తాను చేయని నేరానికి టెంపూ మాంఝీ జైలులో ఉన్నాడని ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు.
జహానాబాద్ కోర్టులో అతని కేసుపై జరిగిన న్యాయ విచారణలో, అతని ఇంటినుంచి స్వాధీనపరచుకొన్నట్టుగా చెప్తూ పోలీసులు సాక్ష్యంగా ప్రవేశపెట్టిన వస్తువులేవీ నిజానికి అతని ఇంటిలో దొరికినవి కావని టెంపూ కుటుంబ సభ్యులు తెలిపారు.
"అప్పటికే తయారుచేసి పెట్టుకున్న కేసులో అతనిపై తప్పుడు నేరారోపణ చేశారు," అని టెంపూ భార్య, 35 ఏళ్ళ వయసున్న గుణా దేవి చెప్పారు.
ప్రత్యక్షసాక్షులుగా చెప్తోన్న ఎవరి సాక్ష్యం మీద టెంపూను నేరస్థుడిగా నిర్ధారించారో, ఆ ఐదుగురూ పోలీసులు కావటం గుణా దేవి చెప్తున్నదానికి బలాన్నిస్తోంది. సాధారణ వ్యక్తులనెవరినీ ఈ కేసులో సాక్షులుగా విచారించలేదు. టెంపూను బిహార్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ (అమెండ్‌మెంట్) చట్టం, 2016 కింద విచారించారు.
"ఆ మద్యం మా ఇంటి వెనుకనున్న ఒక పొలంలో దొరికింది. ఆ భూమి సొంతదారులెవరో మాకు తెలియదు. వాళ్ళు పట్టుకున్న మద్యంతో మాకు ఎటువంటి సంబంధమూ లేదని నేను పోలీసులతో చెప్పాను," అన్నారు గుణా దేవి. కానీ వాళ్ళు ఆమె మాటలను వినిపించుకోలేదు. " తోరా ఘర్ కె పీఛే (దారూ) హవ్, త తోరే నా హోతవ్ (నీ ఇంటివెనుక దొరికిన మద్యం నీది కాక ఇంకెవరిది అవుతుంది?)." ఆమె వేడుకోళ్ళను తోసిపారేస్తూ పోలీసులు అన్నారు.
టెంపూ మాంఝీని 2019లో జైల్లోకి తోశారు. మూడేళ్ళ తర్వాత, మార్చ్ 25, 2022న ఇంటివద్ద మద్యాన్ని తయారుచేసి అమ్మిన నేరానికి గాను ఆయనకు ఐదేళ్ళ కఠిన జైలు శిక్ష, ఒక లక్ష రూపాయల జరిమానా విధించారు.
ముసహర్ సముదాయానికి చెందిన టెంపూ మాంఝీ, గుణా దేవి తమ నలుగురు పిల్లలతో కలిసి జహానాబాద్ జిల్లా, కెనారీ గ్రామంలోని ముసహర్ టోలీ (పల్లె)లో ఒక ఒంటిగది ఇంటిలో నివసిస్తుంటారు. తమ ఇంటిపై దాడి జరిగిన మార్చి 20, 2019 నాడు టెంపూ ఇంట్లో లేరు. అతను పొద్దుపొద్దున్నే, పొలంలోని పంటను ఎత్తి రైతు ఇంటికి చేరవేసే పనిలో కళాశీ (సహాయకుడు)గా పనిచేసేందుకు ఇంట్లోంచి వెళ్ళిపోయారు.
జనవరి 2023లో పరి వారి పల్లెకు వెళ్ళినపుడు, గుణా దేవి, మరికొంతమంది స్త్రీ పురుషులు, పిల్లలు, అంతా కలిసి శీతాకాలపు సూర్యుని వేడిమిలో చలికాచుకుంటున్నారు. ఆ చుట్టుపక్కల ప్రదేశమంతా చెత్త కుప్పలతో నిండిపోయి చాలా కంపుకొడుతోంది.
కెనారీ మొత్తం జనాభా 2,981 (2011 జనగణన); వారిలో మూడోవంతు మంది షెడ్యూల్డ్ కులాలకు చెందినవారు. వారిలో బిహార్‌లో మహాదళిత్‌గా వర్గీకరించిన ముసహర్లు కూడా ఉన్నారు. సామాజికంగానూ, విద్యాపరంగానూ చాలా వెనుకబడివున్న ముసహర్లు రాష్ట్రంలో అత్యంత పేద, అత్యంత అట్టడుగు వర్గాలకు చెందినవారు.
వారికి చట్టపరమైన విధానాల గురించి ఎంతమాత్రమూ తెలియకపోవడం వారిని మరింత సంకటస్థితిలోకి నెట్టివేసింది. “మద్యం చట్టం కింద మొట్టమొదటి దోషులు ముసహర్ సోదరులు కావడం యాదృచ్ఛికమేమీ కాదు. సమాజంలో ఈ సముదాయాన్ని గురించి చాలా భయంకరంగా చిత్రించి ఉండటం వలన కూడా ఈ సముదాయం ఒక లక్ష్యంగా మారింది,” అని పట్నాకు చెందిన హిందీ పత్రిక, సబాల్టర్న్ సంపాదకులు మహేంద్ర సుమన్ పేర్కొన్నారు.
ఇక్కడ సుమన్, మద్యం చట్టం కింద మొట్టమొదటగా నేరస్థులుగా శిక్షపడిన రోజు కూలీలైన ముసహర్ సోదరులు పేంటర్ మాంఝీ, మస్తాన్ మాంఝీల గురించి చెప్తున్నారు. వారిద్దరినీ 2017 మే నెలలో అరెస్టు చేసి 40 రోజులలోనే శిక్ష విధించారు. వారికి ఒక్కొక్కరికీ ఐదేళ్ళ జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా పడింది.
వారిపై సామాజికంగా ఆపాదించివున్న కళంకం కారణంగా, వారు మద్యం కేసులలో కూడా లక్ష్యంగా మారారని సుమన్ అన్నారు. “ముసహర్‌లను అరెస్టు చేస్తే, వారి అరెస్టుకు వ్యతిరేకంగా ఏ పౌర సమాజం లేదా సామాజిక సంస్థ వీధుల్లోకి రాదని వారికి (పోలీసులకు) బాగా తెలుసు,” అని దశాబ్దాలుగా ముసహర్ సముదాయంతో కలిసి జీవిస్తూ, వారికోసం పనిచేస్తున్న సుమన్ చెప్పారు.
టెంపూ విషయంలో, వారు పట్టుబడినట్లుగా చెప్తోన్న మద్యం టెంపూ ఇంటి బయట దొరికింది. అయినప్పటికీ ఆయనకు ఐదేళ్ళ జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించారు.
టెంపూ కేసును జహానాబాద్‌కు చెందిన న్యాయవాది రామ్ వినయ్ కుమార్ వాదించారు. ఈ కేసులో ఉన్న లొసుగులను ఎత్తిచూపుతూ ఆయన, "టెంపూ మాంఝీ కేసులో జప్తుచేసిన వస్తువుల జాబితాలో ఇద్దరు స్వతంత్ర సాక్షుల సంతకాలు ఉన్నప్పటికీ, వారి సాక్ష్యాలను పోలీసులు కోర్టుకు సమర్పించలేదు. పైగా, టెంపూ ఇంటిపై దాడి చేసిన బృందంలో ఉన్న పోలీసులే కోర్టులో సాక్షులుగా వాంగ్మూలమిచ్చారు," అన్నారు.
రామ్ వినయ్ (50) గత 24 ఏళ్ళుగా ఇక్కడి జిల్లా కోర్టులలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. “కోర్టులో డిఫెన్స్ సాక్షులుగా అతని బంధువులతో సాక్ష్యం చెప్పించమని నేను టెంపూ మాంఝీకి చెప్పాను. కానీ అతని కుటుంబ సభ్యులెవరూ నన్ను కలవలేదు, దాంతో నేను నిందితుడికి రక్షణగా ఎలాంటి సాక్ష్యాన్ని సమర్పించలేకపోయాను."
ఇదే విధంగా స్వతంత్ర సాక్షులు లేకపోవటం, మరో ముసహర్ రామ్‌వృక్ష మాంఝీ (అసలు పేరు కాదు)ని తీవ్ర న్యాయపరమైన చిక్కుల్లో పడేసింది. టోలా సేవక్ అయిన రామ్‌వృక్ష, జహనాబాద్‌లోని ఘోసి (ఘోషి) బ్లాక్‌లోని కాంటా అనే పల్లెలో ఉండే ఒక పాఠశాలకు మహాదళిత్ పిల్లలను తీసుకువెళ్ళేవారు.
మెట్రిక్ చదివిన 45 ఏళ్ళ రామ్‌వృక్షను రాష్ట్ర విద్యా విభాగం గ్రామ సహాయకుడిగా నియమించింది. కాంటా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతోన్న చిన్న పిల్లలను బడికి తీసుకువెళ్ళటంతో పాటు వారికి చదువు చెప్పడం ఆయన పని.
బడికి వెళ్ళేందుకు రద్దీగా ఉన్న ఒక రోడ్డును దాటుతుండగా రామ్‌వృక్షను అరెస్టు చేశారు. "హఠాత్తుగా ఒక డజనుమంది పోలీసులు అక్కడ ప్రత్యక్షమయ్యారు. వారిలోంచి ఒకరు నా కాలర్ పట్టి నన్ను పట్టుకున్నారు," మార్చ్ 29, 2019లో జరిగిన సంఘటనను తలచుకుంటూ చెప్పారాయన. ఒక తెల్లని ప్లాస్టిక్ గ్యాలన్ పాత్రను ఝుళిపిస్తూ, ఆయన ఇంటి నుంచి ఆరు లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టుగా ఆ పోలీసులు ఆయనతో చెప్పారు. (అసలు పోలీసులు తమ ఇంటికి ఎన్నడూ రాలేదని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.)
ఆ తర్వాత ఆయనను శకురాబాద్ పోలీస్ స్టేషన్‌కు నడిపిస్తూ తీసుకువెళ్ళి, ఆయనపై మద్యనిషేధ చట్టం కింద కేసుపెట్టారు.
అంతకుముందు జరిగిన ఒక సంఘటన ఈ అరెస్టుకు కారణమని రామ్‌వృక్ష నమ్ముతున్నారు. తాను బడికి వెళ్తూన్న సమయంలో దారిని అడ్డుకుంటూ రోడ్డుపై నిల్చొని ఉన్న పోలీసులను ఆయన చూశారు. వాళ్ళని అడ్డు తొలగమని ఆయన అడిగారు. బదులుగా, "పోలీసు నన్ను తిట్టి, కొట్టాడు కూడానూ," అని రామ్‌వృక్ష చెప్పారు. ఇది జరిగిన అరగంటకు ఆయన అరెస్టయ్యారు.
పోలీసులను చూసి జనం గుమిగూడారు. "నన్ను పట్టుకున్నపుడు ఆ ప్రదేశమంతా మనుషులతో నిండిపోయివుంది. కానీ పోలీసులు ఎవరినీ సాక్షులుగా ఉండమని అడగలేదు, జమచేసుకున్న వస్తువుల జాబితా ఉన్న రిజిస్టర్‌లో సంతకం పెట్టమని ఏ స్వతంత్ర వ్యక్తినీ అడగలేదు," అంటారతను. ఇందుకు విరుద్ధంగా, ఆయన్ని అరెస్టు చేసేటపుడు గ్రామస్థులు పారిపోయారని ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్)లో రాసివుంది.
"స్వతంత్ర సాక్ష్యాలుండాలి. పోలీసులే సాక్షులుగా ఉంటే, పక్షపాతంతో కూడిన సాక్ష్యాలుండే ప్రమాదం ఉంటుంది," అన్నారు జితేంద్ర కుమార్ అనే న్యాయవాది. జహానాబాద్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తోన్న ఈయన తన సుదీర్ఘమైన వృత్తిలో మద్య నిషేధానికి సంబంధించిన అనేక కేసులలో అభియోగాలను ఎదుర్కున్నవారి తరఫున వాదించారు.
పోలీసులు దాడికి వెళ్ళినపుడు, ఆ బృందంలో పాల్గొన్న పోలీసులనే సాక్షులుగా ఉపయోగిస్తారని జితేంద్ర చెప్పారు. ఇది చట్టవిరుద్ధం, న్యాయస్థానంలో సమర్థించదగినది కాదు అని ఆయన అన్నారు.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దాడి చేయడంతో చుట్టుపక్కలవారు గుమిగూడతారని అతను చెప్పారు. అయినప్పటికీ, “రైడ్ పార్టీ (పోలీసు-ప్రజలతో కూడిన రైడింగ్ స్క్వాడ్) సభ్యులను సాక్షులుగా మార్చారు. ఇది అరెస్టయిన వ్యక్తి తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే అవకాశాలను బాగా తగ్గిస్తుంది.
దాడులు చేసే సమయంలో జప్తు చేసుకున్న వస్తువులను వీడియో తీయటాన్ని తప్పనిసరి చేయాలని మేం ఎన్నోసార్లు కోర్టును అభ్యర్థించాం. దురదృష్టవశాత్తూ, మా మాటలకు ఏ విలువా ఇవ్వలేదు." అన్నారాయన.
బిహార్ మద్యనిషేధ చట్టం 2016 ఏప్రిల్ నుండి ఉంది. మద్య నిషేధానికి సంబంధించిన కేసుల కోసం ప్రతి జిల్లాకు ప్రత్యేక ఎక్సైజ్ కోర్టు ఉంది, తద్వారా కేసులను ఫాస్ట్ ట్రాక్ ప్రాతిపదికన విచారించవచ్చు
మద్య నిషేధానికి సంబంధించిన కేసులను త్వరత్వరగా పరిష్కరించాలనే ఒత్తిడి, పోలీసులు పరిస్థితిని తారుమారు చేసేలా చేస్తుందని న్యాయవాదులు, వారికి ప్రాతినిధ్యం వహించేవారు చెప్పారు
కోర్టు కార్యకలాపాలను నివేదించే వెబ్‌సైట్, లైవ్ లా 24 జనవరి 2023లో వెలువరించిన నివేదిక ప్రకారం, 2022 మే 11 వరకూ మొత్తం 3,78,186 కేసులు నిషేధ చట్టం కింద నమోదయ్యాయి. వీటిలో 1,16,103 కేసులలో కోర్టులు తమ విచారణను ప్రారంభించినప్పటికీ, 2022 మే 11 నాటికి కేవలం 473 కేసుల విచారణ మాత్రమే పూర్తయింది.
మార్చి 2022లో, అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ నిషేధానికి సంబంధించిన బెయిల్ ఇవ్వదగిన కేసులతో కోర్టులు కిక్కిరిసిపోతున్నాయని, ఇది ఇతర కేసుల విచారణ నెమ్మదిగా సాగడానికి దారితీస్తుందని పేర్కొన్నారు.
"ప్రభుత్వం ఆబ్కారీ కేసులకు విరివిగా నిధులను మళ్ళించింది, ఇతర కేసుల ప్రాధాన్యాన్ని తగ్గించింది," అని జహానాబాద్ కోర్టు న్యాయవాది సంజీవ్ కుమార్ అన్నారు.
*****
రామ్‌వృక్ష మాంఝీకి బెయిల్ ఇవ్వడానికి జహానాబాద్ కోర్టుకు 22 రోజులు పట్టింది. ఇన్ని రోజులూ అతని కుటుంబం అన్ని ఏర్పాట్లూ చేయడానికి అటూ ఇటూ పరుగెట్టాల్సివచ్చింది. ఇందుకు వారికి రూ. 60,000 ఖర్చయ్యాయి, రామ్‌వృక్ష నెల జీతానికి ఈ మొత్తం సుమారు ఆరు రెట్లు ఉంటుంది. ఇప్పుడు జైలు నుంచి బయటకు వచ్చిన ఆయన ఆగస్ట్‌లో విచారణకు హాజరుకావలసి ఉంది. "ఈ కేసు నాలుగేళ్ళుగా పెండింగులో ఉంది. ఖర్చులు కూడా పెరిగాయి," అన్నారు రామ్‌వృక్ష.
ఆయనకు ఏడు నుంచి 20 ఏళ్ళ వయసుకలిగిన నలుగురు పిల్లలు - ముగ్గురు కూతుళ్ళు, ఒక కొడుకు - ఉన్నారు. వారి పెద్దమ్మాయి వయసు 20 ఏళ్ళు. ఈ విషయమేదో తేలేంతవరకూ వీరు ఆ అమ్మాయి పెళ్ళి తలపెట్టలేరు. "నాకు బడికి వెళ్ళి పిల్లలకు చదువు చెప్పాలనిపించడంలేదు. నేను మానసికంగా ఒత్తిడిలో ఉన్నాను... ఐదు గంటలకు బదులు రెండు గంటలు మాత్రమే నిద్రపోతున్నాను," అన్నారు రామ్‌వృక్ష.
గుణా దేవి కోర్టు మున్షీ (గుమాస్తా)కి చెల్లించేందుకు రూ. 25,000 ఖర్చుపెట్టారు. "నేను ఒకటి రెండుసార్లు కోర్టుకు వెళ్ళి అక్కడి గుమాస్తాను కలిశాను. వాదించేందుకు వకీలు లేడు," తనముందున్న కాగితాలను చదవలేని ఆమె ఆన్నారు.
టెంపూ జైలుకు వెళ్ళటంతో ఆయన కుటుంబం తిండికి కష్టపడుతోంది. వారికి భూమి లేదు. నాట్లు, కోతల కాలంలోనే గుణా దేవికి చేసేందుకు వ్యవసాయపు పనులు దొరుకుతాయి. వారి నలుగురు సంతానం - ఇద్దరమ్మాయిలు, ఇద్దరబ్బాయిలు - పది నుంచి 15 ఏళ్ళ వయసులవారు.
దుర్బలంగా ఉన్న తన 15 ఏళ్ళ కొడుకు రాజ్‌కుమార్ వైపు చూపిస్తూ, " బవ్‌వా తనీ మనీ కమా హయీ (నా కొడుకే కొద్దిగా సంపాదిస్తున్నాడు)," స్థానిక మగహీ భాషలో అన్నారు గుణా దేవి. 2019లో తండ్రి జైలుకు వెళ్ళడంతో అప్పుడు 5వ తరగతి చదువుతోన్న రాజ్‌కుమార్ చదువు మానేసి, బజారులో బస్తాలు మోస్తూ రోజుకు రూ.300 సంపాదిస్తున్నాడు. మైనర్ కావడంతో ఈ పని దొరకడం కూడా కష్టమే.
ఇంతలో, పోలీసులు గుణా దేవిని మద్యనిషేధానికి సంబంధించిన ఒక ప్రత్యేక కేసులో నిందితురాలిగా ఆరోపిస్తూ, ఆమెను 'పరారీలో ఉన్న వ్యక్తి'గా గుర్తించారు.
"అరెస్టు కాకుండా తప్పించుకోవడానికి రాత్రుళ్ళు నా పిల్లలతో మా బంధువుల ఇళ్ళల్లో తలదాచుకుంటున్నాను. వాళ్ళు నన్ను కూడా పట్టుకుపోతే నా నలుగురు పిల్లల గతి ఏమిటి?"
కొన్ని ప్రదేశాల, మనుషుల పేర్లు మార్చబడ్డాయి.
ఈ కథనానికి రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల కోసం పోరాడుతూ జీవితాన్ని గడిపిన బిహార్‌కు చెందిన ట్రేడ్ యూనియన్ నాయకుడి జ్ఞాపకార్థం ఏర్పాటుచేసిన ఫెలోషిప్ మద్దతు ఉంది.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి