ఛబి సాహా గత 25 ఏళ్ళుగా కాగితపు సంచులను తయారుచేస్తున్నారు. "ముందుగా నేను ఒక కత్తితో కాగితాన్ని మూడు ముక్కలుగా విభజిస్తాను. ఆరు సంచులు వస్తాయి. గుండ్రటి భాగాల మీద జిగురు అంటిస్తాను. తర్వాత కాగితాన్ని చతురస్రాకరంలో మడిచి, దానికి ఇంకోవైపున జిగురు అంటిస్తాను. ఈ విధంగా నేను సంచులను తయారుచేస్తుంటాను," అంటారామె.
ఆదిత్యపుర్ నివాసి అయిన 75 ఏళ్ళ ఛబి, తన రెండంతస్తుల మట్టి ఇంట్లో, వరండాలోనూ ప్రాంగణంలోనూ చెల్లా చెదురుగా పడివున్న పాత వార్తాపత్రికల మధ్య పనిచేసుకుంటూ కూర్చొని మాతో మాట్లాడుతున్నారు.
1998లో ఆమె ఈ పనిని మొదలుపెట్టినప్పుడు ఆమె భర్త ఆనందగోపాల్ సాహా జీవించే ఉన్నారు. ఆయన ఊరిజనాల ఆవులనూ మేకలనూ చూసుకుంటూ రోజుకు రూ. 40-50 సంపాదించేవారు. "మేం బీదవాళ్ళం," శుఁరీ సముదాయానికి చెందిన ఛబి సాహా చెప్పారు. "నా తిండి కోసం కొద్దిగానైనా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో ఈ పనిని చేపట్టాలని అనుకున్నాను."
ఆమె తన ఇరుగుపొరుగువారు వదిలేసిన వార్తాపత్రికలను సేకరించటం మొదలుపెట్టారు. స్థానిక దుకాణాల నుంచి వెచ్చాలు తెచ్చుకున్న కాగితం పొట్లాలను చూసి ఆమె వాటిని ఎలా తయారుచేయాలో నేర్చుకున్నారు. "నేను ఈ పనినే ఎందుకు ఎంచుకున్నానంటే, వీటి తయారీకి కావలసిన వస్తువులు సులభంగా దొరుకుతాయి, ఇంకా నేను ఇంట్లో కూర్చొనే ఈ పని చేయవచ్చు," అంటూ ఆమె వివరించారు. "మొదట్లో నేను చాలా నెమ్మదిగా చేసేదాన్ని. ఒక్కో సంచీ తయారుచేయటానికి నాకు 25 నుంచి 30 నిముషాలు పట్టేది," అంటారు ఛబి.
"నేను రోజుకు ఒక కిలో (సంచులు) మాత్రమే చేయగలిగేదాన్ని," ఆమె చెప్పటం కొనసాగించారు.
ఆమె ఆ సంచులను బోల్‌పుర్‌లో చాప్, ఘూగ్నీ వంటి తినుబండారాలను అమ్మే 8-9 దుకాణాలకు అమ్ముతారు. ఇందుకోసం ఆమె బీర్‌భూమ్ జిల్లా, బోల్‌పుర్-శ్రీనికేతన్ బ్లాక్‌లో ఉన్న తన గ్రామం నుంచి పక్షం రోజులకొకసారి బస్‌లో ప్రయాణించవలసివుంటుంది. "నేనింక బోల్‌పుర్ వెళ్ళలేను," చెప్పారామె. ఆమెకు కాళ్ళ నొప్పులొచ్చాయి. బదులుగా ఆమె ఆ ఊరిలోనే ఉన్న కొద్ది దుకాణాలకు ఈ సరుకును అందజేస్తున్నారు.
మొదట్లో - రెండు దశాబ్దాల క్రితం - వార్తాపత్రికలు ఆమెకు ఉచితంగా దొరికేవి. కానీ వార్తాపత్రికలు మరీ అంత ఖరీదైనవి కాకపోవటం వలన వాటితో తయారుచేసే సంచీలకు పెద్దగా డబ్బులొచ్చేవి కావు. "నేనిప్పుడు కిలో రూ. 35కి వార్తాపత్రికలు కొంటున్నాను," అన్నారు ఛబి.
ఆమెకు 56 ఏళ్ళ వయసున్నపుడు, 2006లో భర్తను కోల్పోయారు. ఆమె ముగ్గురు కొడుకులకూ పెళ్ళిళ్ళయి, వారికి సొంతంగా చిన్న వ్యాపారాలున్నాయి. ఇంటిలో ఒక భాగంలో ఆమె నివాసముంటుండగా, మిగిలిన భాగంలో చిన్న కొడుకు సుకుమార్ సాహా తన కుటుంబంతో కలిసి ఉంటున్నారు. ఆమె పెద్ద కొడుకులిద్దరూ అక్కడికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న బోల్‌పుర్ పట్టణంలో నివాసముంటున్నారు.
ఛబి సాహా తన ఇరుగుపొరుగువారు వదిలేసిన వార్తాపత్రికలను సేకరించటంతో తన పనిని మొదలుపెట్టారు. స్థానిక దుకాణాల నుంచి వెచ్చాలు తెచ్చుకున్న కాగితం పొట్లాలను చూసి ఆమె వాటిని ఎలా తయారుచేయాలో స్వయంగా నేర్చుకున్నారు
ఉదయం 6 గంటలకు ఆమెకు రోజు ప్రారంభమవుతుంది. "నిద్రలేచి నా సొంత పనులు చేసుకుంటాను. 9 గంటలయ్యేటప్పటికి కాగితాలను కత్తిరిస్తాను," అంటారామె. వంట చేసుకొని, మధ్యాహ్నం భోజనం చేశాక కొంత సమయం విశ్రాంతి తీసుకుంటారు.
సాయంత్రం వేళల్లో, ఊరిలోని మహిళలతో కాసేపు కబుర్లు చెప్పుకోవడానికి బయటకు వెళ్తారు. తిరిగివచ్చాక, మళ్ళీ కాగితాలకు జిగురు అంటించి సంచులు తయారుచేయటం మొదలెడతారు. ఈ సంచులు తయారు చేయడానికి ఆమెకు రోజులో ఒక నిర్దిష్ట సమయమంటూ లేదు. "నాకెప్పుడు సమయం దొరికితే అప్పుడు చేస్తాను," అంటారామె. తరచుగా ఆమె తన ఇంటి పనులు చేసుకుంటూనే మధ్య మధ్య కొంత ఈ పనిని కూడా చేస్తుంటారు.
ఉదాహరణకు, వంట చేసుకుంటూనే కొన్నిసార్లు జిగురు అంటించిన కాగితాలను వరండాలోనో పెరట్లోనో ఆరబెడుతుంటారు. "జిగురు అంటించిన తర్వాత, ఎండటానికి వాటిని బయట ఎండలో ఆరబెడతాను. అవి ఎండిపోయాక, ఒక్కో సంచిని సగానికి మడతబెట్టి, బరువు తూచి, కట్టగట్టి, అమ్మటానికి దుకాణాలకు తీసుకువెళ్తాను."
రేషన్ దుకాణం నుంచి తెచ్చిన పిండిని ఉడకబెట్టి ఆమె సొంతంగానే జిగురు తయారుచేసుకుంటారు.
"వారంలో రెండుసార్లు ఒక కిలోగ్రాము బరువున్న సంచులను నేను దుకాణాలకు ఇవ్వాల్సివుంటుంది," ఆమె మాతో చెప్పారు. ఆ దుకాణాలన్నీ ఆమె నడిచివెళ్ళేందుకు వీలుగా ఆమె ఇంటి చుట్టుపక్కల 600 మీటర్ల దూరంలోనే ఉన్నాయి. "నేను కిలో బరువు తూగే 220 సంచులను చేస్తాను." కిలో సంచులకు రూ. 60 చొప్పున ఆమెకు నెలకు రూ 900-1000 వరకూ వస్తాయి.
కానీ ఈ సంచుల తయారీని ఛబి ఇంకొన్ని రోజులు మాత్రమే చేయగలరు: "ఇప్పుడెవరూ వార్తాపత్రికలను చదవటంలేదు. వార్తలను వాళ్ళు తమ టివిలలోనూ, మొబైల్ ఫోనుల్లోనూ చూస్తున్నారు. అందుకే వార్తాపత్రికలకు (సంచులు తయారుచేసేందుకు) కొరతగా ఉంది."
వీడియో తయారీలో సహాయం చేసినందుకు తిష్యా ఘోష్‌కు రచయిత కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు
అనువాదం: సుధామయి సత్తెనపల్లి