వరదల కారణంగా మొదటిసారిగా తాను మకాం మార్చవలసి వచ్చిన సందర్భం మహేశ్వర్ సమూవాహ్‌కి స్పష్టంగా గుర్తుంది. అప్పుడతని వయసు కేవలం ఐదు సంవత్సరాలు. “నీటిలో మొదట మా ఇళ్ళల్లో ఒక ఇల్లు కొట్టుకుపోయింది. ద్వీపానికి దగ్గరగా ఉన్న భూమి పైకి మకాం మార్చడం కోసం ఆశ్రయాన్ని వెదుక్కుంటూ మేం మా పడవలలో ఎక్కి తప్పించుకున్నాం,” అని ఇప్పుడు అరవై ఏళ్ళు దాటిన సమూవాహ్‌ చెప్పారు.

సమూవాహ్‌ వలె, అస్సాంలోని నదీ ద్వీపమైన మాజులీలో జీవించే 1.6 లక్షల మంది ప్రజలు తరచుగా వచ్చే వరదల వల్ల, భూమి కోతకు గురవడం వల్ల ప్రభావితమవుతున్నారు. 1956లో దాదాపు 1,245 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ద్వీపంలోని భూభాగం, 2017 నాటికి 703 చదరపు కిలోమీటర్లకు తగ్గిపోయిందని జిల్లా విపత్తు నిర్వహణాధికార సంస్థ నివేదిక పేర్కొంది.

"ఇది నిజానికి శాల్మొరా కాదు," చెప్పారు సమూవాహ్‌. "శాల్మొరాను దాదాపు 43 సంవత్సరాల క్రితం [నది] బ్రహ్మపుత్ర మింగేసింది." బ్రహ్మపుత్ర, దాని ఉపనది సుబన్‌సిరి ద్వారా కొత్త శాల్మొరా ఏర్పడింది. ఇక్కడ సమూవాహ్‌ గత 10 సంవత్సరాలుగా తన భార్య, కుమార్తె, కొడుకు కుటుంబంతో కలిసి జీవిస్తున్నారు.

ఆయన కొత్త ఇల్లు సిమెంటుతోనూ మట్టితోనూ కట్టినది. ఇంటికి బయట కట్టిన మరుగుదొడ్డిని ఉపయోగించడానికి నిచ్చెన ఉపయోగించాల్సిందే. "ఏటేటా మేం బ్రహ్మపుత్రకు కొంత భూమిని నష్టపోతున్నాం," అంటారాయన.

PHOTO • Nikita Chatterjee
PHOTO • Nikita Chatterjee

ఎడమ: 'అదే నా ఇల్లు' అని ఒక సాపోరి (చిన్న ఇసుకదిబ్బ ద్వీపం)ని చూపిస్తూ మహేశ్వర్ సమూవాహ్ చెప్పారు. బ్రహ్మపుత్ర ద్వీపాన్ని ముంచివేసినప్పుడు, అతను ప్రస్తుత శాల్మొరాకు వెళ్ళవలసి వచ్చింది. ఇదే కారణంతో మహేశ్వర్ చాలాసార్లు వలస వెళ్ళాల్సి వచ్చింది. కుడి: తరచుగా వచ్చే వరదల కారణంగా భూమిని కోల్పోతున్నందున గ్రామంలో వ్యవసాయోత్పత్తులు దెబ్బతిన్నాయని శాల్మొరా గ్రామ సర్పంచ్ జిశ్వర్ హజారికా చెప్పారు

తరచుగా వచ్చే వరదలు గ్రామంలో వ్యవసాయంపై ప్రభావం చూపుతున్నాయి. "మేం ధాన్యం, మాటీ దాల్ (మినుములు), బైంగన్ (వంకాయ), పట్టాగోబి (కాబేజి) వంటి కూరగాయలను కూడా పండించలేం; ఇప్పుడు ఎవరికీ భూమి లేదు," అన్నారు శాల్మొరా సర్పంచి జిశ్వర్. అనేకమంది పడవలు తయారుచేయటం, కుండలు చేయడం, చేపలు పట్టడం వంటి పనులను చేపట్టారు.

"శాల్మొరా పడవలకు ద్వీపం అంతటా మంచి గిరాకీ ఉంది," అని పడవలను తయారుచేసే సమూవాహ్ చెప్పారు. ఎందుకంటే సాపొరీల (చిన్న ద్వీపాలు) నుండి చాలామంది ప్రజలు నదిని దాటడానికి, పిల్లలను బడులకు తీసుకెళ్ళడానికి, చేపలు పట్టడానికి, వరదల సమయంలో కూడా పడవలను ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది.

పడవలను తయారుచేయడాన్ని సమూవాహ్ తనంతట తానే నేర్చుకున్నారు; ముగ్గురు కలిసి ఒక బృందంగా ఏర్పడి పనిచేస్తారు. ఈ పడవలను హిజల్ గురి అనే ఖరీదైన కలపతో తయారుచేస్తారు. ఇది అంత సులభంగా అందుబాటులో ఉండేది కానప్పటికీ, ఇది చాలా "దృఢమైన, ఎక్కువ కాలం మన్నే" చెక్క కావటంతో దీనినే ఉపయోగిస్తారని సమూవాహ్ చెప్పారు. వాళ్ళు ఈ కలపను శాల్మొరా, ఆ చుట్టుపక్కల గ్రామలలోని వ్యాపారుల నుంచి కొంటారు.

పెద్ద పడవను తయారుచేయడానికి ఒక వారం, చిన్న పడవ తయారీకి ఐదు రోజుల సమయం పడుతుంది. అనేక చేతులు పడటం వలన వాళ్ళు నెలకు 5-8 పడవలను తయారుచేస్తారు. ఒక పెద్ద పడవ (10-12 మంది మనుషులతో పాటు మూడు మోటారుసైకిళ్ళను తీసుకు వెళ్ళగలిగింది) రూ. 70,000 ఖరీదుచేస్తే, చిన్న పడవ ఖరీదు రూ. 50,000; ఈ సంపాదనను వారు ఇద్దరు లేదా ముగ్గురు పంచుకుంటారు.

PHOTO • Nikita Chatterjee
PHOTO • Nikita Chatterjee

ఎడమ: శాల్మొరాలో పడవలకు చాలా గిరాకీ ఉంది. మహేశ్వర్ పడవల తయారీని స్వయంగా నేర్చుకున్నారు. మామూలుగా ఆయన మరో ఇద్దరు ముగ్గురితో కలిసి పడవను తయారుచేస్తారు; వచ్చిన ఆదాయాన్ని వారంతా పంచుకుంటారు. కుడి: శాల్మొరా నివాసులు ఎక్కువగా చేపల వేటకు వెళ్తారు. మహేశ్వర్ హోరూ మాచ్ లేదా చిన్న చేపలను పట్టుకోవడానికి వెదురుతో తయారుచేసిన అత్వా జాల్‌ని ఉపయోగిస్తారు. ఇక్కడ ఆయన పక్కన నిల్చున్నవారు, శాల్మొరా నివాసి మణి హజారికా

PHOTO • Nikita Chatterjee
PHOTO • Nikita Chatterjee

ఎదమ: కట్టెలను సేకరించడానికి పడవలో నదిలోకి వెళ్తోన్న రుమీ హజారికా, తర్వాత ఆమె వాటిని అమ్మేస్తారు. కుడి: సత్రీయా పద్ధతిలో చిన్న కుండలను తయారుచేసేందుకు ఆమె నల్ల మట్టిని ఉపయోగిస్తారు. వాటిని ఆమె స్థానిక మార్కెట్‌లో అమ్ముతారు

వర్షాకాలం (వరదలు వచ్చే కాలం)లో మాత్రమే పడవలకు ఆర్డర్లు వస్తాయి కాబట్టి పడవ తయారీ ద్వారా వచ్చే ఆదాయం నిలకడగా ఉండదు. దాంతో, సమూవాహ్‌కు చాలా నెలల పాటు పని ఉండదు, నెలవారీ ఆదాయం కూడా ఉండదు.

వరదలు వచ్చినప్పుడు, యాభై ఏళ్ళు దాటిన రుమీ హజారికా గ్రామ బజారులో అమ్మడానికి కట్టెలను సేకరించడం కోసం నదిలోకి వెళ్తారు. ఆమె తెడ్లు వేస్తూ పడవ నడపటంలో నిపుణురాలు. ఇలా కట్టెలు అమ్మటం వల్ల ఆమెకు క్వింటాల్‌కు కొన్ని వందల రూపాయలు లభిస్తాయి. ఆమె ద్వీపానికి కేంద్రంగా ఉండే గరమూర్, కమలాబారీలలో కాలో మాటీ (నల్ల మట్టి)తో తయారుచేసిన కుండలను ఒక్కొక్కటీ రూ. 15కి, మట్టి దీపాలను ఒక్కొక్కటి రూ. 5కి అమ్ముతారు.

"మా భూమితో పాటు మేం మా సంప్రదాయక అలవాట్లను కూడా నష్టపోతున్నాం," అంటారామె. "మా కాలో మాటీ ఇప్పుడు బ్రహ్మపుత్ర వరదలలో కొట్టుకుపోయింది."

ఈ కథనాన్ని నివేదించడంలో సహాయపడినందుకు కృష్ణ పెగుకు ఈ రిపోర్టర్ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Nikita Chatterjee

నికిత ఛటర్జీ డెవలప్‌మెంట్ ప్రాక్టీషనర్, అంతగా ప్రాతినిధ్యం లేని సముదాయాల కథనాలను విస్తరించడంపై దృష్టి సారించిన రచయిత.

Other stories by Nikita Chatterjee
Editor : PARI Desk

PARI డెస్క్ మా సంపాదకీయ కార్యక్రమానికి నాడీ కేంద్రం. ఈ బృందం దేశవ్యాప్తంగా ఉన్న రిపోర్టర్‌లు, పరిశోధకులు, ఫోటోగ్రాఫర్‌లు, చిత్రనిర్మాతలు, అనువాదకులతో కలిసి పని చేస్తుంది. PARI ద్వారా ప్రచురితమైన పాఠ్యం, వీడియో, ఆడియో, పరిశోధన నివేదికల ప్రచురణకు డెస్క్ మద్దతునిస్తుంది, నిర్వహిస్తుంది కూడా.

Other stories by PARI Desk
Translator : Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.

Other stories by Sudhamayi Sattenapalli