2017 లో ఉద్దండరాయునిపాలెం గ్రామానికి చెందిన రైతు.గింజుపల్లి శంకర రావు రాబోతున్న అమరావతి రాజధానీ నగరంలో తనకు కేటాయించబడిన 1,000 గజాల నివాస స్థలాన్ని విజయవాడ లోని కొనుగోలుదారులకు అమ్మారు. ఆయనకు 2 కోట్లు వచ్చాయి. ఆయన తన 90 ఏళ్ల నాటి సాదా సీదా ఇంటిని రెండు అంతస్తుల భవనంగా మార్చడానికి 80 లక్షలు వాడారు. “నేను ఆ డబ్బుతో ఈ ఇంటిని కొత్తగా కట్టుకున్నాను, షెవ్రలెట్ కారు కొన్నాను. మోటర్‌బైక్ కొన్నాను. మా అమ్మాయిని పెద్ద చదువుల కోసం ఆస్ట్రేలియాకు పంపించాను. ఆమె పెళ్లికోసం కూడా కొంత డబ్బు దాచిపెట్టాము” అని ఆనందంగా చెప్పారు.
కృష్ణా నదికి ఉత్తపుటొడ్డున ఉన్న గుంటూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ కొత్త ‘గ్రీన్‌ఫీల్డ్’ రాజధాని, అమరావతి నిర్మించబడుతున్న 29 గ్రామాలలో ఉద్దండరాయునిపాలెం గ్రామం ఒకటి. రాజధాని నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమరావతి సుస్థిర రాజధానీ నగర అభివృద్ధి ప్రాజెక్ట్ కోసం మొదటి దశలోనే 33,000 ఎకరాలకు పైగా ల్యాండ్ పూలింగ్ పథకం (ఎల్ పి ఎస్) ద్వారా సేకరిస్తోంది.
ఈ 29 గ్రామాలు ఇప్పుడు సరికొత్త భవనాలతో నిండి ఉన్నాయి, కొన్ని పూర్తయ్యాయి, మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయి. 2014లో కొత్త రాజధానిని ప్రకటించినప్పటి నుంచి ఈ గ్రామాల్లో రియల్ ఎస్టేట్ సంస్థలు పుట్టుకొచ్చాయి. ఇక్కడ అగ్రవర్ణాలకు చెందిన భూస్వాములు, ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు, ఎక్కువగా లబ్ధి పొందుతున్నారు. “దాదాపు 90 శాతం మంది భూయజమానులు నాలాగే తమ (కేటాయించిన) భూమిలో కొంత భాగాన్ని అమ్మి ఇళ్లు కట్టుకున్నారు” అన్నారు శంకర రావు. (పైన ఉన్న కవర్ ఫోటోలో కుడి వైపున తన పొరిగింటి నారిన సుబ్బారావుతో కలసి ఉన్నవారు)
శంకరరావుకు చెందిన 20 ఎకరాలకి ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి అధికార సంస్థ (ఎ పి సి ఆర్ డి ఎ) ఎల్ పి ఎస్ నిబంధనలకు లోబడి కొత్త రాజధానిలో ఒక్కొక్కటి 1000 గజాలు చొప్పున 20 నివాస స్థలాలు, ఒక్కొక్కటి 450 గజాల చొప్పున 20 వ్యాపార స్థలాలు కేటాయించింది. 'పునర్య్వవస్థీకరించి అభివృద్ధి' చేసిన ఈ ప్లాట్లు దాదాపు ఒక దశాబ్ద కాలంలో రైతులకు అందజేయబడతాయి. అలాగే ఎటువంటి భూమి అనేదానిని బట్టి రైతులకు 10 సంవత్సరాల పాటు, ప్రతి ఎకరానికి, సంవత్సరానికి రూ. 30-50,000 చెల్లించాలి. ప్లాట్స్ పంచగా మిగిలిన భూమిని రోడ్లు, ప్రభుత్వ భవనాలు, పరిశ్రమలు, పౌర సౌకర్యాల తన అధీనంలో ఉంచుకుంటుంది కోసం ఎ పి సి ఆర్ డి ఎ తన అధీనంలో ఉంచుకుంటుంది.
శంకరరావు లాగానే మరికొందరు కూడా తమ ‘కేటాయింపు’లను అమ్ముకుంటున్నారు(కేటాయించిన స్థలాలు ఇంకా వారి ఆధీనంలోకి రాలేదు) ఇక్కడ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఊహాగానాలు చాలా బలంగా ఉన్నాయి. 2014లో రాజధాని ప్రాంత పనులు ప్రారంభమైనప్పుడు ఈ ప్రాంతంలో భూముల ధరలు ఎకరానికి రూ. 70 లక్షలు (1996లో అయితే కేవలం రూ. 3 లక్షలు) ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఎకరం రూ. 5 కోట్లు గా ఉంది, కానీ ఈ ధరలు కాగితాలపై కనిపించవు అని ఇక్కడ గ్రామాల్లో రైతులు చెబుతున్నారు.
అయితే, ఇలాంటి రియల్ ఎస్టేటు విజృంభణ కొన్ని ప్రదేశాల్లోనే ఉంది. ఇక్కడ చాలా మంది దళిత (కొంతమంది ఓ బి సి కూడా) రైతులు చిన్న కమతాలు కలిగి ఉన్నారు. అవి ఆంధ్రప్రదేశ్ భూ సంస్కరణల (వ్యవసాయ భూమిపై సీలింగ్) చట్టం, 1973 క్రింద ప్రభుత్వం వారికి ఒక ఎకరం చొప్పున 'కేటాయించిన’ భూములు. “పట్టా కలిగిన భూ యజమానులకు (భూమిపై అధికారిక పట్టాలు కలిగినవారు) ఈ ‘కేటాయింపు’ భూ యజమానుల కంటే మెరుగైన ప్యాకేజీ (పునర్య్వవస్థీకరించి అభివృద్ధి చేసిన ప్లాట్లు) ఇస్తున్నారు. మాకూ అదే ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం’’ అని మాల సామాజికవర్గానికి చెందిన దళిత రైతు, 38 ఏళ్ల పులి మత్తయ్య చెబుతున్నారు, ఈయనకి ఉద్దండరాయునిపాలెంలో ల్యాండ్ పూలింగ్‌కు ఇంకా ఇవ్వని ఒక ఎకరం ‘కేటాయింపు’ పొలం ఉంది.
పట్టా భూములు, కేటాయింపు భూములు రెంటికీ వార్షిక మొత్తాల(రూ. 30,000 నుండి రూ. 50,000 వరకు) చెల్లింపు ఒకేలా ఉన్నాయి. కానీ, ఎ పి సి ఆర్ డి ఎ ఒక ఎకరం పట్టా భూమికి 800 చదరపు గజాల నివాస స్థలాన్ని, 250 చదరపు గజాల వాణిజ్య స్థలాన్ని కేటాయింపుగా నిర్ణయించింది. ఇక కృష్ణా నది ద్వీపాలలో కేటాయింపు భూములు కలవారికి (పట్టా భూములు కలవారి కంటే తక్కువగా) 500 చదరపు గజాల నివాస స్థలాన్ని, 100-చదరపు గజాల వాణిజ్య స్థలాన్ని కేటాయించారు.
రాజధాని ప్రాంత గ్రామాల్లో అధిక శాతం భూ యజమానులు తమ భూమిని వదలి పెట్టగా, 4,060 మంది రైతులు మాత్రం ఇప్పటికీ ల్యాండ్ పూలింగ్‌కు అంగీకరించటం లేదు. వీరిలో దాదాపు 500 మంది దళిత రైతులు. వీరంతా కలసి ఉద్దండరాయునిపాలెం కోఆపరేటివ్ జాయింట్ అసైన్డ్ ఫార్మర్స్ సొసైటీ గా ఏర్పడ్డారు. పులి యోనా (62) దాని ఉపాధ్యక్షుడు. వీరంతా కలిసి దాదాపు 600 ఎకరాల ‘అసైన్డ్’ భూమిని సాగు చేస్తున్నారు.
ఈ 29 గ్రామాలు అత్యంత సారవంతమైన కృష్ణా-గోదావరి డెల్టాలో ఉన్నాయి. అందువల్ల , ఇక్కడ ఏడాది పొడవునా రకరకాల పంటలను పడుతాయి , "మాకు భూగర్భజలాలు (కేవలం) 15-20 అడుగుల దిగువన ఉన్నాయి. అలానే 20 లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు ఉన్నాయి," అని మత్తయ్య చెప్పారు. “ఇది అనేక పంటలు పండే భూమి, మార్కెట్లు సహకరిస్తే మంచి లాభాలు వస్తాయి. కానీ 2015లో ఎ పి సి ఆర్ డి ఎ ఎరువుల దుకాణాలను బలవంతంగా మూసివేసింది. ఇప్పుడు మేము ఎరువులు, పురుగుమందులు కొనటానికి విజయవాడ, గుంటూరులకు వెళ్ళవలసి వస్తోంది. ప్రభుత్వమే కంకణం కట్టుకుని రైతులకు, వ్యవసాయానికి బ్రతుకు లేని పరిస్థితులను సృష్టించడానికి ప్రయత్నిస్తోంది. ఆ విధంగా మమ్మల్ని బలవంతంగా బయటి తరిమేయచ్చని.”
ఇక్కడ వ్యవసాయ రుణాల కొరత చాలా మంది చిన్నకమతాల రైతులను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టివేస్తోంది. మే 2018లో వచ్చిన తుఫాను కారణంగా యోనా తన ఒక ఎకరంలోని అరటి పంటను కోల్పోయారు. దాంతో ఆయన రూ. 4 లక్షలు నష్టపోయారు. ఈ నష్టం, బ్యాంకులు, ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల నుంచి తీసుకున్న అప్పు అన్నీ పేరుకుపోయి మొత్తం అప్పు రూ.6 లక్షలు అయింది. అప్పటి ఈదురు గాలుల వల్ల ఉద్దండరాయునిపాలెంలో దాదాపు 300 ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయని ఇక్కడి రైతులు అంచనా వేస్తున్నారు, దాదాపు 10 కుటుంబాలు బాగా నష్టపోయాయి. తుఫాను ఫలితంగా, యోనా కూడా తన గ్రామంలోని చాలామందిలాగానే, జూలై నుండి అక్టోబర్ 2018 వరకు వ్యవసాయ పనుల సమయంలో తన భూమిలో ఏమీ సాగు చేయలేకపోయారు. “2014 నుంచి బ్యాంకులు రుణాలు ఇవ్వడం మానేశాయి,” అని ఆయన చెప్పారు. “అమరావతి రాజధాని ప్రాంతంలోని గ్రామాల్లో ఎలాంటి రుణాలు ఇవ్వకూడదని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.” అని అన్నారు
అయితే, అధికార తెలుగుదేశం పార్టీకి గట్టి మద్దతుదారుడైన శంకరరావు తనకు కేటాయించిన ప్లాట్‌ను 2 కోట్లకి అమ్మేశాక పని చేయటం మానేశారు . నేను సేఠ్ లా బతుకుతున్నాను. నేను ఇప్పుడు ఆనందంగా ఉన్నాను. నేను వ్యవసాయం నుండి పదవీ విరమణ చేశాను. ఏ ప్రభుత్వోద్యోగి కంటే కూడా 10 ఏళ్ళు ముందుగా నేను పదవీ విరమణ చేశాను ", అని ఆయన సంతోషంగా చెప్పారు. "ఈ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి అద్భుతంగా ఉంది." అని అన్నారు.
‘ప్లాట్ డెవలప్మెంట్ను అర్థం చేసుకోవడానికి’, ఎ పి సి ఆర్ డి ఎ రాజధాని కోసం తమ భూములను ఇచ్చిన కొంతమంది రైతులను సింగపూర్‌కు వరుస పర్యటనలకు తీసుకువెళ్లిందని స్థానిక వార్తాపత్రికలు ప్రచురించాయి. ఇలా వెళ్ళినవారిలో ఉద్దండరాయునిపాలెంలో 15 ఎకరాల పొలం ఉన్న కమ్మ రైతు బత్తుల నాగమల్లేశ్వరరావు (59) ఉన్నారు. ఈయన 2017 సెప్టెంబర్‌లో ఆరు రోజుల పాటు సింగపూర్‌కు వెళ్లారు. "అమరావతి అభివృద్ధి గురించి నాకు సందేహం ఉండేది. కానీ సింగపూర్ ఎలా అభివృద్ధి చెందిందో చూసి వచ్చిన తర్వాత, అమరావతి కూడా అదే తరహాలో అభివృద్ధి చెందుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను" అని ఆయన చెప్పారు.
ఆయన కుమారుడైన బత్తుల తిరుపతి రావు (35) ఒక ఐ టి ప్రొఫెషనల్. ఒక దశాబ్దం తర్వాత అమెరికా నుండి తిరిగి వచ్చిన ఆయన ఇక్కడ పరిస్థితి అంత ఆశాజనకంగా ఉందని అనుకోటం లేదని అన్నారు. “నేను అమరావతిలో వ్యాపారం ప్రారంభించడానికి 2017 మేలో అమెరికా నుండి తిరిగి వచ్చాను. కానీ ఇక్కడ నిర్మాణ పనులు ప్రారంభించి నాలుగేళ్లయినా సరైన మౌలిక సదుపాయాలు లేవు. అధ్వాన్నమైన రోడ్లు, విద్యుత్తు అంతరాయాలు, బలహీనమైన మొబైల్ సిగ్నల్స్. పరిస్థితి ఇలా ఉంటే, ఈ ప్రాంతంలో కంపెనీలు తమ శాఖలను ఎందుకు ఏర్పాటు చేస్తాయి?” అని ఆయన అడిగారు. “ప్రస్తుతం 'మెగా వరల్డ్ క్లాస్' అమరావతి కేవలం పేపర్ మీద, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లలో మాత్రమే ఉంది. మనం అక్కడికి చేరుకునే ముందు చాలా చేయాల్సినది ఉంది. ఇక్కడ స్థానిక పరిస్థితులలో మార్పులు చేయకుండా సింగపూర్ మోడల్ని అమరావతికి తీసుకురావాలనుకోటం ఉత్త తెలివితక్కువతనమే అవుతుంది.” అని ఆయన అన్నారు.
2014 డిసెంబరులో నేషనల్ అలయన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్మెంట్స్ బృందం రాజధాని ప్రాంతంలోని గ్రామాలను సందర్శించింది. ఈ బృందానికి ఎం.జి. దేవసహాయం నాయకత్వం వహించారు. మాజీ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అధికారి కూడా అయిన ఈయన 1960లో చండీగఢ్ క్యాపిటల్ సిటీ ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేశారు. ఆయన ఇలా అన్నారు, “రియల్ ఎస్టేట్ ఆర్థిక వ్యవస్థ కోసం రైతు ఆర్థిక వ్యవస్థను చేస్తున్న ఈ విధ్వంసాన్ని చూస్తుంటే నాకు 1770లలో గ్రామీణ జీవనం గురించి ఆలివర్ గోల్డ్‌స్మిత్ రాసిన కవిత, ది డెసర్టెడ్ విలేజ్ గుర్తువస్తోంది. ఈ కవితలోని ఈ పంక్తులు – “ఇల్ ఫేర్స్ ది ల్యాండ్, టు హాజనింగ్ ఇల్స్ ఎ ప్రే/ వేర్ వెల్త్ అక్యుమిలేట్స్, అండ్ మెన్ డికే (సంపద పోగుపడినప్పుడు మనుషులు క్షీణిస్తారు. గ్రామీణ ప్రాంతాలు అన్ని రకాల ఇబ్బందులకు గురవుతాయి)” – అమరావతిలో ఎం జరుగుతోందో ఈ పంక్తులే సంక్షిప్తంగా చెపుతున్నాయి.”
ఈ వరసలో ఇంకొన్ని శీర్షికలు:
‘This is not a people’s capital’
New capital city, old mechanisms of division
‘Let the state give us the jobs it promised’
Mega capital city, underpaid migrant workers
అనువాదం: కె. పుష్ప వల్లి