నవంబర్ 15, 2023న ఎన్. శంకరయ్య తుదిశ్వాసను విడిచారు. ఆయన వయస్సు 102 సంవత్సరాలు; ఆయనకు చంద్రశేఖర్, నరసింహన్ అనే ఇద్దరు కొడుకులు, చిత్ర అనే కుమార్తె ఉన్నారు.

డిసెంబర్ 2019లో PARIకి, పి. సాయినాథ్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో శంకరయ్య ఎక్కువభాగం పోరాటాలతోనే గడచిన తన జీవితం గురించి వివరంగా మాట్లాడారు. చదవండి: తొమ్మిది దశాబ్దాల విప్లవకారుడు, శంకరయ్య

ఆ ఇంటర్వ్యూ ఇచ్చిన సమయానికి ఆయన వయసు 99 సంవత్సరాలు, కాని అప్పటికి ముదిమి ఆయనను ఇంకా సమీపించలేదు. ఆయన స్వరం స్థిరంగానూ, జ్ఞాపకశక్తి తప్పుపట్టలేని విధంగానూ ఉంది. జీవంతో తొణికిసలాడుతోన్న ఆయన నిండైన ఆశాభావంతో ఉన్నారు.

స్వాతంత్ర్య పోరాటం జరుగుతోన్న రోజులలో శంకరయ్య ఎనిమిదేళ్ళు జైలు జీవితం - 1941లో మదురైలోని అమెరికన్ కళాశాల విద్యార్థిగా ఉన్నప్పుడు ఒకసారి, ఆ తర్వాత 1946లో మదురై కుట్రకేసులో ఒక నిందితుడిగా - గడిపారు. భారత ప్రభుత్వం మదురై కుట్రను స్వతంత్రోద్యమంలో భాగంగా గుర్తించింది.

చాలా మంచి విద్యార్థి అయినప్పటికీ శంకరయ్య తన డిగ్రీ చదువును పూర్తిచేయలేకపోయారు. 1941లో, తన బి.ఎ. ఫైనల్ పరీక్షలకు 15 రోజుల ముందు, ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ అరెస్ట్ కావడమే ఇందుకు కారణం.

ఆగస్ట్ 14, 1947న - భారతదేశం స్వాతంత్ర్యం సాధించడానికి ఒక రోజు ముందు - ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. 1948లో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం విధించినపుడు శంకరయ్య మూడేళ్ళ పాటు అజ్ఞాతంలో ఉన్నారు. రాజకీయంగా రసవత్తరమైన వాతావరణంలో పెరిగిన - ఆయన తల్లి తరఫు తాతగారు పెరియార్ అనుయాయులు - శంకరయ్యకు కళాశాలలో చదివే రోజులలో వామపక్ష ఉద్యమంతో పరిచయం ఏర్పడింది. జైలు నుంచి విడుదలై, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, శంకరయ్య కమ్యూనిస్టు ఉద్యమంలో చురుగ్గా ఉన్నారు. తమిళనాడులో రైతాంగ ఉద్యమాన్ని నిర్మించటంలోనూ, అనేక పోరాటాలకు నాయకత్వం వహించటంలోనూ ఆయన కీలక పాత్ర వహించారు.

స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా ఉంటూనే శంకరయ్య, ఇతర కమ్యూనిస్టు నాయకులు చేసినట్లే, ఇతర సమస్యల మీద కూడా పోరాటం చేశారు. "మేం సమాన వేతనాల కోసం, అంటరానితనానికి సంబంధించిన సమస్యల గురించి, ఆలయ ప్రవేశ ఉద్యమం కోసం పోరాటాలు చేశాం," PARIకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. " జమీందారీ వ్యవస్థను రద్దుచేయటం కోసం చేసిన పోరాటం చాలా ముఖ్యమైనది. కమ్యూనిస్టులు ఇందుకోసం పోరాడారు."

పి. సాయినాథ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూను ఇక్కడ చదవండి, వీడియో చూడండి: తొమ్మిది దశాబ్దాల విప్లవకారుడు, శంకరయ్య

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Translator : Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.

Other stories by Sudhamayi Sattenapalli