మొహమ్మద్ ఘోసుద్దీన్ అజీమ్ దుకాణంలో రంగురంగు కాగితాలు, పెళ్ళి శుభలేఖల కార్డులు, పోస్టర్లు సూదులకి గుచ్చి ఒక తాడుకి వేలాడదీసున్నాయి. ఎండిన వెదురుతో చేసిన తన “కలం” (పెన్ను)తో తెల్లటి కాగితం మీద మొదటగా “అల్లాహ్” అని ఉర్దూలో రాశారు. ఆయన ఏ పనైనా దీనితోనే మొదలుపెడతారు. “నేను 28 ఏళ్ళ బట్టీ నగిషీకారుడిగా (కాలీగ్రాఫర్) పనిచేస్తున్నాను. నేను సౌదీ అరేబియాలో పని చేస్తున్నప్పుడు ఈ కళని నేర్చుకున్నాను. . 1996లో ఇండియాకు వాపసు వచ్చాక ఈ దుకాణం షురూ చేశాను.” అని చెప్పారు.
నలభై నాలుగేళ్ల అజీమ్, హైదరాబాదు నడిబొడ్డులో నివసిస్తుంటారు. ఆయన దుకాణం చార్మినారు దగ్గర చట్ట బజారులోని జమల్ మార్కెటులో ఒక మూడంతస్థుల భవనంలో ఉంది.. నగరంలోని పాత మార్కెట్టుల్లో అది ఒకటి. ప్రింటింగు షాపులకి అది ఒక అడ్డా. శతాబ్దాల పురాతన కళ అయిన “ఖత్తాతి” (ఉర్దూ, అరబిక్ అక్షరాలను అందంగా, అలంకారప్రాయంగా రాయడం) అక్కడ సాధన చేస్తూ ఉంటారు.
ఖత్తాతి దక్కను ప్రాంతంలో ఉన్న ఖుతుబు షాహీ రాజుల కాలం (1518-1687) నాటిది. చరిత్ర ప్రకారం, ఈ కళాకారులు (వీళ్ళని కత్తాత్ లేదా కాతిబ్ అని అంటారు) ఖురానుని అరబిక్కు, ఉర్దూలలో నగిషి చెక్కారని చెప్తారు. ఇలా చేతితో రాసిన ఖురానులు హైదరాబాదు, దాని పరిసర ప్రాంతాల్లోని మ్యూజియంలలో ఉన్నాయి. ఖుతుబ్ షాహీ కాలంనాటి కట్టడాలలో కూడా ఖత్తాతిని చూడవచ్చు. ఇప్పుడు మాత్రం ప్రజలు ఉర్దూ నగిషీ పనిని ఖుష్ ఖత్ (మంచి దస్తూరి)గానే చూస్తున్నారు, ఏవో ప్రత్యేకమైన సందర్భాలలో మాత్రమే చట్ట బజారులోని చేయితిరిగిన కళాకారుల కోసం వెతుక్కుంటూ వస్తున్నారు. ఉర్దూ పాఠశాలలు, మదర్సాలు కూడా తన లోగోలు డిజైను చేయించుకోడానికి అప్పుడప్పుడు వస్తుంటారు..
అజీమ్ చుట్టూ చాలా సందడిగా - పనివాళ్ళు కాగితాలను తిరగేస్తూ ఉండడం, కస్టమర్ల అరుపులు, ప్రింటింగు మెషీన్ల సన్నని రొద - ఉన్నా ఆయన మాత్రం గమ్మున పనిజేసుకుంటూ ఉన్నారు. “జనాలు నన్ను గొప్ప నగిషీకారుడు అన్నా గాని, నన్ను నేను ‘ఈ కళని సాధన చేసేవాడిని’ అనే అనుకుంటాను,” అని అంటారాయన. “ఖత్తాతి అంటే వ్యాకరణం. ప్రతి ఫాంటుకి, ప్రతి అక్షరానికి ఒక వ్యాకరణం ఉంటుంది - ఎత్తు, వెడల్పు, లోతు.”







