ఆమె కేవలం తన పేరును మాత్రమే చదవగలరు, రాయగలరు. దేవనాగరి లిపిలో తన పేరుని సగర్వంగా, జాగ్రత్తగా గో-పుహ్-లీ అని రాశాక,  ఆ వెంటనే ఆమె తెరలుతెరలుగా నవ్వారు.

తమ మనసులో నిశ్చయించుకున్నదేదైనా మహిళలు సాధించగలరని నలుగురు పిల్లల తల్లైన 38 ఏళ్ళ గోప్లీ గమేతీ చెప్పారు.

ఉదయ్‌పుర్ జిల్లా గోగుందా బ్లాక్ లోని కర్దా గ్రామ శివార్లలో కేవలం 30 ఇళ్ళు మాత్రమే ఉన్న ఈ ప్రాంతంలో గోప్లి తన నలుగురు పిల్లల్ని ఇంటి దగ్గరే ప్రసవించారు. ఆమె ఇంటికి దగ్గర్లో ఉనండే కొంతమంది మహిళలు ఆమెకు ప్రసవంలో సహాయం చేశారు. నాలుగో బిడ్డకు (మూడో కూతురు) జన్మనిచ్చిన కొన్ని నెలల తర్వాత, మొదటిసారిగా ఆమె – ట్యూబల్ లైగేషన్ (ట్యూబెక్టమీ లేదా కుటుంబ నియంత్రణ శస్త్ర చికిస్త్స) చేయించుకోడానికి ఆస్పత్రికి వెళ్ళారు.

“మా కుటుంబం సంపూర్ణమైందని ఒప్పుకోవడానికి ఇదే సరైన సమయం,” అని ఆమె అన్నారు. గోగుందా సామాజిక ఆరోగ్య కేంద్రం (కమ్యూనిటీ హెల్త్ సెంటర్ - సిఎచ్‌సి)కి చెందిన ఒక ఆరోగ్య కార్యకర్త, గర్భ నిరోధక “శస్త్రచికిత్స” గురించి ఆమెకు వివరించారు. దాన్ని ఉచితంగా చేస్తారు. ఇందుకోసం ఆవిడ, అక్కడికి 30 కిలోమీటర్ల దూరంలో, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తోన్న సిఎచ్‌సికి వెళ్తే సరిపోతుంది. నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పిఎచ్‌సిలు) ఆరోగ్య సేవలందించే గ్రామాలకు ఈ సిఎచ్‌సి కూడా సేవలందిస్తుంది.

ఈ విషయం గురించి (ట్యూబెక్టమీ) చాలాసార్లు తన భర్త దగ్గర ప్రస్తావించినప్పటికీ, అతను పట్టించుకోలేదు. దాంతో, తన చిన్నారి పసిబిడ్డకు పాలిచ్చి పెంచుతూ, నెలల తరబడి ఆలోచించి, తన నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఆవిడ మానసికంగా సిద్ధమయ్యారు.

Gameti women in Karda village, in Udaipur district’s Gogunda block. Settled on the outskirts of the village, their families belong to a single clan.
PHOTO • Kavitha Iyer
Gopli Gameti (wearing the orange head covering) decided to stop having children after her fourth child was born
PHOTO • Kavitha Iyer

ఎడమ: ఉదయపూర్ జిల్లా గోగుందా బ్లాక్‌లోని కర్దా గ్రామానికి చెందిన గమేతీ మహిళలు. ఊరి పొలిమేరలలో స్థిరపడిన వారి కుటుంబాలన్నీ ఒకే కుదురుకు చెందినవి. కుడి: గోప్లీ గమేతీ (నారింజ రంగు వస్త్రాన్ని తలపై కప్పుకున్నవారు) తన నాల్గవ బిడ్డ పుట్టిన తర్వాత ఇక పిల్లలను కనడం మానేయాలని నిర్ణయించుకున్నారు

“ఒక రోజు, నా ట్యూబులను ముడివేయించుకోడానికి దవాఖానా కి (క్లినిక్) వెళ్తున్నానని ఇంట్లో చెప్పేసి నేను బయలుదేరాను,” వచ్చీ రాని హిందీలోనూ, భీలీలోనూ మాట్లాడుతూ, ఆ జ్ఞాపకానికి ముసిముసిగానవ్వుకుంటూ, ఆమె గుర్తుచేసుకున్నారు. “నా భర్త, అత్తగారు నా వెనకాలే పరుగులుపెట్టి వచ్చారు.” దారిలో కొద్దిసేపు వాదించుకున్నాక, ఈ విషయంలో ఆమె వెనక్కి తగ్గదని వాళ్ళకి స్పష్టంగా అర్థమైపోయింది. ఆ తర్వాత, గోప్లీకి శస్త్రచికిత్స చేయించేందుకు, గోగుందా సిఎచ్‌సికి వాళ్ళందరూ కలిసి బస్సులో బయలుదేరారు.

అదే రోజు ఆ సిఎచ్‌సిలో మరికొంతమంది మహిళలకు కూడా ట్యూబల్ లైగేషన్ చేస్తున్నారు. అయితే, అది స్టెరిలైజేషన్ (సంతానం కలగకుండా చేసే శస్త్రచికిత్స) శిబిరం అవునో కాదో తనకు తెలియదనీ, అసలు ఆ రోజు అక్కడ ఎంత మంది స్త్రీలు ఉన్నారో తనకు గుర్తు లేదనీ గోప్లీ అన్నారు. చిన్న చిన్న పట్టణాల్లో నిర్వహించే ఈ స్టెరిలైజేషన్ శిబిరాలకు, చుట్టుపక్కల గ్రామాల నుండి మహిళలు వస్తుంటారు. గ్రామాలలోని ఆరోగ్య కేంద్రాలలో సాధారణంగా ఉండే సిబ్బంది కొరత లాంటి సమస్యలను అధిగమించడానికి ఇటువంటి శిబిరాలను నిర్వహిస్తుంటారు. కానీ, ఇక్కడ అధ్వాన్నంగా ఉండే పారిశుద్ధ్య పరిస్థితులు, లెక్కకు ఇన్ని శస్త్రచికిత్సలు చేయాలనే లక్ష్యసాధనలో భాగంగా చేపట్టే విధివిధానాలు దశాబ్దాలుగా తీవ్ర చర్చనీయాంశాలుగా మారాయి.

ట్యూబల్ లైగేషన్ అనేది శాశ్వత కుటుంబ నియంత్రణ పద్ధతి. దీనిలో ఫెలోపియన్ ట్యూబ్‌లను ముడి వేస్తారు/కత్తిరిస్తారు. దాదాపు 30 నిమిషాల పాటు జరిగే ఈ శస్త్రచికిత్సను ‘ట్యూబల్ స్టెరిలైజేషన్’ లేదా ‘ఫిమేల్ స్టెరిలైజేషన్’ అని కూడా అంటారు. 2015 ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం, మహిళా స్టెరిలైజేషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన గర్భనిరోధక పద్ధతి. దాదాపు 19 శాతం మంది వివాహిత, లేదా లైంగిక సంపర్కంలో పాల్గొనే మహిళలు దీనిని ఎంచుకున్నారు.

భారతదేశంలో, జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 (2019-21) ప్రకారం, 15-49 ఏళ్ళ వయసున్న వివాహితల్లో 37.9 శాతం మంది ట్యూబల్ లైగేషన్ పద్ధతిని ఎంచుకున్నారు.

తన కళ్ళను సగంవరకూ కప్పేలా మెరిసిపోయే కాషాయ రంగు ఘూంఘట్ (ముసుగు) వేసుకున్న గోప్లీకి ఇది ఒక విప్లవాత్మక మలుపు. నాలుగో బిడ్డను కన్నాక ఆమె అలసిపోయారు కానీ, ఆరోగ్యంగానే ఉన్నారు. ఒక విధంగా ఇది ఒక ఆర్థికపరమైన నిర్ణయం.

వలస కార్మికుడైన ఆమె భర్త సోహన్‌రామ్ సూరత్‌లో పని చేస్తారు, సంవత్సరంలో చాలా కాలం పాటు అక్కడే ఉంటారు. హోళీ, దీపావళి పండుగల సమయంలో మాత్రం ఒక నెల రోజుల కోసం ఇంటికి వస్తుంటారు. నాలుగో బిడ్డ పుట్టిన కొన్ని నెలల తర్వాత అతను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, గోప్లీ మళ్ళీ గర్భవతి కాకూడదని నిశ్చయించుకున్నారు.

Seated on the cool floor of her brick home, Gopli is checking the corn (maize) kernels spread out to dry.
PHOTO • Kavitha Iyer
Gopli with Pushpa Gameti. Like most of the men of their village, Gopli's husband, Sohanram, is a migrant worker. Pushpa's husband, Naturam, is the only male of working age in Karda currently
PHOTO • Kavitha Iyer

ఎడమ: తన ఇటుక ఇంటిలోని చల్లని నేలపై కూర్చొని, ఎండటానికి ఆరబెట్టిన మొక్కజొన్న కండెలను తనిఖీ చేస్తోన్న గోప్లీ. కుడి: పుష్పా గమేతీతో గోప్లీ. వారి గ్రామంలోని చాలామంది మగవాళ్ళ మాదిరిగానే, గోప్లీ భర్త సోహన్‌రామ్ కూడా వలస కూలీ. పుష్ప భర్త, నాతూరామ్ ఒక్కరే ప్రస్తుతం కర్దాలో పనిచేసే వయస్సులో ఉన్న మగవాడు

“పిల్లల పెంపకంలో ఏదైనా సాయం అవసరమైతే అందించడానికి మగవాళ్ళెప్పుడూ ఇళ్ళల్లో ఉండరు,” అన్నారు గోప్లీ. ఇటుక గోడలు, గడ్డి/రెల్లు పైకప్పున్న తన ఇంట్లో, చల్లని బండలపై కూర్చొని మాట్లాడుతున్నారావిడ. అటు పక్కనే కొన్ని మొక్కజొన్న కండెలు ఎండబెట్టి ఉన్నాయి. ఆమె గర్భవతిగా ఉన్న సమయాలలో, సోహన్‌రామ్ ఎప్పుడూ ఆమె దగ్గర లేరు. నిండు గర్భిణిగా ఉన్నప్పుడు కూడా, వాళ్ళకున్న అర బిఘా (సుమారు 0.3 ఎకరాలు) వ్యవసాయ భూమిలోనూ, ఇతరుల భూములలోనూ పని చేస్తూ, సంసారాన్ని నడుపుకొచ్చారావిడ. “చాలాసార్లు మా పిల్లలకు కడుపునిండా తిండి పెట్టడానికి సరిపడా డబ్బు మా దగ్గర ఉండదు. అలాంటప్పుడు ఎక్కువ మంది పిల్లల్ని కని ఏం ఉపయోగం?”

మరేదైనా గర్భనిరోధక పద్ధతిని ప్రయత్నించారా అని ప్రశ్నించినప్పుడు, ఆమె సిగ్గుగా నవ్వారు. తన భర్త గురించి మాట్లాడటానికి ఆమె ఇష్టపడలేదు కానీ, తమ సమాజంలోని పురుషులను కుటుంబ నియంత్రణా పద్ధతులను పాటించేలా ఒప్పించడమనేది జరిగే పని కాదని మాత్రం ఆమె చెప్పారు.

*****

రోయ్‌డా పంచాయితీలో భాగమైన కర్దా గ్రామం, పొరుగునున్న రాజ్‌సమంద్ జిల్లాలోని పర్యాటక ప్రాంతమైన కుంభల్‌గఢ్ కోట నుండి 35 కిలోమీటర్ల దూరంలో, ఆరావళి పర్వతపాదాల వద్ద ఉంది. కర్దాలో నివసించే గమేతీలు, షెడ్యూల్డ్ తెగలుగా వర్గీకరించబడిన భీల్-గమేతీ సామాజికవర్గంలోని ఒకే కుదురుకు చెందిన 15-20 కుటుంబాల పెద్ద సమూహం. ఊరి పొలిమేరల్లో స్థిరపడిన వీరిలో ప్రతి కుటుంబానికీ ఒక బిఘా కంటే తక్కువ భూమి ఉంది. ఈ సమూహంలోని స్త్రీలలో ఎవరూ బడి చదువు కూడా పూర్తి చేయలేదు; చదువు విషయంలో స్త్రీల కన్నా పురుషులు కాస్తంత మెరుగ్గా ఉన్నారు.

జూన్ చివరి నుండి సెప్టెంబరు వరకూ ఉండే ఋతుపవన కాలంలో, గోధుమలు పండించడం కోసం తమ భూమిని దున్నే కాలాన్ని మినహాయిస్తే, మగవాళ్ళు చాలా అరుదుగా తప్ప, నెల కంటే ఎక్కువ కాలం ఇంటి పట్టున ఉండరు. ముఖ్యంగా, కోవిడ్-19 లాక్‌డౌన్‌లు తెచ్చిపెట్టిన కష్టాల తర్వాత, చాలామంది మగవాల్ళు సూరత్‌లో చీరలు తయారుచేసే పరిశ్రమల్లో ఉద్యోగాల్లో చేరారు. అక్కడ, తానుల్లోని బట్టలను ఆరు మీటర్ల పొడవైన చీరలుగా కత్తిరించి, అంచులను పూసలతోనో, లేదా కుచ్చులతోనో అలంకరించాలి. ఇది పూర్తిగా నైపుణ్యం లేని పని; ఇందుకోసం వారికి రోజుకు రూ.350-400 వేతనంగా ఇస్తారు.

దక్షిణ రాజస్థాన్ నుండి వలస వెళ్ళే లక్షలాదిమంది కార్మికుల్లో గోప్లీ భర్త సోహన్‌రామ్, ఇంకా చాలామంది గమేతీ మగవాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు దశాబ్దాలుగా సూరత్, అహమ్మదాబాద్, ముంబై, జైపూర్, న్యూఢిల్లీలలో పనిచేయడానికి వలస వెళ్తున్నారు. ఆడవాళ్ళను మాత్రం తమ గ్రామాల్లోనే విడిచిపెట్టి వెళ్తుంటారు.

ఇళ్ళవద్ద మగవాళ్ళు లేకపోవడంతో, పూర్తిగా నిరక్షరాస్యులైన, లేదంటే కాస్తో కూస్తో చదువుకున్న ఇక్కడి మహిళలు ఇటీవలి కాలంలో కొన్ని సంక్లిష్టమైన ఆరోగ్య సంరక్షణ పద్ధతులను ఎంచుకోవడం, నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకున్నారు...

Pushpa’s teenage son was brought back from Surat by anti-child-labour activists before the pandemic.
PHOTO • Kavitha Iyer
Karda is located in the foothills of the Aravalli mountain range, a lush green part of Udaipur district in southern Rajasthan
PHOTO • Kavitha Iyer

ఎడమ: కరోనా విజృంభణకు ముందు యుక్తవయసులో ఉన్న పుష్ప కొడుకును బాల కార్మిక వ్యతిరేక కార్యకర్తలు సూరత్ నుండి తిరిగి తీసుకువచ్చారు. కుడి: దక్షిణ రాజస్థాన్‌లోని ఉదయపూర్ జిల్లాలో పచ్చని భాగమైన కర్దా, ఆరావళి పర్వత శ్రేణుల దిగువ భాగంలో ఉంది

సరిగ్గా కరోనా విజృంభణకు ముందు, ముగ్గురు పిల్లలకు తల్లైన పుష్పా గమేతీ యుక్తవయసుకొచ్చిన కొడుకుని బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం పనిచేసే కార్యకర్తలు కొందరు, సూరత్ నుండి రక్షించి తిరిగి తీసుకువచ్చారు. ముప్పయ్యో పడిలో ఉన్న పుష్ప, ఎలాంటి ఆటుపోట్లనైనా ఎదుర్కొనేందుకు స్త్రీలు సిద్ధపడాలన్నారు.

ఇంతకు ముందు, ఏదైనా వైద్య సంబంధమైన అత్యవసర పరిస్థితి వస్తే, మహిళలు భయాందోళనలకు గురయ్యేవారు. వారాల తరబడి పిల్లలకు జ్వరం తగ్గకపోతే, లేదా పొలం పనులు చేసేటప్పుడు అయిన గాయాల నుండి ఎంతకూ రక్తస్రావం ఆగకపోతే, మహిళలు ఎంతగా భయంతో గడ్డకట్టుకుపోయేవారో ఆవిడ గుర్తు చేసుకున్నారు. “మా మధ్య మగవాళ్ళు లేని ఒకానొక సమయంలో, వైద్య ఖర్చుల కోసం మా దగ్గర డబ్బు ఉండేది కాదు. ఆస్పత్రికి వెళ్ళడానికి ప్రజా రవాణా వ్యవస్థను ఎలా వినియోగించుకోవాలో కూడా మాకు తెలిసేదికాదు. కానీ, మేం నెమ్మదిగా ప్రతిదీ నేర్చుకున్నాం.” అన్నారు పుష్ప.

పుష్ప పెద్ద కొడుకు కిషన్ మళ్ళీ పొరుగు గ్రామంలో పనిచేస్తున్నాడు – ఈసారి మట్టిని తవ్విపోసే మెషిన్ డ్రైవర్‌కి అసిస్టెంట్‌గా. ఇప్పుడు 5-6 ఏళ్ళ వయసులో ఉన్న తన పిల్లలు మంజు, మనోహర్‌ల కోసం, 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నరోయ్‌డా గ్రామంలోని అంగన్‌వాడీ కి వెళ్ళిరావడం నేర్చుకున్నారావిడ.

“మా పెద్ద పిల్లలకు అంగన్‌వాడీ నుండి తెచ్చేదేమీ ఉండదు.” అన్నారు పుష్ప. కానీ ఇటీవలి కాలంలో, కర్దాకు చెందిన బాలింతలు రోయ్‌డాను అనుకొని ఉన్న రహదారి వెంట జాగ్రత్తగా కొండపైకి నడవడం ప్రారంభించారు. అక్కడ అంగన్‌వాడీ లో బాలింతలకూ, చిన్న పిల్లలకూ వేడి వేడి భోజనం పెడుతున్నారు. పుష్ప, మంజుని ఎత్తుకొని నడిచేవారు. అప్పుడప్పుడు వారికి లిఫ్ట్ కూడా దొరికేది.

“ఇదంతా కరోనాకు ముందు,” అని పుష్ప తెలిపారు. లాక్‌డౌన్‌లు ముగిసిన తర్వాత, మే 2021 వరకు, అంగన్‌వాడీ కేంద్రాలు మళ్ళీ పని చేస్తున్నాయో లేదో అన్న సమాచారం ఈ మహిళలకు అందలేదు.

ఐదవ తరగతి తర్వాత కిషన్ బడి మానేసి, స్నేహితుడితో కలిసి సూరత్‌లో పని చేయడానికి వెళ్ళిపోయినప్పుడు, కిషన్‌ను ఎలా వారించాలన్న విషయంలో కుటుంబ సమష్టి నిర్ణయంపై తనకు అదుపు లేదని పుష్ప భావించారు. “కానీ మిగతా ఇద్దరి విషయంలో తీసుకొనే నిర్ణయాలన్నీ నా నియంత్రణలో ఉంచుకోవడానికే ప్రయత్నిస్తున్నాను.” అని ఆమె చెప్పారు.

Gopli and Pushpa. ‘The men are never around for any assistance with child rearing.
PHOTO • Kavitha Iyer
Gopli with two of her four children and her mother-in-law
PHOTO • Kavitha Iyer

ఎడమ: గోప్లి, పుష్ప. ‘పిల్లల పెంపకంలో సహాయం చేసేందుకు మగవాళ్ళెప్పుడూ అందుబాటులో ఉండరు.’ కుడి: తన నలుగురు పిల్లల్లో ఇద్దరితోనూ, అత్తగారితోనూ గోప్లి

ఆమె భర్త నాతూరామ్ ఒక్కరే ప్రస్తుతం కర్దాలో పని చేయగల వయసులో ఉన్న పురుషుడు. 2020 వేసవి లాక్‌డౌన్‌లో, వలస కార్మికులు సూరత్ పోలీసులతో ఘర్షణ పడడం చూసి ఆందోళన చెందిన అతను, కర్దా చుట్టుపక్కల ప్రాంతాలలో పని వెతుక్కోవడానికి ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు.

ట్యూబల్ లైగేషన్ ప్రయోజనాలను పుష్పకు వివరించారు గోప్లీ. శస్త్రచికిత్స తర్వాత సరైన సంరక్షణ లేకపోవడం వల్ల ఎదురయ్యే వైద్యపరమైన సమస్యలు (గాయం విషపూరితం కావటం, లేదా ఇన్ఫెక్షన్లు, పేగు అడ్డంకి లేదా పేగులకు సంబంధించిన ఇతర సమస్యలు, మూత్రాశయం దెబ్బతినడం వంటివి), లేదా ఈ పద్ధతి విఫలం అయ్యే అవకాశాల గురించి వాళ్ళిద్దరూ ఎప్పుడూ వినలేదు. అలాగే, కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలనేవి జనాభా నియంత్రణే లక్ష్యంగా చేపట్టే వ్యూహాల్లో ఒక భాగమని గోప్లీకి అర్థం కాలేదు. “ఇంతటితో చింత తీరిపోతుంది,” అని ఆమె అన్నారు.

పుష్ప కూడా తన ముగ్గురు పిల్లలను ఇంట్లోనే కన్నారు; వారి వర్గానికే చెందిన మహిళ/పెద్దావిడ ఒకరు శిశువు బొడ్డు తాడుని కత్తిరించిన తర్వాత, దాని చివరలను ' లచ్చా ధాగా '- హిందువులు సాధారణంగా తమ మణికట్టుకు కట్టుకునే మందపాటి దారం - తో ముడివేస్తారు.

యువ గమేతీ మహిళలు ప్రమాదకరంగా మారే ఇంటివద్ద జరిగే కాన్పులు చేయించుకోరన్నారు గోప్లీ. ఆమె ఒక్కగానొక్క కోడలు గర్భవతి. “మేం తన ఆరోగ్యం, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం విషయాల్లో రిస్క్ తీసుకోలేం.” అన్నారామె.

ప్రస్తుతం, ఆ 18 ఏళ్ళ గర్భవతి, ఆరావళి పర్వత శ్రేణుల్లోని ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఒక గ్రామంలో, తన పుట్టింట్లో ఉంది. అత్యవసర పరిస్థితి వస్తే, ఆమెను అక్కడ నుండి త్వరత్వరగా తరలించడం చాలా కష్టం. “ప్రసవ సమయంలో మేం ఆమెనిక్కడికి తీసుకువస్తాం. ఇద్దరో ముగ్గురో ఆడవాళ్ళు ఆమెను టెంపోలో దవాఖానా కు తీసుకువెళ్తారు.” అన్నారు గోప్లీ. టెంపో అంటే స్థానిక ప్రజా రవాణాలో ఉపయోగించే మూడు చక్రాల వాహనం.

“ఏదేమైనా, ఈ కాలపు అమ్మాయిలు పురిటి నొప్పులు భరించలేరు,” గోపి నవ్వుతూ అన్నారు. ఆమె చుట్టూరా ఉన్న ఇరుగుపొరుగువారు, బంధువులు కూడా ఆమెతో పాటు నవ్వారు.

Bamribai Kalusingh, from the Rajput caste, lives in Karda. ‘The women from Karda go in groups, sometimes as far as Gogunda CHC’
PHOTO • Kavitha Iyer

రాజ్‌పుత్ కులానికి చెందిన బమ్రీబాయి కాలూసింగ్ కర్దాలో నివసిస్తున్నారు. 'కర్దా నుండి మహిళలు ఒక సమూహంగా వెళ్తుంటారు, ఒక్కోసారి దూరంలో ఉండే గోగుందా సిఎచ్‌సి వరకూ కూడా'

ఈ ఇళ్ళల్లో ఉండే ఇద్దరు ముగ్గురు మహిళలు కూడా ట్యూబల్ లిగేషన్ చేయించుకున్నారు. అయితే దాని గురించి చర్చించడానికి ఈ మహిళలు చాలా సిగ్గుపడుతున్నారు. గోప్లీ చెప్పినదాని ప్రకారం, ఆధునిక గర్భనిరోధక సాధనాలేవీ ఇక్కడ సాధారణ ఉపయోగంలో లేవు, 'కానీ ఈ కాలపు యువతులు మరింత తెలివైనవాళ్ళు'

సమీప పిఎచ్‌సి, దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాందేశ్‌మా గ్రామంలో ఉంది. కర్దాకు చెందిన యువతులు గర్భం దాల్చినప్పుడు, ఈ పిఎచ్‌సిలో నమోదు చేస్తారు. వాళ్ళక్కడికి పరీక్షలు చేయించుకోవడానికి వెళ్తారు. గ్రామాలను సందర్శించే ఆరోగ్య కార్యకర్తలు పంపిణీ చేసే కాల్షియం, ఐరన్ సప్లిమెంట్లను వాడతారు.

అదే గ్రామంలో నివసించే రాజ్‌పుత్ సామాజిక వర్గానికి చెందిన బమ్రీబాయి కాలూసింగ్ మాట్లాడుతూ, “కర్దా నుండి మహిళలు గుంపులు గుంపులుగా వెళ్తారు. కొన్నిసార్లు దూరంగా ఉన్న గోగుందా సిఎచ్‌సి వరకూ కూడా వెళ్తుంటారు. వాళ్ళ ఆరోగ్యం గురించి స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం గమేతీ మహిళల జీవితాలను మార్చింది. ఇంతకుముందు వరకూ, మగతోడు లేకుండా వాళ్ళు తమ గ్రామాన్ని విడిచిపెట్టిన సందర్భాలు చాలా అరుదు,” అన్నారు.

గమేతీ మగవారితో సహా వలస కార్మికులతో కలిసి పనిచేసే అజీవికా బ్యూరో, ఉదయ్‌పుర్ యూనిట్ కమ్యూనిటీ ఆర్గనైజర్ అయిన కల్పనా జోషి చెప్పినదాని ప్రకారం, పెద్ద సంఖ్యలో వలసలు నమోదైన గ్రామాల్లో ఉండే మహిళల నిర్ణయాధికారంలో కొంత స్వావలంబన కనబడుతోంది. “అంబులెన్స్ కోసం ఎలా కాల్ చేయాలో వారికిప్పుడు తెలుసు. చాలామంది సొంతంగా ఆస్పత్రికి వెళ్తారు. ఆరోగ్య కార్యకర్తలు, ఎన్జీఓ ప్రతినిధులతో నిజాయితీగా మాట్లాడతారు. ఒక దశాబ్దం క్రితం పరిస్థితులు చాలా భిన్నంగా ఉండేవి.” అంతకుముందు, సూరత్ నుండి మగవారు తిరిగివచ్చేవరకూ అన్ని వైద్య అవసరాలనూ ఆపి ఉంచేవారని ఆమె అన్నారు.

ఈ సమూహంలో నివసించే ఇద్దరు-ముగ్గురు మహిళలు కూడా ట్యూబల్ లైగేషన్ చేయించుకున్నారు. అయితే, వాళ్ళు దీని గురించి చర్చించడానికి చాలా సిగ్గుపడతారు. గోప్లీ చెప్పిన ప్రకారం, ఆధునిక గర్భనిరోధక పద్ధతులను ఇక్కడి స్త్రీలు సాధారణంగా వాడరు. “కానీ ఈ కాలపు యువతులు తెలివైనవాళ్ళు!” పెళ్ళైన ఏడాది తర్వాత ఆమె కోడలు గర్భం దాల్చింది.

*****

ఒక వలస కార్మికుని భార్యగా బతకడం ఎంతో ఒత్తిడితో కూడుకున్న వ్యవహారమని, కర్దా నుండి 15 కిలోమీటర్ల లోపు దూరంలో ఉన్న ఒక గ్రామానికి చెందిన పార్వతి మేఘవాల్ (అసలు పేరు కాదు) అన్నారు. ఆమె భర్త గుజరాత్‌ రాష్ట్రం, మెహ్సానాలోని ఒక జీలకర్ర ప్యాకేజింగ్ యూనిట్‌లో పని చేస్తారు. కొంతకాలం పాటు, ఒక టీ స్టాల్ నడుపుకుంటూ, అతనితో కలిసి మెహ్సానాలో నివసించడానికి ప్రయత్నించారావిడ. కానీ, వారి ముగ్గురు పిల్లల చదువు కోసం ఆమె ఉదయ్‌పుర్‌కు తిరిగి రావాల్సి వచ్చింది.

2018లో, తన భర్త ఇంట్లో లేని సమయంలో, రోడ్డు ప్రమాదానికి గురయ్యారు పార్వతి. కిందపడగానే, ఆమె నుదుటికి ఒక మేకు గుచ్చుకుంది. గాయాలు నయమైన తర్వాత, ఆమెను ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ చేశారు. ఆ తర్వాత, రెండు సంవత్సరాలకు పైగా ఏదో తెలియని మానసిక సమస్యతో బాధపడ్డానని ఆమె చెప్పారు.

Parvati Meghwal (name changed) has struggled with poor mental health. She stopped her husband from migrating for work and now runs a little store in her village. ‘I don’t want to remain the left-behind wife of a migrant labourer’
PHOTO • Kavitha Iyer
Parvati Meghwal (name changed) has struggled with poor mental health. She stopped her husband from migrating for work and now runs a little store in her village. ‘I don’t want to remain the left-behind wife of a migrant labourer’
PHOTO • Kavitha Iyer

పార్వతి మేఘవాల్ (అసలు పేరు కాదు) మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారు. తన భర్తను పని కోసం వలసపోకుండా ఆపిన ఆమె, ఇప్పుడు తన గ్రామంలో ఒక చిన్న దుకాణాన్ని నడుపుతున్నారు. ‘ఒక వలస కూలీ ఇంటివద్ద వదిలివెళ్ళిన భార్యగా మిగిలిపోవడం నాకు ఇష్టం లేదు’

“నేనెప్పుడూ నా భర్త గురించీ, పిల్లల గురించీ, డబ్బుల గురించీ చింతిస్తూ ఉండేదాన్ని. ఆ సమయంలోనే నాకు ప్రమాదం జరిగింది,” అని ఆమె వివరించారు. కాటటోనియా (అచేతనంగా పడివుండే ఒక రకమైన మానసిక సమస్య) లక్షణాలతో, బహిష్టు సమయంలో చాలాసేపు విషాద ఛాయల్లో మునిగివుండే లక్షణాలలాంటివి ఎదుర్కొన్నారావిడ. “నా అరుపులకు, నేను చేసిన పనులకు అందరూ భయపడేవారు; ఊర్లో ఎవరూ నా దగ్గరికి వచ్చేవాళ్ళు కారు. నా వైద్య పరీక్షలకు సంబంధించిన పత్రాలన్నీ చింపేశాను; కరెన్సీ నోట్లు, నా బట్టలు కూడా చింపేశాను...” మానసిక వ్యాధి కారణంగా ఒకప్పుడు తాను అలాంటి పనులు చేసిందని తెలుసుకుని, ఇప్పుడు సిగ్గుతో తలదించుకున్నారావిడ.

“అదే సమయంలో లాక్‌డౌన్‌ విధించడంతో, మళ్ళీ అంతా మొదటికొచ్చింది. నేను మళ్ళీ మానసికంగా కుంగిపోయినంత పనయ్యింది.” అన్నారామె. ఆమె భర్త, 275 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెహ్సానా నుండి ఇంటికి నడిచి రావలసి వచ్చింది. ఈ లోపు ఆమె ఆందోళన పార్వతిని దాదాపు చావు అంచుకు పంపింది. ఆమె చిన్న కుమారుడు కూడా అప్పుడు ఉదయ్‌పుర్‌లో ఉన్నాడు; అక్కడతను ఒక రెస్టారెంట్‌లో రోటీలు చేసే పనిచేశాడు.

మేఘవాల్ అనేది ఒక దళిత సామాజిక వర్గం. షెడ్యూల్డ్ కులాలకు చెందిన వలస కార్మికుల భార్యలు, తమ గ్రామాల్లో జీవనోపాధి పొందడానికి పెద్ద పోరాటమే చేయాల్సి వస్తుందన్నారు పార్వతి. “మానసిక రుగ్మతతో బాధపడుతున్న, లేదా ఆ రుగ్మతతో బాధపడిన చరిత్ర ఉన్న దళిత మహిళకు, అది ఇంకెంత కష్టంగా ఉంటుందో మీరే ఊహించండి!” అన్నారామే.

పార్వతి అంగన్‌వాడీ కార్యకర్తగా, ఒక ప్రభుత్వ కార్యాలయంలో సహాయకురాలిగా పని చేశారు. ప్రమాదం జరిగిన తర్వాత, ఆమె మానసిక ఆరోగ్యం క్షీణించడంతో, ఉద్యోగంలో కొనసాగడం ఆమెకు కష్టంగా మారింది.

2020, దీపావళి సమయంలో లాక్‌డౌన్‌లు ముగిశాక, తన భర్త మళ్ళీ ఉద్యోగరీత్యా వలస వెళ్ళడానికి ఆమె నిరాకరించారు. కుటుంబ సభ్యుల దగ్గర కొంత, సహకార సంఘం దగ్గర కొంత అప్పు తీసుకుని, తన గ్రామంలోనే చిన్న కిరాణా కొట్టు పెట్టారావిడ. ఆమె భర్త మాత్రం గ్రామంలో, చుట్టుపక్కల ప్రాంతాల్లో రోజువారీ కూలీ కోసం ప్రయత్నాలు చేసేవారు. “ప్రవాసి మజ్దూర్ కి బీవీ నహీ రెహనా హై (ఒక వలస కార్మికుడు ఇంటివద్ద విడిచివెళ్ళిన భార్యగా మిగిలిపోవడం నాకిష్టం లేదు). ఇదొక తీవ్రమైన మానసిక గాయం.” అన్నారామె.

మళ్ళీ కర్దా విషయానికి వస్తే, మగవాళ్ళు లేకుండా సొంతంగా జీవనోపాధిని పొందడం దాదాపు అసాధ్యమని ఇక్కడి మహిళలు అంగీకరిస్తున్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) కింద లభించే పనులే గమేతీ మహిళలకు ఉపాధిని కలిగిస్తాయి. 2021కి సంబంధించి, వర్షాకాలం వచ్చే సమయానికి, కర్దా వెలుపలవున్న క్లస్టర్‌లోని మహిళలు 100 రోజుల పనిని పూర్తి చేశారు.

“మాకు ప్రతి సంవత్సరం 200 రోజుల పని అవసరమవుతుంది,” అని గోప్లీ అన్నారు. ప్రస్తుతానికి, సమీపంలోని మార్కెట్లో విక్రయించేందుకు, కూరగాయలు పండించే ప్రయత్నంలో ఉన్నారు ఇక్కడి మహిళలు. మగవాళ్ళని సంప్రదించకుండా వాళ్ళే తీసుకున్న మరో నిర్ణయం ఇది. “ఏదేమైనప్పటికీ, మేము తినడానికి పోషకాహారం కావాలి కదా!”

గ్రామీణ భారతదేశంలో, కౌమారదశలో ఉన్న బాలికలు, యువతులు మొదలైన అట్టడుగు సమూహాల జీవన పరిస్థితులను, అనుభవాలను వారి గొంతులతోనే పదిల పరచాలని, పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో, PARI మరియు కౌంటర్ మీడియా ట్రస్ట్ లు ఈ దేశవ్యాప్త రిపోర్టింగ్ ప్రాజెక్టును చేపట్టాయి.

ఈ కథనాన్ని ప్రచురించాలనుకుంటున్నారా? అయితే [email protected] కి ఈమెయిల్ చేసి, [email protected] కి కాపీ పెట్టండి.

అనువాదం: వై క్రిష్ణ జ్యోతి

Kavitha Iyer

کویتا ایئر گزشتہ ۲۰ سالوں سے صحافت کر رہی ہیں۔ انہوں نے ’لینڈ اسکیپ آف لاس: دی اسٹوری آف این انڈین‘ نامی کتاب بھی لکھی ہے، جو ’ہارپر کولنس‘ پبلی کیشن سے سال ۲۰۲۱ میں شائع ہوئی ہے۔

کے ذریعہ دیگر اسٹوریز Kavitha Iyer
Illustration : Antara Raman

انترا رمن سماجی عمل اور اساطیری خیال آرائی میں دلچسپی رکھنے والی ایک خاکہ نگار اور ویب سائٹ ڈیزائنر ہیں۔ انہوں نے سرشٹی انسٹی ٹیوٹ آف آرٹ، ڈیزائن اینڈ ٹکنالوجی، بنگلورو سے گریجویشن کیا ہے اور ان کا ماننا ہے کہ کہانی اور خاکہ نگاری ایک دوسرے سے مربوط ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Antara Raman
Translator : Y. Krishna Jyothi

Krishna Jyothi has 12 years of experience in journalism as a sub-editor & features writer. Now, she is into blogging.

کے ذریعہ دیگر اسٹوریز Y. Krishna Jyothi