"నిన్ను నమ్మి నా జీవితగాథ నీతో చెప్పవచ్చా?
ఇది ఒక సూటిగా గురిపెట్టి విసిరిన సవాలు. ఈ ప్రశ్న అడగడానికి తన వద్ద గట్టి కారణాలు కూడా ఉన్నాయి. తమిళనాడులోని విల్లిపురం జిల్లాలో పెద్దగా పేరు తెలియని పల్లెటూరు నుండి వచ్చిన జనని(పేరు మార్చబడింది), తన జీవితగాథను చెప్తుంది. “క్షయ నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.”
ఆమెకు పెళ్లయి సంవత్సరంన్నర, ఒక నాలుగున్నర నెలల బాబుకూడా ఉన్నాడు. అప్పుడే ఆమెకు క్షయ సోకింది. “మే 2020 లో నాకు లక్షణాలు బయటపడ్డాయి. అంతకు ముందు నెలంతా విపరీతమైన దగ్గు, జ్వరం.” మామూలుగా చేసే అన్ని పరీక్షలు చేసి ఏమి తేలక, డాక్టర్ ఆమెని టిబి పరీక్ష చేయించుకోమన్నాడు. “నాకు క్షయ(టిబి)అని తెలియగానే నేను భోరున ఏడ్చాను. నాకు తెలిసిన వారెవరికీ ఇది రాలేదు. నాకు వస్తుందని నేను ఊహించలేదు.”
“మా ఊరిలో ఈ జబ్బు ని చాలా చెడ్డగా చూస్తారు. ఈ జబ్బు తో ఎవరిని కలవడం కుదరదు- ఈ జబ్బు నాకే రావడమంటే…!”
ఆ రోజు నుంచి ఒకప్పుడు ఎంతో ప్రేమగా ఉండే జనని 27 ఏళ్ళ భర్త, ఊరికూరికే ఆమెను ఈ జబ్బు తెచ్చుకుందని , తనకి కూడా అంటిస్తుందని అనడం మొదలు పెట్టాడు. “అతను నన్ను మాటలతోను, దెబ్బలతోను హింసించేవాడు. అతని అమ్మ మా పెళ్ళైన ఒక ఏడాదికి చనిపోయింది. అంతకు ముందే ఆమెకు కిడ్నీ కి సంబంధించిన ఇబ్బందులేవో ఉండేవి. కానీ నా భర్త తన తల్లి నావల్లే చనిపోయిందని అనడం మొదలు పెట్టాడు.”
అసలు ఈ వ్యాధి వలన ఎవరికైనా ప్రమాదం ఉందంటే అది మొదట జననికే ఉంది.
క్షయ ఇప్పటికీ భారతదేశంలో మనుషులు చనిపోయేంత పెద్ద అంటువ్యాధి.
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(World Health Organisation) ప్రకారం, 2019లో కోవిడ్ 19 రాక మునుపే క్షయ, భారతదేశంలో 26 లక్షలాదిమంది కన్నా ఎక్కువ మందికి సోకి 4,50,000 మందిని పొట్టన పెట్టుకుంది . కానీ భారత ప్రభుత్వం ఆ విషయాన్ని ఒప్పుకోక మొత్తంగత 15 నెలలలో క్షయ వలన జరిగిన మరణాలు 79,000 కు మించలేదని చెప్పింది
2019 లో మొత్తం ప్రపంచం లో ఉన్న క్షయ వ్యాధి కేసులలో పావు వంతు భారతదేశం నుంచే ఉన్నాయని, అవి మొత్తం ఒక కోటిదాకా ఉండొచ్చని WHO చెప్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఒక కోటి మంది క్షయ వలన రోగగ్రస్తులయ్యారు. ఈ మధ్యలో ఈ సంఖ్య నెమ్మదిగా ప్రతి సంవత్సరమూ తగ్గుతూ వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సంభవించిన 14 లక్షల టీబీ మరణాలలో పావు వంతు భారతదేశం నుండే ఉన్నాయి.
WHO క్షయ ని గురించి వివరిస్తూ , “ ఇది బ్యాక్టీరియా( మైకో బ్యాక్టీరియం ట్యూబర్కులోసిస్) వలన కలిగేది, ఎక్కువగా ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. క్షయ ఒక మనిషి నుండి మరొకరికి గాలి ద్వారా వ్యాపిస్తుంది. ఊపిరితిత్తులలో టిబి ఉన్నవారు దగ్గినా, తుమ్మినా, ఉమ్మినా వాళ్ళు గాలిలోకి టీబీ క్రిములను వదులుతారు. ఆ గాలి ని పీల్చిన మనిషికి టీబీ సోకుతుంది. మన ప్రపంచ జనాభాలో పావువంతు మందికి టీబీ ఇన్ఫెక్షన్ ఉంటుంది, అంటే వారికి టీబీ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉన్నా సరే, వారు ఇంకా జబ్బు పడలేదు కాబట్టి వారు టిబిని వ్యాపింపజేయరు.
WHO క్షయను,“పేదరికం, ఆర్థిక ఇబ్బందుల జబ్బు” అని కూడా అంటుంది. క్షయ వచ్చిన వారు చాలా సార్లు, సమాజం వలన “నిస్సహాయులై, తిరస్కరించబడి, చిన్నచూపును వివక్ష ను ఎదుర్కొంటారని తెలుపుతుంది.
జననికి అందులో సత్యమెంతో తెలుసు. ఆమె ఎంతో చదువుకున్నదైనా - ఆమెకు సైన్స్ ల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండినా , బి.ఈడి కూడా చేసినా. ఆమెకు ఈ నిస్సహాయతను, తిరస్కారాన్ని, వివక్ష ను ఎదుర్కోక తప్పలేదు. ఆమె తండ్రి ఒక రోజువారీ కూలి. దొరికిన పని చేస్తాడు. ఆమె తల్లి ఇంట్లోనే ఉంటుంది.
ఆమె చికిత్స మొదలయినప్పటి నుంచి ముగిసేవరకు జనని అక్కడ కాంపెయిన్ లో “టీబీ యోధ” లేదా “టీబీ వుమన్ లీడర్” గా పిలిచే వ్యక్తి అయింది. ఆమె క్షయ మీద ఉన్న అపోహలు, ఆ జబ్బు ఉన్నవారి పై వివక్షను తొలగించడానికి ప్రయత్నం చేస్తోంది.
ఆమెకు క్షయ అని తెలిసిన నెల లోపలే జనని తన పుట్టింటికి వెళ్ళిపోయింది. “ఇక నా భర్త హింసని భరించలేక పోయాను. పైగా నా నాలుగు నెలల పిల్లవాడిని కూడా హింసించేవాడు. ఆ చిన్నవాడు ఏం పాపం చేసాడని?” ఒక చిన్న వర్క్ షాప్ నడిపే ఆమె భర్త విడాకులకు కాగితాలు పంపాడు. ఆమె తల్లిదండ్రులు ఆ విషయాన్ని అసలు నమ్మలేకపోయారు.
కానీ వాళ్ళు ఆమెను ఇంటికి సాదరంగా ఆహ్వానించారు. జనని వారికి ఎంతో రుణపడి ఉన్నానని చెప్తుంది. “నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడూ కాస్త పెద్దయ్యాక కూడా వారు నన్నెప్పుడు పొలం పనికి పంపలేదు. మా చిన్న ప్రపంచం లో అది చాలా మామూలు విషయం. కానీ వారు మా పిల్లలందరికీ చదువు అబ్బేలా జాగ్రత్తపడ్డారు.” ఆమెకు ఒక అన్న, ఒక అక్క ఉన్నారు. ఇద్దరూ పోస్ట్ గ్రాడ్యుయేట్, డిగ్రీ పట్టభద్రులు. జనని కూడా భర్త నుంచి విడిపోయాకే ఉద్యోగం చేయడం మొదలుపెట్టింది.
ఇక డిసెంబరు 2020 నాటికి పూర్తిగా కోలుకున్న జనని ఆమెకు అర్హత కు సరిపోయే పలురకాల ఉద్యోగాలను వెతకలేదు. దానికి బదులుగా ఆమె రిసోర్స్ గ్రూప్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ అడ్వొకేసీ ఫర్ కమ్యూనిటీ హెల్త్ (REACH) అని తమిళనాడు లో క్షయ నిర్మూలనకై రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్న ఒక లాభాపేక్ష లేని సంస్థ లో చేరింది. అప్పటి నుంచి జనని తన ఊరిలో ను, పక్క ఊర్లలోనూ క్షయ పై అవగాహన పెంచి క్షయను మొదట్లోనే కనిపెట్టే దిశగా పనిచేస్తోంది. “నేను చాలా మీటింగులు నిర్వహించాను. ముగ్గురు పేషెంట్ల లో ముందస్తుగానే క్షయని కనిపెట్టాను. ఇంకా 150 పేషెంట్ల ను, నెగటివ్ అయిన తరవాత కూడా లక్షణాలున్నవారిని తరచుగా ఫాలో అప్ చేస్తుంటాను. “
WHO నివేదిక ప్రకారం, “క్షయ నయం చేయదగినది, నివారించదగినది. క్షయ సోకినవారిలో దాదాపు 85 శాతం మనుషులు ఆరు నెలల చికిత్సతో హాయిగా జబ్బు నుంచి బయటపడతారు. 2000 నుంచి క్షయ చికిత్స వలన 600 లక్షల మరణాలను నివారించగలిగాము కానీ సార్వత్రిక ఆరోగ్య కవరేజ్ (యుహెచ్‌సి) కు ఇంకా తగినంత అవకాశం లేకపోయి, అనేక మిలియన్ల మంది రోగ నిర్ధారణను, చికిత్సను అందుకోలేకపోయారు.”
*****
“కోవిడ్, లాక్ డౌన్- రెండూ పెద్ద సవాళ్లుగా నిలిచాయి” అన్నది టెంకాసి జిల్లాకు చెందిన 36 ఏళ్ళ బి.దేవి. జనని లానే ఆమె కూడా క్షయ నుంచి కోలుకొని టీబీ యోధ అయింది. “నేను ఏడో తరగతిలో ఉన్నప్పుడు నాకు క్షయ వచ్చింది.దానికి ముందు ఆ పదాన్ని కూడా నేను వినలేదు.” అంత కష్టం లోనూ ఆమె పన్నెండో తరగతి వరకు చదువుకోగలిగింది.
ఆమె తల్లిదండ్రులు ఆమెను ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు, అక్కడ ఆమెకు వ్యాధి నయం కాలేదు. “అప్పుడు మేము టెంకాసి లోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాము. అక్కడ రకరకాల చికిత్సావిధానాలు ప్రయత్నించారు. కానీ ఇప్పుడు ఆలోచిస్తే, ఆ చికిత్సలో ఏదీ నాకు భరోసాను ఇవ్వలేదు. నాకు దగ్గరగా వచ్చేవారికి ఇటువంటి అనుభవం జరగకుండా ఉండాలని కోరుకున్నాను.” అని దేవి చెప్పారు.
దేవి టెంకాసి జిల్లాలోని వీరకేరలంపుదూర్ అనే తాలూకాకు చెందినది. ఆమె తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. పేదరికం ఉన్నప్పటికీ, టిబి ఆమెకు సోకినప్పుడు వారు, ఆమె ఇతర బంధువులు చాలా ధైర్యాన్నిచ్చారని ఆమె చెప్పింది. వారు ఆమెకు సరైన చికిత్సను అందించి ఫాలోఅప్ లు సరిగ్గా చేశారు. "నన్న చాలా జాగ్రత్తగా చూసుకున్నారు," అని ఆమె చెప్పింది.
దేవి భర్త కూడా చాలా ధైర్యాన్ని, భరోసాని ఇచ్చేవాడు. అతను ఆమె ఉద్యోగం గురించి కూడా ఆలోచించాడు. ఆమె యాంటీ- టిబి కాంపెయిన్ లో పాల్గొని, శిక్షణ పొంది, జనని లానే లాభాపేక్షలేని సంస్థ లో పని చేస్తుంది. సెప్టెంబర్ 2020 నుండి, దేవి డజనుకు పైగా సమావేశాలను నిర్వహించారు (సగటున 20 లేదా అంతకంటే ఎక్కువ మంది హాజరయ్యారు) దీనిలో ఆమె క్షయ గురించి మాట్లాడారు.
“నేను శిక్షణ పొందాకనే క్షయ వ్యాధిగ్రస్తులతో ఎలా మాట్లాడాలో నేర్చుకున్నాను. నిజం చెప్పాలంటే శిక్షణ తరవాత నాకు బోల్డంత ఉత్సాహం వచ్చింది. నాకు అవసరమైనప్పుడు దొరకనిది, నేను వేరే వాళ్ళకి ఇప్పుడు ఇవ్వగలను.”. అన్నదామె. టెంకాసి జిల్లా పులియముడి మున్సిపాలిటీ లోని జనరల్ ఆసుపత్రి లో దేవి 42 మంది క్షయ వ్యాధిగ్రస్తులని చూసుకుంటుంది. ఇందులో ఒకరు పరిపూర్ణంగా నయమయ్యారు. “ మేము చాలా వరకు కౌన్సెల్లింగ్, పేషెంట్ల తో ఫాలో అప్ లు చేస్తాము. ఒక వ్యక్తి కి క్షయ వస్తే అతన్ని పూర్తి కుటుంబాన్ని పరీక్ష చేసి, వారికి రాకుండా నివారణ చర్యలు తీసుకుంటాము.” అని చెప్పింది.
ఈ కోవిద్ మహమ్మారి తో దేవి, జనని పరిస్థితిని సరిగ్గా ఆకళింపు చేసుకున్నారు. ఆ ప్రదేశాలలో పనిచేయడానికి వారికి కూడా తక్కువ ప్రమాదమేమీ కాదు. అయినా వారు పని చేస్తూనే ఉన్నారు. “అది చాలా కష్టంగా ఉండేది .ఆసుపత్రి సిబ్బంది కరోనా వస్తుందన్న భయం తో మమ్మల్ని స్ఫూటం శాంపిల్ తీసుకోవద్దన్నారు. కానీ నేను కచ్చితంగా వారికి తెలిసేట్లు మాత్రమే పరీక్షలు చేయవలసి వచ్చేది.” అన్నది దేవి.
పైగా కోవిడ్ మహమ్మారి తెచ్చిన కొత్త భయాలు చాలా పెద్దవి. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వారు ప్రస్తావించిన యూరోపియన్ రెస్పిరేటరీ జర్నల్ లో చేసిన స్టడీ రిపోర్ట్ ప్రకారం ‘భారత దేశం లో కోవిడ్ మహమ్మారి వలన ఆరోగ్య సేవలకు అంతరాయం కలిగి, వచ్చే ఐదేళ్ళలో క్షయ వలన 95,000 మరణాలు సంభవించడమే గాక, రోగనిర్ధారణ మరియు చికిత్స కూడా ఆలస్యమవుతాయి. అంతేకాకుండా, డేటాకు కూడా అంతరాయం కలుగుతుంది. పైగా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి టిబి కేసుల నమోదు తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. సరిపడిన డేటా లేనప్పటికీ, కొన్ని కోవిడ్ -19 మరణాలలో టిబి ప్రధాన సహ-అనారోగ్యంగా ఉందన్న విషయాన్ని ఎవరూ వ్యతిరేకించలేదు.
భారతదేశంలో తమిళనాడు అత్యంత ఎక్కువ క్షయ కేసులు నమోదైన రాష్ట్రంగా గుర్తించబడింది. 2019లో ఇక్కడ 110,845 మందికి క్షయవ్యాధి ఉందని ఇండియా టీబీ రిపోర్ట్ 2020 లో ఇచ్చారు . ఇందులో 77,815 మంది మగవారు, 33,905 మంది ఆడవారు, 125 మంది ట్రాన్సజెండర్లు ఉన్నారు.
అయినా కొత్తకేసులను కనిపెట్టడంలో ఈ రాష్ట్రం రాంకు ఇంకా 14 లోనే ఉంది. దీనికి కారణం ఇంకా తెలీదని చెన్నై లో దీర్ఘకాలంగా మెడికల్ ఆక్టివిస్ట్ గా పనిచేస్తున్న క్షయ మీద చాలా అనుభవం ఉన్నవారు అన్నారు. “ బహుశా దీన్ని ప్రాబల్యం తక్కువవడం వలన కూడా అయుండొచ్చు. లేదా తమిళనాడులో మౌలిక సదుపాయాలూ పేదరిక నిర్మూలన కార్యక్రమాలు ఎక్కువగా ఉండటం వలన కూడా అయి ఉండవచ్చు.ఈ రాష్ట్రంలో చాలా ఆరోగ్య కార్యక్రమాలు మిగిలిన రాష్ట్రాల కన్నా బావుంటాయి. కానీ ప్రభుత్వ యంత్రాగం కూడా సరిగా పనిచేయడం లేదని అనుమానపడవచ్చు. కొన్ని ఆసుపత్రులలో, ఛాతీ ఎక్స్-రే చేయడం చాలా పెద్ద పని [కోవిడ్ -19 కారణంగా ఆరోగ్య సేవల పై ఉన్న ఒత్తిడి వల్ల ఇది మరింత క్లిష్టంగా ఉంటుంది]. “మనము క్షయవ్యాధికి అన్ని తప్పనిసరి పరీక్షలను అందించలేము. కొనసాగుతున్న ప్రాబల్య సర్వే ముగియకపోతే, రాష్ట్రంలో నమోదు ఎందుకు తక్కువగా ఉందో మనము నిజంగా చెప్పలేము.” అన్నారు.
“క్షయవ్యాధి బాధితులపై సమాజం ఇంకా చిన్న చూపు చూస్తూనే ఉంది. "టీబీ బారిన పడ్డ స్త్రీలు పురుషుల కంటే తక్కువగా ఉండవచ్చు, అయితే, ఈ వ్యాధితో వేరే రకమైన కష్టం ఉంటుంది. పురుషులు పై కూడా చిన్న చూపు ఉన్నా మహిళల విషయంలో ఇది ఇంకా అధ్వాన్నంగా ఉంటుంది”,”అని REACH డిప్యూటీ డైరెక్టర్ అనుపమ శ్రీనివాసన్ వివరించారు.
ఈ విషయాన్ని జనని, దేవి అంగీకరిస్తారు. అందుకే వారు ఈ ఉద్యోగాన్ని ఎంచుకోవడానికి ఒక కారణమై ఉండొచ్చు.
*****
ఆ పై పూంగోడి గోవిందరాజ్ గురించి చెప్పాలి. వెల్లూరుకు చెందిన ఈ 30 ఏళ్ల ప్రచార నాయకురాలు తన జీవితంలో మూడుసార్లు టిబి బారిన పడింది. "2014 మరియు 2016 లో, టిబిని చాలా తేలికైన వ్యవహారం గా తీసుకుని టాబ్లెట్లు వాడడం మానేసాను. " అని ఆమె చెప్పింది. “2018 లో, నాకు యాక్సిడెంటు అయింది . ఆ చికిత్స సమయం లో నాకు వెన్నెముక టిబి ఉందని తెలిసింది . ఈ సారి చికిత్సని సరిగ్గా తీసుకుని పూర్తిగా కోలుకున్నాను. “ అన్నది.
పూంగోడి తన 12 వ తరగతి విజయవంతంగా పూర్తి చేసి, నర్సింగ్‌లో బీఎస్సీ డిగ్రీ చదువుతున్నప్పుడు ఆమె తన చదువుని ఆపివేయాల్సి వచ్చింది. "నాకు 2011, 2012 మరియు 2013 సంవత్సరాల్లో ముగ్గురు పిల్లలు పుట్టారు. ముగ్గురూ పుట్టిన వెంటనే మరణించారు" అని ఆమె చెప్పింది. "ఆరోగ్య కారణాల వల్ల నేను నా నర్సింగ్ కోర్సును నిలిపివేయాల్సి వచ్చింది." ఇది ఆమె కథ మాత్రమే కాదు. ఆమె తల్లి 2011 లో టిబితో మరణించింది. ఆమె తండ్రి ప్రస్తుతం క్షౌరశాల సెలూన్లో పనిచేస్తున్నారు. ఒక ప్రైవేట్ కంపెనీలో చిన్న ఉద్యోగం చేసే పూంగోడి భర్త, 2018 లో ఆమెకు టిబి అని తెలిసిన వెంటనే ఆమెను విడిచిపెట్టాడు,
పూంగోడి తన కుటుంబానికి ఒకప్పుడు కొంత ఆస్తి ఉండేదని, అయితే అవన్నీ చికిత్స కోసం తన భర్త తనను విడిచిపెట్టిన తరువాత జరిగిన విడాకుల కేసుకు చెల్లించాల్సి ఖర్చుకు అమ్మవలసి వచ్చిందని చెప్పారు. “నా తండ్రి ఇప్పుడు నాకు మార్గనిర్దేశం చేసి మద్దతు ఇస్తాడు. ఇప్పుడు టిబి పై అవగాహన పెంచుతున్నందుకు నేను సంతోషంగా ఉన్నాను,” అని ఆమె చెప్పింది. క్షయవ్యాధి పూంగోడి బరువును 35 కిలోగ్రాములకు తగ్గించింది.“ఇంతకు ముందు నేను 70 కిలోల బరువు ఉండేదానిని. అయితే ఈ రోజు నేను టిబి వ్యతిరేక ప్రచార నాయకురాలిగా విజయవంతమయ్యాను. నేను కనీసం 2,500 మందికి కౌన్సెలింగ్ ఇచ్చాను.80 మంది టిబి రోగుల చికిత్స గురించి పనిచేసాను. వారిలో 20 మంది నయమయ్యారు. ” ఇంతకు మునుపు ఉద్యోగం చేయని పూంగోడి లాంటి వ్యక్తికి, ‘ఉమెన్ టిబి లీడర్’గా ఆమె పాత్ర,“నాకు శాంతి, ఆనందం మరియు సంతృప్తిని ఇస్తుంది. నేను గర్వపడే పని చేస్తున్నాను. నా భర్త ఉన్న ఊరిలో ఇటువంటి పని చేయడం నేను సాధించిన పెద్ద విజయమని అనుకుంటాను.” అని సంతోషంగా చెప్తుంది పూంగోడి.
*****
సాదిపోమ్ వా పెన్నే (మహిళలు పైకి రండి! మనం సాధిద్దాం) కార్యక్రమం టిబి కేసు గుర్తింపుకు సహాయపడగల, ప్రోత్సహించగల మహిళలను గుర్తిస్తుంది. దీనిని REACH ప్రారంభించింది. దీనిని వెల్లూర్, విల్లుపురం, తిరునెల్వేలి, సేలం - ఈ నాలుగు జిల్లాల్లో అమలు చేస్తున్నారు.
ఈ కార్యక్రమం లో ఇక్కడి కమ్యూనిటీ లోని 400 మంది మహిళలు తమ గ్రామాలలో లేదా వార్డులలో అందరి ఆరోగ్యానికి సాయపడే వ్యక్తులు గా మారడానికి ఫోన్ ద్వారా శిక్షణ పొందుతున్నారు. ప్రజారోగ్య సౌకర్యాలలో క్షయవ్యాధి కోసం స్క్రీనింగ్ చేపట్టే మహిళా టిబి లీడర్స్ (పూంగోడి వంటి) మరో 80 మందికి శిక్షణ ఇస్తామని అనుపమ శ్రీనివాసన్ చెప్పారు.
సమస్య యొక్క స్థాయిని బట్టి ఇది సంఖ్యాపరంగా మామూలుగా కనబడుతున్నా, ఈ కార్యకరం జనని, దేవి, పూంగోడి ఇంకా ఇతర మహిళలకు - వీరు చేరే వేలాది మంది టిబి రోగులకు చాలా ముఖ్యం. పైగా దీని ప్రాముఖ్యత వైద్యానికి మాత్రమే కాదు. ఇది సామాజిక మరియు ఆర్థిక రంగానికి కూడా చాలా అవసరం. అంతేగాక ఈ కార్యక్రమం ఎవరినైతే చేరుతుందో, వారి ఆత్మావిశ్వాసం పై ప్రగాఢమైన ప్రభావం ఉంటుంది.
"ఇక్కడ పని చాలా హాయిగా ఉంటుంది.” అంది జనని తన రోజువారీ పనిని ప్రస్తావిస్తూ. ఆమె REACH లో పనిచేయడం ప్రారంభించిన రెండు నెలల తర్వాత, ఆమె భర్త (మరియు అతని కుటుంబం) ఆమె వద్దకు తిరిగి వచ్చారు. “ఇది నేను సంపాదించిన డబ్బు కోసమో, కాదో నాకు తెలియదు - అతను ఇంట్లో నన్ను పనికిరాని దానా అని తరచూ అనేవాడు మరి! లేదంటే అతను ఒంటరిగా ఉండడం వలన నా విలువ తెలిసిందేమో. ఏది ఏమైనా, విడాకుల కేసు తర్వాత సయోధ్య సాధ్యమేనని నా తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు.” అంది జనని.
తన తల్లిదండ్రులను సంతోషపరచడానికి, ఈ సంవత్సరం ఫిబ్రవరిలో జనని తన భర్తతో కలిసి అతని ఇంటికి వెళ్లారు. “ఇప్పటి వరకు అయితే అతను నన్ను బాగానే చూసుకుంటున్నాడు . టిబి నా జీవితాన్ని నాశనం చేసిందని నేను అనుకున్నాను కానీ వాస్తవానికి ఇది నా జీవితానికి మరింత అర్ధాన్ని ఇచ్చింది. దాదాపు నన్ను చంపిన ఒక వ్యాధి గురించి నేను ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాను. ఈ విషయమే నాకు చాలా శక్తినిస్తుంది.” అంటుంది జనని.
కవితా మురళీధరన్ ఠాకూర్ ఫ్యామిలీ ఫౌండేషన్ నుండి స్వతంత్ర జర్నలిజం గ్రాంట్ ద్వారా ప్రజారోగ్యం మరియు పౌర స్వేచ్ఛపై నివేదికలు రాస్తారు. ఠాకూర్ ఫ్యామిలీ ఫౌండేషన్ ఈ రిపోర్టేజీలోని విషయాలపై సంపాదకీయ నియంత్రణను అమలు చేయలేదు.
అనువాదం: అపర్ణ తోట