చిత్ర కి తొలిచూపులోనే ప్రేమ కలిగింది. ఆమె మొదటిసారి ముత్తురాజాని 2016లో తన స్నేహితురాలి పెళ్ళిలో చూసింది. అతను కూడా ఆమెతో ప్రేమలో పడ్డాడు కానీ అతను ఆమెని చూడలేదు- ఎందుకంటే అతనికి కళ్ళు కనపడవు. ఆమె కుటుంబం ఈ పెళ్ళికి అసలు ఒప్పుకోలేదు. గుడ్డివాడిని పెళ్లి చేసుకుని తన జీవితాన్ని నాశనం చేసుకుంటోందని వారు వాదించారు. వారిద్దరి కోసం ఆమె ఒకతే సంపాదించవలసి ఉంటుంది అని హెచ్చరించారు, ఆమె మనసు మళ్లించాలని ప్రయత్నించారు.
పెళ్ళైన ఒక నెల తరవాత చిత్ర కుటుంబం చెప్పిన మాటలు తప్పని తేలాయి. ముత్తురాజే ఆమెని పూర్తిగా చూసుకుంటున్నాడు, ఆమెకి గుండెజబ్బు ఉందని తెలిసింది. అప్పటి నుంచి వారి జీవితం ఊహించనన్ని మలుపులు తిరిగింది - కొన్ని మలుపులు అతి క్రూరంగా కూడా ఉన్నాయి. కానీ తమిళనాడులో, సోలంకురుని గ్రామంలో ఉండే 25 ఏళ్ళ చిత్ర, 28 ఏళ్ళ ముత్తురాజా, ఇద్దరూ, ధైర్యమూ ఆశ తో జీవితాన్ని ఎదుర్కొన్నారు.
*****
చిత్రకి పదేళ్లు ఉన్నప్పుడు ఆమె తండ్రి ఆమెని, ఆమె ఇద్దరు చెల్లెళ్లని, భార్యనీ, లెక్కలేనన్ని అప్పులనీ వదిలి వెళ్ళిపోయాడు. అప్పుల వాళ్ల బాధని తట్టుకోలేక, ఆమె తల్లి బడిలో చదువుకుంటున్న తన పిల్లలని చదువు మాన్పించి, పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కి తీసుకువచ్చింది. అక్కడ వారందరూ, నూలుదారాలు తయారు చేసే కంపెనీలో పనికి చేరారు.
వాళ్ళు రెండేళ్లకు మధురై తిరిగి వచ్చారు. ఈసారి వాళ్లు చెరకు తోటల్లో పనికి చేరారు. చిత్రకు 12 ఏళ్ళు. చెరకు తోటలో, పది వరసల చెరకుని ఎండిపోయిన కాడలని తుంచి శుభ్రం చేస్తే 50 రూపాయిలు ఇచ్చేవారు. అది చాలా కఠినమైన పని, ఆమె చేతులు కోసుకుపోయేవి, వెన్ను నొప్పి పుట్టేది. కానీ ఇంత కష్టపడినా, వాళ్ళు ఆమె తండ్రి చేసిన అప్పులను తీర్చలేకపోయారు. కాబట్టి చిత్రను, ఆమె అక్కను కాటన్ మిల్లులో పనికి చేర్పించారు. ఆమె అక్కడ రోజుకు 30 రూపాయిలు సంపాదించేది. మూడేళ్ళ తరవాత, ఆమె జీతం 50 రూపాయలకు పెరిగింది, అప్పుడు ఆమె అప్పును తీర్చగలిగింది. ఇప్పుడు చిత్రకు అప్పటి అప్పు ఎంతో, దానికి వడ్డీ ఎంత తీసుకున్నారో గుర్తులేదు. కానీ ఆ అప్పు తీర్చడానికి ఆమె నలిగిపోయింది.
ఈ అప్పులని తీర్చాక వేరే ఇబ్బందులు వచ్చి పడ్డాయి. ఆమె పెద్దక్క కి పెళ్లి చేయవలసి వచ్చింది. చిత్ర, ఆమె చెల్లి ఇద్దరూ ఈ సారి టెక్స్టైల్ మిల్లులో పనికి వెళ్లడం మొదలుపెట్టారు. టెక్స్టైల్ మిల్ వాళ్ళు ఈ ఇద్దరిని సుమంగళి స్కీంలో భాగంగా పనిలోకి తీసుకున్నారు, ఈ స్కీం పై విరుద్ధమైన చర్చలు జరుగుతున్నాయి. ఈ స్కీం ద్వారా తమిళనాడులో ప్రైవేట్ టెక్స్టైల్ మిల్లులలో ళ్ళికాని అమ్మాయిల పెళ్లి ఖర్చులకు ఆదాయాన్ని అందిస్తుంది. అది ఎలా అంటే, పెళ్లికాని పేద బలహీన వర్గాల అమ్మాయిలను పనిలో చేర్చుకుని, వారు సుమారుగా మూడేళ్లు పని చేశాక, కాంట్రాక్టు పూర్తవగానే మిల్లువారు, పనిచేసిన అమ్మాయి కుటుంబానికి ఒకేసారి పెద్ద మొత్తంలో నగదు ఇస్తారు. అప్పటికి చిత్రకి ఇంకా 18 ఏళ్ళే. ఆమె తమ ఇంటి అప్పులని తీర్చడానికి విపరీతంగా కష్టపడుతోంది. ఆమె 2016 వరకు ఇల్లు నడిపింది, ఆ తరవాత ఆమెకు 20 ఏళ్ళు వచ్చాక ముత్తురాజాను కలిసింది.
*****
చిత్రను కలివక మూడేళ్ళ ముందే ముత్తురాజా తన రెండు కళ్ల దృష్టినీ కోల్పోయాడు. అతనికి ఆ రోజు తేదీ, సమయం ముద్రించుకుపోయాయి. జనవరి 13, 2013న సంక్రాంతికి ఒక రోజు ముందు, సాయంత్రం ఏడు గంటలకు, ఇక ఏమి చూడలేకపోతున్నాడన్న విషయాన్ని అర్థం చేసుకుని, అతను విపరీతంగా ఆందోళనపడిన సమయమది.
ఆ తరవాత కొన్నేళ్లు అతను చాలా కష్టపడ్డాడు. ఎక్కువగా ఇంట్లోనే ఉండిపోయేవాడు- కోపంతో, పిచ్చెక్కిపోయి, ఏడుస్తూ- చనిపోవాలన్న ఆలోచనలు కూడా వచ్చేవి. చిత్రని కలిసే సమయానికి అతనికి 23 ఏళ్ళు. తనకు తానే ఒక జీవఛ్ఛవంలా అనిపించేవాడు. ఆమె వలెనే అతనికి కొత్త జీవితం అందింది, అని మెత్తగా చెబుతాడు.
దృష్టిని కోల్పోక ముందు ముత్తురాజా కొన్ని దురదృష్టవంతమైన సంఘటనలు ఎదుర్కొనవలసి వచ్చింది. అతనికి ఏడేళ్లు ఉన్నప్పుడు, అతను, అతని చెల్లెలు వాళ్ళ పొలం లో గులాబీ మొక్కలు నాటుతున్నారు. వారి కుటుంబం గులాబీలు పూయించి వాటిని అమ్మేది. ఒక చిన్న తప్పు- పెకిలించి అందించిన మొక్కని అతని చేతినించి అతని చెల్లి సరిగ్గా అందుకోలేదు, అందువలన ఆ మొక్క మొహానికి విసురుగా తగిలి, ముళ్ళు అతని కళ్ళలోకి గుచ్చుకుపోయాయి.
ఆ తర్వాత ఆరు ఆపరేషనలు జరిగాయి. అతని ఎడమ కంటికి కొంత వరకు దృష్టి వచ్చింది. అతని కుటుంబం 3 సెంట్ల భూమిని అమ్మి అప్పుల్లో కూరుకుపోయారు. ఆ తరవాత కొంత కాలానికి ఒక బైక్ ఆక్సిడెంట్ వలన కనిపించే కన్నుకు మళ్లీ దెబ్బ తగిలి అతను ఆ కొంచెం దృష్టిని కూడా కోల్పోయాడు. స్కూల్, చదువు చాలా కష్టమైపోయాయి ముత్తురాజా కు- అతనికి బోర్డు సరిగ్గా కనిపించేది కాదు, దాని పై తెల్ల అక్షరాలూ కనిపించేవి కావు. కానీ టీచర్ల సాయం తీసుకుని ఎలాగోలా పదవతరగతి వరకు చదువుకోగలిగాడు.
ఆ జనవరి 2013 రోజున ఇంటి ముందున్న వీధిలో ముత్తురాజా తలకు ఒక ఐరన్ రాడ్ కొట్టుకుంది. ముత్తురాజా లోకం మొత్తం చీకటైంది. చిత్రను కలిశాకే అతని జీవితంలో వెలుగు, ప్రేమ తిరిగివచ్చాయి.
*****
2017 ల్లో, వారి పెళ్ళైన ఒక నెలకు, చిత్రకు ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా అనిపించింది. వాళ్లు మధురై అన్నా నగర్ కాలనీ ప్రాంతంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. చాలా పరీక్షలు చేశాక ఆమె గుండె బలహీనంగా ఉందని, ఆమె ఇంతకాలం బతికి ఉండడం చాలా విచిత్రమని డాక్టర్లు అన్నారు. (చిత్రకు తన జబ్బు పేరు తెలీదు, ఆమె మెడికల్ రికార్డులు ఆసుపత్రిలో ఉన్నాయి.) ఏ కుటుంబం కోసం అయితే ఆమె అంతకాలం కష్టపడిందో వారు సహాయం చేయడానికి నిరాకరించారు.
ముత్తురాజా ఆమె చికిత్స కోసం 30,000 రూపాయిలు వడ్డీ మీద తీసుకున్నాడు. ఆమెకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయి, మూడు నెలలు ఆసుపత్రిలోనే ఉంది. ఇంటికి వచ్చాక ఆమెకు కొంచెం మెరుగయింది. అప్పటికి ముత్తురాజాకు చెవి ఆపరేషన్ అవసరమైంది. ఈ బాధలను భరించలేక వారు చనిపోదామనుకున్నారు. కానీ ఒక కొత్త జీవి ఈ ప్రయత్నాన్ని ఆపాడు. చిత్ర గర్భవతి అయింది. బలహీనమైన చిత్ర గుండె ఈ గర్భాన్ని భరించగలడో లేదో అని ముత్తురాజా భయపడ్డాడు కాని డాక్టర్ గర్భాన్ని కొనసాగించమని చెప్పారు. కొన్ని నెలల ఆందోళన, ప్రార్ధనల తరవాత, వారికి ఒక కొడుకు పుట్టాడు. నాలుగేళ్ల విశాంత్ రాజా, ఇప్పటి వారి ఆశ, భవిష్యత్తూ, ఆనందమూను.
*****
వారి దైనందిన జీవితం కష్టంగానే గడుస్తుంది. చిత్ర ఆమె ఆరోగ్య కారణాల వలన పెద్ద బరువులు ఎత్తలేదు. ముత్తురాజా రెండు వీధుల అవతల ఉన్న పంపు దగ్గర నుండి ఒక బిందె నిండా నీళ్లు పట్టుకుని వస్తాడు- అతని చేయి ఆమె భుజం మీద ఉంటుంది. ఆమె అతని కళ్లుగా మారి, అతనికి దారి చూపుతుంది. చిత్ర పొలాల్లోనూ, దగ్గరలోని అడివిలోను వేపకాయలు ఏరి, ఒక కొలత వేపకాయలు 30 రూపాయలకు అమ్ముతుంది. వేరే సమయాల్లో, ఆమె మంజనాతి కాయ్ (ఇండియన్ మల్బరీ) ఏరి, ఒక కొలత 60 రూపాయలకు అమ్ముతుంది. ఆమె మల్లె తోటలో ఒకటి రెండు కిలోల పూలు కోసి రోజుకు 25-30 రూపాయిలు సంపాదిస్తుంది.
చిత్ర కు రోజుకు 100 రూపాయిలు వరకు సంపాదిస్తుంది. అది ఆమె ఇంటి ఖర్చులకు సరిపోతాయి. ముత్తురాజాకి తమిళ నాడు ప్రభుత్వం నుంచి దివ్యంగుల పింఛను, నెలకు 1000 రూపాయిలు వస్తుంది. ఆ డబ్బుతో చిత్ర తన మందులు కొనుక్కుంటుంది. “నా జీవితం ఈ మందుల ఆధారంగానే నడుస్తుంది. నేను ఇవి తీసుకోకపోతే చాలా నొప్పిని భరించవలసి వస్తుంది.” అన్నది చిత్ర.
ఈ కోవిడ్ లాక్ డౌన్ వలన ఆమెకు పండ్లను అమ్ముకునే అవకాశం లేకుండా పోయింది. ఆదాయం తగ్గిపోగానే చిత్ర మందులు వాడడం మానేసింది. ఆమె ఆరోగ్యం క్షీణిస్తోంది - ఆమె ఊపిరి తీసుకోడానికి, నడవడానికి ఇబ్బంది పడుతోంది. ఆమె టీ చేసుకోడానికి పాలు కొనలేకపోతోంది. అందుకని ఆమె కొడుకు బ్లాక్ టీ మాత్రమే తాగుతున్నాడు. “నాకు ఇలా తాగడమే ఇష్టం”, అన్నాడు విశాంత్. వాడి అమ్మనాన్నల జీవితం, వారు కోల్పోయిన ఆనందాలు- అలానే వారి ప్రేమ, అన్నీవాడికి అర్థంమయినట్లే ఉన్నాడు.
విలేఖరి ఈ కథనం వ్రాయడానికి అపర్ణ కార్తికేయన్ అక్షరసాయం అందించారు
అనువాదం: అపర్ణ తోట