నేను శబర్‌పారా చేరేసరికి రాత్రయింది. బాందోయాన్ తాలూకా లోని కూఁచియా గ్రామం అంచున, పదకొండు ఇళ్ళు రహదారికి దూరంగా ఉన్నాయి. అది శబర్ (సబర్ అని కూడా పిలుస్తారు) సమూహానికి చెందిన చిన్న మట్టితో కట్టిన నివాసాల సమూహం.

సగం చీకటిలో చిక్కుకున్న వారి ఇళ్ళు, దుయార్సిని కొండలతో కలిసిపోతున్నకొద్దీ మరింత దట్టంగా మారిపోతోన్న అడవికి ప్రారంభ బిందువుగా ఉన్నాయి. సాల , సెగున్ (టేకు), పియాల్ (చిరోంజీ), పలాశ్ (మోదుగు) చెట్లతో కూడిన ఈ అడవి పండ్లు, పువ్వులు, కూరగాయల వంటి ఆహారానికీ, జీవనోపాధికీ మంచి వనరు.

శబర సముదాయాన్ని పశ్చిమ బెంగాల్‌లో డి-నోటిఫైడ్ (DNT) తెగగానే కాకుండా, షెడ్యూల్డ్ తెగగా కూడా జాబితా చేశారు. వలసవాద బ్రిటిష్ ప్రభుత్వం క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ (CTA) ద్వారా 'నేరస్థులు'గా ముద్రవేసిన అనేక తెగలలో వీరు కూడా ఉన్నారు. 1952లో భారత ప్రభుత్వం ఈ చట్టాన్ని రద్దు చేయటంతో ఆ తెగలను ఇప్పుడు డి-నోటిఫైడ్ తెగలు (DNTs) లేదా సంచార తెగలు (NTs)గా సూచిస్తున్నారు.

ఈనాటికి కూడా శబర్‌పారా (సబర్‌పారా అని కూడా పిలుస్తారు)లోని ఈ కుటుంబాలు అడవిపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. వారిలో 26 ఏళ్ళ నేపాలీ శబర్ ఒకరు. ఆమె తన భర్త ఘల్టూ, ఇద్దరు కుమార్తెలు, పసివాడైన కొడుకుతో కలిసి పురూలియా జిల్లాలోని తన మట్టి ఇంట్లో నివసిస్తోంది. అందరికంటే పెద్దదైన తొమ్మిదేళ్ళ కుమార్తె ఇప్పటికీ 1వ తరగతిలోనే ఉంది. రెండవ సంతానం తప్పటడుగుల చంటిబిడ్డ, అందరికంటే చిన్నది తల్లి పాలు తాగే పసిబిడ్డ. ఈ కుటుంబ సంపాదన మొత్తం సాల ( షోరియా రోబస్టా ) ఆకులపై ఆధారపడి ఉంటుంది.

PHOTO • Umesh Solanki

తన ఇంటి బయట, పక్కనే కూర్చొనివున్న చిన్నకూతురు హేమమాలిని, కొడుకు సుర్‌దేవ్‌లతో నేపాలీ సబర్ (కుడి). సన్నటి వెదురు పుల్లలతో సాల పత్రాలను కలిపికుట్టి విస్తరాకులు సిద్ధంచేస్తోన్న నేపాలీ

ఈ గ్రామంలో నివాసముండే 11 కుటుంబాలలోని ఏడు కుటుంబాలవారు సాల చెట్ల ఆకులతో విస్తరాకులు కుట్టి అమ్ముతారు. ఆ చెట్లన్నీ దుయార్సిని అడవికి చెందినవే. ఈ అడవి గ్రామానికి సరిహద్దులుగా ఉండే కొండల వరకూ సాగుతుంది. " నౌ బజే యహాఁ సే జాతే హై. ఏక్ ఘంటా లగ్తా హై దువార్సిని పహుఁచ్‌నే మేఁ [మేం ఇక్కడి నుంచి ఉదయం తొమ్మిది గంటలకు బయలుదేరుతాం. దువార్సిని చేరుకోవటానికి ఒక గంట సమయం పడుతుంది]," చెప్పింది నేపాలీ.

ఆ దంపతులు అడవికి వెళ్ళటానికి ముందు, ఆహారం తయారుచేసుకోవడానికి తన ఇంటి ముందరి ఆవరణలో నేపాలీ పనిలో మునిగివుంటుంది. భర్తకూ పిల్లలకూ తిండి పెట్టాలి, పెద్ద కూతురిని బడికి పంపించాలి, రెండవ సంతానం రక్షణలో పసిబిడ్డను ఉంచాలి. చుట్టుపక్కల ఇళ్ళవారు ఎవరైనా ఇంటిదగ్గరే ఉంటే, వాళ్ళు ఈ చిన్నపిల్లల మీద ఒక కన్నేసి ఉంచుతారు.

దుయార్సిని అడవిని చేరిన వెంటనే ఈ భార్యాభర్తలు పని మొదలెడతారు. ఘల్టూ (33) చెట్టెక్కి ఒక చిన్న కత్తితో చిన్నా పెద్దా ఆకులను కత్తిరిస్తారు. ఈలోపు చుట్టూ ఉన్న చెట్ల నుంచి తనకు సులభంగా అందే ఆకులన్నీ నేపాలీ కోస్తుంది. " బారా బజే తక్ పత్తే తోడ్‌తే హై. దో తీన్ ఘంటే లగ్తే హైఁ [మధ్యాహ్నం 12 వరకూ మేం ఆకుల్ని కత్తిరించటం, కోయటం చేస్తాం. అందుకు రెండు నుంచి మూడు గంటలు పడుతుంది]," చెప్పిందామె. మధ్యాహ్నానికల్లా వాళ్ళు ఇల్లు చేరుకుంటారు.

"ఇల్లు చేరాక మళ్ళీ ఒకసారి తిండి తింటాం." ఘల్టూ ఆ తర్వాత విశ్రాంతి తీసుకుంటారు. భోజనం తర్వాత ఒక కునుకు తీయటం అతనికి చాలా ముఖ్యం, కానీ నేపాలీ ఆ పని చాలా అరుదుగా మాత్రమే చేస్తుంది. ఆకులతో విస్తర్లు కుట్టడం మొదలుపెడుతుంది. ఎనిమిది నుంచి పది సాల పత్రాలను సన్నని వెదురు పుల్లలతో కలిపి కుడితే ఒక విస్తరి తయారవుతుంది. "వెదురు కొనటానికి నేను అంగడికి వెళ్తాను. ఒక వెదురు గడ ఖరీదు 60 రూపాయలు, అంది మూడు నాలుగు నెలలు వస్తుంది. నేపాలీ వెదురును చీల్చి సన్నని పుల్లలుగా చేస్తుంది," ఘల్టూ చెప్పారు.

ఒక విస్తరిని చేయటానికి నేపాలీకి ఒకటో రెండో నిముషాలు పడుతుంది. "మేం ఒక రోజులో 200-300 ఖాలీ పత్తా తయారు చేయగలం," అంటుందామె. విస్తర్లను శబరులు ఖాలీ పత్తా లేదా థాలా అంటారు. నేపాలీ రోజులో ఎనిమిది గంటల పాటు పనిచేస్తే తన లక్ష్యాన్ని అందుకోగలుగుతుంది.

PHOTO • Umesh Solanki

'వెదురును కొనేందుకు నేను అంగడికి వెళ్ళినప్పుడు, ఒక వెదురు గడ కోసం అరవై రూపాయలు చెల్లిస్తాను. అది మాకు 3-4 నెలల పాటు వస్తుంది. వెదురు గడలను చీల్చే పని నేపాలీ చేస్తుంది,' నేపాలీ భర్త ఘల్టూ శబర్ చెప్పారు

నేపాలీ విస్తర్లు తయారుచేస్తే, ఘల్టూ వాటి అమ్మకాల పని చూసుకుంటారు.

"మాకేం పెద్దగా డబ్బులు రావు. 100 విస్తర్లకు అరవై రూపాయలా? ఒక రోజు పనికి మాకు 150 నుంచి 200 రూపాయలు వస్తాయి. ఒక మనిషి మా ఇంటికే వచ్చి వాటిని మా దగ్గర కొనుగోలు చేస్తాడు," చెప్పారు ఘల్టూ. అంటే ఒక విస్తరికి 60 నుంచి 80 పైసలు పడినట్టు. ఈ విధంగా ఇద్దరూ కలిసి రోజుకు 250 రూపాయలు సంపాదించినట్టు. ఈ సంపాదన రాష్ట్రంలో MGNREGA కింద పనిచేసే నైపుణ్యం లేని శ్రామికులకు ఇచ్చే అధ్వాన్నమైన రోజువారీ కూలీ కంటే కూడా చాలా తక్కువ.

"అతను నాకు సహాయం చేస్తాడు," ఆమె పడే కష్టాన్ని చూసి ఆశ్చర్యపోతున్న నాకు జవాబు అన్నట్టుగా భర్తను వెనకేసుకువస్తూ చెప్పింది నేపాలీ. "అతనొక కూరగాయల వ్యాపారి దగ్గర పనిచేస్తాడు. ప్రతి రోజూ కాదుగానీ, వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళి పనిచేసి ఆ రోజుకి 200 రూపాయలు తెస్తాడు. అలా వారానికి రెండు మూడు సార్లు ఉండొచ్చు," చెప్పిందామె.

"ఈ ఇల్లు నా పేరనే ఉంది," చురుగ్గా చెప్పింది నేపాలీ. కొద్ది క్షణాల విరామాన్ని ఒక పెద్ద నవ్వు అనుసరించింది. ఆ చిన్ని మట్టిగుడిసెని ప్రతిబింబిస్తూ ఆమె కళ్ళు వెలిగాయి.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Umesh Solanki

ఉమేష్ సోలంకి అహ్మదాబాద్‌కు చెందిన ఫోటోగ్రాఫర్, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్, రచయిత. ఈయన జర్నలిజంలో మాస్టర్స్ చేశారు, సంచార జీవనాన్ని ఇష్టపడతాడు.

Other stories by Umesh Solanki
Editor : Pratishtha Pandya

PARI సృజనాత్మక రచన విభాగానికి నాయకత్వం వహిస్తోన్న ప్రతిష్ఠా పాండ్య PARIలో సీనియర్ సంపాదకురాలు. ఆమె PARIభాషా బృందంలో కూడా సభ్యురాలు, గుజరాతీ కథనాలను అనువదిస్తారు, సంపాదకత్వం వహిస్తారు. ప్రతిష్ఠ గుజరాతీ, ఆంగ్ల భాషలలో కవిత్వాన్ని ప్రచురించిన కవయిత్రి.

Other stories by Pratishtha Pandya
Translator : Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.

Other stories by Sudhamayi Sattenapalli