లము. అందుట్ల 4 నుండి 5 క్వింటాళ్ల బియ్యం మా ఇంట్లో ఉత్తగనే నిలువకు పడి ఉండేయి. అవసరమైనప్పుడు, మేము దానిలో కొంత భాగాన్ని వేరే రైతులతో కంది, నాగ్లి [రాగి], వారై [మిల్లెట్], హరభర [సెనగలు] కోసం మార్పిడి చేశేటోల్లము, ”అని మాలు భార్య అయిన 50 ఏళ్ల నకుల చెప్పింది. గట్ల ఆముదాను గా ఉండే బియ్యం ఐదుగురు ఉన్న కుటుంబాకి సంవత్సరం అంతా ఆకలి తిరుస్తుండే. ఇప్పుడు అయితే ‘‘ఐదేళ్ల నుంచి 6 నుంచి 7 క్వింటాళ్లకు మించి వరి పండుతనే లేదు.”
"ప్రతి సంవత్సరం దిగుబడి తగ్గుతంది," అని మాలు చెప్పింది.
పోయిన యాడాది ఆగస్టుల వానలు పడుడుతోటి వాళ్ళ ఆశలు చిగురించినయి. కానీ అక్టోబరుల 11 రోజుల్లో 102 మిల్లీమీటర్ల అకాల భారీ వర్షపాతం, ఆ కుటుంబానికి ఉన్న ఒకే ఒక్క ఎకురం వ్యవసాయ భూమిని ముంచెత్తింది. పండించిన వరి పంట తడిసిపోయింది – వాళ్ళు మూడు క్వింటాళ్లను మాత్రమే కాపాడుకోగలిగారు. "ఈ వర్షపాతం కారణంగా మేము విత్తనాలు, ఎరువులు మరియు ఎద్దుల కిరాయికి ఖర్చు చేసిన 10,000 రూ. కూడా వృధా అయిపోయినయి.” అన్నది మాలు.
థానే జిల్లాలో ఉన్న షాహాపూర్ తాలూకాలోని ఈ కుగ్రామంలో 12 కట్కారీ మరియు 15 మల్హర్ కోలీ కుటుంబాలు నివసిస్తరు. అందుట్ల చానా మంది ఇదే రకమైన నష్టాన్ని భరించినరు.
“ఋతుపవనాలు ఇప్పటికే చానా వేగంగా మారుతన్నయి అని తెలుసు. ఈ వైవిధ్యం వాతావరణ మార్పుల వల్ల మరింత తీవ్రతరం అవుతున్నది. దీని కారణంగా రైతులు తమకు అనుగునమైన పంట కాలాలను, విధానాలను అనుసరించలేకపోతున్నరు" అని బొంబాయిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో క్లైమేట్ స్టడీస్ ఇంటర్ డిసిప్లినరీ ప్రోగ్రామ్ కన్వీనర్ ప్రొఫెసర్ డి.పార్థసారథి చెప్పినరు. మహారాష్ట్రలోని నాసిక్, కొంకణ్ జిల్లాలు వర్షపాతం తీవ్రత(వెట్ స్పెల్స్ )లో గణనీయమైన పెరుగుదలను చూపెడుతున్నయని కూడా అయన అన్నరు. 1976-77 తర్వాత, థానే జిల్లాలో విపరీతమైన వర్షపాతం కురిసే రోజులలో (వర్షపాతం ఫ్రీక్వెన్సీ) వ్యత్యాసం ఉన్నదని ఆయన నిర్వహించిన ఒక అధ్యయనం తెలియజెప్పుతున్నది.
ఈ అధ్యయనం వ్యవసాయంపై వాతావరణ మార్పు ఎటువంటి ప్రభావం చూపిస్తున్నది అన్న విషయం పై దృష్టి సారించింది. 1951 - 2013 మధ్య 62 సంవత్సరాల పాటు, మహారాష్ట్రలోని 34 జిల్లాల నుండి సేకరించిన రోజువారీ వర్షపాత డేటాను ఈ అధ్యయనం విశ్లేషించింది. "వాతావరణ మార్పు అవపాతం [వర్షపాతం] నమూనాలను ప్రభావితం చేస్తది. ఈ మార్పు వానకాలం ప్రారంభం, రుతుపవనాల విరమణ, తడి మరియు పొడి కాలాలు, వర్షపాతం, విత్తనాలు అలికే/నాటే తేదీ, అవి మొలకెత్తే శాతం మరియు మొత్తం దిగుబడిపైన ప్రతికూల ప్రభావం చూపుతున్నదని అధ్యయనాలు చెబుతున్నయి. కొన్నిసార్లు ఇది పెద్ద ఎత్తున పంట వైఫల్యానికి కూడా దారి తీస్తున్నది. ” అని అంటాడు ప్రొ.పార్థసారథి.
బెర్సింగిపాడుకు 124 కి.మీ దూరంలోన ఉన్న నెహ్రోలి గ్రామంలో, మా ఠాకూర్ వర్గానికి చెందిన 60 ఏళ్ల ఇందు అగివాలే కూడా ఈ మారుతున్న తీరు గురించి చెప్తున్నది. “మేము రోహిణి నక్షత్రంలో [25 మే నుండి జూన్ 7 వరకు] విత్తనాలు ఏస్తము. పుశ్య్యం [20 జూలై నుండి ఆగస్టు 2] వచ్చే సమయానికి, మా పంటలు నాట్లు ఏయడానికి తయారుగా ఉంటయి. చిత్రా నక్షత్రం [10 అక్టోబర్ నుండి 23 అక్టోబర్] వచ్చే నాటికి మేము కోత నూర్పిడిని మొదలుపెడతము. ఇప్పుడు ఇదంతా [వరి సాగు ప్రక్రియ] ఆలస్యం అయితంది. చానా కాలంగా నక్షత్రాలు, కార్తుల ప్రకారం వానలు పడుతలెవ్వు. ఎందుకో నాకు అర్థం అయిత లేదు."
ఇందు కూడా పెరుగుతున్న వేడి గురించి మాట్లాడుతున్నది. “నా జీవితంలో పుట్టి బుద్దెరిగిన కాన్నుంచి ఇంత వేడిని ఎన్నడూ సూడలేదు. నా చిన్నప్పుడు రోహిణీ నక్షత్రం నాడు విపరీతంగా వానలు కురిషేటియి. ఎండాకాలంలో వేడిక్కిన భూమిని చల్లబరిచే ప్రకియ వర్షం. వానకు తడిసిన భూమి వాసన గాలిలో ఉంటది. ఇప్పుడు ఆ సుగంధం చానా అరుదుగా వస్తున్నది...” అని ఆమె తన రెండు ఎకరాల వ్యవసాయ భూమిలో చుట్టూ కంచె కట్టడానికి అంచుల దగ్గర గుంతలు తవ్వుకుంట చెప్పింది.
అసమాన వర్షపాతం, దిగుబడులు పడిపోవడం, ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు షహాపూర్‌లో భూసారం కూడా తగ్గుతున్నదని ఇక్కడి రైతులు చెబుతున్నరు. నెహ్రోలి గ్రామానికి చెందిన 68 ఏండ్ల కిసాన్ హిలామ్, హైబ్రిడ్ విత్తనాలు రసాయన ఎరువులు కూడా ఇందుకు కారణమని ఆరోపించినరు. “మసూరి, చికందర్, పోషి, డాంగే...ఈ [సాంప్రదాయ] విత్తనాలు ఇప్పుడు ఎవలి దగ్గర ఉన్నయి? అందరూ సాంప్రదాయం నుండి హైబ్రిడ్ విత్తనాలకు మారిండ్లు. ఇప్పుడు ఎవలూ విత్తనాలను సంరక్షించడం లేదు…” అని ఆయన చెప్పినరు.
మేము కలిసినప్పుడు అతను పిచ్‌ఫోర్క్‌తో మట్టిలో హైబ్రిడ్ విత్తన రకాన్ని కలుపుతున్నాడు. "నేను వాటిని ఉపయోగించడాన్ని వ్యతిరేకించాను. సాంప్రదాయ విత్తనాలు తక్కువ దిగుబడిని ఇస్తయి, కానీ అవి పర్యావరణానికి అనుగుణంగా ఉంటయి. ఔషధాలు [ఎరువులు] లేకపోతే ఈ కొత్త విత్తనాలు అస్సలు పెరగయి. ఇది నేల యొక్క స్వచ్ఛతను [సారవంతం] తగ్గిస్తది.ఈ రకాలకు వర్షపాతం తక్కువగా ఉన్నదా లేదా భారీగా ఉన్నదా అనే దానితో సంబంధం ఉండది.”
“రైతులు తమ సొంత సాంప్రదాయ విత్తనాల నిల్వలను కాపాడుకునుడు ఇడిశిపెట్టి, విత్తన కంపెనీలపై ఎక్కువగా ఆధారపడుతున్నరు. కానీ ఈ హైబ్రిడ్ విత్తనాలకు, కాలక్రమేణా, అధిక మొత్తంలో ఎరువులు, పురుగుమందులు, ఇంకా నీరు అవసరం పడతయి. ఇవి [ఇన్‌పుట్‌లు] అందుబాటులో లేకుంటే ఆ రకాలు కచ్చితంగా దిగుబడులను ఇయ్యలేవు. దీని అర్థం ఎందంటే మారుతున్న వాతావరణ పరిస్థితులల్లా, హైబ్రిడ్ రకాలు స్థిరంగా ఉండవు" అని పూణేలోని ఇన్స్టిట్యూట్ ఫర్ సస్టైనబుల్ లైవ్లీహుడ్స్ అండ్ డెవలప్‌మెంట్ BAIFకి చెందిన అసిస్టెంట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ సంజయ్ పాటిల్ వివరించినరు. "గ్లోబల్ వార్మింగ్ మరియు వాతావరణ మార్పుల కారణంగా, ఇప్పుడు సకాలంలో ఊహించదగిన వర్షపాతం చానా అరుదు. కాబట్టి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉండే ప్రధానమైన పంటలను పండించుడు చానా అవసరం."
"ఆ ప్రాంతాలలో ఉపయోగించే సాంప్రదాయ వరి విత్తనాలు, వాతావరణ పరిస్థితులలోని మార్పులతో సంబంధం లేకుండా కొంత ఉత్పత్తిని ఇవ్వడానికి సరిపోతయి" అని BIAF యొక్క సోమనాథ్ చౌదరి చెప్పినరు.
హైబ్రిడ్ విత్తనాలకు కూడా సాధారణంగా ఎక్కువ నీరు అవసరం పడుతది. వర్షాధార గ్రామాలలో, వర్షపాతంలో హెచ్చుతగ్గులు ఉంటే, పంటలు నష్టపోతయి.
మేము ఫోన్‌లో మాట్లాడినప్పుడు, మాలు, నకులు, వారి కుమారుడు రాజేష్, కోడలు లత 10 సంవత్సరాల మనవరాలు సువిధ, ఈ సంవత్సరం ప్రారంభంలో వాపిలోని ఇటుక బట్టీలో వారు కట్టుకున్న తాత్కాలిక గుడిసెలో, భోజనం చేస్తున్నరు. వాళ్ళు తము తినే భోజన పరిమాణాన్ని తగ్గించుకున్నరు - కొన్ని వంకాయలు, బంగాళాదుంపలు లేదా కొన్నిసార్లు టమోటా రసాలతో అన్నం - రోజుకు ఒకసారి మాత్రమే తింటున్నరు.
“ఇటుకలు తయారు చేసుడు అంత అల్కటి పని కాదు. మన చెమట కూడా బురదలో నీళ్లలెక్క కలిసిపోతది. కాబట్టి, పనిని కొనసాగించడానికి మనం సరిగ్గా తినాలి.కానీ ఈసారి దిగుబడి తక్కువగా ఉండడంతో ఒక్కపూటే తింటున్నాము. ఎందుకంటే జూన్ లో విత్తనాలు అలికే సీజన్‌లోపు మేము మా [బియ్యం] నిలువలను అయిపోగొట్టుకోలేము., ”అని మాలు చెప్పారు.
ఇటుకల తయారీ సీజన్ ముగిసే సమయానికి, అంటే మే నాటికి, వాళ్ళు సాధారణంగా బేర్శింగిపాడుకు తిరిగి వస్తరు. అప్పుడు వాళ్ళ చేతిలో సుమారు రూ. 80,000-90,000 ఉంటయి. ఈ డబ్బులతోనే వారి వ్యవసాయ పెట్టుబడులు, కరంటు బిల్లులను, మందులు/ఎరువుల ఖర్చులను - ఉప్పు, కారం, కూరగాయలు వంటి మరెన్నో రేషన్‌ల ఖర్చులను తీర్చుకోవాలి.
షహాపూర్‌లోని ఆదివాసీ కుగ్రామాల్లోని మాలు వాఘ్, ధర్మ గారెల్ మరియు మిగతావాళ్లకు 'వాతావరణ మార్పు' అనే పదం తెలవకపోవచ్చు, కానీ వాళ్ళు మార్పును స్వయంగా తెలుసుకుంటున్నరు. ప్రతిరోజూ దాని ప్రభావాలను నేరుగా ఎదుర్కొంటున్నరు. వాళ్ళందరూ వాతావరణ మార్పుల యొక్క అనేక కోణాల గురించి స్పష్టంగా మాట్లాడతరు: అస్థిర వర్షపాతం, దాని అసమాన పంపిణీ గురించి, భూమి ఉష్ణోగ్రతల్లో భయంకరమైన పెరుగుదల గురించి మాట్లాడుతరు. నీటికోసం ఎక్కువ సంఖ్యలో బోర్‌వెల్‌ల కోసం ఎగబడటం వల్ల భూగర్భ నీటి వనరులపై పడే ప్రభావం గురించి కూడా మాట్లాడుతరు. ముఖ్యంగా వీటన్నింటి వల్ల, భూమి, పంటలు, వ్యవసాయంపై; విత్తనాలలో మార్పులు, దిగుబడిపై అవి చూపెట్టే ప్రభావం గురించి కూడా మాట్లాడుతరు; వీటన్నింటి ఫలితంగా ఆహార భద్రత దిగజారుతున్నదని వాతావరణ శాస్త్రవేత్తలు చానా బలంగా హెచ్చరిస్తున్నరు.
వాళ్ళకి ఇదంతా ప్రత్యక్ష అనుభవం. నిజానికి వీళ్ళ పరిశీలనలు, శాస్త్రవేత్తలు చెప్పేదానికి చాలా దగ్గరగా ఉన్నది. – కానీ వాళ్ళు చెప్పేది చానా భిన్నమైన భాషలో. దీనితో పాటు ఈ తండాల్లో అధికారులతో అదనపు యుద్ధం జరుగుతనే ఉంటది - అది కూడా సాధారణంగా అటవీ శాఖ వాళ్ళతోనే.
మాలు ఇలా చెప్తుంది: మా పోరాటం కేవలం “వర్షంతో మాత్రమే కాదు. మాకు పోరాడడానికి ఇంకా చానా సమస్యలు ఉన్నయి. ముఖ్యంగా భూమి పట్టాల కోసం అటవీ అధికారులతో, నిత్యావసర సరుకుల కోసం రేషన్ అధికారులతో ఎప్పుడూ పోరాడుతనే ఉండాలి. అలాంటప్పుడు వర్షం కూడా మమ్ముల్ని ఎందుకు విడిచిపెడుతది ?”
”80 ఏళ్ల ధర్మ గారెలపాడులోని తన వ్యవసాయ భూమిలో నిలబడి మాట్లాడుతూ, “వాతావరణం చానా వేడిగా మారింది. ఎనకటి లెక్క ఇప్పుడు వానలు సకాలంలో పడతలేవు. ప్రజలు మునుపటి కాలంలో లెక్క మంచిగా ఉండకపోతే, నిసర్గ్ [ప్రకృతి] ఎలా ఉంటది? అది కూడా మారుతంది..."
వాతావరణ మార్పుల గురించి ప్రజల అనుభవాలను వారి గొంతులతోనే రికార్డు చేయాలని PARI దేశవ్యాపిత వాతావరణ మార్పులపై రిపోర్టింగ్ ప్రాజెక్టును UNDP సహకారంతో చేపట్టింది.
ఈ వ్యాసాన్ని ప్రచురించాలనుకుంటున్నారా ? అయితే [email protected] కు మెయిల్ చేసి [email protected] కు కాపీ పెట్టండి.
అనువాదం: జి విష్ణు వర్ధన్