“ఏ సమయంలోనైనా చూడండి, సగంమంది మగవాళ్ళు గ్రామం బయటే ఉంటారు. కొందరు హైదరాబాద్‌లోని అంబర్‌పేట మార్కెట్‌లో, కొందరు విజయవాడలోని బీసెంట్ రోడ్డులో, ముంబైలోని వాషి మార్కెట్‌లో లేదా ఇండియా గేట్ దగ్గర, లేదా ఢిల్లీలోని పహార్‌గంజ్‌లో- బుట్టలు, చిక్కం ఉయ్యాలలు (hammocks) అమ్ముతుంటారు." ఉత్తరాంచల్‌లో అమ్మకాలు సాగించి, ఈమధ్యనే ఊరిగి తిరిగివచ్చిన మ్యాలపిల్లి పట్టయ్య అన్నారు.
42 సంవత్సరాల పట్టయ్య, తన గ్రామంలోని ఇతరుల మాదిరిగానే 20 సంవత్సరాల క్రితం నుంచి నైలాన్ తాడుతో బుట్టలు, సంచులు, ఊయలలు, చిక్కం ఉయ్యాలలు తయారు చేయడం ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం లో బంగాళాఖాతంకు ఆనుకుని ఉన్న చిన్న తీరప్రాంత గ్రామం కొవ్వాడ (జనాభా లెక్కలలో జీరుకొవ్వాడగా ఉంటుంది). సుమారు 250 మంది జనాభా ఉన్న ఈ ఊరిలో అప్పటివరకూ చేపలు పట్టడమే ప్రధాన వృత్తిగా ఉండేది..
అంతలోనే నీటి కాలుష్యం ఈ ప్రాంతంలోని జల సంపదను నాశనం చేయడం ప్రారంభించింది. ఔషధ తయారీ పరిశ్రమలు 1990లలో, కొవ్వాడకి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పైడిభీమవరం గ్రామంలోకి వచ్చాయి. వాటి వల్ల భూగర్భ జలాలతో పాటు సముద్ర జలాలు కూడా కలుషితమవుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఔషధాల తయారీ ద్వారా వెలువడే ప్రమాదకర వ్యర్థాల కారణంగా, భారత పర్యావరణ మంత్రిత్వ శాఖ దీనిని 'రెడ్ కేటగిరీ' కార్యకలాపంగా వర్గీకరించింది. ప్రపంచవ్యాప్తమైన ఔషధ రంగం 1990ల ప్రారంభం నుండి విస్తరించడం మొదలుపెట్టింది. అప్పటినుండి ఈ పరిశ్రమ "భారత ఆర్థికవ్యవస్థలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విభాగాలలో ఒకటిగా మారింది" అని 'భారత ప్రజలపై, పర్యావరణంపై ఔషధరంగ కాలుష్య ప్రభావాలు ' అనే నివేదిక పేర్కొంది. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలోని పరిశ్రమల హబ్‌లు కూడా ఉన్నాయి. ఈ నివేదిక “తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఔషధ పరిశ్రమ యొక్క అదుపులేని విస్తరణ ఫలితంగా ఎదురవుతున్న నిరంతర ప్రతికూల ప్రభావాల" గురించి మాట్లాడింది.
పైడిభీమవరం-రణస్థలం ప్రాంతం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ఔషధ తయారీ కేంద్రంగా ఉంది. కొల్‌కతా-చెన్నై జాతీయ రహదారికి ఇరువైపులా పరిశ్రమలతో విస్తరించి ఉన్న ఈ పారిశ్రామిక ప్రాంతం, 2008-2009లో ప్రత్యేక ఆర్థిక మండలం (ఎస్ఇజెడ్ - సెజ్)గా మారిన తర్వాత ఈ ఔషధ పరిశ్రమ కూడా మరింత ఊపందుకుంది. మరిన్ని కొత్త కంపెనీలు కూడా ఇక్కడ తమ యూనిట్లను ఏర్పాటు చేయడం ప్రారంభించాయి. 2005 సెజ్ చట్టం, పరిశ్రమలకు అనేక పన్నులను మినహాయించి, కార్మిక చట్టాలను సడలించడంతో పాటు రాయితీలను కూడా ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 19 సెజ్‌లు ఉన్నాయి. వీటిలో నాలుగు సెజ్‌లు ఔషధాల తయారీపై దృష్టి సారించాయి. వాటిల్లో ఈ పైడిభీమవరం కూడా ఒకటి.
"వాటి (వ్యర్థాలు పోయే) పైప్‌లైన్‌లు సముద్రంలోకి 15 కిలోమీటర్ల లోపలి వరకూ ఉన్నాయి. కానీ ఔషధ పరిశ్రమల నుండి వచ్చే చమురు, ఇతర వ్యర్థాలు మాత్రం మేం చేపలు పట్టడానికి వెళ్ళిన ప్రతిసారీ, తీరం నుండి 100 కిలోమీటర్ల లోపలివరకూ కనిపిస్తాయి," అని కొవ్వాడ గ్రామంలో ఇంకా కొద్దిగా మిగిలివున్న తెప్ప ల(చేతితో తెడ్డువేసి నడిపించే చిన్న పడవలు) యజమానుల్లో ఒకరైన గనగళ్ల రాముడు ( కవర్ ఫోటో ) చెప్పారు. “20 సంవత్సరాల క్రితం ప్రతి ఇంట్లో కనీసం ఒక తెప్ప ఉండేది. ఇప్పుడు 10 మాత్రమే మిగిలి ఉన్నాయి,” అన్నారాయన. “మేము 2010లో రణస్థలంలోని ఎమ్ఆర్ఒ (మండల రెవెన్యూ అధికారి) కార్యాలయం ముందు మూడు నెలలపాటు నిరంతరాయంగా నిరసన తెలిపాం, కానీ ఎవరూ పట్టించుకోలేదు. దాంతో మేం పోరాటాన్ని ఆపేసి, మా పనుల్లోకి తిరిగి వెళ్ళిపోయాం.”
"ఔషధ పరిశ్రమల ద్వారా వచ్చే కాలుష్యం కారణంగా ఈ ప్రాంతంలోని జల సంపద ధ్వంసమైంది. చనిపోయిన తాబేళ్లు, చేపలు తీరంలో తరచుగా కనిపిస్తుంటాయి. వీటిలో ఆలివ్ రిడ్లీ తాబేళ్ళు కూడా ఉన్నాయి. సముద్రగర్భంలో ఉన్న వృక్షజాలం విషపూరితమైపోయింది, ఇది జలచరాలను కూడా విషపూరితం చేసింది,” అని నేషనల్ అలయన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్‌మెంట్‌తో పనిచేసే బుడుమూరు గ్రామానికి చెందిన పర్యావరణ కార్యకర్త కూనం రాము చెప్పారు.
ఈ పరిస్థితి కొవ్వాడ, తదితర గ్రామాలలో చేపలు పట్టడాన్ని దాదాపు ఒక వ్యర్థమైన పనిగా చేసేసింది. 40 ఏళ్ల మ్యాలపిల్లి అప్పన్న మాట్లాడుతూ, "మేమిప్పుడు చేపల వేటకు వెళ్ళటం లేదు. ఎంత కష్టపడినా చేపలు పట్టుకోలేపోతున్నాం. తెల్లవారుజామున 4 గంటలకే సముద్రంలోకి వెళ్ళి, 20 కిలోమీటర్ల వరకూ తెడ్డు వేస్తాం. ఉదయం 8-9 గంటలకు వలలు విసిరి, రెండుమూడు గంటలు వేచి ఉండి, మధ్యాహ్నం 2 లేదా 3 గంటలకు తిరిగి ఒడ్డుకు వస్తాం. ఒక్కో తెప్ప మీద నలుగురైదుగురం వెళ్తాం. పొద్దుగూకేసరికి ఒక్కొక్కరికీ 100 రూపాయలు కూడా రావు." అన్నారు.
“మేం పట్టే చేపలు మా ఇళ్లలో కూరకు కూడా సరిపోవు, ఇక వాటిని అమ్మి డబ్బు సంపాదించడం అనే మాటే మరిచిపోవాలి. మా ఇళ్లలో వండుకోవాలంటేనే విశాఖపట్నం నుండో, శ్రీకాకుళం లేదా రణస్థలం నుండో చేపలు తెచ్చుకోవాలి," అంటారు పట్టయ్య.
అందువల్ల అప్పన్న, పట్టయ్యలు కూడా కొవ్వాడలోని చాలామందికిలాగానే బుట్టలు, సంచులు, ఊయలలు, చిక్కం ఉయ్యాలల తయారీవైపుకు తిరిగారు. వాళ్ళు సంపాదన కోసం అనేక దారులు వెతికారు. వాటిల్లో ఇది లాభదాయకంగా ఉందనీ, పైగా నైలాన్ తాళ్లు శ్రీకాకుళంలో సులభంగా అందుబాటులో ఉన్నాయనీ వారు చెప్పారు. "గత 20 సంవత్సరాలలో నేను 24 రాష్ట్రాలలో తిరిగాను, వాటిలో చాలావాటికి నేను ఒకటి కంటే ఎక్కువసార్లే వెళ్ళాను," అని అప్పన్న చెప్పారు. “నేను బుట్టలు అల్లుతాను, నా భర్త వాటిని అమ్మడానికి ఇతర ప్రాంతాలకు తీసుకువెళతారు,” అని అతని భార్య లక్ష్మి చెప్పారు.
ఒక కిలో నైలాన్ తాడు ధర, టెంపో లేదా ట్రక్కు ద్వారా గ్రామానికి చేర్చటానికయ్యే రవాణా ఖర్చులతో కలుపుకుని, రూ. 350-400 అవుతుంది. “మేము ఒక కిలో నైలాన్ తాడు నుండి 50 బుట్టలను తయారుచేసి, ఒక్కొక్కటి రూ. 10 నుంచి 20కి అమ్ముతాం. కిలోకి రూ.200 నుంచి 400 వరకు లాభం వస్తుంది,” అంటారు అప్పన్న. ఊయలలు లేదా చిక్కం ఉయ్యాలలను గుడ్డతో, నైలాన్‌తో తయారుచేస్తారు. వీటిని ఒక్కొక్కటి రూ. 150 నుండి 200కు అమ్ముతారు.
గ్రామంలోని పురుషులు బృందాలుగా ఏర్పడి దూర ప్రాంతాలకు వెళ్లి వస్తువులను అమ్ముతారు. ఏప్రిల్ నెలలో అప్పన్నతో పాటు కేరళకు వచ్చిన అతని స్నేహితుడు గనగళ్ల రాముడు, తిండి, ప్రయాణం, బసల కోసం అయ్యే రోజువారీ ఖర్చులను వివరించారు. “నేను మే 15న (ఒక నెల తర్వాత) ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి, కేవలం ఆరు వేల రూపాయలు మాత్రమే ఆదా చేయగలిగాను,” అని ఆయన అన్నారు.
పట్టయ్య ప్రయాణాలు అతన్ని కన్నడం, మలయాళం, తమిళం, హిందీ భాషలలో అనర్గళంగా మాట్లాడేలా చేశాయి. "మా దగ్గర కొనడానికి వచ్చినవాళ్ళతో మాట్లాడటం చాలా ముఖ్యం కాబట్టి మేం ఎక్కడికి వెళ్లినా అక్కడి భాషను పట్టుకుంటాం," అని ఆయన చెప్పారు. “ఇప్పుడు పండుగలు, శుభకార్యాలే ఊరంతా కలిసే సందర్భాలు. బుట్టలు, ఊయలలు అమ్మడానికి బయటికి వెళ్ళిన మగవాళ్ళు ముఖ్యమైన పండుగలకు తిరిగి ఇంటికి వస్తారు. పండుగ తర్వాత వాళ్ళ తిరగుడు మళ్ళీ మొదలవుతుంది.
లక్ష్మికిలాగే గ్రామంలోని చాలామంది మహిళలు బుట్టలు, చిక్కం ఉయ్యాలలు, ఊయలలు తయారుచేయడంతో పాటు, వారికి అడపాదడపా డబ్బులు చెల్లించే ఎమ్‌జిఎన్ఆర్ఇజిఎ (MGNREGA) ప్రాజెక్ట్‌లలో పనిచేస్తారు. "నేను నాలుగు వారాలు పనిచేశాను. కానీ రోజుకు 100 రూపాయల చొప్పున రెండు వారాలకు మాత్రమే డబ్బులు చెల్లించారు," అని 56 సంవత్సరాల మ్యాలపల్లి కన్నాంబ అన్నారు. ఆమె చుట్టుపక్కల గ్రామాలలో ఎండు చేపలను కూడా అమ్ముతుంటారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్‌జిఎన్ఆర్ఇజిఎ కనీస తప్పనిసరి వేతనం రూ.205. “మేము విశాఖపట్నం నుండి చేపలను తెచ్చుకుంటాం, అమ్మడానికి ముందు వాటిని రెండు రోజులపాటు ఎండబెడతాం. ఒకప్పుడు ఈ చేపలు ఉచితంగా దొరికేవి. ఇప్పుడు, 2,000 రూపాయల లాభం పొందడం కోసం మేం 10,000 రూపాయలు పెట్టుబడిగా పెట్టాలి,” అని కన్నాంబ చెప్పారు
ఇంకొంతకాలం పోతే, ఆ చిన్న లాభం పొందటం కూడా సాధ్యమయ్యేలా లేదు. మూడు గ్రామాలలోని 2,073 ఎకరాల్లో నిర్మించడానికి ప్రతిపాదించిన అణువిద్యుత్ ప్లాంట్, కొవ్వాడతో సహా మరో రెండు కుగ్రామాలలోని గ్రామస్తులను పూర్తిగా స్థానభ్రంశం చేయబోతోంది. ఇది బుట్టలు, ఊయలల అమ్మకాలతో వారు ఏర్పాటుచేసుకున్న కొద్దిపాటి వ్యాపారానికి అంతరాయం కలిగిస్తుంది. చేపల వేటను మరింత నాశనం చేస్తుంది. ‘ విద్యుత్తు పుష్కలంగా ఉన్నా వినేవారే లేరు ’ వ్యాసాన్ని చూడండి.
అనువాదం: కె. పుష్ప వల్లి