"కొన్ని రోజుల క్రితం, నా పాదం దగ్గరగా కాటేయడానికి సిద్ధంగా ఉన్న ఒక రక్తపింజరి కనిపించింది. సరైన సమయంలో నేను దాన్ని గమనించాను," మహారాష్ట్ర, కొల్హాపుర్ జిల్లాలోని శెండూర్ గ్రామానికి చెందిన రైతు, దత్తాత్రేయ్ కసోటే అన్నారు. ఆయన రాత్రివేళ తన పొలానికి నీరు పెడుతుండగా ఆ భయంకరమైన పాము కనిపించింది.
కరవీర్, కాగల్ తాలూకా లలో నివసించే కసోటే వంటి రైతులకు అనూహ్యంగా, నమ్మశక్యం కాని రీతిలో, అడపా దడపా వచ్చే విద్యుత్ సరఫరా మూలంగా, రాత్రిపూట పంపుల ద్వారా తమ పొలాలకు నీరు వదలడం అనేది ఒక జీవన విధానంగా మారింది.
విద్యుత్ సరఫరాకు ఒక సమయమంటూ ఉండదు: ఇది రాత్రిపూట లేదా ఒకోసారి పగటిపూట రకరకాల సమయాలలో రావచ్చు; కొన్నిసార్లు తప్పనిసరిగా ఇవ్వవలసిన ఎనిమిది గంటల విద్యుత్ సరఫరాలో కోతపడుతుంది, కానీ ఆ కొరతను తర్వాత భర్తీచేయరు.
ఫలితంగా, అత్యధిక నీటి సరఫరా అవసరమున్న చెరకు పంటలకు సరైన సమయంలో నీరు అందకపోవడంతో పంటలు దెబ్బతింటాయి. ఈ విషయంలో తాము నిస్సహాయులమని రైతులు చెపుతున్నారు; తమ పిల్లలను వ్యవసాయాన్ని జీవనాధారంగా చేసుకోకుండా నిరుత్సాహపరుస్తున్నారు. యువకులు సమీపంలోని మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎమ్ఐడిసి)లో నెలకు రూ. 7,000-8,000 జీతానికి పనిచేయడానికి మొగ్గుచూపుతున్నారు.
“ఇంత కష్టపడి పనిచేసి, ఇన్ని కష్టాలు పడుతున్నప్పటికీ, వ్యవసాయం ఎంతమాత్రం లాభదాయకమైన రాబడిని ఇవ్వదు. పరిశ్రమల్లో పనిచేసి, మంచి జీతాలు పొందడమే మంచిదనిపిస్తోంది," అని కరవీర్‌కు చెందిన యువ రైతు శ్రీకాంత్ చవాన్ చెప్పారు.
కొల్హాపుర్‌లోని రైతులపై, వారి జీవనోపాధిపై విద్యుత్ కొరత ప్రభావం గురించి ఒక లఘు చిత్రం
అనువాదం: సుధామయి సత్తెనపల్లి