“కొంచెం కోపాన్ని చూపించడానికి కళ్ళను కొద్దిగా పైకి లేపాలి... తీవ్రమైన కోపం చూపించేందుకు, కళ్ళు పెద్దగా చేసి, కనుబొమ్మలు పైకి లేపి ఉంచాలి. ఆనందం చూపించటం కోసం, చిరునవ్వుతో బుగ్గలను పొంగించాలి.’’

ఇలాంటి చిన్న చిన్న వివరాలపై శ్రద్ధ చూపడమే దిలీప్ పట్నాయక్‌ను ఝార్ఖండ్‌లోని సరాయకేలా ఛావ్ నృత్యంలో ఉపయోగించే ముఖాలకు తగిలించుకునే ముసుగులను తయారుచేయడంలో ప్రముఖ కళాకారుడిగా మార్చింది. "మారుముఖం అనేది పాత్రను ప్రతిబింబించాలి," అంటారు ఆయన. "సరాయకేలా మారుముఖాలు ప్రత్యేకమైనవి. ఎందుకంటే అవి నవరసాలు , అంటే తొమ్మిది రకాల భావోద్వేగాలను ప్రతిబింబిస్తాయి, మరే ఇతర ఛావ్ శైలిలో ఇది లేదు."

ఆయన పనిచేసే ప్రదేశంలో వివిధ దశలలో ఉన్న మారుముఖాలు చుట్టూ పడి ఉంటాయి. విశాలమైన కళ్ళు, పెన్సిల్ గీతలాంటి సన్నని కనుబొమ్మలు, ముదురు చర్మపు రంగు... ఇలా విభిన్న వ్యక్తీకరణలను ప్రదర్శిస్తూ అవి రకరకాలుగా ఉంటాయి.

ఈ కళారూపం నృత్యాన్నీ, యుద్ధకళలనూ మిళితం చేస్తుంది. రామాయణం , మహాభారతం , ఇంకా స్థానిక జానపదగాథలకు సంబంధించిన కథలను ప్రదర్శించేటప్పుడు నృత్యకారులు ఈ మారుముఖాలను ధరిస్తారు. దిలీప్ అన్ని మారుముఖాలను తయారుచేస్తారు, కానీ ఆయనకు ఇష్టమైనది కృష్ణుని మారుముఖం. ఎందుకంటే: "పెద్ద కళ్ళు, ఎత్తిన కనుబొమ్మలతో కోపాన్ని వర్ణించడం సులభం, కానీ చిలిపితనాన్ని చూపించడం అంత సులభం కాదు."

దిలీప్ కూడా ఒక కళాకారుడు కావడం దీనికి దోహదపడింది. చిన్నతనంలో ఆయన ఛావ్ నృత్య బృందంలో భాగంగా ఉండేవాడు, ఛావ్ పండుగ సమయంలో స్థానిక శివాలయంలో ఇచ్చే ప్రదర్శనలు చూస్తూ ఆయన నేర్చుకున్నాడు. అప్పటి నుంచీ ఆయనకు ఇష్టమైనది, కృష్ణుడి నృత్యం. ఈ రోజున ఆయన ఢోల్ (డోలు) వాయిస్తారు, ఒక సరాయకేలా ఛావ్ బృందంలో భాగంగా కూడా ఉన్నారు.

PHOTO • Ashwini Kumar Shukla
PHOTO • Ashwini Kumar Shukla

సరాయకేలా జిల్లా టెంటొపొసి గ్రామంలోని తన ఇంటిలో దిలీప్ పట్నాయక్ (ఎడమ). టెంటొపొసిలోని శివాలయం దగ్గర స్థానిక ఛావ్ ప్రదర్శనలో దిలీప్ ఢోల్ (కుడి) వాయిస్తారు

దిలీప్ తన భార్య, నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడితో కలిసి ఝార్ఖండ్‌లోని సరాయకేలా జిల్లా, టెంటొపొసి గ్రామంలో నివసిస్తున్నారు. ఈ గ్రామంలో సుమారు వెయ్యిమందికి పైగా నివసిస్తున్నారు. సాగుచేసిన పొలాల మధ్య ఇటుకలతో కట్టిన వాళ్ళ రెండు గదుల ఇల్లు, ఆవరణలలోనే ఆయన తన పని కూడా చేసుకుంటారు. ఆయన ఇంటి ముఖద్వారం ముందు ఒక మట్టి కుప్ప, ఇంటి ఎదురుగా విస్తరించిన ఒక వేప చెట్టు ఉంటాయి. ఆ చెట్టు కింద ప్రశాంత వాతావరణంలో ఆయన పని చేసుకుంటారు.

"నా చిన్నతనం నుండి మా నాన్న [కేశవ్ ఆచార్య] మారుముఖాలు తయారుచేయడాన్ని చూసేవాణ్ని," అని దిలీప్ చెప్పారు. "ఆయన మట్టి నుంచి ఎలాంటి పాత్రనైనా సృష్టించేవారు." సరాయకేలాకు చెందిన పురాతన రాజవంశం ఈ కళకు సహకారాన్ని ఇచ్చేదని, మారుముఖాలు తయారుచేయడం నేర్పించడానికి ప్రతి గ్రామంలో శిక్షణా కేంద్రాలు ఉండేవని ఆయన చెప్పారు; ఆయన తండ్రి ఉపాధ్యాయునిగా పని చేసేవారు.

"నేను 40 సంవత్సరాలుగా ఈ మారుముఖాలను తయారుచేస్తున్నాను," అని ఈ పురాతన సంప్రదాయాన్ని బతికిస్తున్న చివరి కళాకారులలో ఒకరైన 65 ఏళ్ళ దిలీప్ చెప్పారు. “ప్రజలు చాలా దూరం నుంచి దీన్ని నేర్చుకోవడానికి వస్తారు. కొంతమంది అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్‌ల నుంచీ వస్తారు..." అంటూ ఆయన దూర ప్రదేశాలను చుట్టుకొచ్చారు.

ఒడిశాతో సరిహద్దులో ఉన్న సరాయకేలా సంగీత, నృత్య ప్రియులకు కేంద్రం. "సరాయకేలా అన్ని ఛావ్ నృత్యాలకు తల్లిలాంటిది. ఇక్కడ నుంచి అది మయూర్‌భంజ్ [ఒడిశా], మాన్‌భూమ్ [పురూలియా]లకు వ్యాపించింది," అని సరాయకేలా ఛావ్ కేంద్రం మాజీ సంచాలకులు, 62 ఏళ్ళ గురు తపన్ పట్నాయక్ చెప్పారు. మొదటిసారిగా 1938లో సరాయకేలా రాయల్ ఛావ్ బృందం భారతదేశం వెలుపల, ఐరోపా అంతటా ఈ నృత్యాన్ని ప్రదర్శించిందని, అప్పటి నుంచి ఈ శైలి ప్రపంచంలోని అనేక ప్రాంతాలకు విస్తరించిందని ఆయన వివరించారు.

అయితే ప్రపంచవ్యాప్తంగా ఛావ్ ప్రశంసలు పొందినప్పటికీ, ఈ నృత్యాన్ని సరూపంగా ప్రదర్శించే మారుముఖాలను తయారుచేసే కళాకారుల సంఖ్య మాత్రం తగ్గిపోయింది. "స్థానిక ప్రజలు దీన్ని నేర్చుకోవాలనుకోవడం లేదు," అన్నారు దిలీప్. ఇప్పుడు సన్నని మట్టిదారానికి వేలాడుతోన్న ఆ కళ గురించిన విచారం ఆయన గొంతులో ధ్వనించింది.

*****

తన ఇంటి ప్రాంగణంలో కూర్చొనివున్న దిలీప్, పనిముట్లను జాగ్రత్తగా అమర్చుకొని, మెత్తని మట్టిని ఒక చెక్క చట్రం మీద ఉంచారు. "మారుముఖాన్ని కొలిచి, మూడు భాగాలుగా విభజించడానికి - ఒకటి కళ్ళకు, ఒకటి ముక్కుకు, ఇంకొకటి నోటికి - మేం మా చేతి వేళ్ళను ఉపయోగిస్తాం," అని ఆయన వివరించారు.

చూడండి: సరాయకేలా ఛావ్ మారుముఖాల తయారీ

'సరాయకేలా అన్ని ఛావ్ నృత్యాలకు తల్లిలాంటిది. [...] ఇది నా సంప్రదాయం. నేను జీవించినంత కాలం ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తాను'

నీళ్ళతో తన చేతులను తడుపుకొని, ఆయన నవరసాలను (తొమ్మిది భావోద్వేగాలు) - శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక, బీభత్స, అద్భుత, శాంత - వ్యక్తీకరించే మారుముఖాలను తయారుచేయడం ప్రారంభించారు.

ఛావ్‌లో అనేక శైలులు ఉన్నా సరాయకేలా, పురూలియా ఛావ్‌లో మాత్రమే మారుముఖాలను ఉపయోగిస్తారు. “సరాయకేలా ఛావ్ ఆత్మ దాని మారుముఖంలోనే ఉంది; అవి లేకుంటే ఛావ్ లేదు,” ఆయన చేతులు వేగంగా మట్టిని ముఖాకృతిగా మలుస్తూండగా చెప్పారు దిలీప్.

మట్టి మారుముఖం ఆకారంలోకి వచ్చిన తర్వాత, దిలీప్ దానిపై రాఖ్ (ఆవుపేడ కాల్చిన బూడిద)ను చల్లుతారు, అప్పుడే అచ్చులోంచి మారుముఖాన్ని సులభంగా వేరు చేయవచ్చు. ఆ తర్వాత ఆయన లేయీ (పిండితో చేసిన జిగురు)తో ఆరు పొరలుగా కాగితాన్ని అతికిస్తారు. మారుముఖాన్ని రెండు, మూడు రోజులు ఎండలో ఎండబెట్టి, ఆ తర్వాత బ్లేడుతో జాగ్రత్తగా దాన్ని వేరు చేసి, హెచ్చుతగ్గులేమీ లేకుండా రంగులు వేస్తారు. "సరాయకేలా మారుముఖాలు చూడటానికి చాలా అందంగా ఉంటాయి," దిలీప్ గర్వంగా చెప్పారు. ఆ ప్రాంతంలోని దాదాపు 50 గ్రామాలకు ఆయనే వాటిని సరఫరా చేస్తారు.

గతంలో పూలు, ఆకులు, నదీతీరాన ఉండే రాళ్ళతో తయారుచేసిన సహజసిద్ధమైన రంగులతో వాటికి రంగులు వేసేవాళ్ళు, కానీ ఇప్పుడు కృత్రిమ రంగులు వాడుతున్నారు.

PHOTO • Ashwini Kumar Shukla
PHOTO • Ashwini Kumar Shukla

మారుముఖాన్ని కొలిచి, మూడు భాగాలుగా - ఒకటి కళ్ళకు, ఒకటి ముక్కుకు, ఇంకొకటి నోటికి - విభజించేందుకు దిలీప్ తన వేళ్ళను (ఎడమ) ఉపయోగిస్తారు. విభిన్న భావోద్వేగాల కోసం వేర్వేరు ఆకృతులను జాగ్రత్తగా పరిశీలించి, ఒక చెక్క సాధనంతో (కుడి) ఆయన కళ్ళ ఆకారాన్ని తీర్చిదిద్దుతారు

PHOTO • Ashwini Kumar Shukla
PHOTO • Ashwini Kumar Shukla

ఎడమ: మట్టి మారుముఖం ఆకారంలోకి వచ్చిన తర్వాత, దిలీప్ దానిపై రాఖ్ (ఆవుపేడను కాల్చిన బూడిద) చల్లుతారు, తద్వారా అచ్చును మారుముఖం నుంచి సులభంగా వేరు చేయవచ్చు. ఆ తర్వాత ఆయన లేయీ (పిండితో చేసిన జిగురు)తో ఆరు పొరలుగా కాగితాన్ని అతికిస్తారు. మారుముఖాన్ని రెండు, మూడు రోజులు ఎండలో ఎండబెట్టి, ఆపైన బ్లేడుతో జాగ్రత్తగా తొలగించాలి. కుడి: సరాయకేలా మారుముఖాలను తయారుచేసే చివరి కళాకారులలో ఒకరైన దిలీప్, ఆ ముఖం ఏ భావోద్వేగాన్ని సూచించడానికి ఉద్దేశించిందో, దాని ఆధారంగా కళ్ళు, పెదవులు, బుగ్గలను తీర్చిదిద్ది, హెచ్చుతగ్గులు లేకుండా వాటికి రంగులు వేస్తారు

*****

"కళాకారుడు ఒకసారి మారుముఖం ధరించగానే, వాళ్ళు ఆ పాత్రగా రూపాంతరం చెందుతారు," అని 50 సంవత్సరాలుగా ఛావ్‌ను ప్రదర్శిస్తోన్న తపన్ చెప్పారు. “మీరు రాధగా నటిస్తుంటే, రాధ వయస్సును, రూపాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. పురాతన గ్రంథాల ప్రకారం, ఆమె చాలా అందంగా ఉంటుంది. కాబట్టి, మేం ఆమె పెదవులు, బుగ్గలు విలక్షణంగా కనిపించేలా రాధ అచ్చును తయారుచేస్తాం, అది ఆమెలానే ఉండేలా చూసుకుంటాం.’’

"ఒకసారి మీరు మారుముఖం ధరించిన తర్వాత, మీరు మీ శరీరం, మెడ కదలికల ద్వారా భావోద్వేగాలను తెలియజేయాలి," అని అతను చెప్పారు. నర్తకుల శరీరం రెండు భాగాలుగా విభజించబడుతుంది: ' అంగ ' (మెడ క్రింది భాగం), ' ఉపాంగ ' (తల). ' ఉపాంగ 'లో కళ్ళు, ముక్కు, చెవులు, నోరు ఉంటాయి. ఇవన్నీ మారుముఖంతో కప్పబడి ఉంటాయి. ప్రదర్శనకారుడు శరీరంలోని ఎగువ, దిగువ భాగాలు రెండిటినీ ఉపయోగించి భావోద్వేగాలను వ్యక్తపరుస్తాడు.

ఒక నర్తకుడు మారుముఖం ధరించి, ఏడుపును ప్రదర్శించాలంటే, మారుముఖం కారణంగా ముఖంలోని భావోద్వేగాలు కనిపించవు. తాను చెప్పాలనుకున్నదేమిటో PARIకి వివరించేందుకు తపన్ తన మెడను ఎడమవైపుకు వంచి, ఆపైన రెండు పిడికిళ్ళనూ తన ముఖానికి దగ్గరగా తెచ్చి, తన తలను, శరీరం పైభాగాన్ని ఎడమవైపుకి వంచి, ఎవరో గాయపడినట్లు, విచారంతో దూరంగా చూస్తున్నట్లు ప్రదర్శించి చూపించారు.

మొదట్లో ప్రదర్శకులు ప్రజల ముందు నాట్యం చేయడానికి సిగ్గుపడి, తమ ముఖాలను కప్పి పుచ్చుకోవడానికి ఈ మారుముఖాలను ధరించేవారని జానపద కథలు చెబుతున్నాయి. "అలా ఈ మారుముఖం పరికండా [యుద్ధ కళ]లోకి ప్రవేశించింది," అని తపన్ వివరించారు. మొదట్లో కళ్ళ స్థానంలో రంధ్రాలున్న వెదురు బుట్టలను మారుముఖాలుగా ఉపయోగించేవారు. క్రమంగా ఆ సంప్రదాయం మారుతూవచ్చి, తమ బాల్యంలో గుమ్మడికాయలతో మారుముఖాలు తయారుచేసేవారని దిలీప్ చెప్పారు.

మరొక మూల కథ, ఛావ్‌కు ఛావనీ లేదా సైనిక శిబిరాలు మూలమని గుర్తిస్తుంది. అందుకే ఈ కళలో యుద్ధకళలకు సంబంధించిన కదలికలు కనిపిస్తాయని భావిస్తారు. కానీ తపన్ దీనితో ఏకీభవించలేదు: "ఛావ్ ఛాయ [నీడలు] నుంచి ఉద్భవించింది," అంటూ అతను, ప్రదర్శకులు వాళ్ళు పోషించే పాత్రల నీడల్లాంటివారని వివరించారు.

సంప్రదాయం ప్రకారం ఈ నృత్యాన్ని పురుషులే చేస్తారు. అయితే ఇటీవలి కాలంలో కొంతమంది మహిళలూ ఛావ్ బృందాలలో చేరుతున్నారు. కానీ సరాయకేలా ప్రదర్శనలలో ఇప్పటికీ పురుషులదే ఆధిపత్యం.

PHOTO • Ashwini Kumar Shukla
PHOTO • Ashwini Kumar Shukla

ఎడమ: దిలీప్ ఇంటి వరండాలో ఒకవైపు వేలాడదీసిన సరాయకేలా మారుముఖాలు తొమ్మిది భావోద్వేగాలను (నవరసాలు) – శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక, బీభత్స, అద్బుత, శాంత - సూచిస్తాయి. ఇదే వాటిని ప్రత్యేకంగా నిలుపుతోంది. కుడి: తను తయారు చేసిన కొన్ని ప్రసిద్ధ మారుముఖాలు, నిర్వహించిన కార్యశాలల పాత ఫొటోలను చూపుతున్న దిలీప్

మారుముఖాల తయారీలోనూ ఇదే పరిస్థితి. ఛావ్ మే మహిళా నహీ... యహీ పరంపరా చలా ఆ రహా హై, మాస్క్ మేకింగ్ కా సారా కామ్ హమ్ ఖుద్ కర్తే హైఁ [మహిళలు ఛావ్‌లో పాల్గొనరు... ఇదే సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది, మారుముఖాల తయారీ పనులన్నీ మేమే స్వయంగా చేసుకుంటాం],” అని దిలీప్ చెప్పారు. "నా కొడుకు ఇక్కడ ఉన్నప్పుడు నాకు సహాయం చేస్తాడు."

ఆయన కొడుకు దీపక్, తండ్రి దగ్గర మారుముఖాలు ఎలా తయారుచేయాలో నేర్చుకున్నాడు. కానీ 25 ఏళ్ళ దీపక్ ధన్‌బాద్‌కు వెళ్ళిపోయాడు. అక్కడతను ఒక ఐటి సంస్థలో పని చేస్తూ, ఈ మారుముఖాల తయారీకన్నా ఎక్కువ సంపాదిస్తున్నాడు.

అయితే విగ్రహాల తయారీ విషయానికి వస్తే, కొన్నిసార్లు మొత్తం కుటుంబం కలిసి వాటిని తయారుచేస్తారు. విగ్రహాల తయారీకి సంబంధించిన పనులన్నీ తానే చేస్తానని దిలీప్ భార్య సంయుక్త చెప్పారు. “ సాంచా బనాతే హై, మిట్టీ తయ్యార్ కర్తే హై, పెయింటింగ్ భీ కర్తే హై. లేకిన్ ముఖౌటా మే లేడీస్ కుచ్ నహీ కర్తీ హై [మేం అచ్చులను తయారుచేస్తాం, మట్టిని సిద్ధం చేస్తాం, రంగులు కూడా వేస్తాం. కానీ మారుముఖాల విషయానికి వస్తే, ఆడవాళ్ళు ఏమీ చేయరు]."

2023లో దిలీప్ 500-700 మారుముఖాలను తయారుచేసి, దాదాపు ఒక లక్ష రూపాయలు సంపాదించారు. ఆయన ఏడాది మొత్తం మీద రంగులు, కుంచెలు, బట్టల కోసం మూడు నుంచి నాలుగు వేల రూపాయలు ఖర్చు చేశారు. ఆయన దానిని తన "పార్ట్ టైమ్ జాబ్" అని పిలుస్తారు. ఇప్పుడు ఆయన ముఖ్య వృత్తి విగ్రహాలను తయారుచేయడం. దాని నుంచి ఆయన యేటా మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు సంపాదిస్తారు.

ఆయన వివిధ ఛావ్ నృత్య కేంద్రాలకు కమీషన్‌పై మారుముఖాలను తయారుచేస్తారు. అలాగే చైత్ర్ పర్వ్ లేదా వసంతోత్సవంలో - ఇది సరాయకేలా ఛావ్‌ను ప్రదర్శించే అనేక సందర్భాలలో ఒక ముఖ్యమైన కార్యక్రమం - భాగంగా ప్రతి ఏప్రిల్‌లో జరిగే చైత్ర మేళా లో కూడా వాటిని విక్రయిస్తారు. ఇక్కడికి ప్రపంచం నలుమూలల నుంచి సందర్శకులు వస్తారు. ఇక్కడ పెద్ద మారుముఖాల ధర రూ. 250–300, చిన్నవి ఒక్కొక్కటి వంద రూపాయలకు అమ్ముడవుతాయి.

తనను ఇప్పటికీ ఈ పనిని కొనసాగించేలా చేస్తున్నది డబ్బు కాదని దిలీప్‌కు స్పష్టంగా తెలుసు. “ఇది నా సంప్రదాయం. నేను జీవించి ఉన్నంత కాలం ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తాను.”

ఈ కథనానికి మృణాళిని ముఖర్జీ ఫౌండేషన్ (MMF) ఫెలోషిప్ సహకారం అందించింది.

అనువాదం: రవి కృష్ణ

Ashwini Kumar Shukla

అశ్విని కుమార్ శుక్లా ఝార్కండ్ రాష్ట్రం, పలామూలోని మహుగావాన్ గ్రామానికి చెందినవారు. ఆయన దిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ నుంచి పట్టభద్రులయ్యారు (2018-2019). ఆయన 2023 PARI-MMF ఫెలో.

Other stories by Ashwini Kumar Shukla
Editor : PARI Desk

PARI డెస్క్ మా సంపాదకీయ కార్యక్రమానికి నాడీ కేంద్రం. ఈ బృందం దేశవ్యాప్తంగా ఉన్న రిపోర్టర్‌లు, పరిశోధకులు, ఫోటోగ్రాఫర్‌లు, చిత్రనిర్మాతలు, అనువాదకులతో కలిసి పని చేస్తుంది. PARI ద్వారా ప్రచురితమైన పాఠ్యం, వీడియో, ఆడియో, పరిశోధన నివేదికల ప్రచురణకు డెస్క్ మద్దతునిస్తుంది, నిర్వహిస్తుంది కూడా.

Other stories by PARI Desk
Translator : Ravi Krishna

రవి కృష్ణ ఫ్రీలాన్స్ అనువాదకులు. జార్జ్ ఆర్వెల్ రాసిన 'యానిమల్ ఫామ్' తెలుగు అనువాదం ‘చతుర’లోనూ; పలు అనువాదాలు, గల్పికలు ‘విపుల’, ‘మాతృక’లలోనూ ప్రచురితమయ్యాయి.

Other stories by Ravi Krishna