వృత్తిపరంగా, వ్యక్తిగతంగా, శారీరకంగా కూడా అబ్దుల్ రెహమాన్ ప్రపంచం అక్షరాలా కుంచించుకుపోయింది. నాలుగు ఖండాలలో కార్మిక సిబ్బందిలో పనిచేసిన ఈ వలస కార్మికుడు, ఇప్పుడు తన ఐదుగురు కుటుంబ సభ్యులతో పాటు 150 చదరపు అడుగుల గదికి పరిమితమయ్యారు.
ఈ ముంబై టాక్సీ డ్రైవర్ - ఈయన తండ్రి దశాబ్దాల క్రితం తమిళనాడు గ్రామీణ ప్రాంతం నుండి ఈ నగరానికి వచ్చారు - గతంలో సౌదీ అరేబియా, దుబాయ్, బ్రిటన్, కెనడా, ఇండోనేషియా, మలేషియా, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో బుల్డోజర్లను, కార్లను నడిపారు. ఈ రోజు ఆయన్ని, మాహిమ్ స్లమ్ కాలనీలోని ఇరుకైన సందులోంచి సాయన్‌లోని ఆసుపత్రికి తీసుకెళ్ళే టాక్సీ దగ్గరకు, కుర్చీలో కూర్చోబెట్టి మళ్ళీ మళ్ళీ మోసుకునిపోవాలి.
ఆసుపత్రికి వెళ్లే సమయం వచ్చినప్పుడు, రెహమాన్ తన గది నుండి కిందికి దిగేందుకు సిద్ధమవుతారు. నిచ్చెన బయట తలుపు దగ్గర ఉంటుంది. నేలపై కూర్చుని ఉన్న ఆయన్ని కొడుకు కాళ్ళ క్రింద చేయివేసి పట్టుకుంటే, ఒక మేనల్లుడో లేదా పొరుగువాడో పై నుండి ఆయనకు ఆసరా ఇస్తారు. రెహమాన్ అప్పుడు తొమ్మిది ఏటవాలు మెట్ల మీదుగా ఒక్కొక్క అడుగే బాధాకరంగా వేస్తూ, నెమ్మదిగా క్రిందికి దిగుతారు.
దిగువనున్న ఇరుకైన సందులో, పెయింట్ మరకలు పడిన ఒక పాత ప్లాస్టిక్ కుర్చీ ఉంటుంది. పాదం తొలగించబడిన అతని కుడి కాలు ఆ కుర్చీ సీటుపై ఉండేలా ఆయన్ని కూర్చోపెడతారు. అప్పుడు అతని కొడుకు, మరో ఇద్దరు కలిసి ఆ కుర్చీని పొడవుగా, వంకరటింకర్లుగా ఉన్న ఆ సందు వెంట, మాహిమ్ బస్ డిపో సమీపంలోని రహదారి వైపుకు మోసుకువెళ్తారు. అక్కడ, రెహమాన్ కుర్చీలోంచి టాక్సీలోకి మారతారు.
కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న సాయన్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి టాక్సీ ఛార్జీలు ఆయన భరించగలిగే దానికంటే ఎక్కువే. అయినప్పటికీ, గత సంవత్సరంలో నెలల తరబడి ఆయన తన పాదాలకు కట్టు కట్టించుకోడానికి ప్రతి వారం అక్కడికి వెళ్లవలసి వచ్చింది. ఇప్పుడు గాయం కొంచెం మానిన తర్వాత, ఆసుపత్రికి వెళ్ళిరావడం కొంత తగ్గింది. అయినా అప్పుడప్పుడూ ఉత్తర ముంబైలోని మోరీ రోడ్‌కి దూరంగా, ఇరువైపులా రెండు-మూడు అంచెలుగా ఒకదానిపై ఒకటి ఎక్కినట్టున్న ఇరుకైన గదులున్న కాలనీలో నుంచి, సన్నని సందుగొందుల గుండా ఆ కుర్చీలో ఊరేగింపు జరుగుతూనే ఉంది.
కొన్నేళ్లుగా, అబ్దుల్ రెహమాన్ అబ్దుల్ సమద్ షేక్ ప్రతిరోజూ ఉదయం ఈ లేన్‌లోనే పార్క్ చేసిన తన టాక్సీ దగ్గరకు వెళ్లి, తన 12 గంటల పనిదినాన్ని ప్రారంభించేవారు. 2020 మార్చిలో ప్రారంభమైన లాక్‌డౌన్‌తో, అతను క్యాబ్ నడపడం మానేశారు. కానీ కొన్నిసార్లు “ దోస్త్ లోగ్ ” ను, స్నేహితులను, సహోద్యోగులను కలవడానికి తెలిసిన చాయ్ దుకాణాలకు వెళ్లేవారు. ఆయన మధుమేహం పెరుగుతోంది, అనారోగ్యంగా ఉంటున్నారు. అందుకే లాక్డౌన్ సడలించినప్పటికీ తన పనిని తిరిగి ప్రారంభించలేకపోయారు. అయితే, ఆయన తిరుగుతూనే ఉన్నారు.
అప్పుడే ఆయన తన కాలి వేలుపై "పెన్ పాయింట్ మార్క్ లాగా" ఒక చిన్న నల్లటి మచ్చను గమనించారు. ఒక బ్యాచ్ యాంటీబయాటిక్స్ వాడితే బాగైపోతుందని డాక్టర్ చెప్పటంతో రెహమాన్ దాని గురించి పెద్దగా ఆలోచించలేదు. "అదేమీ ఉపయోగపడలేదు," అని అతను చెప్పారు. కుడికాలి మధ్యవేలుపై ఉన్న ఆ మచ్చ స్థిరంగా పెరుగుతూనే ఉంది. "నా పాదం చాలా తీవ్రంగా బాధించడం ప్రారంభించింది. నడుస్తున్నప్పుడు దానిలోపల సూదిగానీ మేకుగానీ ఉన్నట్టనిపించేది." అని అతను చెప్పారు.
అనేకసార్లు వైద్యులను కలిసి, ఎక్స్-రేలు, పరీక్షలు చేయించిన తర్వాత, నల్లగా మారివున్న చర్మాన్ని తొలగించారు. అది కూడా ఏం పనిచేయలేదు. ఒక నెలలోపే, ఆగస్టు 2021లో, ఆ వేలును తీసేయాల్సివచ్చింది. కొన్ని వారాల తర్వాత, బొటనవేలు పక్కనే ఉన్న వేలు కూడా తొలగించబడింది. మధుమేహం కారణంగా రక్త ప్రసరణలో ఏర్పడిన తీవ్ర అవరోధాలు ఒక క్రమంలో దెబ్బతీస్తున్నాయి. గతేడాది అక్టోబర్ నాటికి రెహమాన్ కుడి పాదం దాదాపు సగానికి తొలగించబడింది. " పాంచో ఉంగ్లీ ఉడా దియా [వారు మొత్తం ఐదు వేళ్లనూ తొలగించారు]," అన్నారు రెహమాన్. తన గదిలో నేలపై పరచిన సన్నని పరుపుపై అలసిపోయి కూర్చుని వున్నారాయన.
అప్పటి నుండి తరచుగా ఆసుపత్రికి వెళ్ళడం తప్ప, అతని ప్రపంచం ఆ చిన్న గాలిలేని మొదటి అంతస్తు గదికి కుదించబడింది. " బస్ , అకేలా పడా రెహతా హూఁ [ఊరికే అలా ఒక్కడినే పడివుంటాను]," అని ఆయన చెప్పారు. “సమయం గడిపేందుకు నా దగ్గర ఏమీ లేదు. మా దగ్గర టీవీ ఉంది, కానీ దాన్ని నడిపించే స్థోమత లేదు... ఆలోచిస్తూనే ఉంటాను... నా స్నేహితులను, నా పిల్లల కోసం కొన్న వస్తువులను గుర్తుచేసుకుంటాను... కానీ ఇవన్నీ గుర్తుపెట్టుకుని నేను చేసేదేముంది?"
తన పాదాన్ని సగం కోల్పోయి, ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమయ్యేవరకు - నాలుగు దశాబ్దాలపాటు - రెహమాన్ ప్రపంచం ఆ గదినీ, ఆ లేన్‌ను దాటి - తన టాక్సీలో నగరపు సుదూర మూలల వరకు, అంతకు మించి కూడా విస్తరించింది. 18 సంవత్సరాల వయస్సులో రెహమాన్, ఇతర టాక్సీ డ్రైవర్ల నుండి నగరంలోని వీధుల్లో డ్రైవింగ్ నేర్చుకున్నారు. కొంతకాలం అతను "30-50 రూపాయలు సంపాదించడానికి" ప్రతిరోజూ కొన్ని గంటలపాటు అద్దె టాక్సీని నడిపారు. అతనికి 20 ఏళ్లు వచ్చేసరికి, ముంబై పబ్లిక్ బస్ సర్వీస్ అయిన బెస్ట్ (BEST)లో క్లీనర్‌గా, మెకానిక్ హెల్పర్‌గా ఉద్యోగం సంపాదించారు.
ఎనిమిది సంవత్సరాల తర్వాత, 1992లో తన జీతం రూ. 1,750 ఉన్నప్పుడు, ఒక ఏజెంట్ ద్వారా సౌదీ అరేబియాలో ఉద్యోగం సంపాదించారు. "ఆ రోజుల్లో అదేమంత కష్టం కాదు," అని రెహమాన్ చెప్పారు. "అక్కడ [సౌదీలో] నేను నెలకు 2,000-3000 రూపాయలు సంపాదించేవాడ్ని. ఒక నెల ఇల్లు గడవడానికి రూ. 500 [బెస్ట్‌లో నా జీతం కంటే] ఎక్కువ వస్తే సరిపోయేవి."
రెహమాన్ అక్కడ బుల్డోజర్ ఆపరేటర్‌గా పనిచేశారు. కొన్నిసార్లు అద్దె కారును కూడా నడిపారు. "నా స్పాన్సర్ [యజమాని] మంచి వ్యక్తి. అతను ఉండేందుకు ఇల్లు ఇచ్చాడు. ఇతర దేశాలలో పనిచేసే ప్రదేశాలకు తన సిబ్బందిని పంపేవాడు." అన్నారు రెహమాన్. కాలక్రమేణా, అతను ప్రపంచవ్యాప్తంగా వివిధ వర్క్ సైట్లలో పనిచేశారు.
అతని ప్రయాణాల ఛాయాచిత్రాలలో చాలా వరకు ముడుచుకుపోయి మసకబారుతున్నాయి. అతని భార్య తాజున్నిసా వాటిని ఒక ప్లాస్టిక్ సంచిలో నుండి బయటకు తీశారు. కొంచంగా నవ్వుతున్న రెహమాన్ ఆ ఫోటోలలో కారుకు ఆనుకుని, బుల్డోజర్పై కూర్చొని, దుకాణంలో నిలబడి, స్నేహితులతో కూర్చొని సంతృప్తిగా కనిపిస్తున్నారు. గతకాలానికి చెందిన ఆ ఫోటోలలో అతను పొడవుగా, మంచి శరీర దారుఢ్యంతో ఉన్నారు. ఇప్పటి ఈ 57 ఏళ్ల రెహమాన్, పరుపుపైనే రోజులు గడుపుతున్నారు. ఆయన కుంచించుకుపోయి, బలహీనంగా ఉన్నారు. మాట్లాడుతున్నప్పుడు ఒకోసారి ఊపిరి అందక ఇబ్బంది పడుతున్నారు.
ఎల్లవేళలా కూర్చోవడమో లేదా పడుకోవడమోతో బహుశా అతని మనస్సు ఇప్పుడు ఈ ఇరుకైన సందులోంచి ఆ దూరమైన ప్రాంతాలలో తిరుగుతున్నట్టుంది. అక్కడి జీవితం హాయిగా గడిచిపోయిందని ఆయన చెప్పారు. “[సౌదీలో] నా గదిలో ఎసి ఉంది, నేను నడిపిన కారులో ఎసి ఉంది. ఆహారం కోసం మేము బియ్యం, అక్కా ముర్గ్ [ఒక కోడి మొత్తం] పొందేవాళ్ళం. ఎటువంటి టెన్షన్ లేదు. పని నుండి తిరిగి వచ్చాక, స్నానం చేసి, తినేసి, పడుకునేవాడ్ని. ఇక్కడ, మా పరిసరాల్లో నిరంతరం పెద్దపెద్ద శబ్దాలు, ఝగడాలు (పోట్లాటలు). ఎవరూ చుప్ - చాప్ [నిశ్శబ్దంగా]గా కూర్చోరు. ఈ ఫ్యాన్ గాలి నాకు నొప్పి కలిగిస్తుంది, నాలో జీవం లేనట్టు భావించేలా చేస్తుంది.”
రెహమాన్ 2013లో భారతదేశానికి తిరిగి వచ్చారు. ఎందుకంటే సౌదీలోని యజమానులు ఇతర దేశాల నుండి వచ్చిన కార్మికులను 15 సంవత్సరాలకు మించి ఉంచుకోలేరు. తానిప్పుడు నివసిస్తున్న ఇదే గదిలోకి అతను తిరిగి వచ్చారు. బెస్ట్ కంపెనీలో డ్రైవర్ అయిన రెహమాన్ తండ్రి మరణించినప్పుడు అతని తల్లికి రూ. 25,000 ప్రావిడెంట్ ఫండ్ వచ్చింది. ఆ డబ్బుతో ఆమె ఈ ఇంటిని 1985లో కొన్నారు. (ఆ కుటుంబం అప్పటి వరకు వడాలాలోని స్టాఫ్ క్వార్టర్స్‌లో నివసించింది; రెహమాన్ 7వ తరగతి వరకు అక్కడే చదివారు). అతనికి నలుగురు తమ్ముళ్లు, నలుగురు అక్కలు ఉన్నారు. "మేమిక్కడికి మారినప్పుడు, మా పదిమందిమీ ఈ గదిలోనే ఉండేవాళ్ళం," అని అతను చెప్పారు. (డిసెంబర్ 2021 వరకు, ఏడు మంది - రెహమాన్, తాజున్నిసా, వారి నలుగురు పిల్లలు - ఉన్నారు. అతని తల్లి ఆ నెలలోనే మరణించారు.)
వారు మాహిమ్కు మారినప్పుడు, అతని తల్లికి ఇళ్ళల్లో పనిచేసే ఉద్యోగం దొరికింది (చివరికి అతని తోబుట్టువులు కూడా ఇదే పనిచేశారు). కొన్నేళ్ల తర్వాత, వీధి వ్యాపారాలు చేసే అతని ఇద్దరు సోదరులు, రెండు వేర్వేరు ప్రమాదాల్లో మరణించారు. రెహమాన్, అతని మిగిలిన ఇద్దరు సోదరులు - వారిలో ఒకరు ఎసి మెకానిక్, మరొకరు చెక్కకు మెరుగుపెట్టే వృత్తి - మాహిమ్ స్లమ్ కాలనీలోని ఒక మూడంచెల నిర్మాణంలో నివసిస్తున్నారు. మధ్య గదిలో రెహమాన్, ఆయన సోదరులు ' ఊపర్ - నీచే ', పైనొకరు, క్రిందొకరు, క్రిక్కిరిసి ఉండే గదులలో నివాసం ఉంటున్నారు.
పెళ్ళిళ్ళు కాగానే ఆయన తోబుట్టువులంతా ఆ యింటి నుంచి వెళ్ళిపోయారు. విదేశాల్లో పనిచేసేటప్పుడు సంవత్సరానికో, రెండేళ్ళకో ఒకసారి రెహమాన్ ఇండియాకు వచ్చేవారు. ఆ సమయంలో తన జీతం డబ్బుల నుంచీ, దాచుకున్నవాటి నుంచీ తన తోబుట్టువుల (ఆ తర్వాత తన మేనకోడళ్ళ) పెళ్ళిళ్ళకు సహాయం చేశానని కాస్తంత గర్వం నిండిన గొంతుతో ఆయన చెప్పారు.
రెహమాన్ సౌదీ అరేబియా నుంచి తిరిగివచ్చేటప్పటికి ఆయన దగ్గర ఇన్నేళ్ళుగా కష్టపడి పొదుపుచేసుకున్న డబ్బు రూ. 8 లక్షలుంది.(అప్పుడాయన నెల జీతం రూ. 18,000. అందులో ఎక్కువ భాగాన్ని ఆయన ఇంటికే పంపేవారు.) ఈ పొదుపుచేసిన డబ్బులో ఎక్కువ భాగం కుటుంబంలోని పెళ్ళిళ్ళకే ఉపయోగించారు. టాక్సీ నడిపేందుకు అనుమతి సంపాదించి, బ్యాంకు నుంచి రూ. 3.5 లక్షల రుణాన్ని తీసుకుని, ఒక శాంత్రో కారు కొన్నారు. టాక్సీ స్వయంగా నడపటం, లేదా ఎవరికైనా అద్దెకివ్వడం ద్వారా రోజుకు రూ. 500-600 వరకు సంపాదించేవారు. రెండేళ్ళ తర్వాత, కారు నిర్వహణ ఖర్చులను భరించలేక, అతని ఆరోగ్యం కూడా క్షీణించడంతో, రెహమాన్ క్యాబ్‌ను అమ్మేసి, అద్దె టాక్సీని నడపడం ప్రారంభించారు. రోజుకు దాదాపు రూ. 300 ఆదాయం వచ్చేది.
ఇదంతా 2015లో జరిగినది. "లాక్డౌన్ వచ్చేవరకూ(మార్చి 2020లో) నేనిదంతా చేస్తూవున్నాను. ఇంతలో ప్రతిదీ ఆగిపోయింది." అన్నారాయన. స్నేహితులతో మాట్లాడేందుకు తెలిసిన సమావేశ స్థలాలకు నడిచిపోతున్నప్పటికీ, అప్పటి నుండి "నేను ఎక్కువగా ఇంట్లోనే ఉన్నాను" అని అతను చెప్పారు. ధార్మిక సంస్థలు, స్థానిక దర్గాలు అందించే రేషన్‌తో; స్నేహితులు, ఆర్థికంగా కొంత బాగున్న బంధువులు అప్పుడప్పుడూ ఇచ్చిన కొన్ని వందల రూపాయలతో లాక్డౌన్ సమయంలో ఆ కుటుంబం నెట్టుకురాగలిగింది.
రెహమాన్ సౌదీ అరేబియాలో ఉండగానే ఆయనకు మధుమేహం వచ్చింది. అప్పటినుంచీ మందులు వాడుతున్నా, ఆయన ఆరోగ్యం పాడయింది. 2013లో భారతదేశానికి తిరిగివచ్చాక ఆరోగ్యం మరింత దిగజారింది. దాంతో విదేశాల్లో ఉద్యోగం కోసం మళ్లీ ప్రయత్నించకుండా అది అడ్డుకుంది. కానీ లాక్‌డౌన్‌తో అతని ప్రపంచం నిజంగానే కుంచించుకుపోయింది. ఎక్కువసేపు పడుకొనే ఉండటం వల్ల అతని శరీరంపై పుండ్లు(బెడ్ సోర్స్) వచ్చాయి. ఆ గాయాలకు కూడా సాయన్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది.
ఇదంతా జరిగిన తర్వాతనే రెహమాన్ తన కుడి కాలి మధ్య వేలుపై నల్లటి మచ్చను గమనించారు.
అనేకసార్లు ఆసుపత్రికి వెళ్ళివస్తూనే, ఆయన స్థానిక వైద్యుడిని కూడా సంప్రదించారు. రక్త ప్రసరణ అడ్డంకులను తొలగించడానికి యాంజియోప్లాస్టీ చేయించుకోవాలని ఆయన సలహా ఇచ్చాడు. ఆయన పాదం సగానికి తొలగించబడిన కొన్ని వారాల తర్వాత, ఈ ప్రక్రియ కూడా అక్టోబర్ 2021లో సాయన్ ఆసుపత్రిలో జరిగింది. "రక్తప్రసరణ మెరుగుపడింది, నొప్పి తగ్గుముఖం పట్టింది, నలుపు తగ్గింది," అని రెహమాన్ చెప్పారు. "కొంత నొప్పి, కాలులో దురద ఇంకా మిగిలి ఉంది." గాయానికి డ్రెసింగ్ చేయడానికి స్థానిక సంస్థ ఒకటి, అటెండర్‌ను ఏర్పాటు చేసింది. దాంతో ఆసుపత్రికి వెళ్ళవలసిన అవసరం తగ్గింది.
రెహమాన్ పాదం నయం అవుతుండటంతో, ఆయన ఆశాజనకంగా ఉన్నారు. (కదలకుండా ఉండడంతో తీవ్రమయిన పొట్ట సమస్యల వలన ఆయన ఈ సంవత్సరం ప్రారంభంలో KEM ఆసుపత్రిలో కొన్ని రోజులు గడిపారు). "నా పాదాల మీద కొంత చమ్డా [చర్మం] పెరిగిన తర్వాత, దీని కోసం ప్రత్యేక బూట్లు ఉన్నాయని నేను విన్నాను" అని అతను అన్నారు. “అందుకు ఎంత ఖర్చవుతుందని అడిగాను. అప్పుడు నేను మళ్లీ నడవడం ప్రారంభించగలను…” (అతనిప్పుడు ఉపయోగించడానికి ప్రయత్నిస్తున్న చవకబారు వాకర్‌కు బదులుగా) తాజున్నిసా అయన కోసం ఒక వీల్‌చైర్ కొనాలనుకుంటున్నామని చెప్పారు.
తన పాదాలు నయం అవుతున్నట్లు అనిపించినప్పుడు, రెహమాన్ తన ఆనందాల గురించి - సంతృప్తి గురించి కూడా చెప్పారు: తన అక్కనూ, తన పెద్ద కుటుంబాన్నీ కలవడానికి అప్పుడప్పుడు తమిళనాడులోని ఉళుందూర్పేట్టై తాలూకా లోని తన పూర్వీకుల గ్రామమైన ఇళవరసనూర్కోట్టైని (గతంలో) సందర్శించినప్పుడు; ఇప్పుడు తన తోబుట్టువులు తన ఆరోగ్యం గురించి ఆదుర్దా పడి అడిగినప్పుడు కలిగే సంతృప్తి."అప్పుడు బాగా అనిపిస్తుంది," అని అతను చెప్పారు.
అతని దీర్ఘకాల అనారోగ్యం అతని కుటుంబాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. లాక్డౌన్ల తర్వాత కూడా ఆదాయం లేకపోవడంతో, వారు ఇతరులిచ్చే సహాయంపైనే ఆధారపడుతున్నారు. ఇటీవలి వరకు గృహిణిగా ఉన్న తాజున్నిసా (48) స్థానిక బాల్వాడిలో పార్ట్‌టైమ్ క్లీనర్‌గా, నెలకు రూ. 300లకు పనిచేస్తున్నారు. "నేను ఇంటి పని కోసం కూడా వెతకాలి," అని ఆమె చెప్పారు. "మేం మా పెద్దబ్బాయిని టైలరింగ్‌కి పంపుతాం."
వారి పెద్దబ్బాయి అబ్దుల్ అయాన్ వయసు 15 ఏళ్ళు. ఈ పిల్లాడు ఇంకొంచం పెద్దవాడయ్యుంటే, "పని కోసం దుబాయ్ పంపించే ప్రయత్నం చేసేవాళ్ళం," అంటారు రెహమాన్. "మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది," అంటారు తాజున్నిసా. “మేము కట్టాల్సిన కరెంట్ బిల్లు [లాక్డౌన్ అప్పటినుండి] సుమారు 19,000 రూపాయల వరకూ పేరుకుపొయింది. కాని, విద్యుత్ శాఖకు చెందిన వ్యక్తి వచ్చి మా పరిస్థితిని చూసి, బిల్లు చెల్లించడానికి సమయం ఇచ్చాడు. పిల్లల స్కూల్ ఫీజులు పూర్తిగా చెల్లించలేదు, దానికి కూడా సమయం అడిగాము. [గ్యాస్] సిలిండర్ అయిపోతోంది. మా ఇల్లు ఎలా నడుస్తుంది, మా పిల్లలను ఎలా చూసుకోవాలి?"
వారి చిన్న కుమారుడు, ఎనిమిదేళ్ల అబ్దుల్ సమద్, చిన్న కుమార్తె, 12 ఏళ్ల అఫ్షా. దాదాపు రెండు సంవత్సరాలుగా వీరు ఆన్లైన్ తరగతులకు హాజరు కాలేకపోయారు (నలుగురు పిల్లలను సమీపంలోని పాఠశాలల్లో చేర్చారు). ఇటీవలే బడులు తిరిగి తెరిచిన తర్వాత "తరగతిలో ఏమి జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు," అని అఫ్షా అంటోంది.
వారి పెద్ద కుమార్తె, 16 ఏళ్ల దనియా 11వ తరగతి చదువుతోంది. (అయాన్ చేసినట్లుగానే) ఈమె కూడా తమ బంధువుల, స్నేహితుల మొబైల్ ఫోన్లను ఉపయోగించి చదువుకుంది. తాను బ్యూటీషియన్‌గా శిక్షణ పొందాలనుకుంటున్నానని, మెహందీ(గోరింటాకు) పెట్టడంలో ఇప్పటికే నైపుణ్యం ఉందని, దాని ద్వారా కొంత సంపాదించాలని భావిస్తున్నానని దనియా చెప్పింది.
రెహమాన్ ఎప్పుడూ తన కుటుంబం గురించి చాలా ఆందోళన చెందుతూనే ఉంటారు. “నా తర్వాత వారికి ఏమవుతుంది? నా చిన్న కొడుకు వయస్సు కేవలం ఎనిమిదేళ్ళే…” వారి మురికివాడల కాలనీ ఏదో ఒక పునరాభివృద్ధి ప్రాజెక్ట్ కోసం కూల్చివేయబడుతుందేమోననే ఆలోచన కూడా ఆయన్ని నిరంతరం వేధిస్తుంటుంది. అలా జరిగితే, మొత్తం కుటుంబానికంతా కలిపి ఒక యూనిట్/గదిని ఇస్తారు. అతనిప్పుడు తన సోదరులతో కలిసి మూడు గదులలో నివసిస్తున్నప్పుడు, పరిహారంగా ఒక్క గదినే ఇస్తే ఎలా అని అతను భయపడుతున్నారు. “నా సోదరులు ఇంటిని అమ్మేసి, ఇక్కడినుంచి వెళ్ళిపోవాలనుకుంటే? వారు నా కుటుంబానికి ఏ 3-4 లక్షలో ఇచ్చి వెళ్లిపోమని కూడా అడగవచ్చు. అప్పుడు నా కుటుంబం ఎక్కడికి వెళుతుంది?," అని అడుగుతారు.
"నా పాదానికి బదులుగా శరీరంలోని మరేదైనా భాగానికి ఇది జరిగి ఉంటే, కనీసం నా చేయికి జరిగినా కూడా నేను కనీసం నడవగలిగేవాడిని, ఎక్కడికైనా వెళ్లి ఉండేవాడిని. ఇప్పుడు నేను ఎంతకాలం బతికే ఉంటానో నాకు తెలియదు. నా పిల్లలపై నా ఆశలు చచ్చిపోయాయి. కానీ నేను ఉన్నంత కాలం, వారు చదువుకోవాలని కోరుకుంటున్నాను. అప్పు చేసో, అడుక్కునో ఎలాగోలా నడిపిస్తాను.”
ఫిబ్రవరి మధ్యలో, సాయన్ ఆసుపత్రికి తిరిగి వెళ్ళినప్పుడు, అతని చక్కెర స్థాయిలు ప్రమాదకరంగా ఉన్నట్టు తెలిసింది. రెహమాన్‌ను ఆసుపత్రిలో చేర్చుకోవాలని డాక్టర్ సలహా ఇచ్చారు. అతనక్కడ ఒక నెల గడిపాక, మార్చి 12న తిరిగి ఇంటికి పంపించారు. మధుమేహం ఇప్పటికీ అదుపులోకి రాలేదు, అతని కుడి కాలిలో ఒట్టి ఎముక, చర్మం మాత్రమే మిగిలింది.
"కుడి పాదంలో మిగిలిన చర్మం మళ్లీ నల్లగా మారుతోంది, అది కూడా చాల్లా బాధిస్తోంది" అని ఆయన చెప్పారు. "మొత్తం పాదాన్ని తొలగించాల్సి రావచ్చని డాక్టర్ అంటున్నారు."
మార్చి 14 రాత్రి, నొప్పి భరించలేనిదిగా మారింది, "ఏడ్చే స్థాయికి" వచ్చిందని రెహమాన్ చెప్పారు. అతన్ని మళ్లీ అర్ధరాత్రి కుర్చీపై కూర్చోబెట్టి టాక్సీ దగ్గరకు మోసుకెళ్లి ఆసుపత్రికి చేరుకోవలసి వచ్చింది. మరిన్ని పరీక్షలు జరిగాయి. ఇంజెక్షన్లు, మందులు నొప్పిని- అది తిరిగి వచ్చేవరకూ- కొంచెంగా తగ్గిస్తాయి. అతను త్వరలోనే స్కానింగుల కోసం, పరీక్షల కోసం - బహుశా మరొక శస్త్రచికిత్స కోసం కూడా - ఆసుపత్రికి తిరిగి రావాల్సివుంటుంది.
అతను రోజురోజుకి మరింత అలసిపోయి, మరింత నిరుత్సాహానికి గురవుతున్నారు. ఇవన్నీ సర్దుకుంటాయని కుటుంబసభ్యులు ఆశగా ఎదురుచూస్తున్నారు. "ఇన్షా అల్లాహ్," అంటారు రెహమాన్భాయ్.
కవర్
ఫోటో
:
సందీప్
మండల్
ఈ
కథనంపై
పని
చేస్తున్నప్పుడు
ఉదారంగా
సహాయాన్నీ
,
సమయాన్నీ
అందించినందుకు
లక్ష్మీకాంబ్లేకు
ధన్యవాదాలు
.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి