ఢిల్లీ కల్కా శతాబ్ది స్పెషల్ ని అందుకోవాలన్న నా ఆందోళన ప్రస్తుతం ట్రైన్ లో నాతో పాటు నా సీట్ లో కుదురుకుంటూ ఉంది. ఆ ట్రైన్ నెమ్మదిగా కసితో శబ్దాలు చేసుకుంటూ ప్లాట్ఫారం ని దాటుతుండగా రైలు చక్రాల లయతో నా ఆలోచనలలానే నా చుట్టూ ఉన్న సమూహం కూడా స్థిమితపడ్డట్టు అనిపించింది. ఆ పాప తప్ప. ఆమె అనిశ్చితత రైలు వేగంతో పాటే పెరుగుతోంది.
ముందు ఆమె తన తాత నుదిటిపై పలచబడ్డ జుట్టుని దువ్వింది. మేము కురుక్షేత్రకు చేరేసరికి సూర్యుడు కిటికీ ముందు నుంచి అదృశ్యమయ్యాడు. ఆమె ఇప్పుడు కుర్చీ చేతితో ఆడుకుంటోంది - ఒక నిముషం దానిని పైకెత్తి తర్వాత నిముషం కిందకి తోసి. సూర్యుడు ఎత్తుకెళ్ళిపోయిన ఆ పసుపు పచ్చని రంగు కోసం నేను అర్రులుచాస్తున్నాను, మేమంతా చీకటిలో మునిగిపోయాం.
కానీ ఆ పెరిగే చీకటి ఆమె పెరుగుతున్న ఉత్సాహం పై పెద్ద ప్రభావం చూపలేదు. నీలిరంగు పై తెల్లని చారలున్న ఫ్రాక్ వేసుకున్న ఆ పాప తన తల్లి వడిలో చేరింది. ఆ యువతి పాపకు ఇంకా బాగా కనపడాలని పాపను పైకెత్తింది. ఆమె ఎటువైపు చూస్తుందో తెలుసుకుందామని నేను కూడా చూశాను. ఆమె తల కన్నా కాస్త ఎక్కువ ఎత్తులో ఉన్న రెండు ఎలక్ట్రిక్ స్విచుల పై మా దృష్టి పడింది. ఆమె తల తల్లి ఒడి నుంచి కొంచెం జరిగి ఒక చేతిని ఎత్తింది, అదను దొరకక రెండో చెయ్యి కూడా ఎత్తి బాగాసాచి కష్టపడింది… యురేకా!
పసుపచ్చని కాంతి కిరణాలు ఆమె మొహాన్ని ముంచేసాయి. ఆమె కళ్ళలో ఎక్కడో దాక్కున్నసూర్యుడు మళ్లీ ఉదయ్యిస్తున్నాడు. ఆమె రెండో స్విచ్ ని కూడా నొక్కింది. ఇంకొన్ని కాంతి కిరణాలు ఆమె చిన్ని శరీరాన్ని వెలిగించాయి. అక్కడ ఆమె నుంచుంది - ఆమె కళ్ల నుండి, చిరునవ్వు నుండి, ఆ బల్బ్ ని పట్టుకున్న ఆమె చేతి వేళ్ళ సందుల నుంచి కాంతి ప్రవహిస్తోంది.
ఇంత అద్భుతంగా ఉన్న నా తోటి ప్రయాణికురాలైన ఆ పాపను చూశాక, నేను నిదా ఫాజిల్ రాసిన కొన్ని పంక్తులను నాలో నేనే చెప్పుకున్నాను.
"బచ్చోన్ కె చోటే
హాతోన్ కో చాంద్ సితారే ఛూనేదో
దో -చార్ కితాబేన్
పఢకర్ యే భీ హాఁ జైషే జో జాయేంగే “
చిన్నారి పిల్లల బుజ్జి చేతులు
చందమామ, తారలను
తాకనీ
రెండు మూడు పుస్తకాలు
చదివి,
వీరు కూడా మనలా
మారిపోతారు.
అనువాదం: అపర్ణ తోట