అతను చనిపోయేవరకు 22 ఏళ్ళ గురుప్రీత్ సింగ్ తన గ్రామం లో రైతులతో కలిసి రైతుల నిరసన లో భాగంగా ర్యాలీలు నిర్వహించేవాడు. ఆతని తండ్రి జగ్తార్ కటారియా, వాయువ్య పంజాబ్ లో ఐదు ఎకరాలు ఉన్న రైతు. ఆ తండ్రికి తన కొడుకు ఆఖరి ప్రసంగం గుర్తుంది. దగ్గరగా 15 మంది అతని ప్రసంగాన్ని విన్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో జరిగే ఈ నిరసన చరిత్రలో నిలిచి పోతుందని అందుకు అందరూ సహకరించాలని అతను చెప్పాడు. ఈ ప్రసంగం డిసెంబర్ 2020లో అయినాక, వారు ఢిల్లీ వరకు వెళ్లి పోరాడాలని నడుము బిగించారు.
గత ఏడాది డిసెంబర్ 14న పంజాబ్‌లోని షాహిద్ భగత్ సింగ్ నగర్ జిల్లా బాలాచౌర్ తహసీల్‌లోని మకోవాల్ గ్రామం నుండి వీరంతా బయలుదేరారు. కానీ ఆ 300 కిలోమీటర్ల ప్రయాణంలో, హర్యాణాలోని అంబాలా జిల్లాలోని మోహ్రా సమీపంలోని ఒక భారీ వాహనం వారి ట్రాక్టర్ ట్రాలీని ఢీకొట్టింది. "చాలా పెద్ద ప్రమాదమే జరిగింది. గుర్‌ప్రీత్ చనిపోయాడు, ”అని జగ్తార్ సింగ్ తన కొడుకు గురించి చెప్పాడు. గురుప్రీత్ పాటియాలాలోని మోడీ కాలేజీలో బిఎ చదువుతున్నాడు. "ఉద్యమానికి అతని ప్రాణాన్ని ఇవ్వడమే, అతను అందించిన సహకారం."
సెప్టెంబర్ 2020లో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో పాల్గొని మరణించిన 700 లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులలో గుర్‌ప్రీత్ ఒకరు. ప్రైవేట్ వ్యాపారులు, పెద్ద కార్పొరేట్లు వారి స్వంత ప్రయోజనాల కోసం, పంటల ధరలను నియంత్రించడం మొదలుపెడితే, దేశవ్యాప్తంగా ఉన్న రైతుల కనీస మద్దతు ధర (MSP) ప్రక్రియను నాశనం చేస్తాయని నమ్మిన రైతులు ఈ చట్టాలను వ్యతిరేకించారు. దీని పై నిరసన తెలిపిన రైతులు - ప్రధానంగా పంజాబ్, హర్యానా ఉత్తరప్రదేశ్ నుండి - నవంబర్ 26, 2020న ఢిల్లీ సరిహద్దుల వరకు రావలసి వచ్చింది. ఈ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, వారు ఢిల్లీ- హర్యానా సరిహద్దు అయిన సింగు, ఘజిపూర్, ఢిల్లీ-ఉత్తర్ ప్రదేశ్ సరిహద్దు అయిన తిక్రిలో క్యాంపులు వేసుకుని ఉన్నారు.
నిరసనలు ప్రారంభమై ఒక సంవత్సరం దాటి కొంతకాలం గడిచాక, ప్రధానమంత్రి నవంబర్ 19, 2021న చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు 2021 నవంబర్ 29న పార్లమెంటులో ఆమోదించబడింది, కానీ ఈ ఆందోళన డిసెంబర్ 11, 2021న ముగిసింది. రైతు సంఘాలు పెట్టిన చాలా డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించింది.
చాలా కాలం పాటు జరిగిన ఈ ఆందోళన సమయంలో ప్రియమైన వ్యక్తులను కోల్పోయిన కొన్ని కుటుంబాలతో - వ్యక్తిగతంగాను, ఫోన్ ద్వారాను - నేను మాట్లాడాను. దుఃఖ్ఖం, విచారం, కోపం కలగలిసిన ఆ కుటుంబ సభ్యులు, లక్ష్యం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులను గుర్తు చేసుకున్నారు.
"మేము రైతుల విజయాన్ని జరుపుకుంటాము, కానీ చట్టాలను వెనక్కి తీసుకుంటామని ప్రధాని మోడీ చేసిన ప్రకటన మాకు సంతోషాన్ని కలిగించలేదు" అని జగ్తార్ సింగ్ కటారియా అన్నారు. ‘‘రైతులకు ప్రభుత్వం ఎలాంటి మేలు చేయలేదు. ఇది రైతులను, చనిపోయినవారిని అవమానించింది.”
'మా రైతులు చనిపోతున్నారు. మన సైనికులు కూడా పంజాబ్ కోసం, దేశం కోసం మరణించారు. కానీ ప్రభుత్వం అమరవీరుల గురించి ఆందోళన చెందదు - అది [దేశం] సరిహద్దుల వద్ద ఉండొచ్చు లేదా దేశం లోనే ఉండవచ్చు. సరిహద్దుల్లో పోరాడుతున్న జవాన్లను, ఇక్కడ ఆహారాన్ని పండిస్తున్న రైతులను ఈ ప్రభుత్వం హాస్యాస్పదంగా మార్చింది” అని పంజాబ్‌లోని మాన్సా జిల్లాలోని బుధ్లాడా తహసీల్‌లోని దోద్రా గ్రామానికి చెందిన 61 ఏళ్ల జ్ఞాన్ సింగ్ అన్నారు.
నిరసనల ప్రారంభ రోజుల్లో జ్ఞాన్ సింగ్ తన తమ్ముడు రామ్ సింగ్ (51)ని కోల్పోయాడు. రామ్, భారతి కిసాన్ యూనియన్ (ఏక్తా ఉగ్రహన్) రైతు సంస్థ సభ్యుడు. అతను మాన్సా రైల్వే స్టేషన్‌లో నిరసన ప్రదేశానికి కావలసిన కలపను సేకరించేవాడు. అలా సేకరించేటప్పుడు ఒక కర్ర దుంగ మీద పడడంతో అతను, గతేడాది నవంబర్ 24న మృతి చెందాడు. "అతను ఐదు పక్కటెముకలు విరిగాయి, ఒక ఊపిరితిత్తి దెబ్బతిన్నది," దృఢమైన స్వరంతో అతని నొప్పిని కప్పి పుచ్చుకుంటూ అన్నారు అన్నారు జ్ఞాన్ సింగ్.
"వ్యవసాయ చట్టాలు రద్దు చేయబడతాయని ప్రకటించినప్పుడు మా గ్రామంలోని ప్రజలు పటాకులు పేల్చారు, దీపాలను వెలిగించారు" అని జ్ఞాన్ తెలిపారు. “మా కుటుంబంలో మా తమ్ముడు చనిపోవడం వలన మేము జరుపుకోలేకపోయాము. కానీ మేము సంతోషంగా ఉన్నాము.”
ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను చాలా ముందుగానే రద్దు చేసి ఉండాల్సిందని ఉత్తరప్రదేశ్ (యుపి)లోని రాంపూర్ జిల్లా బిలాస్‌పూర్ తహసీల్‌లోని దిబ్దిబా గ్రామానికి చెందిన 46 ఏళ్ల సిర్విక్రమజీత్ సింగ్ హుండాల్ అన్నారు. "కానీ వ్యవసాయ నాయకులతో 11 రౌండ్ల చర్చల తర్వాత కూడా అది చేయలేదు." విక్రమ్‌జిత్ 25 ఏళ్ల కుమారుడు నవరీత్ సింగ్ హుందాల్ జనవరి 26, 2021న ఢిల్లీలో రైతుల ర్యాలీలో పాల్గొని మరణించాడు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ మార్గ్‌లో ఢిల్లీ పోలీసులు ఏర్పాటు చేసిన భద్రతా బారికేడ్ల వద్ద అతను నడుపుతున్న ట్రాక్టర్ బోల్తా పడింది. అంతకు ముందే నవ్రీత్‌పై కాల్పులు జరిపారని, పోలీసులే ఆ పని చేశారని అతని తండ్రి ఆరోపించారు. అయితే ఆ సమయంలో ట్రాక్టర్ బోల్తా పడడంతో నవ్రీత్ మృతి చెందినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. "విచారణ జరుగుతోంది," అని సిర్విక్రమ్‌జీత్ చెప్పారు.
"అతను వెళ్ళిపోయినప్పటి నుండి ప్రతిదీ తలక్రిందులుగా కనిపిస్తోంది," సిర్విర్క్రమ్జీత్ అన్నారు. “చట్టాలను రద్దు చేయడం ద్వారా ప్రభుత్వం [రైతుల గాయాలకు] లేపనం పూయలేదు. ఇది తన సీటు [అధికారం]ను అంటిపెట్టుకుని ఉండడానికి ఒక ఎత్తుగడ, ఇది మన భావోద్వేగాలతో ఆడుకోవడమే.” అన్నారాయన.
సజీవంగా లేదా చనిపోయిన రైతుల పట్ల ప్రభుత్వ వైఖరి చాలా దారుణంగా ఉంది, అని UPలోని బహ్రైచ్ జిల్లాలోని బలాహా బ్లాక్‌లోని భటేహ్టా గ్రామానికి చెందిన 40 ఏళ్ల జగ్జీత్ సింగ్, అన్నారు. “మేము ఈ ప్రభుత్వానికి ఓటు వేసి అధికారంలోకి తెచ్చాము. ఇప్పుడు మమ్మల్ని 'ఖలిస్థానీ', 'యాంటీ-నేషనల్' అని పిలుస్తూ, మాపై దుమ్మెత్తి పోస్తున్నారు. వారికి ఎంత ధైర్యం?” అని అతను అన్నాడు. సెప్టెంబరులో చేసిన కేంద్ర హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ తేనీ, తన ప్రసంగంలో రైతులను బెదిరించినందుకు వ్యతిరేకంగా అక్టోబర్ 3, 2021న యుపిలోని లఖింపూర్ ఖేరీలో రైతులు గుమిగూడినప్పుడు, జరిగిన హింసాత్మక సంఘటనలో జగ్జీత్ సోదరుడు దల్జీత్ సింగ్ మరణించాడు.
మంత్రి కాన్వాయ్‌లోని వాహనాలు వారిపైకి దూసుకెళ్లి నలుగురు రైతులు, ఒక జర్నలిస్టు మృతి చెందడంతో హింస చెలరేగింది. 13 మంది నిందితుల్లో తేని కుమారుడు ఆశిష్ మిశ్రా కూడా ఉన్నాడు, ఈ ఘటనపై విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (Special Investigation Team-సిట్) దీనిని 'ముందస్తు ప్రణాళిక పన్నిన కుట్ర'గా అభివర్ణించింది.
35 ఏళ్ల దల్జీత్‌ను రెండు SUVలు (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్) ఢీకొట్టి, మూడోది అతని పైకి ఎక్కింది. "మా 16 ఏళ్ల కొడుకు రాజ్‌దీప్ జరిగినదంతా చూశాడు" అని దల్జీత్ భార్య పరమజీత్ కౌర్ చెప్పారు. “ఆ ఉదయం అతను నిరసనకు వెళ్ళే ముందు, దల్జీత్ నవ్వుతూ మాకు వీడ్కోలు పలికాడు. ఘటన జరగడానికి కేవలం 15 నిమిషాల ముందు కూడా మేము ఫోన్‌లో మాట్లాడుకున్నాం’’ అని ఆమె గుర్తు చేసుకున్నారు. "అతను ఎప్పుడు తిరిగి వస్తాడని నేను అడిగాను. 'ఇక్కడ చాలా మంది ఉన్నారు. నేను త్వరలో తిరిగి వస్తాను, అని అతను చెప్పాడు,’’ కానీ అలా జరగలేదు.
వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే నిర్ణయం వెలువడినప్పుడు, ఇంట్లో వాతావరణం విషాదభరితంగా మారిందని పరంజీత్ అన్నారు. "ఆ రోజు దల్జీత్‌ని కోల్పోయినందుకు మా కుటుంబం మళ్లీ దుఃఖించింది." అని జగ్జీత్ చెప్పారు, “చట్టాలను రద్దు చేయడం వలన సోదరుడు తిరిగి రాడు. ఆ 700 మంది అమరవీరులలో ఎవరూ వారి ప్రియమైనవారి వద్దకు తిరిగిరారు.”
లఖింపూర్ ఖేరీలో నిరసనకారులను ఢీకొన్న SUVలు జనం మందంగా ఉన్న చోట నెమ్మదిగా కదిలాయని, అయితే జనం తక్కువగా ఉన్న చోట అవి వేగాన్ని పెంచాయని 45 ఏళ్ల సత్నామ్ ధిల్లాన్ చెప్పారు. అతని కుమారుడు, లవ్‌ప్రీత్ సింగ్ ధిల్లాన్, 19, బాధితుల్లో ఒకరు. యుపిలోని ఖేరీ జిల్లాలోని పాలియా తహసీల్‌లోని భగవంత్ నగర్ గ్రామంలో నివసించే సత్నామ్ మాట్లాడుతూ "వారు ప్రజలను ఢీకొట్టి, వారి బండ్లను మీదకు ఎక్కించారు.” ఇది జరిగినప్పుడు అతను నిరసన ప్రదేశంలో లేడు, కానీ ఈ సంఘటన జరిగిన వెంటనే అతను అక్కడికి చేరుకున్నప్పుడు ఎవరో జరిగినది అతనికి వివరించారు
లవ్‌ప్రీత్ తల్లి, సత్వీందర్ కౌర్, 42, తరచుగా రాత్రి నిద్రలేచి, తన కొడుకును గుర్తు చేసుకుంటూ ఏడుస్తుందని సత్నామ్ చెప్పారు. “మంత్రి రాజీనామా చేయాలని, మా కొడుకుకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మాకు న్యాయం మాత్రమే కావాలి.”
"మాకు న్యాయం జరిగేలా ప్రభుత్వం ఏమీ చేయడం లేదు" అని ధౌరహర తహసీల్, ఖేరీకి చెందిన జగ్దీప్ సింగ్ అన్నారు. అతని తండ్రి, 58 ఏళ్ల నచత్తర్ సింగ్, లఖింపూర్ ఖేరీ హింసలో మరణించారు. జరిగిన విషాదం గురించి మాట్లాడమని అడిగినప్పుడు, 31 ఏళ్ల జగదీప్, “మేము ఎలా బాధపడుతున్నామో మమ్మల్ని అడగడం సరికాదు. ఇది ఆకలితో ఉన్న వ్యక్తిని వెనుకకు చేతులు కట్టేసి, అతని ముందు ఆహారాన్ని పెట్టి, ‘తిండి ఎలా ఉంది?’ అని అడిగినట్లుగా ఉంది. దీనికి బదులు, న్యాయం కోసం జరిగిన ఈ పోరాటం ఎక్కడికి చేరుకుంది. ఈ ప్రభుత్వం తో మాకున్న ఇబ్బందులేమిటి? రైతుల పైకి అలా బండ్లను ఎక్కించారెందుకు?’, అని నన్ను అడగండి.
జగదీప్ వైద్యుడు. అతని తమ్ముడు దేశ సరిహద్దుల్లోని కేంద్ర సాయుధ పోలీసు దళం అయిన సశాస్త్ర సీమా బాల్‌లో ఉన్నారు. "మేము దేశానికి సేవ చేస్తున్నాము" అని జగ్‌దీప్ ఆగ్రహంతో అన్నారు. "తండ్రిని కోల్పోయినందుకు ఏమనిపిస్తుంది అని కొడుకుని అడగండి."
మన్‌ప్రీత్ సింగ్ కూడా డిసెంబర్ 4, 2020న జరిగిన ప్రమాదంలో తన తండ్రి సురేందర్ సింగ్‌ను కోల్పోయాడు. 64 ఏళ్ళ సురేందర్ షాహిద్ భగత్ సింగ్ నగర్‌లోని బాలాచౌర్ తహసీల్‌లోని హసన్‌పూర్ ఖుర్ద్ గ్రామం నుండి నిరసనలలో పాల్గొనడానికి ఢిల్లీకి వెళుతున్నాడు. హర్యానాలోని సోనిపట్‌లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. “[నేను] విచారంగా ఉన్నాను, చాలా విచారంగా ఉన్నాను, కానీ గర్వంగా కూడా ఉన్నాను. ఆయన ఉద్యమానికి తన జీవితాన్ని అర్పించారు. అతను అమరవీరుడిగా మరణించాడు, ”అని 29 ఏళ్ల మన్‌ప్రీత్ అన్నారు. "సోనిపట్‌లోని పోలీసు అధికారులు నా తండ్రి మృతదేహాన్ని పొందేందుకు నాకు సహాయం చేసారు."
పంజాబ్‌లోని పాటియాలా జిల్లాలోని రైతులలో హర్బన్ష్ సింగ్, 73, ఆందోళనలు ఢిల్లీ సరిహద్దుల వరకు వెళ్లే ముందు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ప్రదర్శనలు ప్రారంభించారు. భారతి కిసాన్ యూనియన్ (సిధుపూర్) సభ్యుడు, హర్బన్ష్ పాటియాలా తహసీల్‌లోని మెహమూద్‌పూర్ జట్టన్‌లోని తన గ్రామ సమావేశలలో ప్రసంగిస్తున్నాడు. గతేడాది అక్టోబరు 17న ఆయన ప్రసంగిస్తుండగా కుప్పకూలిపోయారు. "అతను ప్రేక్షకులకు చట్టాలను వివరిస్తున్నప్పుడు గుండెపోటుతో పడిపోయి మరణించాడు” అని అతని 29 ఏళ్ల కుమారుడు జగ్తార్ సింగ్ చెప్పాడు.
"చనిపోయిన వారు చనిపోకుండా ఉంటే మేము సంతోషించాము" అని జగ్తార్ జోడించారు.
పాటియాలాలోని నాభా తహసీల్‌లోని సహౌలీ గ్రామంలో 1.5 ఎకరాల భూమి ఉన్న 58 ఏళ్ల రైతు పాల్ సింగ్, ఢిల్లీలో జరిగిన నిరసనల్లో పాల్గొనడానికి ఇంటి నుండి బయలుదేరినప్పుడు, " తిరిగి ప్రాణాలతో వస్తానని ఆశించవద్దని ఆయన మాకు చెప్పారు" అని అతని కోడలు, అమన్‌దీప్ కౌర్ చెప్పింది. అతను డిసెంబర్ 15, 2020న సింగులో గుండెపోటుతో మరణించాడు. "పోయిన వారిని ఎవరూ తిరిగి తీసుకురాలేరు, కానీ రైతులు ఢిల్లీకి చేరుకున్న రోజే చట్టాలను రద్దు చేసి ఉండాల్సింది. బదులుగా, వారు (ప్రభుత్వమూ పోలీసులు) రైతులను ఆపడానికి వారికి చేతనైనంత చేశారు. బారికేడ్లు పెట్టి, కంచెలు కట్టారు." అని కళాశాలలో లైబ్రరీ మేనేజ్‌మెంట్ చదివిన 31 ఏళ్ళ అమన్‌దీప్, అన్నది.
అప్పుల బాధతో ఉన్న నలుగురి కుటుంబంలో పాల్ సింగ్ సంపాదనే ప్రధాన ఆదాయ వనరు. అమన్‌దీప్ టైలర్‌గా పనిచేస్తుంది, కానీ ఆమె భర్త పని చేయడు, ఆమె అత్తగారు గృహిణి. “చనిపోయే ముందు రాత్రి, అతను తన బూట్లు వేసుకుని నిద్రపోయాడు. మరుసటి రోజు పొద్దున్నే బయలుదేరి ఇంటికి రావాలనుకున్నాడు” అన్నది అమన్‌దీప్. "కానీ అతను రాలేదు. అతని శరీరం ఇంటికి వచ్చింది."
పంజాబ్‌లోని లూథియానా జిల్లా ఖన్నా తహసీల్‌లోని ఇకోలాహాకు చెందిన రవీందర్ పాల్ (67) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. డిసెంబర్ 3న సింగులో విప్లవ గీతాలు పాడుతూ వీడియోలో రికార్డ్ చేశారు. 'పర్నామ్ షహీదోన్ కో' (అమరవీరులకు వందనం), 'నా పగ్డీ నా టాప్, భగత్ సింగ్ ఏక్ సోచ్' (భగత్ సింగ్ అద్భుతమైన ఆలోచనలకు తలపాగా లేదు, టోపీ లేదు) అని ఎరుపు సిరాతో వ్రాసి ఉన్న పొడవాటి తెల్లని కుర్తాను అతను ధరించాడు.
అయితే, ఆ రోజు తర్వాత రవీందర్ ఆరోగ్యం మలుపు తిరిగింది. డిసెంబరు 5న అతన్ని లూథియానాకు తరలించారు, మరుసటి రోజు అతను మరణించాడు. "అతను ఇతరుల స్పృహను మేల్కొల్పాడు, ఇప్పుడు అతనే శాశ్వతంగా నిద్రపోయాడు" అని 2010-2012లో భూటాన్ రాజ సైనికులకు శిక్షణ ఇచ్చిన అతని కుమారుడు 42 ఏళ్ల రాజేష్ కుమార్ అన్నారు. ఆ కుటుంబానికి భూమి లేదు. "మా నాన్న వ్యవసాయ కార్మిక సంఘంలో సభ్యుడు, వారి ఐక్యత కోసం పనిచేశారు," అని రాజేష్ వివరించారు.
60 ఏళ్ళ వయసులో, మల్కిత్ కౌర్ పంజాబ్‌లోని మాన్సాలో మజ్దూర్ ముక్తి మోర్చాలో క్రియాశీల సభ్యురాలు. ఈమె కార్మికుల హక్కుల కోసం ప్రచారం చేశారు. ఈ భూమి లేని దళితురాలు, ఆమె గతేడాది డిసెంబర్ 16న ఢిల్లీకి వెళ్లేందుకు 1,500 మంది రైతులతో కలిసి బయలుదేరింది. “వారు హర్యాణాలోని ఫతేహాబాద్‌లోని లంగర్ [కమ్యూనిటీ కిచెన్] వద్ద ఆగారు. ఆమె రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొని చనిపోయింది’’ అని కార్మికుల సంస్థ స్థానిక అధినేత గుర్జంత్ సింగ్ తెలిపారు.
రమణ్ కశ్యప్, 34, అక్టోబర్ 3, 2021న జరిగిన లఖింపూర్ ఖేరీ ఘటనలో హత్యకు గురైన జర్నలిస్ట్. అతను ఇద్దరు పిల్లలకు తండ్రి, ఖేరీలోని నిఘసన్ తహసీల్‌కు చెందిన సాధన ప్లస్ అనే టీవీ న్యూస్ ఛానెల్‌కి ప్రాంతీయ విలేఖరి. "అతను ఎప్పుడూ సామాజిక సేవ పట్ల ఆసక్తి చూపేవాడు" అని రైతు అయిన అతని తమ్ముడు పవన్ కశ్యప్ అన్నారు. అతను, రామన్, ఇంకా వారి మూడవ సోదరుడు- ఈ ముగ్గురికి కలిసి దాదాపు నాలుగు ఎకరాల భూమి ఉంది. “అతను వాహనం చక్రం కింద చిక్కుకుని పడిపోయాడు. దాదాపు మూడు గంటలకుపైగా ఘటనా స్థలంలో ఈ విషయాన్ని ఎవరూ చూడలేదు. అతని మృతదేహాన్ని నేరుగా శవపరీక్ష కోసం పంపారు” అని తమ భూమిలో వ్యవసాయం చేసే 32 ఏళ్ల పవన్ (32) చెప్పారు. “నేను అతన్ని మార్చురీలో చూశాను. టైర్లు, కంకర వలన అతని వంటిపై గాయాలయ్యాయి. సకాలంలో వైద్యం అందించి ఉంటే అతడిని రక్షించుకోగలిగేవారిమి.”
పిల్లలను పోగొట్టుకోవడం ఆ కుటుంబాలకు కష్టంగా మారింది. పంజాబ్‌లోని హోషియార్‌పూర్ జిల్లాలోని గర్‌శంకర్ తహసీల్‌లోని తండాకు చెందిన గుర్జిందర్ సింగ్ వయస్సు కేవలం 16 సంవత్సరాలు. “మా కుటుంబం నాశనం అయింది. ప్రభుత్వం ఇంత భయంకరమైన చట్టాలను ఎందుకు తెచ్చింది?” అని అతని తల్లి, 38 ఏళ్ల కుల్విందర్ కౌర్ అన్నారు. డిసెంబర్ 16, 2020న గుర్జీందర్ ఢిల్లీ వెలుపల నిరసన ప్రదేశానికి వెళుతుండగా, కర్నాల్ సమీపంలో అతను ప్రయాణిస్తున్న ట్రాక్టర్ నుండి పడిపోయాడు. ఈ సంఘటన జరగడానికి 10 రోజుల మునుపు, డిసెంబర్ 6న, హర్యానాలోని కైతాల్ జిల్లాలోని గుహ్లా తహసీల్‌లోని మస్త్‌గఢ్‌కు చెందిన 18 ఏళ్ల జస్‌ప్రీత్ సింగ్ సింగుకు ప్రయాణిస్తున్నాడు. మార్గమధ్యంలో అతను ప్రయాణిస్తున్న వాహనం కాలువలో పడి మృతి చెందాడు. జస్ప్రీత్ మామ, 50 ఏళ్ల ప్రేమ్ సింగ్ ఇలా అన్నాడు: "తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకి- చట్టాలు రద్దు చేయబడ్డాయా లేదా అనేది ఎంత ముఖ్యం?"
మృతుల కుటుంబాలతో మాట్లాడుతూ, నేను రోడ్డు ప్రమాదాలు, మానసిక ఒత్తిడి, కఠినమైన ఢిల్లీ వాతావరణంలో శారీరక కష్టాలను మరణానికి ప్రధాన కారణాలుగా జాబితా చేయగలిగాను. వ్యవసాయ చట్టాలపై వేదన, దానిని అమలు చేస్తే ఎదురయ్యే అనిశ్చత - రైతుల పట్ల ప్రభుత్వపు ఉదాసీనత- ఇవన్నీ ఆత్మహత్య మరణాలకు దారితీశాయి.
నవంబర్ 10, 2021న, 45 ఏళ్ల గురుప్రీత్ సింగ్, సింగులోని నిరసన శిబిరానికి సమీపంలో ఉన్న స్థానిక తినుబండార అంగడి ముందు ఉరి వేసుకుని కనిపించాడు. కేవలం ఒక పదం, జిమ్మెదార్ (బాధ్యత), అని అతని ఎడమ చేతిపై వ్రాసి ఉంది, అని అతని కుమారుడు 21 ఏళ్ళ లవ్‌ప్రీత్ సింగ్, నాకు చెప్పాడు. గుర్‌ప్రీత్‌కు పంజాబ్‌లోని ఫతేఘర్ సాహిబ్ జిల్లాలోని అమ్లోహ్ తహసీల్‌లోని రూర్కీ గ్రామంలో అర ఎకరం భూమి ఉంది, ఇది ఆ కుటుంబం పెంచే పశువులకు గడ్డిని అందించేది. అతను 18 కిలోమీటర్ల దూరంలోని మండి గోవింద్‌గఢ్‌లో పిల్లలను ఇంటి నుండి పాఠశాలకు తీసుకువెళ్లి జీవనం సాగించేవాడు. "చట్టాలను రద్దు చేయాలని 10 రోజుల ముందు నిర్ణయించినట్లయితే, మా నాన్న మాతో ఉండేవారు" అని మండి గోవింద్‌గఢ్‌లోని దేశ్ భగత్ విశ్వవిద్యాలయంలో బి కామ్ విద్యార్థి అయిన 21 ఏళ్ల లవ్‌ప్రీత్ అన్నారు. "మా నాన్నగారు చేసిన పని మరే రైతు చేయకుండా ఉండాలంటే, రైతుల డిమాండ్లన్నింటినీ ప్రభుత్వం అంగీకరించాలి."
కాశ్మీర్ సింగ్ ఆగష్టు 15, 1947 న జన్మించాడు, ఆధునిక భారతదేశం బ్రిటిష్ రాజ్ నుండి స్వాతంత్య్రం పొందిన రోజు. కాశ్మీర్ సింగ్ యుపిలోని రాంపూర్ జిల్లాలోని సువార్ బ్లాక్‌లోని పసియాపురాకు చెందిన రైతు. అతను ఘాజీపూర్ సైట్‌లోని కమ్యూనిటీ కిచెన్‌లో సహాయం చేస్తున్నాడు. కానీ జనవరి 2, 2021న, అతను ఉరివేసుకుని చనిపోయాడు, "వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించడానికి నేను నా శరీరాన్ని త్యాగం చేస్తున్నాను," అని వ్రాసి చనిపోయాడు.
"700 మంది అమరవీరుల కుటుంబాలకు ఇప్పుడు ఏమనిపిస్తుంది?" అని కాశ్మీర్ సింగ్ మనవడు గుర్విందర్ సింగ్ నన్ను అడిగాడు. "చట్టాలు రద్దు చేయబడినా, మా 700 మంది రైతులు తిరిగి రారు. 700 ఇళ్లలో వెలుగులు ఆరిపోయాయి.”
ఢిల్లీ చుట్టూ ఉన్న నిరసన స్థలాలు ఖాళీ చేయబడ్డాయి, అయితే రైతులు MSP పై చట్టపరమైన హామీ, అమరవీరుల కుటుంబాలకు పరిహారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తూనే ఉన్నారు. అయితే, డిసెంబర్ 1, 2021 న, పార్లమెంటుకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో, మరణాల గురించి ప్రభుత్వం వద్ద రికార్డులు లేనందున పరిహారం చెల్లించే ప్రశ్నే లేదని చెప్పారు.
ప్రభుత్వం దృష్టి సారిస్తే ఎంతమంది చనిపోయారో తెలుస్తుందని గుర్విందర్ అన్నారు. "రైతులు హైవేలపై కూర్చున్నారు, కానీ ప్రభుత్వం తన భవనాలలో విశ్రాంతి తీసుకుంటోంది." సాంకేతికత ఇంతగా అభివృద్ధి చెంది, డేటా అంతా సులభంగా అందుబాటులో ఉన్నప్పుడు, "ఉద్యమంలో మరణించిన వారి వివరాలను పొందడం ఎలా సాధ్యం కాదు?" అని మజ్దూర్ ముక్తి మోర్చా గుర్జంత్ సింగ్ ప్రశ్నించారు.
గురుప్రీత్ సింగ్ మళ్లీ ప్రసంగం చేయడు. అతనిలాంటి 700 మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో చరిత్రలో చివరి అధ్యాయాన్ని చూడలేదు. కన్నీళ్లు తుడవడానికి లేదా తమ తోటి నిరసనకారులతో విజయాన్ని రుచి చూడడానికి వారెవరూ ఇక్కడకు రాలేదు. కానీ బహుశా వారు పైన ఆకాశంలో విజయ పతాకాన్ని ఎగురవేస్తున్నారు, భూమి నుండి వారికి తమ రైతుల సోదరుల వందనాన్ని అందుకుంటారు.
ఫోటోలన్నీ అమరవీరుల కుటుంబాలు ఇచ్చారు. కవర్ ఫోటోను అమీర్ మాలిక్.అందించారు.
మీలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కలుగుతున్నా లేదా ఆపదలో ఉన్నారని అనిపించినా, దయచేసి కిరణ్ అనే జాతీయ
హెల్ప్‌లైన్‌కి
1800-599-0019 (24/7 టోల్ ఫ్రీ) లేదా మీకు సమీపంలో ఉన్న ఈ హెల్ప్‌లైన్‌లలో దేనినైనా కాల్ చేయండి. మానసిక ఆరోగ్య నిపుణుల, వారి సేవల సమాచారం కోసం, దయచేసి
SPIF మానసిక ఆరోగ్య డైరెక్టరీ
ని సందర్శించండి.
అనువాదం: అపర్ణ తోట