"ఎందుకు మమ్మల్నందరూ తిరస్కారంతో చూస్తారు? కేవలం మేం ట్రాన్స్‌జండర్లం అయినందుకేనా? అంటే మాకు ఇజ్జత్ (గౌరవం) అంటూ ఉండదా?" శీతల్ ప్రశ్నిస్తారు.

శీతల్ ఏళ్ళతరబడీ తనకు కలిగిన చేదు అనుభవాల నుంచి ఇలా మాట్లాడుతున్నారు. సుమారు దశాబ్దకాలంగా బడిలోనూ, పనిచేసేచోట, వీధుల్లో, దాదాపు వెళ్ళిన ప్రతిచోటా, 22 ఏళ్ళ శీతల్ వివక్షనూ వేధింపులనూ ఎదుర్కొంటూనే ఉన్నారు.

ఇదంతా తనకు 14 ఏళ్ళ వయసున్నపుడు ఇచల్‌కరంజిలోని నెహ్రూ నగర్లో ఉన్న ఇంటి నుంచే మొదలయింది. అప్పుడామె పేరు అరవింద్. "నేను 8, 9 తరగతుల్లో ఉండగా తరగతిలోని ఇతర ఆడపిల్లల్లా బట్టలు వేసుకోవాలని నాకనిపించేది. నాకెందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థమయ్యేది కాదు... ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడూ అద్దంలో నన్ను నేను చూసుకుంటూ ఉండేదాన్ని. 'ఎందుకు ఎప్పుడూ బాయలా ('ఆడపిల్లలా')లాగా నిన్ను నువ్వే చూసుకుంటావు? బయటికెళ్ళి మగపిల్లలతో ఆడుకో పోయి’ అని మా నాన్న కేకలేస్తుండేవాడు. నాకు చీర కట్టుకోవాలని ఉందనీ, అమ్మాయిలాగా జీవించాలని ఉందనీ చెప్పినపుడు ఆయన నన్ను కొట్టి, పిచ్చాసుపత్రిలో చేర్పిస్తానని అనేవాడు. ఆయన నన్ను కొట్టినపుడల్లా నేను చాలా ఏడ్చేదాన్ని..."

శీతల్ (ఆమె అభ్యర్థన మేరకు పేరు మార్చాం) కుటుంబం తమ కొడుకును ‘బాగుచేయించడానికి’ ఒక తాంత్రికుని దగ్గరకు కూడా తీసుకెళ్ళారు. "నాకెవరో చేతబడి చేశారని మా అమ్మ అనేది. మా నాన్న (తుక్కును అమ్మే వ్యాపారం చేసేవారు) ఒక కోడిపెట్టను కూడా బలి ఇచ్చాడు. నేను శారీరకంగా అబ్బాయినే అయినప్పటికీ నాకు అమ్మాయిలా ఉండాలని ఉందనే విషయాన్ని నా తల్లిదండ్రులు అర్థంచేసుకోలేకపోయేవారు. నేను చెప్పేది వినిపించుకునేవారుకాదు."

పదహారేళ్ళ వయసులో శీతల్ తన ఇంటినుంచి వచ్చేసి, వీధుల్లో అడుక్కోవడం మొదలుపెట్టారు. ఆమె ఇప్పటికీ ఆ పని చేస్తున్నారు. ఉదయం 10 గంటల నుండి చీకటి పడేవరకూ ఆమె దుకాణాల వెంట తిరిగి డబ్బులు అడుగుతుంటారు; దగ్గరలో ఉన్న పట్టణాలైన జైసింగ్‌నగర్, కొల్హాపుర్, సాంగ్లిలకు కూడా వెళ్తుంటారు. ఇలా రోజుకు రూ.100- 500 వరకూ సంపాదిస్తారు. కొన్నిసార్లు ఆమెనూ, మరో నలుగురైదుగురు ఆమె స్నేహితులైన ట్రాన్స్‌జండర్‌లనూ పెళ్ళిళ్ళలో, పేరు పెట్టే పండుగలలో, మతపరమైన జాగారాల వంటి ఇతర కార్యక్రమాలలో ఆడి పాడటానికి జనం పిలుస్తుంటారు. ఇలాంటి వాటి ద్వారా వారికి మనిషికి రూ. 2000 - 3000 వరకూ సంపాదన ఉంటుంది.

Mastani Nagarkar asking for money outside a shop
PHOTO • Minaj Latkar

'నాకు ఏమీ చేతకానివారిలాగా వీధులెంట తిరిగి అడుక్కోవటం ఇష్టం ఉండదు', అంటారు శీతల్

శీతల్ కుటుంబం తమ కొడుకును ‘బాగుచేయించడానికి’ ఒక తాంత్రికుని దగ్గరకు కూడా తీసుకెళ్ళారు. 'నాకెవరో చేతబడి చేశారని మా అమ్మ అనేది. మా నాన్న ఒక కోడిపెట్టను కూడా బలి ఇచ్చాడు. నేను శారీరకంగా అబ్బాయినే అయినప్పటికీ నాకు అమ్మాయిలా ఉండాలని ఉందనే విషయాన్ని నా తల్లిదండ్రులు అర్థంచేసుకోలేకపోయారు’

కానీ పనిచేసుకుంటూ, స్వతంత్రంగా జీవించడం కూడా ఆమెపై వివక్ష మరింత ఎక్కువయ్యేలా చేసింది. "నేను డబ్బులు అడగటానికి బజారుకు వెళ్ళినపుడు జనం నా చీర పల్లూ (కొంగు) పట్టి లాగుతారు, అసభ్యకరంగా సైగలు చేస్తారు. కొన్ని దుకాణాల్లో మమ్మల్ని దొంగలమన్నట్టు అనుమానంగా చూస్తుంటారు." ఇంటిదగ్గర ఉన్నప్పుడు కూడా, "మా పొరుగునే ఉండే మగవాళ్ళు రాత్రివేళల్లో నా ఇంటి తలుపు కొట్టి సెక్స్ కోసం డిమాండ్ చేస్తారు. నేను ఒంటరిగా ఉంటాను, ఎప్పుడూ భయంతో జీవిస్తుంటాను." అన్నారు శీతల్.

శీతల్ తన ఇల్లుగా చెప్పుకుంటోన్న ప్రదేశం కూడా ఇచల్‌కరంజి ప్రాంతంలోని షాహాపుర్ మురికివాడలో ఉన్న ఒక గది. అది కూడా ఆమెకు చాలా కష్టమ్మీద దొరికింది. తన తల్లిదండ్రుల ఇంటిని విడిచిపెట్టాక ఆమె కొద్దికాలం ఒక బస్ స్టాప్‌లో నిద్రపోయేవారు. "నేను ప్రతినెలా రూ. 2000 అద్దె చెల్లించాలి. అందులో జంతువులు కూడా నివాసముండలేవు, అలా ఉంటుంది ఆ గది. వానాకాలంలో ఒకోసారి ఆ గది నీటితో నిండిపోతుంది. అలాంటప్పుడు నేను బస్‌స్టేషన్‌లో నిద్రపోవాలి. నేను సమయానికి అద్దె కడుతున్నా కూడా నాకో మంచి గది దొరకదు. నాక్కూడా ఒక మంచి ఇంటిలో నివాసముండాలని ఉంటుంది. కానీ మాకు అద్దెకు ఇల్లు ఇవ్వడానికి అందరూ ఇష్టపడరు. మా సొంత కుటుంబం, సమాజం మమ్మల్ని ఒప్పుకోకపొతే మేమెక్కడికి వెళ్ళగలం?"

శీతల్ చేస్తూవస్తున్న సుదీర్ఘ పోరాటాలు మహారాష్ట్రలోని కొల్హాపుర్ జిల్లా, హాత్‌కణంగలే తాలూకా లోని సుమారు 2.88 లక్షల జనాభా ఉన్న ఇచల్‌కరంజి అనే పట్టణంలోని మొత్తం ట్రాన్స్‌జండర్ సమాజం వారి ఇళ్ళల్లో, బడులూ కళాశాలలలో, పనిచేసే ప్రదేశాలలో, ఇంటా బయటా చేస్తున్న పోరాటాల గురించి మాట్లాడుతున్నాయి.

ఇళ్ళల్లో అవి, అపనమ్మకం నుంచి కోపం వరకూ, లేదంటే నిరాకరణ నుంచి బలవంతపు పెళ్ళిళ్ళ వరకూ ఉంటాయి. సకీనా ( మహిళగా ఆమె పెట్టుకున్న పేరు ) స్త్రీగా జీవించాలనే తన కోరిక గురించి తన కుటుంబానికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు, కానీ (ఆమెను మగవాడిగా చూసే) కుటుంబసభ్యులు ఒక అమ్మాయిని పెళ్ళి చేసుకోవాల్సిందిగా ఒత్తిడిచేశారు. సామాజిక అపవాదుకు భయపడిన సకీనా 27 ఏళ్ళ వయసులో పెళ్ళి చేసుకున్నారు. ఆమె/అతడు నెహ్రూనగర్ మురికివాడల్లో ఉండే తన ఇంటి వద్ద, సామాజికంగా కూడా ఒక పురుషునిలాగే జీవిస్తున్నారు.

"కొన్నిసార్లు, హిజ్రా సముదాయంలో ఏదైనా కార్యక్రమం ఉన్నపుడు, నేను చీర కట్టుకొని రహస్యంగా అక్కడికి వెళ్తాను," 33 ఏళ్ళ వయసున్న సకీనా చెప్పారు. "కానీ ఇంటిదగ్గర నేను ఒక తండ్రిగా, ఒక భర్తగా జీవించాలి. మహిళగా జీవించాలనే నా కోరికను నేను తీర్చుకోలేను. నేనొక ద్వంద్వ జీవితాన్ని - నా మనసులో ఒక స్త్రీగానూ, ప్రపంచానికి ఒక పురుషుడిగానూ జీవిస్తున్నాను."

Radhika with her family
PHOTO • Minaj Latkar
Radhika getting ready in a traditional saree and jewellery for her daily round of the markets to ask for money
PHOTO • Minaj Latkar

రాధికా గోసావీ తల్లిగారైన సుమన్ (ఎడమవైపు కూర్చున్నవారు) ఇళ్ళల్లో పనులు చేస్తూ, తుక్కు ఏరుకునే పని కూడా చేస్తారు. 'నా సొంత కొడుకును నేనెట్లా ఇంట్లోనుంచి పంపేయగలను?' అంటారామె

సకీనాలా కాకుండా 30 ఏళ్ళ సునీత (ఆమె నిజం పేరు కాదు) తన కుటుంబం కట్టబెట్టబోయిన పెళ్ళిని చేసుకోకుండా నిలవరించగలిగారు. కానీ ఆమె కూడా సకీనాలాగానే తనని తాను స్త్రీగా భావించుకొంటున్నప్పటికీ, పురుషుడిగానే జీవనం సాగిస్తున్నారు. తన గురించి కుటుంబానికి చెప్పుకోగలిగినంత ధైర్యం సునీతకు లేదు. ఆమె తండ్రి కిరాణా దుకాణం నడుపుతారు, తల్లి గృహిణి. "నన్ను పెళ్ళి చేసుకోమని ఇంట్లో ఒత్తిడిచేస్తున్నారు. కానీ ఒక స్త్రీని పెళ్ళి చేసుకొని ఆమె జీవితాన్ని నేనెలా పాడుచేయగలను? అందుకని ఇంటిని విడిచిపెట్టి పోవాలని నిర్ణయించుకున్నాను. మా (మరాఠా) సముదాయంలో, నేనొక ట్రాన్స్‌జండర్‌నని తెలిస్తే అది నా కుటుంబ గౌరవాన్ని చెడగొడుతుంది. నా చెల్లెళ్ళకు పెళ్ళిళ్ళు కావు, మా కుటుంబం కష్టాలపాలవుతుంది. ప్రజలేమనుకుంటారో అనే బాధతోనే, నేను ఇల్లువిడచిపోవాలని నిర్ణయించుకున్నాను.”

ఇంటిని విడచిపెట్టి, నెహ్రూనగర్ మురికివాడలో ఒక గదిని అద్దెకు తీసుకొని ఉండేనాటికి సునీత వయసు 25 ఏళ్ళు. "అప్పటి నుంచి నావంటివాళ్ళను ఎంతో మందిని నేను కలిశాను. కానీ వాళ్ళంతా జీవనం సాగించడానికి అడుక్కోవలసి వస్తోంది. ఎవరూ వాళ్ళకు పని ఇవ్వడానికి గానీ, అద్దెకు ఇల్లు ఇవ్వడానికి గానీ ఇష్టపడరు. వారు పడే కష్టాలను చూశాక, నాకు చీర కట్టుకోవడానికి ధైర్యం చాలడంలేదు. కానీ ఈ రకంగా జీవించడం కూడా చాలా కష్టంగానే ఉంటుంది." అన్నారు సునీత.

కొన్ని కుటుంబాలలో మాత్రం, ఎంతో కొంత ఆమోదం ఉంటోంది. ఇప్పుడు పాతికేళ్ళ వయసున్న రాధికా గోసావికి(పైన ముఖచిత్రంలో ఉన్నవారు) సుమారు 13 ఏళ్ళ వయసులో ఉండగా తాను ట్రాన్స్‌జండర్‌ననే విషయం తెలిసింది. మొదట్లో ఆమె తల్లి, ఇద్దరు చెల్లెళ్ళు దీన్ని వ్యతిరేకించారు. లోహపు తుక్కును ఏరుకునే పనిచేసే ఆమె తండ్రి రాధికకు పదేళ్ళ వయసప్పుడే చనిపోయారు.

"నాకు మా అమ్మకులా జుట్టును జడగా అల్లుకోవాలని, మా అక్కాచెల్లెళ్ళకులాగా బట్టలు ధరించి, బొట్టు కాటుక, లిప్‌స్టిక్ పెట్టుకోవాలనిపించేది. మా చెల్లికిలా ఇంటి పనులు చేయాలనివుండేది. కానీ ఇలా ఎందుకనిపించేదో అర్థమయ్యేది కాదు," నెహ్రూనగర్‌లోనే నివసిస్తోన్న రాధిక(మునుపటి పేరు సందీప్) చెప్పారు. "నాకు స్త్రీలాగా జీవించాలని ఉందని మా అమ్మతో చెప్పినపుడు మా అమ్మ భయపడిపోయింది, చాలా ఏడ్చింది. 'నువ్వు మాకు సోదరుడివి, ఒక అబ్బాయి అబ్బాయిలాగే జీవించాలి, పెళ్ళి చేసుకొని మాకొక వదినను తీసుకురావాలి, ఉద్యోగం సంపాదించుకోవాలి. ఇదంతా వదిలేసి, ఈ చీర కట్టుకోవాలనే మూర్ఖపు ఆలోచన నీ బుర్రలోకి ఎలా వచ్చింది?' అని మా అక్కచెల్లెళ్ళు అన్నారు. మా బంధువులు నన్ను ఇంట్లోంచి పంపించేయమని మా అమ్మతో చెప్పారు. 'కొన్ని రోజులు ఏడ్చుకుంటూ బయట తిరిగితే, ఇంటికి సక్రమంగా (మారిపోయి) తిరిగి వచ్చేస్తాడు అని వాళ్ళు చెప్పారు."

కానీ రాధిక దీనికి ఎదురుతిరిగారు. "నేను ఇల్లు విడచి వెళ్ళిపోతానని మా అమ్మతో చెప్పాను." అయితే, ఇళ్ళల్లో పాచిపని చేస్తూ, తుక్కు ఏరుకునే పని కూడా చేసే ఆమె తల్లి సుమన్ ద్రవించిపోయారు. "నా సొంత కొడుకుని నేనెలా ఇంట్లోంచి వెళ్ళగొట్టగలను?" నేను ఆమెను వారి ఇంటివద్ద కలిసినప్పుడు, ఆమె నాతో అన్నారు. "అతనికి ఎవరు సహాయం చేస్తారు? అతను చెడుసావాసాలు పట్టవచ్చు. అంత ప్రమాదానికి పోకుండా, అతను నాతో ఉండిపోవటమే మంచిది. మా బంధువులు, ఇరుగుపొరుగూ ఇందుకు నన్ను విమర్శించారు, కానీ వాటన్నిటినీ నేను భరించాను."

Aliya Sheikh
PHOTO • Minaj Latkar

అలియా తోబుట్టువులు ఆమెను బాహాటంగా గుర్తించడానికి సిగ్గుపడతారు

'నువ్వు నా తమ్ముడివని బయటెక్కడా చెప్పొద్దని నా అన్న అంటాడు. మా అక్కలకు పెళ్ళిళ్ళయ్యాయి, కానీ వారి అత్తవారి ఇళ్ళలో జరిగే ఏ వేడుకలకూ నేను వెళ్ళను, వాళ్ళకు ఇష్టం ఉండదు,' అంటారు అలియా. జీవనం సాగించడానికి ఆమె బిచ్చమెత్తుకుంటారు. 'మమ్మల్నెవరూ మనుషులుగా చూడరు'

నెహ్రూనగర్‌లోనే తన కుటుంబంతో కలిసి నివాసముంటారు అలియా షేక్. ఆమె ముగ్గురు అన్నల్లో ఇద్దరు జౌళి మిల్లులోనూ, ఒకరు బట్టల దుకాణంలోనూ పనిచేస్తారు. తాను ట్రాన్స్‌జండర్ అవటం వలన వారు తనను బహిరంగంగా గుర్తించడానికి సిగ్గుపడతారని అలియా చెప్పారు. మేం తనని కలిసినపుడు అలియా రమ్‌జాన్ పండుగ ఉపవాసాలు పాటిస్తున్నారు, కానీ బిచ్చమెత్తడానికి బయటకు వెళ్తూనే ఉన్నారు. 'నువ్వు నా తమ్ముడివని బయటెక్కడా చెప్పొద్దని నా అన్న అంటాడు. మా అక్కలకు పెళ్ళిళ్ళయ్యాయి, కానీ వారి అత్తవారి ఇళ్ళలో జరిగే ఏ వేడుకలకూ నేను వెళ్ళను, వాళ్ళకు ఇష్టం ఉండదు,' అంటారు అలియా.

ఇంట్లో సంఘర్షణ, దుఃఖాలతో పాటు చదువుకోవటం అనే పోరాటం ముందుకొచ్చింది. దాంతోపాటు కొంచం గౌరవనీయమైన సంపాదనను తీసుకువచ్చే పని కోసం వెదుకులాట. పదహారేళ్ళ వయసులో శీతల్ ఇంటిని వదిలివచ్చేటప్పటికే 12వ తరగతి చదువుకొన్నారు. "ఇంకా పైకి చదువుకోవాలని నాకుంది. నాకూ స్వాభిమానం ఉంది, తెలివితేటలున్నాయి. ఏమీ చేతకానివారిలా అడుక్కుంటూ తిరగటం నాకు ఇష్టంలేదు. నాకు చదువుకొని ఏదైనా ఆఫీసులో ఉద్యోగంలో చేరాలని ఉంది." అన్నారు శీతల్.

ఒక ట్రాన్స్‌జండర్ వ్యక్తిగా కాకుండా పురుషునిగా జీవనం సాగిస్తోన్న సకీనా మరాఠీ సాహిత్యంలో మాస్టర్స్, బి.ఎడ్. డిగ్రీ చేశారు. (తాను చదివిన విశ్వవిద్యాలయం పేరు చెప్పడానికి ఆమె ఇష్టపడలేదు). కానీ అదంతా చాలా కష్టంతో కూడుకొన్నది. కాలేజీ చదువు కోసం సకీనాకు డబ్బు అవసరమయింది. అందుకోసం కొన్నాళ్ళ పాటు సెక్స్ వర్క్ చేశారు. ఈ సంగతి తెలిసిన కొంతమంది సహవిద్యార్థులు, తమతో సెక్స్‌కు ఒప్పుకోకపోతే ఈ విషయాన్ని ఆమె కుటుంబానికి చెప్పేస్తామని బెదిరించేవారు. కొంతమంది టీచర్లు కూడా ఖాళీగా ఉన్న తరగతి గదులలోకి ఆమెను పిలచి, లైంగిక సహాయాలను డిమాండ్ చేసేవారు. "నేను ఒక స్త్రీలాగా దుస్తులు ధరించనప్పటికీ, నా గొంతు, ప్రవర్తనా ధోరణి నేనొక ట్రాన్స్‌జండర్‌నని గుర్తుపట్టేలా చేసేవి," అన్నారు శీతల్. "ఈ వేధింపులన్నిటితో విసుగెత్తిపోయిన నేను ఆత్మహత్య చేసుకోవాలని తరచుగా ఆలోచించేదాన్ని. మా నాన్న (తాపీ పని చేసేవారు) నా ముగ్గురు తోబుట్టువుల పెళ్ళిళ్ళు చేసి అప్పులపాలై ఉన్నారు. (సెక్స్ వర్క్ ద్వారా) నేను సంపాదించిన డబ్బుతో ఎలాగో నా చదువును పూర్తిచేయగలిగాను. అయినా ఏం చేయాలి? జనం ఎలాగూ మమ్మల్ని సెక్స్ వర్కర్లనే అనుకుంటారు."

ప్రస్తుతం సకీనా ఇచల్‌కరంజీలోని ఒక ప్రభుత్వేతర సంస్థలో పనిచేస్తూ, నెలకు రూ. 9000 సంపాదిస్తున్నారు. ఈ సంస్థ ఎచ్ఐవి పాజిటివ్, క్షయవ్యాధితో బాధపడుతున్నవారికి సహాయం చేస్తుంది.

Some shopkeepers drive them away from the shops and curse them. These three shopkeepers were harassing Radhika with lewd behaviour and driving her away from the shop
PHOTO • Minaj Latkar

'దుకాణదారులు తరచుగా మమ్మల్ని వెళ్ళగొట్టేస్తుంటారు. తిండికి సరిపోయేంత సంపాదించుకోవడం కోసం మేం అన్నిటినీ భరిస్తుంటాం', అంటారు రాధిక

ఇంట్లో ఎంత ఆమోదం ఉన్నప్పటికీ రాధికకు కూడా పని దొరకడం కష్టంగానే ఉంటోంది. ఆమె 3వ తరగతి తర్వాత బడి మానేయాల్సివచ్చింది. తన తండ్రిలాగే ఆమె కూడా రీసైకిలింగ్ కోసం ఇనుము, ప్లాస్టిక్, ఇంకా ఇతర వ్యర్థ పదార్థాలను సేకరించే పని, లేదంటే ఇటుకలు పేర్చే పనిని చేసేవారు. "నాకు 16-17 సంవత్సరాల వయసప్పుడు నేను చీర కట్టుకోవడం మొదలుపెట్టాను, దాంతో జనం నాకు పని ఇవ్వడం ఆపేశారు," అన్నారు రాధిక. ఆమె ఇప్పుడు ఒక 80-100 దుకాణాలలో డబ్బు కోసం అడుగుతూ తిరుగుతుంటారు. దుకాణదారులు ఆమెకు ఒక రూపాయి నుంచి పది రూపాయల వరకూ ఇస్తుంటారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటలవరకూ అలా పోగుచేసిన సుమారు రూ. 125లను తన కుటుంబ ఆదాయానికి ఆమె జతచేస్తారు.

తన ట్రాన్స్‌జండర్ గుర్తింపును దాచిపెట్టి, సునీత పనిని సంపాదించుకోగలిగారు. ఇచల్‌కరంజిలోని ఒక రెస్టరెంటులో పాత్రలను కడిగి శుభ్రం చేసినందుకు ఆమెకు రెండు పూటల భోజనం, రోజుకు రూ. 50 ఇస్తారు. ఇప్పుడామె ఒక చిన్న వ్యాపారాన్ని మొదలుపెట్టేందుకు తన స్నేహితుల దగ్గర రూ. 25,000 అప్పుగా తీసుకున్నారు ( ఆమె నివసించే ప్రాంతంలో గుర్తించకుండా ఉండేందుకు ఆ వ్యాపారం వివరాలను తొలగించాం ).

బ్రతుకుతెరువు వ్యూహం ఎలాంటిదైనా, వేధింపులూ వివక్షా కొనసాగుతూనేవుంటాయి. "కొంతమంది ప్రజలు మమ్మల్ని దైవసంబంధమైన కానుకగా భావించి మా పాదాలను తాకుతారు, కానీ మరికొంతమంది మమ్మల్ని చాలా వేధిస్తారు," అన్నారు రాధిక. "దుకాణాలవాళ్ళు మమ్మల్ని ఎక్కువగా వెళ్ళిపోమని చెప్తుంటారు. మా పొట్ట నిండేంత సంపాదించుకొవటం కోసం మేం ఆ ఛీత్కారాలన్నీ భరిస్తుంటాం. ఎండలో వేడిలో తిరిగితే మాకు కనాకష్టంగా ఓ రూ. 150 వస్తాయి. చిన్న పట్టణాల్లో జనం మాకెంతని ఇవ్వగలరు? అడుక్కోవడమంటే మాకు ఇష్టం ఉండదు, కానీ ప్రజలు మాకు పని ఇవ్వరు. మేం ఎక్కడికైనా వెళ్ళాలంటే రిక్షా తొక్కేవాళ్ళు మమ్మల్ని ఎక్కించుకోరు, రైళ్ళలోనూ బస్సులలోనూ జనం మమ్మల్ని అంటరానివాళ్ళను చూసినట్టు చూస్తారు. ఎవరూ మా పక్కన నించోవటంగానీ, కూర్చోవటంగానీ చేయరు, కానీ మేమేదో దుష్టశక్తులమన్నట్టు మావైపు కళ్ళు మిటకరించి చూస్తుంటారు. ప్రతి రోజూ ఇవన్నీ భరిస్తూ బతకటం చాలా కష్టంగా ఉంటుంది. మా సముదాయానికి చెందినవాళ్ళు పొగతాగటానికీ, మద్యం తాగటానికీ బానిసలవుతుంటారు."

అనేక సంఘటనలలో పోలీసులు సాయం చేయడానికి బదులు మరింత వేధిస్తుంటారు. తనని వేధిస్తోన్న ఇరుగుపొరుగు అబ్బాయిల గురించి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోగా హఫ్తా (లంచం) కోసం అడిగారని శీతల్ చెప్పారు. తాను పోలీస్ స్టేషన్‌కు వెళ్ళినప్పుడు, "అక్కడి పోలీసు 'నువ్వే ఆ అబ్బాయిల వెంటపడి ఉంటావు. మీరంతా డబ్బులకోసం జనాన్ని దౌర్జన్యంగా అడుగుతుంటారు' అని నాతో అన్నాడు," అని శీతల్ చెప్పారు. ఆ ట్రాన్స్‌జండర్ వ్యక్తి సెక్స్ వర్కర్ అయితే, జైలులో పెడతామనే బెదిరింపులతో పాటు ఇవ్వాల్సిన లంచం మొత్తం కూడా పెరుగుతుంది. "పోలీసులు, 'మీ సెక్స్‌వర్కర్లే జనాన్ని వేధిస్తూ ఉంటారు, మిమ్మల్నెవరు వేధించేది?' అంటారు." అన్నారామె.

Radhika Gosavi walking through the market street on a very sunny afternoon
PHOTO • Minaj Latkar

రాధిక డబ్బులు అడుగుతూ 80-100 దుకాణాలకు తిరుగుతుంటారు; ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటలవరకూ తిరిగి, రూ. 125 వరకూ పోగుచేస్తారు

కొన్ని మార్పులైతే, కనీసం కాగితం మీదనైనా, వస్తున్నాయి. 2016లో ట్రాన్స్‌జండర్ పెర్సన్స్ (ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్) బిల్లులు లోక్ సభ ఆమోదం పొందాయి, సవరణల కోసం ఎదురుచూస్తున్నాయి. ఈ బిల్లు ట్రాన్స్‌జండర్ వ్యక్తులు స్వతంత్రంగా "ఇతరులు"గా గుర్తించబడే అవకాశాన్ని కల్పిస్తుంది, ఇంకా ఏ భారతీయ పౌరుడికైనా ఉండే అన్ని హక్కులకూ వీరు అర్హులవుతారు. ఇతర నిబంధనలతో పాటు, అన్ని స్థాయిలలోనూ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే విద్యా సంస్థల్లో రెండు శాతం సీట్లను రిజర్వ్ చేయడం, ప్రత్యేక ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజీలను ప్రారంభించడం, ఇంకా ట్రాన్స్‌జండర్ వ్యక్తుల గురించి చేసే ద్వేషపూరిత ప్రసంగాలకు జరిమానాలను నిర్దేశించడం కూడా దీని లక్ష్యం.

మే 2018లో ఇచల్‌కరంజి పురపాలక సమితి ట్రాన్స్‌జెండర్ల సంక్షేమం కోసం(ఇంకా అమలు చేయాల్సి ఉంది) రూ. 25 లక్షలు ఏర్పాటు చేసిందని కౌన్సిల్ ప్రధాన అధికారి ప్రశాంత్ రసాల్ తెలిపారు.

రసాల్, న్యాయవాది దిల్‌షాద్ ముజావర్‌లు కూడా ట్రాన్స్‌జండర్ వ్యక్తులు రేషన్ కార్డులను, ఆధార్ కార్డులను పొందేలా సహాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకూ 60 రేషన్ కార్డులు పొందేలా చేయగలిగారు. ట్రాన్స్‌జండర్ వ్యక్తులు తమ పేర్లను మార్చుకుంటారు, సాధారణంగా శాశ్వత చిరునామా కలిగివుండరు కాబట్టి, వారికి గుర్తింపు కార్డులు రావడం కష్టమవుతోంది. కానీ ఇలాంటి గుర్తింపు కార్డులు లేకపోతే, ప్రభుత్వ పథకాలను వారు పొందలేరు.

అదే కారణాల వల్ల, వారి సంఖ్య కూడా తెలియదు. ఇచల్‌కరంజిలో హెచ్‌ఐవి/ఎయిడ్స్‌పై అవగాహన, నివారణలపై పనిచేస్తోన్న మైత్రి అనే ఎన్‌జిఒ, పట్టణంలోని 250 మంది ట్రాన్స్‌జండర్ వ్యక్తులు సంస్థ సేవలను పొందుతున్నారని చెప్పారు.

అలియా చెప్పినట్లుగా, "మమ్మల్ని ఎవరూ మనుషులుగా చూడరు" అనే ప్రపంచంలో ఇవే కాక మరిన్ని కష్టాలు కొనసాగుతూనే ఉంటాయి.

ట్రాన్స్‌జండర్ సముదాయానికి చెందిన వ్యక్తులను కలవటంలో సహాయం చేసినందుకు న్యాయవాది దిల్‌షాద్ ముజావర్‌కు, ఫోటోగ్రఫీ గురించి చిట్కాలు అందించినందుకు సంకేత్ జైన్‌కు, ఈ కథనం కోసం ఇంటర్వ్యూలు ఇచ్చేందుకు అంగీకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Minaj Latkar

మినాజ్ లత్కర్ ఒక స్వతంత్ర పాత్రికేయురాలు. ఆమె పుణేలోని సావిత్రిబాయి ఫూలే విశ్వవిద్యాలయంలో జెండర్ స్టడీస్‌లో ఎంఎ చేస్తున్నారు. ఈ కథనం PARIలో ఇంటర్న్‌గా ఆమె చేసిన పనిలో భాగం.

Other stories by Minaj Latkar
Translator : Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.

Other stories by Sudhamayi Sattenapalli