మహారాష్ట్రలోని పాలఘర్ జిల్లాలోని నింబవలి అనే మా గ్రామంలోని ఒక చెట్టు కింద కొంతమంది మధ్యవయస్కుల బృందం కూర్చొని వుంది. ఈనాటికీ తమ ప్రభావాన్ని చూపిస్తోన్న, దాదాపు 10 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనల గురించి వారు చర్చించుకుంటున్నారు. కాగితాలు, కొలిచే పరికరాలు, టేపులు పట్టుకొని ఒక ప్రభుత్వ అధికారుల బృందం పెద్ద కారులో వచ్చి ఆగింది. వారు భూగర్భ జలాలకోసం తవ్వేందుకు స్థలాల కోసం వెతికారు, అని మా బాబా (నాన్న), 55 ఏళ్ళ పరశురామ్ పరేడ్, గుర్తుచేసుకున్నారు.
"నాకు వాళ్ళు బాగా గుర్తున్నారు. ఏం చేస్తున్నారు అని మేం పదే పదే అడిగితే, ‘మీకు నీళ్లు కావాలి కదా?’ అని వాళ్ళడిగారు. మాకు కావాలని చెప్పాం. పానీ కిసే నహీ మాంగ్తా [నీళ్ళెవరికి అవసరముండదు?]" అని బాబా గుర్తు చేసుకున్నారు. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో, ప్రభుత్వం గుర్తించగలిగే ఏ నీటి వనరైనా స్వాగతించదగినదే. కానీ గ్రామస్తులు ఊహించిన ఆనందం త్వరలోనే ఆవిరైపోయింది.
కొన్ని నెలల తర్వాత, వాడా తాలూకా లోని నింబవలికి చెందిన వర్లీలకు తొలగింపు నోటీసులు అధికారికంగా అందాయి. అక్కడ ఎటువంటి నీటి ప్రాజెక్టూ లేదు సరికదా, ముంబై-వడోదర నేషనల్ ఎక్స్‌ప్రెస్ హైవే కోసం గ్రామం లోని భూమి కేటాయించబడింది.
"మాకు హైవే గురించి అప్పుడే తెలిసింది," అని 50 ఏళ్ళ బాలకృష్ణ లిపట్ అన్నారు. ఇదంతా జరిగింది 2012లో. ఒక దశాబ్దం గడిచిపోయినా, మా గ్రామం ఆ మోసపూరిత భూసేకరణతో ఒక అంగీకారానికి రావడానికి ఇంకా కష్టపడుతూనేవుంది. ఇది రాజ్య శక్తికి వ్యతిరేకంగా చేసే యుద్ధమనీ, ఓడిపోయే యుద్ధం కూడా అనీ చాలామందికి తెలుసు. అందుకే మొదట్లో అధిక పరిహారం కోసం, ప్రత్యామ్నాయ భూమి కోసం పోరాడినవారు, ఇప్పుడు మొత్తం గ్రామానికి సరైన పునరావాసం మాత్రమే కోరుతూ తమ డిమాండ్లను పరిమితం చేసుకున్నారు.
కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మహారాష్ట్ర, గుజరాత్, దాద్రా-నాగర్ హవేలీల గుండా వెళ్ళే ఎనిమిది లైన్ల, 379 కిలోమీటర్ల పొడవైన హైవే నిర్మాణం కోసం భూమిని సేకరించేందుకు పూనుకుంది. మహారాష్ట్ర వంతుకువచ్చే విభాగంలోని కొంత భాగం పాలఘర్ జిల్లాలోని మూడు తాలూకాల లోని 21 గ్రామాల గుండా వెళుతుంది. ఆ మూడు తాలూకాల లో వాడా కూడా ఒకటి. దాదాపు 140 ఇళ్ళున్న నింబవలి అనే ఈ చిన్న గ్రామం, వాడా తాలూకా లోనిదే.
కేవలం 5.4 కిలోమీటర్ల పొడవైన హైవే మాత్రమే నింబవలి గుండా వెళుతుంది. నింబవలిలో మొత్తం 71, 035 చదరపు మీటర్ల భూమి గుర్తించబడింది. అయితే, గ్రామస్తులు ఆ భూమి చుట్టూ రాతి గోడలు కట్టడానికి ముందే భూస్వాధీన ప్రక్రియ ప్రారంభమైంది.
ప్రాజెక్ట్ గురించిన వాస్తవాన్ని గ్రామస్తులు తెలుసుకున్నప్పుడు, వారు కోల్పోయిన ఇళ్లకు తగినంత డబ్బు నష్టపరిహారంగా వస్తుందని పెద్దలు హామీ ఇచ్చారు. ఆ డబ్బు కొత్తగా భూమి కొనుక్కొని, ఇళ్లు కట్టుకోవడం కోసమే. కానీ మా గ్రామ నివాసితులు దీనిని తిరస్కరించారు. పునరావాసం కోసం ప్రత్యామ్నాయంగా భూమిని ఇస్తేనే తప్ప మేం ఎవరం మా భూమిని లేదా ఇంటిని విడిచిపెట్టబోమని వారు ప్రకటించారు.
"మాకు సగటున తొమ్మిది లక్షల రూపాయల నష్టపరిహారం వచ్చినట్టు నోటీసులు అందాయి" అని 45 ఏళ్ళ చంద్రకాంత్ పరేడ్ అన్నారు. "ఎందుకవి? ఈ చెట్లన్నింటిని చూడండి - మునగ(శేవ్గా), సీతాఫలం, సపోటా, కరివేపాకు. మేము ఈ భూమిలో అన్నిరకాల దుంపలను, భూమి లోపల పండే కూరగాయలను పండించాము. వీటన్నింటికీ వారెంత డబ్బు ఇవ్వగలరు? ఏమీ ఇవ్వలేరు. తొమ్మిది లక్షలతో భూమి కొని, ఇల్లు కట్టుకుని, ఈ చెట్లన్నీ నాటగలరా?” అని అతను అడిగారు.
మరొక సమస్య ఉంది: రహదారి గ్రామాన్ని రెండుగా చీలుస్తూ పోతుంది. “నింబవలి ప్రజలమైన మేము, ఎన్నో యుగాలుగా చేస్తున్నట్టే ఎప్పుడూ కలిసే జీవించాలనుకుంటున్నాము. మా ప్రస్తుత గావ్ఠాణ్ (భూమి)కు పరిహారంగా మాకు భూమే కావాలి. అయితే పరిహారం ప్యాకేజీలో మేము గ్రామంలోని అన్ని ఇళ్లను చేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఇక్కడి ప్రజలం అందరికీ న్యాయమైన పరిహారం కావాలి. అభివృద్ధికి గుర్తుగా మీరు ఈ రోడ్డును నిర్మించాలనుకుంటున్నారు కదా? అలాగే చేయండి. మాకు ఎలాంటి సమస్యా లేదు. అయితే, మమ్మల్నెందుకు నాశనం చేస్తారు??” అని వినోద్ కాకడ్ ప్రశ్నించారు.
ప్రాజెక్ట్ మా జీవితాల్లోకి అనిశ్చితిని తీసుకొచ్చింది. 49 ఇళ్లలోని 200-220 మంది ప్రజలు రోడ్డు క్రమబద్ధీకరణ (అలైన్మెంట్) వలన మొత్తంగా నష్టపోగా, నాలుగు ఇళ్లు మాత్రం అలైన్మెంట్ తాకకపోవడంతో తొలగించకుండా అలాగే ఉన్నాయి. ఈ నష్టపోయిన నలుగురిలో ముగ్గురి ఇళ్ళు అటవీభూమిలో ఉన్నందున, వారిని పరిహారానికి అనర్హులుగా చూస్తూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.
మా వర్లీ తెగవాళ్ళం శతాబ్దాలుగా ఈ నేలపై జీవిస్తున్నాం. మేమిక్కడ ఇళ్ళు కట్టుకోవడమే కాకుండా ఈ భూమితో ప్రియమైన సంబంధాన్ని కూడా కలిగివున్నాం. చింతపండు, మామిడి, ఇంకా ఇతర చెట్ల నీడలు కఠినమైన వేసవిలో మాకు ఉపశమనం కలిగిస్తాయి, సపర్య పర్వతం మాకు వంటచెరుకును అందిస్తుంది. ఇవన్నీ వదిలేసి వేరే చోటికి వెళ్లడం మాకు ఎంతో బాధను కలిగిస్తుంది. మనం ఉంటున్న సమాజాన్ని విచ్ఛిన్నం చేసి, మన స్వంతవారిని కొంతమందిని విడిచిపెట్టి వెళ్ళటం కూడా అంతే బాధాకరంగా ఉంటుంది.
“భూమిని కొలవడానికి వచ్చిన అధికారులు మా సంఘీభావాన్ని చూసి ఆశ్చర్యపోయారు. సాధారణంగా ఇళ్లు కోల్పోయినవాళ్ళు తీవ్ర విషాదంలో మునిగిపోవడం సహజమే. కానీ ఇక్కడ, మకాం మార్చాల్సిన అవసరం లేనివారు కూడా దుఃఖపడుతున్నారని వారన్నారు,” అని 45 ఏళ్ల సవితా లిపట్ చెప్పారు. “మా ఇంటి ముందున్న ఇంటినీ, వెనుక ఉన్న ఇంటినీ కూడా రహదారి కోసం స్వాధీనం చేసుకున్నారని నేనతనికి చెప్పడానికి ప్రయత్నించాను. నా ఇల్లు సరిగ్గా మధ్యలో ఉంది. ఈ రహదారి మాకు చాలా ఇబ్బందిగా ఉండబోతోంది."
దశాబ్దాలుగా కలిసి జీవిస్తున్న వారిని వేరుచేసే రహదారే అధ్వాన్నంగా ఉందనుకుంటే, మరింత అధ్వాన్నంగా ఉండేది ఇంకా రావల్సే ఉంది. రహదారికి ఇరువైపులా ఉన్న కొన్ని ఇళ్లు మ్యాప్‌లో గానీ, లేదా అధికారిక పత్రాల్లో గానీ గుర్తింపబడలేదు; వారిని మొత్తానికే వదిలేశారు. మరో 3-4 ఇళ్లనేమో అటవీ భూమిలో నిర్మించినట్లు చూపారు. అన్ని కుటుంబాలకూ పునరావాసాన్ని కల్పించాలని గ్రామస్తులు ప్రభుత్వంతో వాదిస్తున్నారు. అయితే వర్లీలంతా కలిసి ఉండాలనే ఈ సామూహిక అవసరాన్ని గుర్తించడంలో అధికారులు విఫలమయ్యారు.
"నేను చాలా సంవత్సరాలు ఇక్కడ నివసించాను. ఈ పాత ఇంటిపన్ను రశీదు చూడు. అయితే ఇప్పుడు నేను అటవీ భూమిని ఆక్రమించాననీ, నష్టపరిహారం పొందే అర్హత నాకు లేదనీ ప్రభుత్వం చెబుతోంది. నేనిప్పుడు ఎక్కడికి వెళ్ళాలి?" 80 ఏళ్ల దాము పరేడ్, కొన్ని పాత అధికారిక పత్రాలను నా వైపు ఊపి చూపిస్తూ అడిగారు. అతను మా తాతయ్యకు సోదరుడు. “ఇదంతా నేనిప్పుడు తీసుకోలేను. మీరు విద్యావంతులు, యువజనులు. ఇప్పుడు మీరే దీన్ని ముందుకు తీసుకెళ్ళండి,” అంటూ ఆయన మౌనం వహించారు.
45 ఏళ్ళ దర్శన పరేడ్, 70 ఏళ్ళ గోవింద్ కాకడ్ల ఇళ్లు అటవీ భూమిలో ఉన్నట్లు చూపించారు. ఇద్దరూ ఇందిరా ఆవాస్ యోజన కింద తమ ఇళ్లను నిర్మించుకున్నారు, ప్రతి సంవత్సరం ఆస్తి పన్ను చెల్లించారు, ప్రభుత్వం అందించిన మీటర్ ఉన్న విద్యుత్ కనెక్షన్ ద్వారా ఇళ్లలో కరెంట్ వాడుకున్నారు. అయితే, హైవే కోసం పటం గీసే సమయంలో, వారి ఇళ్ళు అటవీ భూమిని ఆక్రమించి కట్టినవిగా ప్రకటించారు. అంటే వారు నష్టపరిహారం పొందేందుకు అర్హులు కారన్నమాట.
ఇది సంవత్సరాల తరబడి సాగిన సంక్లిష్టమైన పోరాటం. ప్రారంభంలో ప్రజలను ఏకతాటిపైకి తెచ్చింది కానీ, తర్వాత వారి డిమాండ్లను వేరుచేసింది. ముందుగా ఇది ప్రాజెక్ట్ పట్ల వ్యతిరేకతతో ప్రారంభమైంది, ఆ తర్వాత ప్రజలు అధిక నష్టపరిహారాన్ని డిమాండ్ చేయాలని సమష్టిగా నిర్ణయించుకున్నారు. చివరికిది నింబవలిలోని అన్ని కుటుంబాలకు సరైన పునరావాసం కోసం చేసే పోరాటంగా మారింది.
“వివిధ రాజకీయ వర్గాలు, సంస్థలు, సంఘాలకు చెందిన వ్యక్తులు ఒకే స్వతంత్ర బ్యానర్ - శేత్కారీ కళ్యాణ్కారీ సంఘటన కింద ఏకమయ్యారు. ఈ ఫ్రంట్ ప్రజలను సమీకరించింది, ర్యాలీలు చేపట్టింది, నిరసన ప్రదర్శనలు నిర్వహించింది, ఇంకా అధిక పరిహారం కోసం ప్రభుత్వంతో చర్చలు జరిపింది. అయితే ఇది పూర్తయిన తర్వాత, రైతులు, సంఘటన నాయకులు మా ఖర్మకు మమ్మల్ని వదిలేశారు. న్యాయమైన పునరావావాసానికై పోరాడే సమస్య వెనుకంజ వేసింది” అని బాబా అన్నారు.
దీనిని శేత్కారీ కళ్యాణకారీ సంఘటన మాజీ చైర్పర్సన్ కృష్ణ భోయిర్ ఖండించారు. "న్యాయమైన పరిహారం కోసం పోరాడటానికి మేం ప్రజలను సంఘటితం చేశాం. హైవే నిర్మించిన తర్వాత ప్రజల రోజువారీ జీవితాలను ప్రభావితం చేసే సమస్యలపై కూడా మేము ప్రశ్నలు లేవనెత్తాం. ఉదాహరణకు, ప్రజలు ఈ హైవేని ఎలా దాటుతారు, విద్యార్థులు పాఠశాలలకూ కళాశాలలకూ ఎలా వెళతారు, వాగుల నుండి నీరు గ్రామాల్లోకి, పొలాల్లోకి వస్తే వాళ్ళేం చేస్తారు? అని. మేము చాలా పోరాడాం, కాని ప్రజలకు కొంత పరిహారం అందగానే, వారు ప్రతిదీ మర్చిపోయారు,” అని ఆయన వివరించారు.
వీటన్నింటి మధ్య, ఆదివాసీ కాని కుణ్బీ రైతు అరుణ్ పాటిల్, తన పొలానికి ఆనుకుని వర్లీలు నివసించే భూమిలో కొంతభాగం తనకు చెందినదని చెప్పుకొచ్చాడు. కాబట్టి అతనికి కూడా నష్టపరిహారం చెల్లించాలి. అయితే, అది తప్పని తేలింది. “మేం మా పనులన్నీ పక్కన పెట్టి, రెవెన్యూ కార్యాలయానికి అనేకసార్లు తిరిగాం. చివరికి, మా ఇళ్లన్నీ గావ్ ఠా ణ్ ప్రాంతంలో ఉన్నాయని నిర్ధారణ అయింది,” అని 64 ఏళ్ల దిలీప్ లోఖండే గుర్తు చేసుకున్నారు.
నింబవలిలోని ఆదివాసీ కుగ్రామమైన గరేల్పారాలో లోఖండే నివాసం ఐదు ఎకరాల గావ్ ఠా ణ్ (ప్రభుత్వం కేటాయించిన గ్రామ భూమి)లో విస్తరించి ఉంది. ఈ భూమి యొక్క ఖచ్చితమైన సరిహద్దుల కోసం వర్లీలు ల్యాండ్ రికార్డుల విభాగానికి దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు వచ్చారు కానీ, అప్పుడక్కడ అటవీశాఖ అధికారులు లేరనే సాకుతో ఆ పనులు పూర్తి చేయలేదు.
పరిహారం కోసం అర్హులైనవారు కూడా తమ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు. ప్రకటించిన అరకొర పరిహారంతో మరో ఇల్లు కట్టుకోవడం అసాధ్యమని కుటుంబ పెద్దలు చెబుతున్నారు. "అటవీ భూముల్లో ఇళ్ళు కట్టుకోవడానికి మాకు అనుమతి లేదు. మీ అభివృద్ధి కార్యక్రమాలకు దారి ఇచ్చేందుకు ఆదివాసులమైన మేం ఎక్కడికి వెళ్ళాలి?" అని 52 ఏళ్ల బబన్ తంబాడీ అడిగారు.
సబ్ డివిజనల్ అధికారిని సంప్రదించిన ప్రతిసారీ, నింబవలి వాసులకు వాగ్దానాలు, హామీలు గుప్పిస్తున్నారు. "ఇవి నిజమయ్యే వరకు మేము వేచి చూస్తాం. అప్పటి వరకు భూమి కోసం పోరాటం కొనసాగుతూనే ఉంటుంది" అని బాబా చెప్పారు.
నింబవలిలోని వర్లీలకు ఈ రహదారి వల్ల ఎలాంటి ప్రయోజనాలు లేవు, కానీ పూర్తి పునరావాసం గురించి ఎలాంటి ప్రణాళిక లేకుండానే వారు గావ్ ఠా ణ్ నుండి స్థానభ్రంశం చెందారు. నా తోటి గ్రామస్తులు సంవత్సరాల తరబడీ పోరాడటన్ని నేను చూశాను. ఓడిపోయే యుద్ధంలా కనిపిస్తున్నప్పటికీ కూడా వారింకా పోరాడుతూనే ఉన్నారు.
ఈ కథనానికి స్వతంత్ర పాత్రికేయురాలు, కాలమిస్ట్, మీడియా అధ్యాపకురాలు స్మృతి కొప్పీకర్ సంపాదకత్వం వహించారు.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి