వీడియోను చూడండి: మారీ కీ మస్జిద్ ఔర్ మజార్ / మారీలోని మసీదు, గోరీ

ముగ్గురు యువకులు ఓ నిర్మాణ ప్రదేశంలో పని ముగించుకొని మారీలోని తమ ఇళ్ళకు తిరిగి వస్తున్నారు. "ఇది 15 ఏళ్ళ క్రితం జరిగింది. మేం మా గ్రామంలో నిర్జనంగా ఉండే మసీదును దాటుతూ, దాని లోపల ఏముందో చూడాలని అనుకున్నాం. మాకు చాలా ఆసక్తిగా ఉండింది," అని వాళ్ళలో ఒకరైన అజయ్ పాశ్వాన్ గుర్తు చేసుకున్నారు.

మసీదు నేలంతా నాచు పరచుకుని ఉంది, ఆ నిర్మాణం నిండా పొదలు పెరిగివున్నాయి.

"అందర్ గయే తో హమ్ లోగోఁ కా మన్ బదల్ గయా [మేం లోపలికి వెళ్ళగానే, మా మనసు మారిపోయింది]," అని 33 ఏళ్ళ ఆ రోజువారీ కూలీ అన్నారు. "బహుశా అల్లానే మమ్మల్ని లోపలికి పంపాడేమో."

ఆ ముగ్గురూ - అజయ్ పాశ్వాన్, బఖోరీ బింద్, గౌతమ్ ప్రసాద్ - దానిని శుభ్రం చేయాలని నిర్ణయించుకున్నారు. “లోపల అడవిలాగా పెరిగిన పొదలను, మొక్కలను శుభ్రంగా కొట్టేశాం. మసీదుకు రంగులు వేశాం. మసీదుకు ముందు పెద్ద వేదికను నిర్మించాం,” అని అజయ్ చెప్పారు. వాళ్ళు సాయంసంధ్యా దీపం వెలిగించడం కూడా ప్రారంభించారు.

వాళ్ళు ముగ్గురూ మసీదులో ఒక సౌండ్ సిస్టమ్‌ను అమర్చి, మసీదు గుమ్మటం మీద ఒక లౌడ్‌స్పీకర్‌ను వేలాడదీశారు. "సౌండ్ సిస్టమ్ ద్వారా మేం ఆజాన్ వినిపించాలనుకున్నాం," అని అజయ్ చెప్పారు. ఆ రోజు నుంచి బిహార్‌ లోని నలంద జిల్లాలో ఉన్న మారీ అనే ఆ గ్రామంలో రోజుకు ఐదుసార్లు ఆజాన్ (ముస్లిమ్‌లకు ప్రార్థన చేయాలనే పిలుపు) వినిపించడం ప్రారంభమైంది.

PHOTO • Umesh Kumar Ray
PHOTO • Shreya Katyayini

అజయ్ పాశ్వాన్ (ఎడమ) మరో ఇద్దరు స్నేహితులతో కలిసి బిహార్‌లోని నలంద జిల్లాలో ఉన్న స్వగ్రామం మారీలో మసీదు నిర్వహణ బాధ్యత తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. శతాబ్దాలుగా, గ్రామంలో హిందువులు జరుపుకునే ఏ వేడుకైనా ఆ మసీదు, గోరీ దగ్గర పూజలు చేయడంతోనే ప్రారంభమవుతుందని ఆ గ్రామంలోని పెద్దలు (కుడి) చెప్పారు

మారీ గ్రామంలో ముస్లిములు లేరు. కానీ ఇక్కడ మసీదు , మజార్ (గోరీ) సంరక్షణ, నిర్వహణ బాధ్యతను అజయ్, బఖోరి, గౌతమ్ అనే ముగ్గురు హిందువులే తీసుకున్నారు.

"మా విశ్వాసం ఈ మసీదు , మజార్‌ లతో ముడిపడింది, మేమే వాటిని సంరక్షిస్తాం," అని జానకి పండిట్ చెప్పారు. "65 ఏళ్ళ క్రితం నాకు పెళ్ళయినప్పుడు, నేనూ మొదట మసీదు ముందు తల వంచి, ఆ తర్వాత మా [హిందూ] దేవతలను పూజించాను," అని 82 ఏళ్ళ ఆ వృద్ధుడు తెలిపారు.

తెలుపు, ఆకుపచ్చ రంగులు వేసివుండే మసీదు, ప్రధాన రహదారి నుంచే కనిపిస్తుంటుంది; ప్రతి వర్షాకాలంలో దాని రంగులు వెలిసిపోతాయి. మసీదు, గోరీల చుట్టూ నాలుగు అడుగుల ఎత్తైన సరిహద్దు గోడ ఉంది. పెద్దగా, పాతగా ఉన్న చెక్క తలుపును దాటి మసీదు ప్రాంగణంలోకి ప్రవేశిస్తే, లోపల ఖురాన్ హిందీ అనువాదం, ప్రార్థనా పద్ధతులను వివరించే సచ్చీ నమాజ్ అనే పుస్తకం ఉంటాయి.

"గ్రామానికి చెందిన వరుడు ముందు మసీదు , మజార్‌ లకు నమస్కరించిన తర్వాత మాత్రమే మా హిందూ దేవతలకు నమస్కరిస్తాడు," అని ప్రభుత్వ పాఠశాల విశ్రాంత ఉపాధ్యాయుడైన పండిట్ చెప్పారు. బయటి నుంచి ఏవైనా పెళ్ళి ఊరేగింపులు గ్రామానికి వచ్చినప్పుడు కూడా, “వరుడిని మొదట మసీదు కు తీసుకువెళతారు. అక్కడ పూజలు చేసిన తర్వాత ఆలయాలకు తీసుకువస్తాం. ఇది తప్పనిసరిగా పాటించే ఆచారం." స్థానికులు మసీదులోని గోరీ దగ్గర ప్రార్థనలు చేస్తారు. తమ కోరికలు నెరవేరినవాళ్ళు దానిపై చాదర్ పరుస్తారు.

PHOTO • Shreya Katyayini
PHOTO • Umesh Kumar Ray

మారీలోని మసీదును 15 ఏళ్ళ క్రితం అజయ్ పాశ్వాన్, బఖోరీ బింద్, గౌతమ్ ప్రసాద్ అనే ముగ్గురు యువకులు పునరుద్ధరించారు. వాళ్ళు మసీదు చుట్టు, లోపల పెరిగిన పొదలను, చెట్లను కొట్టేసి శుభ్రంచేసి, మసీదుకు రంగులు వేసి, దాని ముందు ఒక పెద్ద వేదికను నిర్మించి, సాయంసంధ్యా దీపాన్ని వెలిగించడం ప్రారంభించారు. మసీదు లోపల ఖురాన్ హిందీ అనువాదం (కుడి), నమాజ్ (రోజువారీ ప్రార్థనలు) ఎలా చేయాలో చెప్పే పుస్తకం ఉన్నాయి

PHOTO • Shreya Katyayini
PHOTO • Shreya Katyayini

ఈ గోరీ (ఎడమ) సుమారు మూడు శతాబ్దాల క్రితం అరేబియా నుంచి వచ్చిన సూఫీ ఫకీరైన హజ్రత్ ఇస్మాయిల్‌దని భావిస్తున్నారు. 'మా విశ్వాసం ఈ మసీదు, మజార్ [గోరీ]లతో ముడిపడి ఉంది, అందుకే మేం వాటిని సంరక్షిస్తాం,' అని విశ్రాంత పాఠశాల ఉపాధ్యాయులు జానకి పండిట్ (కుడి) అన్నారు

యాభై ఏళ్ళ క్రితం, మారీలో ముస్లిమ్ సముదాయానికి చెందిన కొంతమంది జనం ఉండేవారు. 1981లో బిహార్ షరీఫ్‌లో జరిగిన మత హింసాకాండ తర్వాత వారు ఆ గ్రామాన్ని హుటాహుటిన వదిలి వెళ్ళిపోయారు. ఆ సంవత్సరం ఏప్రిల్‌లో ఒక టాడీ (కల్లు) దుకాణం దగ్గర హిందువులు, ముస్లిముల మధ్య ఏర్పడిన వివాదం వలన ఆ కలహాలు ప్రారంభమయ్యాయి. ఆ అల్లర్లలో 80 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఆ అల్లర్లు మారీని తాకకపోయినా, ఈ ప్రాంతంలోని ఉద్రిక్త వాతావరణం గ్రామంలోని ముస్లిములలో అలజడిని సృష్టించింది. వాళ్ళు మెల్లమెల్లగా ఆ ఊరిని వదిలి, దగ్గరలో ముస్లిములు ఎక్కువగా ఉండే పట్టణాలకు, గ్రామాలకు వెళ్ళిపోయారు.

అప్పటికింకా పుట్టని అజయ్, “అప్పుడు ముస్లిములు గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారని జనం చెబుతారు. వాళ్ళు ఊరు ఎందుకు వదలి వెళ్ళిపోయారో, ఇక్కడేం జరిగిందో నాకెవరూ చెప్పలేదు. కానీ ఏదైతే జరిగిందో, అది మంచిదైతే కాదు,” అన్నారు, ముస్లిములు గ్రామాన్ని వదిలిపోవడం గురించి ప్రస్తావిస్తూ.

గతంలో ఆ గ్రామంలో నివసించిన షహబుద్దీన్ అన్సారీ దీనితో ఏకీభవించారు: " వో ఏక్ అంధడ్ థా, జిస్‌నే హమేషా కే లియే సబ్‌కుచ్ బదల్ దియా [అది ఒక తుఫాను, అది ప్రతిదాన్నీ శాశ్వతంగా మార్చేసింది]."

1981లో మారీ నుంచి వెళ్ళిపోయిన దాదాపు 20 ముస్లిముల కుటుంబాలలో అన్సారీలు కూడా ఉన్నారు. “మా నాన్న ముస్లిమ్ అన్సారీ ఆ సమయంలో బీడీలు చుట్టేవాడు. అల్లర్లు చెలరేగిన రోజున ఆయన బీడీ సామాగ్రి తీసుకురావడానికి బిహార్ షరీఫ్ వెళ్ళాడు. ఆయన తిరిగి వచ్చి, జరిగిన దాని గురించి మారీలోని ముస్లిమ్ కుటుంబాలకు తెలిపాడు,” అని షహబుద్దీన్ చెప్పారు.

PHOTO • Umesh Kumar Ray
PHOTO • Umesh Kumar Ray

మారీలో అజయ్ (ఎడమ), షహబుద్దీన్ అన్సారీ (కుడి). తాను పోస్ట్‌మ్యాన్ ఉద్యోగం పొందడానికి ఒక హిందువు తనకు ఎలా సహాయం చేశాడో అన్సారీ గుర్తు చేసుకున్నారు. 1981లో ముస్లిములు గ్రామాన్ని ఖాళీ చేయడానికి కారణమైన అల్లర్లను గుర్తు చేసుకుంటూ అన్సారీ, 'నేను మారీ గ్రామంలో పోస్ట్‌మ్యాన్‌గా పనిచేస్తున్నందువల్ల, నేనక్కడ ఓ హిందూ కుటుంబం ఇంట్లో నివసించడం ప్రారంభించాను, కానీ మా అమ్మానాన్నలను మాత్రం బిహార్ షరీఫ్‌కు మార్చాను. అది అన్నిటినీ శాశ్వతంగా మార్చేసిన తుఫాను' అన్నారు

అప్పుడు తన ఇరవైల వయసులో ఉన్న షహాబుద్దీన్ గ్రామంలో పోస్ట్‌మ్యాన్‌గా పనిచేసేవాడు. తన కుటుంబం మారీ నుంచి వెళ్ళిపోయాక, ఆయన బిహార్ షరీఫ్ పట్టణంలో కిరాణా దుకాణాన్ని నడపడం ప్రారంభించారు. వాళ్ళు హఠాత్తుగా గ్రామం నుంచి వెళ్ళిపోయినా, “గ్రామంలో వివక్ష ఉండేది కాదు. అప్పటికి చాలాకాలంగా అందరం కలిసిమెలిసి సామరస్యంగా జీవిస్తుండేవాళ్ళం. ఎవరికీ ఎవరితోనూ ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు," అని షహబుద్దీన్ తెలిపారు.

మారీలో హిందువులకు, ముస్లిములకు మధ్య శత్రుత్వం లేదని ఆయన పునరుద్ఘాటించాడు. “నేను మారీని సందర్శించినప్పుడు, చాలా హిందూ కుటుంబాలు వాళ్ళ ఇళ్ళల్లో భోజనం చేయాలని పట్టుబట్టారు. నన్ను భోజనం చేయమని అడగని ఇల్లు ఒక్కటీ లేదు,” అంటూ ఆ 62 ఏళ్ళ వృద్ధుడు మసీదు, మజార్‌ లను సంరక్షిస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు.

బేన్ బ్లాక్‌లోని మారీ గ్రామంలో సుమారు 3,307 మంది జనాభా ఉన్నారు ( 2011 జనగణన ). వీరిలో చాలామంది వెనుకబడిన తరగతులకు చెందినవారు, దళితులు. మసీదు సంరక్షణ చూసుకుంటున్న యువకులలో అజయ్ దళితుడు, బఖోరీ బింద్ ఇబిసి (అత్యంత వెనుకబడిన తరగతి)కి, గౌతమ్ ప్రసాద్ ఒబిసి (ఇతర వెనుకబడిన తరగతి)కి చెందినవారు.

" గంగా-జముని తెహజీబ్ [సమ్మిళిత సంస్కృతి]కి ఇదో సజీవ ఉదాహరణ," అని మొహమ్మద్ ఖలీద్ ఆలమ్ భుట్టో చెప్పారు. గతంలో ఆ గ్రామంలోనే ఉండి, ఇప్పుడు సమీపంలోని బిహార్ షరీఫ్ పట్టణానికి వెళ్ళినవారిలో 60 ఏళ్ళ ఈయన కూడా ఒకరు. "ఈ మసీదు 200 సంవత్సరాల కంటే పురాతనమైనది, దానికి అనుసంధానంగా ఉన్న ఆ గోరీ ఇంకా పురాతనమైంది," అని ఆయన అభిప్రాయపడ్డారు.

“ఈ గోరీ అరేబియా నుండి మారీ గ్రామానికి వచ్చినట్లు భావిస్తున్న హజ్రత్ ఇస్మాయిల్ అనే ఒక సూఫీ ఫకీరుది. ఆయన రాకకు ముందు వరదలు, అగ్నిప్రమాదాల్లాంటి ప్రకృతి వైపరీత్యాల వలన ఈ గ్రామం చాలాసార్లు నాశనమైందని నమ్ముతారు. కానీ ఆయన ఇక్కడ నివసించడం ప్రారంభించాక, ఆ విపత్తులన్నీ ఆగిపోయాయి. ఆయన మరణించాక, ఇక్కడ ఆయన గోరీని నిర్మించి, గ్రామంలోని హిందువులు పూజలు చేయడం ప్రారంభించారు,” అని ఆయన చెప్పారు. "ఆ సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది."

PHOTO • Umesh Kumar Ray
PHOTO • Shreya Katyayini

అజయ్ (ఎడమ), అతని స్నేహితులు ఆజాన్ చేయడానికి ఒక వ్యక్తిని నియమించారు. వాళ్ళంతా కలిసి అతనికి తాము పనిచేసి సంపాదించిన ఆదాయంలోంచి నెలకు రూ.8,000 జీతంగా చెల్లిస్తున్నారు. కుడి: 'గంగా-జముని తెహజీబ్ [సమ్మేళన సంస్కృతి]కి ఇది ఉత్తమ ఉదాహరణ' అని గతంలో మారీలో నివసించిన మొహమ్మద్ ఖలీద్ ఆలమ్ భుట్టో చెప్పారు

మూడేళ్ళ క్రితం కోవిడ్-19 విజృంభణ, దాని వెంటనే వచ్చిపడిన లాక్‌డౌన్‌ల తర్వాత అజయ్, బఖోరి, గౌతమ్‌లకు మారీలో పని దొరకడం కష్టం కావడంతో వాళ్ళు వేర్వేరు ప్రాంతాలకు వెళ్ళిపోయారు. గౌతమ్ ఇస్లామ్‌పుర్‌లో (అక్కడికి 35 కిలోమీటర్ల దూరం) కోచింగ్ సెంటర్‌ను నడుపుతున్నారు. బఖోరి చెన్నైలో తాపీపని చేస్తున్నారు. అజయ్ బిహార్ షరీఫ్ పట్టణానికి మారారు.

ముగ్గురూ వెళ్ళిపోవడం మసీదు నిర్వహణపై ప్రభావం చూపింది. మసీదులో ఆజాన్ ఆగిపోయిందని, అందుకే ఆజాన్‌ ను నిర్వహించడానికి ఒక మువాజిన్‌ ని నియమించామని ఫిబ్రవరి 2024లో, అజయ్ చెప్పారు. “రోజుకు ఐదుసార్లు ఆజాన్ చేయడం మువాజిన్‌ పని. మేం [ముగ్గురు] అతనికి నెలకు రూ.8,000 జీతం చెల్లిస్తున్నాం. అతను ఉండడానికి గ్రామంలో ఒక గదిని కూడా ఏర్పాటు చేశాం,” అని అజయ్ చెప్పారు.

తాను జీవించి ఉన్నంత వరకు మసీదును, గోరీని కాపాడాలని అజయ్ నిర్ణయించుకున్నారు. “ మర్నే కే బాద్ కోయి కుచ్ కర్ సక్తా హై. జబ్ తక్ హమ్ జిందా హైఁ, మస్జిద్ కో కిసీ కో కుచ్ కర్నే నహీ దేంగే [నేను చనిపోయాకే ఎవరైనా ఏదైనా చేయగలరు. నేను బతికి ఉన్నంతవరకు, మసీదుకు ఎవర్నీ ఏమీ [హాని] చేయనివ్వను.’’

ఈ కథనానికి బిహార్ రాష్ట్రంలో అణగారిన ప్రజల పోరాటాలకు చేయూతనందించిన ఒక ట్రేడ్ యూనియన్ నాయకుడి జ్ఞాపకార్థం ఇచ్చిన ఫెలోషిప్ మద్దతు ఉంది.

అనువాదం: రవి కృష్ణ

Text : Umesh Kumar Ray

ఉమేశ్ కుమార్ రే 2022 PARI ఫెలో, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. బిహార్‌లో నివాసముండే ఈయన అట్టడుగు వర్గాల కథనాలను నివేదిస్తారు.

Other stories by Umesh Kumar Ray
Photos and Video : Shreya Katyayini

శ్రేయా కాత్యాయిని పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో సీనియర్ వీడియో ఎడిటర్, చిత్ర నిర్మాత కూడా. ఆమె PARI కోసం బొమ్మలు కూడా గీస్తుంటారు.

Other stories by Shreya Katyayini
Editor : Priti David

ప్రీతి డేవిడ్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో జర్నలిస్ట్, PARI ఎడ్యుకేషన్ సంపాదకురాలు. ఆమె గ్రామీణ సమస్యలను తరగతి గదిలోకీ, పాఠ్యాంశాల్లోకీ తీసుకురావడానికి అధ్యాపకులతోనూ; మన కాలపు సమస్యలను డాక్యుమెంట్ చేయడానికి యువతతోనూ కలిసి పనిచేస్తున్నారు.

Other stories by Priti David
Translator : Ravi Krishna

రవి కృష్ణ ఫ్రీలాన్స్ అనువాదకులు. జార్జ్ ఆర్వెల్ రాసిన 'యానిమల్ ఫామ్' తెలుగు అనువాదం ‘చతుర’లోనూ; పలు అనువాదాలు, గల్పికలు ‘విపుల’, ‘మాతృక’లలోనూ ప్రచురితమయ్యాయి.

Other stories by Ravi Krishna