వారణాసిలో పోలింగ్ రోజున సల్మాకు రెండు వరసలు కనిపించాయి - ఒకటి పురుషుల కోసం, రెండోది మహిళల కోసం. బంగాలీ టోలా పోలింగ్ బూత్‌ను ప్రసిద్ధ విశ్వనాథ ఆలయానికి దారితీసే ఒక సన్నని సందులో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటుచేశారు.

ఆ 25 ఏళ్ళ ట్రాన్స్ మహిళ మహిళల వరసలో నిల్చున్నారు, కానీ " ఆంఖేఁ బడీ హో గయీ థీ సబ్‌కీ [అందరూ గుడ్లప్పగించి చూశారు]. మగవాళ్ళు నన్ను చూడనట్లుగా నటిస్తోంటే, మహిళల వరసలో చివరిగా నిల్చొన్న నన్ను చూసి ఆడవాళ్ళు ఇకిలించటం, గుసగుసలుపోవటం మొదలెట్టారు," అందామె.

కానీ సల్మా ఇవేమీ పట్టించుకోలేదు. "ఏమైతేనేం, నేను లోపలికి వెళ్ళాను," అందామె. "నాకు హక్కు ఉంది [వోటేయడానికి]. ఈరోజున మాకు అవసరమైన మార్పును తీసుకొచ్చేందుకు నేను ఆ హక్కును వినియోగించుకున్నాను."

భారతదేశంలో 48,044 మంది "మూడవ జెండర్‌కు చెందిన వోటర్లు" ఉన్నారని భారత ఎన్నికల సంఘం డేటా చూపిస్తోంది. వారి సంఖ్య కొద్దిపాటిదే అయినప్పటికీ, ఒక ట్రాన్స్ వ్యక్తిగా వోటరు గుర్తింపు కార్డును సంపాదించడం అన్నివేళలా అంత సులభం కాదు. వారణాసిలో సుమారు 300 మంది ట్రాన్స్ జనం ఉన్నారని, వారికి వోటరు గుర్తింపు కార్డులను సంపాదించడం ఒక పోరాటమయిందని ఫ్రిజ్మాటిక్ అనే ప్రభుత్వేతర సంస్థ వ్యవస్థాపక సంచాలకులు నీతి చెప్పారు. "మేం సుమారు 50 మంది ట్రాన్స్ వ్యక్తులకు వోటర్ ఐడిలు సంపాదించాం. కానీ ఎన్నికల సంఘం ధృవీకరణ కోసం ఇళ్ళకు వెళ్ళడాన్ని తప్పనిసరి చేసింది. వారి జెండర్‌ను ధృవీకరించడానికి ప్రజలు తమ ఇళ్ళకు రావడం ఇష్టంలేని ఈ సముదాయంలోని చాలామంది సభ్యులకు ఇది సమస్యగా మారింది,” అని చెప్పారామె.

అయితే సల్మాకు తన వోటర్ గుర్తింపు కార్డును పొందడంలో ఎలాంటి అడ్డంకులు ఎదురుకాలేదు. "నేను నా కుటుంబంతో గానీ, నా గుర్తింపు తెలియనివారితో గానీ కలిసి జీవించటంలేదు," అని ఆమె చెప్పింది.

PHOTO • Jigyasa Mishra

సల్మా జూన్ 1, 2024న వారణాసిలోని బంగాలీ టోలా పరిసరాల్లోని పోలింగ్ బూత్‌లో (ఎడమ) ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు, పురుషులకూ మహిళలకూ వేర్వేరు వరసలు ఉన్నాయని గుర్తించింది. ట్రాన్స్ మహిళ, ఒక  చిన్న వ్యాపారానికి యజమాని అయిన సల్మా, మహిళల వరసలో చేరినప్పుడు అందరూ ఆమెవైపు కళ్ళప్పగించి చూశారు. కానీ సల్మా లోపలికి వెళ్ళి తన ఓటు (కుడి) వేసింది. 'నేనేమీ పట్టించుకోలేదు,' చెప్పిందామె

5వ తరగతి వరకు చదివిన తర్వాత ఆమె నడకనూ, మాట్లాడే విధానాన్నీ ఆమె సహవిద్యార్థులు ఎగతాళిచేస్తుండటంతో సల్మా బలవంతంగా బడి మానేయవలసి వచ్చింది. ప్రస్తుతం సల్మా తన సోదరుడితో కలిసి ఉంటోంది. ఆమె బనారసీ చీరలను విక్రయించే చిన్న వ్యాపారాన్ని చేస్తూ, దీని ద్వారా నెలకు దాదాపు రూ. 10,000 సంపాదిస్తోంది. సల్మా స్థానిక దుకాణాల నుంచి చీరలను కొనుగోలు చేసి ఇతర నగరాల్లోని కొనుగోలుదారులకు పంపుతుంటుంది.

వారణాసిలో షమా అనే ట్రాన్స్ మహిళ గత ఆరేళ్ళుగా సెక్స్ వర్కర్‌గా జీవిస్తోంది. “నేను బలియా జిల్లాలోని ఒక గ్రామంలో పుట్టి పెరిగాను. కానీ నా జెండర్ కారణంగా అక్కడ విషయాలు చాలా క్లిష్టంగా మారాయి,” అని ఆమె వివరించింది. “ఇరుగుపొరుగువారు నా తల్లిదండ్రులను వేధిస్తారు. మా నాన్న నన్నూ అమ్మనూ మామూలుగా లేమని తిట్టేవాడు. జెండర్ లేని నాలాంటి వ్యక్తికి జన్మనిచ్చినందుకు నా తల్లిని నిందించేవాడు. అందుకని నేను నాకు బాగా దగ్గరగా ఉండే నగరమైన వారణాసికి వచ్చాను.” పోలింగ్ రోజున ఆమె చాలా ముందుగానే బూత్‌కు చేరుకుంది. "నేను గుంపును, జనం చూపులను తప్పించుకోవాలనుకున్నాను," అని షమా PARIకి చెప్పింది

ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల ( హక్కుల పరిరక్షణ ) చట్టం, ట్రాన్స్ వ్యక్తులకు రక్షణ, భద్రత, పునరావాసం కల్పించాలని, అలాంటి వ్యక్తుల అవసరాలను తీర్చడం కోసం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను నిర్దేశిస్తున్నప్పటికీ, ప్రత్యేకించి ట్రాన్స్‌ వ్యక్తులకు నగరం ఎల్లప్పుడూ సురక్షితమైన ప్రదేశమేమీ కాదు. ప్రతి నెలా ఐదు నుంచి ఏడు వేధింపుల కేసులను చూస్తామని నీతి చెప్తున్నారు

వేధింపులను ఎదుర్కొన్న సల్మా, తాను పనిచేసిన బ్యూటీ పార్లర్‌ యజమాని నుంచి లైంగికంగా వేధింపులకు గురైన అర్చన వంటి ట్రాన్స్ మహిళల ఘోరమైన అనుభవాలను పంచుకోవడానికి PARI వారితో మాట్లాడింది. ఫిర్యాదు చేయడానికి అర్చన పోలీస్ స్టేషన్‌కు వెళ్ళింది, కానీ అక్కడి అధికారులు ఆమెను నమ్మకపోగా ఆమెను బెదిరించి అవమానించారు. వాళ్ళ ప్రవర్తనకి అర్చన ఏమీ ఆశ్చర్యపోలేదు. ఆమె 2024లో IIT-BHUలో ఒక మహిళా విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారాన్ని గురించి ప్రస్తావిస్తూ, “మహిళలకే భద్రత లేనప్పుడు, ట్రాన్స్ మహిళ మాత్రం ఎలా సురక్షితంగా ఉంటుంది?” అని ప్రశ్నించింది.

PHOTO • Jigyasa Mishra
PHOTO • Abhishek K. Sharma

ఎడమ: ప్రభుత్వ ఉద్యోగాలలో ట్రాన్స్ వ్యక్తులకు రిజర్వేషన్ ఉండాలని సల్మా అంటోంది. కుడి: ఎన్నికలకు ముందు తమ డిమాండ్లను వినిపించేందుకు ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు ఒక బహిరంగ ర్యాలీలో పాల్గొన్నారు. ఎడమ వేపున ఉన్నది సల్మా (మట్టిరంగు సల్వార్ కమీజ్)

*****

అత్యంత ప్రాధాన్యం కలిగిన వారణాసి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన అజయ్ రాయ్‌పై 1.5 లక్షల వోట్ల తేడాతో గెలుపొందాడు.

"ప్రధానమంత్రి మా నగర పార్లమెంటు సభ్యునిగా పదవీ బాధ్యతలు స్వీకరించి పదేళ్ళయింది, కానీ ఆయన ఎప్పుడైనా మా గురించి ఆలోచించాడా?" అని సల్మా అడుగుతోంది. ఇప్పుడామె భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతోంది. “అంతా చీకటిగా కనిపిస్తోంది. కానీ మేం ఈ ప్రభుత్వంపై దృష్టి పెడుతున్నాం,” అని ఆమె చెప్పింది.

షమా, అర్చనలు కూడా అంగీకరించారు. ఈ ఇద్దరు ట్రాన్స్ మహిళలు 2019లో నరేంద్ర మోదీకి ఓటు వేశారు, కానీ 2024లో వారు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఈసారి, "నేను మార్పు కోసం ఓటు వేశాను," అని షమా చెప్పింది.

సెక్స్ వర్క్ ద్వారా తనను తాను పోషించుకునే 25 ఏళ్ళ కళాశాల విద్యార్థి అర్చన ఇలా అంటోంది, “మోదీ ప్రసంగాలు నన్ను ఆకట్టుకున్నాయి. అయితే, అతను టెలిప్రాంప్టర్ ద్వారా వచ్చేది మాత్రమే చదువుతున్నాడని ఇప్పుడు నాకు తెలుసు."

చట్టంలో మార్పుల గురించీ, కాగితాల మీద తమకు హామీ ఇచ్చిన హక్కుల గురించి కూడా వాళ్ళు ఇలాగే భావిస్తున్నారు.

PHOTO • Jigyasa Mishra

సల్మాతో సహా PARI మాట్లాడిన ఇతర ట్రాన్స్ మహిళలు ప్రభుత్వం వలన నిరాశకు లోనవుతున్నట్లు, భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ మాట్లాడారు. 'ఇదంతా చీకటిగా కనిపిస్తోంది, కానీ మేం ఈ ప్రభుత్వాన్ని గమనిస్తున్నాం,' అని సల్మా చెప్పింది

"పదేళ్ళ క్రితం వారు కనీసంగా పనిచేసి, మమ్మల్ని మూడవ జెండర్‌గా అంగీకరించి, తద్వారా దానిని ఒక చారిత్రాత్మక తీర్పు అని పిలిచారు. కానీ అది కూడా కాగితంపై మాత్రమే," అని షమా చెప్పింది. "ప్రభుత్వానికి ఇతర మార్గదర్శకాలను ఇవ్వడంతో పాటు, ట్రాన్స్‌జెండర్లను మూడవ జెండర్‌గా గుర్తిస్తూ" సుప్రీం కోర్టు 2014లో ఇచ్చిన తీర్పు ను షమా ఇక్కడ ప్రస్తావిస్తోంది. ఈ ఇతర మార్గదర్శకాలలో విద్యా సంస్థలలో, ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లతో పాటు సముదాయం కోసం సామాజిక సంక్షేమ పథకాలను రూపొందించడానికి చర్యలు తీసుకోవడం వంటివి ఉన్నాయి.

కేంద్ర ప్రభుత్వం ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల ( హక్కుల పరిరక్షణ ) చట్టాన్ని 2019లో ఆమోదించింది. ఇది విద్య, ఉద్యోగాలలో వివక్ష లేకుండా ఉండేలా, బాధ్యతపడేలా హామీ ఇస్తుంది; విద్యా సంస్థలలో ప్రవేశాలకు, ప్రభుత్వ ఉద్యోగాలలో ఎటువంటి రిజర్వేషన్లను అందించలేదు.

"ఒక ప్యూన్ నుండి అధికారి వరకు - అక్కడ ఉండే ప్రతి ఉద్యోగానికి ప్రభుత్వం మాకు రిజర్వేషన్లు ఇవ్వాలని మేం కోరుకుంటున్నాం," అని సల్మా చెప్పింది.

(నీతి, సల్మాల పేర్లు మినహా ఈ కథనంలోని మిగిలివారి పేర్లను వారి అభ్యర్థన మేరకు మార్చాము)

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Jigyasa Mishra

జిగ్యసా మిశ్రా ఉత్తర ప్రదేశ్ లోని చిత్రకూట్ లో ఒక స్వతంత్ర జర్నలిస్ట్.

Other stories by Jigyasa Mishra
Illustration : Jigyasa Mishra

జిగ్యసా మిశ్రా ఉత్తర ప్రదేశ్ లోని చిత్రకూట్ లో ఒక స్వతంత్ర జర్నలిస్ట్.

Other stories by Jigyasa Mishra
Photographs : Abhishek K. Sharma

అభిషేక్ కె. శర్మ వారణాసికి చెందిన ఫోటో, వీడియో జర్నలిస్ట్. సామాజిక, పర్యావరణ సమస్యలపై కథనాలను అందించే ఈయన అనేక దేశీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలతో ఫ్రీలాన్సర్‌గా పనిచేశారు.

Other stories by Abhishek K. Sharma
Editor : Sarbajaya Bhattacharya

సర్వజయ భట్టాచార్య PARIలో సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్. ఆమె బంగ్లా భాషలో మంచి అనుభవమున్న అనువాదకురాలు. కొల్‌కతాకు చెందిన ఈమెకు నగర చరిత్ర పట్ల, యాత్రా సాహిత్యం పట్ల ఆసక్తి ఉంది.

Other stories by Sarbajaya Bhattacharya
Translator : Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.

Other stories by Sudhamayi Sattenapalli