"మా తాత దగ్గర 300 ఒంటెలుండేవి. నా దగ్గర ఇప్పుడు కేవలం 40 ఒంటెలు మాత్రమే ఉన్నాయి. మిగిలినవన్నీ చచ్చిపోయాయి... వాటిని సముద్రంలోకి వెళ్ళనివ్వడం లేదు," జెఠాభాయ్ రబారి అన్నారు. ఖంభాలియా తాలూకా బాహ్ గ్రామంలో ఈయన ఈ సముద్రపు ఒంటెలను కాస్తుంటారు. ఈ ఒంటెలు గుజరాత్‌లోని కోస్తా పర్యావరణ పరిస్థితులకు అలవాటుపడిన ఖారాయీ అనే అంతరించిపోతున్న జాతికి చెందినవి. ఈ ఒంటెలు కచ్ అఖాతం లోని మడ అడవులలో తమ ఆహారాన్ని వెతుక్కొంటూ గంటల తరబడి ఈత కొడతాయి.
17వ శతాబ్దం నుండి ఫకీరానీ జాట్, భోపా రబారీ తెగలవారు ప్రస్తుతం మెరైన్ నేషనల్ పార్క్, అభయారణ్యం ఉన్న అఖాతం దక్షిణ తీరం వెంబడి ఖారాయీ ఒంటెలను మేపుతున్నారు. కానీ 1995లో మెరైన్ పార్క్ లోపల మేత మేయడంపై నిషేధం విధించడం ఒంటెలకూ, వాటి కాపరుల మనుగడకూ ముప్పు తెచ్చిపెట్టింది..
ఈ ఒంటెలకు చెర్ ( మడ ఆకులు) అవసరమని జెఠాభాయ్ చెప్పారు. మడ ఆకులు వాటి ఆహారంలో ఒక ముఖ్యమైన భాగం. "ఆకులు తినడానికి అనుమతించకపోతే అవి చనిపోతాయి కదా?" అని జెఠాభాయ్ అడుగుతారు. కానీ ఈ జంతువులు సముద్రంలోకి వెళితే, "మెరైన్ పార్క్ అధికారులు మాకు జరిమానా విధిస్తున్నారు, మా ఒంటెలను పట్టుకుని వాటిని నిర్బంధింస్తున్నారు" అని ఆయన అన్నారు.
ఒంటెలు మడ అడవుల కోసం వెదుక్కుంటూ తిరగడాన్ని మనం ఈ చిత్రంలో చూస్తాం. వాటిని బతికించి ఉంచడానికి తాము పడుతున్న కష్టాల గురించి పశుపోషకులు వివరిస్తారు.
ఇది ఉర్జా తీసిన చిత్రం
కవర్ ఫోటో: ఋతాయన్ ముఖర్జీ
ఇది కూడా చదవండి: కష్టాల కడలిలో జామ్‌నగర్ 'ఈత ఒంటెలు '
అనువాదం: సుధామయి సత్తెనపల్లి