దిల్లీ నుంచి మేం తిరిగివచ్చి ఇప్పటికి రెండేళ్ళవుతోంది. మా డిమాండ్లను తీరుస్తానని చెప్పిన ప్రభుత్వం, వాటిని గురించి చర్చించేందుకు మా రైతులనెవరినీ ఇంతవరకూ పిలవలేదు," పంజాబ్‌లోని సంగ్రూర్ జిల్లాకు చెందిన 60 ఏళ్ళ చరణ్‌జిత్ కౌర్ అన్నారు. ఆమె, ఆమె కుటుంబం తమ రెండెకరాల పొలంలో గోధుమ, వరితో పాటు ఇంటి వాడకం కోసం కొన్ని కూరగాయలను పండిస్తుంటారు. "మేం రైతులందరి హక్కుల కోసం పోరాడుతున్నాం," అంటారామె.
చరణ్‌జిత్ కౌర్, తన స్నేహితురాలైన గుర్మీత్ కౌర్‌తో సహా మరి కొంతమంది మహిళల బృందంతో కలిసి పటియాలా జిల్లా, శంభూ సరిహద్దు దగ్గర కూర్చొనివున్నారు. "వాళ్ళు (ప్రభుత్వం) మమ్మల్ని దిల్లీ కూడా వెళ్ళనివ్వడంలేదు," అన్నారు గుర్మీత్. ఆమె ఇక్కడ హరియాణా-పంజాబ్ సరిహద్దు పొడవునా రహదారుల మీద కాంక్రీట్ గోడలు, ఇనుప మేకులు, ముళ్ళ కంచెలతో అంచెలంచలుగా నిర్మించిన అవరోధాలను గురించీ, ఆపైన దిల్లీ-హరియాణా సరిహద్దులలో రైతు నిరసనకారులను దిల్లీలోకి ప్రవేశించనీయకుండా నిరోధిస్తోన్న విషయం గురించీ మాట్లాడుతున్నారు. చదవండి: 'శంభూ సరిహద్దు వద్ద నేను బందీనైనట్టనిపించింది '
కేంద్రం అనేక విషయాలలో విఫలమయిందని ఇక్కడ గుమిగూడిన రైతులు అన్నారు: స్వామినాథన్ కమిషన్ సిఫారసుల మేరకు కనీస మద్దతు ధరకు(ఎమ్ఎస్‌పి) హామీ; రైతులకు రైతు కూలీలకు అప్పులను పూర్తిగా మాఫీ చేయటం; లఖింపూర్-ఖేరీ మారణకాండలో నష్టపోయిన రైతులకు న్యాయం చేయటం, దోషులను అరెస్టు చేయటం; రైతులకు, కూలీలకు పింఛను పథకం; 2020-2021 నిరసన లో అమరులైన రైతుల కుటుంబాలకు పరిహారం.
కొన్ని వారాల క్రితం ఫిబ్రవరి 13న, తమ డిమాండ్ల సాధన కోసం ఈ రైతులు దేశ రాజధానికి శాంతియుతంగా యాత్రను ప్రారంభించినప్పుడు, వారిని ముందుకు కదలకుండా ఆపడానికి హరియాణా పోలీసులు బాష్పవాయువును, నీటి ఫిరంగులను, పెల్లెట్ గన్‌ల నుండి రబ్బర్ బుల్లెట్‌లను వారిపై ప్రయోగించారు.
హరియాణా, పంజాబ్‌ల మధ్య శంభూ సరిహద్దు వద్ద ఉన్న నిరసనకారులలో సురీందర్ కౌర్ కుమారుడు కూడా ఉన్నారు. “ సాడే తే మొబైల్, టెలివిజన్ బంద్ హీ నహీ హుందే. అసీ దేఖ్‌దే హాఁ నా సారా దిన్ గోలే వజదే, తద మన్ విచ్ హౌల్ జేహా పైందా హై కి సాడే బచ్చే తే వజ్జే నా . [మా మొబైల్ ఫోన్‌లు, టెలివిజన్‌లు నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. రోజంతా బాష్పవాయు ప్రయోగం కొనసాగడం చూస్తుంటే, మా పిల్లల భద్రత గురించి మేం ఆదుర్దా పడుతున్నాం]," అని ఆమె చెప్పారు.
హరియాణా-పంజాబ్‌కు చెందిన మరో సరిహద్దు, ఖనౌరి వద్ద భద్రతా సిబ్బందికి, నిరసనకారులకు మధ్య జరిగిన ఘర్షణలో మరణించిన 22 ఏళ్ళ శుభకరణ్ సింగ్ కోసం జరిగిన కొవ్వొత్తుల యాత్రలో పాల్గొనడానికి ఖోజే మాజ్రా గ్రామానికి చెందిన సురిందర్ కౌర్ ఫిబ్రవరి 24, 2024 ఉదయం ఇక్కడకు వచ్చారు.
"మేం మా హక్కుల కోసం ప్రతిఘటిస్తున్నాం, అవి నెరవేరేవరకూ మేం తిరిగివెళ్ళేది లేదు," అని ఆమె నొక్కిచెప్పారు. 64 ఏళ్ళ సురిందర్, తన కోడలితోనూ మనవ సంతానంతోనూ కలిసి ఇక్కడకు వచ్చారు.
ఆరుగురు సభ్యులు గల సురిందర్ కౌర్ కుటుంబం ఫతేగఢ్ సాహిబ్ జిల్లాలోని తమ రెండు ఎకరాల పొలంపై ఆధారపడింది. అందులో వారు గోధుమలు, వరి సాగుచేస్తారు. కేవలం ఐదు పంటలకే ఎమ్ఎస్‌పి ఇవ్వడం సరిపోదని ఆమె అంటున్నారు. "మిట్టీ దే భా లైందే నే సాడీ ఫసల్ [వాళ్ళు మన పంటలను అమిత తక్కువ ధరకు కొంటారు]," అంటూ ఆమె తమ పొలాల్లోనూ, చుట్టుపక్కల విక్రయించే ఆవాల వంటి ఇతర పంటల గురించి ప్రస్తావిస్తూ చెప్పారు.
"మేం శాంతియుతంగా నిరసనలు చేస్తున్నప్పటికీ, పోలీసులు ఎందుకు ఇటువంటి తీవ్రమైన చర్యలకు దిగుతున్నారు?" ఆందోళన చెందుతోన్న దేవిందర్ కౌర్ అడిగారు. ఆమె కుమారులు మొదటి నుండి నిరసన ప్రదేశంలోనే ఉన్నారు. పంజాబ్‌లోని సాహిబ్‌జాదా అజిత్ సింగ్ నగర్ జిల్లాలోని లాండ్రాఁ గ్రామ నివాసి అయిన దేవిందర్ కౌర్ కూడా తన కుటుంబంతో - కోడలు, 2, 7, 11 సంవత్సరాల వయస్సు గల మనవసంతానంతో - కలిసి వచ్చారు.
"ప్రభుత్వం గోధుమ, వరి - ఈ రెండు పంటలకే ఎమ్ఎస్‌పిని అందిస్తోంది. మళ్ళీ వాళ్ళే మమ్మల్ని వివిధ రకాల పంటలను వెయ్యమంటారు. ఇటువంటి పరిస్థితులలో మేం మార్పిడి పంటలను ఎలా వేయగలం?" దేవిందర్ అడిగారు. భారత ఆహార సంస్థ 2022-2023కుగాను ఒక క్వింటాల్ మొక్కజొన్నకు రూ. 1962ను ఎమ్ఎస్‌పిగా నిర్ణయించగా, మేం పండించిన మొక్కజొన్నను క్వింటాల్ ఒక్కింటికి రూ. 800-900కు కొన్నారు."
అవరోధాల నుండి దాదాపు 200 మీటర్ల దూరంలో, ట్రాలీపై ఏర్పాటుచేసిన ఒక తాత్కాలిక వేదికపై నిలబడి, రైతు నాయకులు ప్రసంగాలు చేస్తున్నారు, నిరసన తెలుపుతోన్న రైతులకు జరగనున్న కార్యక్రమాల గురించి తెలియజేస్తున్నారు. హైవేపై పరచివున్న దుర్రీలపై ప్రజలు కూర్చునివున్నారు; వేలకొద్దీ ట్రాక్టర్ ట్రాలీలతో కూడిన నాలుగు కిలోమీటర్ల పొడవైన బిడారు పంజాబ్ వైపుకు విస్తరించి ఉంది.
పంజాబ్‌లోని రాజ్‌పురాకు చెందిన పరమ్‌ప్రీత్ కౌర్ (44) అనే రైతు, ఫిబ్రవరి 24 నుండి ఇక్కడ శంభూ వద్దనే ఉన్నారు. అమృత్‌సర్, పఠాన్‌కోట్ ప్రాంత గ్రామాల నుండి వచ్చిన ట్రాక్టర్ ట్రాలీలు ఒక్కొక్కదానిలో నలుగురు నుండి ఐదుగురు మహిళలు ఉన్నారు. వారు రోజంతా అక్కడే ఉంటారు, మరుసటి రోజు మరో మహిళల బృందం అక్కడకు వస్తుంది. నిరసన స్థలంలో మరుగుదొడ్లు లేకపోవడం వల్ల రాత్రిపూట అక్కడ ఉండలేకపోతున్నామని వారు అంటున్నారు. "కుటుంబం నుండి ఎవరైనా మద్దతుగా రావాలని నేను కోరుకుంటున్నాను" అని పరమ్‌ప్రీత్ చెప్పారు. అనారోగ్యంతో ఉన్న 21 ఏళ్ళ ఆమె కొడుకు అక్కడికి రాలేడు కాబట్టి, అతనికి బదులుగా ఆమె తన బంధువులతో కలిసి వచ్చారు. ఆ కుటుంబానికి 20 ఎకరాల భూమి ఉంది, అందులో వారు గోధుమలు, వరి పండిస్తారు. కానీ 2021లో ఆమె భర్తకు స్ట్రోక్ వచ్చినప్పటి నుండి వారు ఆ భూమి ద్వారా ఏమీ సంపాదించలేదు.
"సమీపంలో ఉన్న కర్మాగారం నుండి విడుదలయ్యే రసాయనాల వలన భూగర్భజలాలు కలుషితమవుతుండటంతో, ఆ భూమిని కౌలుకు సాగు చేయడానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదు," అని పరమ్‌ప్రీత్ అన్నారు.
పటియాలా జిల్లాలోని భతెహ్రీ గ్రామంలో అమన్‌దీప్ కౌర్, ఆమె కుటుంబానికి 21 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో వీరు ప్రధానంగా గోధుమలు, వరి పండిస్తారు. “మన పంటలు మన పొలాల్లో ఉన్నప్పుడు వాటి విలువ చాలా తక్కువగా ఉంటుంది. అయితే, అవి మన స్వాధీనంలోంచి వెళ్ళిపోయిన తర్వాత, వాటిని బజారులో రెట్టింపు ధరకు విక్రయిస్తారు.”
నిరసన గురించి ఆమె మాట్లాడుతూ, “నిరసనకారులు నిరాయుధులుగా ఉన్నారు, అయినా ప్రభుత్వం తన సొంత పౌరులపైనే ఆయుధాలను ప్రయోగిస్తోంది. భారతదేశంలోనే ఉండిపోవటానికి పెద్ద కారణాలేమీ లేవు. అందుకే యువత దేశం విడిచి వెళ్లిపోవడంలో పెద్ద ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. ఇక్కడ ఉద్యోగాలు పరిమితంగా ఉండటం మాత్రమే కాకుండా, మనం మన హక్కుల గురించి నొక్కి అడిగినప్పుడల్లా, ఇదిగో ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటుంటాం."
అనువాదం: సుధామయి సత్తెనపల్లి