దురాగతాల, యుద్ధాల, రక్తపాతాల సమయంలో, మనం ప్రపంచ శాంతి గురించి తరచుగా ప్రశ్నలు లేవనెత్తుతుంటాం. కానీ పోటీతత్వం, దురాశ, శత్రుత్వం, ద్వేషం, హింసలపై ఆధారపడిన నాగరికతలు దానిని ఎలా దృశ్యమానం చేయగలవు? ఈ రకమైన సంస్కృతిని మనం ఎక్కడి నుంచి వచ్చామో, ఆ వచ్చిన చోట్ల నేను చూడలేదు. ఆదివాసీలమైన మాకు కూడా నాగరికత గురించి ఒక స్వంత అవగాహన ఉంది. చదువుకున్నవాళ్ళు రాత్రివేళల్లో నిశ్శబ్దంగా బహిరంగ ప్రదేశాల్లో చెత్త పారబోస్తారనీ, చదువురాని వ్యక్తి ఉదయాన్నే ఆ చెత్తను శుభ్రం చేస్తారనీ అంటే మేం నమ్మలేం. మేం దానిని నాగరికత అని పిలవం; అలాంటి ఒక నాగరికతలో కలిసిపోవడానికి ఒప్పుకోం. మేం నది ఒడ్డున మలవిసర్జన చేయం. పండక ముందే చెట్ల నుండి కాయలను కోసుకోం. హోలీ పండుగ దగ్గర పడినప్పుడు, మేం భూమిని దున్నడం మానేస్తాం. మేం మా జమీన్ ను(భూమిని) దోపిడీ చేయం; భూమి నుండి సంవత్సరం పొడవునా నిరంతరాయంగా పంట రావాలని ఆశించం. మేం దానిని ఊపిరి తీసుకోవడానికి వదిలేస్తాం, తిరిగి శక్తిని పుంజుకోవడానికి సమయం ఇస్తాం. మనుషుల జీవితాలను గౌరవించినట్లే ప్రకృతిని కూడా గౌరవిస్తూ జీవిస్తాం.
అందుకే అడవుల్ని వదిలి రాలేదు మేము
మా పూర్వీకులని
లక్కగృహాలలో సజీవ దహనం చేశారు మీరు
వారి బొటనవ్రేళ్ళను
కత్తిరించారు
అన్నదమ్ముల
మధ్య చిచ్చు పెట్టి
ఒకరి మీదకొకర్ని
ఎగదోశారు మీరు
వారి వేలితో
వారి కన్నునే పొడుచుకునేలా చేశారు మీరు
మీ ఈ నెత్తుటి
నాగరికతను చూసే
క్రూరమైన
దాని మొహాన్ని చూసే
అడవుల్ని
వదిలి రాలేదు మేము
మరణమంటే,
చెట్టుమీద
నుంచి రాలిపడే ఆకు
మట్టిలో
కలిపోవడమంత సహజమైన విషయం మాకు.
దేవుళ్ల
కోసం స్వర్గాలలో వెతకము మేము
జీవంలేని
వాటి గురించి చిన్న ఊహయినా చేయము
ప్రకృతి
మాకు దైవం
ప్రకృతే
మా స్వర్గం
ప్రకృతికి
విరుద్ధమైనదంతా మాకు నరకం
స్వేచ్ఛ
మా మతం
ఈ ఉచ్చుని,
ఈ ఖైదుని మతమంటారు మీరు.
మీ ఈ నెత్తుటి
నాగరికతను చూసే
క్రూరమైన
దాని మొహాన్ని చూసే
దొరా,
అడవుల్ని
వదిలి రాలేదు మేము
జీవితమంటే
బతకడమొక్కటే కాదు మాకు
నీరు, అడవి,
మట్టి, మనిషి, యింకా
పశుపక్ష్యాదులూ
- వీటి వల్లనే ఉన్నాం మేము
వీటి మధ్యనే ఉన్నాం మేము
దొరా,
భూమాత సైనికులం
మేము.
మా పూర్వీకులను
ఫిరంగి గొట్టాల మూతులకు కట్టారు మీరు
చెట్లకు
వేలాడదీసి కింద మంట పెట్టారు
వాళ్ళను
ఊచకోత కోసేందుకు వాళ్ళతోనే సైన్యాల్ని నిర్మించారు మీరు
మా సహజ
శక్తిని చంపి,
మమ్మల్ని
దొంగలని బందిపోట్లని
పందులనీ
పితూరిదార్లనీ ముద్ర వేశారు మీరు
దొరా, మీ
ఈ నెత్తుటి నాగరికతను చూసే
క్రూరమైన
దాని మొహాన్ని చూసే
అడవుల్ని
వదిలి రాలేదు మేము
మీరుండే
ప్రపంచాన్నే ఒక అంగడిలా మార్చివేశారు మీరు
దొరా, చదువుండీ
గుడ్డివాళ్ళయ్యారు మీరు
ఆత్మను
అమ్ముకోవడానికే మీ చదువులు
సంస్కృతి
పేరుతో నాగరికత పేరుతో మమ్మల్ని
నడిబజారులో
నిలబెడుతున్నారు మీరు
క్రూరత్వాన్ని
కుప్పలుగా పేర్చుతున్నారు మీరు
మనిషిని
మరో మనిషి ద్వేషించే చోటా
మీరు వాగ్దానం
చేస్తోన్న సరికొత్త ప్రపంచం?
తుపాకులతోనూ
యుద్ధ క్షిపణులతోనూ
తీసుకురాగలమనుకుంటున్నారా
ప్రపంచ శాంతి?
దొరా, మీ
ఈ నెత్తుటి నాగరికతను చూసే
క్రూరమైన
దాని మొహాన్ని చూసే
అడవుల్ని
వదిలి రాలేదు మేము.
వచనానువాదం: సుధామయి సత్తెనపల్లి
కవితానువాదం: కె. నవీన్ కుమార్