మీరు మమ్మల్ని ఏరివేసి నీటిలో ముంచగలరని ఎక్కడో రాశాను. కానీ త్వరలోనే మీ కోసమంటూ నీరు మిగిలి ఉండదు. మీరు మా భూమిని, మా నీటిని దొంగిలించవచ్చు, కానీ మేం మీ భవిష్యత్ తరాల కోసం పోరాడుతూనే చనిపోతాం. నీరు, అడవి, భూమి కోసం మనం చేసే పోరాటాలు మనవి మాత్రమే కాదు, మనం ఎవరం ప్రకృతి నుండి వేరు కాదు. ఆదివాసీ జీవితాలు ప్రకృతితో మమేకమై జీవిస్తున్నాయి. మనల్ని మనం దాని నుండి వేరుగా చూడలేం. దేహవాలీ భీలీలో రాసే చాలా కవితలలో , నేను మన ప్రజల విలువలను కాపాడటానికి ప్రయత్నించాను.
ఆదివాసీ సమాజాల గురించి మన ప్రాపంచిక దృక్పథం ముందుముందు తరాలకు పునాది కాగలదు. అందుకే ఆ జీవన విధానానికీ, దృక్పథానికీ తిరిగి వెళ్ళటం తప్ప వేరే గత్యంతరం లేదు. కానిపక్షంలో సామూహికంగా సమాజం ఆత్మహత్య చేసుకోవడమే మిగిలిన దారి అవుతుంది.
అడుగు మోపేందుకు నేల
సోదరా,
నా సోదరా, నీకు అర్థం కాదు
బండలను పిండి చేయటమంటే,
మట్టిని మండించటం అంటే ఏమిటో
నీ ఇంట్లో వెలుగులు నింపుకొని
నువ్వు సంతోషంగా ఉన్నావ్
జగత్తులోని శక్తినంతా అదుపులోకి తెచ్చుకొని
అయినా నీకర్థం కాదు
నీటి బిందువు మరణించటమంటే ఏమిటో
నువ్వీ ధరిత్రిపై శ్రేష్ఠమైన సృష్టివి కదా
నీ శ్రేష్ఠత సాధించిన అతి పెద్ద ఆవిష్కరణ ‘ప్రయోగశాల’
ఈ జంతుజాలంతో నీకేం పని?
చెట్లూ, వృక్షజాలాల ఊసు నీకెందుకు?
ఆకాశంలో ఇల్లు కట్టాలనేది నీ కల
నువ్విప్పుడు ఈ భూమికి ప్రియపుత్రుడివి కాదు
సోదరా, తప్పుగా ఏమీ అనుకోకపోతే
'కలల నెలబాలుడు’అనొచ్చా నిన్ను?
నువ్వు పక్షివేమీ కాదు కానీ
ఎగరాలనే కలలు మాత్రం బాగానే కంటావ్
ఎంతైనా చదువుకున్నోడివి కదా
సోదరా, నువ్వు ఒప్పుకోకపోవచ్చు కానీ,
చదువులేని మా లాంటి వాళ్ల కోసం ఈ ఒక్క పని చేసిపెట్టు
ఈ నేలపైన కనీసం అడుగు మోపేందుకైనా కాస్త జాగా వదిలిపెట్టు
సోదరా,
నా సోదరా, నీకు అర్థం కాదు
బండలను పిండి చేయటమంటే,
మట్టిని మండించటమంటే ఏమిటో
నీ ఇంట్లో వెలుగులు నింపుకొని
నువ్వు సంతోషంగా ఉన్నావ్
జగత్తులోని శక్తినంతా అదుపులోకి తెచ్చుకొని
అయినా నీకర్థం కాదు
నీటి బిందువు మరణించటమంటే ఏమిటో
నువ్వీ ధరిత్రిపై శ్రేష్ఠమైన సృష్టివి కదా
అనువాదం: సుధామయి సత్తెనపల్లి