మే 2021లో రాజేంద్ర ప్రసాద్ భార్యకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ప్రారంభమైనప్పుడు, అతడామెను ఉత్తరప్రదేశ్‌లోని తన మారుమూల గ్రామానికి దగ్గరగా ఉన్న పట్టణంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించవలసి వచ్చింది. కాని అతనికి, తన గ్రామానికి అతి సమీపంలోనే ఉన్నప్పటికీ, నేపాల్‌లోని జాతీయ సరిహద్దుకు దగ్గరగా ఉన్న ఆసుపత్రికే తీసుకువెళ్లాలని ఉంది.
"సరిహద్దుకు అవతలి వైపు భూభాగంలో చికిత్స పొందడం మాకు సర్వసాధారణం. గ్రామంలోని మాలో చాలా మందిమి సంవత్సరాలుగా అలా చేశాము" అని తన అసాధారణ ప్రాధాన్యాన్ని గురించి వివరిస్తూ చెప్పారు, 37 యేళ్ళ రాజేంద్ర. నేపాల్‌లోని ఆసుపత్రి రాజేంద్ర స్వగ్రామమైన బన్‌కటీ నుండి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. బన్‌కటీ నేపాల్ సరిహద్దులో ఉన్న ఉత్తరప్రదేశ్ జిల్లాలలో అతిపెద్దది అయిన లఖీంపూర్ ఖీరీ (ఖీరీ అని కూడా పిలుస్తారు) కిందికి వస్తుంది.
భారతదేశం, నేపాల్‌ల మధ్య 1950లో శాంతి మరియు స్నేహ ఒప్పందంపై సంతకం చేసినప్పటి నుండి, భారతదేశం, నేపాల్‌లకు చెందిన పౌరులు ఈ రెండు భూభాగాల మధ్య స్వేచ్ఛగా రాకపోకలు సాగించడానికి అనుమతించారు. ఇది వ్యాపారం చేసుకోవడానికి, ఆస్తిని సంపాదించుకోడానికి, ఉపాధిని చేపట్టడానికి వారిని అనుమతిస్తుంది. బన్కాటీ నివాసితుల కోసం, నేపాల్‌లో చౌకైన, మెరుగైన ఆరోగ్య సంరక్షణను పొందేందుకు ఈ స్వేచ్ఛా సరిహద్దు వీలు కల్పించింది.
కానీ, కోవిడ్-19 ఈ మొత్తం పరిస్థితిని తారుమారు చేసేసింది.
రాజేంద్ర భార్య, 35 ఏళ్ల గీతాదేవిని ఆసుపత్రిలో చేర్చవలసివచ్చినప్పుడు, రెండవ దశ కోవిడ్-19, భారతదేశంలో ముమ్మరస్థాయికి చేరుకుంది. కోవిడ్ -19 వ్యాప్తి చెందిన తర్వాత, నేపాల్ ఐదు భారతీదేశ రాష్ట్రాలమేరా విస్తరించిన తన 1,850 కిలోమీటర్ల సరిహద్దును మార్చి 23, 2020 నుండి మూసివేసినందున వారు సరిహద్దును దాటి అవతలివైపు ఆసుపత్రికి వెళ్లలేకపోయారు.
ఇందువలన రాజేంద్ర కుటుంబం పెద్ద మూల్యాన్నే చెల్లించింది.
రాజేంద్ర బన్‌కాటీకి 25 కిలోమీటర్ల దూరంలో - వారి గ్రామం ఈ బ్లాక్ యొక్క ప్రధాన కార్యాలయానికి చెందినదే - ఉన్న పలియా పట్టణానికి గీతను తీసుకెళ్లారు. "[పలియాకు] రహదారి భయంకరంగా ఉంది, దాంతో అక్కడికి చేరుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది" అని ఆయన చెప్పారు. "పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి అంత మంచిది కాదు, అందుకని మేము ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళవలసి వచ్చింది." బన్కాటీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పిఎచ్‌సి) తీవ్రమైన అనారోగ్యాలను ఎదుర్కోవడానికి అవసరమయిన ప్రమాణాలతో లేకపోవడం వలన గీతను పలియా తీసుకువెళ్ళేందుకు రాజేంద్ర 2,000 రూపాయలకు ఒక వాహనాన్ని అద్దెకు తీసుకున్నారు.
గీతకు దగ్గు, జలుబు,శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి కోవిడ్ లక్షణాలు ఉన్నప్పటికీ - ఆమెకు టౌన్ ఆసుపత్రిలో వ్యాధికి నెగటివ్ రిపోర్ట్ వచ్చింది; అయితే ఆమెకు న్యుమోనియా ఉన్నట్టు గుర్తించబడింది. "ఆమె శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులు పడుతూనే ఉంది." అని రాజేంద్ర చెప్పారు. అప్పుడు పలియాలో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. "నేను స్వంతంగా కొన్ని సిలిండర్లను ఏర్పాటుచేశాను, కానీ అవి సరిపోలేదు. ఆసుపత్రిలో చేరిన ఆరు రోజుల తరువాత, ఆమె మరణించింది."
ఎకరం లోపు భూమి ఉన్న చిన్న రైతు రాజేంద్ర వార్షిక ఆదాయం రూ. 1.5 లక్షలు, అదికూడా స్థిరమైన ఆదాయం కాదు. ప్రైవేటుగా కొనుగోలు చేసిన ఆక్సిజన్ సిలిండర్లతో సహా గీత చికిత్స కోసం మొత్తం సుమారు రూ. 50,000 ఖర్చుచేశారు. “నేను నా బియ్యాన్ని కొనుగోలు చేసే వ్యాపారి నుండి డబ్బు అప్పు తీసుకున్నాను. పంట వచ్చాక అతని బాకీ తీరుస్తాను” అని అతను చెప్పారు. "నేను అప్పు తీసుకున్నందుకు చింతించడంలేదు, కానీ ఆమెకు సరైన చికిత్స అందకపోయినందుకు నేను బాధపడుతున్నాను" అని ఆ ఇద్దరు పిల్లల తండ్రి చెప్పారు. "ఇప్పుడు నా పిల్లలకు నేను ఒక్కడినే అయిపోయాను."
గీత చనిపోయి త్వరలో ఏడాది అవుతుంది. నేపాల్‌లోని ఆసుపత్రికి వెళ్లి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేదేమో అని రాజేంద్ర ఇప్పటికీ ఆలోచిస్తున్నారు. "సరిహద్దు మూసేసినప్పుడు కొంతమంది వ్యక్తులు [మోహనా] నది ద్వారానో, లేదా [దుధ్వా] అడవి గుండానో చొరబడటానికి ప్రయత్నించారు," అని అతను చెప్పారు. “కానీ నేను ఎలాంటి ప్రమాదం తీసుకోదలచుకోలేదు. మాకు తగినంత సమయం కూడా లేదు. అందుకే నేను నేపాల్‌కు వెళ్లకుండా పలియాలో ఆసుపత్రి కోసం వెతకాలని నిర్ణయించుకున్నాను. ఇది సరైన నిర్ణయమో కాదో నాకు తెలియదు."
బన్కటీలో ఉన్న 214 గృహాలలోని దాదాపు ప్రతి ఒక్కరూ నేపాల్‌లోని ధన్‌గఢీ జిల్లాలో ఉన్న సెతి జోనల్ ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందినవారే. వారిలో బన్‌కటీ ప్రధాన్, 42 ఏళ్ల జై బహదూర్ రాణా కూడా ఉన్నారు.
6-7 సంవత్సరాల క్రితం తనకు క్షయవ్యాధి (టిబి) సోకినప్పుడు తాను ఐదుసార్లు ఈ ఆసుపత్రికి వెళ్లినట్లు ఆయన చెప్పారు. "ఆ చికిత్స దాదాపు ఆరు నెలలపాటు కొనసాగింది" అని రాణా చెప్పారు. “ఆ కాలంలో సరిహద్దు వెంబడి తనిఖీలు లేవు. నేను ఇబ్బంది లేకుండా చికిత్స పొందగలిగాను."
తన గ్రామ ప్రజలు సెతి జోనల్ ఆసుపత్రికి ఎందుకు వెళ్లాలనుకుంటారో, కొన్ని కారణాలను రాణా వివరించారు. “పలియాకు వెళ్లే దారి దుధ్వా రిజర్వ్ గుండా వెళుతుంది. ఇది ప్రయాణానికి సురక్షితమైన మార్గం కాదు. అందులో అనేక అడవి జంతువులు ఉన్నాయి,” అని అతను చెప్పారు. “మేము పలియాకు చేరుకున్న తర్వాత కూడా, మాకున్న అవకాశాలు ఏమిటి? ప్రైవేటు ఆసుపత్రులను మేం భరించలేం. ఖీరీలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు లేవు. దానితో పోలిస్తే, సెతిలో వైద్యులూ, సౌకర్యాలు కూడా చాలా మెరుగ్గా ఉన్నాయి."
నేపాల్‌లో తన అనుభవాలను ప్రేమగా గుర్తు చేసుకున్నారు రాణా. “ఇక్కడ [భారతదేశం] ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్స, మంచం(బెడ్) ఉచితం. కానీ వైద్యులు ఎల్లప్పుడూ మీరు బయట [మెడికల్ స్టోర్స్] నుండి కొనుక్కోవలసిన మందులనే సూచిస్తారు. చాలా డబ్బు ఖర్చవుతుంది.” ఇది నేపాల్‌లో లేదని ఆయన చెప్పారు. “అక్కడ, ఆసుపత్రిలో అందుబాటులో లేకుంటే మాత్రమే వారు బయట కొనే మందులను సూచిస్తారు. నా చికిత్సకు నాకు ఎటువంటి డబ్బు ఖర్చు కాలేదు. మార్చి 2020 తర్వాత నాకు టిబి రాకపోవడం నా అదృష్టం. వచ్చినట్టయితే, నేను ఖీరీలోనో, లక్నోలోనో [సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న] ఏదో ఒక ఆసుపత్రిని వెదుక్కోవలసి ఉండేది. సరిహద్దులను తెరిచిన తర్వాత కూడా, పరిస్థితి ఇంతకుముందులా లేదు.”
సెప్టెంబర్ 2021 చివరి వారంలో భారతదేశం నుండి ప్రజలు తమ భూభాగంలోకి వచ్చేందుకు అనుమతించాలని నేపాల్ నిర్ణయించింది. అయితే, ఇప్పుడు అక్కడకు రావడానికి 72 గంటల ముందు పొందిన కోవిడ్-నెగటివ్ నివేదిక, ఆన్లైన్ అంతర్జాతీయ ప్రయాణీకుల ఫారమ్ ముద్రిత కాపీ కూడా సమర్పించడం అవసరం .
ఈ కొత్త వ్యవస్థ బన్కటీవాసులను వారి స్వంతదేశంలో వైద్యసదుపాయాలపై తిరిగి ఆధారపడేలా చేసింది.
"సరిహద్దులో (గౌరీఫాంటా వద్ద) ఇప్పుడు చాలా ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి" అని రాణా అన్నారు. "వారు మీ గ్రామం పేరు, మీ గుర్తింపు కార్డు, సందర్శించడానికి కారణం, మొదలైన వివరాలు అడుగుతారు," అని అతను చెప్పారు. "వారు చాలామటుకు మమ్మల్ని అనుమతించినప్పటికీ, గార్డుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ఒక గ్రామస్తుడికి భయకారణం కావచ్చు. కాబట్టి ఇప్పుడు చాలామంది ప్రజలు వారికి సరిహద్దు దాటి వెళ్లాల్సిన తప్పనిసరి అవసరం వస్తే [మాత్రమే] వెళతారు."
అటువంటి అనివార్యమైన కారణాలలో ఒకటి, నేపాల్‌లోని కైలాలీ జిల్లాలోని గెటా కంటి ఆసుపత్రికి వెళ్లడం.
జనవరి 2022 నడిమిలో, 23 ఏళ్ల మాన్సరోవర్, ఖీరీ జిల్లాలోని తన స్వగ్రామం కజారియా నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కంటిఆసుపత్రికి చేరుకోవడానికి అడవిగుండా నడిచింది. అక్కడి వైద్యులకు చూపించేందుకు తన పసికందును తన వెంట తీసుకెళ్లింది. "మా జిల్లాలోగానీ, లేదా రాష్ట్రంలోగానీ కంటిసంరక్షణ కోసం గెటా అంత మంచి ఆసుపత్రి ఏదీలేదు. నేను నా కొడుకు విషయంలో ఎలాంటి అవకాశం తీసుకోదలచుకోలేదు,” అని ఆమె అన్నారు..
ఆమె కొడుకు ఏప్రిల్ 2021లో జన్మించాడు. పుట్టుకతోనే కంటిసమస్యతో (కళ్ళనుండి విపరీతంగా నీరు, స్రావం కారడం) బాధపడేవాడు. మాన్సరోవర్ వాడిని సరిహద్దు దాటించేవరకూ సమస్య అలాగే కొనసాగింది. "అదృష్టవశాత్తూ, సరిహద్దు వద్ద ఎవరూ నన్ను ఆపలేదు. రెండు వారాల్లో నా కొడుకు బాగుపడ్డాడు. కంటి స్రావం ఆగిపోవడంతో మళ్లీ ఆసుపత్రికి వెళ్లాను. డాక్టర్ నా కొడుకు తలపై చేయి ఉంచి ఇకపై దానిగురించి చింతించవద్దని చెప్పారు. మొత్తం చికిత్సకు నాకు రూ. 500 ఖర్చయింది,” అని ఆమె అన్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని థారు అనే షెడ్యూల్డ్ తెగకు చెందిన ప్రజలు మెజారిటీగా ఉన్న ఖీరీ సరిహద్దు గ్రామాల ప్రజలకు- చౌకైన చికిత్స ఎంత ముఖ్యమైనదో, గౌరవప్రదమైన చికిత్స కూడా అంతే ముఖ్యం.
బన్‌కాటీకి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కజారియా గ్రామానికి చెందిన 20 ఏళ్ల షిమాలి రాణాకి ఆసుపత్రిలో జరిగే అవమానాల గురించి తెలుసు. “మనము నిస్సహాయులం. మనలను అవమానపరిచే వ్యక్తే మనకు చికిత్స కూడా చేయవలసి ఉంటుంది కాబట్టి మనమేమి అనలేము,” అని ఆమె పలియాలోని ఒక ఆసుపత్రిలో తనకు జరిగిన అనుభవాన్ని వివరించారు.
నవంబర్ 2021లో ఆమెకి కొడుకు పుట్టాడు. పుట్టుకతోనే ఊపిరితిత్తుల సమస్యతో బాధపడేవాడు. "బాబు సరిగ్గా ఊపిరి తీసుకోలేకపోయాడు. స్థానిక ప్రాథమిక ఆరోగ్యకేంద్రంవారికి ఏంచేయాలో తెలియక మమ్మల్ని పలియాకు వెళ్లమని చెప్పారు," అని ఆమె అన్నారు. "మేము ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళాము. అక్కడ మాకు భయంకరమైన అనుభవం ఎదురైంది."
కోలుకున్న తర్వాత కూడా తమ పిల్లాడిని డిశ్చార్జ్ చేయడానికి వైద్యులు ఇష్టపడలేదని ఆమె భర్త, 20 ఏళ్ల రామ్‌కుమార్ చెప్పారు. "వారు మానుండి మరింత డబ్బు లాగాలని చూశారు," అని ఆయన అన్నారు. “మేము కొద్దిపాటి భూమి [ఎకరం కంటే తక్కువ] ఉన్న పేదరైతులం. ఇక మాకు ఆర్థిక స్థోమత లేదని చెప్పాం. అక్కడి డాక్టర్ మమ్మల్ని దుర్భాషలాడుతూ, ‘మీరు పేదవారు కావడం నా తప్పుకాదు’ అన్నారు. అంతకు మునుపు కూడా, అడ్వాన్సుగా డబ్బు చెల్లించలేనందుకు మమ్మల్ని అవమానించారు.”
వారు ఎదుర్కొన్న వివక్ష అసాధారణమేమీ కాదు. రోగుల హక్కులపై నవంబర్ 2021లో ఆక్స్‌ఫామ్ ఇండియా విడుదలచేసిన సర్వే నివేదిక ప్రకారం, ఉత్తరప్రదేశ్ నుండి సర్వేలో పాల్గొన్న 472 మందిలో 52.44 శాతం మంది ఆర్థిక స్థితి కారణంగా వివక్షకు గురవుతున్నట్లు భావిస్తున్నారు. దాదాపు 14.34 శాతంమంది తమ మతం కారణంగా, 18.68 శాతంమంది కులం కారణంగా వివక్షకు గురవుతున్నట్టు భావిస్తున్నారు.
షిమాలి, రామ్‌కుమార్‌లకు డిశ్చార్జ్ చేయమని పట్టుబట్టేవరకు, అంటే ఒక వారంపాటు ఈ అసహ్యకరమైన అనుభవం కొనసాగింది. అప్పటికే రామ్‌కుమార్ ఆసుపత్రి ఖర్చులు చెల్లించేందుకు తన బంధువులనుంచి రూ. 50,000 అప్పుతీసుకున్నాడు. "మా అబ్బాయిని డిశ్చార్జ్ చేస్తున్నప్పుడుకూడా, 'అతనికి ఏదైనా జరిగితే అది మా బాధ్యతకాదు' అని డాక్టర్ అన్నాడు."
మాన్ససరోవర్కి నేపాల్‌లో ఎదురైన అనుభవం ఇందుకు సరిగ్గా వ్యతిరేకం. ఆమె గెటా కంటి ఆసుపత్రి నుండి చక్కటి ఉపశమనంతో, భరోసాతో బయటికి వచ్చారు. "వైద్యులు గౌరవప్రదంగా ఉన్నారు. మనకు నేపాలీ అర్థంకాకపోతే, హిందీ అంతగా రాకపోయినా వారు మనతో హిందీలో మాట్లాడేందుకు ప్రయత్నిస్తారు. మనం అడిగే అన్ని ప్రశ్నలకూ సమాధానం ఇస్తారు. భారతదేశంలో పేదప్రజలను చిన్నచూపు చూస్తారు. అదే ఈ దేశంలోని అతిపెద్ద సమస్య."
పార్థ్ ఎం.ఎన్. ఠాకూర్ ఫ్యామిలీ ఫౌండేషన్ నుండి స్వతంత్ర జర్నలిజం గ్రాంట్ ద్వారా ప్రజారోగ్యం, పౌర హక్కులపై నివేదికలు అందిస్తారు. ఈ నివేదికలోని విషయాలపై ఠాకూర్ ఫ్యామిలీ ఫౌండేషన్ ఎలాంటి సంపాదకీయ నియంత్రణనూ పాటించలేదు.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి