జమ్మూకశ్మీర్, బాందీపుర్ జిల్లా, వజీరిథల్ గ్రామానికి చెందిన 22 సంవత్సరాల షమీనా బేగమ్ తన రెండో బిడ్డ పురిటి సమయం గురించి మాట్లాడుతూ, “నా ఉమ్మనీటి సంచి పగిలిపోయిన ఆనాటి సాయంకాలం, నేను విపరీతమైన బాధలో ఉన్నాను. అప్పటికి మూడు రోజులుగా మంచు పడుతోంది. అలా పడినపుడు రోజుల తరబడి సూర్యకాంతి ఉండదు. మా సౌర ఫలకాలు (సోలార్ పేనల్స్) చార్జ్ అవవు” అని చెప్పింది. వజీరిథల్ గ్రామం అంటే అక్కడ సూర్యుడు ఎక్కువ కాలం కనపడడు. కనీసం ఒక పద్దతి ప్రకారంగా కూడా ప్రకాశించడు. అక్కడ ప్రజలకు విద్యుత్ అందించే ఏకైక మార్గం సౌరశక్తి మాత్రమే

“కిరసనాయిలు లాంతరు లేకపోతే మా ఇల్లు చీకట్లో మగ్గిపోయేది” షమీనా చెబుతూపోయింది. “అందుకే ఆ సాయంత్రం మా పొరుగు ఆడవాళ్ళందరూ కలిసి, వాళ్ల వాళ్ల లాంతర్లతో వచ్చారు. పసుపుపచ్చటి ఐదు కాంతులతో గది వెలిగిపోయింది. అక్కడే మా అమ్మ సహాయంతో నేను రషీదాకు జన్మనిచ్చాను.” అది 2022 ఏప్రిల్ మాసంలో ఒక రాత్రి.

బడగామ్ పంచాయితి లోని వజీరిథల్ శోభాయమానమైన ప్రకృతికి నెలవైన గ్రామం. రాజ్‌దాన్ పాస్ నుండి గురేజ్ లోయ వరకూ ఉన్న గతుకుల రోడ్డుతో కలుపుకొని-శ్రీనగర్ నుండి 10 గంటల కారు ప్రయాణం, అరడజన్ చెక్ పోస్టులు, చివరిగా 10 నిమిషాల నడక అయ్యాక షమీనా ఇల్లు వస్తుంది. అక్కడకు ఆ దారి తప్ప ఇంకో మార్గం లేనే లేదు

విభజన రేఖకు కేవలం కొద్ది మైళ్ల దూరంలో, గురేజ్ లోయలోని ఈ గ్రామంలో ఉన్న 24 కుటుంబాల ఇళ్ళను దేవదారు కలపతో నిర్మించారు. ఈ ఇళ్ళ లోపలి వెచ్చదనం పోకుండా ఉండటానికి బంకమట్టితో అద్దుతారు. జడల బర్రె పాత కొమ్ములను ఒక్కోసారి నిజమైన వాటినీ, కొన్నిసార్లు కలపతో తయార చేసి అలాగే కనిపించేవాటికి ఆకుపచ్చ రంగును పూసీ - ఇక్కడి ఇళ్ల ప్రధాన ద్వారానికి అలంకరిస్తారు. ఈ ఇళ్లకున్న దాదాపు అన్ని కిటికీలు సరిహద్దు అవతల వైపు కనిపించేటట్లు తెరిచి ఉంటాయి.

షమీనా తన ఇద్దరు పిల్లలు - రెండు సంవత్సరాల ఫర్హాజ్, నాలుగు నెలల రషీదాతోపాటు (పేర్లు మార్చాం) ఇంటి బయట ఉన్న కట్టెల మోపు మీద కూర్చొని, సాయంత్రపు సూర్యుడి చివరి కిరణాల వెచ్చదనాన్ని తనలో నింపుకుంటూవుంది. “నాలాంటి బాలింతలు పుట్టిన బిడ్డలతో సహా ప్రతిరోజూ పొద్దునా, సాయంకాలం ఎండలో కూర్చోవాలని మా అమ్మ చెప్తుంటుంది” అన్నదామె. అదింకా ఆగస్టు మాసమే. లోయనింకా మంచు ఆక్రమించుకోలేదు. కానీ ఇంకా మబ్బుపట్టిన రోజులు, అప్పుడప్పుడూ వర్షాలు, సూర్యుడు కనబడని దినాలు, విద్యుత్తు లేని రోజులు ఉంటూనే ఉన్నాయి.

Shameena with her two children outside her house. Every single day without sunlight is scary because that means a night without solar-run lights. And nights like that remind her of the one when her second baby was born, says Shameena
PHOTO • Jigyasa Mishra

తన ఇద్దరు పిల్లలతో ఇంటి బయట కూర్చొనివున్న షమీనా. అక్కడ సూర్యకాంతి లేని ప్రతి రోజూ భయపెట్టే రోజే. ఎందుకంటే ఇక ఆ రాత్రికి సౌరశక్తితో నడిచే దీపాలు ఉండవు. అలాంటి రాత్రుళ్లు తనకు తన రెండో బిడ్డ పురిటి రోజులను గుర్తుకు తెస్తాయని షమీనా చెప్పింది

“ఇప్పటికి రెండేళ్ళ క్రితం 2020లో మాకు బ్లాక్ ఆఫీస్ ద్వారా సోలార్ పేనల్స్ లభించాయి. అప్పటి వరకూ మాకు బాటరీ మీద నడిచే లైట్లు, లాంతర్లు మాత్రమే ఉండేవి. కానీ ఇవి (సోలార్ పేనల్స్) కూడా ఇప్పటికీ మా సమస్యలను పరిష్కరించటం లేదు,” అని వజీరిథల్ నివాసి, 29 సంవత్సరాల మహమ్మద్ అమీన్ చెప్పాడు.

"మా బడగామ్ బ్లాక్‌లో ఉన్న ఇతర గ్రామాలు జనరేటర్ల ద్వారా ఏడు గంటల విద్యుత్తును పొందుతాయి. మా దగ్గర సోలార్ పేనల్స్ ద్వారా చార్జ్ అయ్యే 12 వోల్టుల బాటరీ ఉంది. అది కనీసం రెండు రోజుల పాటు ప్రతి ఇంట్లో రెండు బల్బులు వెలగటానికి, కొన్ని ఫోన్లను చార్జి చేసుకోవటానికి ఉపయోగపడుతుంది. అంటే, వరుసగా రెండు రోజుల పాటు వర్షం పడినా, మంచు పడినా సూర్యకాంతి ఉండదు కాబట్టి, మాకు విద్యుత్తు కూడా ఉండదు” అన్నాడు అమీన్.

ఇక్కడ ఆరు నెలల పాటు ఉండే చలికాలంలో మంచు తీవ్రంగా కురుస్తుంది. అది అక్టోబర్-ఏప్రిల్ నెలల మధ్య అక్కడికి 123 కిలోమీటర్ల దూరంలో ఉండే గాందర్‌బల్ జిల్లాకు కానీ, 108 కిలోమీటర్ల దూరంలో ఉండే శ్రీనగర్‌కు గానీ కుటుంబాలు బలవంతంగా వలసపోయేటట్లు చేస్తుంది. ఆ విషయాన్ని షమీనా పొరుగింటామె అఫ్రీన్ బేగమ్ నాకు స్పష్టంగా వివరించింది. “అక్టోబర్ మధ్యలో కానీ, చివర్లో కానీ మేం గ్రామాన్ని వదిలిపోవటం మొదలుపెడతాం. నవంబర్ తరువాత ఇక్కడ ఉండటం చాలా కష్టం. నువ్వు నిల్చొని ఉన్నచోట మంచు ఇక్కడిదాకా కప్పుకొని ఉంటుంది” నా తల వైపు చూపిస్తూ చెప్పిందామె.

“అంటే ప్రతి ఆరు నెలలకూ ఇంటికి దూరంగా ఒక కొత్త ప్రాంతంలో స్థిరపడటానికి ప్రయాణం చేసి, చలికాలం అయిపోయిన తరువాత తిరిగి రావటమన్నమాట. కొంతమందికి అక్కడ (గాందర్‌బల్, శ్రీనగర్‌లలో) చుట్టాలుంటారు. కొంతమంది ఆ ఆరునెలల కోసం ఇళ్లు అద్దెకు తీసుకుంటారు,” ముదురు ఎరుపు రంగు ఫిరన్ ధరించి ఉన్న షమీనా చెప్పింది. ఫిరన్‌లు కశ్మీరీలను వెచ్చగా ఉంచే పొడవాటి ఊలు దుస్తులు. “పది అడుగుల మంచు తప్ప ఇక్కడ ఇంకేమీ కనబడదు. సంవత్సరం మొత్తమ్మీద అప్పుడు తప్ప మేం గ్రామాన్ని వదిలి వెళ్లటమనేది చాలా అరుదు.”

షమీనా భర్త, 25 సంవత్సరాల గులామ్ మూసా ఖాన్ దినసరి కూలి. అతను చలికాలాల్లో ఎక్కువగా పని లేకుండానే ఉంటాడు. “మేమిక్కడ వజీరిథల్‌లో ఉన్నపుడు అతను బడగామ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో, అప్పుడప్పుడూ బాందీపుర్ పట్టణంలో పని చేస్తుంటాడు. ఎక్కువగా రహదారి నిర్మాణ ప్రాజెక్టులలో పని చేస్తాడు. కొన్నిసార్లు భవన నిర్మాణాల్లో కూడా అతనికి పని దొరుకుతుంది. పని దొరికినపుడు అతనికి రోజుకి దాదాపు 500 రూపాయలు దొరుకుతాయి. కానీ వర్షాల వలన నెలకు సరాసరి ఐదారు రోజులు అతను ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది,” అని షమీనా చెప్పింది. పనిని బట్టి గులామ్ మూసా నెలకు రూ. 10000 దాకా సంపాదిస్తాడని ఆమె చెప్తోంది.

"కానీ మేం గాందర్‌బల్‌కు వెళ్లినపుడు, అతను ఆటోరిక్షా వేస్తాడు. దాన్ని అద్దెకు తీసుకొని శ్రీనగర్‌లో తిప్పుతాడు. అక్కడి చలికాలం అన్ని ప్రాంతాల నుంచి టూరిస్టులను ఆకర్షిస్తుంటుంది. దాని వలన కూడా ఇంచుమించు అంతే మొత్తం డబ్బులు (నెలకు 10000 రూపాయలు) అతనికి వస్తాయి. కానీ అక్కడ మేం డబ్బులేమీ దాచిపెట్టుకోలేం” అని కూడా షమీనా చెప్పింది. వజీరిథల్‌లో కంటే గాందర్‌బల్‌లో రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉంటాయి.

Houses in the village made of deodar wood
PHOTO • Jigyasa Mishra
Yak horns decorate the main entrance of houses in Wazirithal, like this one outside Amin’s house
PHOTO • Jigyasa Mishra

ఎడమ: గ్రామంలో దేవదారు కలపతో నిర్మించిన ఇళ్లు. కుడి: ఇక్కడ అమీన్ ఇంటి బయట కనిపిస్తున్నట్లుగానే వజీరిథల్‌లోని ఇళ్ల ప్రధాన ద్వారాలు జడల బర్రె కొమ్ములతో అలంకరించి ఉంటాయి

“మా పిల్లలు అక్కడే (గాందర్‌బల్‌లో) ఉండాలని కోరుకుంటారు,” షమీనా చెప్పింది.“అక్కడ తినటానికి రకరకాల తిండి ఉంటుంది. విద్యుత్తు కూడా పెద్ద సమస్య కాదు. కానీ అక్కడ మేం అద్దె కట్టాలి. మేం ఇక్కడ (వజీరిథల్‌లో) ఉన్న రోజుల్లోనే డబ్బులు దాచిపెట్టుకుంటాం.” గాందర్‌బల్‌లో సరుకుల కోసం పెట్టే ఖర్చు వారికి అదనపు ఖర్చు. వజీరిథల్‌లో షమీనా కుటుంబానికి అవసరం అయ్యే కూరగాయల కోసం ఒక పెరటి తోటను పెంచుతుంది. ఇంకా వారుండే ఇల్లు కూడా వారి సొంతమే. గాందర్‌బల్‌లో వాళ్ళు తీసుకొన్న ఇంటికి బాడుగ నెలకు 3000 నుండి 3500 వరకూ ఉంటుంది.

“అక్కడుండే ఇళ్లు ఇక్కడున్న మా ఇళ్ళకంటే ఖచ్చితంగా పెద్దవి కావు. కానీ అక్కడ మంచి ఆసుపత్రులు ఉంటాయి, మంచి రోడ్లు ఉంటాయి. అక్కడ అన్నీ దొరుకుతాయి. కానీ డబ్బులుంటేనే దొరుకుతాయి. ఎంతయినా అవి మా ఇళ్లు కావు కదా!" షమీనా PARIతో చెప్పింది. ఆ ఖర్చుల వల్లనే, షమీనా మొదటిసారి కడుపుతో ఉన్న చివరి మూడు నెలల కాలంలో - దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించివున్న సమయంలోనే - ఆ కుటుంబం వజీరిథల్‌కు తిరిగి ప్రయాణం కట్టాల్సివచ్చింది.

“మార్చి 2020లో లాక్‌డౌన్ ప్రకటించినపుడు నేను ఏడు నెలల గర్భిణిని. ఫర్హాజ్ నా కడుపులో ఉన్నాడు,” షమీనా చిరునవ్వు నవ్వింది. “గాందర్‌బల్‌లో ఎలాంటి ఆదాయం లేకుండా, ఆహారానికీ అద్దెకూ ఖర్చు పెడుతూ బతకటం కష్టం కాబట్టి, ఏప్రిల్ రెండో వారంలో మేమొక వాహనాన్ని అద్దెకు తీసుకొని ఇంటికి తిరిగివచ్చాం” అంటూ షమీనా గుర్తుకు చేసుకొన్నది.

“అప్పుడు టూరిస్టులు లేరు. మా ఆయన ఏమీ సంపాదించలేకపోయాడు. సరుకులు, మందులు కొనడం కోసం చుట్టాల నుండి కొద్దిగా అప్పు చేయాల్సి వచ్చింది. తరువాత వాళ్లకు అప్పు తీర్చామనుకోండి. మా ఇంటిగల్లాయనకు సొంత వాహనం ఉంది. మా పరిస్థితి చూసి పెట్రోలు చార్జీలతో బాటు కేవలం 1000 రూపాయలకు మమ్మల్ని దాన్ని వాడుకోనిచ్చాడు. ఆ విధంగా మేం తిరిగి ఇంటికి రాగలిగాం.”

ఇక్కడ వజీరిథల్‌లో సమస్య కేవలం వచ్చే పోయే కరెంటు ఒక్కటే కాదు. గ్రామం చుట్టూరా ఉన్న రోడ్లు, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు సరిగ్గా లేకపోవటం కూడా. వజీరిథల్‌కు ఐదు కిలోమీటర్ల దూరంలో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) ఉంది కానీ, వైద్య సిబ్బందిని సరిగ్గా భర్తీ చేయకపోవటం వలన మామూలు ప్రసవాలు చేసేటంతటి సౌకర్యాలు కూడా దానికి లేవు.

“బడగామ్ పిఎచ్‌సికి ఒకే ఒక నర్సు ఉంది. వాళ్లెక్కడ ప్రసవాలు చేస్తారు?” వజీరిథల్‌లో పనిచేస్తున్న 54 ఏళ్ల అంగన్‌వాడీ సేవిక రాజా బేగమ్ అడుగుతున్నారు. “అది అత్యవసరం అయినా, కావాలని చేయించుకున్న గర్భస్రావం అయినా, పిండం సరిగ్గా లేక అయ్యే గర్భస్రావం (మిస్‌కేరేజ్) అయినా నేరుగా గురేజ్‌కు వెళ్లాల్సిందే. ఆపరేషన్ అవసరం అయితే వాళ్లు శ్రీనగర్‌లోని లల్‌ద్‌యద్ ఆసుపత్రికి వెళ్లాల్సిందే. అది గురేజ్ నుండి 125 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రతికూల వాతావరణంలో అక్కడకు చేరటానికి 9 గంటలు పడుతుంది” అని కూడా ఆమె చెప్పారు.

Shameena soaking in the mild morning sun with her two children
PHOTO • Jigyasa Mishra
Raja Begum, the anganwadi worker, holds the information about every woman in the village
PHOTO • Jigyasa Mishra

ఎడమ: తన ఇద్దరు పిల్లలతో కలిసి ఉదయపు నులివెచ్చని సూర్యకిరణాలలో తడిసిపోతోన్న షమీనా. కుడి: గ్రామంలోని ప్రతి మహిళకు సంబంధించిన ఆరోగ్య సమాచారాన్ని సేకరించి పెట్టుకున్న అంగన్‌వాడీ సేవిక , రాజా బేగమ్

గురేజ్ సిఎచ్‌సి వరకూ వెళ్లే రోడ్లు చాలా ఘోరంగా ఉంటాయని షమీనా చెప్పింది. “ఆసుపత్రికి వెళ్లి తిరిగి రావటానికి ఒక్కో వైపుకు రెండు గంటలు పడుతుంది,” 2020లో తాను గర్భవతిగా ఉన్నప్పటి అనుభవాలను చెబుతూ అన్నది షమీనా. “ఇక ఆసుపత్రిలో (CHC) నన్ను చూసిన పద్దతి! బిడ్డను కనటానికి నాకు ఒక పారిశుధ్య కార్మికురాలు సహాయం చేసింది. ప్రసవానికి ముందూ తరువాతా- ఒక్కసారి కూడా వైద్యులెవరూ నన్ను చూడటానికి రాలేదు.”

గురేజ్‌లో ఉన్న పి‌ఎచ్‌సి, సి‌ఎచ్‌సిలు రెండింటికీ ఎప్పటినుండో వైద్యాధికారులు, ఫిజిషియన్, గైనకాలజిస్టు, పిల్లల వైద్యుల వంటి స్పెషలిస్టుల కొరత ఉంది. ఈ విషయంపై రాష్ట్ర పత్రికల్లో ఎక్కువగా చర్చ జరిగింది. రాజా బేగమ్ చెప్పినదాని ప్రకారం పి‌ఎచ్‌సిలో ప్రాథమిక వైద్య సహకారం, ఎక్స్ రే సౌకర్యాలు మాత్రమే ఉన్నాయి. దానికి మించింది కావాలంటే రోగిని 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న సి‌ఎచ్‌సికి పంపుతారు.

అయితే గురేజ్‌లోని సి‌ఎచ్‌సి పరిస్థితి మరీ దుర్భరంగా ఉంది. బ్లాక్ వైద్యాధికారి నివేదిక ప్రకారం (సెప్టెంబర్ 2022న సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అయ్యింది) ఈ బ్లాక్‌లో 11 మంది వైద్యాధికారులు, ముగ్గురు దంత వైద్యులు, ఒక ఫిజిషియన్, ఒక పిల్లల డాక్టర్, ఒక ప్రసూతి సంబంధిత వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖాళీ పోస్టులను భర్తీ చేయటంలో అభివృద్ధి సాధించామని చెప్పుకుంటోన్న నీతి అయోగ్ ఆరోగ్య సూచిక నివేదికకు- ఈ లెక్కలు విరుద్ధంగా ఉన్నాయి.

షమీనా ఇంటికి ఐదారిళ్ల అవతల ఉన్న 48 సంవత్సరాల అఫ్రీన్‌కు తన సొంత కథ ఒకటి ఉంది. “2016 మే నెలలో ప్రసవం కోసం నేను గురేజ్ లోని సి‌ఎచ్‌సికి వెళ్లాల్సివచ్చినపుడు, నా భర్త నన్ను వీపు మీద మోసుకుంటూ వాహనం వరకూ తీసువెళ్లాడు. నేను అతని వీపు మీద ముఖం పైకి ఉండేలా పడుకోవాల్సి వచ్చింది. అక్కడికి 300 మీటర్ల దూరంలో మేము అద్దెకు తీసుకొన్న సుమో ఆగి ఉన్న దగ్గరకు చేరటానికి ఇలా తప్ప మరో మార్గం లేదు” ఆమె కశ్మీరీ మిళితమైన హిందీలో చెప్పారు. “ఇది ఐదు సంవత్సరాల కిందటి మాట. కానీ ఇప్పటికీ పరిస్థితులు అలాగే ఉన్నాయి. ఇప్పుడు మా మంత్రసాని కూడా ముసలిదయి పోయింది. అప్పుడప్పుడూ జబ్బున పడుతోంది.”

అఫ్రీన్ చెబుతున్న మంత్రసాని షమీనా తల్లి. “నా మొదటి ప్రసవం తరువాత నేను ఇకముందు పిల్లల్ని కంటే ఇంట్లోనే కనాలని నిర్ణయించుకున్నాను” షమీనా చెప్పుకొచ్చింది. “అప్పుడు గనుక మా అమ్మే లేకపోయి ఉంటే, నా రెండో కాన్పులో ఉమ్మనీటి సంచి పగలటం వలన నేను చనిపోయుండేదాన్ని. మా అమ్మ మంత్రసాని. పల్లెలో చాలామంది మహిళలకు సహాయం చేసింది” షమీనా తనకు 100 మీటర్ల దూరంలో ఉన్న వృద్ధ మహిళను చూపిస్తూ చెప్పింది. ఆమె తన ఒడిలో పడుకొని ఉన్న అప్పుడప్పుడే నడకలు నేరుస్తున్న పిల్లవాడికి పాటలు పాడి వినిపిస్తున్నారు.

Shameena with her four-month-old daughter Rashida that her mother, Jani Begum, helped in birthing
PHOTO • Jigyasa Mishra
Jani Begum, the only midwife in the village, has delivered most of her grand-children. She sits in the sun with her grandchild Farhaz
PHOTO • Jigyasa Mishra

ఎడమ: తల్లి జానీ బేగమ్ సహాయంతో తాను కన్న బిడ్డ, ఇప్పుడు నాలుగు నెలల వయసున్న రషీదాతో షమీనా. కుడి: జానీ బేగమ్ గ్రామంలో ఉన్న ఒకే ఒక మంత్రసాని. తన మనవళ్ల, మనవరాళ్ల పుట్టుకలకు చాలావరకు ఆవిడే సహాయం చేశారు. తన మనవడు ఫర్హాజ్‌తో ఎండ కాగుతోన్న జానీ బేగమ్

షమీనా తల్లి, 71 సంవత్సరాల జానీ బేగమ్ ముదురు గోధుమ రంగు ఫిరన్ ధరించి ఇంటి బయట కూర్చొని ఉన్నారు. ఆ పల్లెలోని మహిళలలందరిలాగానే ఆమె కూడా తలకు ఒక గుడ్డ కట్టుకొని ఉన్నారు. ఆమె ముఖం మీద ముడతలు ఆమె సుదీర్ఘ అనుభవం గురించి చెబుతున్నాయి. “ఈ పనిని నేను 35 సంవత్సరాల నుండి చేస్తున్నాను. చాలా ఏళ్ల క్రితం మా అమ్మ ప్రసవం చేయడానికి వెళ్తోన్న సమయాల్లో సహాయం చేయటానికి నన్ను అనుమతించింది. అందుకే నేను గమనిస్తూ, ఆచరిస్తూ, నేర్చుకున్నాను. ఇతరులకు సహాయం చేయగలగటం ఒక ఆశీర్వాదమే” అన్నారామె.

జానీ తన జీవిత కాలంలో చాలా తక్కువ మార్పును ఈ విషయంలో గమనించారు. ఆ మార్పు కూడా పెద్ద చెప్పుకోదగ్గదేమి కాదు. “ఇదివరకులా కాకుండా ఇప్పుడు ఆడవాళ్లకు ఐరన్ టాబ్లెట్స్, ఇంకా ఇతర ఉపయోగకరమైన అనుబంధ పోషషకాలు దొరకటం వలన ప్రసవాలలో తక్కువ ప్రమాదాలు ఉంటున్నాయి” అంటారామె. “అవును. కొంత మార్పు వచ్చింది. కానీ ఇతర గ్రామాలలో వచ్చినంత కాదు. మా అమ్మాయిలు చదువుకొంటున్నారు. కానీ ఈ రోజుకీ వాళ్లకు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు పరిమితంగానే లభిస్తున్నాయి. మాకు ఆసుపత్రులు ఉన్నాయి. కానీ అత్యవసర స్థితిలో అక్కడకు చేరడానికి సరైన రహదారులు లేవు.”

గురేజ్ సిఎచ్‌సి చాలా దూరంలో ఉందనీ, అక్కడకు చేరటానికి కనీసం 5 కిలోమీటర్ల దూరమైనా నడవాలనీ జానీ చెప్పారు. 5 కిలోమీటర్ల తరువాత మాత్రమే అక్కడకు చేరటానికి ప్రజా రవాణా దొరికే అవకాశం ఉంది. అర కిలోమీటర్ నడిచాక కూడా ప్రైవేట్ వాహనాలు దొరుకుతాయి, కానీ వాటికి అధికమొత్తంలో డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.

“రెండో గర్భిణీ నాటి చివరి మూడు నెలల్లో షమీనా చాలా బలహీనంగా అయింది,” అన్నారు జానీ. మా అంగన్‌వాడి సేవిక సలహాతో ఆసుపత్రికి వెళ్లాలనుకున్నాం. కానీ మా అల్లుడు పని వెతుక్కుంటూ వేరే పట్టణానికి వెళ్ళివున్నాడు. ఇక్కడ వాహనం దొరకటం చాలా కష్టం. ఒక వేళ దొరికినా గర్భిణీ స్త్రీలను ఆ వాహనాల వరకూ మనుషులు మోసుకొని పోవాలి” అని కూడా జానీ చెప్పారు.

“ఈమె చనిపోయాక మా పల్లెలోని ఆడవాళ్ల పరిస్థితి ఏమిటి? మేం ఎవరి మీద ఆధారపడాలి?” జానీని ఉద్దేశించి అఫ్రీన్ బయటకే మాట్లాడారు. అప్పటికి సాయంత్రం అయ్యింది. సాయంకాలం భోజనంలోకి కోడిగుడ్ల కోసం షమీనా పొదల్లో వెతుకుతోంది. “కోళ్లు తమ గుడ్లను దాచిపెడతాయి. గుడ్ల కూర కోసం వాటిని నేను వెతికిపట్టుకోవాలి. లేకపోతే ఈ రాత్రికి కూడా అన్నం, రాజ్మానే. ఇక్కడ ఏది సులభంగా రాదు. దూరం నుండి ఈ పల్లె పొడవాటి చెట్ల మధ్య ఇళ్లతో నయనానందకరంగా కనిపిస్తుంది. కానీ దగ్గరగా వచ్చినపుడే, ఇక్కడ జీవితాలు ఎలా ఉంటాయో అర్థం అవుతుంది” చెప్పిందామె.

గ్రామీణ భారతదేశంలోని కౌమారదశలో ఉన్న బాలికలు, యువతులపై PARI, కౌంటర్‌మీడియా ట్రస్టుల ఈ దేశవ్యాప్త రిపోర్టింగ్ ప్రాజెక్ట్- పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా మద్దతుతో కీలకమైన, ఇంకా అట్టడుగున ఉన్న సమూహాల పరిస్థితిని- సాధారణ ప్రజల గొంతుల ద్వారా, జీవన అనుభవం ద్వారా అన్వేషించడంలో ఒక భాగం.

ఈ కథనాన్ని తిరిగి ప్రచురించాలనుకుంటున్నారా? దయచేసి [email protected] కు రాయండి. [email protected] కు కాపీ పెట్టండి.

అనువాదం: రమాసుందరి

Jigyasa Mishra

جِگیاسا مشرا اترپردیش کے چترکوٹ میں مقیم ایک آزاد صحافی ہیں۔ وہ بنیادی طور سے دیہی امور، فن و ثقافت پر مبنی رپورٹنگ کرتی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Jigyasa Mishra
Editor : Pratishtha Pandya

پرتشٹھا پانڈیہ، پاری میں بطور سینئر ایڈیٹر کام کرتی ہیں، اور پاری کے تخلیقی تحریر والے شعبہ کی سربراہ ہیں۔ وہ پاری بھاشا ٹیم کی رکن ہیں اور گجراتی میں اسٹوریز کا ترجمہ اور ایڈیٹنگ کرتی ہیں۔ پرتشٹھا گجراتی اور انگریزی زبان کی شاعرہ بھی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Pratishtha Pandya
Translator : Ramasundari

Ramasundari is from Andhra Pradesh. She is a member of the Editorial Board of Telugu monthly, Matruka.

کے ذریعہ دیگر اسٹوریز Ramasundari