జనాదరణ పొందిన గర్బా తీరులో స్వరపరిచిన ఈ పాట, స్త్రీల స్వేచ్ఛ, ధిక్కరణ, పట్టుదలలను అంశాలుగా పొందుపరిచిన పాట. వారసత్వకట్టడిని, సంస్కృతి విధించిన నిర్దేశాలను ప్రశ్నించకుండా అంగీకరించడానికి సిద్ధంగా లేని గ్రామీణ మహిళల నిజ స్వరాన్ని ఈ పాట ప్రతిధ్వనిస్తుంది.

ఈ పాట కచ్‌ ప్రాంతంలో మాట్లాడే అనేక భాషలలో ఒకటైన గుజరాతీలో రాసినది. మహిళా హక్కుల గురించి అవగాహన కల్పించడానికి కచ్ మహిళా వికాస్ సంగఠన్ (కెఎమ్‌విఎస్) నిర్వహించిన ఒక వర్క్‌షాప్‌లో పాల్గొన్న గ్రామీణ మహిళలు ఈ పాటకు సహరచయితలు.

ఈ పాటను మొదట ఏ సంవత్సరంలో స్వరపరిచారు, పాట రచయితలు ఎవరు అనేది ఖచ్చితంగా నిర్ధారించడం కష్టం. అయితే ఆస్తిపై సమాన హక్కులు కోరుతూ మహిళలు ఎలుగెత్తిన బలమైన స్వరాన్ని శ్రోతలు నిస్సందేహంగా వినగలుగుతారు.

ఈ పాటను ఏ సందర్భంలో రూపొందించారో మనకు తెలియకపోయినా, గుజరాత్ అంతటా, ప్రత్యేకించి కచ్‌లో, 2003 సంవత్సరంలో మహిళల భూయాజమాన్యం, జీవనోపాధి సమస్యల గురించి చర్చలు జరిపి, వర్క్‌షాప్‌లు నిర్వహించినట్లు మావద్ద రికార్డులున్నాయి. మహిళల హక్కులపై అవగాహన పెంపొందించడానికి చేపట్టిన ప్రచార కార్యక్రమాలు, వ్యవసాయోత్పత్తికి మహిళలు అందించే సహకారం, భూమిపై వారికి హక్కు లేకపోవడం మధ్య ఉన్న తీవ్ర వ్యత్యాసం వంటి కీలక అంశాలపై దృష్టి సారించాయి. ఈ పాట రూపొందడానికి ఆ చర్చలే ప్రభావితం చేశాయా అనేది మనకు ఖచ్చితంగా తెలియదు.

అయితే అప్పటి నుంచి ఈ పాట ఆ ప్రాంతం అంతటా ప్రయాణించి ప్రచారంలోకి వచ్చింది. ఈ పాట ప్రయాణమంతటా, తరచుగా జానపద పాటలలో జరిగే మాదిరిగానే, గాయకులు తమ తక్షణ ప్రేక్షకులను ఆకర్షించడానికి పంక్తులను జోడించారు, మార్పులు చేశారు, సర్దుబాటు చేశారు. ఇప్పుడు మనం వింటున్న ఈ పాటను నఖాత్రా తాలూకా కు చెందిన నందుబా జడేజా అందించారు.

ఈ పాట 2008లో ప్రారంభించిన సాముదాయక రేడియో, సురవాణి రికార్డ్ చేసిన 341 పాటల్లో ఒకటి. కెఎమ్‌విఎస్ ద్వారా PARI సేకరించిన ఈ పాటలు ఈ ప్రాంతపు అద్భుతమైన సంస్కృతి, భాష, సంగీత వైవిధ్యాలను చక్కగా ప్రతిబింబిస్తాయి. ఈ పాటల సేకరణ క్షీణిస్తోన్న కచ్ సంగీత సంప్రదాయాన్ని, ఎడారి ఇసుకలో మసకబారుతున్న దాని సంగీత ధ్వనులనూ సంరక్షించడానికి సహాయపడుతుంది.

నఖాత్రాకు చెందిన నందుబా జడేజా పాడుతోన్న జానపద గీతాన్ని వినండి


Gujarati

સાયબા એકલી હું વૈતરું નહી કરું
સાયબા મુને સરખાપણાની ઘણી હામ રે ઓ સાયબા
સાયબા એકલી હું વૈતરું નહી કરું
સાયબા તારી સાથે ખેતીનું કામ હું કરું
સાયબા જમીન તમારે નામે ઓ સાયબા
જમીન બધીજ તમારે નામે ઓ સાયબા
સાયબા એકલી હું વૈતરું નહી કરું
સાયબા મુને સરખાપણાની ઘણી હામ રે ઓ સાયબા
સાયબા એકલી હું વૈતરું નહી કરું
સાયબા હવે ઘરમાં ચૂપ નહી રહું
સાયબા હવે ઘરમાં ચૂપ નહી રહું
સાયબા જમીન કરાવું મારે નામે રે ઓ સાયબા
સાયબાહવે મિલકતમા લઈશ મારો ભાગ રે ઓ સાયબા
સાયબા હવે હું શોષણ હું નહી સહુ
સાયબા હવે હું શોષણ હું નહી સહુ
સાયબા મુને આગળ વધવાની ઘણી હામ રે ઓ સાયબા
સાયબા એકલી હું વૈતરું નહી કરું
સાયબા મુને સરખાપણાની ઘણી હામ રે ઓ સાયબા
સાયબા એકલી હું વૈતરું નહી કરું

తెలుగు

నేనికపై ఒంటరిగా కష్టపడను, నా పెనిమిటీ
నేను నీతో సమానంగా ఉండాలనుకుంటున్నాను, ఎన్నటికీ, నా పెనిమిటీ
నేనికపై ఒంటరిగా కష్టపడను
నీలాగే నేనూ పొలాల్లో పని చేస్తాను
అయితే పొలాలన్నీ నీ పేరు మీదనే ఉన్నాయి
ఓహ్! భూమి నీ పేరునే ఉంది, నా పెనిమిటీ
నేనికపై ఒంటరిగా కష్ష్టం చేయను
నేను నీతో సమానంగా ఉండాలనుకుంటున్నాను, ఎప్పటికీ, నాపెనిమిటీ
నేనికపై ఒంటరిగా కష్టపడను
ఇకపై ఇంట్లో మౌనంగా ఉండను
నా మాట్లాడే స్వేచ్ఛని వదులుకోను, ఇంకెన్నడూ వదులుకోను
ప్రతి ఎకరానికి నా పేరును జోడించాలి
ఆస్తి పత్రాలలో నా వాటాను అడుగుతాను
ఆస్తి కాగితాల్లో నా వాటాను కోరుకుంటాను, నా పెనిమిటీ
నేనికపై నాపై దోపిడీ జరగనీయను, నా పెనిమిటీ
ఇకపై ఎప్పటికీ సహనంతో ఈ దోపిడీని భరించను
నేను స్వేచ్ఛగా ఎదగాలని, ఇంకా చాలా చేయాలనీ అనుకుంటున్నాను
నేనికపై ఒంటరిగా కష్టపడను
నీతో సమానంగా ఉండాలనుకుంటున్నాను, ఎప్పటికీ, నా పెనిమిటీ
నేనికపై ఒంటరిగా కష్టపడుతూ ఉండను.


PHOTO • Priyanka Borar

పాట స్వరూపం : అభ్యుదయ గీతం

శ్రేణి : స్వేచ్ఛా గీతాలు

పాట : 3

పాట శీర్షిక : సాయబా ఇకలీ హూఁ వైతరూ నహి కరూఁ

స్వరకర్త : దేవల్ మెహతా

గానం : నఖాత్రా తాలూకా కు చెందిన నందుబా జడేజా

పయోగించిన వాయిద్యాలు : హార్మోనియమ్, డోలు, తంబురా

రికార్డు చేసిన సంవత్సరం : 2016, కెఎమ్‌విఎస్ స్టూడియో

ప్రీతి సోనీ, కెఎమ్‌విఎస్ కార్యదర్శి అరుణా ఢోలకియా, కెఎమ్‌విఎస్ ప్రాజెక్ట్ సమన్వయకర్త అమద్ సమేజాల సహకారానికి; గుజరాతీ అనువాదంలో అమూల్యమైన సహాయం చేసినందుకు భారతీబెన్ గోర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు.

అనువాదం: పద్మావతి నీలంరాజు

Pratishtha Pandya

PARI సృజనాత్మక రచన విభాగానికి నాయకత్వం వహిస్తోన్న ప్రతిష్ఠా పాండ్య PARIలో సీనియర్ సంపాదకురాలు. ఆమె PARIభాషా బృందంలో కూడా సభ్యురాలు, గుజరాతీ కథనాలను అనువదిస్తారు, సంపాదకత్వం వహిస్తారు. ప్రతిష్ఠ గుజరాతీ, ఆంగ్ల భాషలలో కవిత్వాన్ని ప్రచురించిన కవయిత్రి.

Other stories by Pratishtha Pandya
Illustration : Priyanka Borar

ప్రియాంక బోరార్ కొత్త అర్థాలను మరియు వ్యక్తీకరణలను కనుగొనటానికి సాంకేతికతతో ప్రయోగాలు చేసే కొత్త మీడియా ఆర్టిస్ట్. నేర్చుకోవడం కోసం, ఆటవిడుపు గాను అనుభవాలను డిజైన్ చేయడం ఆమెకు చాలా ఇష్టం. ఇంటరాక్టివ్ మీడియాతో గారడీ చేయడం ఆమె ఎంతగా ఆనందీస్తుందో, అంతే హాయిగా సాంప్రదాయక పెన్ మరియు కాగితాలతో బొమ్మలు గీస్తుంది.

Other stories by Priyanka Borar
Translator : Padmavathi Neelamraju

పద్మావతి ఆంగ్ల భాషా బోధనలో 35 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న పదవీ విరమణ చేసిన పాఠశాల ఉపాధ్యాయురాలు. తెలుగు, ఆంగ్ల సాహిత్యాలపై ఉన్న ఆసక్తితో ఆమె తన అభిరుచిని అనుసరించి బ్లాగ్ రచయితగానూ వార్తాపత్రికలలోనూ తన జీవితానుభవాలను పంచుకుంటుంటారు.

Other stories by Padmavathi Neelamraju