కవిత్వంలోనే మనం పరిపూర్ణంగా జీవిస్తాం; మానవులకు, సమాజానికి మధ్య మనం సృష్టించే అత్యంత బాధాకరమైన విభజనలను మనం కవిత్వంలోనే అనుభవిస్తాం. నిరాశ, ఖండనలు, ప్రశ్నించడం, పోలికలు తేవడం, జ్ఞాపకాలు, కలలు, అవకాశాలు - వీటన్నిటికీ ఇదే నెలవు. ఇక్కడి నుండే మన మార్గం మన లోపలి, వెలుపలి ప్రధాన ద్వారానికి రెండు వైపులకూ మనలను నడిపిస్తుంది. అందుకే కవిత్వం వినడం మానేసినప్పుడు వ్యక్తులంగానూ, సమాజంగానూ మనం సహానుభూతిని కోల్పోతాం.

దేవనాగరి లిపిలో, దేహ్వాలీ భీలీలో జితేంద్ర వాసవ రాసిన కవితను ఇక్కడ అందిస్తున్నాం.

దేహ్వాలీ భీలీలో జితేంద్ర వాసవ చదువుతోన్న ఈ కవితను వినండి

ఈ కవిత ఆంగ్లనువాదాన్ని ప్రతిష్ఠ పాండ్య చదువుతున్నారు, వినండి

कविता उनायां बोंद की देदोहो

मां पावुहूं! तुमुहुं सोवता पोंगा
बाठे बांअणे बोंद की लेदेहें
खोबोर नाहा काहा?
तुमां बारे हेरां मोन नाहां का
बारे ने केड़ाल माज आवां नाह द्याआ
मान लागेहे तुमुहूं कविता उनायां बोंद की देदोहो
मांय उनायोहो
दुखू पाहाड़, मयाल्या खाड़्या
इयूज वाटे रीईन निग्त्याहा
पेन मां पावुहूं! तुमुहुं सोवता पोंगा
बाठे बांअणे बोंद की लेदेहें
खोबोर नाहा काहा?
तुमां बारे हेरां मोन नाहां का
बारे ने केड़ाल माज आवां नाह द्याआ मोन
मान लागेहे तुमुहूं कविता उनायां बोंद की देदोहो

पेन मां पावुहू!
तुमुहू सौवता डोआं खुल्ला राखजा मासां होच
बास तुमुहू सोवताल ता ही सेका
जेहकी हेअतेहे वागलें लोटकीन सौवताल
तुमुहू ही सेका तुमां माजर्या दोर्याले
जो पुनवू चादू की उथलपुथल वेएत्लो
तुमुहू ही सेका का
तुमां डोआं तालाय हुकाय रियिही
मां पावुहू! तुमनेह डोगडा बी केहेकी आखूं
आगीफूंगा दोबी रेताहा तिहमे
तुमुहू कोलाहा से कोम नाहाँ
हाचो गोग्यो ना माये
किही ने बी आगीफूंगो सिलगावी सेकेह तुमनेह
पेन मां पावुहूं! तुमुहुं सोवता पोंगा
बाठे बांअणे बोंद की लेदेहें
खोबोर नाहा काहा?
तुमां बारे हेरां मोन नाहां का
बारे ने केड़ाल माज आवां नाह द्याआ मोन
मान लागेहे तुमुहूं कविता उनायां बोंद की देदोहो

तुमुहू जुगु आंदारो हेरा
चोमकुता ताराहान हेरा
चुलाते नाहां आंदारारी
सोवताला बालतेहे
तिया आह्लीपाहली दून्या खातोर
खूब ताकत वालो हाय दिही
तियाआ ताकात जोडिन राखेहे
तियाआ दुन्याल
मां डायी आजलिही जोडती रेहे
तियू डायि नोजरी की
टुटला मोतिई मोनकाहाने
आन मां याहकी खूब सितरें जोडीन
गोदड़ी बोनावेहे, पोंगा बाठा लोकू खातोर
तुमुहू आवाहा हेरां खातोर???
ओह माफ केअजा, माय विहराय गेयलो
तुमुहुं सोवता पोंगा
बाठे बांअणे बोंद की लेदेहें
खोबोर नाहा काहा?
तुमां बारे हेरां मोन नाहां का
बारे ने केड़ाल माज आवां नाह द्याआ मोन
मान लागेहे तुमुहूं कविता उनायां बोंद की देदोहो

నువ్వు కవిత్వాన్ని వినటం మానేసినప్పటి నుండి ...

సోదరా! నాకు తెలియదు
నువ్వు నీ ఇంటి తలుపులన్నిటినీ ఎందుకు మూసివేశావో.
బయటేం జరుగుతోందో చూడకూడదనుకుంటున్నావా?
లేదా ఎవరినీ లోనికి రాకుండా అడ్డుకోవడం కోసమా?
నువ్వు కవిత్వాన్ని వినడం మానేశావని నాకనిపిస్తోంది.

నేనిలా విన్నాను,
మన కష్టాలంత ఎత్తున్న పర్వతాలు
ప్రేమలా ప్రవహించే నదులు,
రెండూ ఇక్కడే ఉన్నాయని,

కానీ నువ్వు నీ ఇంటి తలుపులను మూసేశావు.
ఎందుకో నాకు తెలియదు.
బయటకు చూడకూడదని అనుకుంటున్నందుకా?
లేదా ఎవరినీ లోనికి రాకుండా అడ్డుకోవడం కోసమా?
నువ్వు కవిత్వాన్ని వినడం మానేశావని నాకనిపిస్తోంది.

ఓ సోదరా! చేపలా నీ కన్నులను తెరచి ఉంచు,
నిన్ను నువ్వు చూడగలిగేలా,
తనను తాను అన్నివైపులా చూసుకోగలిగే గుడ్లగూబలా
ఆకాశంలో నీలి చంద్రుడిని చూసినప్పుడల్లా
అశాంతితో అల్లకల్లోలమవుతుండే సంద్రంలా
నువ్వూ నీ లోపలి సముద్రాన్ని చూడవచ్చు
నీ కన్నులలోని నీటి చెలమలు ఎండిపోయాయి.
కానీ ఓ సోదరా, నువ్వొక రాయివని నేననలేను.
ఎలా అనగలను? రాయి లోపల కూడా మంటలు దాగి ఉంటాయి.
నువ్వు బొగ్గు కంటే తక్కువ వాడివేమీ కాదు
నేను సరిగ్గా చెప్పానా లేదా?
ఎక్కడి నించో వచ్చిన నిప్పురవ్వైనా
నిన్ను రగిలించగలదు.

కానీ సోదరా, నువ్వు నీ ఇంటి తలుపులన్నిటినీ మూసివేశావు.
ఎందుకో నాకు తెలియదు.
బయటేం జరుగుతోందో చూడకూడదనుకుంటున్నావా?
లేదా ఎవరినీ లోనికి రాకుండా అడ్డుకోవడం కోసమా?
నువ్వు కవిత్వాన్ని వినడం మానేశావని నాకనిపిస్తోంది.

ఆకాశంలో కమ్ముకుంటున్న చీకటిని చూడు,
తళతళ మెరిసే తారలను చూడు
వాటికి చీకటంటే భయముండదు
అలాగని చీకటితో పోరాడవు కూడా
అవి కేవలం తమను తాము వెలిగించుకుంటాయి
తమ చుట్టూ ఉన్న మిగిలిన ప్రపంచం కోసం.
సూర్యుడు శక్తిమంతుడు.
అతని శక్తే ఈ ప్రపంచాన్ని కలిపి ఉంచుతోంది.
ముసలిదైన మా అమ్మమ్మ ఎప్పుడూ కలిపి గుచ్చుతూ ఉంటుంది
మసకబారి, బలహీనమైన కనుచూపుతో
తెగిపోయిన పూసల పేరును
మా అమ్మ మా అందరి కోసం ఒక మెత్తని బొంతను నేస్తుంది,
అనేక గుడ్డపీలికలను ఒకటిగా కలిపి ఉంచుతూ.

మీరు వచ్చి చూడాలనుకుంటున్నారా?
ఓహ్! క్షమించు, నేను మర్చిపోయాను
నువ్వు నీ ఇంటి తలుపుల్ని మూసివేశావు.
ఎందుకో నాకు తెలియదు.
బయటేం జరుగుతోందో చూడకూడదనుకుంటున్నావా?
లేదా ఎవరినీ లోనికి రాకుండా అడ్డుకోవడం కోసమా?
నువ్వు కవిత్వాన్ని వినడం మానేశావని నాకనిపిస్తోంది.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Jitendra Vasava

జితేంద్ర వాసవ గుజరాత్‌ రాష్ట్రం, నర్మదా జిల్లాలోని మహుపారా గ్రామానికి చెందిన కవి. ఆయన దేహ్వాలీ భీలీ భాషలో రాస్తారు. ఆయన ఆదివాసీ సాహిత్య అకాడమీ (2014) వ్యవస్థాపక అధ్యక్షులు; ఆదివాసీ స్వరాలకు అంకితమైన కవితా పత్రిక లఖారాకు సంపాదకులు. ఈయన ఆదివాసీ మౌఖిక సాహిత్యంపై నాలుగు పుస్తకాలను కూడా ప్రచురించారు. అతని డాక్టరల్ పరిశోధన, నర్మదా జిల్లాలోని భిల్లుల మౌఖిక జానపద కథల సాంస్కృతిక, పౌరాణిక అంశాలపై దృష్టి సారించింది. PARIలో ప్రచురించబడుతున్న అతని కవితలు, పుస్తకంగా రాబోతున్న అతని మొదటి కవితా సంకలనంలోనివి.

Other stories by Jitendra Vasava
Illustration : Manita Kumari Oraon

మనితా కుమారి ఉరాంవ్ ఝార్ఖండ్‌కు చెందిన కళాకారిణి. ఆదివాసీ సముదాయాలకు చెందిన సామాజిక, సాంస్కృతిక ప్రాముఖ్యం కలిగిన అంశాలపై శిల్పం, చిత్రకళల ద్వారా పనిచేస్తున్నారు.

Other stories by Manita Kumari Oraon
Editor : Pratishtha Pandya

PARI సృజనాత్మక రచన విభాగానికి నాయకత్వం వహిస్తోన్న ప్రతిష్ఠా పాండ్య PARIలో సీనియర్ సంపాదకురాలు. ఆమె PARIభాషా బృందంలో కూడా సభ్యురాలు, గుజరాతీ కథనాలను అనువదిస్తారు, సంపాదకత్వం వహిస్తారు. ప్రతిష్ఠ గుజరాతీ, ఆంగ్ల భాషలలో కవిత్వాన్ని ప్రచురించిన కవయిత్రి.

Other stories by Pratishtha Pandya
Translator : Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.

Other stories by Sudhamayi Sattenapalli