ఝార్ఖండ్‌లోని బోరోతికాలో, సంక్లిష్టమైన గర్భాన్ని మోస్తున్న ఒక మహిళ వైద్యులను చూడడానికి సరిహద్దులను దాటి ఒడిశా వెళ్ళవలసి వస్తుంది.

ఆమె ఒక్కతే కాదు - మీరు గ్రామీణ భారతదేశంలో నివసిస్తున్న మహిళ అయితే, గైనకాలజిస్టును లేదా సర్జన్‌ను కూడా చూసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇక్కడి సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సిహెచ్‌సి) ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలలో అవసరమైనదానికంటే 74.2 శాతం ప్రసూతి వైద్యుల, గైనకాలజిస్ట్‌ల కొరతను ఎదుర్కొంటున్నాయి.

మీరు అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నబిడ్డకు తల్లి అయితే, సిఎచ్‌సిలో శిశువైద్యుని సంప్రదించడానికి కొంత సమయం పట్టవచ్చు. ఎందుకంటే, అవసరమైన పిల్లల వైద్యుల నుంచి సాధారణ వైద్యుల వరకూ దాదాపు 80 శాతం వైద్యఉద్యోగాలు ఇంకా భర్తీ కాలేదు.

వీటన్నిటితో పాటు మరిన్ని విషయాలు గ్రామీణ ఆరోగ్య గణాంకాలు 2021-22 ద్వారా మనకు తెలుసు. ఇవే కాకుండా ముఖ్యమైన ఇతర నివేదికలు, పరిశోధనా పత్రాలు, స్థిరమైన డేటా, చట్టాలు, సమావేశాలు PARI హెల్త్ ఆర్కైవ్‌ లో అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ భారతదేశంలోని మహిళల ఆరోగ్య స్థితిని వివరించడానికి, బాగా అర్థం చేసుకోవడానికి కీలకమైన అనుకూల బిందువులుగా పనిచేస్తాయి.

ఈ విభాగం భారతదేశంలో మహిళల ఆరోగ్యం, ప్రత్యేకించి గ్రామీణప్రాంతాల మహిళల ఆరోగ్యం అనిశ్చిత స్వభావాన్ని తెలియజేస్తుంది. పునరుత్పత్తి ఆరోగ్యం నుండి లైంగిక హింస వరకు, మానసిక ఆరోగ్యం నుండి కోవిడ్-19 ప్రభావం వరకు, PARI హెల్త్ ఆర్కైవ్ మహిళల ఆరోగ్యానికి సంబంధించిన అనేక అంశాలను కవర్ చేస్తుంది - 'రోజువారీ ప్రజల రోజువారీ జీవితాలను' కవర్ చేయాలనే PARI ఆదేశాన్ని బలపరుస్తుంది.

PHOTO • Courtesy: PARI Library
PHOTO • Courtesy: PARI Library

PARI గ్రంథాలయం ఉపవిభాగమైన PARI హెల్త్ ఆర్కైవ్‌లో ప్రభుత్వ, స్వతంత్ర సంస్థలు, యుఎన్ ఏజెన్సీల నివేదికలతో సహా 256 పత్రాలు ఉన్నాయి. ప్రపంచ సమస్యల నుండి దేశీయ సమస్యల వరకు, లేదా దేశంలోని నిర్దిష్ట ప్రాంతాల ఇతివృత్తాల వరకు కేంద్రీకరణ ఉంటుంది

పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాకు చెందిన బీడీ కార్మికురాలు తనూజ మాట్లాడుతూ, "నాకు కాల్షియం, ఐరన్ సమస్య ( లోపం ) ఉందనీ, నేను ఎప్పుడూ నేలపై కూర్చోకూడదని అతను నాతో చెప్పాడు." అన్నారు.

“మా దగ్గరకు ఇప్పటికీ వచ్చే కొందరు ఆదివాసీ ఆడవారికి అసలు రక్తం ఉండదు - ఒక డెసిలీటర్‌కు రెండే గ్రాముల హిమోగ్లోబిన్ ఉంటుంది వారిలో. అది అంతకన్నా తక్కువే ఉండొచ్చు కానీ మనం దానిని కొలవలేం.” అన్నారు, నీలగిరులలోని ఆదివాసీ ఆసుపత్రిలో పనిచేసే డా. శైలజ.

తాజా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ( NFHS -5 2019-21 ) ప్రకారం, దేశవ్యాప్తంగా, 2015-16 నుండి మహిళల్లో రక్తహీనత తీవ్రమైంది. ఈ సర్వే భారతదేశంలోని 28 రాష్ట్రాలు, ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు, 707 జిల్లాలకు చెందిన జనాభా, ఆరోగ్యం, పోషకాహారంపై సమాచారాన్ని అందిస్తుంది

PHOTO • Design Courtesy: Aashna Daga

నాకు ప్రసవం అయినప్పుడు చాలా రక్తాన్ని కోల్పోయాను . బిడ్డ పుట్టకముందే మా నర్స్ నాకు ఖూన్ కి కమీ (అధిక రక్త హీనత) ఉందని చెప్పి నన్ను కూరగాయలు, పండ్లు తినమని చెప్పింది...” అని బిహార్‌లోని గయ జిల్లాకు చెందిన అంజనీ యాదవ్ చెప్పారు.

2019-21లో, 15-49 సంవత్సరాల వయస్సు గల భారతీయ మహిళల్లో 57 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు ముగ్గురు మహిళలలో ఒకరు రక్తహీనతతో బాధపడుతున్నారు. ఐక్యరాజ్యసమితిలోని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ విడుదల చేసిన ది స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ ఇన్ వరల్డ్ 2022 ప్రకారం, “రక్తహీనత గ్రామీణ ప్రాంతాల్లో, పేద కుటుంబాలలో, ఎటువంటి క్రమబద్ధమైన విద్యను పొందని మహిళలను ఎక్కువగా ప్రభావితం చేస్తోంది”.

పౌష్టికాహారం అందుబాటులో లేకపోవడంతో ఇటువంటి లోపాలు మరింత తీవ్రమవుతున్నాయి. పోషకాలు అధికంగా ఉండే ఆహారాల (గుడ్లు, పాలు వంటివి) ధర ఎక్కువగా ఉండటమే పోషకాహార లోపాన్ని పరిష్కరించడానికి ముఖ్యమైన అడ్డంకిగా ఉందని 2020 గ్లోబల్ న్యూట్రిషన్ రిపోర్ట్ పేర్కొంది. 2020 నాటికి, ఆరోగ్యకరమైన ఆహారం ధర భారతదేశంలో 2.97 అమెరికా డాలర్లు , లేదా దాదాపు రూ. 243 ఉండటంతో, అత్యధిక జనాభా - 973.3 మిలియన్ల మంది - ఉన్న భారతదేశ ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోగలిగే స్తోమత ఉండటంలేదు. తమ ఇళ్ళల్లో గానీ, బయట గానీ వనరుల కేటాయింపు మహిళలకు తక్కువగా ఉంటుందనడంలో ఆశ్చర్యమేమీ లేదు.

PHOTO • Design Courtesy: Aashna Daga

ప్రస్తుతం ఉన్న ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల గురించిన అఖిల భారత సర్వేలు PARI గ్రంథాలయంలో ఉన్నాయి. భారతదేశం మొత్తమ్మీద దాదాపు 20 శాతం ఇళ్ళకు ఎటువంటి పారిశుద్ధ్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో, “రాత్రివేళల్లో అందుబాటులో ఉండే ఏకైక మరుగుదొడ్డి సౌకర్యం రైలుకట్ట మాత్రమే!” అని పాట్నాలోని మురికివాడల్లోని బాలికలు అంటున్నారు.

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే -5 (2019-2021) ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లోని మొత్తం మహిళల్లో 73 శాతం మంది పరిశుభ్రమైన రుతుక్రమ సంబంధిత ఉత్పత్తులను వాడుతున్నారు. వీరితో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న మొత్తం మహిళల్లో 90 శాతం మందికి ఈ సౌకర్యముంది. శానిటరీ న్యాప్‌కిన్‌లు, మెన్‌స్ట్రువల్ కప్పులు, టాంపాన్‌లు - చివరకు ఒక గుడ్డ ముక్క కూడా ఈ 'పరిశుభ్రమైన రుతుక్రమ ఉత్పత్తుల'లో ఉంది. అనేక శానిటరీ న్యాప్‌కిన్‌లలో అధిక స్థాయిలో విషపూరిత రసాయనాలు ఉన్నట్లు అధ్యయనాలు వెల్లడించాయి.

PHOTO • Design Courtesy: Aashna Daga

మహిళల పునరుత్పత్తి ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే మహిళల హక్కులు "వివక్ష, బలవంతం, హింస లేని"విగా ఉండాలని ఇండియన్ విమెన్స్ హెల్త్ చార్టర్ సమర్థిస్తుంది. ఈ హక్కులను నెరవేర్చడానికి తక్కువ ఖర్చుతో కూడిన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను పొందడం తప్పనిసరి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 (2019-21) ప్రకారం, మహిళా కుటుంబ నియంత్రణ ప్రక్రియలో పాల్గొన్నవారిలో 80 శాతం మంది మహిళలు సాధారణంగా మున్సిపల్ ఆసుపత్రి లేదా సామాజిక ఆరోగ్య కేంద్రం వంటి ప్రజా ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల ద్వారా వాటిని పొందారు. అయినప్పటికీ, దేశంలో అటువంటి సంస్థల కొరత ఎక్కువగానే ఉంది.

జమ్మూ కాశ్మీర్‌లోని వజీరీథల్ గ్రామ నివాసితులకు సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పిఎచ్‌సి) ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఇందులో కూడా సిబ్బంది తక్కువగా ఉన్నారు, సరైన వైద్య సౌకర్యాలు లేవు. కశ్మీర్‌లోని బాందిపుర్‌ జిల్లా బడగామ్ పిఎచ్‌సిలో ఒకే ఒక నర్సు ఉన్నారు. “అది అత్యవసరం అయినా, గర్భస్రావం అయినా, పిండం సరిగ్గా లేక అయ్యే గర్భస్రావం (మిస్‌కేరేజ్) అయినా నేరుగా గురేజ్‌కు వెళ్లాల్సిందే. ఆపరేషన్ అవసరం అయితే వాళ్లు శ్రీనగర్‌లోని లల్‌ద్‌యద్ ఆసుపత్రికి వెళ్లాల్సిందే. అది గురేజ్ నుండి 125 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రతికూల వాతావరణంలో అక్కడకు చేరటానికి 9 గంటలు పడుతుంది,” అని వజీరీథల్‌లో పనిచేస్తున్న 54 ఏళ్ల అంగన్‌వాడీ సేవిక రాజా బేగమ్ PARIతో చెప్పారు.

PHOTO • Design Courtesy: Aashna Daga

గ్రామీణ ఆరోగ్య గణాంకాలు 2021-22 ప్రకారం మార్చి 31, 2022 నాటికి ఉప కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సహాయక నర్సులు, మంత్రసానుల కోసం 34,541 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మహిళలు ఎక్కువగా గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్తలను ( ఆశాలు ), సహాయక నర్సులుగా చేసే మంత్రసానులను (ఎఎన్ఎమ్‌లు), అంగన్‌వాడీ కార్యకర్తలను తమ ఆరోగ్య అవసరాల కోసం సంప్రదించే అవకాశమే ఉంటుందనేది వాస్తవం.

ఆక్స్‌ఫామ్ ఇండియా వారి ఇనీక్వాలిటీ రిపోర్ట్ 2021: ఇండియాస్ అనీక్వల్ హెల్త్‌కేర్ స్టోరీ ప్రకారం, దేశంలో ప్రతి 10,189 మందికి ఒక అల్లోపతి వైద్యుడు, ప్రతి 90,343 మందికి ఒక ప్రభుత్వ ఆసుపత్రి ఉంది.

PHOTO • Design Courtesy: Aashna Daga

భారతదేశంలో ఆరోగ్య సేవల అవసరం, అక్కరా కూడా ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాల కంటే చాలా ఎక్కువగా ఉంది. లింగ సమానత్వం ప్రాతిపదికపై దేశాలను గుర్తించే గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ , 2022 సంవత్సరంలో 146 దేశాలలో భారతదేశానికి 135వ స్థానాన్నిచ్చింది. 'ఆరోగ్యం మరియు మనుగడ' సూచికలో కూడా దేశం అత్యంత దిగువ స్థానంలో ఉంది. ఇటువంటి అంతరాల నిర్మాణ లోపాల నేపథ్యంలో, దేశంలో ఆరోగ్య సంరక్షణ స్థితినీ, మహిళల జీవితాలపై దాని ప్రభావాన్నీ బాగా అర్థం చేసుకోవడం చాలా కీలకం.

PARI గ్రంథాలయం దీనికొక సాధనం

గ్రాఫిక్స్ రూపకల్పన చేసినందుకు మేము PARI గ్రంథాలయ వాలంటీర్ ఆష్నా దాగాకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం

ముఖపత్ర రూపకల్పన : స్వదేశ శర్మ

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

PARI Library

PARI గ్రంథాలయ బృందానికి చెందిన దీపాంజలి సింగ్, స్వదేశ శర్మ, సిద్ధిత సోనావనేలు ప్రజల రోజువారీ జీవిత వనరుల ఆర్కైవ్‌ను సృష్టించాలనే PARI విధులకు సంబంధించిన పత్రాలను క్యూరేట్ చేస్తారు

Other stories by PARI Library
Translator : Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.

Other stories by Sudhamayi Sattenapalli