రామకుండ - ఇది బహుశా గోదావరి నది మీద వున్న అత్యంత పవిత్రమైన ఘాట్ (స్నానఘట్టం) కావొచ్చు. ఆ ఘాట్ అంచున అతను ప్రార్థిస్తున్నవాడి భంగిమలో నిలబడివున్నాడు. అలాగే ముందుకు వంగుతూ కిందికి వెళ్ళి, స్నానం చేశాడు- ట్యాంకర్‌లోని పవిత్ర జలాలతో.

పవిత్ర గోదావరి పురిటి గడ్డ మహారాష్ట్ర నీటి సంక్షోభానికి స్వాగతం

గడిచిన 139 ఏళ్లగా ఎండిపోని ఆ చారిత్రిక రామకుండ ఘాట్ మొట్టమొదటిసారిగా ఈ ఏప్రిల్‌లో ఎండిపోయింది. అప్పటి నుంచి రెండు నెలలుగా రోజుకి 60-90 ట్యాంకర్ల నీటిని ఆ కుండా (గుండం)లో పోసి దాంట్లో నీళ్లు వుండేట్టుగా చేస్తున్నారు. క్లుప్తంగా చెప్పాలంటే, మహారాష్ట్ర ట్యాంకర్లతో నీటిని తెచ్చి నదిలో పోస్తోంది. గోదావరి నది పరిస్థితి కష్టంగా వుంది. నది చాలా చోట్ల ఎండిపోయింది. గోదావరి నది ఇలా ఎండిపోవడం ఎన్నడూ విననిదీ చూడనిదీ. మే నెల వచ్చేసరికి, నాశిక్‌లోని త్రయంబక్ పట్టణానికి ఎగువన ఉన్న బ్రహ్మగిరి పర్వతాలలోని దాని మూలం వద్ద సన్నని ధారగా మాత్రమే మిగిలింది. (నది జన్మస్థలాన్ని పవిత్రం చేసే త్రయంబకేశ్వర్ ఆలయం పేరుతోనే ఆ ప్రాంతాన్ని పిలుస్తుంటారు.) రుతుపవనాల రాకతో పరిస్థితిలో మార్పు వస్తుందని స్థానిక ప్రజలు ఆశతో వున్నారు.

PHOTO • P. Sainath

ఎడమ: నదిలోకి నీళ్లు పోస్తున్న ట్యాంకర్లు. కుడి: నదిలో కాకుండా టాంకర్ దగ్గర స్నానం చేస్తున్న యాత్రికుడు

“నదీ మూలం వద్ద ఉన్న పట్టణంలోనే ఈ వేసవికాలంలో మూడురోజులొకసారి నీళ్ళు వచ్చేలా పరిస్థితి దిగజారింది," నవ్వుతూ అన్నారు కమలాకర్ ఆకోల్కర్. ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతంగా ఆదాయాన్నార్జించే త్రయంబక్‌లో ఈయన పత్రికా ఫోటోగ్రాఫర్‌గానూ, పురోహితుడు గా కూడా ఉన్నారు. “ఇరవై ఏళ్లుగా జరుగుతున్న అటవీ విధ్వంసం ఇది. మా పచ్చదనమంతా పోయింది. ఇప్పుడిక్కడ లెక్కలేనన్ని కొత్త రోడ్లు, హోటళ్లు, వసతి గృహాలు, అభివృద్ధి, అనేక నిర్మాణాలు ఉన్నాయి. పట్టణ జనాభాయే దాదాపు 10 వేల మంది. కానీ రోజూ వచ్చేపోయేవాళ్ళు- యాత్రీకులు, చిన్న వ్యాపారులు, పర్యాటక ఆర్థిక వ్యవస్థలోని ఇతరులతో సహా అంతా కలిపి 50 వేల మంది వరకూ వుంటారు. ఇదంతా మాకున్న నీటి ఎద్దడిని ఇంకొంచెం పెంచింది. మాకు ఇరవై ఏళ్ల క్రితం ఏడాదికి నాలుగు నెలలు వర్షాలు పడేవి, ఇప్పుడది ఒకటిన్నర నెలకు తగ్గిపోయింది." అన్నారు అకోల్కర్.

“మునిసిపల్ కార్పొరేషన్ మమ్మల్ని ధ్వంసం చేసింది," అన్నారు అక్కడికి కొన్ని కిలోమీటర్ల దిగువన వుండే రామకుండ ముఖ్య పురోహితుడు సతీశ్ శుక్లా. కొన్నేళ్ల క్రితం భారతీయ జనతా పార్టీకి చెందిన కార్పొరేటర్ అయిన ఈయన గోదావరి పంచకోటి పురోహిత్ సంఘ్ అధ్యక్షుడు. 70 ఏళ్ల నుంచి వున్న ఈ పూజారుల సంఘం నది పేరుతో గుర్తింపు పొందింది. "కార్పోరేషన్, చాలాకాలంగా ఉన్న రాతి స్నానాల ఘాట్‌ ని పగలగొట్టి సిమెంట్‌తో మళ్ళీ కట్టింది. ఆలా చెయ్యకుండా ఉండాల్సింది. వందల ఏళ్లలో జరగని విధ్వసం గత రెండేళ్లలోనే జరిగింది." అన్నారు శుక్లా. "విచ్చలవిడి కాంక్రీట్ కట్టడాలు నదిని చంపేస్తున్నాయి. పాత జలాశయాలు ఎండిపోయాయి. పాత నీటి ఊటలూ మాయం అయ్యాయి. వాళ్ళు మా పురోహితుల ను ఒక్కసారి కూడా సంప్రదించలేదు. వాళ్ళకిష్టం వచ్చినట్టు మార్చేశారు. నది సహజ ప్రవాహం ఇప్పుడు లేదు. వరుణ దేవుడు మా పురోహితుల ప్రార్థనలు ఎప్పుడూ మన్నించేవాడు. కానీ, ఇకపై అలా ఉండదు.” అన్నాడాయన.

PHOTO • P. Sainath

ఎడమ : రామకుండ గట్టుమీద గుమిగూడివున్న యాత్రికులు . కుడి : గోదావరి పూజారుల సంఘం అధ్యక్షుడు సతీశ్ శుక్లా

వరుణ దేవుడు పురోహితుల ప్రార్థనలు ఆలకించకపోవచ్చు కానీ ప్రభుత్వం మాత్రం నాశిక్‌లో జరిగిన కుంభమేళా కోసం వాన దేవుడి పాత్రను పోషించాలని నిర్ణయించుకుంది. కుంభమేళా కోసం గోదావరిపై ప్రధాన ఆనకట్ట అయిన గంగాపూర్, గోదావరి ఉపనదులైన గౌతమి, కాశ్యపి నదుల నుండి మొత్తం 1.3 వేల మిలియన్ క్యూబిక్ అడుగుల(టిఎమ్‌సి) నీటిని విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. 2015 ఆగస్టు-సెప్టెంబర్ నెలల్లో షాహీ స్నాన్ (రాజ స్నానం) కోసం మూడు రోజుల పాటు విడుదల చేసిన నీరు ఇందులో ఒక భాగం మాత్రమే. ఈ ఏడాది జనవరిలో జరిగిన ముగింపు కార్యక్రమానికి కూడా చాలా నీళ్లు అవసరమయ్యాయి. పవిత్ర స్నానాల వల్ల పేరుకుపోయిన చెత్తని శుభ్రం చెయ్యడానికి మరిన్ని నీళ్లు విడుదల చెయ్యాల్సి వచ్చింది.

మొత్తమ్మీద కుంభమేళా, దాని అనేక అనుబంధ కార్యక్రమాలకు నెలల వ్యవధిలో 1.3 టిఎమ్‌సిల నీళ్లు విడుదల చేశారు. ఇది 2015-16 సంవత్సరం మొత్తానికి నాశిక్ నగరానికి కేటాయించిన 3.7 టిఎమ్‌సిల నీటిలో దాదాపు సగం. దీనిపై కోర్టుల్లో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇవన్నీ మేళాలో ఉన్న భక్తుల ప్రార్థనలకు సమాధానం ఇచ్చినప్పటికీ, దిగువనున్న రైతుల ప్రార్థనలను ఎవరూ వినలేదు. ఈ రైతులు తమ అవసరాల కోసం గంగాపూర్ నుంచి సకాలంలో విడుదలయ్యే నీటిపైనే ఆధారపడుతున్నారు

PHOTO • P. Sainath

కుంభ మేళాకు నీళ్లు తరలించడం వల్ల తన పంటకు జరిగిన నష్టాన్ని వివరిస్తున్న ప్రశాంత్ నిమ్సే

"మాకు మూడు విడతల నీళ్ళు అవసరమయితే, ఒక్క విడత నీళ్ళే వచ్చాయి. ఒకటిన్నరసార్లు వచ్చాయనుకోవచ్చు. కానీ మొదటిసారి వచ్చినవి ముందస్తు హెచ్చరికేమీ లేకుండా కాస్త ముందుగానే వచ్చాయి," అన్నారు ప్రశాంత్ నిమ్సే. ఇతను గంగాపూర్ ప్రాజెక్టు ఎడమ కాలువ నుంచి నీళ్లు పారే నాందుర్‌గాఁవ్ గ్రామానికి చెందిన రైతు. నిమ్సే ద్రాక్ష, అత్తి పండ్లు వంటి ఉద్యాన పంటలు పండిస్తారు. తన సొంత స్థలంలో కట్టిన కల్యాణ మంటపం వల్లే ఎంతో కొంత ఆదాయం వస్తోందని అతను చెప్పారు. వాళ్ళ గ్రామం నాశిక్ పట్టణ శివార్లలో కలిసిపోతూవుండటం వల్ల కల్యాణ మంటపం నుంచి వచ్చే ఆదాయం బాగానే వుంది. "నా పరిస్థితి ఫర్వాలేదు. కానీ వ్యవసాయాన్ని మాత్రమే నమ్ముకున్నవాళ్ళు మాత్రం మునిగిపోయారు."

ద్రాక్ష పంటకు జరిగిన నష్టం చాలా తీవ్రమైన సమస్యలనే తెచ్చింది," అన్నారు వాసుదేవ్ ఖాటే అనే మరో రైతు. "కరవుకాలంలో నీళ్లు లేకపోవడం పంటను దెబ్బతీస్తుంది. ఎలాగో ఒకలా ద్రాక్ష దిగుబడి తీసుకురాగలిగినా, అది నాణ్యతను దెబ్బతీస్తుంది. ఒక ఎకరా ద్రాక్ష తోటకి సంవత్సరానికి దాదాపు 100 పని దినాలు అవసరం. ఇక్కడ 40 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందంటే, అన్ని ఎకరాల్లో పనిచేసే కూలీలకు పని లేదన్నట్టు. వారు 30 లక్షల పనిదినాలు నష్టపోయారు. ఈ కూలీలంతా బయటి ప్రాంతాలయిన మరాఠ్వాడా, లాతూర్, బీడ్, ఔరంగాబాద్, ఉస్మానాబాద్‌ల నుంచి వస్తారు. ఇక్కడ పనిలేకపోవడం వల్ల వచ్చే నష్టం ఆ వేలాది మరఠ్వాడా ఇళ్లల్లోకి అపరిమితమైన దుఃఖాన్ని మోసుకుపోతుంది.

ఇప్పుడిక రాష్ట్రంలో వర్షాలు కురవడం మొదలయ్యింది. ఈ సమస్య ఒక్క మంచి వానాకాలంతో ముగిసేది కాదని చాలామంది రైతులకు కూలీలకు తెలుసు. "ఈ వర్షాలు ఉపశమనం కలిగిస్తాయి," అన్నారు ఫోటోగ్రాఫర్-పురోహితుడు ఆకోల్కర్. "... కానీ దీర్ఘకాలిక సంక్షోభం మరింత ముదురుతోంది, అది పోయేది కాదు.".

నాశిక్ జిల్లా నీటిపారుదల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ పి. బి. మిసాళ్‌ది ఈ విషయంపై మరో రకమైన విశ్లేషణ. "మహారాష్ట్రలో మాకు జీవనదులనేవి లేవు. వ్యవసాయం కోసం విచ్చలవిడిగా పంపింగ్ చేసెయ్యడం వల్ల గత ఇరవై ఏళ్లలో భూగర్భ జిల్లాలు విపరీతంగా పడిపోయాయి. అలాగే నాశిక్ నగర జనాభా కూడా పెరిగి 20 లక్షలకు చేరుకుంది. రోజూ వచ్చిపోయే జనాభా దాదాపు మరో 3 లక్షలు. భూమి వాడకం పద్ధతులు కూడా చాలా మారాయి. ఇంతకుముందు పట్టణం చుట్టూ వున్న పచ్చటి పొలాలు ఇప్పుడు జనావాసాలుగా మారిపోయాయి.” అన్నారు మిసాళ్. వర్షాలు కురిసే పద్దతి మరింత అస్తవ్యస్తంగా మారటం కనిపిస్తోంది కానీ, వర్షపాతంలో ఎటువంటి "లౌకిక క్షీణత"నూ డేటా చూపడం లేదని అతను కనుగొన్నారు. ప్రొఫెసర్ మాధవ్ గాడ్గిల్ వంటి పర్యావరణ నిపుణుల ప్రకారం మహారాష్ట్రలో జీవనదులు ఉండేవి, కానీ ఇప్పుడవి "వానాకాలం నదులుగా మారిపోయాయి."

ఇది మహారాష్ట్ర మెగా నీటి సంక్షోభంలో మానవ పాత్రను ముందుకు తెస్తోంది. త్రయంబకేశ్వర్ నీటి సమస్యలు పశ్చిమ మహారాష్ట్ర, సతారా జిల్లాలోని పాత మహాబలేశ్వర్‌లో ఉన్న కృష్ణా నదీమూలం వద్ద మేం కనుగొన్నవాటినే పోలి ఉన్నాయి. (అక్కడకూడా నేను, నా సహచరులు మే నెలలో దిగువ ప్రాంతంలో ప్రయాణించాం. నదుల మూలాలూ, పాలకుల అవినీతి చర్యలూ అనే వ్యాసం రాశాం.)

"నాశిక్ ఒక ప్రధాన పారిశ్రామిక ప్రాంతంగా మారిందని గుర్తుంచుకోవాలి. అలాగే ఈ ప్రాంతంలోని నీటి భాగస్వామ్య వ్యవస్థలు కూడా మారాయి,” అని అకోల్కర్ చెప్పారు. “ప్రతి ప్రాంతంలోనూ, ప్రతి చోటా ఒక భారీ, నియంత్రణ లేని పానీ (నీటి) మార్కెట్ ఉంది. అద్భుతమైన వర్షపాతం కూడా దీనిపై తక్కువ ప్రభావం చూపుతోంది. పర్యాటకం అంటే అర్థం ఇప్పుడు పట్టణంలోని ప్రతి అడుగూ కాంక్రీట్ చేసివుంది. నీటికి ప్రవహించడానికో, లేదా శ్వాసించడానికో చాలా తక్కువ స్థలం మాత్రమే ఉంది."

PHOTO • P. Sainath

త్రయంబకేశ్వర ఆలయం వద్ద ఉన్న గంగాసాగర్ గోదావరి నదికి మొదటి పరీవాహక తటాకం అయినప్పటికీ, దాని సాధారణ స్థాయి కంటే కూడా చాలా తక్కువ నీటిమట్టంతో ఉంది

త్రయంబకేశ్వర్‌లోని గంగాసాగర్ తటాకంలోకి బ్రహ్మగిరి పర్వతాల నుండి ప్రవహించే అనేక చిన్న ప్రవాహాలన్నీ ఎండిపోయి పర్వతం వైపున తెల్లటి చారికలు మాత్రం మిగిలివున్నాయి. మనం చూసినవన్నీ ఎండిపోయేవున్నాయి. బహుశా ఇప్పుడు రాష్ట్రంలో వర్షాలు కురుస్తుండటంతో వాటికి మళ్ళీ జీవం రావొచ్చు.

విచ్చలవిడి అడవుల నాశనం, అవసరానికి మించి నదులకు కట్టిన ఆనకట్టలు, పారిశ్రామిక అవసరాల కోసం, విలాసవంతమైన రిసార్ట్‌ల వంటి జీవనశైలి ప్రాజెక్టుల కోసం భారీగా నీటిని మళ్లించడాన్ని రాష్ట్రవ్యాప్తంగా చూడవచ్చు. అలాగే నదీ జన్మస్థానాల్లో ఎడతెగని శంకుస్థాపనలు, భూగర్భజలాలను భారీగానూ, నియంత్రణ లేకుండానూ వెలికితీయడం, నీటి పంపకంలో పేద, ధనిక వర్గాల మధ్య అసమానతలు- ఇవన్నీ కూడా ఇవ్వాల్టి మహారాష్ట్రలోని భయంకర నీటి సంక్షోభానికి కారణాలు. ఈ సంక్షోభం వర్షాల ప్రారంభంతో మాయమైపోయిన మీడియా కవరేజీలాగా, రుతుపవనాల ప్రభావానికి కొట్టుకుపోలేనిది.

అనువాదం: వి. రాహుల్జీ

پی سائی ناتھ ’پیپلز آرکائیو آف رورل انڈیا‘ کے بانی ایڈیٹر ہیں۔ وہ کئی دہائیوں تک دیہی ہندوستان کے رپورٹر رہے اور Everybody Loves a Good Drought اور The Last Heroes: Foot Soldiers of Indian Freedom کے مصنف ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز پی۔ سائی ناتھ
Translator : Rahulji Vittapu

Rahulji Vittapu is an IT professional currently on a small career break. His interests and hobbies range from travel to books and painting to politics.

کے ذریعہ دیگر اسٹوریز Rahulji Vittapu