ఈ ఖరీఫ్ లో వేసిన పంట దిగుబడి పై తీరా, అనిత భుయ్యాలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళు వరి, కొంత మొక్క జొన్న నాటారు. పంట కోతల సమయం దగ్గర పడుతోంది.
ఈ సారి వీరికి మంచి దిగుబడి రావటం చాలా ముఖ్యం. ఎందుకంటే మార్చి నెలలో ప్రారంభమయిన లాక్డౌన్ వల్ల వాళ్ళు సంవత్సరంలో ఆరు నెలల పాటు ఇటుక బట్టీలలో చేసే పని తగ్గిపోయింది.
"పోయినేడు కూడా నేను సేద్యం చేశాను. సరైన వానలు లేక, చీడల వల్ల పంట పోయింది." అన్నారు తీరా. "మేము దాదాపు ఆరు నెలల పాటు సేద్యం చేస్తాం. కానీ అది మాకు చేతిలో ఒక్క పైసా కూడా మిగల్చదు." అనిత అందుకున్నారు.
45 ఏళ్ల తీరా, 40 ఏళ్ల అనిత మహుగావాన్ గ్రామం దక్షిణం మూలనున్న భుయ్యా తాఢీ - భుయ్యా అనే షెడ్యూల్డ్ కులానికి చెందిన- కాలనీలో వుంటారు.
ఝార్ఖండ్ రాష్ట్రం, పలామూ జిల్లాలోని చెయిన్‌పూర్ బ్లాక్ లో ఉన్న ఈ గ్రామంలో, 2018 నుంచి ప్రతి ఖరీఫ్ సీజన్లో ఈ కుటుంబం భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తోంది. స్థానికంగా బటియా అని పిలిచే ఈ కౌలు పద్దతి ప్రకారం కౌలు రైతు, భూయజమానీ ఇద్దరూ చెరో సగం పెట్టుబడి పెడతారు. వచ్చిన దిగుబడిని చెరి సగం పంచుకుంటారు. ఇదంతా నోటి మాట మీద నడిచే వ్యవహారం. సాధారణంగా కౌలు రైతులు పంటలో వచ్చే తమ భాగాన్ని తమ సొంత వినియోగం కోసం వుంచుకుంటారు. అప్పుడప్పుడు మాత్రమే కొంత పంటను మార్కెట్లో అమ్మడానికి ప్రయత్నిస్తారు.
దాదాపు అయిదేళ్ల క్రితం వరకు ఈ కుటుంబం వ్యవసాయ కూలీలుగా పని చేసేవారు. రోజుకి 250 నుంచి 300 రూపాయల కూలీ, లేదా ధాన్యాన్ని ప్రతిఫలంగా పొందేవారు. ఒక ఏడాదిలో విత్తనాలు నాటే రెండు సీజన్లలో కలిపి మొత్తం 30 రోజుల పని దొరికేది. మిగతా రోజుల్లో కూరగాయల తోటల్లోనో, పక్క గ్రామాల్లోనో లేక, మహుగావాన్ గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలో వున్న డాల్టన్‌గంజ్ పట్టణంలో కూలీలుగానో పని చేసుకొనేవారు.
కానీ ప్రతి సంవత్సరం అందుబాటులో ఉండే పొలం పనులు తగ్గిపోతుండటంతో, 2018లో వాళ్ళు సొంత వ్యవసాయంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుందామని భూ యజమానితో బటియా ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. "దీనికి ముందు నేను భూస్వాములకు హర్వాహి - ఎద్దులను ఉపయోగించి భూమిని దున్నడం, ఇతర వ్యవసాయ పనులు - చేసేవాడ్ని." అన్నారు తీరా. "కానీ ఇప్పుడు అన్నింటికీ ట్రాక్టర్ లు వచ్చేశాయి- దున్నడానికి, పంట కొయ్యడానికీ- అన్నింటికీ. ఒకే ఒక ఎద్దు మిగిలింది వూర్లో."
వేడినీళ్ళ కు చన్నీళ్ళ లాగా ఉంటుందని అనిత, తీరాలు భూమిని కౌలుకు తీసుకోవడంతో పాటు 2018 నుంచి ఇటుక బట్టీల్లో పని చెయ్యడం ప్రారంభించారు. గ్రామంలో ఇంకొంతమంది కూడా ఇటుక బట్టీల్లో పనిచేసేవారు .బట్టీల్లో పని నవంబర్ చివరి వారం లేదా డిసెంబర్ మొదటి వారం నుంచీ మే నెల మధ్య దాకా లేదా జూన్ నెల మొదటి వారం వరకు ఉండేది. "నిరుడు మేము మా అమ్మాయి పెళ్లి చేశాం," అన్నారు అనిత. వాళ్లకు ఇద్దరు ఆడపిల్లలు. ఇంకా పె ళ్ళికాని వాళ్ళ చిన్నమ్మాయి వాళ్ళతోనే వుంటోంది. డిసెంబర్ 5, 2019 న పెద్దకూతురి పెళ్లి అయ్యింది. మూడు రోజుల తర్వాత ఈ కుటుంబం ఇటుక బట్టీలో పని ప్రారంభించింది. "పెళ్లి కి చేసిన అప్పు తీర్చేస్తే మేము మళ్లీ వ్యవసాయానికి వెళ్లి పోతాం".
మార్చి నెల చివర్లో మొదలయిన లాక్‌డౌన్‌కు ముందు తీరా, అనిత, వాళ్ళ అబ్బాయిలు 24 ఏళ్ల సితేందర్, 22 ఏళ్ల ఉపేందర్, మరికొందరు తమ భుయ్యా కాలనీవాళ్ళతో కలిసి పొద్దున్నే ట్రాక్టర్ ఎక్కి 8 కిలోమీటర్ల దూరంలో వున్న బుర్హిబిర్ అనేవూరు వెళ్ళేవాళ్ళు. అక్కడ చలికాలంలో అయితే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ, ఎండాకాలంలో అయితే వేకువ ఝామున 3 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు పని చే సేవారు. "ఇటుక బట్టీలో పనిచేయటంలో మంచి విషయం ఏదైనా వుందీ అంటే అది కుటుంబం మొత్తం ఒకే దగ్గర పని చేయడం." అంటారు అనిత.
ఇటుకల బట్టీలో ప్రతి వెయ్యి ఇటుకల తయారీకి అయిదు వందల రూపాయలు ఇస్తారు. ఈ సారి బట్టీల సీజన్లో వాళ్ళు తమ ఊరికే చెందిన కాంట్రాక్టర్ దగ్గర అక్టోబర్ 2019లో అప్పుగా తీసుకున్న ముప్పై వేల అడ్వాన్సు తీర్చెయ్యడానికే పనిచెయ్యాలి. అతని దగ్గరే కూతురి పెళ్లి కోసం వడ్డీలేని అడ్వాన్సుగా తీసుకున్న మరో డెబ్భై అయిదు వేలు తీర్చడం కోసం వాళ్ళు మళ్ళీ నవంబర్ 2020 లో మొదలయ్యే బట్టీల సీజన్లో పని చేయాల్సి రావచ్చు.
బట్టీ దగ్గర అనిత, తీరా, అతని కొడుకులిద్దరికీ కలిపి వారానికి వెయ్యి రూపాయలు భత్యం ఇస్తారు. "దాంతోటి మేము బియ్యం, ఉప్పు, నూనె, కూరగాయలు కొనుక్కుంటాం," అన్నారు తీరా. "ఇంకా ఎక్కువ డబ్బు కావాలంటే మేము కాంట్రాక్ట ర్ని అడుగుతాం, అతను ఇస్తాడు." ఈ వారానికొకసారి ఇచ్చే భత్యం, ఎప్పుడైనా అవసరానికి ఇచ్చే అప్పు, ఇంకా ముందే ఇచ్చిన ఎక్కువ మొత్తం అడ్వాన్స్- మొత్తం అన్నీ కలిపి - వాళ్ళు అన్ని నెలలపాటు బట్టీల దగ్గర ఉంటూ తయారుచేసిన మొత్తం ఇటుకలకు చివరలో చెల్లించే కూలీ లోంచి మినహాయించుకుంటారు.
గతేడాది అంటే జూన్ 2019లో వాళ్ళు ఇటుక బట్టీల పనిలోనుంచి చేతిలో యాభై వేల రూపాయలతో తిరిగి వచ్చారు. ఆ డబ్బుతో కొన్ని నెలలు గడిచాయి. కానీ ఈసారి లాక్డౌన్ వల్ల భుయ్యా కుటుంబానికి ఇటుకలు చేసే పని తగ్గిపోయింది. మార్చి నెల చివరికి వచ్చేసరికి వాళ్లకు కాంట్రాక్టర్ నుంచి కేవలం రెండు వేలే చేతికి వచ్చాయి.
అప్పటి నుంచి భుయ్యా కుటుంబం, వాళ్ల సామాజిక వర్గంలోని చాలామందికి లాగే ఇతర ఆదాయమార్గాలు వెతుకుతున్నారు. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద కుటుంబంలో ఒక్కొక్కళ్ళకి అయిదు కిలోల బియ్యం, ఒక కిలో దాల్ (పప్పు) ఇచ్చారు. కొంత వెసులుబాటు దొరికినట్టయ్యింది. ఇంకా, వారి అంత్యోదయ అన్న యోజన రేషన్ కార్డుపై (ఆహారం మరియు ప్రజాపంపిణీ శాఖ వర్గీకరించిన "పేదవారిలోకెల్లా పేదవారి కోసం"), కుటుంబానికి ప్రతి నెలా సబ్సిడీ ధరకు 35 కిలోల ధాన్యం వస్తుంది. "అది మా కుటుంబానికి పది రోజులకి కూడా సరిపోదు," అన్నారు తీరా. అతనితో పాటు ఆ కుటుంబంలో అనిత, వాళ్ళ ఇద్దరు కొడుకులు, ఒక కూతురు, ఇద్దరు కోడళ్ళు, ముగ్గురు మనవలు వున్నారు.
తిండి సరుకులు నిండుకునే కొద్దీ, వాళ్ళు మహుగావాన్లోనూ, ఆ చుట్టుపక్కల గ్రామాల్లోనూ ఏవో చిన్నాచితకా పనులు చేసుకుంటూ, అప్పుడప్పుడు అప్పులు చేస్తూ నెట్టుకొస్తున్నారు.
ఈ ఖరీఫ్ సీజన్లో కౌలుకి తీసుకున్న రెండెకరాల పొలంలో వరి, మొక్కజొన్న పండించడానికి విత్తనాలు, పురుగు మందులు, ఎరువులతో కలిపి దాదాపు అయిదు వేలు ఖర్చయివుంటుందని తీరా, అనితల అంచనా. "నా దగ్గర డబ్బులేమీ లేవు," తీరా అన్నారు. "ఒక బంధువు దగ్గర అప్పు చేశాను. ఇప్పుడు నా నెత్తి మీద చాల అప్పు వుంది."
వాళ్ళు వ్యవసాయం చేస్తున్న పొలం అశోక్ శుక్లాది. అతనికి పది ఎకరాల భూమి వుంది. గత ఐదేళ్లుగా అతను కూడా నష్టాలే చూస్తున్నారు. అందుకు ప్రధాన కారణం వర్షాభావం. "మేము ఏడాదిన్నరా రెండేళ్లకు సరిపడా ధాన్యం పండించుకునేవాళ్ళం,” అని అశోక్ గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు మా కోఠీ (వడ్లు దాచుకునే గది) ఆరు నెలలకే ఖాళీ అయిపోతోంది. నేను దాదాపు 50 ఏళ్లు వ్యవసాయం చేశాను. కానీ, వ్యవసాయంలో భవిషత్తు లేదనీ, వున్నదంతా నష్టాలే అని గత ఐదారేళ్ళు నాకు అర్థంచేయించాయి.”
శుక్లా చెప్పినదాని ప్రకారం వాళ్ళ గ్రామంలోని భూయజమానులు - ఎక్కువ మంది అగ్రకులాలకు చెందినవాళ్ళు - వేరే ఉద్యోగాలు వెతుక్కుంటూ పట్టణాలకూ నగరాలకూ వలస వెళ్లడం పెరిగింది. తగ్గిపోతున్న దిగుబడుల కారణంగా, వ్యవసాయ కూలీలకు రోజుకి మూడు వందల రూపాయలు ఇచ్చి వ్యవసాయం చెయ్యడం కంటే బటియా కు ఇవ్వడమే మంచిదనుకుంటున్నారు. "మొత్తం గ్రామంలో వాళ్ళు (అగ్ర కులాల భూయజమానులు) సొంతంగా వ్యవసాయం చెయ్యడం చాల అరుదుగా మాత్రమే మనం చూడగలం," అన్నారు శుక్లా. "వాళ్లంతా తమ భూముల్ని భుయ్యాలకు లేదా ఇతర దళితులకు కౌలుకు ఇచ్చారు". (2011 జనాభా లెక్కల ప్రకారం, మహుగావన్ గ్రామంలోని మొత్తం 2698 మంది జనాభాలో 21 నుంచి 30 శాతం ప్రజలు షెడ్యూల్డు కులాలకు చెందినవాళ్ళు.)
ఈ ఏడాది వర్షాలు బాగానే కురిశాయి కాబట్టి, తమ పంట దిగుబడి కూడా మంచిగానే ఉంటుందని తీరా ఆశిస్తున్నారు. మంచి పంట అంటే తమ రెండు ఎకరాల్లో మొత్తం 20 క్వింటాళ్ల వరి పండుతుందని అతను అంచనా వేస్తున్నారు. ధాన్యం నుండి ఊకను వేరు చేసి, అశోక్ శుక్లాతో దిగుబడిని పంచుకున్న తరువాత, వారి వాటాకి దాదాపు 800 కిలోల బియ్యం వస్తాయి. మరే ఇతర తిండిగింజల ఆధారమూ లేని పదిమంది సభ్యుల తీరా కుటుంబానికి అదే ప్రధాన ఆహారం. "ఆ ధాన్యాన్ని మార్కెట్ లో అమ్మగలిగితే బాగుండునని నా కోరిక." అంటారు తీరా. "కానీ ఆ ధాన్ (ధాన్యం) మాకు ఆరు నెలలకు కూడా సరిపోవు."
తనకు అన్ని పనుల కంటే వ్యవసాయం పనులే బాగా వచ్చని తీరా అన్నా రు. ఎక్కువ మంది భూయజమానులు తమ భూములను కౌలుకి ఇవ్వడానికి సిద్ధంగా వున్నారు కాబట్టి, ఎక్కువ భూమిలో వివిధ రకాల పంటలు సాగు చేయవచ్చునని అతను ఆశిస్తున్నారు.
ప్రస్తుతానికి, కొన్ని వారాల్లో రాబోయే దిగుబడి పుష్కలంగా ఉంటుందనే ఆశతో వున్నారు, అతనూ అనితా కూడా.
అనువాదం: వి. రాహుల్జీ